অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

రాగిని వెండిగా బంగారంగా మార్చేద్దాం

రాగిని వెండిగా బంగారంగా మార్చేద్దాం

మెజీషియన్ సుబ్బు వేదిక మీదికి రాగానే పిల్లలంతా చప్పట్లు కొట్టారు. మెజీషియన్ నవ్వుతూ చేతులు ఊపి అందర్నీ హుషారు పరిచాడు. తన చేతిలో కొన్ని ఎర్రని నాణాలను అందరికీ చూపించాడు “ఈ నాణాలను చూశారుగా, ఇవి రాగితో చేయబడిన పెన్నీలు. ఆ మధ్య నేను అమెరికా వెళ్లినప్పుడు కొన్ని నాతో పాటు తెచ్చుకున్నాను. ఇప్పుడు ఈ రాగి నాణాలను ముందు వెండిగా తర్వాత బంగారంగా మారుస్తాను. ఇదే ఈ రోజు మేజిక్ చూడండి. వేదిక మీద టేబుల్ దాని మీద రెండు బీకర్లలో రంగు లేని ద్రావణాలు ఉన్నాయి. ఒక సారాదీపం వెలుగుతోంది.

mar007.jpgమెజీషియన్ ఒక చిన్న బీకరులో కొంచెం నీరు పోశాడు. తనతో పాటు తెచ్చుకున్న ఒక పొట్లం విప్పి అందులోంచి గచ్చకాయరంగులో వున్న కొద్దిపాటి చూర్ణాన్ని భీకరులోకి పోశాడు. తర్వాత వేరే బీకరులోంచి రంగులేని ద్రావణాన్ని కలిపాడు. చిన్న భీకరును టాంగ్స్ తో పట్టుకుని సారాదీపం జ్వాల మీద ద్రావణం మరిగేలా వేడిచేశాడు. బీకరును తిరిగి టేబుల్ మీద పెట్టి రాగి నాణాలను ఒక దానినొకటి తగలకుండా బీకరులోని ద్రావణంలో ఉంచాడు. పది నిమిషాల తర్వాత టాగ్స్ సహాయంతో నాణాలను బీకరులోంచి పైకి తీసి నీటిలో కడిగి రుమాలుతో తుడిచి అందరికీ చూపించాడు. ఆశ్చర్యం! రాగి నాణెం తెల్లగా మెరుస్తూ వెండి నాణెంలాగా మారిపోయింది. అందరూ చప్పట్లు కొట్టారు.

రాగి నాణేన్ని బంగారంలాగా కూడా మారుస్తానన్నారుగా? తన సందేహాన్ని బయట పెట్టింది ఏడవ తరగతి చదువుతున్న అశ్రిత.

mar006.jpgఇదిగో ఆ మేజిక్ కూడా చేస్తాను చూడండి అన్నాడు మెజీషియన్. వెండి నాణెంగా మారిన పెన్నీని టాంగ్స్ తో పట్టుకుని సారాదీపం జ్వాలపై వెలుపలి అంచుమీద ఉంచి నెమ్మదిగా వేడి చేస్తున్నట్లు కన్పించాడు. అంతే, అందరూ చూస్తుండగానే వెండి నాణెం కాస్తా బంగారం రంగులోకి మారిపోయింది. నాణేన్ని బయటకు తీసి నీటిలో కడిగి అందరికీ చూపించాడు మెజీషియన్. అంతా చప్పట్లు కొట్టారు.

ఈ మేజిక్ మనం కూడా చేయగలం. ఇందుకు కావల్సినవి రాగి నాణేలు(పెన్నీలు లేదా ఏదైనా రాగి వస్తువు), జింక్ చూర్ణం, టాంగ్స్, చిన్న భీకరులో నీరు, వేరే బీకరులో సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం, బుస్సెన్ జ్వాలకం లేదా సారాదీపం.

ఒక చిన్న బేకరులో కొంచెం నీరు తీసుకొని దానికి 1 లేదా 2 గ్రాములు జింక్ చూర్ణం కలపాలి. దీనికి కొంచెం సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం (సుమారు 15% గాఢత) కలిపి మరిగేదాకా వేడి చేయాలి. వేడి చేయడం ఆపి రాగి నాణేలను ఒక దానినొకటి తగల కుండా ఉండేటట్లు బీకరులోని ద్రావణంలో ఉంచాలి. సుమారు 5 లేదా 10 నిమిషాల్లో నాణేలు వెండి రంగులోకి మారుతాయి. ఈ నాణేలను బయటకు తీసి నీటితో కడిగి పొడి గుడ్డతో తుడవాలి. తర్వాత వెండి రంగులో ఉన్న నాణేన్ని టాంగ్స్ తో పట్టుకుని జ్వాల బాహ్య మండలంలో వుంచి నెమ్మదిగా వేడి చేయాలి. నాణెం బంగారం రంగులోకి మారుతుంది. దీన్ని నీటిలో ముంచి చల్లార్చి తర్వాత పొడిగుడ్డతో తుడవాలి. చూశారుగా రాగి నాణెం ముందుగా వెండిగాను తర్వాత బంగారం గాను ఎలా మారిందో. ఈ మేజిక్ చేయడం చాలా తేలిక కదూ!

ఇలా ఎందుకు జరుగుతుంది?

mar005.jpgవేడిగా ఉన్న సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంతో జింక్ చర్య జరపినప్పుడు నీటిలో కరిగే సోడియం జింకేట్ (Na,Zn02) ఏర్పడుతుంది. ఇది రాగి నాణేన్ని తాకినప్పుడు జింక్ గా మారి, నాణెం మీద పూతగా ఏర్పడుతుంది. దీన్నే గాల్వనైజేషన్ అంటారు. అందుకే ఎర్రని రాగినాణెం వెండి రంగులోకి మారుతుంది. ఇప్పుడు ఈ నాణేన్ని జ్వాల మీద వేడి చేసినప్పుడు రాగి, జింక్ లు గలనం (buse) చెంది ఇత్తడి (Brass)ని ఏర్పరుస్తాయి. ఇత్తడి బంగారు పసుపు రంగులో వుండే ఒక మిశ్రమలోహం. అందుకే నాణెం బంగారు రంగులోకి మారుతుంది.



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate