অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సరదా సరదా నీటి బుడగలు

బకెట్టులోని నీటిలో సబ్బుగాని, సర్ఫుగాని వేసి బాగా కలియబెట్టినప్పుడు కొన్ని వందల కొద్దీ నీటి బుడగలు ఏర్పడడాన్ని మీరు ఎన్నోసార్లు గమనించి వుంటారు. కాకపోతే ఈ బుడగలు ఇలా రూపొంది, అలా మాయమైపోతూ వుంటాయి. అయితే ఉన్నంతసేపూ అనేక రంగులలో అవి మెరుస్తుంటాయి.

304.jpgఅదే విధంగా, సబ్బునీటిలో, ఓ పుల్లని ముంచి తీసి గాల్లో నీటి బుడగలను కూడా మీరు ఎన్నోసార్లు వదిలిపెట్టి వుంటారు. అవునా ...నిజానికి ఈ పనంటే దాదాపు ప్రపంచంలోని పిల్లలందరికీ ఇష్టమే. ఇలా గంటలకు గంటలు నీటి బుడగలను వదులుతూ తమను తాము మరిచిపోయే పిల్లలు ఎందరో ఎందరెందరో..

మీకో సంగతి తెలుసా... ఇలా రూపొందే అన్ని నీటి బుడగలూ వెంటనే పగిలిపోవు. కొన్నిటిని మనం ముట్టుకోవచ్చు. కొన్నిటిని నేలపై బంతిలా దొర్లించవచ్చు. ఇలా వాటితో రకరకాల విన్యాసాలని కూడా మనం చేయించవచ్చు.

గాలి బుడగ ఏదైనా ఒక వస్తువులోంచి దూరి అవతలికి వెళ్ళిపోతే ఎలా వుంటుంది. పొనీ గాలి బుడగ లోపలి ఏదైనా వస్తువు దూరిపోతే ఎలా వుంటుంది... ఒకసారి ఊహించి చూడండి. భలే సరదాగా వుంటుంది కదా.. అన్నట్లు ఒకానొక కథలో ఓ కుర్రాడు (సబ్బు) నీటి బుడగల మీద రకరకాల ప్రయోగాలు చేస్తుంటాడు. కొత్తకొత్త నీటి బుడగలను సృష్టించేందుకై అతను రకరకాల పదార్థాలను, వేర్వేరు పాళ్ళలో కలుపుతుంటాడు. ఒకనాడు అందుకోసం ఏమేం కలుపుతాడో ఏమోగానీ (కొండమీది నుంచి) అతను ఊదే గొట్టంలోంచి కొన్ని అడుగుల వ్యాసంతో వుండే చాలా చాలా పెద్ద నీటి బుడగ బయటకు వస్తుంది. ఆ తరువాత అది కొండమీద నుంచి జరజరా దొర్లుకుంటూ ఊరి మీద పడుతుంది. దారిలో దానికే అడ్డుగా నిలిచిన అనేకమంది చిన్న పిల్లల్ని, గొర్రెల్ని, కోళ్ళని, ఆవుల్ని, ఆఖరికి ఒక గుర్రపుబండీని కూడా ఆగాలి బుడగ తనలోకి తీసేసుకుంటుంది. చివరకు, ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయమూ కలగదుగానీ, ఆ బుడగకు మూల కారణమైన కుర్రాడ్ని మాత్రం వేరే వూరికి పంపించేస్తారు.

ఈ కథలోని నీటి బుడగలాంటి గొప్ప నీటి బుడగను కాకపోయినా మీరు కూడా చాలా సేపటి దాకా వుండే పెద్ద పెద్ద, అందమైన నీటి బుడగల్ని సృష్టించవచ్చు. వీటితో రకరకాలుగా మీరు ఆడుకోవచ్చు కూడా. ఇలాంటి బుడగలను సృష్టించడంలో ఎంతటి సైన్సు వుంటుందో. అంతటి కళ కూడా వుంటుంది.

మీరేం చేయాలంటే...

ముందుగా ఏదైనా ఒక మామూలు సబ్బుని లేదా సబ్బు ముక్కల్ని నీటిలో కరిగించి చిక్కగా వుండే కొంచెం సబ్బు నీటి ద్రావకాన్ని తయారు చేయండి. ఇందుకే సాధారణంగా అందరూ ఏ నీటిని పడితే ఆ నీటిని వాడుతుంటారు. కాని అది సరికాదు.

సబ్బునీటి ద్రావకాన్ని తయారు చేసేందుకై మీరు ఓ ఐసుగడ్డను కరిగించగా వచ్చిన నీటిని గాని లేదా నేరుగా పట్టిన వాననీటిని గాని వాడాల్సి వుంటుంది. ఇంజక్షన్లలో కలిపే డిస్టిల్ వాటర్ ని కూడా వాడొచ్చుగాని అది కొంచెం ఖర్చుతో కూడిన పని. ఒకవేళ ఐసుగడ్డగాని, వాననీరుగాని దొరకని పక్షంలో మామూలు నీటిని మరిగించి, అలా మరిగించినప్పుడు వచ్చిన ఆవిరిని చల్లార్రగా వచ్చిన నీటిని కూడా మీరు వాడవచ్చు.

ఇలాంటి శుద్ధమైన నీటిలో సబ్బు ముక్కల్ని గాని, లేదా సర్ఫుని గాని వేసి, అది చిక్కని ద్రవకంలా మారేదాకా బాగా కలపండి... ఎక్కువ సేపటి దాకా వుండే పెద్దపెద్ద నీటి బుడగల కోసం ఈ దొరుకుతుందో ఏమిటో అని బెంగ పడవలసిన అవసరం లేదు.

ఏ మందుల షాపులోనేనా మీకు అతి సులభంగా దొరుకుతుంది. ఒక చిన్న సీసాను తెచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చెంచాను ఉపయోగించి, ద్రావకం మీద పేరుకుని ఉన్న నురుగునంతటినీ తీసేయండి. ఆ తరువాత ఓ సన్నని గొట్టం లేదా స్ట్రాని తీసుకుని, దాని ఓ కొసను సబ్బునీటి ద్రావకంలో ముంచి తీయండి. అలా చేయడం వలన, ఆ కొస వద్ద ఒక పలుచని సబ్బునీటి పొర ఏర్పడుతుంది. ఇప్పుడు గొట్టం రెండో కొసను మీ పెదాల మద్య బిగించి పట్టుకుని దానిలోకి మెల్లగా గాలిని వూదండి. మీనోటి నుంచి వచ్చిన వేడివేడిగాలి సబ్బునీటి పొరను ముందుకు నెట్టి, చివరకు దానితో రూపొందే బుడగలో బందీ అవుతుంది. బుడగలోని గాలి వేడిగా వుండే కారణంగా, ఆ బుడగ బయటి గాలితో తేలుతూ ముందుగు సాగుతుంది.

ఇంకా సబ్బు కలపాలని ఇలా తెలుస్తుంది.

మీ ద్రావకంలో సబ్బు తగినంతగా వుందా లేక ఇంకా కలపాల్సిన అవసరం వుందా అన్న విషయాన్ని మీరు చాలా సులభంగా తెలుసుకోవచ్చు.

305.jpgమీ చేతి వేళ్ళలో ఓ వేలిని ద్రావకంలో ముంచి ఆ వేలితో, గొట్టం చివర రూపొందిన గాలి బుడుగను ముట్టుకోండి. ఒకవేళ అలా చేసినప్పుడు అది వెంటనే లేచి పోయినట్లయితే, మీ ద్రావకంలో మరికొంచెం సబ్బుని కలపాల్సిన అవసరం వుందని గుర్తించండి. అలాగే, మొదట్లోనే మీరు 10 సెంటీమీటర్లు వ్యాసంతో వుండే నీటి బుడగును తయారు చేయగలిగినట్లయితే, అలాంటి సందర్భంలో కూడా ద్రావకంలో మరికొంచెం సబ్బుని కలపాల్సిన అవసరం వుందని గుర్తించండి. చాలా కాలం వుంటాయి.

సబ్బు నీటి బుడగలు ఇలా పుట్టి అలా పగిలిపోవడాన్ని మనం సాధారణంగా చూస్తుంటాము. అవునా... అయితే పరిస్థితులు అనుకూలంగా వుండాలే గానీ ఈ బుడగలు ఎంత కాలమైనా ఉండగలుగుతాయని కొన్ని ప్రయోగాలు స్పష్టం చేస్తున్నాయి. మీరు తయారు చేసిన గాలి బుడగ దేనికీ ఢీ కొట్టు కోకుండా వున్నట్లయితే, దానికి దుమ్ము, ధూళి, వేడిగాని వంటివి తగలనట్లయితే అది కొన్ని వారాలపాటు పగిలిపోకుండా వుంటుంది. ఆశ్చర్యంగా వుంది కదూ... అయినా అది నిజం మీకు తెలుసో తెలీదో గాని లారెన్స్ అనే ఒక అమెరికా దేశస్థుడు ఒక గాజు బీరువాలో కొన్ని సంవత్సరాల పాటు నీటి బుడగల్ని సురక్షితంగా ఉంచగలిగాడు.

ఈదే రంగులు

బాగా వెలుతురు వుండే ప్రదేశంలో, ముఖ్యంగా పగటి సమయంలో మీరు సృష్టించే బుడగలపైన రకరకాల రంగులు మీకు ఎంతో అందంగా కన్పిస్తాయి. ఈ బుడగలపైన వివిధ రంగులకు చెందిన కాంతి రేఖలు ఈదుతూ వుండటాన్ని కూడా మీరు గమనించవచ్చు. భలే అందంగా వుంటుంది ఆదృశ్యం...

శాస్త్రజ్ఞులకూ చెప్పలేనంత ఆశక్తి

306.jpgపిల్లలకే కాదు, శాస్త్రజ్ఞులకూ నీటి బుడగలంటే ఆసక్తే ఎందుకంటారా... ఈ నీటి బుడగలపైన తారాడే రంగులను బట్టి ఆ కాంటి తాలూకూ తరంగధైర్ఘ్యాన్ని వీరు తెలుసుకోగల్గుతున్నారు. అణువుల మధ్య ఆకర్షణ అనేదే లేకపోతే ఈ విశ్వమంతా ఓ బ్రహ్మాండమైన (అణు) ధూళి నిండిన ప్రదేశంలా తప్పించి మరోలా వుండేది కాదు. నీటి బుడగలోని పలుచలి పొరను నిశితంగా పరిశీలించడం ద్వారా, అణువుల మధ్య పరస్పరం ఏ రకమైన ఆకర్షణ సంభవిస్తుందో తెలుసుకొనేందుకు కూడా నీటి బుడగలు శాస్త్రజ్ఞులకు ఉపయోగపడుతున్నాయి. అదీ అసలు విషయం. అర్థమయ్యిందిగా....

రచయిత: కె ఆదర్శ సామ్రాట్,

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/3/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate