অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

తనదాకా వస్తే

పాత్రలు

  1. 264.jpgశాస్త్రులు - 50 సం||లు
  2. రాఘవయ్య - 45 సం||లు
  3. సుందరం - 22 సం||లు

(తెరతీయగానే రాఘవయ్య ఓ కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉంటాడు. ఇంతలో శాస్త్రులు చేతిలో జోతిష్యం / వాస్తుశాస్త్రం పుస్తకాలతో ప్రవేశిస్తాడు.)

శాస్త్రులు: (ప్రవేశిస్తూ...) రాఘవయ్యగారూ!......ఓ రాఘవయ్యగారూ!! ?

రాఘవయ్యగారూ : ఓ!...... శాస్త్రులు గారా!...... రండి ..... రండి నమస్కారం

శాస్త్రులు:నమస్కారం!!

రాఘవయ్య: రండి కూర్చోండి.......ఊరకరారు మహానుభావులు

శాస్త్రులు: శుభకార్యం జరగాల్సిన ఇంటికి ఊరకే వస్తామటండీ.......

రాఘవయ్య: (ఆశ్చర్యంగా) శుభకార్యమా ? మా ఇంట్లోనా ..... ?

శాస్త్రులు: ఔనండీ మీ అమ్మాయికి దివ్వమైన సంబంధం ఒకటి తీసుకొచ్చాను.

రాఘవయ్య: మా అమ్మాయికి సంబంధమా....పెళ్ళిచేస్తానని నేనెప్పుడూ చెప్పలేదే

శాస్త్రులు: మీరు చెప్పాలటండీ...... హై స్కూల్ చదువులైపోయిన అమ్మాయిని గుండెలమీద కుంపటిలా ఎన్ని రోజులని ఇంట్లో ఉంచుకుంటాం చెప్పండీ ?అసలే రోజులు బాగాలేవూ....అదీగాక కాళ్ళదాకా వచ్చిన సంబంధం.....

రాఘవయ్య: (కొంత అసహనంగా) శాస్త్రులుగారూ... నేనెప్పుడూ నాబిడ్డను గుండెల మీద కుంపటిలా భావించలేదు.

భావించను కూడా ఐనా... నిండా పదహారేళ్ళు కూడా లేని అమ్మాయికి ఇప్పుడప్పుడే పెళ్ళి చేసి, గొంతు కోస్తామా చెప్పండి ?

శాస్త్రులు: ఏవిఁటో ..... ఊరందరిదీ ఒక దారి... ఉలిపికట్టెద మరో దారీనూ..... ఐనా మాస్టారు ... పక్కింటి పరంధామయ్య దారి కోడల్ని చూడండి...ఏమంత వయసుంటుందనీ...అప్పుడే నలుగుర్ని కనేసీ హాయిగా సంసారం చేసుకుంటోంది...

రాఘవయ్య: (వ్యంగ్యంగా ) ఆఁ...... చేసుకుంటోంది లెండి రక్త హీనత.... నడుంనొప్పితో బాధపడ్తూ ఇరవై ఏళ్ళకే అరవై ఏళ్ళ ముసలిదానిలా తయారైంది.

శాస్త్రులు: వూఁ... మీతో మాట్లాడ్డం చాలా కష్టంలేండి..... ఐనా అదేదో వేదికలో పన్జేస్తారటగా..వేధికా....

రాఘవయ్య: జన విజ్ఞాన వేదిక అంటారు లెండి మూఢవిశ్వాసాలనూ, అశాస్త్రీయతనూ ఎండగడ్డీ..... శాస్త్రవిజ్ఞాన ప్రచారంలో ...దేశ సమగ్రతకూ, సామాజిక అభివృద్ధికీ కృషిచేసే ...జన..విజ్ఞాన... వేదిక...

శాస్త్రులు: (వెటకారంగా.)ఆఁ ...అదేఁ....వేధక..... మా కుర్రకుంక కూడా అదే వేఁధికలో ఊరేగుతాడుగా ...వాడూ ...ఇవే పలుకులు నేర్చాడు. చిలక పలుకులు పిదప బుద్ధులూ వాడూనూ ఎడ్డమంటే తెడ్డమంటాడా తెడ్డెమంటే ఎడ్డెమంటాడా.... నాకడుపున చెడబుట్టాడు వెధవ....(ఒక వైపు చూస్తూ...) ఆఁ ఘోరం.... మహాఘోరం

రాఘవయ్య: ఘోరమా...... ఏంజరిగిందండీ.....

శాస్త్రులు: మంటలు....మంటలండీ బాబూ మంటలు

రాఘవయ్య: (కాస్త కంగారుగా) మంటలా..ఎక్కడండీ..

శాస్త్రులు: అక్కడండీ అక్కడ ఈశాన్యంలో ..ఈశాన్యంలో మంటలండీబాబూ

రాఘవయ్య: (కూల్ గా) మంటలేమిటండీ అదిస్టవ్వు...మా ఆవిడ అక్కడ వంట చేస్తోంది...శాస్త్రులు గారూ నానాటికీ మీలో చాదస్తం పాలు..... మరీ ఎక్కువౌతోందండీ...

శాస్త్రులు: మీరెన్నయినా చెప్పండి ఈశాన్యంలో వంటగదా.....ఇంతటి అఘాయిత్యం నేనెక్కడ చూళ్ళేదండీ....

రాఘవయ్య: (అనునయంగా) శాస్త్రి గారూ మన అనుకూలను బట్టి, గాలి ప్రవాహదిశ, వేగాన్ని బట్టి వంటగది ఎక్కడైనా నిర్మించుకోవచ్చు. దీనికంత రాద్ధాంతం ఎందుకు చెప్పండీ.

శాస్త్రులు: రాద్ధాంతం ఏమిటండీ నాపిడాకూడూ..ఐనా అప్పుడే అనుకున్నాను. లెండి రాఘవయ్యగారు పట్నం నుంచి ఎవరో పెద్ద ఆర్కిటెక్ట్ ని తీసుకొచ్చి, ఇంటిని చాలా గొప్పగా కడుతున్నారనీ ఇదన్నమాట ఆ ఆర్కిటెక్ నిర్వాకం చూద్దాం.... ఇదెంత కాలం సాగుతుందో .......శాస్త్రాన్ని కాదని చలిచీమయినా సరే ....సర్వఁ....న్నాశన...ఆఁ అదేవిఁటీ...(ఒక వైపుకు చూస్తూ) అక్కడేదోకన్పిస్తోందీ. మరుగుదొడ్డిలా ఉందే)...

రాఘవయ్య: (నవ్వుతూ శాస్త్రులుగారూ... వెంటిలేషన్ బాగుండాలి కానీ ఆమూడు నిమిషాలు పనికి ...ఎటుకూర్చుంటే మాత్రం ఏమిటి చెప్పండి... ముందు మీరు ఇటు తిరగండి.. ఈ మంచినీళ్ళు తాగి కొంచెం స్థిమిత పడండి. (మంచి నీళ్ళు అందిస్తాడు)

శాస్త్రులు: తిరుగుతున్నానండీ తిరుగుతున్నానూ... (నీళ్ళు గటగటా తాగేసి) , మొత్తం తిప్పుతున్నారుమీరు కాలచక్రాన్ని తిప్పేస్తున్నారు. ముందుది వెనక్కీ, వెనకది ముందుకూనూ ఏ ఇల్లైనా నైరుతి ఎత్తుగా ఉండి, ఈశాన్య పల్లంగా ఉండాలని వాస్తుశాస్త్రం ఘోషిస్తోంది....మరి మీరు చేసిందేమిటటా.... రాఘవయ్య: ఈశాన్యం ఎత్తుగా ఉండి నైరుతి పల్లంగా ఉంది అంతేనా....

శాస్త్రులు: ఇంకా అంతేనా.... అంటారేమిటండీ నెమ్మదిగానూ...

రాఘవయ్య: (నవ్వుతూ) శాస్త్రులు గారూ... మీకు ముక్కెక్కడ ఉందో చూపించండి.

శాస్త్రులు: (కాస్త కోపంగా) ఇక్కడండీ ఇక్కడ ... ఇక్కడ వుంది నా ముక్కు..ఇంకా నాకు మతేం భ్రమించలేదు లెండి.

రాఘవయ్య: అంత మాటెందుకు శాస్త్రిగారూ... మీ ముక్కెక్కడ ? అంటే సూటిగానే చూపించారుగా ? తలచుట్టూ తిప్పిచూపించలేదు కదా మా ఇంటికి డ్రైనేజీ అటువైపే ఉంది. అందుకే అటువైపు పల్లంగా ఉంచాను. సరేనా ....

శాస్త్రులు: సరేలెండి చెప్పుతో కొట్టినట్టు చెప్పారుగా ఇంకా సరేగాక ఏముంటుంది గనకా ...ఐనా మీరు ముక్కుకు సూటిగా పోయే మనిషులాయే కలికాలం దాపురించిందండీ...కలికాలం ఆ ఆర్కిటెక్ట్ వెధవ ఎవడోగానీ నా చేతికి చిక్కితేనా డొక్కచీల్చి డోలుకు కట్టేసి ఉండేవాడ్ని..ఆఁ...

రాఘవయ్య: శాస్త్రులు గారు ప్లీజ్ ....దయచేసి మమ్మల్నిలా వదిలేయండి.

శాస్త్రులు: (కట్ చేస్తూ) వదలనండీ... వదలనంతే.... ఏవో నాలుగు అక్షరం ముక్కలు కెలికినంత మాత్రాన ... శాస్త్రానికే ప్రచారం చేస్తాడా వాడూ... కన్నతల్లిలాంటి శాస్త్రానికే ద్రోహం చేస్తాడా వాడూ.

రాఘవయ్య: శాస్త్రీగారూ ...

శాస్త్రులు: పుట్టగతులు లేకుండా పోతాడండీ... మా కడుపులు కొడతాడా వాడూ (ఇంతలో శాస్త్రి కొడుకు సుందరం బిగ్గరగా అరుస్తూ ప్రవేశిస్తాడు)

సుందరం : నాన్నా... నాన్నా ఘోరం జరిగిపోయింది నాన్నా మాస్టారూ...దారుణం జరిగిపోయింది మాస్టారూ దారుణం జరిగిపోయింది మాస్టారూ దారుణం.

రాఘవయ్య: ఏమిటి ? సుందరం ఏం జరిగింది చెప్పు.

సుందరం : జరగాల్సిందే జరిగింది మాస్టారు. అనుకున్నంతా అయ్యింది. సర్వనాశనం జరిగిపోయింది.

శాస్త్రులు: ఓరే నీ అఘాయిత్యం కూలా.. ఏం జరిగిందో ముందుచెప్పరా ముదనష్టపు వెధవా....

రాఘవయ్య: (అనునయంగా) శాస్త్రులుగారూ మీరుండండీ.. సుందరం..అసలేం జరిగిందో చెప్పు....

సుందరం : చెప్పాను మాస్టారూ చెప్పాను. ఇన్నాళ్ళూ మా నాన్న మూర్ఖత్వాన్ని సహించినందుకు ఈ రోజు మేము భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చింది.

శాస్త్రులు: ఒరేయ్ నన్నిలా చిత్రవధచేయక జరగిందేమిటో చెప్పరా ముందూ....

సుందరం : ఆనాడు, మేము వద్దూవద్దని చెప్పున్నా వినకుండా ఆగ్నేయంలో వంటగది కట్టించావు. దానిని అనుకునే పడకగదినీ, హాలునీ నిర్మించావు అవునా.......

శాస్త్రులు:అవునూ

సుందరం : అదిగాక మనం నివసించే ప్రదేశంలో ఆగ్నేయం నుంచి గాలులు వీస్తాయనీ, అవి వంట ఇంటి నుంచి పడక గదకీ, హాలులోనికి ప్రవేశించటం - మన ఆరోగ్యానికి, అస్థికీ మంచిది కాదని, నేనూ, ఇంజనీరు ఎంత మొత్తుకున్న వినకుండా నువ్వు మూర్జంగా కిచెన్ ఫ్లాట్ ఫాం కూడా తూర్పువైపే కట్టించావ్ అవునా... ఆవున్రా శాస్త్ర ప్రకారమే కదా కట్టించాను అయితే ఏమయిందంట.

సుందరం: (కట్ చేస్తూ) వెళ్ళి) నీ శాస్త్రాన్నే అడుగు ఏం జరిగిందో....

శాస్త్రులు: ఒరేయ్

సుందరం: శాస్త్రమట, శాస్త్రం మనిషి ఆరోగ్యాన్ని , అవసరాన్నీ, అనుకూలతనూ పట్టించుకోని నీ శాస్త్రమూ ఒక శాస్త్రమేనా...(గద్దద స్వరంతో) ఈ రోజు ఉదయం అమ్మ వంట చేస్తున్నప్పుడు నూనెలో మంటలు లేచి ఒకసారిగా ముఖాన్ని తాకాయి. అమ్మ కళ్ళు మూసితెరిచేలోగా మంటలు చూరునంటుకున్నాయి. వాటికి ఆగ్నేయంగా వడగాలులు కూడా తోడవ్వడంతో ఆ మంటలే నాలుకలు సాచి, మన పడక, గదినీ, హాలునీ అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు లేచి ఇల్లు మొత్తం క్షణాల్లో బూడిదగా మారింది. సర్వనాశనమైపోయింది.. (ఏడుస్తాడు)

రాఘవయ్య: ఎంత ఘోరం జరిగిపోయింది ?

శాస్త్రులు: అయ్యో నాశనం అయిపోయింది. సర్వనాశనం అయిపోయింది ఏ జన్మదాకో ఎందుకునాన్నా ఈ జన్మలో నీ మూర్ఖపు ఆలోచనలే మనకీ గతి పట్టించాయి.

రాఘవయ్య: (వారిస్తాడు) సుందరం... పశ్చాత్తాపంతో బాధపడుతున్న వ్యక్తిని మరింత బాధించటం మంచిది కాదు. శాస్త్రుగారూ లేవండీ ఇక జరగాల్సింది ఆలోచించండి.

శాస్త్రులు: ఒరేయ్ ..ఒరేయ్ ఇంతకీ మీ అమ్మకెలా ఉందిరా....

సుందరం: తృటిలో ప్రాణాపాయం తప్పిందినాన్నా...

శాస్త్రులు: (ఉత్సాహంగా లేస్తాడు) హమ్మయ్య అంతా అనుకున్నట్లే జరిగింది. నేను చేసిన పనికి అంతనుంగా మేలే జరిగింది.

సుందరం: రాఘవయ్య: (ఒక్కసారిగా) మంచి పనా... ఏమిటది....

శాస్త్రులు: ఒరేయ్ ఆ రోజు వద్దూవద్దంటున్నా వినకుండా ఈశాన్యంలో పెద్ద గొయ్యి తవ్వించాను కదా..

సుందరం: అవును తవ్వించావు.. అయితే

శాస్త్రులు: ఇంకా అయితే ఏమిట్రా ఆ గొయ్యి తవ్వించడం వల్లే, ఈనాడు మీ అమ్మ బతికి బట్టకట్టిందిరా వెధవాయ్

సుందరం: (కోపంగా) నాన్నా ...చీ ఇంత జరిగినా.... నువ్వసలు మనిషివేనా....

శాస్త్రులు: ఆ ఏమిటి కన్న తండ్రిని ... నన్ను పట్టుకొని మనిషిని కాదంటావా......నేను మనిషిని కాకపోతే నువ్వెడివిరా ... గాడిదా... నిన్నేంచేస్తానో చూడు (ముందుకెళ్తాడు).

రాఘవయ్య: (వారిస్తూ) శాస్త్రులు గారూ శాస్త్రులు గారూ ఆవేశపడకండి. ఇది సమయం కాదు. సావధానంగా ఆలోచించండి.

శాస్త్రులు: ఇంకా సావదానం ఏమిటండీ... కన్న కొడుకు, కట్టుకున్న ఇల్లూ నాశనమైపోతేనూ.

రాఘవయ్య: తప్పు శాస్త్రులుగారూ మీరు మారాలి మీ ఆలోచనా విధానం మారాలి.. ఒకనాడు మనకు తెలిసిన విషయాన్ని నమ్మి ఆచరించాం. కానీ ఈనాడు వాస్తవాలుగా ఋజువైన విషయాల్ని కూడా అవాస్తవాలని ఎన్నిరోజులు మభ్యపెడతాం చెప్పండి. మారుతున్న కాలంతో మనం మారక తప్పదు మార్పును ఆహ్వానించకపోతే మనం మనుగడ సాగించలేం శాస్త్రిగారూ

శాస్త్రులు: అంతేనంటారా రాఘవయ్యగారూ

రాఘవయ్య: తప్పదు పడండి చీకటి నుంచి వెలుగులోకి, అశాస్త్రీయత, అపోహలనుండి వాస్తవంలోకి పదండి.

సుందరం: పదండి నాన్న..

శాస్త్రులు: పదండి (తెరవెనక నుండి చైతన్య గీతం విని పిస్తూండగా ప్రేక్షకుల మధ్యకు నడుచుకుంటూ వెళ్తారు).

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/25/2021



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate