పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పున్నమి ప్రశ్న వెన్నెల జవాబు

రాజు ప్రశ్నకు తెలివిగా సమాధానమిచ్చి ప్రసంశలు పొందిన వెన్నెల.

kingఅనగనగా ఒక రాజు. ఆ రాజుకు 60 ఏళ్ళు నిండాయి.షష్ఠిపూర్తి ఉత్సవం రంగరంగ వైభవంగా జరగింది.

ఈ ఉత్సవంలో రాజు ఒక ప్రకటన చేశాడు. “రాబోయే పున్నమి రోజు నేనొక ప్రశ్న వేస్తాను. దానికి జవాబు చెప్పినవారికి వెయ్యి బంగారు కాసులు ఇస్తాను. కొలువులో ఉద్యోగం కూడా ఇస్తాను”.

“మహారాజు ఏం ప్రశ్న వేస్తాడో ఏమో, దానికి జవాబు చెప్పగల అదృష్టవంతులెవరో ” అని దేశమంతా ఒకే చర్చ ప్రారంభమైంది. ఎక్కడ బట్టినా జనం ఇదే మాట్లాడుకోసాగారు.

పున్నమి కోసం ఎదురు చూడసాగారు. ఇక పండితులు, మేధావులు సరేసరి. తమ అదృష్టాన్ని, తెలివిని పరీక్షించుకుందామని తహతహలాడసాగారు. కొందరైతే శాస్త్రాలు తిరగెయ్యసాగారు.

అలా అలా ఈ వార్త గ్రామాల్లోకి పాకింది. ఒక రైతు కూతురు వెన్నెల అనే అమ్మాయి చెవిలో కూడా ఈ వార్త పడింది. వెన్నెల చాలా తెలివైన పిల్ల. పున్నమిరోజు పుట్టిందని ఆ పిల్లకు వెన్నెల అని పేరు పెట్టారు. ఆ పిల్లను తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుతున్నారు. నేను కూడా రాజధానికి వెళతానని వెన్నెల మారాం చేసింది. అమ్మా నాన్నా వొప్పుకొన్నారు.

పున్నమిరోజు రానే వచ్చింది. జనం తండోపతండాలుగా రాజధానికి చేరుకొన్నారు. పండితులు, విద్యావేత్తలు, మేదావులు ఎక్కడెక్కడి నుంచో శాస్త్రాలు పట్టుకొని, పట్టుపంచెలు కట్టుకొని, శాలువాలు కప్పుకొని బయలుదేరి వచ్చారు. వెన్నెల కూడా వాళ్లమ్మా నాన్నలతో పాటు వచ్చింది. పున్నమి రోజు గదా వెన్నెల పిండారబోసినట్టుంది. జనం కిటకిటలాడుతున్నారు. అయినా చీమ చిటుక్కుమన్నా విన్పించేంత నిశ్శబ్దం. అందరూ రాజు ప్రశ్నకోసం ఎదురు చూస్తున్నారు.

రాజు ఇలా చెప్పాడు.

“ మహారాణి గారికి గుత్తి వంకాయ కూర తినాలన్పించింది. వెంటనే వంటవాడిని పిలిచింది. మసాలా బాగా వెయ్యి. ఘుమఘుమలాడేలా గుత్తి వంకాయ కూర చెయ్యి, అని ఆజ్ఞాపించింది. వంటవాడు రంగంలో దిగాడు. సన్నికల్లు మీద మాసాలా నూరుతున్నాడు. కూర వండకముందే వాసన గుబాళించేస్తోంది.

వంటవాడి కూతురు ఉయ్యాల్లో ఏడుస్తోంది. పొయ్యిదగ్గర వున్న నీళ్ళ గంగాళం పట్టుకొని వంటవాడి కొడుకు ఆడుకొంటున్నాడు. ఆ నీళ్ళు పడి మంటలు ఆరుతున్నాయి. వంటవాడికి ఎక్కడలేని కోపం వస్తోంది.

ఈ సంగతి వంటవాడి భార్య చూసింది. ఒరే పొయ్యి దగ్గరేం పనిరా? పొయ్యిలో పడ్డావంటే నీ చావు మూడుతుంది. జాగ్రత్త, అని వాణ్ణితిట్టి దూరంగా లాగింది.

ఎలాగైతేనేం గుత్తి వంకాయకూర తయారైంది. దాని రుచిని మహారాణిగారు మహదానందపడిపొయ్యారు. సంతోషం పట్టలేక ఆమె వంటవాణ్ణి పిలిచింది. బంగారుకాసులు బహుమానంగా ఇచ్చింది.

కథ బాగా విన్నారుగా. రాణీగారు వంటవాడికి ఎన్ని బంగారు కాసులిచ్చింది? ఇదీ ప్రశ్న. సమాధానం కథలోనే వుంది. ఎవరు జవాబు చెబుతారో చెప్పండి”. అని ముగించాడు రాజు.

పండితులందరూ తలలు గోక్కున్నారు. కొందరు చెత్త ప్రశ్న అన్నారు. కొందరు ఇదెక్కడా శాస్త్రంలో కన్పించి చావలేదు అని గొణుక్కొన్నారు. అనవసరంగా వచ్చి పరువు పోగొట్టుకొన్నాం అని కొందరు నసగసాగారు. జవాబు మాత్రం ఒక్కరైనా చెపితే ఒట్టు.

వెన్నెల వాళ్ళ నాన్న భుజాల మీది కెక్కి కథ బాగావింది. రాజా నేను చెబుతా అంటూ పెద్దగా అరిచి చేతులూపింది.

రాజు ఆప్యాయంగా ఆ పిల్లను దగ్గరికి పిలిచాడు. “చెప్పమ్మా జవాబు చెప్పు. పెద్దవాళ్ళే చెప్పనక్కరలేదు. తెలివిలో ఎవరు పెద్దయితే వాళ్ళే పెద్ద” అని పురమాయించాడు.

“రాజా ! రాణిగారిచ్చిన కాసులు వెయ్యిన్నూట పదహారు” అనింది వెన్నెల. రాజు ఆ పిల్లను దగ్గరకు తీసుకొన్నాడు. “శభాష్ ! చిన్నదానివైనా సరిగ్గా చెప్పావు అని సింహాసనం మీద కూడా కూచోబెట్టుకొన్నాడు.

అది సరేగానీ జవాబు ఎలా చెప్పగలిగావు అని వెన్నెలని అడిగాడు. రాజు.

జవాబు మీ కథలోనే వుంది రాజా. మసాలా వెయ్యిలో వెయ్యి వుంది. నూరుతున్నాడు లో నూరు వుంది. ఏడుస్తోందిలో ఏడు వుంది. ఆరుతున్నాయి లో ఆరు ఉంది. మూడుతుంది లో మూడు వుంది. మొత్తం కలిపితే 1116 గదా అంది వెన్నెల. ఈ సారి రాజుతోపాటు రాణి కూడా ఆశ్చర్యపోయింది.

రచన: కొండూరి వి. సన్యాలిరావు, జామి.

2.99350649351
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు