অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

గొంతెత్తి గర్జిద్దాం ద్వీపాల ముంపును నివారిద్దాం

గొంతెత్తి గర్జిద్దాం ద్వీపాల ముంపును నివారిద్దాం

"RAISE YOUR VOICE - NOT THE SEA LEVELS"... ఇదే ఈ సంవత్సరపు ప్రపంచ పర్యావరణ దినోత్సవపు (జూన్ 5) నినాదం. పెరగాల్సింది సముద్రమట్టాలు కాదు ప్రకృతికి అనుగుణమైన మానవ చర్యలు. ప్రపంచ మానవాళి అనాలోచితంగా చేస్తున్న తప్పిదాల కారణంగా భూగోళం వేడెక్కుచూ (గ్లోబల్ వార్మింగ్) మంచు శిఖరాలు, గ్లేసియర్లు కరిగిపోతూ సముద్రమట్టాలు పెరుగుచున్న కారణంగా, మాల్దీవులు, లక్షదీవులు లాంటి వందలాది లోతట్టు ద్వీపాలు సముద్ర ముంపుకు గురికాబోతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని సముద్ర మట్టాలు పెరుగుటకు కారణమవుతున్న మానవాళి చేష్టలకు వ్యతిరేకంగా గళం విప్పి గర్జించాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పిలుపునిచ్చింది.

పర్యావరణ సమతుల్యతను పాటించేవిధంగా ఎవరికి వారు స్వీయ నియంత్రణ పద్ధతులను ఆచరిస్తూ భావితరాలకు అందమైన, ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన, జీవరాశులకు అనుకూలమైన సమగ్ర భూగోళాన్ని Environment అందించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా విద్యార్థులు ఏం చేయవచ్చో తెలుసుకుందాం.

పర్యావరణంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం ప్రతి ఒక్కరి తక్షణ కర్తవ్యం. నేటి పర్యావరణ పరిరక్షణ రేపటి తరానికి సుందర భవిష్యత్తు అన్న విషయం అందరికి తెలియపర్చాలి. మేము పిల్లలం.. మేమేం చేయగలమని మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేయకండి. మీరు పిల్లలు కాదు పిడుగులు. మీరు తలచుకుంటే ఏమైనా సాధించగలరు. మరీ ముఖ్యంగా పెద్దవాళ్ళను మార్చేశక్తి మీకు ఉన్నదన్న విషయం మరువొద్దు. పర్యావరణ పరిరక్షణ మీతోనే, మీ ఇంటి నుంచే ప్రారంభించండి.

  1. నీటిని పొదుపుగా వాడడం అలవాటు చేసుకోవాలి....
  2. june06.jpgమన ఇళ్ళల్లో చాలామంది తక్కువ నీళ్ళు వాడాల్సిన చోట ఎక్కువ నీటిని వాడి వృథా చేస్తుంటారు. పళ్ళు తోముకునే సమయంలో, మొహం కడుక్కునే సమయంలో, కాళ్ళు కడుక్కోడానికి, గడ్డం గీసుకోడానికి, బాత్ రూంలకు వెళ్ళినపుడు కొళాయిలు తిప్పి నీటిని వదిలేస్తుంటారు. నీళ్ళు పోతూనే ఉన్నా పట్టించుకోరు.నేటి వృథా రేపటివ్యధ అవుతుంది. నీటిని పొదుపుగా వాడే మార్గాలన్నీ అన్వేషించాలి. చెట్లకు, మొక్కలకు నీటిని పట్టేటప్పుడు పైపులను వదిలేస్తుంటారు. అలా కాకుండా డ్రిప్ పద్ధతిలో నీటిని పట్టి పొదుపు చేయవచ్చు. మీరు ఆచరించాలి. అందరిచే ఆచరింప చేయాలి.

  3. నడకకు లేదా పబ్లిక్ రవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలి.
  4. చాలా మంది విద్యార్థులు పాఠశాలలకు/ కాలేజీలకు/ ట్యూషన్లకు, కోచింగ్ సెంటర్లకు, సినిమాలకు, హెూటళ్ళకు, ఆటస్థలాలకు వ్యక్తిగత వాహనాలు, కార్లు, బైక్ లు, స్కూటర్లు వినియోగిస్తుంటారు. తక్కువ దూరాలకు నడకమంచిది ఆరోగ్యం. ఇంకాస్త ఎక్కువ దూరాలకు సైకిలని ఎంచుకోవాలి. మరీ దూరం ఎక్కువగా ఉంటే పబ్లిక్ రవాణా వ్యవస్థ అంటే స్కూలు బస్సులు లేదా సిటీబస్సులు లేదా ఆటోలలో వెళ్ళాలి. పరస్పర సహకార ప్రయాణం మంచిది. దీనివల్ల శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించిన వాళ్ళు అవుతారు.

  5. ప్లాస్టిక్ త్యజించాలి.
  6. ప్లాస్టిక్ పెను ప్రమాదమన్న విషయం మీకు తెలిసిందే. ప్లాస్టిక్ క్యారీబ్యాగులను వాడడం పూర్తిగా మానివేయాలి. ప్లాస్టిక్ గ్లాసులను, కప్పులను, సీసాలను త్యజించాలి. ఒకవేళ అనివార్యమైతే పునఃవినియోగ పద్దతిలో వాడుకోవాలి.

  7. వీడియోగేములు మాని విద్చుచ్ఛక్తిని ఆదా చేయాలి.
  8. మీలో చాలా మందికి కంప్యూటర్లలో, టి.వి.లలో, మొబైల్ ఫోన్లలో వీడియోగేములు ఆడే అలవాటు ఉంటుంది. మామూలు వినియోగంలో కన్నా వీడియో గేములు ఆడటానికి శక్తి వినియోగం ఎక్కువగా ఉంటుంది. వీడియోగేములను తక్కువగా ఆడటం ద్వారా విద్యుచ్ఛక్తి వినియోగం తగ్గించుకోవచ్చు. సాధ్యమైనంత వరకు ఇంటిబయట బహిరంగ ఆటస్థలాలలో, స్వచ్ఛమైన గాలి లభించే ప్రాంతాలలో ఇతర పిల్లలతో కలిసి ఆడుకోటానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

  9. పొదుపుగా కాగితాన్ని వినియోగించాలి.
  10. june05.jpgకాగితాన్ని, కాగితంతో తయారుచేసే కప్పులు, గ్లాసులు, ప్లేట్లు, కవర్లు వాడడం ఫ్యాషన్ గా మారింది. కాగితాన్ని పొదుపుగా వినియోగించాలి. తక్కువ స్థలంలో చిన్న అక్షరాలతో ఎక్కువ వ్రాయాలి. నోట్ బుక్స్ వాడకాన్ని పొదుపుగా వాడాలి. ఏ పేజీలను వృధాగా వదిలేయకూడదు. కాగితపు వినియోగాన్ని ఎంత తగ్గిస్తే అంతగా చెట్లను సంరక్షించిన వారౌతారు. ఒక టన్ను కాగితం ఆదా చేస్తే 19 పెద్ద చెట్లను సంరక్షించినట్లు అవుతుంది.

  11. విద్యుత్ ఉపకరణాల వినియోగం.
  12. చాలా మంది ఇళ్ళల్లో పగలనక, రేయనక లైట్లు వెలుగుతూ ఉంటాయి. ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి. టి.వి. వాగుతూ ఉంటుంది. ఈ అలవాటు వెంటనే త్యజించాలి. అవసరం ఉన్న వాటినే ఉపయోగించాలి. స్విచ్లు ఆఫ్ స్థితిలో ఉంచాలి. సాధారణబల్బుల స్థానంలో CFL లేదా LED సమూహ బల్బుల వినియోగం, తక్కువ శక్తిని ఉపయోగించుకొని పనిచేసే విద్యుత్ ఉపకరణాలను వినియోగించాలి. ఇంట్లో గాలి, వెలుతురు వచ్చే విధంగా నిర్మించుకోవాలి. కరెంటు వృథాను అరికట్టాలి.

  13. మొక్కలు పెంచడం అలవాటుగా చేసుకోవాలి.
  14. చెట్టు తల్లికన్నా మిన్న అంటుంటారు. ఒక చెట్టు ఒక కిలోగ్రాము కలపను తయారుచేసుకోడానికి 1.47 కి.గ్రా CO2 ను పీల్చుకొని 1.07 కి.గ్రా. ప్రాణవాయువును 02 విడుదల చేస్తుంది. ఒక చెట్టు 27 కి.గ్రా. కాలుష్యాన్ని శుద్ధి చేస్తుంది. కావున ఎట్టి పరిస్థితులలో మీ ప్రాంతంలోని చెట్లను నరికివేయకుండా అడ్డుపడాలి. అనివార్యమైతే మరో మొక్కను నాటితేనే ఉన్న చెట్టును తొలగించాలి. చెట్లను నరికివేయకుండా తరలించే విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలి. బహుమతులుగా మొక్కలను ఇవ్వాలి. మీ వీధిలో మీ పేర ఓ పది మొక్కలను పెంచాలి.

  15. పర్యావరణ మిత్ర బృందం
  16. మీ పాఠశాలలోగాని, వీధిలోగాని, ఇళ్ళ దగ్గర గాని నివసించే మీ సహచరులతో కలిసి పర్యావరణ మిత్రమండలి ఏర్పాటుచేసి దాని ద్వారా మొక్కల సంరక్షణ, పశుపక్ష్యాదుల సంరక్షణ, వీధి జంతువుల సంరక్షణ చేపట్టవచ్చు. పిల్ల కాలువలను, పంటకాలువలను శుభ్రపరిచే కార్యక్రమాలు చేయవచ్చు. పంచాయితీ లేదా నగర పాలక సిబ్బంది సహకారంతో మురికి కాలువల శుభ్రతను చేసి దోమలను నివారించవచ్చు. పర్యావరణ అంశాల పట్ల అవగాహన కలిగించవచ్చు.

  17. జంక్ ఫుడ్స్ తినడం మానాలి
  18. అనారోగ్యానికి దారి తీసే, ఊబకాయాన్ని కలిగించే పిజ్జాలు, బర్గర్ల వంటి చిరుతిండ్లను, కుర్ కురేలు లాంటి చాట్ తిండ్లను, కంపెనీ శీతల పానీయాలను మాని మీ ఇంటి ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆలోచిస్తే ఇంకా ఎన్నో మార్గాలుంటాయి. ఆలోచించండి. అన్వేషించి.. ఆచరించండి. పర్యావరణాన్ని పరిరక్షించండి.

  • సామాజిక అడవులను పెంచుదాం - సారవంతమైన నేలను కాపాడుదాం
  • ఆహారపు వృదాను అరికడదాం - ఆకలి చావులను తగ్గిద్దాం.
  • ఊరంతా పచ్చదనం - ఊరందరికి చల్లదనం.
  • చెట్లు నాటితే క్షేమం - నరికితే క్షామం.
  • జీవితమే జీవ వైవిద్యం - జీవ వైవిధ్యమే మన జీవితం.
ఆధారం: షేక్ గౌస్ భాష.

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate