অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

శాస్త్రీయంగా ఆలోచిద్దాం !

శాస్త్రీయంగా ఆలోచిద్దాం !

“ పిల్లలూ ! మీకు ఒక కధనుచెప్పనా ?” అన్నారు మాస్టారు.

“ చెప్పండి మాస్టారు ! ” అన్నారు పిల్లలందరూ

“ఇది ఈ మధ్యనే అమెరికాలో నిజంగా జరిగిన సంఘటన ” చెప్పడం మొదలెట్టారు మాస్టారు. “ ఎ.పి.జెన్ కో ఛైర్మన్ ఘటన వివరించారు. అదేమిటంటే, ఒకాయన ఒకకొత్త కారును కొన్నాడు. దానిలో తిరుగుతున్నాడు. ఒక రోజున ఒకషాపు ముందు కారును ఆపి పిల్లలకోసం బిస్కట్ల పాకెట్ కొన్నాడు. 1aa.jpgకారులో కూర్చోని దానిని స్టార్ట్ చేయబోయాడు. కానీ కారు స్టార్ట్ కాలేదు. 4,5 నిముషాలు ప్రయత్నించిన తర్వాత స్టార్టయింది. మరునాడు కూడా పిల్లల కోసం ఒక షాపులో బిస్కట్ల పాకెట్ కొని, కారులో కూర్చోని స్టార్ట్ చేయబోతే మరల అదే సమస్య 4,5 నిముషాల దాకా కారు స్టార్టుకాలేదు. అతనికి ఆశ్చర్యం వేసింది. అంతకుముందు ఏ షాపులోనైనా పీజాగానీ, బర్గర్ గానీ కొని, పాక్ చేయించుకొని కారులో కూర్చోగానే కారు స్టార్టయ్యేది. పీజా, బర్గర్ లు అమెరికాలలో దొరికే తినుబండారాలు.

కానీ బిస్కట్లు కొంటే మాత్రం 4,5 నిముషాలు ఇబ్బంది పెట్టిన తర్వాత గానీ స్టార్టు కావడంలేదు. అప్పుడు తను ఏం చేశాడో తెలుసా ? కార్లు రిపేర్లు చేసే ఇంజనీరు దగ్గరకు వెళ్ళి విషయం వివరించాడు. ఆ ఇంజనీరు కూడా ఆ కారులో వెళ్ళి ఏదైనా వస్తువునుకొని, ప్యాక్ చేయించుకొని కారులో కూర్చోగానే కారు స్టార్టయ్యేది. బిస్కట్లపాకెట్ కొని కారులో కూర్చోగానే కారు స్టార్టయ్యేది కాదు. ఐనా ఆ ఇంజనీరు కంగారుపడలేదు. విషయాన్ని అనేక కోణాల్లో పరిశీలించాడు. ప్రతి వస్తువును కొన్న తర్వాత కారు దగ్గరకు వచ్చిన కాలాన్ని, కారు ఆపినప్పటి నుండి కారు మరల స్టార్ట్ అవుతున్న కాలాన్ని గమనించాడు. అతనికి సమస్య మూలం అర్ధమయింది. అదేమిటంటే ఆ కారుకు “నీటి ఆవిరితాళం” అనే పద్ధతి పెట్టబడింది. దాని కారణంగా కారును ఆపిన తర్వాత “నీటి ఆవిరితాళం” దానంతట అదే పడిపోతుంది. ఆ నీటి ఆవిరి పూర్తిగా ఆవిరై పోయిన తర్వాత “నీటి ఆవిరితాళం” దానంతట అదే విడిపోతుంది. ఈ పని జరగటానికి 4 నిముషాలు పడుతుంది. షాపుముందు కారాపి, పీజా లాంటివికొని, పాక్ చేయించుకొని రావడానికి 4,5 నిముషాలు టైం పడుతుంది. అందువలన అవికొని కారు స్టార్ట్ చేస్తే అప్పటికీ “నీటి ఆవిరితాళం” విడిపోయి ఉంటుంది. కాబట్టి కారు స్టార్టవుతుంది. బిస్కట్లకు పాకింగ్ పని ఉండదు. కాబట్టి దాన్ని కొనుక్కోని రావడానికి 4 నిముషాలు పట్టదుకదా? అందువలన కారును స్టార్ట్ చేసినా 4,5 నిముషాలు బయలుదేరనని మొరాయిస్తుంది. ఇదీ బిస్కట్ల వెనక ఉన్న యంత్ర మహిమ. ఇందులో మంత్రంలేదు, తంత్రంలేదు. అర్ధమైందా ? ”

అర్థమైందన్నట్లుగా తలూపారు పిల్లలు.

“ఇప్పుడు మా స్నేహితుడి కారుకు సంబంధించిన మరో విషయం చెబుతాను వినండి” అంటూ మరల మొదలెట్టారు మాస్టారు.

2aa.jpg“ మా స్నేహితుడొకరు కారునుకొన్నాడు. కొత్తకారులో ఝూమ్మని తిరుగుతున్నాడు. కానీ కారును కొన్న వారం రోజుల లోపలే ప్రమాదం జరిగి అతనికి దెబ్బలు తగిలాయి. కారు కొద్దిగా దెబ్బతిన్నది. అతను ఆ ప్రమాదానికి కారణమేమిటని ఒక స్నేహితుణ్ణి అడిగాడు. అతను “కారుకు నిమ్మకాయలు కట్టకపోవడమే ప్రమాదానికి కారణమన్నాడు. మా స్నేహితుడు కారుకు నిమ్మకాయలు కట్టి మరల ఝూమ్మని తిరగసాగాడు. వారంలో ఇంకో ప్రమాదం. ఐతే కొద్ది గాయాలతో మరల బయటపడ్డాడు. దానికి కారణమేమిటని నన్ను అడిగాడు. “మిత్రమా! నీకు కారు డ్రైవింగ్ బాగారాదు. అయినా యింతపట్టణంలో, రద్దీవీధుల్లో స్పీడుగా డ్రైవ్ చేస్తున్నావు. కారు ప్రమాదాలకు అసలు కారణం ఇదీ” అన్నాను. ఐనా అతను నా మాట వినకుండా ఒక పురోహితుణ్ణి సలహా అడిగాడు. అతను” నీవు బుధవారం బండి బయటకు తీశావు. అందువలన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఐన నీకూ బండి అచ్చిరాదు. ఎంతో కొంత నష్టానికి అమ్ముకోవడమే ఏకైక మార్గం” అన్నాడు. నా స్నేహితుడికి అతన సలహానచ్చి కారును సగం రేటుకే అమ్మివేశాడు. దాని వలన ఎంతో నష్టపోయాడు” అని ముగించాడు మాస్టారు. ఒకక్షణం క్లాసంతా నిశ్శబ్దం.

ఈ రెండు సంఘటనలను బట్టి మీకేమర్ధమవుతున్నది

నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ మాస్టారే అడిగారు.

పిల్లలెవరూ మాట్లాడలేదు.

మాస్టారే మొదలెట్టారు.

అమెరికాలో ఒక విశేషం జరిగితే దానికి సరియైన వాస్తవికమైన కారణం ఏమిటా అని ఆలోచిస్తారు దాన్నే శాస్త్రీయంగా ఆలోచించడం అంటారు. మనదేశంలో పౌరులు కారు ప్రమాదానికీ, నిమ్మకాయలకీ లేదా బుధవారానికి సంబంధం అంటగడతారు. అసలు నిమ్మకాయలకు, కారు ప్రమాదానికి ఎందుకు సంబంధం ఉంటుంది. చెప్పండి. డ్రైవింగ్ చేతకాని తనానికీ, ప్రమాదానికీ సంబంధం ఉంటుంది గాని, మనదేశంలో ఇలా ఆలోచించేవారు ఎక్కువగా ఉన్నారు. అమెరికాలో చాలా కొద్దిమంది ఉన్నారు. ఇలా ఆలోచించడాన్ని అశాస్త్రీయంగా ఆలోచించడం అంటారు. ఏ దేశంలోనైతే ఎక్కువ మంది ప్రజలు అశాస్త్రీయంగా ఆలోచిస్తారో, ఆ దేశం శాస్త్ర విజ్ఞానరంగాలలో వెనుకబడి ఉంటుంది. శాస్త్ర విజ్ఞానంలలో వెనుకబడితే ఆదేశం విద్య, వైద్యం ఆరోగ్యం, రక్షణ ఇలా అన్ని రంగాలలో వెనకబడిపోతుంది. అలా వెనుకబడిన దేశాన్ని అందరూ చులకనగా చూస్తారు. అలా కాకుండా శాస్త్రీయంగా ఆలోచించే ప్రజలున్న దేశం అన్ని రంగాలలో ముందుండి అగ్రరాజ్యంగా పిలవబడుతుంది. కాబట్టి మనదేశం కూడా అగ్రరాజ్యంగా ఎదగాలంటే మన మేం చయాలి ?

మనదేశస్థులందరం శాస్త్రీయంగా ఆలోచించాలి. మా మామయ్య చెప్పినట్లు పిడుక్కీ, బియ్యానికీ ముడిపెట్టగూడదు. సమాధానమిచ్చింది శాంతి.

క్లాసంతా గొల్లున నవ్వింది. మాస్తారు కూడా ఆనందంగా నవ్వారు.

రచయిత:-కె.ఎల్,కాంతారావు

చివరిసారిగా మార్పు చేయబడిన : 12/26/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate