పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

నిప్పులాంటి నిప్పు

నిప్పు ఎంత ఉపయోగకరమో అంత ప్రమాదకరం.

బయటకు అమాయకంగా కనపడుతూ లోపల నిగూఢంగా వుండే వారిని నివురు గప్పిన నిప్పు' అంటారు కదా. నిజాయితీగా, ముక్కు సూటిగా వుండే వారిని నిప్పులాంటి మనిషి' అంటారు కదా. ఇక నిప్పులేనిదే పొగ రాదు' అనే సామెత గత మాసం చెప్పుకున్నాం. పూర్వకాలంలో బడబొగ్గు, జఠరాగ్ని అని రకరకాల అగ్నిలగురించి ప్రస్తావన వుంది. సౌరశక్తి తరువాత మనిషి వాడుతున్న అతిపురాతన శక్తి రూపము 'నిప్పు' (Fire) జాగ్రత్తగా వాడు. ఎంతో విలువైనది. ఉపయోగపడేది. లేదంటే నిప్పు వినాశకారి, ప్రమాదకారి. మరి ఈ నిప్పు కథ ఏమిటో, నిప్పు అంటే ఏమిటో తెలుసుకుందామా.

నిప్పు లేక మంట (Fire) అనేది ఓ ఉష్ణమోచక (exothermic) రసాయనచర్య. ఓ పదార్థము వేగంగా ఆక్సీకరణం (Oxidation) చెందుతూ వేడిమిని, కాంతిని. ఇతర పదార్థాలను విడుదల చేసే ఉష్ణమోచక రసాయన చర్యనే మంట అని అంటారు. ఇనుము తుప్పుపట్టడం, అన్నం జీర్ణం అవడం కూడా ఆక్సీకరణ చర్యలే, కానీ ఇవి చాలా నిదానంగా జరుగుతాయి. కనుక వీటిని మంటలు అని అనలేము.

ఆర్కియాలజీ సైంటిస్ట్ ల ప్రకారం మనిషి ముందుతరాల తొలి రూపి అయిన ‘హెూమో ఎరెక్టస్ (Homo erectus) కు నిప్పువాడకం 3 లక్షల సంవత్సరాల ముందే వారి జీవన విధానంలో ఓ భాగం అని తేలింది. కలపను కాల్చడం వల్ల ఏర్పడ్డ మంటలు ఆదిమానవునికి చలికాలంలో కావలసిన వేడిని, రాత్రిపూట క్రూరజంతువులు, విషకీటకాల నుండి రక్షణ కల్పించేవి. చెకుముకి రాళ్ళను రాపాడించి ఘర్షణ వల్ల నిప్పురవ్వలు పుడితే వాటితో ఎండుగడ్డిని మండించి మంటను రాజేసేవారు.

june08.jpgనిప్పును నియంత్రించి దాని ద్వారా కాంతిని వెలువరించిన తరువాత ఆదిమానవుని మనుగడ పూర్తిగా మారిపోయింది. అంతవరకు పగలు వెలుతురులో మాత్రమే పనిచేసుకునే వారు దీపపు కాంతిలో రాత్రిపూట కూడా పనులు చేసుకోవడం మొదలైంది. మంటలోని పొగవల్ల కొన్ని క్షీరదాలు, పురుగులు దరిచేరడం తగ్గిపోయింది. అందువల్ల వారి ఆరోగ్య పరిస్తితులు కాస్త మెరుగుపడింది.

june07.jpgఅదివరకు పచ్చిమాంసం, పచ్చి కూరగాయలు, ఆకులు తినే మనిషి మంటను కనుగొన్న తరువాత ఆహారాన్ని పండటం ప్రారంభమైంది. వండిన ఆహారం తినడం వల్ల సులభంగా జీర్ణం అవడం ప్రారంభమైంది. పచ్చివి తినేటపుడు ఆదిమానవుని ఆహారంలో మొక్కల కాడలు, దళసరి ముదురు ఆకులు, బాగా బలిసిన వేర్లు అసలు వుండేవికావు. అతి తక్కువ చక్కెర గల లేత ఆకులు, కొమ్మలు, కార్బోహైడ్రేట్లు గల గింజలు, పూలు, పళ్ళు మాత్రమే ఆహారంలో భాగంగా వుండేవి.

ఆహారం మండటం వల్ల పైన చెప్పిన దళసరి ఆకులు మొదలయినవి సులభంగా ఆహారంలో భాగం అయ్యాయి. వండిన ఆహారం వల్ల పిండి పదార్థాలలోని సంక్లిష్ట కార్బోహైడ్రేట్ లు సులభంగా జీర్ణం అయింది. ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ అయిన రిచర్ట్ వ్రాగం (Richard Wragham) అంచనా ప్రకారం వండిన ఆహారం వల్ల దానిలోని ధకశక్తిని గ్రహించడానికి జీర్ణవ్యవస్థకు సులభమైంది. దాంతో మనిషి మెదడు సైజు పెరిగి ప్రస్తుతం వున్న తెలివైన మానవుడిగా రూపాంతరం చెందడానికి ఆస్కారం ఏర్పడిందని ఆయన సిద్ధాంతీకరించాడు.

కొన్ని టాక్సిన్ లు గల కూరగాయలు వండటం వల్ల తినడానికి అనువుగా మారాయి. ఇక మాంసాహారం వండడం వల్ల బయటే సగం జీర్ణం అయినట్లే, తిన్న తరువాత సులభంగా పూర్తిగా జీర్ణం అవుతుంది. వండిన ఆహారం తినడం వల్ల జీర్ణక్రియ సులభం కావడంతో మనిషిలో మార్పులు జరిగి చిన్న జీర్ణవ్యవస్థ, చిన్నపళ్ళు, చిన్న దవడ, పెద్ద మెదడు ఏర్పడ్డాయి అని శాస్త్రవేత్తల అంచనా.

మంటను ఉపయోగించి పెద్ద నెగడు (Camp fire) వేసుకొని దానిచుట్టూ చేరి ఒక్కో తెగ మనుషులు అన్ని విషయాలు చర్చించుకోవడం ప్రారంభమైంది. దీనివల్ల సామాజిక జీవనం అలవాటై మనిషి మనిషిగా మారడానికి పునాది ఏర్పడింది. అసలు అగ్గిని మండించి తన ఆధీనంలోనికి తీసుకొని అదుపు చేసుకొని అవసరం అయినపుడు వాడుకోవడం అనే చర్య చరిత్రలో ఓ పెద్ద మలుపు.

అగ్గిపుల్ల కనుగొన్న తరువాత అనంతమైన నిప్పు అతి చిన్న రూపంలో పుల్ల తలభాగంలో నిక్షిప్తమై పోయింది. సులభంగా కావలసినపుడు మంటను మండించుట సాధ్యమైంది. వస్తువు మండుతున్నప్పుడు మంట అనేది కంటికి కనబడే భాగము, మంట యొక్క రంగు, తీవ్రత మండే వస్తువు మీద, గాలిలో వుండే మలినాల మీద ఆధారపడుతుంది. మంటవల్ల వస్తువుల నాశనం జరుగుతుంది.

భూగోళం మీద జీవ సమతుల్యాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన చర్య 'మంట', మంటల వల్ల లాభాలు ఏమిటంటే ఎదుగుదలను వేగవంతం చేయడం, జీవ పరిణామం సంబంధించిన వ్యవస్థను సమతుల్యం చేయడం. ఇక మనుషులు వంట చేయడానికి, వేడిని పొందడానికి, సమాచారాన్ని ప్రసారం చేయడానికి, చలనానికి (Propulsion) వంటను, నిప్పును వాడుతున్నారు.

దీనివల్ల నష్టాలు కూడా వున్నాయి సుమా. మంటలు మండి దాని బూడిద నీటిలో కలవడం వల్ల నీటికాలుష్యం, వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. మంటల వల్ల కార్బన్ డై ఆక్సైడ్ అధికంగా వాతావరణంలో కలుస్తోంది. కార్చిచ్చు వల్ల అడవులు కాలిపోతాయి. తిరుమలలో శేషాచల అడవుల్లో గతమాసం మంటలవల్లె అడవులు కాలిపోవడం మీరు వినే వుంటారు. ఎండాకాలంలో పల్లెల్లో, పట్టణాల్లో అగ్నిప్రమాదాలు జరుగుతూవుంటాయి. వీటివల్ల ప్రాణనష్టం, ఆస్థినష్టం జరుగుతుంది.

కనుక నిప్పులాంటి నిప్పుని నియంత్రిస్తే మెప్పు, అదుపు తప్పితే ముప్పు. అందుకే నిప్పుతో చెలగాటం ఆడరాదు' అని పెద్దల సామెత. నిప్పుని నిప్పుగా చూస్తూ, లాభాలను పొందుతూ, నష్టాలను అరికడదాం. ఎవరైనా రోడ్డుపై వెలిగే అగ్గిపుల్ల వేసినా, కాలుతున్న ధూమపాన వస్తువులను వేసినా మంచిది కాదని తెలియజేయండి. పిల్లలను అగ్గికి దూరంగా వుంచండి. అగ్గిపెట్టె మంటలతో ఆడుకోవద్దు. సరేనా......

ఆధారం: యుగంధర్ బాబు

3.00267379679
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు