অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మున్నూరేండ్ల లిన్నేయస్

మున్నూరేండ్ల లిన్నేయస్

ముఖ చిత్ర కథ

273.jpgమీ పేరేమిటి ? ఏ ఊరు మీది ? అని ఎవరో, ఒకరు, ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని అడిగే ఉంటారు... మీకు పేరెవరు పెట్టారు ?

అసలు పేర్లెందుకు పెడతారు ? పేర్లు కేవలం మనుషులకేనా ? జంతువులకు కూడా ఉంటాయా ? చెట్లూ చేమలక్కూడ పేరల్లు పెడతారా ? అసలు దేని కయినా పేరు అవసరం ఏమిటి ? పేరుతో ప్రయోజనం ఏమైనా ఉందా? ఇలా ఆలోచించారా ఎప్పుడైనా ? అలా ఆలోచన చేసి దానికొక శాస్త్ర రూపాన్నిచ్చిన వాడు కరోలియస్ లిన్నేయస్ అనే స్వీడన్ శాస్త్రవేత్త.

మానవజాతి మనుగడకు మూలం మొక్కలు. మన ఆహారంకోసం, మందులకోసం వాటిని గుర్తుపట్టటం, వాటిని ఉపయోగించుకోవటం మొక్కలను గుర్తు బట్టటంలో మనిషి పడిన కష్టాలు అన్నీ ఇన్నీకావు. ఒక ప్రాంతంలో ఒక మొక్కను ఒక రకంగా పిలిస్తే, అదే మొక్కను వేరే దేశంలో, భాషలో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఇలా ఒకే మొక్కకు లెక్కకు మిక్కిలి పేర్లు. జంతువుల విషయంలో కూడా ఇదే కథ. ఏదేశంలోనైనా, భాషతో నిమిత్తం లేకుండా ఒక మొక్కను కాని, జంతువునుకాని, ప్రపంచం అంతా ఒకే పేరుతో పిలిచే పద్ధతి ఒకటి కావాలి. అటువంటి విధానాన్ని ప్రవేశపెట్టి మొక్కలు, జంతువులకు శాస్త్రీయంగా పేర్లు పెట్టినవాడు కార్ల్ లిన్నేయస్. స్వీడన్ దక్షిణ ప్రాంతంలో 1707, మే 23 వ తేదీన నీల్స్ ఇంగెమార్సన్ దంపతులకు జన్మించాడు కార్ల్ లిన్నేయస్.

కార్ల్ లిన్నేయస్ త్రిశత జయంతి సంవత్సరం 2007. 77 ఏళ్ళ పాటు జీవించిన కార్ల్ లిన్నేయస్ శాస్త్ర ప్రపంచంలో తనదైన విశిష్టతను చాటుకున్నాడు. కార్ల్ లిన్నేయస్ పేరు లేకుండా ఓ మొక్క లేక ఓ జంతువు పేరు వ్రాయటం సాధ్యం కానంతటి విశిష్టత ఆయనది. అందుకు ప్రధానకారణం కార్ల్ లిన్నేయస్ ప్రవేశపెట్టిన జంట పేర్ల పద్ధతి. దాన్నే శాస్త్ర ప్రపంచంలో ద్వినామీకరణ విధానంగా పేర్కొంటారు. మనకు ఇంటిపేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉన్నట్లే...

చిత్రం ఏమిటంటే ఈ పేర్ల బాధ కార్ల్ లిన్నేయస్ నూ వదిలిపెట్టలేదు. అతనవి అసలు పేరు కార్ల్.ఇంటి పేర్లంటూ స్వీడన్ లో ఆ రోజుల్లో ప్రత్యేకంగా ఉండేవికావు. కార్ల్ ను లుండీ స్కూల్లో చేర్చేటప్పుడు తండ్రి నీల్స్ ను ఇంటిపేరేమిటని అడగటంతో అప్పటికేదో ఆలోచించి లిన్నేయస్ అని చెప్పాడట. దానితో కార్ల్ లిన్నేయస్ గా జంట పేర్లు సంపాదించుకున్నాడు. కార్ల్ లిన్నేయస్ తండ్రి ఒక మత గురువు. లూథరన్ పాస్టర్. తమ కొడుకును కూడ తనలాగే పాస్టర్ ను చేయాలనుకున్నాడు. కార్ల్ మత విషయాల పట్ల బొత్తిగా శ్రద్ధ కనబరచక పోవటంతో తండ్రి నిరాశపడ్డాడు. పూవు పుట్టగానే పరిమళిస్తందన్నట్లు కార్ల్ లిన్నేయస్ కు చిన్నతనం నుండీ మొక్కలంటే ప్రాణం. వాటికి పేర్లు పెట్టడం ఒక హాబీ. అందుకే కార్ల్ ను తండ్రి వైద్య శాస్త్రం చదవటానికి లుండీ యూనివర్శిటీలో చేర్చాడు. ఆ రోజుల్లో మొక్కల గురించి నేర్చుకోవటం వైద్యశాస్త్ర అధ్యయనంలో భాగంగా ఉండేది. ప్రతి వైద్యుడు మొక్కల్నుండి మందులు తయారుచేయటం, వాటితో వ్యాధి నివారించడం వైద్య విద్యలో నేర్చుకునేవారు. లుండీ యూనివర్శిటీలో బొటానికల్ గార్డెన్ సర్గిగా లేకపోవడంతో లిన్నేయస్ ఉప్పసలా విశ్వవిద్యాలయానికి మారాడు.

275.jpgమొక్కల అన్వేషణలో వివిధ ప్రాంతాలను సందర్శించటం, కొత్తకొత్త మందు మొక్కలను సేకరించటంలో ముందుండేవాడు లిన్నేయస్. తాను అధ్యయనం చేసిన మొక్కలపై 11 పేజీల సిద్థాంత వ్యాసం సిస్టమా నేచురీ రాసి 1735 లో లిన్నేయస్ తన డాక్టరు కోర్సును పూర్తి చేసాడు.

ఇలా ఒక చిన్న కరపత్రంలా ప్రారంభమైన సిస్టమా నేచురే లిన్నేయస్ పరిశోధనల ఫలితంగా పలు సంపుటాలుగా వెలువడింది. 1758 లో 10 వ సంపుటి వచ్చే నాటికి 4,400 జంతుజాతులను, 7,700 వృక్షజాతులను వర్ణించాడు. ప్రపంచం నలుమూలల నుండి మొక్కలను గుర్తించటానికి నమూనాలను లిన్నేయస్ కు పంపేవారు. లిన్నేయస్ ద్వినామాకరణ పద్ధతికి శాస్త్ర హోదా కల్పించడమే కాక మొక్కలను ఒక క్రమ పద్థతిలో వర్గీకరించే విధానాన్ని ప్రవేశపెట్టాడు. తన వర్గీకరణకు జీతిని ఆధారంగా తీసుకున్నాడు. వేలాదిగా ఉండే ఒకేరకం మొక్కలను ఒక జాతిగా నిర్ధారించాడు. మొక్కల జాతులు వాటి మధ్య చూపించే సారూప్యాన్ని. అంటే పోలికలను ఆధారం చేసుకుని వాటిని ఒక ప్రజాతిగా నామకరమం చేశాడు. ఇలాగే ఆయా ప్రజాతుల మధ్య ఉన్న సారూప్యతను ఆదారం చేసుకుని వాటిని కుటుంబాలుగా ఏర్పరచాడు. పోలికలున్న కుటుంబాలన్నింటినీ కలిపి ఒక క్రమంగా కొన్ని క్రమాలను ఒక చోట చేర్చి తరగతిగా పేర్కొన్నాడు. ఈ విధంగా సమాన లక్షణాలను పంచుకునే మొక్కల ప్రజాతులను అంచెలంచెల వర్గీకరణగా ఏర్పరచాడు. 300 ఏండ్లు గడచినా, విజ్ఞాన శాస్త్రంలో ఎన్నెన్నో మార్పులు చోటుచేసుకున్నా నేటికీ లిన్నేయస్ ప్రవేశపెట్టిన మౌలిక వర్గీకరణకు ఢోకాలేదు. 274.jpgదానిలో చేర్పులు, మార్పులు అభివృద్ధి జరిగాయేకాని ప్రాథమిక వర్గీకరణ విధానంలో మార్పు చేసే అవసరం రాలేదంటే అదెంత శాస్త్రీయమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయనను వర్గీకరణ శాస్త్ర పితామహుడిగా పిలుస్తారు. లిన్నేయస్ వర్గీకరణకు మొదటిసారిగా లైంగిక లక్షణాలను ఆధారం చేసుకున్నాడు. ఆనాటి ప్రకృతి శాస్త్రవేత్తలైన ఎరాస్మన్, డార్విన్ లాగే అప్పడప్పుడే మొక్కల్లో కనుగొన్న లైంగిక ప్రత్యుత్పత్తికి లిన్నేయస్ కీలక ప్రాధాన్యతనిచ్చాడు. పువ్వుల్లో ఉండే స్త్రీ, పురుష పుష్ప బాగాల లక్షణాల్లో కనపడే సారూప్యత లిన్నేయస్ వర్గీకరణ మూలం.

276.jpgలిన్నేయస్ తన ద్వినామకరణ పద్ధతి ద్వారా వర్గీకరణను సులభతరం చేశాడు. లిన్నేయస్ కంటే మాట్లాడినా లిన్నేయస్ తోనే అది శాస్త్రప్రపంచంలో నిలదొక్కుతుంది. అన్ని రకాల మొక్కల వర్గీకరణకు మూలగ్రంథం. స్పెసీస్ ప్లాంటేరమ్ 1753 లో వెలువరించాడు. మొక్కల లైంగిక లక్షణాల, జంతుజాతుల స్వరూప స్వభావాల్లో సారూప్యత వర్గీకరణకు ఆధారంగా తీసుకున్నా జీవుల్లో వైవిధ్యతను కూడ వివరించే ప్రయత్నం లిన్నేయస్ చేశాడు. హామో సేపియన్లుగా పిలువబడే మానవజాతిలో కనిపించే ఖండాంతర వైవిధ్యాన్ని వివరించటానికి మనిషిని రేస్ Concept ను లిన్నేయస్ ప్రవేశపెట్టాడు. మనిషిని కోతులు, చింపాజీలతో కలిపి ప్రైమేట్ల వర్గంలో చేర్చటం అప్పటి మత పెద్దలకు మింగుడు పడలేదు. లిన్నేయస్ పరిశోధనలు మతాధికార్ల బోధనలకు విరుద్ధంగా ఉండటంతో లూధరన్ ఆర్బిబిషప్ దూషణ భూషణలకు లిన్నేయస్ గురికావల్సి వచ్చింది.

శాస్త్ర పరిశోధనలు లిన్నేయస్ ఆత్మవిశ్వాసాన్ని ఎంతగా పెంచాయంటే - ఒకానొక దశలో ఆయన దేవుడు సృష్టించాడు, లిన్నేయస్ దాన్ని క్రమ పద్ధతిలో అమర్చుతున్నాడనే వరకూ వెళ్లింది. ఆ అర్థం వచ్చేట్లుగా Systema Naturae పై ముఖచిత్రాన్ని వేయించాడు కూడ.

పరిణామశీలి

లిన్నేయస్ పరిణామ వాదా అంటే అవుననే చెప్పకోవాలి. నిజానికి లిన్నేయస్ జాతులు ఏ మార్పులూ చెందకుండా స్థిరంగా ఉండేవని భావించాడు. అందుకే జాతిని తన వర్గీకరణకు ఆధారంగా తీసుకున్నాడు కూడ, కాని ఆ తర్వాత తను చేసిన పరిశోధనలు, సంకరం చేయటం ద్వారా జాతులు, ప్రజాతులు మార్పు చెందుతాయని గ్రహించి తన అభిప్రాయాలను మార్చుకున్నాడు. బాహ్య వాతావరణం కూడ ఆ మార్పుకు దోహదం చేస్తుందని ఆనాడే చెప్పాడు.

ప్రకృతిలో సమతుల్యతకు జీవుల మధ్య పోరాటం, పోటీ రెండూ అవసరమనే పరిణామ శాస్త్ర సూత్రాలను ముందుగానే గుర్తించినవాడు లిన్నేయస్. లిన్నేయస్ శాస్త్రీయ దృక్పథానికి ఇవి తిరుగులేని ఉదాహరణలు.

స్ఫూర్తిదాత

1741 లో ఉప్పసలా విశ్వావిద్యాలయంలో ప్రొఫెసర్ గా చేరిన లిన్నేయస్ యూనివర్శిటీ బొటానికల్ గార్డె న్ ను పునరిద్దరించడమేకాదు. స్వీడన్ నలుమూలల నుండి మొక్కల్ని సేకరించి తన వర్గీకరణ పరంగా క్రమపద్ధతిలో అమర్చాడు. తన బోధనల ద్వారా తరతరాల విద్యార్థులకు స్ఫూర్తిదాతగా నిలిచాడు. ప్రపంచ వృక్ష సంపదను కనుగొన్న పలు నౌకాయాత్రల్లో లిన్నేయస్ విద్యార్థులు 19 మంది పాల్గొన్నారు.

కెప్టెన్ జేమ్స్ కూక్ తొలి ప్రపంచయాత్రలో పొల్గొని ఆస్ట్రేలియా నుండి మొట్టమొదటి మొక్కను సేకరించిన డానియల్ సొలాండర్, లిన్నేయస్ శిష్యబృందంలో సుప్రసిద్ధుడు. ఆ మాట కొస్తే ప్రపంచంలోని వివిధ ఖండాల్లోని మొక్కలను సేకరించి అధ్యయనం చేసిన తొలితరం వృక్ష శాస్త్రజ్ఞులంతా లిన్నేయస్ శిష్యులే..

అతిశీతల వాతావరణంలో పెరుగగల ఎన్నో రకాల మొక్కల్ని పరిశోధించి పెంచటం ద్వారా స్వీడన్ దేశ ఆర్ధిక స్వావలంబనకు, వాణిజ్య అభివృద్ధికీ ఎంతగానో తోడ్పడ్డాడు. ఇన్నీ చేస్తూ కూడా తన వైద్య వృత్తిని వీడలేదు. అందుకే స్వీడిష్ రాచకుటుంబానికి వ్యక్తిగత వైద్యుడుగా నియమించబడ్డాడు.

1758 లో ఉప్పసలా పరిసరాల్లో ఒక ఎస్టేట్ ను కొని తాను సేకరించిన మొక్కలతో ఒక మ్యూజియాన్ని, ఒక లైబ్రరీని ఏర్పరిచాడు. ప్రసిద్ధ బ్రిటిష్ ప్రకృతి చరిత్రకారుడు సర్ జేమ్స్ స్మితి సహాయంతో లిన్నేయస్ సొసైటీ ఆప్ లండన్, ను ఏర్పాటు చేశాడు.

1761 లో స్వీడన్ ప్రభుత్వం లిన్నేయస్ సేవలకు గుర్తింపుగా Nobility ఇచ్చి సత్కరించటంతో కరోలియస్ లిన్నేయస్, కార్లావొన్ లిన్నే(Carlvon Linne) గా మారాడు. ఈ భూగోళం పై ఉన్న సకల జీవరాసులకు ఒక శాస్త్రీయనామం ఉండాలని, ద్వినామీకరణ పద్ధతినిచ్చిన లిన్నేయస్ కూడ చివరకు పేర్ల గొడవ తప్పులేదు. సుమండీ.... చిన్నప్పటి కార్ల్ లిన్నేయస్, పెద్దయి కరోలియస్ లిన్నేయస్ అయినాడు. ప్రసిద్ధుడై, ప్రపంచ గౌరవాన్ని పొంది కార్లా వొన్ లిన్నే గా మారాడు విచిత్రంగా లేదూ....

రచయిత: డా. కట్టా సత్యప్రసాద్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate