పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గాలి గుడ్డు

ఓ గుడ్డు కధ.

mar004.jpgఅనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక కుందేలు. ఆ కుందేలు బలే తుంటరి. దానికి కాలు ఒక చోట నిలిచేది కాదు. అడవంతా పొద్దస్తమానం తిరుగుతుండేది. కనబడిన వాళ్లనంతా పలకరించేది. చిన్నా పెద్ద లేకుండా అందర్నీ ఏదో ఒకటి అడుగుతుండేది. దానికి అదో కాలక్షేపం, ఆనందం.

ఇలా ఉండగా దానికొకరోజు ఒక పెద్ద బంతి కన్పించింది. ఆ బంతి రంగురంగుల బంతి. ముచ్చటైన బంతి. అడవిలోకి బంతి ఎలా వచ్చిందదంటారా. ఎలాగో వచ్చింది. ఎవరో పారేసి పొయ్యుంటారు.

బంతిని చూడగానే కుందేలుకు ఎక్కడలేని ఆశ్చర్యం, కుతూహలం పుట్టుకొచ్చాయి. పాపం కుందేలు ఎప్పుడూ బంతిని చూడలేదాయె. అందువల్ల అది ఆ బంతిని గుడ్డు అనుకొంది. ఇది దేని గుడ్డబ్బా అని ఆలోచించడం ప్రారంభించింది.

ఇంత పెద్ద గుడ్డు పులిదా? సింహానిదా? ఒంటెదా? ఏనుగుదా? అని మన తిక్క కుందేలు తర్జనభర్జన పడింది. ఎంత తర్జనభర్జన పడితే ఏం లాభం? దానికి సమాధానం చిక్కలేదు.

కుందేలు ఒక ఉడతను పిలిచింది. బంతిని చూపించింది. “ఉడతా ఉడతా! నువ్వు చాలా చురుకైన దానివి. ఎక్కడెక్కడో తిరుగుతుంటావు. ఈ గుడ్డు చూడు. ఎంత బావుందో, ఎంత పెద్దదో. ఇది పులి గుడ్డా?” అని అడిగింది.

ఉడతా అంతా తెలిసినట్లు 'ఓరి మొహమా! పులి ఎక్కడైనా ఆరుబయట గుడ్డు పెడుతుందా? గుహలో తప్ప'. అదీ మారుమూల గుహలో తప్ప. ఇది పులిగుడ్డు కానేకాదు” అని తేల్చిచెప్పింది.

నిజమే గదా అనుకుంది కుందేలు. ఒక తాబేలును పిల్చుకొచ్చింది. బంతిని చూపించింది. “తాబేలూ! తాబేలూ! నువ్వు చాలా పెద్దదానివి. తెలివిగల దానివి. ఈ గుడ్డు ఒంటెగుడ్డా?” అని అడిగింది. పులిగుడ్డు కాకుంటే ఒంటె గుడ్డయినా అయి ఉండొచ్చు గదా అని దాని అనుమానం.

తాబేలు మాత్రం చిన్నదా? తెలీదంటే పరువు తక్కువ గదా! “కుందేలా! నీకు కొంచెం కూడా తలకాయలేదోయ్. ఒంటే గుడ్డు ఎక్కడైనా ఇంత గుండ్రంగా వుంటుందా? కొంచెం కోలగా దోసకాయ లాగా ఉంటుంది. ఇది ఒంటెగుడ్డు కానే కాదు” అంది తాబేలు.

అవును కాబోలు అనుకొంది కుందేలు. మరి ఇది దేని గుడ్డు? సింహం గుడ్డా? అయితే అయి వుండొచ్చు. ఈ సారి ఒక కోతిని పిల్చింది. “కోతి బావా! కోతి బావా! మనుషుల తర్వాత అన్నీ తెలిసిన వాడివి నువ్వే. నువ్వు తిరగని చోటు లేదు. చూడని చోటు లేదు. ఈ గుడ్డు చూడు ఇది సింహం గుడ్డా' అని అడిగింది. కోతి మహా చమత్కారి. దానికి డాబులెక్కువ. మాటలు ఎక్కువ. కుందేలంటే దానికి తెలివితక్కువ దద్దమ్మ కింద లెక్క.

“ఓస్ ఆ మాత్రం తెలీదా? పరుగులు తప్ప నీకు ఎవరంత తెలివుంటే ఆ మాత్రం ఆలోచించ లేక పోయేవాడివా? సింహం గుడ్డుకి ఎక్కడైనా రంగులుంటాయా? ఉండనే వుండవు. తెల్లగా చందమామలాగా తళతళామెరుస్తుంటుందమ్మా సింహం గుడ్డు” అనింది కోతి.

పాపం కుందేలు నిజమే గదా అనుకొంది. “ఈ గుడ్డు పులిది కాదు, ఒంటెది కాదు, సింహానిదీ కాదు. మరి ఇంత పెద్ద గుడ్డు ఎవరిదై వుంటుంది. ఆ ఏనుగుదే అయి వుంటుంది. అయినా అడిగి తెలుసుకోవాలి” అనుకొంది. ఈసారి ఒక కప్పను పిలిచింది.

“కప్ప బావా! కప్ప బావా! నువ్వు నాకో సంగతి తేల్చి చెప్పాలి. "ఇదిగో చూడు. ఈ గుడ్డు దేని గుడ్డు? ఏనుగు గుడ్డా” అని , అడిగింది. కప్ప మాత్రం తక్కువ తిందా? దాని బడాయి దానిది. గడ్డును అది ఎగాదిగా చూసింది. దగ్గరకెళ్లి చుట్టూ పరీక్షించింది. ఇంతలో కొంచెం గాలి వీచింది. దాంతో గుడ్డు ఇటూ అటూ కదిలింది. కప్ప ఎగిరి గంతేసింది.

“ఓస్ తెలివి తక్కువ కుందేలూ! ఈ గుడ్డును చూడు. ఇంత కొంచెం గాలికే తొస్తే తొంభై ఆరు చోట్ల పడుతోంది. ఇంత తేలిక గుడ్డు ఎక్కడైనా ఏనుగు పెడుతుందా? ఏనుగుది బరువైన గుడ్డు. ఎంత బరువుంటుందో చెప్పలేను. ఇది ఏనుగు గుడ్డు కానే కాదు” అని తెగేసి చెప్పింది.

కుందేలుకు ఏమీ పాలుపోలేదు. అలా అని దాని కుతుహలం చల్లారి పోనూ లేదు. పులిగుడ్డు కాదు. పులి గుహలో తప్ప గుడ్డు పెట్టదు. సింహం గుడ్డు కాదు.

దానికి రంగులుండవు. ఒంటె గుడ్డు కాదు. అది కోలగా వుంటుంది. ఏనుగు గుడ్డు కాదు. అది చాలా బరువుగా వుంటుంది. మరి దేని గుడ్డయినట్లు? ఎంత తలబాదుకొన్నా దానికర్థం కాలేదు. అయినా అది వదిలిపెట్టలేదు.

ఈ సారి కొంగను పిలిచింది. గుడ్డును చూపించింది. అప్పటికే మన ఉడత, తాబేలు, కోతి, కప్ప అక్కడ చేరి వున్నాయి. బంతిచుట్టూ కూచుని అదే పనిగా దాన్ని చూస్తున్నాయి. కొంగ రెక్కలు విదుల్చుకొంటూ వచ్చింది. “కొంగ బావా! కొంగ బావా! ఇదేమో పులిగుడ్డు కాదట. సింహం గుడూ కాదట. నువ్వు దేశదేశాలు తిరిగేదానివి. ఎన్నెన్నో చూచిన దానివి. ఇది దేని గుడ్డు' అని అడిగింది కుందేలు.

కొంగ తెలివి కొంగది. ఉనిండు పరీక్షించి చూస్తా" అని అది బంతి దగ్గరకు వెళ్లింది. దాన్ని నాలుగువైపులా చూచింది. ఉడత, తాబేలు, కోతి, కప్ప ఊపిరి బిగపట్టుకుని చూస్తున్నాయి. కొంగ తన  పొడవాటి ముక్కుతో బంతిని పొడిచి చూచింది. ఇంకేముంది? బంతిలోంచి 'బుస్ మంటూ గాలి బయటికి తన్నుకొచ్చింది.

కొంగ ఎగిరి గంతేసింది. “చూసారా తెలివితక్కువ దద్దమ్మల్లారా! దీన్ని పట్టుకొని పులిగుడ్డని, సింహం గుడ్డని, ఒంటె గుడ్డని, ఏనుగు గుడ్డనీ కిందా మీదా పడతారా? చూడండి. గాలి ఎలా వస్తోందో ఇది గాలిగుడ్డు" అని కొంగ రెక్కలు కొడుతూ ఎగరసాగింది. కుందేలుకు ఆనందం పట్టలేదు. అవును గాలి గుడ్డు, గాలిగుడ్డు అని గంతులేసింది. “అవునవును గాలిగుడ్డే గాలిగుడ్డు” అని ఉడతా, తాబేలు, కోతి, కప్పా కూడా గెంతసాగాయి.

ఆధారం: వి. బాలసుబ్రమణ్యం.

3.00631578947
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు