অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

బల్లి పడిన కూడు

బల్లి పడిన కూడు

lunchప్రభుత్వ పాఠశాల ప్రాంగణం నినాదాలతో మారుమ్రోగిపోతున్నది. పైగా తల్లితండ్రులు, నిరసన తెల్పుతున్నారు. వారి నినాదాలలో ఆవేశం, ఆక్రోశం కనిపిస్తున్నది. బల్లిపడిన అన్నం తమ పిల్లలకు పెట్టిన వారిని శిక్షించాలనే ఉద్వేగం, ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్పిస్తున్నది. (ప్రధానోపాధ్యాయుల గదిలోపల.)

డి.ఇ.వో: చెప్పండి సార్, సర్పంచ్ గారూ! ఈ సంఘటన ఎలా జరిగింది?

సర్పంచ్: (ఆవేశంగా) ఏం చెప్పేది సార్? పిల్లల ప్రాణాలంటే వీళ్ళకు లక్ష్యం లేదు.!

రఘురాం తాత: మా పిల్లలు పోతే!? వీళ్లేమైన తిరిగి తెస్తారా?

MRO: దయచేసి ఆవేశం తగ్గించుకోండి. ఏం జరిగిందో మాకు తెలియాలిగా?

రఘురాం: ఏం జరిగిందా? బల్లిపడిన కూడు మా బిడ్డలకు పెట్టారండీ!

సర్పంచ్: తప్పు చేయటమే కాదు, ఆ సైన్స్ సార్ దానిని కప్పి పుచ్చేందుకు ప్రయత్నించారండి.

గది చివరన అవమానంతో తలవంచుకొని నిల్చున్న జిల్లా వైద్యాధికారి:

మాస్తారూ! ఇలారండి. మధ్యాహ్న భోజన విషయంలో ఏం జరిగిందో? మాకు చెప్పండి!

సైన్స్ సార్: మధ్యాహ్నం నేను, పిఇటి సార్, హెచ్.యం గారు పిల్లలకు భోజన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నాం సార్! ఇంతలో ఓ పిల్లవాడు తట్టలో బాగా ఉడికి పోయిన బల్లిని చూపి ఏడ్వడం ప్రారంభించాడు.

డి.ఇ.వో: బల్లి ఏ వంటకంలో వచ్చింది?

హెచ్.యం: సాంబార్ లో...

డి.ఇ.ఓ: అప్పడు మీరేం చేశారు?

హెచ్.యం: తట్టలోని అన్నం పారవేయించాను. బల్లి పడిన సాంబారు. ఉడికిన బల్లిని ఒక మగులో పరీక్షల నిమిత్తం దాచివుంచి, మిగిలిన దానిని పారబోయించాను.

పి.ఇ.టి: ఆకలిగా వున్నపిల్లలందరికి అరటి పండ్లు తెప్పించి పెట్టించాం సార్!

సర్పంచ్: అరటి పండ్లు పెట్టారా? మాయమాటలు చెప్పతూ విషయం బయటకు పొకుండా జాగ్రత్త పడ్డారా? అడగండి సార్..!

హెచ్.యం: లేదండీ! సంఘటన జరిగన వెంటనే ఏరియా ఆసుపత్రి డాక్టర్ కు,108కు ఫోన్ చేశామండి. డి.ఇ.ఓ గారికి, యం.ఇ,ఓ గారికి కూడా విషయం తెల్సామండి.

పి.ఇ.టి: గ్రామంలోని ఆర్.యం.పి డాక్టర్ ను తీసుకొని వచ్చి ప్రథమ చికిత్సకూడా చేయించాం సార్!

డి.ఇ.ఓ: ఔను! నాకు సంఘటన జరిగిన వెంటనే ఫోన్ వచ్చింది.

రఘురాం: హెచ్.యం. గారూ! మేం మిమ్మల్ని తప్పపట్టలేదండి.! ఆ సైన్స్ సారే పిల్లలను గుంపచేర్చి తలా ఒక వక్క ఇచ్చి బుగ్గన పెట్టుకోండి, వాంతులు కావని మూర్ధంగా చెప్పాడండి. సర్పంచ్:- బల్లి పడిన అన్నం తిన్నా,విషం ఎక్కదని పిల్లలకు మాయమాటలు చెప్పాడండి.

జిల్లా వైద్యాధికారి: సైన్స్ సార్ గారూ! ఇలా వచ్చి నాప్రక్కన కూర్చోండి. (భయపడుతూ... మౌనంగా కుర్చీలో కుర్చున్నాడు.) బల్లి పడిన ఆహారం విషం కాదని ఎలా చెప్పగలిగారు?

సైన్స్ సార్: నేను జంతుశాస్రంలో పి.హెచ్.డి చేశానండి. కాలేజీ రోజులలోనే ఒక సైన్స్ మాసపత్రికలో ఇంటి బల్లికి విషంలేదని చదివాను.

రఘురాం: పాములా కోరలు, విషపు గ్రంథులు వున్నాయని కాదుసార్, అదిపడిన ఆహారం తింటే విషతుల్యం కదా!

సైన్స్ సార్: అలా కూడా అవకాశం లేదండి, కోడి, పిల్లిలాంటి జంతువులు బల్లినిపట్టి తింటాయి కదా? అవి చనిపోలేదే?

డి.ఇ.వో: అవునూ! అవి చనిపోవు కదా?

సర్పంచ్: సార్! ఈయన మిమ్మల్ని కూడా మాయ చేస్తున్నాడండి. బల్లి పడిన తిండి తిని మంచాన పడిన వారిని, వాంతులైన వారిని ఎందర్ని చూడలేదు!

జిల్లావైద్యాధికారి: బల్లి పడిన ఆహారం తింటే ఎందుకు వాంతులవుతాయో కూడా మీరే చెప్పండి మాస్టారు. (చిన్న నవ్వుతో ప్రోత్సహిస్తూ.)

సైన్స్ సార్: బల్లి నిశాచరం. అది రాత్రి సమయాలలో ఆహార సంపాదనకై తిరుగుతుంది. పగటిపూట ఎండ తగలని, చీకటి, మరుగు ప్రదేశాలలో వుంటుంది. (గదిలో అందరూ శ్రద్ధగా వింటున్నారు. గది బయట ప్రజలు ఈ రోజుతో సైన్స్ సార్ పని అయిపోయిందని చెప్పుకొంటున్నారు.) సూర్యకాంతి పడక సాల్మొనెల్లె రకానికి చెందిన బ్యాక్టీరియా దాని చర్మంపై విపరీతంగా పెరిగి వుంటుంది. ఈ బ్యాక్టీరియా ఆహారంలో కలిస్తే ఆహారాన్ని కలుషితం చేసి, తిన్నవారికి వాంతులు, విరేచనాలు కల్లిస్తుంది.

సర్పంచ్: ఇప్పడు చిక్కావు సార్.! మా పిల్లలకు అలాంటి వాంతులే అయితే ప్రమాదం కాదా

సైన్స్ సార్: లేదండి! మన పిల్లలకు అలాంటి వాంతులు కూడా వచ్చే అవకాశంలేదు.

రఘురాం: వాంతులు ఎందువల్ల కావండి ? (దబాయిసూ అడిగారు.)

సైన్స్ సార్: బల్లి సాంబర్లో పడి బాగా ఉడికిపోయింది. ఆ ఉష్ణోగ్రత వద్ద ఏ బాక్టీరియా కూడా బ్రతికే అవకాశం లేదండి.

విద్యా కమిటీ సభ్యురాలు: మరి ఇద్దరు పిల్లలకు వాంతులైనాయి కదా!

సైన్స్ సార్: పిల్లల్లో కొందరు సున్నిత మనస్కులుంటారు. వారికి బల్లి పడిన ఆహారం అనే భావన మానసిక వికారాన్ని కల్గించి వాంతులు తెప్పించాయనుకొంటాను.

రఘురాం: బుగ్గన పచ్చి వక్క పెడితే విషప్రభావం హరిసుందా? ఇదెక్కడి వైద్యము మాస్టారు?

జిల్లా మెడికల్ ఆఫీసర్: రఘురాం గారూ! మీకు నేను సమాధానం చెపుతాను. ఏదైనా ప్రాణాపాయం వుందనే సందేహం ఒక గుంపుగా వున్న వారందరికి ఒకేసారిగా కలిగితే అది "మాస్ ఫోబియా" అనే ఒక మానసిక ఉన్మాద స్థితికి తీసుకొని పోతుంది.

సైన్స్ సార్: అవును సార్! పిల్లల్లో చాలా మంది కలుషిత ఆహారం తిన్నారు. అందరు మానసికంగా భయానికిలోనైతే వారందరికీ వాంతులై మంచాన పడేవారు.

డి.ఇ.వో: అంటే వక్కలో ఏ మందులేదు, పిల్లల మానసిక స్థైర్యం పెంచడానికి చప్పరించమన్నారా?

సైన్స్ సార్: ఔనండి! బడి సమీపంలోని కొట్టులో చప్పరించడానికి వాలుగా వక్కలు మాత్రమే అందరికీ సరిపడే చిక్కాయి. అందుకనీ...

సర్పంచ్: పిల్లల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాల్సిన పనిలేదా?

హెచ్ యం: డాక్టర్ పరీక్షించాక పిల్లలను జట్లుగా చేసి ఉపాధ్యాయులను తోడిచ్చి పంపి, వారి ద్వారా తల్లిదండ్రులకు విషయం తెలియచేశానండి.

జిల్లా మెడికల్ ఆఫీసర్: ఏరియా డాక్టర్ గారూ! మీ వద్ద ఎవరైనా పిల్లలు ఇంకా ట్రీట్మెంట్ తీసుకొంటున్నారా?

ఏరియా డాక్టర్: లేదండీ! సైన్స్ సార్ ఉపన్యాసమే వారికి మందయింది.

జిల్లా వైద్యాధికారి: సైన్స్ మాస్టారూ! మంచి పని చేశారు. కాని ప్రతి బల్లి విషయంలో వక్కల వైద్యం పనిచేయదు, జాగ్రత్త!

రఘురాం: అంటే కొన్ని బల్లులు విషమైనవనే కాదా సార్

జిల్లా వైద్యాధికారి: దక్షిణ, తూర్పు ఆసియా ప్రాంతాలలోని గైకో అనే బల్లి పూర్తిగా విషరహితమైనదే. కానీ, అమెరికా, మెక్సికో అడవులలో కొన్ని బల్లలను తాకినా, తిన్నా తాత్కాలికంగా పక్షవాతం లాంటి జబ్బులకు గురి అవుతారు. 'ఎలిగేటర్' అనే బల్లి లాలజలంలో రక్తం గడ్డకట్టనీయకుండా చేసే ఎంజైములుంటాయి.

సైన్ సార్: మన ప్రాంతంలో ఉండే 'ఆంక్చికా" అనే చింత బల్లలను ఇబ్బంది పెడితే అవి కరుస్తాయి. కానీ మనిషి చర్మానికి గాయం చేసే శక్తి వాటికి ఎట్లాగూ లేదు.

రఘురాం: అంటే ప్రమాదం లేదన్నమాట!

సర్పంచ్: బల్లి టిక్, టిక్, టిక్ అంటే మనం చెప్పే విషయం నిజమనీ... జరిగి తీరుతుందనీ.. అంటారే!?

సైన్ సార్: మీరు గమనిస్తే బల్లి అరిచిన ప్రతిసారి టిక్, టిక్, టిక్ అంటుంది. బెంగాళీ లో టిక్ సత్యం అని, 3 సార్లు చెప్పింది సత్యం అని చెప్పడం వలన, ఈ మూధాచారం బెంగాలు నుండి, భారత దేశం అంతా ప్రబలంగా వ్యాపించింది.

సర్పంచ్: బల్లి మూత్రం పోస్తే ముఖం మీద దద్దుర్లు వస్తాయి కదా!?

సైన్స్ సార్: అది అలర్జీ వల్ల వచ్చినవే కాని బల్లి మూత్రం వల్ల వచ్చినవి కాదండి. ఇండోనేషియాలో అయితే బల్లి మూత్రం పడితే కుష్టువ్యాధి వస్తుందనే అపోహ వుంది. అంతెందుకూ, బతికి ఉన్న చిన్న చిన్న బల్లలను పట్టుకొని గుటుక్కున మింగే పిల్లవాడొకడు నాకు తెలుసు. అలాగని అందరు ఇలా చేయడం కూడా మంచిది కాదు.

డి.ఇ.వో: విచారణాధికారిగా నేను సైన్స్ ఉపాధ్యాయుడిని అభినందిస్తున్నాను. వంటగది పారిశుద్ధ్యతను పర్యవేక్షించని ప్రధానోపాధ్యాయుడిని మందలిసూ తగిన వివరణ ఇవ్వవలసిందిగా షోకాజ్ నోటీస్ ఇస్తున్నాను. విధులపట్ల అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వంట ఏజెన్సీ వారిని తక్షణం విధుల నుండి తొలగిస్తున్నాను.

సర్పంచ్: ధన్యవాదాలు సార్!(రఘురాం తాత సైన్స్ మాస్టర్ భుజం మీద చేయివేసి బయటకు నడుసూ)

తాత: చిన్నప్పటి నుండి నాకన్ని విషయాలు తెల్చుననే పొగరు వుండేది మాస్టారూ! కాని, మిమ్మల్ని చూసిన తరువాత "ఈ లోక్షంలో అన్నీ తెల్సిన మేధావి ఎవడూ లేడనీ.... ఏమీ తెలియని మూరుడూ లేడని" తెల్చుకొన్నాను.

సైన్ సార్: పిల్లలు క్షేమంగా వున్నారు. నాకదిచాలండి. (గదిలో జరిగిన విషయాలు సభాముఖంగా అందరికి చెప్పడానికి ఏర్పాట్లు చేసుకొంటూ, అంతా బిజీ బిజీగా వున్నారు.!)

(గమనిక: బల్లి కండరాలు చాలా మృదువు. ఉడికిన బల్లి కండరాల ప్రోటీన్లకై అన్నం, కూరలు చల్లారితే బ్యాక్టీరియాలు తొందరగా దాడి చేసి ఆహారాన్ని విషతుల్యం చేస్తాయి. ఆహారం చల్లారి ఎంత సేపు అయ్యిందో తెలియదు కాబట్టి బల్లి పడిన ఆహారాన్ని తినకపోవడమే మంచిది. ఈ రచన ఉద్దేశ్యం బల్లిపడిన ఆహారం మీద ఉన్న అపోహలు తొలగించటానికి మాత్రమే. బల్లిపడ్డా సరే ఆ ఆహారాన్ని ఆరగించమని చెప్పటానికి కాదు. — సంపాదకులు)

రచన: జి. చంద్రశేఖర్, సెల్. 9494746248© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate