অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వాహనం ముద్దు డ్రైవర్ వద్దు

వాహనం ముద్దు డ్రైవర్ వద్దు

nov04.jpgప్రపంచ ఆరోగ్య సంస్థ రహదారుల భద్రతకు సంబంధించి తొలిసారి ప్రచురించిన నివేదిక ప్రకారం ప్రతి 25 సెకన్లకు ఒకరు రహదారి ప్రమాదాలలో చనిపోతున్నారు. అతివేగము, తాగి వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని కారణంగా, పిన్న వయస్సులో వాహనాలు నడపడం లాంటి కారణాలే ఈ ప్రమాదాలకి మూలం. 99% రహదారి ప్రమాదాలకు కారణం మద్యం సేవించిన డ్రైవర్లే అని ప్రకటించారు. అంటే దాదాపు 90% వాహన ప్రమాదాలకు ఆయా వాహనాలను నడిపిస్తున్న డ్రైవర్ల ప్రవర్తనే కారణం అనేది ఋజువయ్యింది. దీనికి పరిష్కారం ఏంటి?

ప్రయాణికుల భద్రత ప్రధాన అంశం అయినప్పుడు ఇస్మాయిల్ జోడి, హెషమ్ రేఖ లాంటి యువశాస్త్రవేత్తలకు డ్రైవర్ లేని వాహనం పరిష్కారంగా కనిపించింది. సమీప భవిష్యత్తులో కారుని మీరు నడిపించడం కాదు కారే మిమ్మల్ని నడిపిస్తుంది అని జోడి అంటున్నాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ! చోదకుడు లేని వాహనం అనే సమస్య సార్వత్రిక సమస్యగా మారి అనేక దేశాలలో దీనిపై పరిశోధనలు ఊపందుకొన్నాయి.

అదొక చిరు దేశం, దాని విస్తీర్ణం కేవలం 716 చ.కి.మీ. ఆ దేశ జనాభా సుమారు 55 లక్షలు. మనదేశ తలసరి ఆదాయం నాలుగు వేల అమెరికన్ డాలర్లయితే, ఆ దేశ తలసరి ఆదాయం 36110 డాలర్లు. అందుకే ఆ దేశమంటే ప్రపంచమంతా క్రేజ్. మరీ మనదేశ పాలకులైతే నిత్యం ఆ దేశం పేరు జపిస్తుంటారు. ఆ దేశం పేరు చెప్పి ప్రజల్ని ఊరిస్తూ మురిపిస్తుంటారు. ప్రపంచ తొలి స్మార్ట్ దేశంగా ఖ్యాతిని ఆర్జించింది అదే సింగపూర్. 23 అక్టోబర్ న మరొకసారి సైన్స్ ప్రపంచానికి పతాక శీర్షికగా మారింది. ఎలా అనుకుంటున్నారా? DJ, BX అనే పేర్లతో రెండు చోదకుడు అంటే డ్రైవర్ లేని వాహనాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. SMART (Singapoor MIT Alliance for Research and Technology) మరియు NUS (National University of Singapoor) సంయుక్తంగా నాలుగేళ్ళ కృషితో వీటిని రూపొందించారు. అలాగే నన్యాంగ్ సాంకేతిక విశ్వవిద్యాలయం (NTU) మరియు JTC కార్పొరేషన్లు సంయుక్తంగా సింగపూర్ ఎకనామికల్ డెవలప్ మెంట్ బోర్డ్ (EDB) ఆర్థిక సహకారంతో NAVIA పేరిట NTU మరియు JTC కార్పొరేషన్ కు చెందిన క్లీన్ టెక్ పార్క్ కార్యాలయానికి మధ్య డ్రైవర్ లేని షటిల్ సర్వీస్ లను నడుపబోతున్నారు.

ఈ వాహనాలు విద్యుత్తో అంటే కాలుష్య రహిత శక్తితో డ్రైవర్ లేకుండా కంప్యూటర్ నియంత్రణతో కదులుతుంటాయి. 3 నుంచి 8 మంది కూర్చొని ప్రయాణించటానికి వీలుగా వీటిని రూపొందించారు. ఇవి గంటకు 10 కి.మీ. నుంచి 20 కి.మీ. వేగంతో ప్రయాణించగలవు. తమ చుట్టూ 200మీ పరిధి వరకు ఉన్న విషయాలను అంటే ఎదుటి వాహనాల వేగం, దిశ, సిగ్నల్ లైట్స్ సమాచారం, ప్రమాద సంకేతాలను పసిగట్టి మానవుని కన్నా వేగంగా నిర్ణయాలు తీసుకొని ప్రమాదాలను నివారిస్తాయి. పాదచారుల నుంచి తాము ఏమి ఆశిస్తున్నది, తాము ఏమి సహకారమిచ్చేది కూడా ఎప్పటికప్పుడు తెలియపరుస్తాయి.

వీటి కొరకు ఒక వెబ్ సైట్ ని ప్రారంభించారు. అవసరం ఉన్నవారు ఆన్ లైన్ ద్వారా బగ్గి ఎక్కడ ఉన్నది తెలుసుకోవచ్చు. ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ముందస్తుగా ఏ సమయానికి బళ్లీ కావాలో నమోదు చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలో నమోదు చేసినట్లయితే వీటిలో సురక్షితంగా ప్రయాణించవచ్చు. ఇవి ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు, బాలబాలికలకు, వికలాంగుల కొరకు వీటిని ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతానికి 2 కిలో మీటర్ల దూరం ప్రయాణానికి వీటిని వినియోగిస్తున్నారు. సమీప భవిష్యత్తులో ప్రధాన రహదారుల పైకి ఈ వాహనాలు వస్తాయని ఆశిద్దాం.

nov06.jpgస్మార్ట్ దేశం SMARTని స్థాపించి స్మార్ట్ వాహనాలు తయారు చేసుకొని ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించే ప్రణాళికలతో ముందుకు సాగుచున్నది. మీరూ స్మార్టుగా అంటే నిర్దిష్టమైన (Specific), కొలవ గలిగిన (Measurable), సాధించగలిగిన (Achievable), వాస్తవికమైన (Realistic), నిర్దిష్ట కాలపరిమితి (Time bound) లక్ష్యాలు ఏర్పరుచుకొని అద్భుతాలు సృష్టించండి. మనదేశంలో మద్యం సేవించి వాహనాలు నడపడం సర్వ సాధారణంగా మారి అత్యంత ప్రమాదకరంగా పరిణమించింది. మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న డ్రైవర్లను గుర్తించడం ఓ ప్రహసనంగా ఉంది. సరళంగా, సులభంగా గుర్తించే మార్గాలను అన్వేషించాల్సి ఉంది. ఆలోచించండి పరిష్కారాలు చూపండి.

ఆధారం: షేక్ గౌస్ బాషా.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate