অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

డా. లాల్ జీ సింగ్

డా. లాల్ జీ సింగ్

జననం: జూలై 5, 1947

మరణం: డిసెంబర్ 10, 2017

విద్యాభ్యాసం: కల్వరి, ప్రతాప్ ఘడ్ (ఉత్తర్ ప్రదేశ్), బెనారస్ హిందూయూనివర్సిటీ

భార్య: అమరావతీ సింగ్

అవార్డులు: శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు, పద్మశ్రీ, ఇంకా అనేక ఇతర బహుమతులు

స్థాపించిన సంస్థలు

1. డిఎన్ఏ వేలిముద్రణ, రోగనిర్ధారణ కేంద్రం-హైదరాబాద్ (Centre for DNA Finger printing Diagnostics CDFD)

2. జన్యుచిత్రణా సంస్థ-హైదరాబాద్ (Genome Foundation)

3. అంతరిస్తున్న జాతుల సంరక్షణా ప్రయోగశాల - హైదరాబాద్ (Laboratory for the Conservation of Endangered Species - LaCONES)

రచించిన పుస్తకాలు

1. You deserve, we conserve: A Biotechnological approach to wildlife.

2. My Travails in the witness Box

3. DNA Fingerprinting: The witness within.

4. Scientific tell-tale of Genome and DNA

5. ఇంకా సుమారు 80 పరిశోధక వ్యాసాలు

పి. హెచ్.డి. చేయడానికి దరఖాస్తు చేసుకున్న ఆ యువకుడి ని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో జెనిటిక్స్ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఎస్.పి రాయ్ చౌదరి, “ఏ అంశం మీద పరిశోధన చేయాలనుకుంటున్నావు?” అని అడిగాడు.

ఆ యువకుడు వినమ్రంగా “మీరే సూచించండి!”  అన్నాడు. “అయితే పాముల క్రోమో జోముల మీద పరిశోధన చేయి.” అని ఆదేశించాడు రాయ్ చౌదరి. "పాములా?” అని అడిగాడా యువకుడు భయం భయంగా. “అవును ఇంతవరకూ ఎవరూ ఆ అంశం మీద పరిశోధన చేయలేదు.” అన్నాడు ప్రొఫెసర్.

ఆ యువకుడు లాల్జీసింగ్. ఆయనకు పాములంటే భయం. కానీ తప్పదు. ప్రొఫెసర్ గారి ఆదేశం మరి! ఒక సామాన్య రైతు సూర్య నారాయణ్ సింగ్ కుటుంబంలో జన్మించిన లాల్జీ సింగ్ పేదరికాన్ని, కష్టాలను తట్టుకుని 8వ తరగతి వరకు జన్మస్థలం కల్వరిలోనూ, 9 నుండి 12 తరగతుల వరకు నాలుగైదు కిలోమీటర్ల దూరంలో వున్న ప్రతాప్ ఘర్ లోనూ రోజు నడిచి వెళ్ళి మరీ చదువుకున్నాడు. తర్వాత బెనారస్ హిందు యూనివర్సిటీలో బి.ఎస్.సి. (1964) యం.ఎన్.సి. (జంతుశాస్త్రం) 1966 పి.హెచ్.డి ( సైటోజెనిటిక్స్) 1971లో పూర్తి చేసుకుని అదే యూనివర్సిటీలో 1970 నుండి 1972 వరకు రిసెర్చి అసోసియేట్ గా పనిచేశాడు.

లింగ నిర్ధారణలో జీవకణాల తన అధ్యయనం పాముల పరిశోధనతోనే ప్రారంభమైందని ‘విజ్ఞాన్ ప్రసార్' వారికి ఇచ్చిన ఒక ముఖాముఖిలో (Interview) చెప్పాడు లాల్జీసింగ్. మానవ లింగ నిర్ధారణ క్రోమోజోములకు భిన్నంగా పక్షులు, కొన్ని చేపలు, రొయ్యలు, ప్రాకెడు జంతువుల్లో Z-W క్రోమోజోములతో నిర్ధారించ బడుతుంది. ZZ క్రోమోజోములు మగతనాన్ని, Z-W ఆడతనాన్ని సూచిస్తాయి. ఆడపాముల్లో వుండే W క్రోమోజోముల్లో డి.ఎన్.ఏ లో వుండే చిన్న పరిచారిక ఉపవిభాగం మగపాముల్లో ఉండదని ఆయన ప్రతిపాదన (Hypothesis) చేశాడు. కానీ దీన్ని నిర్ధారించడానికి తగిన ప్రయోగశాల సదుపాయాలు ఇండియాలో లేవు. విదేశాల్లో వున్న ఇతర శాస్త్రజ్ఞుల సాయం తీసుకుంటానికి ఆయన ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళెవరూ అతడి ప్రతిపాదనలను విశ్వసించలేదు. చివరకు 1974 లో ఎడిన్ బరో యూనివర్సిటీ (UK) అతడి ప్రతిపాదననుసరించి ప్రయోగాలకు ఉపకార వేతనం మంజూరు చేసింది. దానితో ఆయన భారతదేశానికి చెందిన కట్ల పాము జాతి (Branded Krait) మీద పరిశోధనలు చేసి చిన్న పరిచారిక డి.ఎన్.ఏ జన్యు పదార్థాన్ని విడదీయగలిగాడు. ఈ ప్రయోగమే డి.ఎన్.ఏ వేలిముద్రణ సాంకేతికతకు దారితీసింది.

అలెక్ జాఫ్రీ (లైసెస్టర్ విశ్వవిద్యాలయం యునైటెడ్ కింగ్డమ్) 1985 లో మానవ జన్యు చిత్రాన్ని ఉపయోగించి డి.ఎన్.ఏ వేలిముద్రణ చేయగలిగాడు. కానీ ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. లాల్జీ సింగ్ ప్రతిభను గుర్తించిన Center for Cellular and Molecular Biology-(CCMB) సంచాలకులు డా. పుష్పమిత్ర భార్గవ ఆహ్వానంపై 1987 లో భారతదేశం తిరిగి వచ్చిన లాల్జీసింగ్ సిసియంబిలో సీనియర్ సైంటిస్టుగా చేరి హైద్రాబాదులోనే డి.ఎన్.ఏ. వేలిముద్రణను రూపొందించాడు.

1988 లో ఈ సాంకేతికతను లైంగిక వారసత్వం (Paternity) నిర్ధారించడానికి మొదటిసారి ఒక కేసులో సాక్షిగా కేరళలోని తలసరి సబ్ కోర్టు లాల్జీసింగ్ ని ఆహ్వానించింది. ఒక మహిళా ఇన్సురెన్స్ ఏజెంటుకి ఒక వ్యాపారస్థునికి జన్మించిన మగ బిడ్డను వారసునిగా అంగీకరించడానికి వ్యాపారస్థుడు నిరాకరించినప్పుడు తలెత్తిన కోర్టు వివాదంలో లాల్జీసింగ్ సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చింది.

ఆయన వివరణ పూర్తిగా శాస్త్రీయ పదాలతో నిండి వున్నదనీ, దాన్ని తేలిక మాటల్లో చెప్పమని డిఫెన్సు లాయర్ కోరినప్పుడు ఆ కోర్టులో అందరికి అర్థం అయ్యేలా వివరించాడు లాల్జీసింగ్. కోర్టు ఆ పిల్లవాడి తండ్రి వ్యాపారస్థుడేనని నిర్ణయించింది. తర్వాతి కాలంలో లాల్జీసింగ్ సి.సి.యం.బి. కి జూలై 1998లో సంచాలకునిగా నియుక్తులై జూలై 2009 వరకు పనిచేశాడు.

భారత ప్రభుత్వంలోని జీవ సాంకేతిక విభాగం (Department of Biotechnology) ఆయన సూచనల మేరకు డి.ఎన్.ఏ వేలిముద్రణ, రోగనిర్ధారణ కేంద్రం (CDFD) హైద్రాబాద్ లో ప్రారంభించడానికి అనుమతినిచ్చింది. మానవునిలో వుండే 46 క్రోమోజోముల్లో 23 క్రోమోజోములు తండ్రి నుండి (వీర్యంలో) లభిస్తాయి. ఇవి విభజన చెంది పిండంగా మారేటప్పుడు కొన్ని ప్రాంతాల్లో క్రోమోజోము యూనిట్లు! తల్లిదండ్రుల యూనిట్లను పోలివుంటాయి. అయితే ఈ అమరిక ప్రతి వ్యక్తికి భిన్నంగా వుంటుంది. అంటే ఒక వ్యక్తి డి.ఎన్.ఏ అమరిక మరో వ్యక్తి అమరికను ఎప్పటికీ పోలి వుండదు. కాని, ఈ అమరికలో కొన్ని ప్రాంతాల్లో వున్న తల్లిదండ్రుల యూనిట్ల అమరికల్లోని సాదృశ్యాలను బట్టి వారసత్వాన్ని నిర్ణయిస్తారు.

అంతరించిపోతున్న వన్యజాతులను సంరక్షించడానికి కృత్రిమంగా అంతరిస్తున్న జాతుల సంరక్షణా ప్రయోగశాల (La CONE) ఆయన 1998 లో తలపెట్టగా భారత ప్రభుత్వం దానికి 16 సెప్టెంబరు 2001 లో హైద్రాబాద్ లో శంఖు స్థాపన చేసింది. దాని నిర్మాణం పూర్తి అయి 2007 లో ఫిబ్రవరి రెండవ తేదిన అప్పటి రాష్ట్రపతి ఏ.పి.జె. అబ్దుల్ కలాం ప్రారంభించారు. ఇందులోని, జాతీయ వన్య మృగ విభాగం రక్త ఈ నమూనాలోని డి.ఎన్.ఏ ను బట్టి వన్యమృగాలను గుర్తిస్తుంది. ఆ విధంగా వన్యమృగాలపట్ల జరిగే ఆ నేరాలకు మంగళం పాడవచ్చు. అంతేగాకుండా సహాయక పునరుత్పత్తి అ సాంకేతికతతో కృత్రిమంగా వీర్యదానం చేయటం ద్వారా 14 మార్చి 2006లో మొదటిసారి మచ్చల ఆ జింక నొక దాన్ని పునరుత్పత్తి చేయగలిగారు. అలాగే 2007 లో కృష్ణమృగాన్ని (black buck) ని సృష్టించారు.

ఆయన స్థాపించిన జన్యుచిత్రణ సంస్థ (Genome Foundation) జన్యులోపాలను సవరించగలిగిన సాంకేతికతను వృద్ధి చేసింది. ఆఫ్రికాలోని కొన్ని తెగలు 60, 70 వేల సంవత్సరాల క్రితం అండమాన్ నికోబార్ దీవులకు తరలి వచ్చారని డి.ఎన్.ఏ విశ్లేషణ ద్వారా ఆయన అధ్వర్యంలో సైంటిస్టుల బృందం నిర్ధారించింది. ఈ విధంగా మానవ పరిణామ క్రమాన్ని వారు వలసపోయిన మార్గాలను అన్వేషించగలిగారు.

2011 నుండి 2014 వరకు తను చదివిన బెనారస్ హిందూ యూనివర్సిటీకి ఆయన ఉపకులపతిగా నామమాత్రపు జీతం 1 రూపాయి తీసుకుని పనిచేశారు. బెనారస్ వచ్చి అక్కడి నుండి ఢిల్లీ వెళ్ళడానికి బయలుదేరి విమానాశ్రయంలో గుండెపోటు వచ్చి యూనివర్సిటీ హాస్పిటల్ కి తరలించగా ఆయన మరణించారు.

ఆధారము: చెకుముకి© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate