অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పిచుకమ్మా...! చెప్పమ్మా...!

పిచుకమ్మా...! చెప్పమ్మా...!

may9వంశీ: ఏయ్! ఆగు! ఆగు! ఏం చేస్తున్నావు?

పిచుకమ్మ: (చిరాకుగా) ఛీ! పోరా!

వంశీ: ఏయ్! దారంతో ఉచ్చువేస్తున్నావు! ఎందుకు?

పిచుకమ్మ: (ఉరిమి చూస్తూ) ఉరేసుకుని ఛావడానికి!

వంశీ: అంత కష్టం ఏమొచ్చింది నీకు?

పిచ్చుకమ్మ: ఏలడంతలేవే! నీవేమైన ఆర్చేవాడివా? తీర్చేవాడివా? (మెడకు ఉరితాడు తగిలించుకొంటుంది...)

వంశీ: ప్లీజ్! ప్లీజ్! తొందరపడకు...!

పిచుకమ్మ: (చిట్టి ముక్కుచీదుతూ) మీ నరజాతి వల్లే! నాకీ గతిపట్టింది!

వంశీ: నరజాతి...? ఓ! మనుష్యులమా?

పిచుకమ్మ: ఆ! అవును! నాగరికత ముసుగు కప్పుకొన్న నీచజాతి మీది!

వంశీ: (కోపంగా) ఏయ్! పిచుకమ్మా మాటలు తిన్నగా రానియ్!

పిచుకమ్మ: తిన్నగా మాట్లాడేలా ఉన్నాయా మీ పనులు? మా గూళ్ళను గుంజేశారు! తాగడానికి గుక్కెడు నీళ్ళు, తినడానికి పిడికెడు గింజలు దొరకనీకుండా చేసి, ఇప్పుడే వె మా జాతి పోతుందని నంగనాచి కబుర్లు! వాట్సప్ మెసేజీలూనా!

వంశీ: (నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. )

పిచుకమ్మ: ఏం! ఈ భూలోకం ఏ ఒక్కరి సోతోకాదే! మాకు బతికే హక్కు లేకుండా చేస్తారా?

వంశీ: చిలకమ్మా! కాస్తావిను!

పిచుకమ్మ: ఏం వినాలి? అప్పుడెప్పుడో చైనా నియంత ఒకరు అపోహతో మమ్మల్ని ఎంత మందిని చంపి తే అంత పారితోషికం ఇస్తానన్నాడంట. మా చావు దెబ్బకు, వాడి గూబగుయ్యి మనిందంట. తెలియక వాళ్ళు తప్పుచేస్తే, తెలిస్తే మీరింకా పెద్దతప్పు చేస్తున్నారు!...

వంశీ: ఏంటీ! ఈసడింపులు, శాపనార్థాలు! మీరు ఒకప్పటి మా ఊరపిచ్చుకలేనా అని?

పిచుకమ్మ: ఏం?

వంశీ: కువ, కువ లాడుతూ, మా యిండ్లల్లో తెగ సందడి చేసే వాళ్ళంటకదా!

పిచుకమ్మ: సందడి...! (విరక్తి గా నవ్వుతూ) పూరిపాకలు, దూలపు మిద్దెలు, మోటారు షెడ్లు, దిగుడుబావులు, ఇలా ఒకటేమిటి, ఆ రోజుల్లో, అన్ని చోట్లూ మా ఆవాసాలే! చక్కటి గూళ్ళుకట్టి, పిల్లాపాపలతో ఆనందంగా వుండే వాళ్ళం! ...హు! అవన్నీ ఆవిరైపోయినాయ్! వంశీ:

వంశీ: ఈ రోజుల్లో, ఇంకా పెద్దమేడలు కట్టాం కదా!

పిచుకమ్మ: ఆ... కట్టారులే, కాంక్రీట్ వనాలు! నిలువెత్తు అద్దాలను ఇండ్లముందు ఎలివేషన్లుగా పెట్టి! దారి తెన్ను అర్థంకాక మేమీ అద్దాలను గుద్ది, ఎగరలేక మీ ముంగిట పడితే చీపురులతో నెట్టేస్తున్నారే?

వంశీ: ఏం! మా యిండ్ల లోపలే వుండచ్చుగా?

పిచుకమ్మ: ఇండ్లా..? అవి మీ స్వార్ధపు లోగిళ్ళు! POP ఫాల్స్ రూఫ్ లు, పట్టీ పెట్టిన నునుపైన గోడలు! మేమెక్కడ కూర్చోవాలి? ఎలా గూళ్ళు కట్టుకోవాలి? ఆ షాండ్లియర్లు, LED బల్బుల వెలుగులో మేం బ్రతకలేం బాబు!

వంశీ: చెట్లపై వుండండి!

పిచుకమ్మ: (పగుల బడినవ్వుతూ!) వీధికో, వాడకో ఒక చెట్టుంది. “అదీ బతుకుదునా, చస్తునా” అంటూ దుమ్ముకొట్టుకుపోయి వుంటుంది. దాని నిండా ఫ్లెక్సీలు, పార్టీ జెండాలే! గోలిసోడా కొట్టు నుండి, కారు మెకానిక్ షెడ్డు వరకు అన్నీ దాని క్రిందే...!

వంశీ: ఇక్కడే వుండి అర్ధాంతరంగా చావకపోతే, చక్కగా పల్లెలకు పోయి బ్రతకవచ్చు కదా!

పిచుకమ్మ: అబ్బో! అక్కడేదో స్వర్గమున్నట్లు చెపుతావే! బోరు బావులు, డ్రిప్ ఇరిగేషన్లంటూ చుక్కనీరు బయటకు రానీకుండా వ్యవసాయం చేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా చెరువులు, కాలువలు ఎండిపోయాయి. గొంతు తడుపుకొనే తావు లేకుండా నా జాతి అల్లల్లాడిపోతుంది తెల్సా?

వంశీ: గింజలు, పురుగులు మస్తుగున్నాయిగా...!

పిచుకమ్మ: ఆఆ....! వాటి నిండా జబర్దస్తుగా పురుగు మందులు, రసాయనాలు దట్టించారుగా!

వంశీ: ఔనావును! అలాంటి రసాయనాల వల్లే మీరు వ్యంధ్యులు అవుతున్నారటగా!

పిచుకమ్మ: గుడ్లు పెట్టే శక్తిపోయి చాల కాలమైందిలే! (ఇంతలో వంశీ తాతగారి సెల్ ఫోన్ ట్రింగ్... ట్రింగ్ మనసాగింది.)

వంశీ: ఏయ్! ఉండు, తాతయ్యకు ఫోన్ కాల్ వస్తోంది. ఫోన్ తాతకిచ్చి వస్తాను. (పరిగెత్తిపోయాడు)

పిచ్చుకమ్మ: చిన్నా! ఆగరా! సెల్ ఫోన్ రింగంటే అంతమోజా! మేం అంతరించి పోతున్నాం! ఆ సెల్ టవర్ రేడియేషన్ ను, వాటి ఫ్రీక్వెన్సీని తగ్గించే చట్టాలే లేవా మీకు!

వంశీ: అబ్బా! ఆపవే నీ సోదె! లోకంలోని కష్టాలన్నీ మీ నెత్తినే పడ్డట్టు...!

పిచ్చుకమ్మ: నా బాధ, మా జాతిది ఒక్కరిదే కాదురా! కోకిల పాటలు, రామచిలకల అందాలు, కృష్ణగద్దల విన్యాసాలు, నెమలి నాట్యాలు, కొంగజపాలు, వింత ముక్కుల వడ్రంగి పిట్టలు, చెరువు కోళ్ళు, పూతరేళ్ళు, చమిరి కాకులు, గోరింకలు, అంతెందుకు... పీనుగులు తినే రాబందులు సైతం కన్పించకుండా పోతున్నాయి. (బాధగా ఆరక్షణం కళ్ళుమూసీ) “ఫ్లెమింగో ఫెస్టివల్స్” అంటూ ఫారిన్ పక్షులకిచ్చే కనీస గౌరవం కూడా మాకివ్వరా?

వంశీ: ఔను పిచ్చుకమ్మా! నీవుచెప్పే పిట్టలన్నింటిని నేను జూలో మాత్రమే చూశాను.

పిచుకమ్మ: ఆదృష్టం! నీ తరువాతి తరం, వీడియోలలోను, ఫోటోలలోనే మమ్మల్ని చూడబోయేది.

వంశీ: పిచుకమ్మా! మీ కోసం నేనేం చెయ్యాలో చెప్పమ్మా!

పిచుకమ్మ: ఏం చేస్తావు? మీయింటి గోడపై దోసెడు నీళ్ళు, పిడికెడు గింజలు పెట్టు, ఆ కాసింత సాయం మా ప్రాణాలను నిలుపుతుంది.

వంశీ: చిలకమ్మా, నీమీద ఒట్టు! నే తినే ముందు, నీ తిండి గురించి ఆలోచిస్తాను. నీ ఆవాసాలైన చెట్లను పెంచుతానని భరోసా ఇస్తున్నాను. నా స్నేహితులతో సైతం నీ బాగోగులు చూసే విధంగా ఉద్యమిస్తాను. సరేనా? (మాటల్లోనే, ఉరిగావేసిన ఊలుదారాన్ని కాస్తా ఊగే అందాల గూడుగా పిచుకమ్మ మలచుకొంది)

పిచుకమ్మ: మిత్రమా! బ్రతుకూ-బ్రతికించు!

ఆధారం: జి. చంద్రశేఖర్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate