పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

క్రొవ్వొత్తి వెలుగును కత్తిరిద్దామా?

వెలుగును కత్తిరించి పారేయండి.

jun14అబ్బా! ఎండలు మండిపోతున్నాయి. చెట్లను నరికి వేసిన పుణ్యమా అని ఇప్పుడు మనకు ఋతువులు అంటే మూడే. అవి వేసవి, మధ్య వేసవి, అధిక వేసవి (Low Summer, Mid Summer, High Summer) అంతేకదూ. ఇప్పుడు అధిక వేసవి నడుస్తోంది. మన భావితరాలకు రెండే బతువులు (అల్ప వేసవి, అధిక వేసవి) లేక ఒకే ఋతువు (వేసవి మాత్రమే) ఉంటుందేమో... హాయిగా ఆరు ఋతువులు కావాలంటే మనం ఇప్పుడు తప్పక చెట్లు నాటాలి. సంరక్షించాలి. పెంచాలి. అప్పుడు మన భావితరాలు మనలను నిందించకుండా వుంటాయి. మరి నాటుదామా చెట్టు...

సరే, మరి ఈనాటి మన టైటిల్ క్రొవ్వొత్తి వెలుగును కత్తిరిద్దామా! అరే కాగితాన్ని కత్తిరించడం తెలుసు. మీరు వేసవి వినోద కార్యక్రమాలలో, పాఠశాల ప్రాజెక్టు వర్క్లలో కాగితాలను కత్తిరించి వుంటారు. ఇక గుడ్డలను కత్తిరించవచ్చు. దర్జీ పనివారు, ఇంట్లో అమ్మ గుడ్డలను కత్తిరిస్తూ వుంటారు. పలుచని లోహపు. ముక్కలను సైతం ఉలితో కత్తిరించవచ్చు. కొవ్వొతి వెలుగును. ఎలా కత్తించాలి? ఈ కథా కమామిఘ ఏమిటో చూద్దామా.

కావలసిన పరికరాలు:

కొవ్వొత్తి, అగ్గిపెట్టె, సన్నని ఇనుప జల్లెడ (Sieve), (కత్తెర అవసరం లేదు సుమా!)

పందెం:

టేబుల్ పై క్రొవ్వొత్తిని వెలిగించి నిలబెట్టండి. దాని మంట (వెలుగు) పైకి వెలుగుతూ వుంటుంది కదా. ఇపుడు మీ స్నేహితులతో ఎవరైనా క్రొవ్వొత్తి వెలుగును సగానికి కత్తిరిస్తారా! అని పందెం కాయండి... ఒకటి రెండూ... పదీ... హ...హ...హ... ఎవరూ కత్తిరించలేరు కదా! అయితే మీరు రంగంలోకి దూకండి. వెలుగును కత్తిరించి పారేయండి.

చేయు విధానము:

వెలుగును ఎలా కత్తిరించాలి? అదీ కత్తెర లేకుండా! వంటింటిలోని ఇనుప జల్లెడ తీసుకోండి (కాఫీ వడగట్టి గుంతగా వుండే ఇనుప జల్లెడైనా, సమతలంగా గుండ్రంగా వుండే ఇనుప జల్లెడ అయినా ఫర్వాలేదు. పిండి జల్లించే జల్లెడ ప్లాస్టిక్ దారాలతో అల్లి వుంటారు. అవి కొవ్వొత్తి వెలుగుకు కాలిపోతాయి సుమా. జాగ్రత్త. ఇనుప జల్లెడ (చిన్న చిన్న రంధ్రములు వుండేది మాత్రమే వాడాలి). వెలుగుతున్న కొవ్వొత్తి వెలుగు పైన జల్లెడ వుంచి మెల్లగా క్రిందకు దించండి. జల్లెడ క్రిందకు దించుతూ వున్నప్పుడు క్రొవ్వొత్తి వెలుగు ఆపై నుండి కొంచెం కొంచెం ఆరిపోతూ వస్తుంది. సగంలో జల్లెడ అలా పట్టుకుని వుంటే క్రొవ్వొత్తి వెలుగు సగం మాత్రమే వుంటుంది. జల్లెడలోంచి మైనపు ఆవిరి పైకి వస్తూ వుంటుంది. అంతే మనం వెలుగును కత్తిరించేశాము. పందెం గెలిచాము. ఇది ఎలా సాధ్యం. అసలేం జరిగింది. సైన్స్ ఏమిటి?

వివరణ:

క్రొవ్వొత్తి వెలుగుతూ వున్నప్పుడు క్రొవ్వొత్తిలోని మైనము వేడెక్కి ఆవిరై వత్తి గుండా పైకివస్తూ, కాలుతూ వెలుగును ఇస్తుంది. ఇనుప జల్లెడ వుంచడం వల్ల వెలుగులోని వేడిని, ఉష్ణాన్ని పూర్తిగా గ్రహిస్తుంది. అందువల్ల జల్లెడ పై భాగంలోకి వచ్చే మైనపు ఆవిరికి తగినంత వేడిమి లభించక మాడదు. ఆవిరి మాత్రమే వెలువడుతుంది. వెలుగు మంట జల్లెడ క్రింద మాత్రమే మండుతూ జల్లెడలో నుండి క్రొవ్వొత్తి ఆవిరి పైకి వస్తూ వుంటుంది. జల్లెడలోని లోహం ఉత్తమ ఉష్ణ వాహకము కనుక వెలుగులోని మొత్తం వేడిని గ్రహిస్తుంది. అందువల్ల వత్తి సగం మాత్రమే వెలుగుతూ వుంటుంది. జల్లెడ తీసివేస్తే తిరిగి వత్తి పూర్తిగా మండుతుంది.

ఇదే సూత్రం పై “డేవీ గనుల దీపము” పని చేస్తుంది. 'హంఫ్రీ డేవీ' అనే శాస్త్రవేత్త బొగ్గు గనులలో లోతు భాగాలకు తీసుకుపోయి భద్రంగా పనిచేసే దీపాన్ని కనిపెట్టాడు. 1815 ప్రాంతాలలో బొగ్గు గనులలో అంతర్భాగానికి కార్మికులు వెళ్ళాలంటే మామూలు దీపం తీసుకు పోయేవారు. ఒక్కో సారి గనుల లోపల మీథేన్ వాయువుల వెలువడి దీపపు వేడికి మండే ప్రమాదాలలో కార్మికులు చనిపోయేవారు. దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి 'డేవీ' దీపం పనిచేసింది. ఈ దీపంలో కిరోసిన్ దీపపు వత్తి చుట్టూ లోహపు వల అమర్చబడి వుంటుంది. వత్తి వేడిమిని వల గ్రహిస్తూ వుంటుంది. బయట మీథేన్ వాయువు వెలువడినా దీపపు వేడి బయటకు రాదు కనుక వాయువు పేలిపోదు. ఈ విధంగా లోహపు ఉష్ణవాహకత్వం ఎందరి ప్రాణాలనో కాపాడడానికి దోహదమైనది.

ఆధారం: యం. యుగంధర్

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు