పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

స్వీయరచన-భోధన అభ్యాసన ప్రక్రియ

భోధన అభ్యాసన ప్రక్రియలో విద్యార్థి స్వీయరచన

పరిచయం

భావ వినిమయ సాధనం భాష, భావ వ్యక్తీకరణ భావగ్రహణానికి భాష వాహకంగా ఉండడం వలననే మనిషి ఇతర జంతుజాలంకంటే ఉన్నతస్థితిలో ఉన్నాడు. వ్యక్తి ఆలోచించడానికి, సమస్యలను పరిష్కరించుకోవడానికి, ఉద్వేగాలను వ్యక్తం చేయడానికి భాష ఉపయోగపడుతుంది.

భావ వ్యక్తీకరణ రెండు రకాలు

 1. మౌఖిక భావ వ్యక్తీకరణ
 2. లిఖితపూరక్వక భావ వ్యక్తీకరణ

ఆలోచించి, అర్థం చేసుకొని మాట్లాడడం - మౌఖికం అయినది కాగా, స్వీయరచన లిఖిత పూర్వక భావ వ్యక్తీకరణ.

స్వీయరచన

 • విద్యార్థి తాను చదివిన, విన్న, నేర్చుకున్న పరిశీలించిన అర్థం చేసుకున్న అంశాలను తన సొంత ఆలోచనలతో తనదైన శైలిలో రాయగలగడమే స్వీయరచన.
 • ఎస్.సి.ఎఫ్. -2011 నిర్దేశించిన విధంగా బట్టీ విధానం రూపుమాపాలంటే సొంతమాటలలో రాయడాన్ని ప్రోత్సహించాలి.
 • స్వీయరచనలో భాగంగా ఒక అంశాన్ని కుదించి రాయవలసి ఉంటుంది. ఒక అంశం విషయమునకు సంబంధించిన మంచి - చెడులను చర్చించవలసి ఉంటుంది. కారణాలను సూచిస్తూ, పరిష్కారాలను ఊహించి రాయాల్సి ఉంటుంది. పాత్రల స్వభావాన్ని విశ్లేషించవలసి ఉంటుంది. పోలికలను, తేడాలను రాయవలసి ఉంటుంది. ప్రకృతిని, పరిసరాలను, సమాజాన్ని పరిశీలించి తన అభిప్రాయాలను రాయవలసి ఉంటుంది.
 • వేరు వేరు సందర్భాలలో తర్వాత ఏం జరుగుతుందో, తానే గనక అయితే ఏంచేస్తాడో విద్యార్థి ఊహించి రాయవలసి ఉంటుంది.
 • తార్కికమైన ఆలోచనతో రాయవలసి ఉంటుంది.

స్వీయరచన సామర్థ్యం ఆశించే అభ్యసన ఫలితాలు

 • విద్యార్థులు తాము విన్న, చదివిన, అర్థం చేసుకున్న విషయాలను అనుభూతులను, అనుభవాలను సొంతమాటలలో స్పష్టంగా రాయగలగాలి.
 • విభిన్న సందర్భాలలో రాసేటప్పుడు విద్యార్థులు అవసరమైన నూతన పదాలు వాక్య నిర్మాణాలు, జాతీయాలు, సామెతలు మొదలగు వాటిని తగురీతిలో ఉపయోగించగలగాలి.
 • వివిధ రకాల భాషా పఠన సామగ్రి చదివి, అర్ధం చేసుకొని విద్యార్థి తన ఇష్టాఇష్టాలను, అభిప్రాయాలను సహేతుకంగా వివరించగలగాలి.
 • చదివే పాఠకులను దృష్టిలో ఉంచుకొని తాను చెప్పదలచుకొన్న అంశాన్ని ప్రభావవంతంగా రాయగలగాలి.
 • వివిధ సందర్భాలలో ఇతరులు వ్యక్తపరచిన విషయాలను తన సొంతభాషలో, తనదైన శైలిలో రాయగలగాలి.
 • విద్యార్థి ఏదైనా రచనను, విషయాన్ని చదివి, రచయిత యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని, దానికి తన స్వీయ అనుభవాలను అన్వయించుకొని సమర్థించడం లేదా వ్యతిరేకించడం చేయగలగాలి.
 • విరామ చిహ్నాలను పాటిస్తూ, వాక్య భేదాలను సందర్భోచితంగా ఉపయోగించి రాయగలగాలి.
 • గేయం, పాఠం సారాంశాలను సొంతమాటలలో రాయగలగాలి.
 • విషయాన్ని విశ్లేషిస్తూ, ఊహిస్తూ, సమర్థిస్తూ, వివరిస్తూ తగిన కారణాలతో రాయగలగాలి.
 • భావాలను క్రమపద్ధతిలో సరైన పదజాలాన్ని ఉపయోగించి దోషరహితంగా రాయగలగాలి.
 • సూచించిన నిడివికి (5 వాక్యాలు / 10 వాక్యాలు) తగ్గట్టుగా సమాధానాలు రాయగలగాలి.

స్వీయరచన సామర్థ్యం సాధించడంలో ఎదురవుతున్న సమస్యలు

ఈ సామర్థ్య అభివృద్ధిలో తరగతి గదిలో అనేక సమస్యలు విద్యార్థుల ప్రగతిని నిరోధిస్తున్నాయి.

 • సొంతంగా రాయాలనే ఆలోచన లేకపోవడం.
 • గైడ్లు, స్టడీ మెటీరియళ్ళ , ఇతరుల నోటుపుస్తకాల నుండి చూసి రాయడం.
 • సూచించిన నిడివిలో సమాధానం రాయలేకపోవడం.
 • తరగతి గదిలో సామర్థ్య నిర్వహణలో విద్యార్థులందరూ భాగస్వాములు కాకపోవడం.
 • లేఖనా దోషాల కారణంగా విద్యార్థులు రాయడానికి వెనుకంజవేయడం.
 • భావాలను క్రమపద్ధతిలో వ్యక్తీకరించలేకపోవడం.
 • పేరాలుగా కాకుండా పాయింట్లవారీగా సమాధానములు రాయడం.
 • ఒక విషయాన్ని సమర్థిస్తూ / విభేదిస్తూ సహేతుకంగా రాయలేకపోవడం.
 • కవి రచనా శైలిని వివరించలేకపోవడం.
 • ఒక వాక్యం / కవి / మాట యొక్క ఉద్దేశాన్ని, అంతరార్థాన్ని రాయలేకపోవడం.

స్వీయరచన సామర్థ్య సాధనకు వ్యూహాలు

స్వీయరచనలో ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడానికి ఉపాధ్యాయుడు ప్రణాళికాబద్ధమైన వ్యూహాలను అనుసరించాలి.

 • స్వీయరచన ప్రశ్నను నల్లబల్లపై రాయాలి.
 • తరగతి కృత్యంగా ఆప్రశ్నపై చర్చ జరపాలి. అందరు విద్యార్థులును భాగస్వాములను జేయాలి.
 • అవసరమైనచోట విద్యార్థుల సందేహ నివృత్తి చేస్తూ మార్గదర్శనం చేయాలి.
 • నల్లబల్లపై రాసిన ప్రశ్నకు సమాధానాన్ని ఒక్కొక్క విద్యార్థిచే ఒక్కొక్క వాక్యం చెప్పించాలి. ఆ వాక్యంలోని కీలక అంశాన్ని (పదాన్ని) నల్లబల్లపై రాయాలి.
 • చివరికి ఒకరిద్దరు విద్యార్థులచే సమాధానమును మొత్తాన్ని క్రోడీకరింపజేయాలి.
 • నల్లబల్లపై ఉన్న కీలకపదాలను చెఱపివేసి విద్యార్థులందరిచేత వ్యక్తిగత కృత్యంగా సమాధానాన్ని సొంతమాటల్లో రాయించాలి.
 • కొద్ది మంది విద్యార్థుల సమాధానములను తరగతిలో ప్రదర్శింపజేయాలి.
 • ఉపాధ్యాయుడు విద్యార్థుల దోషాలను సవరించి, తగు సూచనలు చేయాలి.
 • వాక్యాలు అన్వయక్రమంలో ఉన్నాయా? లేదా? అని పరిశీలించి, సరిచేసి తగు సలహాలివ్వాలి.
 • గైడ్లు, స్టడీమెటీరియళ్ళను పూర్తిగా నిరోధించాలి.
 • స్వీయరచన సామర్థ్య నిర్వహణ సమయంలో విద్యార్థులు తమ అభిప్రాయాలు తెల్పడానికి తగినంత స్వేచ్ఛనివ్వాలి, ప్రోత్సహించాలి.
 • సొంతంగా రాయడం అంటే ఏది రాసినా సరిపోతుందనే అపోహను విద్యార్థుల మది నుండి తొలగింపజేయాలి. ప్రశ్నకు తగిన సమాధానాన్ని మైండ్ మ్యాపింగ్ ద్వారా రాసే క్రమాన్ని వివరించి, అనుసరించేలా చేయాలి.
 • కవి శైలిని వివరించే సందర్భంలో కవి పరిచయంలోని విషయాలేగాక పాఠంలోని పద్యాల / గేయాల పంక్తులలోని అలంకారం, పదజాలం, రసానుభూతి, పదాల అల్లిక, అంతరార్థం మొదలైన అంశాలపై చర్చ జరిపి, ప్రశంసించే నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలి.

స్వీయరచన సామర్థ్యాభివృద్ధి - (సాధన)

మాదిరి-1

ప్రశ్న : శతక కవుల వల్ల సమాజానికి ఎట్లాంటి మేలు చేకూరుతుంది? (10 వాక్యాలు

 • నైతిక విలువలు
 • స్త్రీలపట్ల సోదర భావం
 • కోపం మంచిదికాదు
 • మేలు చేయడం
 • గొప్పలు చెప్పకూడదు
 • మంచివాళ్ళతో స్నేహం
 • భేదభావం చూపరాలు
 • ఏం చేయాలి? ఏం చేయకూడదు?
 • తప్పుచేస్తే ఒప్పుకోవాలి
 • మానవ సేవ మాధవ సేవ, మానవసేవ మాధవసేవ
 • ధారణ శక్తి ధారణ శక్తి
 • ప్రజల తీరులో మార్పు
 • ఆనందం

ఇలా ఒక్కొక్క విద్యార్థి చెప్పిన వాక్యాలలోని కీలక పదాలను నల్లబల్లపై రాసి విద్యార్థులకు అవగాహన కలిగించాలి.

ఒకరిద్దరు విద్యార్థులచే నల్లబల్లపైనున్న కీలకపదాల ఆధారంగా శతక పద్యాలవల్ల సమాజానికి ఏం మేలు కలుగుతుందోచెప్పించాలి?

సమాధానం :

శతక పద్యాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి. సమాజంలో వ్యక్తులు ఏం చేయాలో? ఏం చేయకూడదో తెలియజేస్తాయి. శతక పద్యాలు నేర్చుకోవడం ద్వారా ధారణాశక్తి పెరుగుతుంది. వీటి ద్వారా రసానుభూతిని, ఆనందాన్ని పొందుతారు. ఇవి ఇతరుల ధనంపై ఆశపడకూడదని వివరిస్తాయి. స్త్రీలపట్ల సోదరభావం కల్గి ఉండాలని మార్గదర్శనం చేస్తాయి. కోపం మంచిదికాదని పద్యాలు బుద్ది చెప్తాయి. ఇతరులకు మేలు చేయాలని చేసిన మేలును పదే పదే చెప్పకూడదని తెలియజేస్తాయి. తమ గురించి తాము గొప్పలు చెప్పుకోకూడదని సందేశమిస్తాయి. తప్పుచేస్తే, చేసిన తప్పును ఒప్పుకోవాలనీ, మానవసేవే మాధవ సేవనీ ఇలా ఇలా ఎన్నెన్నో నీతివాక్యాలు శతక కవులు తమ పద్యాల ద్వారా ప్రభోదించి ప్రజలను ఉత్తములుగా తీర్చిదిద్దుతారు.

ఆధారము : సమగ్ర శిక్ష అభియాన్,వృత్యంతర శిక్షణ కార్యక్రమము 2018 -19 యస్ ఇ ఆర్ టి ,హైదరాబాద్

3.00966183575
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు