অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

జ్ఞానం మూలంగానే అంధనిశ్వాసాలు

జ్ఞానం మూలంగానే అంధనిశ్వాసాలు

జ్ఞానం - సైన్స్ అభివృద్ది చెందడం మూలంగానే నేడు కంప్యూటర్స్, సెల్ ఫోన్స్ అమలులోకి వచ్చాయి. ఇంకా అనేక విషయాలన్ని సైన్స్ కనుగొంటూనే ఉంది. సైన్స్ దీనిని గుడ్డిగా స్వీకరించదూ, అలాగే దేనిని గుడ్డిగా, ప్రచారం చేయదు, చేయలేదుకూడా !

నవసమాజ నిర్మాణంలో నాగరిక మానవుడు గ్రహాల అంతరాలను సైతం చేధిస్తూ ముందుకు సాగుతున్న నేటి కంప్యూటర్ యుగంలో మారుమూల ప్రాంతాలలో మూఢనమ్మకాల మేకంలో ప్రజలు ఉంటున్నారు. గ్రామాలలో ప్రజలుగానీ, పశువులు గాని అనారోగ్యానికి గురైనట్లయితే దానికి గల కారణం ఏమిటో కనుక్కోకుండా, సరైన నిపుణుడిని సంప్రదించకుండా ఏదో ఒక వ్యక్తి ఆ గ్రామాన్ని పట్టి పీడిస్తోందని ఆ శక్తిని పారదోలాలంటే ఆ గ్రామ పోచమ్మకో, మైసమ్మకో మరో అతీతశక్తికో జంతువులను బలిస్తుంటారు. ఇటువంటి తంతునే ఊరికొల్పులు అని అంటుంటారు.

3aa.jpgఈ ఊరికొల్పులు చేయడమనేది ఒక మూఢనమ్మకం, మూఢాచారం ఇలాంటి మూఢనమ్మకాల మైకంలో కొనసాగుతున్న ఊరికొల్పులు అనేవి నేటి గ్రామీణ సమాజానికి ప్రమాదం హేతువులుగా పరిణమించాయి. మరి ఇలాంటి మూఢనమ్మకాల్ని కొందరు స్వార్థ పరులు పెంచి పోషిస్తున్నారు. ఇలాంటి వారిని చట్టరీత్యా కఠినంగా శిక్షించాలి. ప్రజలు శాస్త్రీయంగా ఆలోచిస్తే, ప్రశ్నిస్తే మూఢనమ్మకాలన్నీ పటా పంచలవుతాయి. గ్రామాలలో కీడుపేర, అతీతశక్తిపేర జంతువుల్ని బలివ్వడం, ఊరికొల్పులు చేయడమనేది అహేతుక పోకడకు, ఆజ్ఞాన పోకడకు నిదర్శనమవుతుంది.

ప్రజలు మూఢనమ్మకాల పట్ల చైతన్యం పెంచుకోవాలి. చదువుతో పాటు సక్రమాలోచనా శక్తిని పెంపొందించుకున్ననాడే ఊరికొల్పులు అనే మూఢ నమ్మకాలకు దూరంగా ఉండగలరు. గ్రామాలలో దేవతల పేర, అతీతశక్తుల పేర ఊరికొల్పుల పేర జంతువుల్ని బలివ్వడం అనేది ఆటవిక చర్య. అనాగరిక చర్య అవుతుంది. గ్రామీణ ప్రాంతాలలో మూఢవిశ్వాసాలు అనేవి జడలు విప్పి నాట్యం చేస్తున్నాయి. గ్రామీణులు నేటికి దయ్యాలు, భూతాలు చేతబడులు ఉన్నాయని నమ్మివేలాది రూపాయలు ఊరికొల్పుల ద్వారా వృధా చేస్తున్నారు.

మంత్రాలు, మానవాతీత శక్తులు వున్నాయనేది అబద్దం, మంత్రశక్తులు, మానవాతీతశక్తులు ఉన్నట్లు ఎవరైనా ఋజువు చేయగలరా ? అంటే చేయలేరని చెప్పవచ్చు. ఏ మనిషికైనా ఏది తెలియాలన్నా మనలోని జ్ఞానేంద్రియాల ద్వారానే తెలియాలి. అలా తెలిస్తేనే మనిషికి నిజంగా తెలిసినట్లు జ్ఞానేంద్రియాలకు అతీతంగా తెలియడమేది ఉండదు.

ఎవరైన అతీంద్రియ శక్తులు ఉన్నట్లు ఋజువు చేస్తే జనవిజ్ఞాన వేదిక తరుపున లక్ష రూపాయలు నగదు బహుమతి ఇవ్వగలము. ఋజువు కాని విషయాల్ని ఋజువైనట్లుగా ఎవరూ ఎప్పుడూ చెప్పకూడదు. చెబితే అది సామాజిక వంచనవుతుంది.

గ్రామీణ ప్రాంతాలను చైతన్య పరచాలన్న ధ్యేయంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా, అధికారులు, నాయకుల నిర్లక్ష్యం మూలంగా చైతన్య కార్యక్రమాలు సరిగా గ్రామాల దరి చేరకపోవడంతో మరింత మూఢత్వపుజాడ్యం పెరిగిపోతుంది.

మూఢనమ్మకాల నిర్మూలన పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉండాలి. ప్రసార సాధనాల్లోను, ఇటు పాఠ్య పుస్తకాల్లోను, మూఢనమ్మకాలకు సంబంధించిన అంశాలు ప్రచారం కాకుండా నిరోధించాలి.

దైవం పేర, అతీతశక్తులపేర మూగజీవుల్ని బలివ్వడం సరికాదు. గుడ్డితనం వ్యక్తిని మాత్రమే బాధిస్తుంది. గుడ్డినమ్మకం మాత్రం జాతి పురోగతినే నిరోధిస్తుంది. వ్యక్తి మారితే వ్యవస్థ మార్పు వేగిరంఅవుతుంది. మనలో శాస్త్రీయ దృక్పథం సత్యాన్వేషణ అలవడాలి.

ప్రజల్లోవున్న అజ్ఞానాన్ని, మూఢ నమ్మకాలను పారదోలాలంటే ముందుగా వారిలో యోచనా సామర్థ్యాన్ని పెంచాలి. ఆయా విషయాలలో స్వతంత్ర ఆలోచనా విధానమును అలవర్చుకునేలా కృషి చేయాలి. కేవలం చదువే ప్రధానం కాదు. చదువుతో పాటు పిల్లలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేలా చూడాలి. అప్పుడే వారిలో జిజ్ఞాస పెరుగుతుంది. సత్వాన్వేషణకు సిద్దపడుతారు.

రచయిత:-తుమ్మల రాములు, టీచర్

- బాపూజీ పాఠశాల, కిషన్ పుర, హన్మకొండ.

చివరిసారిగా మార్పు చేయబడిన : 12/29/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate