অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మావుళ్ళమ్మ జాతర

మావుళ్ళమ్మ జాతర

dec10వంగపాడు మండల కేంద్రానికి దాదాపు ఓ 20 కి.మీ. దూరంలో, అడవి సమీపాన దుమ్ముగూడెం గ్రామం ఉన్నది. అక్కడి వారంతా నిరక్షరాస్యులే. చదువు విలువ అస్సలు తెలియదు. అడవి తల్లిని నమ్ముకుని బ్రతికే వారే. కట్టెలు, తేనె తుట్టెలు, కుంకుళ్ళు లాంటివి కాలినడకన పిఠాపురం తెచ్చి అమ్ముకుని బ్రతకడం. మేకలు, గేదెలు, ఆవులు లాంటి పశువులను మేపుకుని అమ్ముకోవడం. గూడెంలోని ఓ ఊట ఉన్న దిగుడు బావి లాంటి కుంట వారికి నీటి అవసరాలు తీర్చేది. స్వాతంత్ర్యం వచ్చి అరవై ఏండ్లు దాటినా కూడా... ఇప్పటికీ కాలిబాట తప్ప రహదారి సౌకర్యాలు లేవు. విద్యా, వైద్య సదుపాయాలు అంతకన్నా లేవు. ఏ సరుకులు కావాలన్నా, చదువు కావాలన్నా పట్నం రావాల్సిందే. చిన్న చిన్న జబ్బులకు వారే నాటువైద్యం చేసుకుంటూ ఉంటారు. వాటి వలన జబ్బు పడ్డవారికి ఆయువు ఉంటే బ్రతుకుతారు. లేకుంటే వైకుంఠయాత్రే, కాన్పులు లాంటివి కష్టమైతే ఆ తల్లుల జీవితాలంతే. ఒకవేళ పట్నం తెద్దామని జోలెలు కట్టుకుని ప్రయత్నించినా, ఏ ఒక్కరికో అదృష్టం దక్కుతుంది.

ఎన్నికల సమయంలో తప్ప ఆ ఊరిని ఏ విషయంలోనూ తలుచుకున్న అధికారులు గానీ, పెద్దలు కానీ లేరు. వారికి ఏం జరిగినా పట్టించుకునే నాథుడే లేదు. ఏదైనా పెద్ద కష్టం వస్తే పురాతన కాలం నుంచీ అక్కడ కొలువై ఉన్న మావూళ్ళమ్మ తల్లికి జాతర చేస్తారు. జాతర చేస్తే కష్టాలు తీరతాయని వారి నమ్మకం. మావూళ్ళమ్మ అంటే, ఆ గూడెం చివర్లో పెద్దలు ఏర్పరచుకున్న ఓ పెద్దరాయి. అక్కడ జంతుబలులు ఇస్తూ ఉంటారు.

వంగపాడు వైద్యశాలకు కొత్తగా డా. శ్రీనివాసరావు గారు వచ్చారు. పేదల పట్ల దయ ఉన్నవారు. వృత్తికి అంకితమై పని చేసేవారు. వారి మంచితనం, వైద్యం వలన అనతి కాలంలోనే వారికి మంచి పేరును తెచ్చి పెట్టింది. అలాగే తన వైద్యం అవసరమని భావిస్తే ఎంత దూరమున్న గ్రామానికైనా స్వయంగా వెళ్లి చికిత్సలు పరిపాటి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ప్రజలందరికీ పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవం. అంతేగాక, వీలును బట్టి మండల పరిధిలోని ఒక్కో గ్రామానికి ఒక్కోరోజు వెళుతుంటారు. వెళ్లినప్పుడు అక్కడి స్థితిగతులనూ పరిశీలించడం, రోగాల బారిన పడకుండా ప్రజలకు కౌన్సిలింగ్లు ఇస్తూ కూడా ఉంటుంటారు.

ఒకసారి, ఉన్నట్లుండి.. గూడెంలో ప్రజలకు వాంతులు, విరేచనాలు ఎక్కువే అనేకమంది మంచాన పడ్డారు. ఒకరిద్దరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఆ భయంతో గూడెపోళ్ళంత గూడెం పెద్ద దగ్గరికెళ్ల, “దణ్ణాలు దొరా! కట్టాలొచ్చె. కాపాడు దొర. కూనా, గుడ్డు, పెద్ద,... అందరికీ ఏటేపోనాదొ ఎరుకైతలేదు దొరా! కాపాడాల." అంటూ మొర పెట్టుకున్నారు.

ఆయన, “అమ్మోరి బొమ్మ. ఏటోతది. అమ్మోరు కన్నెర్ర జేసినాది గంద. జాతరను ఒగేసి ముప్పేటయ్యింది. ఇట్టగే ఉంటది జాతర సేకుంటే. నా పలుకింటిరా, పానాలు ఒగ్గకుండాలంటే జాతర సేయాల. గూడుకో జంతును బలియ్యాల. అప్పుడే అమ్మోరు శాంతడేది." అన్నారు.

“ఓ దొర. ఈతూరి నీ మాటొగ్గం దొర. నీ వెట్టారంటే అట్టగే..కాపాడు సామి. కాపాడు దొర." అని అందరూ ముక్త కంఠంతో సరేనన్నారు. “ఏ పొద్దు సేయాలో పలకండి దొర." అంటూ అడిగారు.

“నాల్రోజుల్లో పున్నమేల, నట్ట నడిజాములో బలియ్యాల. ఈ దొరకు కానుకలిచ్చుకోవాల. ఆపూటే జంతు బలియ్యాల." అన్నాడు. “దండోలు దొర. అట్టే.. ఒట్టే.." అంటూ ఎళ్లిపోయారు..

జాతర జరిగింది. మరణాల సంఖ్య పెరిగింది. ఆనోట ఈనోట వంగపాడు డాక్టరు గారి పేరిన్న కొందరు జబ్బు చేసిన వారిని తీసుకురాసాగారు. వచ్చిన వారికి చికిత్స చేసి నయం చేశారు డాక్టరుగారు. విషయం తెలిసి అక్కడి ప్రజలు ఒక్కొక్కరిగా చికిత్సకు రాసాగారు. అనుమానం వచ్చిన డాక్టరు శ్రీనివాసరావు గారు ఆరా తీస్తే విషయం తెలిసింది. వెంటనే తన సిబ్బంది, మందులతో కాలినడక పై ఆ గూడెంకు పయనమయ్యారు. పరిస్థితిని గమనించి, సిబ్బందికి తగిన సూచనలు, జాగ్రత్తలు తెలిపి, గూడెంలో చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు.

ఓవైపు సిబ్బందితో చికిత్సలు అందిస్తూ గూడెం పరిసరాలను పరిశీలించారు. అక్కడే ఉన్న కుంటలోని నీటిని అన్నిరకాల పనులకు వాడుతున్నట్లు గమనించారు. గూడెంలోని చెత్త చెదారాలు కూడా అక్కడే వేసియుండడం గమనించారు. వెంటనే ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించారు. తగిన ఆర్ధిక సాయం అందించేలా వంగపాడు పెద్దలతో మాట్లాడారు. గూడెం ప్రాంతమంతా బ్లీచింగ్ చేయించారు. ప్రతి ఇంటినీ పరిశుభ్రం చేయించారు. అక్కడి ప్రజలకు కౌన్సిలింగ్ ఇస్తూ, పట్టణంలోని ఎన్.సి,సి. విద్యార్థులను పిలిపించారు. వారికి శిబిరాలు ఏర్పాటు చేయించారు. వారం రోజుల్లో పరిస్థితిని చక్కదిద్దారు.

ఆపై డాక్టరు గారు చొరవ తీసుకుని అక్కడి ప్రజలు చేస్తున్న జాతరలను కూడా ప్రజల సహకారంతో ఆపించి వేశారు. కాదన్న దొరను కటకటాలకు పంపించారు. సంవత్సరం తిరగకుండానే దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో వంగపాడు నుండి గూడేనికి మట్టి రహదారి వేయించారు. అక్కడి ప్రజల నిరక్షరాస్యతే మూఢ నమ్మకాలకు కారణమని గ్రహించారు. ప్రభుత్వముకు విషయాన్ని తెలిపి పాఠశాల, నీటి వసతులకు బోరింగ్ పంపులు మొదలగునవి ఏర్పాటు చేశారు. ఇప్పుడక్కడ మావూళ్ళమ్మ ఎవరో ఎవరికీ తెలియదు.

నాటి నుండి అది “శ్రీనివాసనగర్" గా మారిపోయింది. అక్కడి వారందరికీ డా. శ్రీనివాస్ గారే దేవుడు.

ఆధారం: మద్దిరాల శ్రీనివాసులు© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate