పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సరదా.... సరదా.... వేసవి సెలవులు

వేసవిలో కొత్త విషయాలు నేర్చుకోండి.

వేసవి అంటేనే విపరీతమైన వేడి, ఉక్కపోత. మరీ మే నెలయితే భరించలేం. నిజమే కదా! మనకు 42 నుంచి 45 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకూ ఎండ వేడి నమోదవుతుంది. అందుకే పాఠశాలలకు శెలవులిచ్చి నీడవట్టున ఉండమంటారు.

కానీ నెలన్నర రోజులు బడిలేక ఆడుకుందామంటే వీలులేక పిల్లలంతా ఇబ్బంది పడుతుంటారు. కానీ చక్కగా ప్లాన్ చేసుకుంటే ఎండా తప్పించుకోవచ్చు. సరదాగానూ గడపొచ్చు.

వేసవైతే పల్లెకు వెళ్తుంటారు చాలా మంది. అప్పుడు తెల్లవారు జామునే నిద్రలేవండి. పొలం పనులకు పెద్దలు వెళ్తుంటారు కదా. వారితో బాటు మీరూ వెళ్లండి. వాళ్లు చేసే పనులు శ్రద్ధగా చూడండి. దున్నడం, పొలాలకు నీళ్లు పట్టడం, కలుపు తీయడం, ఇలా అన్ని పనులనూ గమనించండి. మీకు అర్థం కాని వాటిని, ఆ పనులను ఎందుకు చేస్తున్నారో పెద్దవాళ్లను అడగండి.

మీరు వెళ్లే దారిలో ఏయే పంటలున్నాయో, మొక్కలున్నాయో, చెట్లున్నాయో ప్రతిదాని పేరూ అడిగి తెలుసుకోండి. ఏ పంటకు ఎంతకాలం పడుతుందో, ఏ మొక్కకు పూలూ, పండ్లు వస్తాయో తెలుసుకోండి. పెద్ద పెద్ద చెట్ల ఆకులను, కొమ్మలను పరిశీలించండి. వాటి పై ఏయే పక్షులున్నాయో చూడండి. వాటి కూతలను అనుకరించండి. ఇంటికొచ్చాక చూసిన వాటి వివరాలన్నీ ఒక నోట్ బుక్ లో రాయండి. పక్షి రెక్కలెలా ఉన్నాయో, ఏయే రంగులలో ఉన్నాయో రాసుకోండి, వీలయితే వాటి బొమ్మలనూ వేయండి. చెట్ల పేర్లు, వాటి ఆకుల ఆకారం, వాటి సైజు వివరంగా రాయండి.

ఇంట్లో అమ్మా వాళ్లు వంట పనుల్లో బిజీగా ఉంటారు. వారి పనికి ఆటంకం కలగకుండా వారి ప్రతి పనీ గమనించండి. ఇల్లు ఎలా ఊడుస్తున్నారో, గిన్నెలెలా కడుగుతున్నారో చూడండి. చేసే కూరలు, వంటలూ అన్నింటినీ శ్రద్దగా చూడండి. మీ సందేహాలను వాళ్ళతో తీర్చుకోండి. అన్నం ఎంతసేపు ఉడుకుతుందో, దుంప, ఆకు, కాయగూరలు ఇలా రకరకాల వంటలు ఎలా చేస్తారో, ఎంత సేపు చేస్తారో గమనించండి. ఆ వివరాలన్నీ మీ పుస్తకంలోకి ఎక్కించండి.

అన్నం తిన్న తరువాత కాసేపు పడుకుని సాయంత్రం బయటికెళ్లి మీ స్నేహితులతో ఆడుకోండి. కొత్త కొత్త ఆటలను నేర్చుకోండి. రాత్రి అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, అత్తమామలను కథలు చెప్పమనండి. పాటలు పాడే వాళ్ళను పాడమనండి. వాటన్నింటినీ నేర్చుకోండి. అన్నీ పుస్తకంలోకి ఎక్కించడం మాత్రం మరవకండి.

మిగిలిన సమయాల్లో దొరికిన పుస్తకమల్లా చదవండి. మీ తోటి పిల్లలకి మీరు చూసిన సినిమా, ఊళ్ళ విశేషాలు చెప్పండి. వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోండి. దూరంగా ఉన్న స్నేహితులకి ఈ విషయాలతో ఉత్తరాలు రాయండి.

చదివిన, విన్న కథలను, అలాగే సినిమాలను మీ స్వంత భాషలో ఇతరులకు చెప్పండి. మీరు వాటిని తిరిగి రాయండి. అలా చేస్తే మీరు విన్న, కన్న విషయాలను బాగా అర్థం చేసుకోగల్గుతారు. అలాగే సూటిగా స్పష్టంగా, క్లుప్తంగా విషయాలను చెప్పడం అలవాటు అవుతుంది. భాష మీద ఆసక్తి, నేర్చుకునే అలవాటు పెరుగుతుంది.

మీలో బొమ్మలేయగలిగిన వాళ్ళు మీరు సెలవుల్లో చూసిన విశేషాలను బొమ్మలుగా వేయండి, కథలు రాయండి. మాకు పంపండి. మీ వేసవి అనుభవాలను చెకుముకి నేస్తాలతో పంచుకోండి.

2.96341463415
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు