অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వింతల హరివిల్లు – మన ఊసరవెల్లి

వింతల హరివిల్లు – మన ఊసరవెల్లి

ఆరిఫ్: రే! రాజా...! మార్రే! ఉస్తే నై చోడ్ నా...! మార్రే! (రాయి కోసం వెతుకుతున్నాడు)

రాజ: కొట్టు! కొట్టు...! (ఎగిరెగిరి చెట్టు కొమ్మలో దేన్నో కొడుతున్నాడు).

అబ్దుల్లా: ఒరే...! రాజ, దగ్గరకు పోవద్దు! కరిచిందా రంగులు మారి చస్తావ్!

శివ: అయ్యో! కనిపించలేదే?

రాజు: అదిగోరా! ఆకుల పైన..! ఆకుపచ్చరంగులోకి మారింది. (స్కూల్ కాంపౌండ్ ఆవల జరుగుతున్న అలజడికి వంశి, స్నేహితులు అక్కడికి చేరారు).

వంశి: ఒరే! ఏందిరా?

రాజు: ఊసరవెల్లి! దూరంగా పో...!

వంశి: ఎక్కడరా? నన్ను చూడనివ్వండి!

(చెట్ల కొమ్మలలో పెద్ద సైజు తొండలాంటిదే, తలపై రంపపు పళ్ళ లాంటి విచిత్రమైన మడతలున్నాయి. స్ర్పిoగులా చుట్టుకొన్న తోక, బాగా ఉబ్బినట్లున్న కళ్ళతో, ఊగి ఊగి నెమ్మదిగా నడుస్తుంది)

వంశి: భలేగుందే!

ఆరీఫ్ : ఏకమార్ దో తుకడా! (బలంగా రాయి విసిరాడు. గురితప్పింది)

వంశి: ఒరే! దాన్ని చంపద్దురా! వదిలేయండి రా!

అబ్దుల్లా: వంశీ దూరం జరుగు! కొట్టరా శివా ఏయ్!

వంశి: సార్! సార్! ఇలా రండి. వీళ్ళంతా ఊసరవెల్లిని చంపేస్తున్నారు! (విషయం తెల్సి జీవశాస్త్రం సార్ పి.ఇ.టి. సార్ అక్కడికి వచ్చారు)

పిఇటి సార్: (విజిలేస్తూ) దూరంగా రండి! ఏయ్ రాయి వేయద్దు!

(పిల్లలు వెనక్కు తగ్గారు)

సైన్స్ సార్: ఎక్కడరా, అది? (తొంగిచూస్తూ)

ఆరీఫ్: అదిగో సార్, కొమ్మపై నుండి నేలపై పడింది.

అబ్దులా: సార్! మళ్లీ రంగు మారిపోయింది సార్.

అబ్దులా: సార్! దాన్ని కొట్టేస్తా...!

పిఇటి: రాజా! ఆ రాయి ఇలా ఇవ్వరా!

సైన్స్ సార్: సార్! సార్! మీరు కూడానా...?

పిఇటి: అది కరిస్తే పిల్లలకు ప్రమాదం సార్!

సైన్స్ సార్: అదో మూఢనమ్మకం సార్. అది విష జంతువు కాదు. మనిషిని గాయపరచగల్గినంత పదునైన దంతాలు దాని నోట్లో లేవు.

పిఇటి: లేదు సార్! మన పెద్దోళ్ళంతా చెప్తుంటారు కదా! దాని విషం ఎక్కితే రంగులు మారి చనిపోతామని.

సైన్స్ సార్: సరే! ఊసరవెల్లి కరిచి రంగులు మారి చనిపోయిన వారిని మీరు చూశారా? కనీనం విన్నారా? అలాంటివి జరిగివుంటే టి.వి. ప్రసారాలలో ఇంటర్ నెట్లో చూపేవారు కదా!

పిఇటి: (ఆలోచనగా) ఔను సార్! రంగులు మారి చనిపోయారనడానికి ఆధారాలు లేవు.

సైన్స్ సార్: ప్రపంచ వింతలంటు శిథిలమైన కట్టడాలను కాపాడే మనం మూర్ఖంగా ఆలోచిస్తూ ప్రకృతి వింతలైన ఇలాంటి జంతువులను మాత్రం కొట్టి చంపుతాం!

వంశి: సార్ ఊసరవెల్లి రంగులు ఎందుకు మారుస్తుంది?

పిఇటి: తనను తినే వరభక్షకాలకు కన్పించకుండా దాక్కోవడానికి పరిసరాల రంగు పొందుతుంది.

సైన్స్ సార్: అది కూడా వాస్తవం కాదు సార్.

(అందరు సైన్స్ సార్ చెప్పేది శ్రద్దగా వింటున్నారు)

సైన్స్ సార్: శరీరపు రంగు మార్చడం ద్వారా దాని మనస్సులోని చిరాకు, భయం, కోపం లాంటి ఉద్వేగాలను వ్యక్తం చేస్తుందని శాస్త్రీయంగా నిరూపితమైంది.

అబ్దులా: అంటే అది మనల్ని చూచి భయపడిందా?

శివా: కాదురా కోపం వచ్చి భయపెట్టడానికే రంగుమారింది.

సైన్స్ సార్: భావాల వల్లనే కాకుండా కాంతి, ఉష్ణోగ్రత, తేమ కూడా దీని రంగును నిర్ధారిస్తాయి.

వంశి: మరి అది రంగు ఎలా మార్చుకోగలదు?

సైన్స్ సార్: బల్లిలాగానే ఊసరవెల్లి చర్మానికి రంగు లేదు. కాని చర్మం క్రింద పొరలుగా ఉన్న కణాలలో నలుపు, పసుపు, ఆకుపచ్చ వర్ణకాలు వుంటాయి. ఆ పొరలలో ఏ కణాలు వ్యాకోచిస్తాయో, దానికనుగుణంగా ఊసరవెల్లి రంగు కన్పిస్తుంది.

రాజ: సార్ మరి ఎందుకు అది ఊగి ఊగి నడుస్తుంది?

సైన్స్ సార్: అది చెట్లకొమ్మలపై తిరగడానికి పాదంలో అనుకూలతలు పొందిన జీవి. దాని పాదంలో రెండు వేళ్ళు ముందుకు వెనక్కు వుండి కొమ్మలను పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది.

పిఇటి: అదే పాదంతో నేల పై నడవాలంటే బ్యాలెన్స్ కుదరక ఊగుతుందన్నమాట!

అబ్దులా: సార్ నేను చూసినప్పుడు అది తోకతో కొమ్మను చుట్టి తలకిందులుగా వేలాడింది సార్.

శివ: పొడుగ్గా నాలుక చూపి మమ్మల్ని బెదిరించింది సార్.

సైన్స్ సార్: (నవ్వుతూ) అది ఏదో చిన్న కీటకాన్ని వేటాడుతూ అలా వేలాడి ఉంటుంది.

వంశి: దాని తోక ఎంత బలమైంది సార్, దాని బరువంతా మోసిందే?

సైన్స్ సార్: అంతే కాదు! దాని నాలుక దాని శరీరమంత పొడవు వుండి, కీటకాల వేటలో సహకరిస్తుంది.

శివ: సార్! అది నాలుక చాపినప్పుడు అక్కడ ఎలాంటి కీటకం లేదండి?

సైన్స్ సార్: నీకు కనిపించలేదేమో?

శివ: మరి ఊసరవెల్లికెలా కనిపించింది?

సైన్స్ సార్: చూపు విషయంలో కూడా అది మనకంటే గొప్పది. శివ ఎలాసార్? సైన్స్ సార్: దానికి నాన్ స్టీరియో టైపిక్ విజన్ వుండటం వలన అది 180°ల కోణంలో ఏవైపైన తల కదపకుండా చూడగలదు. ఏ కంటికాకంటినే వేరుగా తిప్పుతూ 10 మీటర్లు దూరంలోని చీమను కూడా స్పష్టంగా చూడగలదు.

వంశి: అమ్మో ఎంత వింత?

సైన్స్ సార్: గుడ్లు పెట్టే విషయంలో మరో వింత ఉంది.

పిఇటి: ఏమిటి సార్ అది?

సెన్స్ సార్: తడవకు 6 నుండి 24 గుడ్లు పేడుతుంది వీటిలోని జాతి రకమును బట్టి వాటి పొదుగు కాలం 6 నెలల నుండి సంవత్సరాల వరకు ఉంటుంది.

పిఇటి: ఈ లోపు ఆ గుడ్లను వేరే జంతువులు తినేస్తాయి కదా?

సైన్స్ సార్: అందుకే వాటి సంఖ్య చాలా తక్కువ మనకు కనిపించేది అరుదుగానే పిఇటి : ఇన్ని వింతలున్న ఈ జంతువును మనషి ఎందుకు చేసుకోలేకపోయాడంటారు?

సైన్స్ సార్: అన్ని జంతువులు మనిషికి లొంగాలన్న నియమమేది లేదే?

పిఇటి: మరి ఊసరవెల్లి దుర్గంధపూరిత వాయువులను వదలడం కూడా అవాస్తవమేనా?

సైన్స్ సార్: అంతే కదా!

అబ్దులా/శివ: సార్ ఊసరవెల్లి ఇప్పుడు చాలా అందంగా కన్పిస్తుంది సార్!

రాజ/ ఆరీఫ్: ఇకపై వీటిని చంపము సార్.

పిఇటి: ఇతరులను కూడా చంపనీయ సరేనా! (అందరు బడి లోకి దారితీసారు కొమ్మల్లోని ఊసరవెల్లి బతికిపోయింది.

రచన: చంద్రశేఖర్ రామల్ పేట

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate