অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

చెరకుకు తీపినిచ్చిన సైన్సు కథ

చెరకుకు తీపినిచ్చిన సైన్సు కథ

ct1చెరకుగడ నమిలారా ఎప్పుడన్నా! కనీసం చెరకు రసం తాగే ఉంటారు కదా! నోరూరింతే ఆ తియ్యదనం చెరకుకు ఎలా వచ్చిందో తెలుసా? ఇది తెలుసుకోవాలంటే మనం మనదేశ సైన్సు చరత్రలో వందేళ్ళు వెనక్కుపోయి చూడాల్సి ఉంటుంది. అది 20వ శతాబ్దపు ప్రథమార్థం. జన్యుశాస్త్రంలో, ముఖ్యంగా చెరకులో సంకర రకాలను (హైబ్రిడ్స్ ను) తయారు చేయటంలో సైన్సు ఒక గొప్ప ముందడుగు వేసింది. మనం ఈ రోజు తింటున్న చెరకు ఆ రోజుల్లో లేదు. ఇంకా చెప్పాలంటే మన దేశపు చెరుకుకు తీపి తక్కువ, దృఢత్వం ఎక్కువ. మన దేశపు చెరకు గడలు ఎంత దృఢంగా ఉండేవంటే బురదలో కూరుకుపోయిన బండిని బయటకు తీయటానికి బాటలో వీటిని వెసి మరీ సులువుగా నడిపించే వారట! అంత గట్టిగా ఉండేవట చెరకు గడలు. ఈ దేశవాళీ చెరకును శాస్త్రీయంగా శకారం స్పోంటేనియం (Saccharum Spontaneum) అని పిలిచేవారు. రుగ్వేద కాలం నుండీ భారతదేశంలో చెరకును పండించేవారు. కౌటిల్యుడు చెరకు పంట, దాని ఉత్పత్తుల గురించి తన అర్థశాస్త్రంలో వివరించాడు.

1900 సం. తొలినాళ్ళలో దూరప్రాచ్యం, జావా దేశాల నుండి మనం తియ్యటి చెరకు రకాన్ని దిగుమతి చేసుకున్నాం. తీపి చెరకు పపువా న్యూగినియా ప్రాంతానికి చెందినది. దీన్ని ‘నోబుల్ గడ’ (Noble Cane) అనేవారు. 1910 సం. లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయెాధుడు, పరిశోధకుడూ అయిన పండిత మదనమెాహన మాలవ్యా మన శాస్త్రవేత్తలకు ఒక మంచి సూచన చేశారు. అదేమంటే వృక్షశాస్త్ర పద్ధతులను ఉపయెాగించి, మన దేశవాళీ చెరకును తీయని చెరకుగా మార్చమని. ఆయన సలహా, ప్రోద్బలంతోనే చెరకు పరిశోధనలకు నేడు పేరుగాంచిన “చెరకు సంకరీకరణ పరిశోధనా సంస్ధ” కు కోయంబత్తూరులో అంకురార్పణ జరిగింది. ప్రముఖ శాస్త్రవేత్త బార్బర్, వెంకట్రామన్ గార్లు ఈ అంశాన్ని ఒక సవాలుగా తీసుకుని మన దేశవాళీ చెరకు (S.Spontaneum) చెరకుతో (S. Officianarum) నోబుల్ సంకరం చేయటం మొదలు పెట్టారు. దేశవాళీ చెరకు పుప్పొడితో నోబుల్ చెరకు అండాలను ఫలదీకరణం చేస్తే వచ్చిన హైబ్రిడ్లు అద్భుతాన్ని చూపించాయి. ఆ హైబ్రిడ్స్ లో నోబుల్ చెరకు తీపి, దేశవాళీ చెరకు దృఢత్వం రెండూ సమకూరాయి. ct2ఈ సమయంలోనే వెంకట్రామన్ పరిశోధన బృందంలో ఒక ఆణిముత్యం వచ్చి చేరింది. ఆమే జానకి అమ్మాళ్ అనే యువ మహిళా శాస్త్రవేత్త. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ నుండి డిగ్రీ తీసుకుని, అమెరికా వెళ్ళి మిచిగాన్ యూనివర్సిటీలో ఎం.ఎస్.సి చదివిన మొట్టమొదటి భారతీయ కణజన్యు శాస్త్రవేత్త జానకీ అమ్మాళ్.  కణజన్యు శాస్త్రంలో ఆమెకున్న ప్రతిభ చెరకు సంకర వంగడాల అభివృద్ధికి ఎంతో మేలు చేసింది. అభివృద్ధి చేసిన హైబ్రిడ్లను మళ్ళీ, మళ్ళీ సంకరం చేయటం ద్వారా ఎన్నో తీపి రకాల భారతీయ చెరకును సృష్టించారు.

మొక్కల్లో బహుపిండత్వం ఉంటుందని జానకీ అమ్మాళ్ కు తెలుసు. కేవలం రెండు సెట్ల (2n) క్రోమెాజోములుండటమేగాక వాటి (ఉదా: 2n = 48 అయితే 56, 64, 72 ఇంక 112) క్రోమెాజోముల గుణకాలను కూడా సంకరణ ద్వారా అభీవృద్ది పరిచింది ఆమె. ఆమె పరిశోధనల వల్ల చెరకు బహుపిండత్వం (Poly ploidy) ప్రపంచం తెలుసుకోగలిగింది. హైబ్రిడ్లను ఉత్పత్తి చేయటానికిది ప్రాతిపదికగా తోడ్పడింది. దేశవ్యాప్తంగా విస్తరించిన వివిధ చెరకు రకాలను గుర్తించటానికి కూడా ఈ డిస్కవరీ తోడ్పడింది. కోయంబత్తూరు చెరకు పరిశోధనా స్ధానం నుండి ఆమె లండన్ లోని జాన్ ఇన్సెస్ ఇనిస్టిట్యూట్ కు, అక్కణ్ణించి రాయల్ హార్టికల్చర్ సొసైటీలో గొప్ప పరిశోధనలు చేసింది. మన ప్రథమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఆమె ప్రతిభను గుర్తించి భారతదేశంలో వృక్షశాస్త్ర అభివృద్ధికి సంస్థను (Indain Botanical Society) నడుపవలసిందిగా ఆహ్వానించాడంటే ఆమె గొప్పతనం అర్థం చేసుకోండి.

నెహ్రూ కంటే ముందు మన నోబెల్ శాస్త్రవేత్త సి.వి.రామన్ జానకీ అమ్మాళ్ లోని మెరుపును గుర్తించి భారత జాతీయ సైన్సు అకాడమీ ఫెలోగా సత్కరించారు. 1957లో భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో గౌరవించింది. ఈ రోజు మనం తినే ప్రతి చెరకు గడ తీయదనం వెనుక జానకీ అమ్మాళ్ కృషి ఉందంటే అతిశయెాక్తి కాదు. వారి పరిశోధనల మూలంగానే మన దేశం నేడు చెరకు ఉత్పత్తిలో ముందంజలో ఉంది. చెరకు పంటకు ప్రసిద్ధి చెందిన క్యూబా వంటి దేశలకు కూడా మనం పంచదార ఎగుమతి చేయగలిగే స్థితికి వచ్చామంటే ఆ వజయం వెనుక జానకీ అమ్మాళ్, వెంకట్రామన్ వంటి ఎందరో గొప్ప శాస్త్రవేత్తల కృషి దాగి ఉంది.

ఆధారం: ప్రొ. డీ. బాలసుబ్రహ్మణ్యం© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate