অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఇద్దరు దొంగలు

ఇద్దరు దొంగలు

అప్పడెప్పడో మనం పుట్టక ముందు జరిగిన కథ ఇది. ఒక ఊళ్లో రంగన్న, సింగన్న, అనే ఇద్దరన్నదమ్మలు వుండేవారు. ఇద్దరికిద్దరూ సోమరిపోతులే. ఒళ్లొంచి పనిచేయడమనేది వారికి అస్సలు సరిపదేది కాదు. కష్టపడి పని చేయండిరా... అని చెప్పీ, చెప్పీ వాళ్ల అమ్మనాన్నలు విసిగిపోయారు. చివరకు, పోండి పోయి మీ బతుకులు మీరు బతకండి, అని ఇంటి నుంచి పంపించేశారు. కనీసం అలాగైనా వారు బాగుపడతారని వాళ్ల ఆశ.

idoneసాయంత్రం దాకా నడచీ, నడచీ అన్నదమ్ములిద్దరూ ఓ పల్లెటూరు చేరుకున్నారు. ఆ పూటకి ఎవరో ఇంత అన్నం పెట్టారు. మరునాటి నుంచి పొలం పనికి రమ్మని కూడా చెప్పారు. కాని ఆ మాటలు మన వాళ్లకు తలకెక్కితే కదా. మరునాడు ఊరి వాళ్లందరూ ఎవరి పనుల్లో వాళ్లు ఉన్న సమయం చూసుకుని రంగన్న, సింగన్న చెరో గొర్రెను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. మరో ఊళ్లో ఆ గొర్రెల్ని అమ్మేసి, వచ్చిన డబ్బుతో ఓ నాలుగైదు రోజులు హాయిగా వెళ్లబుచ్చారు. తరువాత ఆ ఊరి నుంచి చెరో గొర్రెను దొంగిలించి, రాత్రికిరాత్రే మరో ఊరు పారిపోయారు. ఇక అప్పటి నుంచి ఆ అన్నదమ్ములు తాము బతకడానికి అదే మార్గాన్ని ఎంచుకున్నారు.

కాని దొంగలనే వాళ్లు పట్టబడకుండా ఎంత కాలముంటారని? ఎంత ఘరానా దొంగలయినా సరే ఏదో ఒక రోజున పట్టుబడవలసిందే కదా. అందుకే మన రంగన్న, సింగన్న కూడా దొంగతనం చేస్తూ ఒక ఊళ్లో పట్టుబడిపోయారు. ఊళ్లోని జనం దొంగలిద్దరినీ చితకబాదారు. తరువాత ఇద్దరి నుదిటి మీద “గొ” అనే అక్షరాన్ని పచ్చబొట్టుగా పొడిపించారు.

ఇది చూడగానే మీరు గొర్రెల దొంగలన్న విషయం అందరికీ తెలుస్తుంది. ఇక మీదట మీరు ఏ ఊళ్లోనూ దొంగతం చేయకూడదనే ఇలా పొడిపించాం, అన్నారు ఊరిజనం.

idtwoపాపం ఆ మాటలు వినగానే రంగన్న, సింగన్న హతాశులయ్యారు. బాగా దిగాలుపడిపోయారు. ఆ రాత్రంతా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయారు. ఊరజనం కొట్టి దెబ్బల కన్నా ఈ పచ్చబొట్టే వాళ్లని వెయ్యిరెట్లు బాధించింది. ఎలా? ఇప్పుడెలా? ఆలోచించి వాళ్లు బాగా అలసిపోయారు. తెలవారుతుండగా కొంచెం కునుకుపట్టింది. రంగన్న నిద్రలేచి చూసేసరికి పక్కన సింగన్న లేడు, అటూ ఇటూ వెతికి చూశాడు కాని లాభం లేకపోయుంది. ఎక్కడా అతని జాడ లేదు. ఇక అతన్ని వెతకడం మానేసి ఊరి పెద్ద దగ్గరకు వెళ్లాడు.

అయ్యా. ఇంతకాలమూ నేనుచేసిన పని తప్పేనని తెలుసుకున్నాను. మరొకరు కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని దొంగతనం చేసి బతకడం నీచమైన పని అని నాకు అర్థమయింది. ఇక మీదట నేను ఎలాంటి దొంగతనాలు చేయను. దయచేసి నాకు మీ ఊళ్లో బతికేందుకు వీలు కల్పించండి. అని రంగన్న ప్రార్థించాడు. ముందుగా కాదన్నప్పటికీ, రంగన్న మళ్లీ ప్రాధేయపడడంతో ఊరిపెద్ద సరేనన్నాడు.

ఇక ఆ రోజు నుంచీ రంగన్న కష్టపడి పనిచేయడం మొదలు పెట్టాడు. అంతేకాదు తన కష్టార్జితంలో కొంత భాగాన్ని నిస్సహాయ స్థితిలో ఉన్న వారి కోసం ఖర్చు పెట్టడం కూడా మొదలుపెట్టాడు. అది అతనికి గతంలో ఎన్నడూ పొందనంత సంతోషాన్ని కల్గించేది. దొంగతనాలు చేసే కాలంలో ఎప్పుడూ ఒక రకమైన భయంతో బతకాల్సి వచ్చేది. కాని ఇప్పుడలాంటి భయమేదీ లేకపోవడంతో అతని మనసుకి ఎంతో హాయిగా ఉంది. దాంతో నిండుగా నవ్వగల్గుతున్నాడు. అందరితోనూ మనస్ఫూర్తిగా మాట్లాడగల్గుతున్నాడు. దాంతో కొన్ని నెలలైనా తిరక్కుండానే ఆ ఊరి వాళ్లందరికీ రంగన్న ఆత్మీయుడిగా మారిపోయాడు. ఒకప్పుడు అతను దొంగతనం చేయడానికి వచ్చాడు అన్న సంగతిని కడా అందరూ మర్చిపోయారు.

మొదట్లో, అప్పుడప్పుడు అతని నుదిటి మీద ఉన్న “గొ” అనే అక్షరం అతనొక దొంగ అనే విషయాన్ని ఊరివాళ్లకి గుర్తు చేసేది. కాని రానురాను అది కూడా గుర్తు చేయడం మానేసింది. ఆ “గొ” అనే గుర్తు గొప్పమనిషి అనే మాటకు సంకేతంలా కన్పించడం మొదలు పెట్టింది. ఎవరైనా కొత్తవాళ్లు దాని గురించి అడిగినప్పుడు కూడా ఊరివాళ్లు అలాగే చెప్పడం మొదలు పెట్టారు.

ఓ రెండుమూడేళ్ల తరువాత రంగన్నకు ఎవరో పిల్లనిచ్చి పెళ్లి చేశారు. తరువాత కొంత కాలానికి అతనికి ఇద్దరు బిడ్డలు కూడా పుట్టారు. అయితే పెళ్లి చేసుకున్నప్పటికీ రంగన్న పరోపరాకబుద్దిలో మార్పు రాలేదు. ఎవరకి ఏ సాయం కావలసివచ్చినా అతను ముందుండేవాడు. దాంతో ఈ రంగన్న నిజంగానే ఓ మహానుభావుడు అని ఊరివాళ్లు మనస్ఫూర్తిగా మెచ్చుకునేవారు.

మరో పాతికేళ్ల కాలం గడిచిపోయింది. ఇప్పుడు రంగన్న పిల్లలు పెద్ద వాళ్లై, ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు.

ఒకనాడు ఎవరో ఓ అసామి రంగన్నను వెతుక్కుంటూ వచ్చాడు. అతను చిక్కి శల్యమై పోయివున్నాడు. మొహమంతా తోటకూర కాడలా వాడిపోయి వుంది. అతను మరెవరో కాదు రంగన్న తమ్ముడు సింగన్న.

తన అన్నను, ఆ అన్నపై గ్రామస్తులు చూపుతున్న ప్రేమాభిమానాలను చూడగానే సింగన్న తన కళ్లను తాను నమ్మలేకపోయారు. ఆ తరువాత రంగన్నను పట్టుకుని బావురుమని ఏడ్చేశాడు.

ఈ పచ్చబొట్టు నా జీవితాన్ని సర్వనాశనం చేసిందన్నయ్యా. నేను ఏ పని చేసినా ఇదే నాకు కన్పిస్తుంది. ఎవరితో ఏం మాట్లాడుతున్నా వాళ్లు నా వంక చూసి నవ్వుతున్నట్లుగానే అన్పిస్తుంది. దీన్ని చూసి నన్ను ఏ ఊళ్లోకి అడుగుపెట్టనిచ్చేవాళ్లు కారు. అందరూ నన్ను అనుమానంగానే చూసేవారు. దాంతో ఇక నేనీ మనుషుల మధ్య ఉండలేననపించి సాధువుల్లో కలసిపోయాను. అయితే వాళ్లలో కూడా ఎందరో సాధువులు ఈ పచ్చబొట్టును అడ్డుగా పెట్టుకుని నన్ను ఆట పట్టించారు. దాంతో ఎన్నోసార్లు ఎందరితోనో జగడాలాడాను. ఎందర్ని ఎంతగా కొట్టానో అంతగా నేనూ దెబ్బలు తిన్నాను. ఛీ...ఛీ... ఇదీ ఒక బతుకేనా.... అని చాలాసార్లు అన్పించింది. ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని కూడా ఎన్నోసార్లు అనిపించింది. కాని ఆ పని చేయలేకపోయారు. ఎందుకు అన్నయ్యా... ఎందుకు మనకీ శిక్ష... అంటూ సింగన్న బావురమన్నాడు. తమ్ముడు పడిన బాధను విన్నాక రంగన్నకు కూడా చాలా బాధగా అన్పించింది. ఊరుకోరా సింగా... ఊరుకో అంటూ ఓదార్చాడు.

నిజం చెప్పాలంటే, ఈ శిక్ష ఎవరో ఎవరికో వేసింది కాదు. ఇది నేను నువ్వే వేసుకున్నది. మనిద్దరం ఒకప్పుడు గొర్రెలు దొంగతనం చేయడం అనే పెద్ద తప్పును చేస్తూ వచ్చాం. అలాంటి తప్పుని మనం మళ్లా చేయకూడదనే ఉద్ధేశంతో ఈ ఊరివాళ్లు మన నుదుటి మీద పచ్చబొట్టు కరచినట్లుగా దేశాలు పట్టి పోయావు. నేను మాత్రం... ఆ చెడ్డపని చేసినందుకు ఇలా శిక్షించిన జనం, మంచిపనులు చేసినప్పుడు ఏం చేస్తారో చూడాలి, అనుకుని ఇక్కడే ఉండిపోయాను. అంటూ జరిగిదంతా చెప్పాడు రంగన్న అంతా విన్నాక... నిజమే చెడు చేసే వాళ్లందరికీ శిక్షలు పడతాయో లేదో తెలియదుగాని, మంచి చేసే వారికి మాత్రం ఈ జనం తప్పక నీరాజనాలు పడతారు. అనుకున్నాడు సింగన్న.

 

 © 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate