অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కాగితం కధ

కాగితం కధ

చందమామ... రావే జాబిల్లి రావే... కొండెక్కి రావే... గోగుపూలు తేవే.. పాట చిన్నప్పుడు మీ అమ్మ అమ్మమ్మ, నాయనమ్మలు పాడగా వినే వుంటారు. ఈ పాట వ్రాసింది ఎవరో తెలుసా? తాళ్ళపాక అన్నమయ్య ఆయన ఇలాంటి పాటలు రాగిరేకుల (Copper Plates) మీద వ్రాసి తిరుమల కొండపైన భద్రపరిచాడు. ఆయన రాగి రేకులపై ఎందుకు రాశాడు. ఎందుకంటే అప్పుడు కాగితాలు (Paper) లేవుగనుక. పాతకాలంలో సమాచారాన్ని, విజ్ఞానాన్ని ముందు తరాలకు అందించడం కోసం, భద్రపరచడం కోసం తాళ్లపత్రాలను (తాటి రేకులను), రాగి రేకులను వాడేవారు. కాగితం కనుగొన్న తరువాత విజ్ఞానాన్ని, సమాచారాన్ని భద్రపరచడం, వ్యాప్తి చేయడం, అందరికీ అందించడం చాలా సులభమైంది. మరి ఈ కాగితం పుట్టు పూర్వోత్తరాలు, కథా కమామిషు తెలుసుకుందామా?

కాగితం అనేది నార, చెక్క గడ్డి ఇతర పదార్థాల గుజ్జు, పీచు మరియు సెల్లులోజ్ (Cellulose) తో తయారు చేయబడిన పలుచని వస్తువు. 'పేపర్' అనే పదము లాటిన్ పదమైన 'పాపి రన్' నుండి గ్రహింపబడింది. నైలునదీ ప్రాంతాలలో విరివిగా పెరిగే సైపరస్ పాపిరస్ (Cyperus Paperus) మొక్కను ఉపయోగించి ప్రాచీన గ్రీకులు పలుచని కాగితంలాంటి పాపిరస్ ప్రదార్థాన్ని వ్రాయడానికి ఉపయోగించేవారు.

క్రీస్తు పూర్వము 2వ శతాబ్దంలో మొట్టమొదట చైనాలో కాగితం వాడినట్లు పురావస్తు శాస్త్రజ్ఞులకు లభించిన ప్రాచీన పేపరు ముక్క వల్ల తెలిసింది. కానీ మొదటి పేపరు తయారీ క్రీ.శ. 105లో చైనాలో 'సాయ్లున్' అనే అతను చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆయన సాన్ (Xaun) కాగితాన్ని తయారు చేశాడు. ఆ తయారీ టెక్నాలజీ చైనాలో వ్యాప్తి చేయడానికి 'సాయ్లున్' చాలా కృషి చేశాడు. చెట్టు బెరడు, చెట్టు నారలు, గోనె సంచులు, చేపల వల తాడుల నుండి గుజ్జు తయారు చేసి పేపరు తయారు చేయవచ్చని నిరూపించాడు. క్రీ.శ 608లో వెదురు నుండి కాగితం తయారీ కనుగొనబడింది. క్రీ.శ. 3వ శతాబ్దంలో పేపరు తయారీ చైనా నుండి వియత్నాం, కొరియా దేశాలకు వ్యాపించింది. తొలుత చేతి తయారీగా వున్న పేపరు తయారీ నీటి యంత్రాల ద్వారా చేయడం ప్రారంభమైంది. 1411లో నీటి యంత్ర పేపరు మిల్లు పోర్చుగీసులోని 'లెరియా! నగరంలో నిర్మింపబడింది. 'గుటెన్ బర్గ్' ప్రింటింగ్ యంత్రం కనుగొన్న తరువాత పేపరు వాడకం, తయారీ వేగవంతం అయ్యింది.

క్రీ.శ. 1838లో చార్లెస్ ఫెనెర్జె (Charles Fenerte) అనే అతను కలప గుజ్జు (Wood Pulpe) నుండి పేపరు తయారీని కనుగొన్నాడు. కానీ దానిపై పేటెంటు హక్కు మాత్రం ఆయన పేరుపై లేదు. ఇతరులపై వుంది. క్రీ.శ. 1850లో అట్ట పెట్టెలలో వాడే 'కారిగేటెడ్ (Corrigated or Pleated) పేపరును ఇంగ్లీషు పౌరులు “హేలే మరియు ఆలెన్లు తయారు చేశారు. క్రీ.శ. 1870లో కారు బోరు బాక్సుల తయారీని అమెరికాకు చెందిన రాబర్ట్ గెయిల్ రూపొందించాడు. దీనితో కావలసినప్పుడు బాక్సు, వద్దనుకున్నప్పుడు విప్పి మడిచి పెట్టుకొనుట ప్రారంభమైంది. పారిశ్రామిక విప్లవం తరువాత పేపరు బ్యాగుల తయారీ, వాడకం పెరిగింది. 1870లోని మార్గరెట్ నైట్ అనే మహిళ దీర్ఘచదరపు అడుగు భాగం గల (వెడల్సుగా గల) పేపరు సంచిల తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పింది. దాని పేరు “ఈస్ట్రన్ పేపర్ బ్యాగ్ కంపెనీ 1904లో వాడి పారవేసే పేపరు ప్లేటుల (Disposable Plates) తయారీ మొదలైంది. 1908లో 'హజ్ మూర్' పేపరు కప్పుల తయారీ ప్రారంభించాడు. మొదట వీటిని Health Cups హెల్త్ కప్స్ అనే వారు. మూర్ వాటికి Dixes Cups అని పేరుపెట్టి వ్యాపారం చేసేవాడు. పేపరును చేతిరుమూలుగా (Tissue Paper), టాయిలెట్ (Toilet) పేపరుగా వాడకం కూడా ప్రారంభమైంది.

ఇలా పేపరును వ్రాయడం కోసం ప్రారంభించి రకరకాలుగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో అనేక రకాలుగా వాడుతున్నారు. మరి ఈ పేపరు తయారీ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం.

పేపరును ఎలాంటి పీచు పదార్థం (Fibrous Material) నుండైనా తయారు చేయవచ్చును. అరబ్బులు లైనిన్ (Linen), కలప, మొక్కలు మరియు ఆల్గెల నుండి లభించు రసాయనjan05.jpg సంయోగ పదార్థం, Flax మొక్కలు మరియు మొక్కల నారలు, సంచులు, వివిధ రకాల కాయగూరల నుండి పీచును తయారు చేసేవారు. కానీ ప్రస్తుతం ప్రధానంగా కలప గుజ్జును వాడుతున్నారు. పూర్వకాలంలో కేవలం కొన్ని వందల అడుగుల కాగితం తయారీ కోసం కొన్ని వేల చదరపు మైళ్ళ వరకు చెట్లను నరికి వాడేవారు. ఆధునిక కాలంలో టింబరు, కలప డిపోల నుండి వృధాగా మిగిలిపోయిన (ఇక ఏ సామాగ్రి చేయడానికి పనికిరాని) కలప ముక్కలను మరియు ప్రత్యేకంగా కాగితం తయారీ కోసం పెంచిన చెట్లను వాడుతున్నారు. ఇది ముడిసరకు సేకరణగా మొదటి అంశం. తరువాత ముడిసరకును శుభ్రపరచడం, కలప దుంపల బెరడును తొలగించి, కలప మొక్కలను నీటితో శుభ్రపరుస్తారు. దీని వల్ల వాటిలోని దుమ్ము, ధూళి, మరియు ఇతర పదార్థాలు తొలగిపోతాయి. ఇలా శుభ్రపరచిన కలపను ఓ పెద్ద యంత్రం చిన్న చిన్న ముక్కలుగా కోస్తుంది.

తరువాత ఈ ముక్కలను డైజస్టర్ (Digester) అనే ఓ పెద్ద సిలిండరులో లైం బై సల్ఫైట్ (Bisolphte of lime) లాంటి రసాయనాలలో నానబెట్టి అధిక పీడనము వద్ద 8 గంటల పాటు ఉడకబెడుతారు. దాంతో కలపలోని సెల్లు లోజ్ (Cellulose) మాత్రం మిగిలి మిగతా పదార్థాలు ఆవిరవుతాయి. ఈ మిగిలిన పదార్థాన్ని చిలికే యంత్రం గుండా పంపుతారు. అక్కడ ఆ పదార్థం బాగా చిలకొట్టబడి, బాదబడి (Beats & Churns) మెత్తటి పాలలాంటి ద్రవం (లాసిక్స్, పెయింటులాగ)గా బయటకు వస్తుంది.

ఆ పైన ఈ ద్రవాన్ని భ్రమణం చేసే “జోర్డాన్ ఇంజను” అనే ఓ పెద్ద యంత్రం గుండా పంపుతారు. ఇందులో తిరుగుతూ వుండే బ్లేడ్లు ఈ కలప పీచును సమాన ముక్కలుగా కత్తిరిస్తాయి. ఈ స్థాయిలో ఈ పీచుకు పౌడరు, చైనా బంకమట్టి పౌడరు, ఇతర సైజింగ్ ఏజెంటుల(Sizing Agents) ను కలుపుతారు. వీటి వల్ల పేపరుకు రంగు, బలం, నునుపు లేదా గరుకుదనం, వ్రాయడానికి ఉపయోగపడే తలము లాంటివి ఏర్పడతాయి. ఇక ఈ మిశ్రమం పేపరు తయారీకి రెడీ.

పై మిశ్రమాన్ని రకరకాల యంత్రాలు, రోలర్ల మధ్యగా పంపుతారు. ఈ క్రమంలో గుజ్జులోని ద్రవాన్ని, నీటిని పీల్చివేసి రోలర్ల మధ్య పలుచని పేపరు పొడవుగా బయటకు వస్తుంది. ఆరిపోయిన పేపరు షీట్ ను కాలెండర్ స్టాక్ గుండా పంపి ఇస్త్రీ (Iron) చేస్తారు. అంతే పేపరు రెడీ.

పేపరు వాడకం వల్ల అనేక లాభాలు వున్నట్లే నష్టాలు కూడా వున్నాయి. పేపరు వాడకం వల్ల పర్యావరణానికి చాలా హానికలుగుతుంది. గత 40 ఏళ్ళలో ప్రపంచ వ్యాప్తంగా పేపరు వాడకం 400 శాతం పెరిగింది. పేపరు తయారీలో 35% ప్రత్యేకంగా పెంచిన చెట్లను వాడుతున్నప్పటికీ 65% అడవుల నుండి కలప వాడుతున్నారు. కనుక రాను రాను అడవులు అంతరించి పోతున్నాయి. jan06.jpgపేపరు తయారీలో వాడే క్లోరిన్ మరియు ఇతర రసాయనాల వల్ల కార్సినోజనిక్ కాలుష్యం జరుగుతోంది. పేపరు తయారీకి నీటి వాడకం చాలా ఎక్కువ. వాడిన నీరు బయటకు వచ్చి తద్వారా నీటి కాలుష్యం, భూకాలుష్యం జరుగుతోంది. పేపరు తయారీ సులభం అయిన తరువాత పేపరు వాడకం, పేపరు వృధా చేయడం (Wastage) ఎక్కువయ్యింది. పేపరు మిల్లుల వలన గాలి, నీరు మరియు భూమి కాలుష్యానికి గురవుతున్నాయి. దీనినే “పేపర్ పొల్యూషన్' అంటారు. మున్సిపాలిటీ ఘన పదార్థ వ్యర్థాలలో 35% పేపరు సంబంధ వ్యర్థాలు వుంటున్నాయి. పేపరు పరిశ్రమ ప్రపంచంలో 4% శక్తిని వినియోగించుకుంటోంది.

కనుక పేపరు వినియోగం తగ్గించాలి. కంప్యూటర్ల ఉపయోగం పెరిగిన తరువాత పేపరు వాడకం చాలా తగ్గుతోంది. “కాగితాన్ని పొదుపు చేస్తే కాగితాన్ని తయారు చేసినట్లే”. (Paper saved & Paper Produced). కనుక పేపరును వృధా చేయకండి. రాకెట్ తయారు చేయడానికి నోట్ బుక్ లో పేపరు చింపకండి. నోట్ బుక్లను పొదుపుగా వాడుకోవాలి. రీ సైకిల్డ్ పేపరు వాడాలి. పేపరు ముక్కలను చెత్తబుట్టలో వేసి పారవేయకండి. పేపరు ముక్కలను కుప్పగా పోసి తగలెట్టకండి. వృధాగా కాల్చి వేయకండి. ప్రతి చిన్న పేపరు ముక్కను జాగ్రత్తగా ఓ సంచిలో వేసి కూడబెట్టండి. చిత్తుకాగితాల వారు దానికి సొమ్ము చెల్లించి మీ దగ్గర కొనుక్కుంటారు. వారు కొంచెం పెద్దమొత్తంలో కొంటారు కనుక కాగితాన్ని, కాగితపు ముక్కలను చిన్న చూపు చూడకుండా జాగ్రత్తగా సేకరించండి. రీ సైక్లింగ్ కు తోడ్పటు అందివ్వండి. 'వృక్షోరక్షతి రక్షిత' పేపరు వాడకం తగ్గిదాం. తద్వారా చెట్లను కాపాడుదాం. అవి మనల్ని కాపాడుతాయి.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate