অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

జలాంతర్గామి

జలాంతర్గామి

nov3మెజీషియన్ సుబ్బు ఏ మేజిక్ చేసినా అందులో ఏదో సైన్స్ రహస్యం దాగి ఉంటుంది. టీచర్ ద్వారా పిల్లలకు సైన్స్ రహస్యాలు అర్థం అవుతున్నాయి. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. సైన్స్ ఫేయిర్లలో పాల్గొనే ఉత్సాహం ఎక్కువ అవుతుంది.

ఆరోజు సైన్స్ మేజిక్ ఫిజిక్స్ ల్యాబ్ లో ఏర్పాటయింది. ల్యాబ్ లో ఒక టేబుల్ మీద నీటితో నిండిన ఒక తొట్టి వుంది. మేజీషియన్ సుబ్బు చేతిలో ఒక ప్లాస్టిక్ సీసా ఉంది. మెజీషియన్ సీసాలో సగం దాకా నీరు పోశాడు. ఈ సీసాతో ఏం మేజిక్ చేస్తాడో అని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.

టేబుల్ మీద ఉన్న బిరడాను తీసి అందరికీ చూపించాడు మెజీషియన్. బిరడాకు రెండు రబ్బరు గొట్టాలున్నాయి. ఒకటి పొట్టి గొట్టం. రెండోది పొడవైన గొట్టం. బిరడాను సీసాకు బిగించి సీల్ చేశాడు. పొడుగు గొట్టం కొంత భాగం సీసాలో ఉంది. మిగతా భాగం బయట ఉంది. పొట్టిగొట్టం బిరడాలోకి దూరి బయటకు కన్పిస్తోంది. సీసాకు ఒకవైపు చిన్నగొట్టం మరోవైపు పెద్ద గొట్టం కన్పిస్తున్నాయి. చిన్నగొట్టం ఉన్నవైపున కొన్ని లోహపు బద్దలను రబ్బరు బ్యాండ్ల సహాయంతో సీసాకు అతికించాడు. ఈ సీసాను చూడండి. దీన్నే ఒక జలాంతర్గామిగా అంటే సబ్ మెరైన్ బోట్ మాదిరిగా చేస్తాను. ఇదే ఈ రోజు మేజిక్ అన్నాడు మెజీషియన్.

మీలో కొంత మంది టేబులకు దగ్గరగా రండి. మిగతావాళ్ళకు ఈ మ్యాజిక్ మళ్ళీ చేసి చూపిస్తా. అందరూ చూడొట్టు అని మెజిషియన్ చెప్పడంతోనే అనిష్, సాకేత్, కార్తీక్, ఆదిత్య, అశ్రీత, అక్షయ, మేఘన టేబుల్ చుట్టూ నిలబడి చూస్తున్నారు. మెజీషియన్ తన చేతిలోని సీసాను నీటితొట్టిలో ఉంచారు సీసా మునిగిపోయి తొట్టి అడుగుకు చేరింది. మెజీషియన్ పొడుగు గొట్టాన్ని చేతిలో పట్టుకుని నోటితో గొట్టంలోకి గాలిని ఊదాడు. సీసా నీటిపైకి తేలింది. ఈసారి పొడుగు గొట్టాన్ని నోటిలో ఉంచుకుని గాలిని లోపలికి అంటే నోట్లోకి పీల్చాడు. సీసా మళ్ళీ తొట్టె అడుగుకు పడిపోయింది. మెజీషియన్ పొడుగు గొట్టంతో ఏదో సర్దుబాటు చేశాడు. ఈసారి సీసా ఒక సబ్ మెరైన్ లాగా నీటి అడుగుకు మునిగిపోకుండా, పూర్తిగా పైకి తేలకుండా నీటి మధ్యలో ఉండిపోయింది. అంతా చప్పట్లు కొట్టారు.

మెజీషియన్ ఏం మాయచేశాడో! సీసా నీటిలో పూర్తిగా మునగకుండా, పైకి తేలకుండా ఒక జలాంతర్గామి లాగా ఎలా ఉండగలిగింది? అయినా, ఇందులో ఏదో సైన్స్ రహస్యం ఖచ్చితంగా ఉండే ఉంటుందని విద్యార్థులు ఫిజిక్స్ టీచర్ లతను చుట్టుముట్టారు. ప్రశ్నలతో ముంచెత్తారు.

లత టీచర్ వాళ్ళకు ఓపిగ్గా వివరించింది. ఇదొక ఫిజిక్స్ మేజిక్. ప్లవన సూత్రాలు ఇందులో ఇమిడి వున్నాయి. ఈ మేజిక్ ను మనం చేయగలం. చాలా సులువు కూడా.

ఇందుకు కావల్సినవి: ఒక ప్లాస్టిక్ సీసా (సుమారు 1.5 లీ), వంగే పల్చని రబ్బరు గోట్టం, కత్తెర, ప్లాస్టిసిన్ (బంకమన్ను లాంటిది), రబ్బర్ బ్యాండ్లు, లోహపుబద్దలు, నీటి తొట్టె.

ముందుగా రబ్బరు గొట్టాన్ని రెండు ముక్కలుగా కత్తిరించుకోవాలి. ఒకటి పొట్టిగొట్టం (పొడవు 10 సెం.మీ.), రెండోది పొడుగు గొట్టం (పొడవు 1 మీటరు). ఒక నిమ్మకాయ సైజు ప్లాస్టిసైన్ ముద్దను తీసుకుని దానిని పొట్టిగొట్టం ఒక కొన చుట్టూ నొక్కాలి. గొట్టం మూసుకుపోకుండా జాగ్రత్త పడాలి.

పొడుగు గొట్టాన్ని తీసుకుని ఒక కొన నుంచి 10 సెం.మీ. దగ్గర ప్లాస్టిసైన్ అతికించాలి. ఇప్పుడు పొట్టిగొట్టం, పొడుగు గొట్టం ప్లాస్టిసైన్ తో అతకబడి ఉన్నాయి. రెండు గొట్టాల తాలూకు 10 సెం.మీ. పొడవులు ఒకే దిశలో ఉండాలి. ఇప్పుడు ఈ రెండు గొట్టాలు రెండు రంధ్రాల రబ్బరు బిరడాలో ఉన్నట్లుగా ఉంటాయి. సీసాను నీటితో సగందాకా నింపాలి. ఇప్పుడు సీసా మూతికి బిరడా బిగించాలి. ఒక గొట్టం సీసాకు ఒకవైపు, రెండో గొట్టం రెండోవైపు ఉండేటట్లుగా సర్దుబాటు చేసి, ఈ బిరడాను ప్లాస్టిసైన్ తో సీసా మూతికి సీల్ చేయాలి.

పొట్టిగొట్టం ఉన్నవైపు సబ్ మెరైన్ అడుగు భాగం అనుకుందాం. రెండు లేదా మూడు రబ్బర్ బ్యాండ్లను సీసా చుట్టూ ఉంచుకుని వాటి సాయంతో కొన్ని లోహపుబద్దలను సీసా అడుగుభాగానికి అమర్చాలి. తొట్టెను నీటితో నింపి సీసాను అంటే మనం తయారు చేసిన సబ్ మెరైన్ ను నీటిలో ఉంచాలి.

సబ్ మెరైన్ నీటిలో పూర్తిగా మునిగిపోయి తొట్టి అడుగుకు పడిపోయిందనుకుందాం. ఇప్పుడు పొడుగు గొట్టంలోకి గాలిని ఊదాలి. సీసాలో ఉన్న భాగంలోంచి గాలి బయటికి వచ్చి సీసాలోంచి కొంత నీటిన పొట్టిగొట్టం ద్వారా బయటికి గెంటుతుంది. (ఇది రంగునీరైతే బయటికి వచ్చే నీటిని మనం స్పష్టంగా చూడగలం) సబ్ మెరైన్ నీటి మీద తేలుతుంది.

సబ్ మెరైన్ నీటి మీద తేలుతుంటే పొడుగు గట్టంలోకి గాలిని నోట్లోకి పీల్చాలి. ఇప్పుడు ఒక గొట్టంలోంచి గాలి బయటకు వస్తుంది. రెండో గొట్టం అంటే పొట్టిగొట్టం తొట్టిలోని నీటిలో ఉంది కదా. దీనిలోంచి నీరు సీసాలోకి వస్తుంది. సబ్ మెరైన్ మునిగిపోతుంది. గొట్టాల సాయంతో సీసాలోని నీటిని సర్దుబాటు చేస్తే ఒక నిర్థిష్ట బరువును సబ్ మెరైన్ పూర్తిగా మునగకుండా పూర్తిగా పైకి తేలకుండా నీటి మధ్యలో ఉండిపోతుంది. మన సబ్ మెరైన్ పనిచేస్తోందన్నమాట. ఒకవేళ సరిగా పనిచేయకపోతే సీసాకు అమర్చిన లోహపు బద్దలతో బరువును సర్దుబాటు చేయాలి.

సీసా సబ్ మెరైన్ బోట్ మాదిరిగా, ఎలా పనిచేస్తోంది? సీసా పూర్తిగా గాలితో నిండి ఉంటే, అది తేలికై పైకి తేలుతుంది. నీటితో పూర్తిగా నిండిపోతే బరువు ఎక్కువై అడుగుకు మునిగిపోతుంది. ఒక నిర్దిష్ట బరువు ఉన్నప్పుడు సబీమెరైన్ పూర్తిగా మునగకుండా, పూర్తిగా తేలకుండా నీటి మధ్యలో ఉండిపోతుంది. దీన్నే తటస్థ బాయెన్సీ (Neutral Buoyancy) అంటారు. సబ్ మెరైన్ బరువు, దాని పరిమాణంతో సమానమైన నీటి బరువుకు - సమానమైనప్పుడు ఈ పరిస్థితి వస్తుంది. తటస్థ బాయెన్సీ ఉన్నప్పుడే తేలకుండా, మునిగిపోకుండా అదే లోతున ఉండిపోతుంది.

ఆధారం: డా. ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate