హోమ్ / విద్య / ఉపాధ్యాయ వేదిక / వృత్యంతర శిక్షణా కార్యక్రమము 2018 -19 / వినడం,అర్థంచేసుకొని ఆలోచించి మాట్లాడడం
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

వినడం,అర్థంచేసుకొని ఆలోచించి మాట్లాడడం

భోధన అభ్యాసన ప్రక్రియలో విని, అర్థం చేసుకొని మాట్లాడగలిగే సామర్ధ్యం

పరిచయం

జానపదాల నుండి వేదాల దాకా కొన్ని వేల సంవత్సరాలపాటు మన భాషా సాహిత్యాలు మౌఖిక రూపంలోనే కొనసాగాయి. లిఖిత రూపాన్ని పొందకున్నా, ఇసుమంతైనా లోపంలేని జ్ఞానాన్ని భావితరాలకు అందించగలిగారంటే ఇందుకు ప్రధాన కారణం విని, అర్థం చేసుకొని మాట్లాడగలిగే సామర్ధ్యం. ఈ సామర్ధ్యమే బోధనాభ్యసన ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తుంది. ఉపాధ్యాయుడు బోధించే అంశాలను విద్యార్థి విని, పాఠ్యపుస్తకంలోని చిత్రాలు చూసి అర్థం చేసుకొని, ఆలోచించి ప్రతిస్పందించగలిగితే 'వినడం, అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడడం’ సామర్థ్యం అవుతుంది.

బోధనాభ్యసన ప్రక్రియలో ఈ సామర్థ్యం ముఖ్యమైనది. ఒక విద్యార్థి ఆయా సామర్థ్యాలలో కనబర్చే అభ్యసన ఫలితాలన్నీ ఈ సామర్థ్యం పైనే ఆధారపడి ఉంటాయి. ఉపాధ్యాయుడు చెప్పిన అంశాలను, తాను చూసిన అంశాలను విద్యార్థి అవగాహన చేసుకొని, ఆలోచించి ప్రతిస్పందించగలిగినప్పుడే మిగతా సామర్థ్యాలను పొందగలడు.

ఆశించే అభ్యసన ఫలితాలు

 1. ఉపన్యాసాలు, సందేశాలు, వక్తృత్వాలు, వార్తలు, కథలు విని, అర్థం చేసుకొని ప్రతిస్పందించగలగాలి.
 2. తమ ఇష్టాయిష్టాలను, ఆసక్తులను, స్వీయ అభిప్రాయాలను, కారణాలను చెప్పగలగాలి.
 3. సమర్థిస్తూ లేదా విభేదిస్తూ / విశ్లేషిస్తూ మాట్లాడగలగాలి.
 4. పద్య తాత్పర్యాలను, గేయ / పాఠ్య సారాంశాలను చెప్పగలగాలి.
 5. కవి యొక్క ఆలోచనను, పాత్రల స్వభావాన్ని వివరించి చెప్పగలగాలి.
 6. సాహిత్య ప్రక్రియలోని భేదాలను గుర్తించి, అవగాహనతో అభిప్రాయాలు వ్యక్తీకరించగలగాలి.
 7. చిన్న చిన్న సంఘటనలను వర్ణించగలగాలి.
 8. ఇచ్చిన అంశాన్ని గురించి మాట్లాడగలగాలి, చర్చించగలగాలి.
 9. పద్యాలు, గేయాలు రాగయుక్తంగా, భావయుక్తంగా పాడగలగాలి.

సామర్థ్య సాధనలో ఎదురవుతున్న సమస్యలు

 1. శ్రద్ధతో, ఏకాగ్రతతో వినకపోవడం.
 2. ఉపాధ్యాయుడు చెప్పే అంశాన్ని అర్థం చేసుకోకపోవడం.
 3. ఆత్మ విశ్వాసం లేకపోవడం.
 4. బిడియం వల్ల మాట్లాడలేకపోవడం.
 5. అందరు విద్యార్థులు భాగస్వాములు కాకపోవడం.
 6. ఉపాధ్యాయుని సూచనలు సక్రమంగా అర్థం చేసుకోలేకపోవడం.
 7. ఉచ్ఛారణ దోషాలు కలిగి ఉండడం.
 8. ఒక అంశాన్ని వేరే కోణంలో అర్థం చేసుకోవడం.
 9. గేయాలు అభినయంతో పాడలేకపోవడం.
 10. విద్యార్థుల్లో భాష నేర్చుకోవాలనే ఆసక్తి లేకపోవడం.
 11. బోధనాభ్యసన ప్రక్రియలు విద్యార్థి కేంద్రీకృతంగా కాకుండా ఉపాధ్యాయ కేంద్రంగా నిర్వహింపబడడం.
 12. ఈ సామర్థ్యానికి తక్కువ ప్రాధాన్యతనివ్వడం.
 13. ఉపాధ్యాయుడు విద్యార్థులను అనుబంధ ప్రశ్నలు అడుగకపోవడం.
 14. విద్యార్థుల చేత మాట్లాడించడానికి తగిన కృత్యాల రూపకల్పన చేయకపోవడం.
 15. విద్యార్థులను సొంతమాటల్లో చెప్పడాన్ని ప్రోత్సహించకపోవడం.
 16. విద్యార్థులు చూసిన అంశాల గురించి మాట్లాడించకపోవడం.

సామర్థ్య సాధనకై అనుసరించాల్సిన వ్యూహాలు

 1. ఒక ప్రశ్నను కాని, ఇతర విద్యార్థులు చెప్పే సమాధానాల గురించికానీ ఒక విద్యార్థిని అడిగినప్పుడు మిగిలిన పిల్లలందరూ వింటున్నారా? లేదా? అనేది తరగతి గదిలో పరిశీలించాలి.
 2. పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించాలి.
 3. తమ స్వీయ అనుభవాలను, తాము చూసిన సంఘటనల గురించి విద్యార్థుల చేత మాట్లాడించాలి.
 4. ప్రతి విద్యార్థిని కృత్యంలో భాగస్వామ్యం చేయాలి.
 5. తరగతి గదిలో స్వేచ్చాయుత వాతావరణం కల్పించాలి.
 6. స్పష్టమైన ఉచ్ఛారణతో విద్యార్థుల తప్పులను సవరించాలి.
 7. విద్యార్థులను అభినందనా పూర్వకంగా ప్రోత్సహించాలి.
 8. విద్యార్థులను వారి అభిరుచుల గురించి మాట్లాడించాలి.
 9. సమర్థిస్తూ, విభేదిస్తూ / విశ్లేషిస్తూ మాట్లాడించాలి.
 10. పండుగలు, జాతరల గురించి మాట్లాడించాలి.
 11. పద్యాలు, గేయాలు రాగయుక్తంగా, భావయుక్తంగా పాటించాలి.
 12. ఉపన్యాసపోటీలు నిర్వహించాలి.
 13. కథలు చెప్పించాలి.
 14. పాఠ్య సారాంశాన్ని సొంతమాటల్లో చెప్పించాలి.
 15. ఒక అంశాన్ని మరొక అంశంతో పోల్చి మాట్లాడడాన్ని ప్రోత్సహించాలి.
 16. గేయ భావాలను, పద్య తాత్పర్యాలను చెప్పించాలి.

మాదిరి కృత్యాలు

 • పద్యం, పాట, గేయం, కవితలు విన్న విద్యార్థి తిరిగి వాటిని రాగ, భావయుక్తంగా, అర్థవంతంగా పాడగలుగుతున్నాడా లేదా పరిశీలించాలి.

ఉదా|| అభినందన, ఏకులం? శ్రీలుపొంగిన జీవగడ్డ (గేయాలు), శతక పద్యాలు, చీమలబారు (వచన కవిత), పల్లెటూరి పిల్లగాడా! (పాట) మొదలగునవి.

 • వచన అంశాలు చదివేటప్పుడు అర్థవంతంగా, సమవేగంతో, భావస్ఫోరకంగా చదువగలుగుతున్నాడా లేదా పరిశీలించాలి.

ఉదా|| స్నేహబంధం (కథ), కాపాడుకుందాం! (సంభాషణ), నాయనమ్మ (కథానిక), ప్రేరణ (ఆత్మకథ) మొదలగునవి.

 • మీ స్నేహితులకు మీరు చేసిన సాయం గురించి చెప్పండి. (స్నేహబంధం)
 • “పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత' అనే అంశాన్ని సమర్థిస్తూ మాట్లాడండి. (కాపాడుకుందాం)
 • మంచి అలవాట్లు అలవచ్చుకోవడానికి ఏం చేయాలో చెప్పండి. (శతక పద్యాలు)
 • పాఠంలో వర్ణించిన ఊరుతో పిల్లలు తాము చూసిన ఊరును పోల్చి మాట్లాడండి. (పల్లె అందాలు)
 • కథలో ఆశ్చర్యం కలిగిన సంఘటనల గురించి మాట్లాడండి. (రాణి శంకరమ్మ)
 • తెలిసిన జానపద గేయాలను పాడండి. (తెలుగు జానపద గేయాలు)
 • నదుల్లో నీరు కనుమరుగయ్యే పరిస్థితి రావడానికి గల కారణాలను వివరించండి. (మంజీర)
 • స్వాతంత్ర్యానికి ముందు గ్రామాల్లో పరిస్థితులు ఎట్లా ఉండేవో పాఠం ఆధారంగా ఊహించి మాట్లాడండి. (చిన్నప్పుడే)
 • తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాల గురించి మాట్లాడండి. (అమరులు)
 • రైతు పరిస్థితిని గురించి, జీవన విధానాన్ని గురించి మాట్లాడండి. (కాపు బిడ్డ)

ఆధారము : సమగ్ర శిక్ష అభియాన్,వృత్యంతర శిక్షణ కార్యక్రమము 2018 -19 యస్ ఇ ఆర్ టి ,హైదరాబాద్

3.02127659574
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు