పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గ్రాఫిన్

గ్రాఫిన్ గురించి తెలుసుకుందాం.

dec13నేస్తమా! ఎందుకలా పదే పదే నా మొన విరగ్గొట్టి చికాకు పడుతున్నావు?

చదువుతూ పెన్సిల్ తో ఆడుతున్న విద్యార్థి ఒక్కసారిగా ఉలిక్కిపడి “ఎవరు నాతో మాట్లాడుతున్నది?” అనుకుని తీరాపార చూశాడు.

తన చేతిలో ఉన్న పెన్సిల్ పక్కున నవ్వి “నేనే... నీవు మాటిమాటికీ విరగొడుతున్న పెన్సిల్ మొననే!” ఎందుకు తమ్మీ! నన్నిట్లా వేధిస్తారు. మీకు ఎంచక్కా రాసుకోటానికి, బొమ్మలు గీయడానికి తోడ్పడుతున్నాను. సరేలే, నీవంటే చిన్నవాడివి. పెద్ద పెద్ద సైంటిస్టులే నన్ను అతలాకుతలం చేసి నాలోని కూపీలు లాగుతున్నారు. నీవేమో నన్ను కేవలం ఒక పెన్సిలు మొన, కాదంటే లెడ్ లేదా గ్రాఫైట్ కడ్డీ అనుకుంటావు. మరి ఆ సైంటిస్టులయితే ప్రకృతిలో దాగి వున్న రహస్యాలను బహిర్గతం చేయటమే తమ పని అంటారు. ప్రకృతిలో ఒక కర్బన రూపాంతరంగా ఉంటూ మీరు రాసుకునే పెన్సిల్ లెడ్ లో కాలక్షేపం చేస్తున్న నన్ను బయటకు లాగి నాకు 'గ్రాఫీన్' అని పేరు పెట్టారు. వాళ్లెవరో తెలుసా? కాన్స్టాంటిన్ నొవొసిలోవ్ (Constantin Novosilov), అనిడ్రి గైమ్ (Anydri Gyme) అనే మాంచెస్టర్ విశ్వవిద్యాలయ భౌతిక శాస్త్రవేత్తలు.

ఇన్నాళ్లూ మా వజ్రం (Diamond) అక్క ప్రపంచంలో అన్నింటికంటే అందమైన దాన్ని, దృఢమైన దాన్నని మురిసిపోతుండేది. కాని మీ శాస్త్రవేత్తలు నన్ను కొద్దిగా ఇబ్బంది పెట్టినా కూడా భలే మంచి పని చేశారు. ఇప్పటి వరకూ విజ్ఞాన శాస్త్రంలో తెలిసిన అన్ని పదార్థాలలోకి నేనే బహు తేలికైన దాన్నట! అంతే కాదు నాకంటే గట్టి పదార్థం కూడా మరొకటి లేదని 2004లోనే చెప్పారు తెలుసా!

నీవేమో నన్ను పెన్సిల్ లెడ్ అనే అనుకుంటున్నావు. పుటుక్కున మొన విరగ్గొడుతున్నావు. శాస్త్రవేత్తలు నాలో ఉన్న గ్రాఫీన్ కంటే గట్టిది మరొకటి లేదంటున్నారు. ఇది కనుగొన్నందుకు వారికి 2010 సం. నోబెల్ బహుమతి కూడ వచ్చింది. ఇప్పుడేమంటావు నేస్తం!

నువ్వయితే రాసుకునేందుకే ఉపయోగం అనుకుంటున్నావు. వాళ్లేమో నా రహస్యాలు కనుక్కొని నేనొక సమర్ధవంతమైన ఉష్ణ, విద్యుత్ వాహకం అని తేల్చారు. నా ఈ లక్షణాలను వాడుకొని వ్యాధులు కూడ నయం చేస్తారట ముందు ముందు! కంప్యూటర్ చిప్ లలో ప్రస్తుతం వాడుతున్న సిలికాన్ కు బదులు నన్ను వాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సిలికాన్ వాలీ నిన్నటిమాట. రాబోయేది గ్రాఫీన్ వాలీ! నేనే మీ కంప్యూటర్లలో చేరితే ఇక మీ కంప్యూటర్ల బరువు బాగా తగ్గి చిన్న పిల్లవాడు కూడ హాయిగా మోస్తాడు. మీ స్కూలు బాగ్ లో కూడా ఇమిడిపోతే ఆశ్చర్యపడకండి. నా అద్భుత విద్యుత్ వాహక శక్తిని, వంగే స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని సెల్ ఫోన్లు, కెమెరాలు ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువుల్లో వాడేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు మీ వాళ్లు.

ఒక పరమాణువు మందం గల నా పొరల్లోంచి ఎలాంటి చిన్న పరమాణువుని కూడా నేను పోనివ్వను. అయినా హైడ్రోజన్ పరమాణువులోని ఎలక్రాన్ని తీసివేసి నా పొరల్లోంచి అవతలకు పంపారు. మాన్చేస్టర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం ప్రోటాన్, ఎలక్ట్రాన్ తీసివేసిన హైడ్రోజన్ పరమాణువు అత్యంత పలుచనైన నా స్పటిక పొర నుంచి సులభంగా దూరిపోవడం గమనించారు. ప్రోటాన్లు మిగతావి చొరబడటానికి శక్యం కాని ఇలాంటి నిరోధకం హైడ్రోజన్ ఇంధన విద్యుత్ ఘటానికి అత్యంత ముఖ్యమైనదిగా గ్రహించారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద ప్రోటాన్లు నా (గ్రాఫీన్) పొర నుంచి తేలికగా దూరిపోవడం గూడా చూశారు. నా పొరలపై సన్నని ప్లాటినం కణాలను (Platinum nano particles) చల్లినా కూడా ప్రోటాన్లు దూరిపోవడం గమనించారు. ఈ శాస్త్రవేత్తల బృందం తేమగా ఉన్న వాతావరణం నుంచి హైడ్రోజన్ను ఒక పరమాణువు మందము గల నా పొర ఒక వైపు నుంచి పంపి స్వచ్ఛమైన హైడ్రోజన్ ను మరొక వైపున గ్రహించగలిగారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంధన విద్యుత్ ఘటాలతో అనుసంధానం చేసి గాలిలో ఉన్న హైడ్రోజన్ తో ప్రయాణించే విద్యుత్ ఉత్పాదక యంత్రాలను సృష్టించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ పరిజ్ఞానంతో శిలాజయింధనాల వాడకంతో పెరిగే భూతాపాన్ని తగ్గించాలని శాస్త్రవేత్తల ప్రయత్నం సుమా. వారికి నా (గ్రాఫీన్) శుభాభినందనలు. ప్రస్తుతానికింతే. సెలవామరి?

ఆధారం: ప్రొ. యం. ఆదినారాయణ

3.01003344482
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు