অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

అనుమానం పెను భూతం

అనుమానం పెను భూతం

boytreeసాలమ్మ చంద్రయ్య లకు ఊరి బయట ట్చి అర ఎకరా పొలం ఉంది. కూరగాయలు పండిస్తారు. వచ్చే ఆదాయంతో ఆనందంగా బ్రతికేవాడు. అయిన ఆరేండ్లకు లేకలేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు వినయ్. లోకజ్ఞానం తెలియకుండా గారాబంగా పెంచారు. బయట ఎక్కువగా తిరగనిచ్చేవారు కాదు.

“ఒరేయ్! నాయనా, ఎవరితో ఎక్కువగా మాట్లాడకు. ఎవరన్నా ఏమన్నా ఇస్తే తినకు. అసలే రోజులు బాగాలేవు. నీకేమన్నా కావాలంటే, నాన్ననో నన్నో అడుగు" అని సాలమ్మ ఎప్పడూ కొడుక్కుచెబుతూ ఉండేది.

వినయ్ “అలాగేనమ్మా" అంటూ అమాయకంగా బదులిసుంటాడు.

తండ్రి చంద్రయ్య కూడా అంతే. "నాన్నా బంగారూ! ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకు. పోట్లాడకు. ఎవరితోనూ సావాసం చేయకు. సారోళ్ళు చెప్పిన పారాలు మాత్రం విను. తెల్సిందా?” అంటూ చెప్పేవాడు. “సరేయ్యా! ?” అంటూ తల ఊపేవాడు. అలా నోట్లో వేలు పెడితే కూడా కొరకలేని వాడిగా తయారయ్యాడు వినయ్.

ఇప్పడు తను ఆరో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు చెప్పినట్లు ఎవరి జోలికి పోయేవాడు కాదు. ఎవరితోనూ కలవడు. మాట్లాడడు. ఆటలు ఆడడు. ఎవరన్నా ఏమన్నా ఎగతాళి చేసినా తల వంచుకుని వెళ్ళేవాడు. ఎప్పడూ అమ్మానాన్నలు చెప్పిన మాటలే వాడి మెదడులో ఎప్పడూ సుడులు తిరుగుతుంటాయి. అందుకే వాడి మనసులో ఎప్పడూ పిచ్చి పిచ్చి ఆలోచనలు, అనుమానాలు ఉండేవి. లేనివి ఉన్నట్లు ఊహించుకోవడం వాడి నైజంగా మారింది. దాంతో ఇంటా, బయటా వాడిని పిచ్చిపుల్లయ్య అంటూ అందరూ గేలి చేసేవారు.

“అమ్మా! అందరూ నన్ను పిచ్చి పుల్లయ్య అంటున్నారు." అంటూ అమ్మకు చెప్పేవాడు.

“అనుకుంటే అనుకోనియ్. నువు మాత్రం ఏమీ అనకు నాయనా, సరేనా!" అనేది వాలమ్మ.

“ఊ... అలాగే... “ అంటూ అమ్మ కొంగు పట్టుకుని తిరిగేవాడు.

బడికి సెలవు వస్తే తమతో పాటు పొలానికి తీసుకెళ్ళేవారు వినయ్ని. అక్కడ పొలం గెట్టున ఉన్న చెట్టు క్రింద ఒక్కడే కూర్చుని ఆడుకుండేవాడు. సాలమ్మ చంద్రయ్యలు పొలం పనులు చూసుకునేవాళ్ళు ఇంటికి వచ్చేటపుడు తమతో తీసుకుని వచ్చేవారు. అలా ఏ ఒక్కరితోనూ కలవనిచ్చేవారు కాదు. చెడిపోతాడని. ఒకరోజు బడినుండి ఇంటికి వచ్చాడు వినయ్. ఇంటికి తాళం వేసి ఉంది. తల్లిదండ్రులు ఇద్దరు లేరు. పొలం నుంచి ఇంకా రాలేదు. దాంతో ఏంచేయాలో తెలియలేదు. ఏమీ తోచడం లేదు. బయట ఉన్న మంచంకోడుకు పుస్తకాల సంచి తగిలించి పడుకున్నాడు. అలా గుడిసె పైభాగాన చూరువైపు చూడసాగాడు. అక్కడ ఒక చిన్న తాడు వేలాడుతూ కనపడింది. గాలికి ఊగుతోంది. "అమ్మో! ఇదేంటి? ఇలా ఊగుతుంది పాము తోకలా?" అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా కొంచెం భయం వేసింది. “ఈ చూరులో పాము ఉందేమో? అందుకే తోక ఊగుతోంది.” అనుకున్నాడు. వెంటనే లేచి కూర్చున్నాడు. పొద్దు పోతోంది. అమ్మానాన్న ఇంకా రాలేదు.

ఇంతలో వినయ్ తో చదివే ఆ బజారులోని కుర్రాడు అటుగా వచ్చాడు. " ఒరేయ్, వినయ్! రారా! ఆడుకుందాం!" అంటూ పిలిచాడు. వెంటనే “ఎవరితోనూ ఆటలాడొద్దన్న వాళ్ళ నాన్న మాటలు గుర్తిచ్చాయి. “ఊహు, నేను రాను" అన్నాడు.

వాడు " అహహ. అహహ. పిచ్చి పుల్లయ్య” అని నవ్వుకుంటూ వెళ్ళాడు.

“అమ్మో! ఇక్కడుంటే ఎవరో ఒకరు ఇలాగే పిలుస్తారు. మా అమ్మవాళ్ళ దగ్గరకి వెళ్లే సరిపోతుంది” అనుకుంటూ పొలం బాట పట్టాడు. కాస్త చీకటి పడుతోంది. పొలం ఒక కిలోమీటరు దూరం ఉంటుంది. దారిలో ఏమన్నాఅవుతుందా? అయినా సరే వెళ్లాల్సిందే అనుకుంటూ బయలుదేరాడు. ఊరు దాటి కొంచెం దూరం వెళ్ళేసరికి సూర్యుడు కొండలోకి జారుకున్నాడు. మసక చీకటి కమ్మింది. కూతవేటు దూరంలో ఒక గుబురు చెటు ఉంది. అనుకోకుండా ఆ చెట్టు పైభాగానికి వినయ్ చూపు మళ్లింది. అక్కడేదో నల్లగా ఊగుతోంది. ముందే బిక్కుబిక్కుమంటున్న వినయ్ కి అది దెయ్యమేమో? అన్న అనుమానం కలిగింది. కానీ, ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యిలాగా అయ్యింది పరిస్థితి.

ఇప్పడు మధ్యలో నుండి వెనక్కు వెళ్ళలేడు. ముందుకు వెత్తే దెయ్యమేమో? ఎలా? ఆలోచించాడు. వెనక్కు వెళ్లేకంటే ముందు కెళితే అమ్మానాన్నలుంటారు కదా! కాబట్టి అంతగా ఆ దెయ్యం వస్తే వాళ్ళను పిలవవచ్చులే... అని ముందుకే వెళ్లాడు. గుండెల్లో దడ పెరిగింది. అయినా, అమ్మదగ్గరకు వెళ్లాలని కాస్త ధైర్యం చిక్కబట్టుకున్నాడు. చిన్నగా చెట్టును దాటి ఆవలివైపుకు వెళ్ళాడు. "హమ్మయ్య" అనుకున్నాడు. కానీ, వెనుకనుండీ దెయ్యం వస్తేనో? మళ్ళీ అనుమానం. దాంతో గుండె దడ తగ్గనేలేదు. దగ్గరలో ఎవరూ లేరు. ఇంకాస్త చీకటి పెరిగింది. పైకి చూడకూడదనుకున్నాడు. కిందికి చూస్తూ వెళుతున్నాడు. చీకటి పెరగడంతో దారి, మసకగా కనబడుతోంది. వెనక్కూ ముందుకూ చూసుకుంటూ వేగంగా నడుసున్నాడు. ఉన్నట్నండి కాలిక్రింద ఏదో చటుకున్నట్టయ్యింది. కాలికి చురుక్కుమంది. "బాబోయ్! పాము కుట్టిందిరోయ్ !” అంటూ కేక పెట్టి కూలబడిపోయాడు.

తరువాతి రోజు వినయ్ పుట్టిన రోజు వాడికి కొత్త బట్టలు, స్వీట్లు తీసుకుని తొందరగా వద్దామని పట్నం వెళ్లారు. బడి వదిలే వేళ్ళకి  రావచ్చని మధ్యాహ్నమే వెళ్లారు. అయితే, వినయ్ డ్రెస్ కోసమని షాపుల్లో వెతుకుతూ కాలం గడిచిపోయింది. 6 కి.మీ. దూరమే అయినా, సమయానికి బస్సులు, ఆటోలు దొరకలేదు. పిల్లోడు ఎట్లాగున్నాడో? వెంట తెచ్చినా బాగుండేది అని కంగారు పడుతూ వచ్చారు. ఇల్లు చేరేసరికి చీకటి పడింది. అంతకు 5 నిమిషాల క్రితమే వినయ్ పొలం వైపబయలుదేరాడు. ఇంటి దగ్గర పిల్లవాడు లేకపోయే సరికి తల్లిదండ్రులు ఇరుగు పొరుగును విచారించారు. తెలియదన్నారు కంగారు పెరిగింది. ఆలోచించారు. పొరుగు కొందరు గువిగూడారు. "ఏమయ్యిందన్నారు?" విషయం చెప్పారు.

"ఎప్పడూ పొలానికే తీసుకెళ్తారు గదా? మీరు. అక్కడికి వెళ్ళుంటాడు లెండి." ఎవరో అన్నారు. “అవును నిజమే. పదండి చూద్దాం. లేటయ్యోసరికి అక్కడికేమన్నా వెళ్లి ఉంటాడేమో?" అంటూ లైట్లు తీసుకుని ఓ నలుగురితో పొలం వద్దకు బయలు దేరారు.

కొంత దూరం వెళ్ళేసరికి, దారిలో అడ్డంగా పడి ఉన్న వినయ్ కనిపించాడు. “వినయ్! వినయ్!" అంటూ ఆతృతగా సాలమ్మ పరిగెత్తింది. గభాలున కింద కూలబడి కొడుకును చేతిలోకి తీసుకుంది. పలకలేదు. వేలాడిపోయాడు.

" అయ్యో! దేవుడా!" అంటూ భోరున ఏడ్వసాగింది సాలమ్మ. చంద్రయ్య కూడా బిత్తరపోయి సాలమ్మ దగ్గరలోనే తానూ కూలబడిపోయాడు. పిల్లవాడు ఉలకలేదు, పలకలేదు. ఇద్దరూ బావురుమన్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన మరికొందరు ఆడవాళ్ళ కూడా వారి ఏడుపుకు వంత కలిపారు. ఏమయ్యింటుందా? అని అటూ ఇటూ లైటు వేసి చూశారు ఎవరో కొంత దూరంలో పెద్ద నల్లేరు తీగ కనిపించింది. పిల్లవాడి కాలికి ఒక తీగ ముక్క తగులుకుని ఉంది. అది చూసి చెంచయ్య అనే వ్యక్తి పరిస్థితిని ఊహించాడు. "ఆ నల్లేరు కాలికి తగిలినట్టుంది. పాపం! చీకట్లో ఏదో అనుకుని భయపడి పరిగెత్తబోయినట్లున్నాడు. అది కాస్తా., కాళ్ళకు తట్టుకొని ఉంటుంది. కింద పడ్డాడు సృహతప్పి ఉంటాడు. డాక్టర్ దగ్గరికి తీసుకొని పదండి." అన్నాడు.

"చెంచన్న చెప్పింది నిజమే. ఎందుకంటే ఈ పిల్లోడు ముందే అనుమానపు పిల్లోడు కదా!" మరో ఎర్రన్న మాట. “అవును కరెక్టే...  అందుకే అంటారు పెద్దలు. "అనుమానం పెనుభూతం'' సుబ్బయ్య మాట. గ్రామంలో ఉన్న ఆర్.యం.పి డాక్టర్ చికిత్సతో వినయ్ తేరుకున్నాడు. తర్వాత తనకెవ్వరు స్నేహితులు లేకపోవటం వల్లనే ఈ ఘటన జరిగిందని వినయ్ అనుకున్నాడు. తల్లిదండ్రులు కూడా తమ తప్పును తెలుసుకున్నారు. వినయ్ ఇప్పడు తన వయస్సు పిల్లలతో కలిసిపోయాడు.

అక్కడ పొలం దారిలో కూడా గాలికి ఎగిరి వచ్చిన గుడ్డ ముక్క అనే సంగతి మాత్రం ఎవరూ ఊహించలేనిది. ఏది ఏమైనా సుబ్బయ్య చెప్పినట్లు, " అనుమానం మాత్రం పెను భూతమేనండోయ్!". పెంచుకోకండే!

రచయిత: మద్దిరాల శ్రీనివాసులు, సెల్. 9010619066© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate