অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పంజరంలో చిలుక

పంజరంలో చిలుక

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. అందుకే నేత్ర దానం చేయండి అని అనేక సేవాసంఘాలు జనాలకు చెబుతుంటారు. ఏదైనా ఒక వస్తువును చూసినట్లయితే రెండు కన్నులు వేరు వేరు ప్రతిబింబాలను మన రెటీనాపై ఏర్పరుస్తాయి. ఈ రెండు ప్రతిబింబాలను మెదడు కలిపేసి ఒకే త్రిజ్యామితీయ (Three Dimensional) ప్రతిబింబాన్ని ఏర్పరచి మనకు దృశ్యాన్ని చూపుతుంది. ఈ దృశ్యాన్నే బైనాక్యులర్ ప్రతిబింబం (Binocular Image) అంటారు. దీనికి మంచి ఉదాహరణ తోమాట్రోప్ (Thowmatrope) అనే ఓ చిన్న ఆటవస్తువు. దీన్ని 1826లో ఆంగ్ల భౌతిక శాస్త్రవేత్త జె.ఎ.పారిస్ రూపొందించాడు. ఈ తోమాట్రిప్ లేక “అద్భుత చక్రం” (Wonder Turner) ఏంటో, అది ఎలా పనిచేస్తుందో దాని కథాకమామిషు ఏంటో తెలుసుకుందాం. అంతెందుకు మనమే ఓ తోమాటోప్ అనే అద్భుత చక్రం తయారు చేద్దామా? ఎలాగంటారా? రండి చేసి చూద్దాం.

తోమాట్రోప్ తయారీకి కావలసిన పరికరాలు

3” అంగుళాల చదరపు అట్ట ముక్క కాగితం, పెన్సిల్, వృత్తలేఖిని కత్తెర, స్కెచ్ పెన్, 12 అంగుళాల దారపు ముక్కలు రెండు.

తయారు చేయు విధానం

jan09.jpg3 అంగుళాల చదరపు అట్ట ముక్కను తీసుకొని 1 1/2 అంగుళాల వ్యాసార్థంతో వృత్తలేఖిని తీసుకొని ఒక వృత్తాన్ని అట్ట ముక్కపై గీయండి. అప్పుడు 3 అంగుళాల వ్యాసం గల వృత్తం ఏర్పడుతుంది కదా. కత్తెరతో ఈ వృత్తం పరిధి వెంబడి కత్తెరించండి. ఈ అట్టముక్క రెండు చివరల వద్ద రెండు రంధ్రాలు (పటంలో చూపిన విధంగా ఒకే వ్యాసంపై వుండేలా) చేయండి. తరువాత కాగితంపై రెండు వృత్తాలు గీచి (1 1/ 2అంగుళాల వ్యాసార్థంతో) ఒక వృత్తంలో పంజరం, మరొక వృత్తంలో చిలుక బొమ్మలు గీయండి. వీటిని కత్తిరించి అట్ట బొమ్మను ఒకవైపు నిలువుగా అతికిస్తే రెండవ వైపున చిలుక బొమ్మను తలకిందులుగా అతికించాలి. అంటే ఒకదానికి ఒకటి తలక్రిందులుగా వుండాలి. ఇప్పుడు అట్టముక్కకు గల రెండు రంధ్రాల గుండా 12 అంగుళాల దారాలను దూర్చి ముడివేయండి. అంతే మన తోమాట్రోప్ రెడీ.

తోమాట్రోప్ పని చేయు విధానం

రెండు దారపు ముక్కలను వేళ్ళ మధ్య పట్టుకుని అట్టముక్కను తాకి వేలుతో తిప్పితే దారాల మధ్య తోమాట్రోప్ నిలువు తలంలో (X అక్షం వెంబడి) వేగంగా తిరుగుతుంది. మొదట పంజరం చిలుక వేరుగా కనిపించి వేగం పెరిగినప్పుడు చిలుక, పంజరం రెండు బొమ్మలు కలిసిపోయి, పంజరంలో చిలుక వున్నట్లుగా కనిపిస్తుంది. దీనినే దృశ్యబ్రాంతి (Optical Ilusion) అంటారు.

అసలు ఏమి జరిగింది ఇది ఎలా సాధ్యం?

ఒక వస్తువు మనకు కనిపించాలంటే కాంతిపుంజంలో వస్తువుపై పడి పరావర్తనం చెంది, కంటిలోని రెటీనాపై పడి వస్తువు కనిపిస్తుంది. ఈ ప్రతిబింబం రెటీనాపై 1/20 సెకను నుండి 1/ 10వ సెకను కాలం వరకు వుంటుంది. దీనినే దృష్టి విక్షేపణము (Persistance of Vision) అంటారు. అంటే 1/20వ సెకను లోపల రెండు, మూడు ప్రతిబింబాలు రెటీనాపై పడితే వాటిని వేరువేరుగా చూడలేక కన్ను వాటిని కలిపి చూస్తుంది. తోమాట్రోప్ విషయంలో జరిగింది అదే. తోమాట్రోప్ వేగంగా తిరుగుతున్నప్పుడు పంజరం, చిలుక ప్రతిబింబాలు 1 సెకనులో 20 కంటే ఎక్కువసార్లు కంటి రెటీనాపై పడితే రెండు కలిసిపోయి పంజరంలో చిలుక వున్నట్లు భ్రమపడ్డాము. ఇదే సూత్రంపై సినిమా కూడా పనిచేస్తుంది. సినిమా షూటింగ్ తీస్తున్నప్పుడు కెమెరాలోని రీలు 1 సెకనులో 20 ఫ్రేములను తీస్తుంది. ఈ రీలును తెరపై ప్రదర్శించినప్పుడు ప్రతిబింబాలు వేగంగా కదులుతూ ప్రతిబింబాల మాలికలా కాక నిజంగా మన హీరో కదులుతున్నట్లుగా మనం భ్రమిస్తామన్నమాట. అదీ సంగతి. తోమాట్రోప్ బాగుంది కదా, పంజరం, చిలుక కాకుండా మీరు బోను-పులి, కోడిగుడ్డు-కోడిపిల్ల ఇలా ఎన్నో బొమ్మలు గీసి తోమాటోప్లు తయారుచేసుకోవచ్చు.


ఆధారం: ఎం.ఎస్ యుగంధర్ బాబు.



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate