অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

తప్పనిసరి బోధనాంశంగా తెలుగు అమలు

తెలంగాణ సుందరమైన ప్రదేశం. భౌగోళికంగా సుసంపన్నమైన ప్రాంతం. నదులు, కొండలు, అడవులు, చెరువులు, వాగులు, నల్ల, ఎర్ర రేగడి భూములు, గనులు, ఖనిజాలతో విలసిల్లుతున్న ప్రాంతం. ఉత్తరాన గోదావరీ నది, దక్షిణాన కృష్ణానది, సహజ సరిహద్దులుగా నెలకొని ఉన్న ప్రాంతం. గోదావరినానుకొని దండకారణ్యం, కృష్ణనానుకొని నల్లమల్ల అడవులు సహజ సంపద నిలయాలుగా ఉన్నవి. భౌగోళికంగా ఎన్నో అనుకూలతలు, వనరులు ఉన్న ప్రదేశం కావటంవల్ల ఇక్కడ ఎన్నో జాతుల వాళ్ళు వేల సంవత్సరాలుగా నివసిస్తున్నారు. వీరిలో గోండులు ఒకరు. తాము మూలపురుషులుగా భావించి పూజించే వారిలోని 'తెలింగం'ను తెలుగు జాతి మూలపురుషుడని ఆరుద్ర భావించాడు. స్థానికంగా ప్రాచీనకాలం నుంచి 'తలైంగ్' జాతివారు నివసించారని, 'తలైంగ్'లు నివసించినందువల్లనే 'తిలింగ, తెలుంగు' పదాలు వచ్చాయని, వారు మాట్లాడే భాష 'తెలుగు' అని, ఆ జాతి 'తెలుగు' అని ఖండవల్లి సోదరులు భావించారు. మార్కండేయ, వాయు పురాణాల్లో 'తిలింగ' ప్రస్తావన ఉన్నది. గ్రీకు శాస్త్రజ్ఞుడు 'టాలెమి' తన యాత్రా చరిత్రలో “టిలింగాన్' పదాన్ని పేర్కొన్నాడు. ఈ 'తిలింగ' శబ్దమే 'తెలుగు' శబ్దానికి మూలం. 'తెలుంగు', 'గణం' కలిసి తెలంగాణగా మారినట్లు భావించవచ్చు. మెదక్ జిల్లాలోని తెల్లాపూర్ లో బయటపడిన క్రీ||శ|| 1417 నాటి శాసనంలో 'తెలంగాణ' పదం ప్రయోగించబడింది. అనంతర కాలంలో, వ్యవహారాల్లో 'తెలంగాణ' పదం విస్తృత ప్రచారంలోకి వచ్చింది. ఇక్కడి ప్రజల భాష తెలుగు. తెలుగు మాట్లాడే వారుండే ప్రాంతం కాబట్టే ఇది 'తెలంగాణ' అని అంటున్నారు.

భాష కేవలం భావ వినిమయ సాధనం అనేది ప్రాథమిక భావన. భాష పరిధి చాలా విస్తృతమైంది. మన భౌతిక వాతావరణం, చరిత్ర, ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రత్యేకతలు, సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వం, ఉజ్జ్వల స్మృతులు భాషలో నిక్షిప్తమై ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక జాతి ఆత్మ ఆ జాతి భాషలో ప్రతిబింబిస్తుంది.

తెలంగాణ ప్రజలు వ్యవహరించే తెలుగు విశేషమైంది. ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్నది. లయబద్ధంగా ఉండడంవల్ల, దృతాత్మకంగా ఉచ్చరించడంవల్ల వినసొంపుగా ఉంటుంది. జీవితానుభవాలలో వికసించిన సామెతలు, జాతీయాలు, పలుకుబడులు సహజంగానే ఇమిడి ఉండడంవల్ల అర్థవంతమై అలరిస్తున్నది. సహజత్వం, సరళత్వంతోపాటు సృజనాత్మకంగా సాగిపోతున్నది. భావాలను ప్రసన్నంగా వ్యక్తంచేసే పద్ధతివల్ల 'జాను తెనుగు' గా ప్రశంసలందుకున్నది. కమ్మని ధ్వనులకు, కమనీయ అలంకారాలకు నెలవైన భాష. జానపద గీతాలకైనా, పద్యకావ్యాలకైనా, అలవోకగా ఒదిగిపోయే అందమైన భాష. సంస్కృత, ఉర్దూ, పారశీ, అరబ్బి, ఆంగ్ల, హిందీ పదాలను కలుపుకొని పదవిస్తృతి సాధించి విశాలతత్వంతో కొత్త సాబగులను అద్దుకొని పురోగమిస్తున్న భాష.

ఎన్నో సాహితీ ప్రక్రియలకు పురుడుపోసుకున్న ప్రాంతం తెలంగాణ. తొలికందం, ద్విపద, సీసం, శతకం, దేశీపురాణం, అచ్చతెనుగు కావ్యం, యక్షగానం, పాట-గేయం వంటి సాహితీ ప్రక్రియలు తెలంగాణ కవుల కలాల నుండి జాలువారినవే! వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది కాబట్టే 'తెలుగు'కు ప్రాచీన హోదా గూడా లభించింది. భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో తెలుగు 4వ స్థానంలో ఉన్నది.

తెలుగు ఇక్కడి వారికి మాతృభాష ఇతరులకు తమ అవసరాలను తీర్చే ప్రాంతీయ భాష. తెలుగును అభ్యసించడం వ్యక్తిగత, సామాజిక అవసరం. ఎవరైనా తమ మాతృభాషలోనే ఆలోచిస్తారు. అతి సున్నిత భావాలనైన మాతృభాషలో వ్యక్తంచేసినంత ప్రభావవంతంగా ఇంకే భాషలోనూ చేయలేరు. ఏ మాధ్యమంలో చదువుతున్నప్పటికీ మాతృభాషలో అర్థం చేసుకొని, అవసరమైన సందర్భాలలో ఇతర భాషలోకి అనువదించుకొని వ్యక్తం చేస్తారు. తెలుగు మాతృభాషకానివారు తెలంగాణ రాష్ట్రంలో తెలుగు నేర్చుకోవడంవల్ల తమ దైనందిన వ్యవహారాలను సమర్థంగా నిర్వహించుకోగలుగుతారు. ఇక్కడి ప్రజలతో మమేకం కావడంలో, మానవ సంబంధాలు ఏర్పరచుకోవడంలో, తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను అర్థం చేసుకోవడం తెలుగేతరులకు ఒక సామాజిక అవసరం. అందుకే తమ మాతృభాషతో పాటు తెలుగును నేర్చుకోవడం వారికి అత్యవసరంగా మారింది. అట్లాగే ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకొనే సత్తా కూడా పిల్లలకుందని, ఎన్ని ఎక్కువ భాషలు నేర్చుకొంటే, అది వారి విజ్ఞాన పరిధిని అంత విస్తృతపరుస్తుందని, ఆయా భాషలపట్ల సున్నితత్వము, గౌరవభావం, సహనం, విశ్లేషణ, సృజనాత్మక వంటివి వ్యక్తుల్లో వృద్ధిచెందుతాయని భాషావేత్తలు పేర్కొన్నారు.

దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య తగ్గుతున్నందని UNESCO, ప్రసారమాధ్యమాలు పేర్కొనడం గమనార్హం. ఆంగ్ల మాధ్యమాల మోజులో తెలుగు అభ్యసనం నిర్లక్ష్యానికి, న్యూనతకు లోనౌతున్నది. దీనివల్ల మన భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు దూరమయ్యే ప్రమాదం వాటిల్లుతున్నది. ఈ పరిస్థితిని అధిగమించి 'తెలుగు'ను ప్రతి ఒక్కరూ అభ్యసించేలా చేయడం తక్షణావసరంగా మారింది.

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులందరూ తప్పనిసరిగా తెలుగును ఒక సబ్జెక్టుగా చదువాలని, దీనికి చట్టాన్ని రూపొందిస్తామని 2017 డిసెంబర్ లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ, ముగింపు సమావేశాల్లో ప్రకటించి తన భాషాభిమానాన్ని చాటారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 213, తేది : 31-10-17 ద్వారా ఒక కమిటీని నియమించింది. కమిటీ సభ్యులు పంజాబ్, ఢిల్లీ, తమిళనాడు, కర్నాటక వంటి రాష్ట్రాలతోపాటు, సి.బి.యస్..ఇ, ఐ.సి.ఎస్.ఇ., కేంద్రీయ విద్యాలయాలు వంటి సంస్థలను సందర్శించి భాషా వినియోగం, వివిధ భాషల అభ్యసనం, అమలుతీరు తెన్నులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నివేదికను పరిశీలించి, చర్చించి ఒకటవ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాలు, అన్ని మాధ్యమాలకు చెందిన పాఠశాలల్లో 'తెలుగు'ను తప్పనిసరి బోధనాంశంగా 2018-19 విద్యా సంవత్సరం నుండి అమలు చేయడానికి చట్టాన్ని రూపొందించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఇందుకనుగుణంగా 2018 మార్చ్ మాసంలో జరిగిన శాసన సభ, శాసన మండలి సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టారు. తేది : 30-03-2018 రోజునాడు "Act No.10 of 2018” గా తెలంగాణ రాష్ట్రంలో తెలుగును బోధించడం, నేర్చుకోవడం తప్పనిసరి (Teaching and Learning Telugu Language At Compulsory in the State of Telangana) అనే పేరుతో చట్టం రూపొందింది.

చట్టంలోని అంశాలను అమలుపర్చుటకు అవసరమైన వివరణలు, విధివిధానాలు, వివిధ అంశాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఉత్తర్వు 15ను తేది : 01-06-2018 రోజునాడు విడుదల చేసింది. ఇందుకనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాలు, అన్ని మాధ్యమాలకు చెందిన పాఠశాలల్లో 2018-19 విద్యా సంవత్సరం నుండి తెలుగును విధిగా నేర్పాలని, విద్యార్థులు నేర్చుకోవాలని తెలుపుతూ పాఠశాల విద్యాశాఖ, తేది : 29-06-2018 రోజున ఉత్తర్వులను జారీ చేసింది.

పాఠశాలలో తప్పనిసరి బోధనాంశంగా తెలుగును బోధించడం, నేర్చుకోవడం గురించి రూపొందించిన చట్టం 10, తేది : 30-03-2018, ప్రభుత్వ ఉత్తర్వు 15, తేది : 01-06-2018లోని ముఖ్యాంశాలు.

 • తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాలు అనగా రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలు, రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపుపొందిన ప్రైవేటు పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, సి.బి.యస్.ఇ., ఐ.సి. ఎస్.ఇ, ఐ.బి. సంస్థలకు అనుబంధంగా నడిచే అన్ని రకాల పాఠశాలల్లో 2018-19 విద్యా సంవత్సరం నుండి తెలుగును తప్పనిసరి బోధనాంశంగా అమలుపరుస్తారు.
 • మన రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని తెలుగు, ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో తెలుగు ఇప్పటికే అమలులో ఉన్నది. ఐతే ఇతర మాధ్యమ పాఠశాలల్లో అనగా ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళం, బెంగాలీ, మరాఠీ మాధ్యమ పాఠశాలల్లో, సి.బి.యస్.ఇ., ఐ.సి.ఎస్.ఇ., ఐ.బి.పాఠశాలల్లో కూడా తెలుగును నేర్పడాన్ని దశల వారీగా అమలుపరుస్తారు. అనగా ఇప్పటివరకు తెలుగును అమలుచేయని పాఠశాలల్లో 2018-19 విద్యా సంవత్సరంలో ఒకటవ తరగతితో ప్రాథమిక స్థాయిలో ప్రారంభించి సంవత్సరానికి ఒక తరగతి చొప్పున విస్తరిస్తారు. అట్లాగే ఉన్నత పాఠశాలల్లో 2018-19 విద్యా సంవత్సరంలో 6వ తరగతితో ప్రారంభించి ఒక్కో సంవత్సరానికి ఒక తరగతి చొప్పున విస్తరిస్తారు.

అమలు సం||

ప్రాథమిక స్థాయి

ఉన్నత స్థాయి

2018-19

1వ తరగతి

6వ తరగతి

2019-20

1, 2వ తరగతి

6, 7వ తరగతి

2020-21

1, 2, 3వ తరగతి

6, 7, 8వ తరగతి

2021-22

1, 2, 3, 4వ తరగతి

6, 7, 8, 9వ తరగతి

2022-23

1, 2, 3, 4, 5వ తరగతి

6, 7, 8, 9, 10వ తరగతి

 • ఇతర మాధ్యమ పాఠశాలల్లో తెలుగు బోధించడానికి ఉపాధ్యాయులను లేదా విద్యావాలంటీర్లను ప్రభుత్వం నియమిస్తుంది.
 • ఏ పాఠశాలలోనైనా రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణాసంస్థ రూపొందించిన తెలుగు వాచకాలనే వినియోగించాలి. ఇందుకోసం 2018-19 విద్యా సంవత్సరంలో ఇతర మాధ్యమ పాఠశాలల విద్యార్థులు తెలుగు నేర్చుకోవడానికి 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకాలు రూపొందించారు.
 • ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 17, తేది : 14-05-2014 ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని తెలుగు భాష కోసం నిర్వహించాలి. 10వ తరగతిలో ప్రభుత్వం నిర్దేశించిన కనీస ఉత్తీర్ణత మార్కులను పొందాల్సి ఉంటుంది.
 • తెలుగు, ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాలల్లో తెలుగుతోపాటు ఆంగ్లాన్ని అభ్యసిస్తారు నేర్చుకొంటారు. ఇది గతంలోవలే కొనసాగుతుంది. ఐతే ఇతర మాధ్యమాలు అనగా ఉర్దూ, హిందీ, బెంగాలీ, తమిళం కన్నడ, మరాఠి మాధ్యమ పాఠశాలల్లో ఇప్పటి వరకు వారి మాతృభాష, ఆంగ్లాన్ని మాత్రమే నేర్చుకొంటున్నారు. 2018-19 విద్యా సంవత్సరం నుండి తెలుగును కూడా తప్పనిసరిగా బోధించాలి. విద్యార్థులు నేర్చుకోవాలి.
 • అట్లాగే ఉన్నత పాఠశాలల్లో ఇప్పటికే తెలుగు, ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో తెలుగును నేర్చుకొంటున్నారు. ఇది ఇలాగే కొనసాగుతుంది. ఐతే ఇతర మాధ్యమ పాఠశాలల్లో 2018-19 విద్యా సంవత్సరం నుండి తెలుగు, ఆంగ్లం భాషలతోపాటు తృతీయ భాషగా హిందీ / ఉర్దూ / సంస్కృతం / వారి మాతృభాషలలో ఏదైనా ఒక దానిని కూడా నేర్చుకోవచ్చు.

తెలుగు - సెకండరీ ఉపాధ్యాయ శిక్షణా మార్గదర్శి

 • సి.బి.ఎస్.ఇ, ఐ.సి.ఎస్.ఇ, ఐ.బి. పాఠశాలలో ప్రాథమిక స్థాయిలో రెండు భాషలనే నేర్చుకొంటారు. దీంట్లో ఆంగ్లం తప్పనిసరి. ఐతే ద్వితీయ భాషగా తెలుగు నేర్చుకొనే అవకాశమున్నది. కాని తప్పని సరికాదు. కాబట్టి చట్టం వల్ల తప్పనిసరిగా తెలుగును నేర్చుకోవాల్సి ఉంటుంది. వారి మాతృభాషను తృతీయ భాషగా నేర్చుకోవచ్చు.
 • ఐదవ తరగతి వరకు తెలుగు చదువకుండా 6వ తరగతిలో ప్రవేశించిన విద్యార్థుల కోసం సరళమైన తెలుగు వాచకాలను చదువడం, రాయడం, చేయగలిగేలా రూపొందించారు. 5వ తరగతి వరకు తెలుగు చదివిన వారికి 6వ తరగతిలో సాధారణ తెలుగు వాచకం 'నవ వసంతం'ను వినియోగించాలి. 1వ తరగతిలో కూడా తెలుగు, ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో సాధారణ తెలుగువాచకం జాబిలి-1 ని, ఇతర మాధ్యమాలలో 'తేనెపలుకులు'-1 సరళమైన తెలుగు వాచకాన్ని వినియోగించాలి.
 • ఎవరైనా పిల్లలు 7వ తరగతి వరకు తెలుగు చదువకుండా '8' వ తరగతిలో లేదా ఆపై తరగతుల్లో మన రాష్ట్రంలో విద్యను అభ్యసించడానికి పాఠశాలల్లో ప్రవేశం పొందితే వారు 'తెలుగు నేర్చుకోవడాన్ని మినహాయింపునిస్తారు. అయితే దీనికి సంబంధిత జిల్లా విద్యాధికారి ద్వారా సంచాలకులు, పాఠశాల విద్యాశాఖ గారికి దరఖాస్తు సమర్పించి మినహాయింపు పొందాల్సి ఉంటుంది.

చట్ట ఉల్లంఘన - చేపట్టే చర్యలు

 • “తెలుగు తప్పనిసరి చట్టాన్ని” ఉల్లంఘించడం అంటే...

ఎ) తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించకపోవడం.

బి)తెలుగు భాషోపాధ్యాయుడిని / బోధకుడిని తెలుగును బోధించడానికి కేటాయించకపోవడం.

సి) రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రభుత్వ తెలుగు పాఠ్యపుస్తకాలను వినియోగించకపోవడం.

డి) చట్టంలో పేర్కొన్న ఇతర నియమాలను పాటించకపోవడం. (Act No.10 off 2018 జి.వో.నెం. 15, తేది : 01-06-2018)

 • పైన తెల్పిన విధంగా ఏదైనా ప్రైవేటు యాజమాన్యానికి చెందిన పాఠశాలలు తెలుగును తప్పనిసరి బోధనాంశంగా అమలుచేయడంలో విఫలమైతే చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా భావిస్తారు. ఈ సందర్భంలో కింది చర్యలు చేపడతారు.

అవి :

 • ఏదైనా పాఠశాలలో తెలుగు అమలుతీరు చట్టాన్ని ఉల్లంఘించినట్లు దృష్టికివస్తే జిల్లా విద్యాధికారి నోటీసు జారీ చేస్తాడు. దీనికి సంబంధిత యాజమాన్యం 15 రోజులలోగా జవాబివ్వాలి.
 • జవాబిచ్చిన తర్వాత మళ్ళీ పరిశీలిస్తారు. అయినప్పటికీ చట్ట ఉల్లంఘన కొనసాగితే జిల్లా విద్యాధికారి జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకెళతాడు. జిల్లా కలెక్టరు మొదటి తప్పుగా భావించి 50,000/- (యాభైవేల రూపాయలను) అపరాధ రుసుంను విధిస్తాడు. సదరు పాఠశాల యాజమాన్యం దీని గురించి పాఠశాల విద్యా సంచాలకులకు అప్పీలు చేసుకోవచ్చు.
 • అయినప్పటికీ ఇదే విధంగా రెండవసారి కూడా ఉల్లంఘించినట్లైతే జిల్లా కలెక్టరు గారు సదరు పాఠశాలలకు ఒక లక్ష రూపాయల అపరాధ రుసుమును విధించవచ్చు.
 • అట్లాగే మూడవ సారి కూడా జరిగితే, ఆ పాఠశాల గుర్తింపును రద్దుచేస్తారు. ఇలా గుర్తింపు రద్దేన పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 10వ తరగతి పరీక్షను రాష్ట్రంలోని ఎస్. ఎస్.సి. బోర్డు లేదా సి.బి.ఎస్.ఇ. లేదా ఐ.సి. ఎస్.ఇ వంటి ఏ బోర్డు కూడా పరీక్షలు నిర్వహించడానికి అవకాశముండదు.

రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు

రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలుగును తప్పనిసరిగా బోధించడాన్ని పరిశీలించి చర్యలు చేపట్టడానికి రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని, అట్లాగే జిల్లా కలెక్టరు నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది. ఈ కమిటీలు మొదటి సంవత్సరంలో ప్రతి మూడు మాసాలకు ఒకసారి, రెండవ సంవత్సరం నుండి ఆరు మాసాలకొకసారి సమావేశమై సమీక్షించి తగు చర్యలు చేపట్టడానికి ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తుంది.

వృత్యంతర శిక్షణలు

 • రాష్ట్రంలోని అధికారులు మానిటరింగ్ సభ్యులు, ఉపాధ్యాయులు మొదలగువారందరికీ రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణాసంస్థ ప్రతి సంవత్సరం శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
 • రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు, మండల విద్యాధికారులు, ఉపాధ్యాయ విద్యా కళాశాలల ప్రిన్సిపాళ్ళు, ఉపవిద్యాధికారులకు రాష్ట్ర స్థాయిలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
 • అట్లాగే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మండల విద్యాధికారులు మొదలగు వారికి జిల్లా విద్యాధికారి నేతృత్వంలో జిల్లాస్థాయిలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు.

వనరులను సమకూర్చడం

 • అన్ని పాఠశాలల్లో తెలుగును సమర్ధవంతంగా బోధించడానికి, విద్యార్థులు నేర్చుకోడానికి వీలుగా పాఠశాలల్లో, గ్రంథాలయాలను ఏర్పాటుచేయాలి.
 • బోధనాభ్యసన సామగ్రిని సమకూర్చాలి.
 • సాంకేతికతను వినియోగించాలి. డిజిటల్ పాఠాల బోధనను చేపట్టాలి.
 • పాఠశాలల్లో బాలసాహిత్యం పిల్లలకు అందుబాటులో ఉంచడం ద్వారా తెలుగును నేర్చుకొనే వాతావరణాన్ని కల్పించాలి.

ముగింపు

తెలంగాణ రాష్ట్రంలో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అన్ని పాఠశాలల్లో బోధించి పిల్లలు నేర్చుకొనేలా చేయాలి. తద్వారా తెలంగాణ సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలు వంటివి పిల్లలు అర్థం చేసుకొని, వాటి గొప్పదనాన్ని గుర్తించి గౌరవించాలి. తెలుగేతరులు తెలుగును నేర్చుకోవడం ద్వారా తెలంగాణ సమాజంతో మమేకమై, ఉన్నతమైన మానవ సంబంధాలను నెలకొల్పాలి. వారి దైనందిన అవసరాలను తీర్చుకోగలగాలి. ఈ సదుద్దేశంతో రూపొందించిన చట్టాన్ని అమలుపరచడంలో మనం అందరం భాగస్వాములం కావాలి.

ఆధారము : సమగ్ర శిక్ష అభియాన్,వృత్యంతర శిక్షణ కార్యక్రమము 2018 -19 యస్ ఇ ఆర్ టి ,హైదరాబాద్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate