హోమ్ / విద్య / ఉపాధ్యాయ వేదిక / వృత్యంతర శిక్షణా కార్యక్రమము 2018 -19 / ధారాళంగాచదువడం అర్థంచేసుకొని ప్రతిస్పందించడం
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ధారాళంగాచదువడం అర్థంచేసుకొని ప్రతిస్పందించడం

భోధన అభ్యాసన ప్రక్రియలో విద్యార్థి ధారాళంగాచదువడం అర్థంచేసుకొని ప్రతిస్పందించడం

పరిచయం

పరిచిత అపరిచిత అంశాలను, పట్టికలను, అక్షర రూపంలో ఉన్న అంశాలను స్పష్టంగా, ధారాళంగా, విరామచిహ్నాలను పాటిస్తూ, భావానికి తగినట్లు, సందర్భానుగుణంగా చదువాలి. చదివిన విషయాన్ని అవగాహన చేసుకోవాలి. తరువాత ప్రశ్నలకు జవాబులు రాయగలగాలి. ప్రశ్నలు తయారుచేయగలగాలి. బహుళైచ్ఛిక ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించగలగాలి. ఖాళీలు పూరించగలగాలి. చదివిన విషయంలోని కీలక పదాలు గుర్తించగలగాలి. విషయం మీద ఎలాంటి ప్రశ్నలడిగినా జవాబులు సాధించగలగాలి. చదువడం వాచిక చర్య అయితే అవగాహన చేసుకోవడం మానసిక చర్య. ఈ రెండు అవినాభావ సంబంధమైనవి. వీటికి ప్రతి చర్యలు ప్రతిస్పందించడం. ధారాళంగా చదివి అర్థం చేసుకొని ప్రతిస్పందించగలవారు అన్ని రకాల అభ్యసన ఫలితాలను సాధించగలుగుతారు అన్నది అక్షర సత్యం.

ఆశించిన అభ్యసన ఫలితాలు

 • పద్యం, వచనం, పాట, గేయం, సంభాషణ, పట్టిక తదితర అంశాలను ధారాళంగా స్పష్టంగా చదువగలగాలి. అవగాహన చేసుకోగలగాలి. అభిప్రాయం చెప్పగలగాలి.
 • చదువుతున్న అంశాలలోని కీలకాంశాలను గుర్తించగలగాలి. అంశానికి శీర్షికను సూచించగలగాలి. అర్థం చేసుకొని ప్రతిస్పందించగలగాలి.
 • పరిచిత అపరిచిత అంశాన్ని అర్థం చేసుకొని పట్టికలు రాయడం, ప్రశ్నలు తయారుచేయడం, ఖాళీలను పూరించడం, తప్పొప్పులు గుర్తించడం, పోలికలు రాయడం, మొదలైనవాటిపై తన అభిప్రాయాలను మౌఖికంగా మరియు లిఖిత పూర్వకంగా వ్యక్తీకరించగల్గాలి. చదివిన అంశంలోని సామెతలను, జాతీయాలను గుర్తించగలగాలి.
 • తెలుగులోని వివిధ రకాల పఠన సామగ్రిని చదివి అర్థం చేసుకొని ప్రతిస్పందించగలగాలి. వాటిలోని విశేషాంశాలను గుర్తించగలగాలి. లిఖిత రూపంలో వ్యక్తీకరించగలగాలి.
 • విద్యార్థి స్థాయికి అనుగుణంగా అభ్యాసాలకొరకు వివిధ రూపాల్లో అంశాలు సిద్దం చేసుకుంటే సాధనకు ఉపయుక్తంగా ఉంటుంది.
 • పద్యాలకు ప్రతిపదార్థాలు రాయగలగాలి.
 • గేయం పద్యం భావం ఆధారంగా పంక్తులను గుర్తించగలగాలి.

సామర్థ్య సాధనలో ఎదురవుతున్న సమస్యలు 

 • విద్యార్థులు స్పష్టంగా ధారాళంగా చదువలేకపోవడం.
 • చదివిన విషయాన్ని అర్థం చేసుకోలేకపోవడం.
 • ప్రశ్నలకు జవాబులు రాయలేకపోవడం.
 • ప్రశ్నలు తయారుచేయలేకపోవడం.
 • కీలక పదాల గుర్తింపులో వెనుకబాటు.
 • ప్రశ్నకు చెందిన పదం పేరాలో వెతికి ఆ వాక్యం యథాతథంగా రాయడం.

సామర్థ్య సాధనకై వ్యూహాలు 

 • పిల్లలకు ఆసక్తి కలిగే అంశాలు చదివే అవకాశం కల్పించడం.
 • చదువుతున్నప్పుడే తర్వాత వాక్యాన్ని ఊహించేలా తెలిసిన అంశాలు చదివించడం.
 • సరళ వాక్యాలతోకూడిన బాలసాహిత్యం అందుబాటులోకి తేవడం.
 • పలికిన ధ్వనికి లిఖిత రూపానికి అనుసంధానం కుదిరేలా వీలైనన్ని ఎక్కువసార్లు చదివించడం.
 • సమూహాలుగ చేస్తూ స్వయం అభ్యసనకు అవకాశమివ్వడం.
 • చదివిన విషయంపై మాట్లాడించడం.
 • స్వీయ అభిప్రాయాలను, అనుభూతులను రాయించేలా అవకాశం కల్పించడం.
 • పేరాను అర్థం చేసుకోవడంలో కీలక అంశాలను, కీలక వాక్యాలను గుర్తించేలా సాధన చేయించడం.
 • చదివిన వాక్యాలకు దృశ్యీకరణం చేసుకోవడం.
 • ఊహాశక్తి పెంపొందేలా మాట్లాడించడం.
 • కనీస సామర్థ్య సాధనలో భాగంగా పఠన లేఖన నైపుణ్యాలు వృద్ధిపరచడం. స్వీయ కార్యాచరణ రూపొందించుకోవడం.
 • దోష రహితంగా ఉచ్చరించేటట్లు సాధన చేయించటం.
 • విషయాన్ని ఒకటికి రెండుసార్లు చదివి విశ్లేషణ చేసుకునేట్లు ప్రోత్సహించడం కీలకాంశాలను గుర్తించే విధంగా చదివే విధానం అలవాటు చేయడం.
 • ప్రశ్నల్ని చదివి ఆలోచించే విధంగా అభ్యాసాలను కల్పించడం.
 • ప్రశ్నలు తయారుచేయడానికి (5 W’s 1 H విధానం ద్వారా) వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు తయారుచేసేటట్లు అభ్యాసాల సాధన నిర్వహించడం.
 • మాదిరి ప్రశ్నలను అధ్యయనం చేయిస్తూ విశ్లేషణ కలిగించడం.
 • జాతీయాలు, కీలక అంశాలపట్ల స్పష్టమైన అవగాహన కలిగించి గుర్తించేలా సాధన చేయడం.
 • ఉన్నత తరగతుల్లో ప్రతి పదార్థం రాసేటప్పుడు అన్వయక్రమం అలవాటుచేయడం, నిఘంటు వినియోగం ద్వారా సాధించడం.
 • చదవడం అలవాటుగా చేసుకునేటట్లు ప్రోత్సహించడం, విస్తారపఠనం ద్వారా పఠనం అలవర్చడం. చదివిన విషయంపై అవగాహనను పరీక్షించడానికి వీలైనన్ని రకాలుగా వీలైనన్ని ప్రశ్నలు అడగడం.

నమూనా / మాదిరి

భూగర్భ జలాలకు చెరువు శ్రీరామరక్ష. చెరువు అలుగు పారిందంటే కరువు తోక ముడిచినట్లే! చెరువు నీరు ఊరికి ప్రాణాధారం. మానవాళినే కాదు పశుపక్ష్యాదులను అక్కున చేర్చుకునే అన్నపూర్ణ చెరువు. వ్యవసాయానికి ప్రధాన వనరు కూడా! అందమైన తామరలతో శోభిల్లే చెరువు సుందరమైన పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది. ఆటపాటల నిలయమై అలరారుతుంది. ఆబాల గోపాలాన్ని మురిపిస్తుంది. ఇంత వైభవమున్న చెరువుకు సాహిత్యంలోనూ ప్రత్యేక స్థానమున్నది. అంతేకాదు. బతుకమ్మలను తన ఒడిలోకి చేర్చుకునే మెట్టినిల్లు చెరువు. ప్రకృతికే సౌందర్యం పులిమే చెరువు గూర్చి మాటల్లో ఎంత వర్ణించినా అది తక్కువే! జలసిరులతో కళకళలాడిన చెరువు ఆధునిక కాలంలో కాలుష్యం కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. చెరువులకు పూర్వవైభవం తేవడానికి అందరం చేయి చేయి కలుపుదాం! పునర్వైభవం తీసుకువద్దాం!!

పై పేరాలో కీలక పదాలు గుర్తించండి.

అ) భూగర్భజలం

ఆ) వ్యవసాయం

ఇ) ప్రాణాధారం

ఈ) కాలుష్యం

ఉ) సాహిత్యం

ఊ) పర్యాటక కేంద్రం

ఋ) ప్రకృతి సౌందర్యం

ఋ) బతుకమ్మ

పై పేరాలో కీలక వాక్యాలు గుర్తించండి.

అ) చెరువు నీరు ఊరికి ప్రాణాధారం

ఆ) పశుపక్ష్యాదులను అక్కున చేర్చుకునే అన్నపూర్ణ

ఇ) చెరువుకు సాహిత్యంలో ప్రత్యేక స్థానం

ఈ) సుందరమైన పర్యాటక కేంద్రం చెరువు

ఉ) ప్రకృతికే సౌందర్యం పులమడం.

 1. పై పేరా ఆధారంగా ఖాళీలు పూరించండి.

అ) వ్యవసాయానికి‌‌‌‌‌‌‌‌‌‌‌‌___________కీలకం.

ఆ) చెరువు నీరు ఊరికి____________

ఇ) చెరువు____________కు నిలయమై అలరారుతుంది.

ఈ) చెరువులకు __________ తేవాలి.

ఉ) తన ఒడిలోకి_____________లను చేర్చుకుంటుంది.

పై పేరా ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) చెరువు ప్రాధాన్యత ఏమిటి?

ఆ) కరువు ఎప్పుడు తొలగిపోతుంది?

ఇ) పర్యాటక కేంద్రం అంటే ఏమిటి?

ఈ) చెరువులు ఎట్లా కలుషితం అవుతున్నాయి?

ఉ) పై పేరాకు శీర్షిక సూచించండి.

ఊ) పై పేరా దేని గూర్చి తెలియజేస్తుంది?

 1. పై పేరా ఆధారంగా ప్రశ్నలు తయారుచేయండి.

అ) చెరువులు ఎవరెవరికి ఉపయోగపడుతున్నాయి?

ఆ) పర్యాటక కేంద్రం అంటే ఏమిటి?

ఇ) కళకళలాడటం అంటే ఏమిటి?

ఈ) భూగర్భజలాలకు ప్రధాన వనరు ఏది?

ఉ) చెరువుల కాలుష్యానికి ఒక కారణం చెప్పండి.

 1. పై పేరా ఆధారంగా తప్పు ఒప్పులను గుర్తించండి.

అ) తోకముడవడం' అంటే అభివృద్ధి చెందడం                (  )

ఆ) వ్యసాయానికి ప్రధాన వనరు చెరువు                              (  )

ఇ) చెరువుకు సాహిత్యంతో సంబంధం లేదు                 (  )

ఈ) చెరువులు కలుషితం కావడం లేదు                     (  )

ఉ) పర్యాటక కేంద్రంగా చెరువును భావించవచ్చు (  )

పై పేరా ఆధారంగా జాతీయాలను గుర్తించి రాయండి.

అ) శ్రీరామరక్ష

ఆ) ఆబాల గోపాలం

ఇ) మెట్టినిల్లు

ఈ) కళకళలాడు

ఉ) విలవిలలాడు

ఊ) తోకముడుచుకొను

ఆధారము : సమగ్ర శిక్ష అభియాన్,వృత్యంతర శిక్షణ కార్యక్రమము 2018 -19 యస్ ఇ ఆర్ టి ,హైదరాబాద్

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు