অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

తల నీలాలకు తల నరకాలా?

తల నీలాలకు తల నరకాలా?

goatngirlఖాదర్ : అయ్యా! మరీ కూటి నీళ్ళకు కొన్నారయ్య మరో వెయ్యి ఇప్పించండి.

చంద్రం : 10 కిలోలు కూడా మాంసం పడదు దానికి ఇప్పుడిచ్చిందే చాల ఎక్కువ!

ఖాదర్: నల్ల మేకపోతు, అమ్మోరి బలికంటిరి...?

చంద్రం: చంటి దాని తల నీలాలు ఇవ్వాలనే తొందరలో వేరే చిక్కక, నీ దగ్గర ఇంత రేటు పెట్టి కొంటున్నాం.

రఘురాం తాత: ఖాదర్ ఆ వంద తీస్కో! ఇక ఆడగవద్దు. (బేరసారాలు చురుకుగా ఒక వైపు జరుగుతుంటే, గుంజకు కట్టిన మేకపోతును చిట్టి చెల్లికి మాలిమి చేయించే పనిలో వంశీ బిజీగా ఉన్నాడు.)

వంశీ : ఏయ్! చిట్టీ, దగ్గరకురా ఇదేమి చేయదులే!

చిట్టి : ఉహు.! (భయంగా)

వంశీ : ఒసే! పిచ్చి మొద్దు! పోనీ, ఆ ఆరటి పండు దానికివ్వు!

(చిట్టి అరటి పండు మేకపోతు ముందుకి విసరి వేసింది పండుతిని, మేక 'మే' అంటూ అరిచింది. చిట్టి మొదట్ల ఉలిక్కిపడి ఆపై పకపక నవ్వసాగింది.)

చిట్టి : మే! మే! (అరవసాగింది. మేకపోతు కూడా చిట్టితో కలసి అరుస్తుంది.)

వంశీ : చిట్టీ! ఇది నీకు థాంక్స్ చెపుతోంది.

(అంటూ దానిపైకి ఎక్కాడు చిట్టి మేక వైపు బాధగాచూస్తోంది.)

నానమ్మ: ఒరే! భడవా! దానిపై నుండి దిగు.

మేక : మే! (వంశీ దిగేశాడు)

చిట్టి : మే! మే! నానమ్మా, అది నీకు థాంక్స్ చెపుతోంది. (మేక చిట్టివైపు తిరిగింది. చిట్టి దాని మెడ చుట్టు చేతులేసి పట్టుకొని)

చిట్టి : అన్నయ్యా, మేక భలే వుందిరా...!

మేక : మే...!

వంశీ : చిట్టీ, అది నీకు థాంక్స్ చెప్పింది. (చిట్టి ముదులతొ, వంశి వేసే మేతతో మేకపోతు ఇంద్రభోగం అనుభవించ సాగింది.)

(ఉదయం 8 గంటలు రఘురాం తాతగారింటి ముందు గంధం, కుంకుమ బొట్లు, పూలమాలతో టాటా ఏసి వాహనం రీవిగా ఆగివుంది. ఆదరా బాదరా అన్నీసర్దుకొని మేక పోతును సైతం బండి ఎక్కించి అందరూ సరుకొని కుర్చున్నారు.)

చిట్టి : (మేకతో) దా! ఇది తినమ్మా!

నానమ్మ : ఒసే! తింగిరి దానా! అవి తమల పాకులే! పూజకు తక్కువ పడతాయి!

చంద్రం: పెట్టనీలే అమ్మా! ఇంకోరెండు గంటలేగా అది తినేది.

పక్కింటాయన: ఆపై దాన్ని మనం తింటాం కదా! (అందరు పక పక నవ్వారు.)

మేక : మే!

చిట్టి : అంకుల్, అది మీకు థాంక్స్ చెపుతోంది. (మళ్ళీ పకపకలు).

ఇంతలో వాహనం ఓ పెద్ద గుంతలో పడి లేచింది. పెద్ద అదురు. నానమ్మ సీటు నుండి కిందకు జారి పడింది. చంద్రం షూ వేసిన కాలు, నానమ్మ చేయిపై పడింది.)

నానమ్మ : అయ్యో! అయ్యో! కాలు తీయరా! (చంద్రం కాలు తీశాడు. వాహనం ఆగింది. నానమ్మ చేతి వేళ్ళు బాగా చితికిపోయాయి. రక్తం ధార పడుతోంది. నానమ్మ విలవిల లాడిపోతుంది.)

చిట్టి : (ఏడుస్తూ!) నానమ్మా! నానమ్మా!

చంద్రం : (రక్తం కారకుండా గాయాన్ని అదిమి పట్టి) సారీ అమ్మా! సారీ ప్లేజ్, (మెత్తటి పంచె గుడ్డను, నీటిలో తడిపి గాయానికి గట్టిగా కట్టాడు.)

చంద్రం: అమ్మా! అరచేయి పైకి వుండేలా పట్టుకో, రక్తం కారకుండా ఆగిపోతుంది.

పద్మమ్మ: పసుప్పొడో, కాఫీ పొడో, అద్దితే రక్తం కట్టుకొనేదేమో

రఘురాం తాత: రక్తగాయాలపై వాటిని వేయరాదు. తెల్సుకో, వాటివల్ల ధనుర్వాతం లాంటి భయంకర జబ్బులు వస్తాయి.

చంద్రం : లేదా చీము పట్టి గాయం సెప్టిక్ అవుతుంది.(వారి వాహనం డాక్టర్ దగ్గరకు వెళ్ళి గాయానికి

వైద్యం పూర్తి అయ్యాక గుడివైపు కదిలింది. చిట్టి చెవి దగ్గర నోరు వుంచి మేక ఏదో నములుతుంది)

వంశీ : తాతయ్యా! మేక చిట్టి వావిలో ఏదో రహస్యం చెపుతోంది!

తాత: అది చిట్టితో 'ఒసే చిట్టీ, నీతల వెంట్రుకలు కత్తిరించటానికి నాతల తొలిగించాలా? అంటోంది.

చిట్టి : తాతా! దీని తల నరికేస్తారా?

నానమ్మ : ఔసే! దానితో పొంగలి చేసి అమ్మోరికి నైవేద్యం పెట్టాలిగా!

చిట్టి : నానమ్మా! నీకు వేలు నలిగితేనే ఏడ్చేశావ్! మరి మేక కెంత నొప్పి అవుతుందో చెప్పు.

వంశీ : అవును చిట్టీ నెత్తురంతా కారి చచ్చి పోతుంది. (బాధగా)

మేక : మే! మే!

చిట్టి : ఈ మేకకు కూడా ఆలా చనిపోవడం యిష్టం లేదంట.! చెబుతోంది.!

(బండి జాతర బలి పీఠం దగ్గర ఆగింది. అప్పడే ఓ దేవర దున్నను బలవంతంగా నరికి, దాని తలను, తట్టలో వుంచి తప్పెట్ల, తాళాలతో ఆలయంలోకి తీసుకొని వెళుతున్నారు. చుటూ పదుల సంఖ్యలో పొట్టేలు పదుల సంఖ్యలో కోళ్ళు, ఇతర జీవాల తలలు తెగి పడున్నాయి. మూగ జీవాల ఆర్తనాదాలతో, పచ్చినెత్తుటి వాసనతో, కాలువలు కట్టిన నెత్తుటి మరకలతో, ఆ ప్రదేశం భయంకరంగా వుంది.)

చిట్టి : బుజ్జి మేకా! నన్ను వదిలి పోవద్దు ప్రమాదం. (దాని చెవిలో చెప్పి, దాని మెడ చుట్టు తన చేతులతో బిగించి పట్టుకొంది చిట్టి.)

చంద్రం: ఏయ్! చిట్టీ, మేకను వదిలి ఇలారా! తలనీలాలు ఇవ్వాలి.

చిట్టి: నే రాను! నా వెంట్రుకలు తీస్తే, దాని తల తెగుతుంది.

పద్మమ్మ: రెండు తగిలించండి! దేవుడి దగ్గర ఆటలాడుతోంది.

చిట్టి : కొట్టండి! చంపండి! నేను వచ్చేది లేదు, మేకను ఇచ్చేదిలేదు.

వంశీ : (పెద్దలకు అడుగా నిలుస్తు!) నేనూ మా చెల్లెలు పార్టీనే!

నానమ్మ: అమ్మా... శక్తి స్వరూపిణీ! పసిపిల్లలు తెలీక తప్పచేస్తున్నారు. తల్లీ! క్షమించమ్మా!

పూజారి: (బలి కత్తితో, బండి వద్దకు వచ్చి) ఏయ్, పాపా! అలా అనరాదు, మేక పోతును ఇలా తే!

చిట్టి: పోలీస్! పోలీస్! కాపాడండి.

పూజారి: (పక పక నవ్వుతూ) ఆదో ఆయనే ఎస్పై బలులు క్యూలో జరిగేలా చూస్తున్నాడు. చెప్పకోఫో! (పక్కింటాయన పాపనుండి మేకను తప్పించబోయాడు.)

చిట్టి: (మేక మెడను గట్టిగా కరుచుకొని బిగ్గరగా ఏడ్వసాగింది. వంశీ చెల్లితో శృతి కలిపి తానూ ఏడ్వసాగాడు.)

నానమ్మ: ఈ రోజు అన్ని అశుభాలే! ఒరే నాయనా, వాళ్ళకు ఎవరైనా చెప్పండిరా!

ఎస్పై: (దగ్గరకు వస్తూ!) ఏమిటీ, గలాట?

తాత : మా పిల్లలేనండి, మేకను బలివ్వరాదంటున్నారు!

ఎస్సై: మానేయండి.

నానమ్మ: అపచారం కదయ్యా!

ఎస్పై: జంతు బలులు చట్టరీత్యా నేరం. కాని సాంప్రదాయం కాదన లేక, మేము చూచి చూడనట్లు పోతున్నాం!

పూజారి: (కోపంగా) పెద్ద చట్టాలు చెప్పావులే సారు. ఇది తరతరాలుగ వస్తున్న మన ఆచారం. శ్రీరాముడు, ధర్మరాజు లాంటి దేవుళ్ళే ఆశ్వమేధయాగం గుర్రాన్ని బలి ఇచ్చారంట.

నానమ్మ: మన ఋగ్వేదంలో కూడా ఏ జంతువును, ఏ దేవుని ప్రీతికోసం బలి ఇవ్వాలో స్పష్టంగా రాశారండి.

ఎస్పై: కానీ మన జాతిపిత మహాత్మాగాంధీ గారు 'అహింసో పరమోధర్మహ!" అన్నాడు కదమ్మా!

పద్మమ్మ: గాంధీగారు మనిషి కదండి! కాని రాముడు, ధర్మరాజు మన పురాణ పురుషులు కదా!

తాత: భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్ని జీవాలు నా నుండే పుట్టాయి! వాటిలో చైతన్యం, ప్రాణం అన్నీ నేనే అని చెప్పాడు.

తాత: (నానమ్మను చూస్తూ!) వేదాలలో కూడా ఈర్ష్య, ద్వేషం, క్రోధం, మోహం, మదం, మాత్పర్యం అనే అరిషడ్వర్గ చెడుగుణాలను జంతువులతో” పోల్చుతూ, ఆ జంతు గుణాలను మనలో నశింప చేసుకోవాలని చెప్పారు. కానీ జంతువులను బలి చేయాలని అర్థం కాదు.

ఖాదర్: మా ఖురాన్ కూడా మనిషిలోని జంతు ప్రవృత్తిని చంపు కోవాలని చెప్పింది.

జోసఫ్ అంకుల్ : మా జీసస్ గొర్రెల కాపరి, ఆయన ప్రాణులను పెంచమన్నాడేకాని, చంపమనలేదు.

ఎస్పై: ఏ మతమైనా చెప్పేది, "అహింసను మించిన ధర్మం లేదనే!” .

పక్కింటాయన: అంటే నాన్-వెజ్ మానెయ్యమనా మీ సలహా?

ఎస్పై: అలా అనలేదే! దేవుని పేరుతో విచ్చలవిడిగా జీవహింస, బలి వంటివి చేయరాదనే మా సూచన.

చంద్రం : బంధుమిత్రులతో విందు భోజనాలంటూ ఇక్కడికి వచ్చాం! ఇప్పడేమి చెయ్యాలి?

ఎస్సై: అదిగో... అక్కడి దుకాణంలో నాన్-వెజ్ చిక్కుతుంది. వడ్డించేయండి.

నానమ్మ: కర్మ! కర్మ...!

తాత: ఒసే! తలనీలాలు తీసేటప్పడు, ఆ చంటిదాని మనస్సు నొప్పించడం ఎందుకు? మేక పోతు ఖరీదు డబ్బుగా ఇస్తాను. అమ్మోరి హుండీలో వేసి, మొక్కుకొనివద్దాం, రా పోదాం. నానమ్మ:  సరే! పదంద్రా!

(భోజనాలైనాక టాటా ఏసి కదిలింది. నున్నటి గుండ్లతో చిట్టి, వంశీలు, మధ్యలో నల్లటి బొచ్చుతో ఠీవిగా నల్లమేకతో తిరుగు ప్రయాణం కట్టారు.)

రచయిత: -జి. చంద్రశేఖర్, సెల్: 9494746248© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate