పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

తిరకాసు నీటి మట్టం

తిరకాసు నీటి మట్టం

ఆకులెల్లదిన్న మేక పోతులకెల్ల

గాకపోయెనయ్యె కాయసిద్ధి,

లోకులెల్ల వెర్రి పోకిళ్ల బోదురు

విశ్వదాభిరామ వినురవేమ!

విచిత్రంగా, ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మన దేశంలో శాఖాహారం... మాంసాహారం పట్ల బిన్నాభిప్రాయాలు... ఇష్టాయిష్టాలు వున్నాయి! వేమనగారు చాలా చమత్కారంగా ఈ తేడాను విమర్శించాడు. మేకపోతు శాఖాహారి కదా. ఎప్పుడూ ఆకులు అలములు తింటూ వుంటుంది కదా. మరి దానికి కాయసిద్ది అంటే బలమైన శరీరం కలిగి తెలివిమంతురాలుగా వుండాలికదా? నిజానికి అలాలేదు కదా? ఆహారపు అలవాట్లు వారి వారి వ్యక్తిగతము. ఎవరినీ ఆహారపు అలవాట్లు బట్టి విమర్శించడం గానీ, ఎగతాళి చేయడం గానీ చేయరాదు. ఇది తినడం తప్పు, అదితినడం తప్పు అని ఆంక్షలు విధించరాడు. సరేనా... ఇక ఈ తిరకాసు నీటిమట్టం సంగతి చూద్దామా... గ్లాసు నీటిలో ఒక రూపాయి నాణెం వేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది... మునుగుతుంది. ఇంకా... గ్లాసులో నీటిమట్టం కాస్త పెరుగుతుంది. అంతేకదా... సరే ఇక్కడ ఓ తిరకాసు. ఒకేనాణెంతో గ్లాసులోని నీటిమట్టాన్ని రెండు వేరు వేరు స్థాయిలకు పెంచడం సాధ్యమేనా? సాధ్యమే. ఎలాగంటారా? రండి చేసిచూద్దాం.

కావలసిన పరికరాలు:

1. గాజుగ్లాసు

2. నీరు

3. అగ్గిపెట్టె

4. ఒక రూపాయి నాణెం

చేయు విధానం:

గాజుగ్లాసు తీసుకొని దానిలో ముప్పావువంతు వరకు నీరు పోయండి. అగ్గిపెట్టె మూతను బయటకు తీసి, పుల్లల్ని ఖాళీ చేయండి. ఈ ఖాళీ మూతలో ఒక రూపాయి వుంచి, మూతను జాగ్రత్తగా గ్లాసులోని నీటి ఉపరితలంపై తేలుతున్నట్లుగా అమర్చండి. అంటే ఇప్పుడు నీటిలో రూపాయి నాణెం వుంది కదా. ఈ స్థితిలో గ్లాసులోని నీటి మట్టాన్ని సి.డి మార్కర్ పెన్నుతో గుర్తించండి (పారలాక్సు దోషం లేకుండా). నీరు మాత్రమే వున్నప్పుడు గ్లాసులోని నీటిమట్టం కంటే, రూపాయి అగ్గి పెట్టె మూతలో వున్నప్పుడు నీటిమట్టం పెరుగుతుంది. ఇది మొదటి నీటిమట్టం పెరుగడం. ఇక రెండవ నీటిమట్టం.

ఇప్పుడు మెల్లగా అగ్గిపెట్టె మూతలోని రూపాయి నాణేన్ని తీసుకొని, మూతను అలాగే వుంచి, రూపాయిని

గ్లాసులోని నీటిలోనికి జారవిడవండి. అంటే నీటిలో రూపాయి, మూతా, రెండు వున్నాయి. కానీ నీటిమట్టం గమనించండి. ఇది వరకు మీరు గుర్తించిన నీటిమట్టం కంటే కాస్త తగ్గి వుంటుంది. ఇది రెండవ నీటి మట్టం పెరుగుదల. చూశారా ఒకే రూపాయితో రెండు రకాలుగా నీటి మట్టం పెరుగుదల గమనించా. ఇది ఎలా సాధ్యం అయింది. నాణెం లోహంతో చేయబడింది కదా. నాణెం సాంద్రత నీటి సాంద్రత కన్నా దాదాపు 9 రెట్లు ఎక్కువ. అంటే ఒక గ్రాము ద్రవ్యరాశి గల నాణెం ఒక గ్రాము ద్రవ్యరాశి గల నీటికంటే 9 రెట్లు బరువైనది. నాణెం గలిగిన అగ్గిపెట్టె మూత వైశాల్యము ఎక్కువ. తన బరువుకు సమానమైన నీటిని తొలగిస్తుంది. మూతవైశాల్యము మరియు నీటిలో మునిగిన లోతుతో ఎక్కువ నీటిని తొలగిస్తుంది. ఈ నీరు గ్లాసులో మట్టం పెరుగుటకు ఉపయోగపడింది (అగ్గిపెట్టె మూత వైశాల్యం X మూత మనిగిన లోతు = తొలగింపబడిన నీటి ఘనపరిమాణం). ఇది మొదటి మట్టం పెరుగుదల.

రూపాయి నాణేన్ని మూత నుండి బయటకు తీసినప్పుడు బరువు తగ్గి మూత పైకి తేలియాడుతుంది. నీరు యధాస్థానానికి చేరుకుంటుంది. ఇప్పుడు నాణేన్ని నీటిలో జారవిడిచినప్పుడు, తన ఘనపరిమాణంతో సమానమైన నీటిని మాత్రమే తొలగిస్తుంది. (నాణెం ఘనపరిణాము, అగ్గిపెట్టె మునిగిన ఘనపరిణామం కంటే తక్కువ కదా). కాబట్టి నీటి మట్టము కొంచెం మాత్రమే పెరుగుతుంది. ఇది రెండవ మట్టం పెరుగుదల చూసారా తిరకాసు నీటి మట్టం రహస్యం.

ఇదే సూత్రంపై పెద్ద పెద్ద షిప్పులు, పడవలు స్టీమర్లు నీటిపై తేలియాడుతున్నాయి. ఇనుపగుండు నీటిలో వేస్తే మునుగుతుంది. స్టీమర్లో వుంటే తేలుతోంది. వస్తువు నీటిపై తేలుతున్నప్పుడు కాస్ల భారాన్ని కోల్పోతుంది. ఈ కోల్పోయిన భారం అది తొలిగించిన నీటి భారానికి సమానం కాబట్టి స్టీమరు వైశాల్యం ఎంత వుంటే అంత నీటిని తొలగిస్తుంది. అంత భారాన్నీ కోల్పోతుంది. అదే ఆర్కిమెడిస్ సూత్రం. సరేనా.

ఆధారం: యం. యుగంధర్
3.01052631579
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు