অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

రసాయన దీపాలు

రసాయన దీపాలు

మేజిక్ షో ఆసక్తికరంగా సాగుతోంది. మరో మేజిక్ కు మెజీషియన్ సుబ్బు సిద్దమౌతున్నాడు. వేదిక మీద ఒక టేబుల్ ఉంది. దాని మీద కొన్ని గాజు బీకర్లు వాటిలో ద్రావణాలు కన్పిస్తున్నాయి. మెజీషియన్ చేతిలో ఒక మరుగునాళిక ఉంది. తన చేతిని పైకెత్తి ఆ గాజు నాళికను అందరికీ చూపించాడు. మీకందరికీ విద్యుత్ బల్బ్ తెలుసు. స్విచ్ వేస్తే విద్యుత్తు ప్రవహించి బల్బు వెలుగుతుంది. గాజు నాళికను చూడండి. నా తెలివితేటలతో ఈ నాళికనే ఒక దీపంగా మారుస్తాను. విద్యుత్తుతో గాని, నూనెలాంటి ఇంధనంతో గాని, నిప్పుతో గాని పనిలేకుండానే అద్భుతమైన కాంతితో ఈ నాళిక వెలిగేలా చేస్తాను చూడండి అన్నాడు. విద్యార్థులందరిలో ఆసక్తి పెరిగింది. మెజీషియన్ చెప్పేది. నిజమా అని కొందరిలో అనుమానం మొదలైంది.

మెజీషియన్ మరుగునాళికలో దాదాపు సగం దాకా ఒక బీకరులో ఉన్న రంగులేని ద్రవం పోశాడు. వేరే బీకరులో ఉన్న దాదాపుగా రంగులేని మరో ద్రావణాన్ని నాళికలో పోసి గాజు కడ్డీ తో కలియబెట్టడం ప్రారంభించాడు. గది తలుపులు మూసేయమని చెప్పాడు. గదిలో చీకటి. అంతలోనే అద్భుతం! నాళిక ఒక విద్యుద్దీపంలా మారిపోయింది. నీలంరంగు కాంతిలో మెరిసిపోయింది. విదార్థులంతా చప్పట్లు కొట్టారు. మెజీషియన్ చెప్పింది చేసి చూపించాడు.

ఈ మేజిక్ మనం చేయగలం. చాలా సులువు కూదా. ఇందుకు ముందుగా రెండు ద్రావణాలు తయారుచేసుకోవాలి.

ద్రావణం A: 4 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ ను 100 మి.లీ. స్పేదనజలంలో కరిగించి 1 M NaoH ద్రావణం తయారుచేసుకోవాలి. వేరే బీకరులో ఈ ద్రావణం 5 మి.లీ. తీసుకొని, 100 మిల్లీ గ్రాముల లూమినాల్ ను కరిగించాలి. ఈ ద్రావణాన్ని స్పేదన జలంతో 1 లీటరుకు విలీనం చేయాలి..

ద్రావణం B: సుమారు 250 మి.గ్రా, పొటాషియం ఫెరసయనైడ్ ను ఒక బీకరులోకి తీసుకొని 10 మి.లీ. 3% హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణం కలిపి గాజు కడ్డీతో కలియబెట్టాలి. స్వేదన జలం కలిపి 1 లీటరుకు విలీనం చేయాలి.

ఒక మరుగు నాళిక లేదా శాంఖవకుప్పే (Conical flask) తీసుకొని 100 మి.లీ. ద్రావణం Aకు 100 మి.లీ. ద్రావణం Bని కలపాలి. గాజుకడ్డీతో బాగా కలియబెడితే రసాయన చర్య జరిగి నీలం రంగు కాంతి వెలువడుతుంది.

ఇలా ఎందుకు జరుగుతుంది?

కొన్ని రసాయన చర్యల్లో కాంతి వెలువడుతుంది. కాని కాంతివెలువడే కొన్ని రసాయనచర్యలో ఉష్ణం వెలువడదు. దీన్నే చల్లనికాంతి (Cola light) అంటారు. రసాయన దీప్తి (Chemiluminiscene) ఇందుకు కారణం.

3-ఎమైనో థాలోయిల్ హైడ్రోజైడ్ ను లూమినాల్ అంటారు. ఇది లేత పసుపు రంగు ఘనపదార్థం. నీటిలో కరగదు. కాని చాలా కర్బన ద్రావణుల్లో కరుగుతుంది.

క్షారం సమక్షంలో లూమినల్ ఎమైనో ధాలేట్ అయాన్ ను ఇస్తుంది. పొటాషియం ఫెర్రిసయనైడ్ ఏర్పరిచే హెక్సాసయనో ఫెర్రేట్ అయాన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ విఘటనానికి ఉత్ర్పేరకంగా పనిచేసి సూపర్ ఆక్సైడ్ రాడికల్ ఆనయాన్ (02)ను ఏర్పరుస్తుంది. ఇది లూమినాల్ ను ఆక్సీకరణం చేస్తుంది. ఈ ఆక్సీకరణ చర్య రసాయన దీప్తికి కారణం. వేర్వేరు రసాయనాలను కలిపి వేర్వేరు రంగుల కాంతిని రాబట్టుకోవచ్చు. ఉదాహరణకు ఫ్లోరోసిన్ తో పనుసు రంగు, రోడమిన్-బి తో పర్పుల్ రంగు వస్తాయి.

ఆధారం: డా. ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate