অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

చెక్కపలక కారు

చెక్కపలక కారు

ఓ పిల్లవాడు ఒక చిన్న చెక్కముక్కకి దారంకట్టి నేలపై ఉంచి దారంతో లాక్కుంటూ వెళుతున్నాడట. ఓ పెద్దమనిషి అది చూసి ఆ పిల్లవాడిని పలుకరిస్తామని 'అరే బాబూ నీ కారు భలేగా వుందే?' అని అన్నాడట. అపుడా గడుగ్గాయి "అది కాదు కాదు చెక్కముక్క అంతే అన్నాడట. మీరందరూ చిన్నప్పుడు ఏ చెక్కముక్కకో రాయిముక్కకో దారం కట్టి ‘డుర్ ... డుర్' అంటూ అరుస్తూ, కారు ఆటలు ఆడే వుంటారు. ఆ రోజులే వేరుకదా. ఎప్పుడూ ఆటలే. పాపం, పుణ్యం, ప్రపంచమార్గం, మోసం, ద్వేషం, శ్లేషార్థాలు తెలియని వయసు కదా. సరే. ఇప్పుడు మనం దారంతో లాగకుండా దారాన్ని కత్తిరించి కదిలే చెక్కపలక కారును తయారుచేద్దామా. ఎలాగ అంటారా రండి. చేసి చూద్దాం. కావలసిన వస్తువులు:

1. చెక్కపలక ముక్క

2. వాల్వ్ ట్యూబు (సైకిల్ వాల్స్ ట్యూబు)

3. చీలలు (మొలలు, Nails),

4. వాడేసిన పెద్ద టార్చ్ సెల్లులు (అనార్థ ఘటాలు),

5 దారపు ముక్క

6. కత్తెర,

7. చిన్న రాయి.

వడ్రంగి దగ్గర ఓ పలుచని దీర్ఘ చదరపు చెక్కపలక ముక్క (దాదాపు 8 సెం.మీ. వెడల్పు, 15 సెం.మీ. పొడవు గలది) సంపాదించండి. దానిపై పటము (1)లో చూపిన విధంగా XYZ స్థానాలలో 3 చీలలు Nails ను దిగగొట్టండి. దాదాపు 10 సెం.మీ పొడవు గల వాల్ట్యూబును తీసుకొని, ఒక కొనను X చీలకు, రెండవ కొనను Y చీలకు ముడివేయండి. (పటము (2)లో మాదిరిగా) తరువాత ఒక దారపు ముక్కను తీసుకుని వాల్వుట్యూబుకు M వద్ద పటము (3)లో చూపిన విధంగా ముడివేసి, లాగి దారపు రెండవ కొనను Z చీలకు ముడి వేయండి. M వద వాల్వ్ ట్యూబుకు ముందర ఒక చిన్నరాయిని అమర్చండి. ఈ అమరికను 4 వాడేసిన సెల్లుల పై పటము (4)లో చూపిన విధంగా ఉంచండి. అంతే మన చెక్కపలక కారు రెడీ.

మరి కారు కదులు విధము

ఏమీ లేదు. ఇప్పుడు కత్తెరను తీసుకొని M,Z ల మధ్య దారపు ముక్కను కత్తిరించండి. అంతే వేగంతో రాయి ఎడమవైపుకు కదులుతుంది. (మన కేటర్ బాల్ మాదిరిగా) వెంటనే చెక్కపలక సెల్లుల మీదుగా రాయికి వ్యతిరేక దిశలో అంటే కుడివైపుకు కదులుతుంది. అంటే మన చెక్కపలక కారు కదిలిందన్నమాట.

ఇది ఎలా సాధ్యం. ఇందులో ఇమిడి వున్న సైన్స్ ఏమిటి

ఇక్కడ మనం న్యూటన్ మహాశయున్ని గుర్తు చేసుకోవాలి. ఆయన 3 గమన నియమాలు.... ప్రతిపాదించారు కదా. అందులో 3వ నియమం ఏమి చెబుతుందంటే. ప్రతీ చర్యకు సమానమైన ప్రతిచర్య వ్యతిరేక దిశలో జరుగుతుంది” (For every action there is an equal and opposite reaction) ఈ సూత్రం ప్రకారం దారపు ముక్కను కత్తిరించగా వాల్వుట్యూబు రబ్బరు కదా) యొక్క స్థితిస్థాపకత (Elasticity) వల్ల అది కుంచించుకుని రాయిని ఎడమవైపుకు నెట్టి వేసింది. ఇది చర్య. (Action) దానికి సమానంగా సెల్లులపై చక్కపలక వ్యతిరేక దిశలో కుడివైపుకు కదిలింది. ఇది ప్రతిచర్య (Reaction) సెల్లులు, ఘర్షణ తగ్గించి చెక్కపలక స్వచ్ఛగా కదలడానికి ఉపయోగపడింది. అదన్నమాట.

ఇదే సూత్రంపై రాకెట్ కూడా పనిచేస్తుంది తెలుసా? రాకెట్లోని ఇంధనం మండి వేడి గాలులు క్రిందికి వేగంగా వస్తూంటే దానికి ప్రతిచర్యగా రాకెట్ వేగంగా పైకి వెళుతుందన్నమాట. ఇంకొకటి సుమా. మనం భూమిపై నడవడం కూడా సూత్రంకు లోబడే తెలుసా. మనం నడి చేటప్పుడు పాదంతో భూమి పై బలం చూపుతూ వెనక్కు నెట్టుతాము. అది చర్య (Action). దీంతో మనము ముందుకు నడుస్తాము. అదన్నమాట. బురద మట్టిలో, ఇసుకలో అంత వేగంగా నడవలేము. ఎందుకో తెలుసా. ప్రతిచర్య కొరకు బురద, ఇసుకలో భూమి గట్టిగా వుండదు కనుక.

ఆధారం: యుగంధర్ బాబు.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate