অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కనువిప్పు

కనువిప్పు

kanuvipuoneరామయ్యది వేమవరంలో మధ్యతరగతి కుటుంబం. భార్య సీతమ్మ ఇద్దరు పిల్లలు. అబ్బాయి రమేష్ 16 ఏళ్ళు అమ్మాయి భారతి 12 ఏళ్ళు. చిన్న పెంకుటిల్లు, కొంతపొలం, చాలీ చాలని ఆదాయంతో నెట్టుకొస్తున్నాడు రామయ్య రమేష్‌కు చదువు అబ్బలేదు. హైస్కూల్ చదువు మధ్యలోనే ఆపేశాడు. కొడుకు కూడా ఎంతో కొంత సంపాదిస్తే కుటుంబానికి ఆసరాగా ఉంటాడని రామయ్య ఆశ. పెద్ద ఉద్యోగం ఆశ ఎటూలేదు. పట్నంలో ఏదైనా పనిదొరుకుతుందనుకుని చివరకు ఒక లారీ కంపెనీలో క్షీనర్గా చేరాడు రమేష్ చలాకీ గానే ఉంటాడు. తిండి ఖర్చులు పోను రోజుకు సంపాదన వంద రూపాయిలు దాకా ఉంటుంది. రెండు రోజులకోసారి ఇంటికి వచ్చిపోతున్నాడు. "ఒరేయే రమేష్, నీకు చదువు ఎలాగూ అబ్బలేదు. పోని చేస్తున్న పనైనా శ్రద్ధగాచేయ్. డ్రైవింగ్ కూడా నేర్చుకుంటే ముందు ముందు ఆ కంపెనీలోనే పైకి రావచ్చు. వ్యవసాయం మనకు ఎలాగూ గిట్టుబాటుగా లేదు. నీ సంపాదనలో కొంతైనా మిగిల్తే మన కుటుంబానికి సాయంగా ఉంటుంది. రాను రాను ఇంటి ఖర్చులు, బాధ్యతలు పెరుగుతున్నాయి. నీకూ తెలుసుగా మీ అమ్మా నేనూ నీ మీదే ఆశలన్నీ పెట్టుకున్నాంరా" అన్నాడు రామయ్య కొడుకుతో, “అలాగే నాన్నా... నాకు మాత్రం తెలియదా" అన్నాడు రమేష్.

ఒక రోజు కొబ్బరికాయల లోడ్ తో లారీ చెన్నై బయలుదేరింది. డ్రైవర్ తో బాటు రమేష్ కూడా వెళ్ళాడు. మధ్యాహ్నం 2 గం.లు అయింది. డ్రైవర్ భోజనం కోసం లారీని ఒక హెూటల్ ముందు ఆపాడు. ఇద్దరూ భోజనం చేశారు. పదినిమిషాలు ఆగి బయలు దేరదాం అన్నాడు డ్రైవర్ హెూటల్ పక్కనే ఒక కిళ్ళీ దుకాణం ఉంది. రంగురంగుల ప్యాకెట్ల దండల్లా వేలాడుతున్నాయి. వాటిని చూసిన రమేష్ కి ఆసక్తి కలిగింది. అటుగా వెళ్ళాడు. "ఈ ప్యాకెట్లు ఏంటి? వక్కపొడి పేకెట్లు అనుకుంటా, అవునా?” ఆసక్తిగా షాపువాణ్ణి అడిగాడు రమేష్.

“వక్కపొడి ప్యాకెట్లు కావు. ఇవి గుట్కా ప్యాకెట్లు వీటిల్లో రకాలున్నాయి. ఒక ప్యాకెటు రెండు రూపాయిలు మాత్రమే. గుట్కా చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఒక సారి నమిలిచూస్తే మీకే తెలుస్తుంది. చాలా హుషారుగా కూడా ఉంటుంది. మీలాగా లారీల్లో పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుంది." అన్నాడు షాపు యజమాని. ఈ మాటలతో రమేష్ ఆసక్తి మరింత పెరిగింది. "ఏదీ ఓ ప్యాకెట్ ఇవ్వండి.” ప్యాకెట్ కొని వాసన చూశాడు. ఘాటైన వాసన. కొద్దిగా నోట్లో వేసుకుని నమలడం మొదలుపెట్టాడు. ఏదో రుచి. భలేగా ఉంది. ఇంకొంచెం నోట్లో వేసుకున్నాడు. లారీ మళ్ళీ బయలుదేరింది. చెన్నై చేరేటప్పటికి రాత్రి తొమ్మిదయింది. లోడు దింపేందుకు ఇంకా అరగంట పైగా ప్రయాణం. భోజనానికి ఆగారు. రమేష్ ఆలోచన మళ్ళీ గుట్కా వైపుకు లాగింది. మరో ప్యాకెట్ కొన్నాడు. మళ్ళీ రెండు రూపాయిలు ఖర్చు. ఆ షాపు దగ్గర ఇంకా జనం ఉన్నారు. అక్కడ ఆగి వున్న ఇతర లారీల డ్రైవర్ లే కాదు కొందరు కుర్రాళ్ళు కూడా ఉన్నారు. చూడానికి కాలేజీ కుర్రాళ్ళలాగా కనిపిస్తున్నారు. గుట్కా నములుతూ కబురు చెప్పకుంటున్నారు. రమేష్ కి ఏదో తమాషాగా ప్రారంభంయిన గుట్కా అలా అలా ఒక అలవాటుగా మారిపోయింది. నోట్లో ఎప్పడు గుట్కా ఉండాల్సిందే. నములుతూ ఉండడం, చీటికి మాటికి ఉమ్మి వేస్తుండడం. చూస్తూ చూస్తూ నాలుగేళ్ళు గడిచిపోయాయి. రమేష్ ఇప్పడు డ్రైవర్ అయ్యాడు. అయినా గుట్కా అలవాటు మానలేదు. నిజానికి అదో వ్యసనంలా మారిపోయింది. ఎప్పడూ జేబులో కొన్ని ప్యాకెట్లు ఉండాల్సిందే. రోజూ 20 రూపాయిల దాకా ఖర్చవుతోంది.

kanoviputwoవెుదటో తండ్రి రామయ్య పెద్దగా పట్టించుకోలేదు. కాని ఇప్పడు రమేష్ పళ్ళపై మకిలి చేరింది. బుగ్గల్లో కూడా మార్పు కన్పిస్తోంది. రామయ్య చాలా కంగారు పడ్డాడు. కొడుకును పిలిచాడు. "ఒరేయ్ రమేష్, ఈ పాడు గుట్కా అలవాటు నీకెలా వచ్చిందిరా, నోరు చెడగొట్టుకుంటున్నావ్. ఏదో మజాగా అనిపించినా బుగ్గలు, దంతాలు పాడవుతున్నాయిరా. పైగా రోజూ ఎంతడబ్బు తగలేస్తున్నావ్! ఇలాంటి వ్యసనాలు మొదట్లో మిత్రుల్లాగా శరీరంలో ప్రవేశిస్తాయి. మెల్లమెల్లగా శత్రువులుగా మారి చాలా హానిచేస్తాయ్. అమ్మ కూడా బెంగపెట్టుకుంటోంది. ఈ చెడు అలవాటు మానరా!" అన్నాడు రామయ్య.

"నాన్నానీదంతా అనవసరమైన కంగారు. లారీ తోలడం చాలా కష్టం. రాత్రిళ్ళు వేులుకొని దూరప్రాంతాలకు లారీ తోలాలంటే గుట్కా ఉండాల్సిందే. పైగా మెదడు చురుగా పనిచేస్తుంది. పెద్దగా నష్టం ఏమీ ఉండదు". అన్నాడు రమేష్.

"ఆహా! అలాగా! అయితే డ్రైవర్లు అంతా ఇలానే ఉన్నారా? గుట్కా లేకుండా వాళ్ళకి అన్నం అరగడం లేదా? నిద్ర మేల్కొనడం లేదా? బండ్లు తోలడం లేదా?" కాస్త మందలింపు ధోరణిలోనే అన్నాడు రామయ్య.

"నాన్నా నువ్వేమీ కంగారు పడకు. నేనే కాదు చాల మంది గుట్కా నములుతారు. ఇంతెందుకు మన పక్కింటి సురేష్ పట్నంలో కాలేజీలో చదువుతున్నాడా, అతను కూడా గుట్కా నములుతాడు. మా మోటారు వర్నర్లేకాదు ఎంతో మంది ఆఫీసు ఉద్యోగస్తులకు కూడా ఈ అలవాటు ఉంది. అన్ని చోటా గుట్కా అమ్ముతున్నారు. రకరకాల కంపెనీలవి ఉన్నాయి. అయినా కంట్రోల్ నా చేతిలోనే ఉంది. ఎప్పడు అనుకుంటే అప్పడే మానెయ్యగలను." ధీమాగా చెప్పాడు రమేష్.

మళ్ళీ ఏదో లైన్కని వెళ్ళి నెల్లాళ్ళ తర్వాత ఇంటికి వచ్చాడు రమేష్, ఇప్పడు దంతాల చిగుళ్ళు వాచి వాటిలో చీము చేరింది. నొప్పి మొదలయింది. అన్నం నమలడమే కష్టమైపోతోంది. తిన్నతిండి సరిగా అరగడంలేదు. దగ్గు వస్తోంది. ఏదోవణుకు. తల్లి సీతమ్మ కన్నీళ్ళ పర్యంతమైంది. రామయ్య కొడుకు పరిస్థితి గమనించాడు రమేష్ రానంటున్న బలవంతం మీద పట్నంలో డాక్టర్ కు చూపించాడు. రమేష్‌ని డాక్టర్ పరీక్షిస్తున్నాడు.

“నీ వయస్సు ఎంత?”

“20 ఏళ్ళ దాటాయి”

“రోజుకి ఎన్ని ప్యాకెట్లు వాడతావు?” డాక్టర్ ప్రశ్నలు వేశాడు.

“సుమారు 10 ప్యాకెట్లు సార్” రమేష్ సమాధానం.

“చూడండి రామయ్యగారు. మీ అబ్బాయికి ఇదంతా ఆ పాడు గుట్కా వల్లే వచ్చింది. ఏదో నవ్వులాటగా మొదలై అలవాటుగా మారింది. మీవాడే కాదు, చాలా మంది ఇలాగే వ్యసనాల బారిన పడుతున్నారు. చదువుకునే కురాళ్ళు కూడా ఇదేదో ఫ్యాషన్ అనుకుంటున్నారు. పైగా వాళ్ళని ఆకర్షించేందుకు స్కూళ్ళు, కాలేజీలా దగ్గర్లోనే వీటిని అమ్ముతారు. ఇదే కాదు, ఈ మధ్య నివాస ప్రాంతాల మధ్య, రోడ్ల పక్కన మద్యం షాపులు వెలిశాయి. ఎంతో మంది మద్యానికి, మత్తు పదార్ధాల (డ్రగ్స్) కు బానిసలవుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని కనిపెట్టుకుని ఉండాలి" అన్నాడు డాక్టర్.

"నేను చెబుతూనే ఉన్నాను డాక్టర్ గారూ! అయినా మావాడు వింటేగా?" ఇప్పుడు మీరు చెప్పారు రామయ్యగారూ! "గుట్కా పాన్ మసాలా, సిగరెట్ మద్యం, జర్గా, డ్రగ్స్ వంటి వ్యసనాలు మన పిల్లల్ని పాడుచేస్తున్నాయి. వీటి బారిన పడడం అంటే చిన్న వయసులోనే మృత్యువును ఆహ్వానించడం అన్నమాట." "అసలీ గుట్కాలో ఏముంటాయ్ డాక్టర్ గారూ?" రామయ్య ప్రశ్న

“గుట్కాలో సాధారణంగా వక్కపొడి, పొగాకు, సున్నం, కవిరి (Catechu) మైనం (paraffin wax) మనల్ని ఆకర్షించేందుకు కొన్ని మసాలా సరుకులు, సుగంధద్రవ్యాలు ఉంటాయి, రామయ్యగారూ" అన్నారు డాక్టర్.

"ఈ గుట్కా నమలడం వల్లనే నాకు ఇలా జరిగిందంటున్నారు కదా. అంటే ఏం జరిగింది డాక్టర్ గారూ? రమేష్ అడిగాడు.

"గుట్కాను నమిలినప్పడు దాంట్లో వుండేవన్నీ కడుపులోకి పోతాయి. వక్క సున్నం ఇతర పదార్థాల సూక్ష్మకణాలు పళ్ళ సందుల్లోకి పోయి అక్కడ నిల్వ ఉంటాయి. పళ్ళను పాడుచేస్తాయి. పొగాకులో ఒక విషపదార్థం ఉంది. దాన్ని నికోటిన్ అంటారు. తక్కువ మోతాదులో ఇది నాడీ మండలాన్ని ఉత్తేజపరుస్తుంది. కాని తర్వాత నిస్తేజ పరుస్తుంది గుండె, ఊపిరితిత్తులు, మెదడుని కూడా పాడుచేస్తుంది. పొగాకు ఇతర రూపాలన్నిటికన్నా గుట్కా చాలా హానికరం" డాక్టర్ మాటలు అర్ధమయ్యాయి రమేష్ కి.

'కొందరు గుట్కా వల్ల కాన్సర్ వస్తుందంటున్నారు. నిజమేనా డాక్టర్?” ఎంతో ఆందోళనతో అడిగాడు రామయ్య "మంచి ప్రశ్నవేశారు. పొగాకు-కాన్సర్ ఒక అపురూపమైన జోడి గుట్మాలో పొగాకు ఉంది. నిజానికి గుట్కాలో ఎన్నో రసాయనాలున్నాయి. వీటిలో సుమారు 40 దాకా కాన్సర్ కారకాలే. గుట్కా నమిలితే నెమ్మదిగా బుగ్గ కాలిపోతుంది. పెదవులు, బుగ్గ కాన్సర్‌కు దారితీస్తుంది. చివరకి బుగ్గ కోయించుకోవాల్సి వస్తుంది. చూశారూ, గుట్కా సువాసనతో ఆకర్షించి విషాణువులతో కొంప మంచుతుంది. మీ రమేష్‌కి ఆ దశరాలేదు. కాస్త ముందుగానే నాకు చూపించారు. గుట్కా అలవాటు తక్షణం పూర్తిగా మానేసి, నేనిచ్చే మందులు వాడాలి. నెమ్మదిగా కోలుకుంటాడు" అన్నాడు డాక్టర్.

"నేను ఎన్నోసార్లు మా వాడికి చెప్పాను డాక్టర్ ఈ పాడు అలవాటు మానెయ్యమని. నామాట వినలేదు. సరిగా నేను చెప్పిన ప్రతిసారీ నాతో వాదనే. రాత్రిళ్ళు మెలకువగా ఉండి లారీ తోలాలంటే గుట్కా తప్పనిసరి అనేవాడు" అన్నాడు రామయ్య.

"గుట్కా వల్ల నష్టం ఏమీ ఉండదు. పైగా హుషారుగా ఉంటుంది. ఈ మాట షాపుల వాళ్ళందరూ అంటున్నారు. అందుకే కొనేవాణ్ణి సార్!” అన్నాడు రమేష్ .

“అది పొరపాటు రమేష్ గుట్కా జర్గా, పాన్‌మసాలా, డ్రగ్స్ అమ్మేవాళ్ళు అలానే చెబుతారు. అది వ్యాపారం! అమాయకజనాన్ని మత్తులో మంచి లక్షలు దండుకుంటారు. గుడ్డిగా నమ్మేయకూడదు. ఏవిషయాన్నైనా ప్రశ్నించి నిగ్గుతేల్చుకోవాలి. మనలో సహజంగా ఉండే శక్తి మాత్రమే మనకు నిజమైన సంపద. గుట్కాలాంటివి కొంత ఉత్తేజాన్ని కలిగిస్తాయేగాని కొత్తగా శక్తిరాదు. శక్తిని పుట్టించవు సరికదా మనిషిని క్రమంగా దుర్బలుడుగా చేస్తాయి. ఎందుకూ పనికి రాని వాడయిపోతాడు. వీటికి తగలేసే డబ్బుతో బలమైన ఆహారం, పాలు, పం కొనుక్కోవాలి” చెప్పాడు డాక్టర్.

"అర్థమయింది డాక్టర్, మీ సలహా తప్పక పాటిస్తాను. ఇంకెప్పుడూ గుట్కాకాని ఏ ఇతర వ్యసనం జోలికి కాని పోను." కృతజ్ఞతతో చెప్పాడు రమేష్,

kanuviputhreeరామయ్య, రమేష్ హాస్పిటల్ బయటకి వచ్చారు. ఇంతలో కొన్ని నినాదాలు విన్పించాయి.

"బెల్లు షాపులను ఎత్తేయాలి"

"మద్య నిషేధం అమలుచేయాలి"

"చుట్ట, బీడి, సిగరెట్ నరకానికి తొలిమెట్టు"

“గుట్కా తింటే గుటుక్కుమంటావ్"

"మత్తు పదార్థం మరణానికి ద్వారం. వ్యసనం నాశనానికి మార్గం"

వాళ్ళు జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలట చాలా మంది మహిళలున్నారు. నగరంలో ర్యాలీ. అవును, “నిజమే! తాను అనుభవించాడు నాలాగా ఎవరూ ఈ గుట్కా లాంటి వ్యసనాలజోలికి పోకూడదు. వాటిని అన్నింటినీ నిషేధించాల్సిందే." అనుకుంటూ తాను కూడా ర్యాలీలో పాల్గొన్నాడు రమేష్ రామయ్య కూడా కొడుకును అనుసరించాడు.

రచయిత: -డా. ఇ.ఆర్ సుబ్రహ్మణ్యం, సెల్: 9848014486© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate