অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మానవుని యొక్క జీర్ణవ్యవస్థ విషయాలు.

మానవుని యొక్క జీర్ణవ్యవస్థ విషయాలు.

  • మానవుడి జీర్ణ వ్యవస్థలో భాగాలు.. నోరు, ఆస్యకుహరం, గ్రసని, ఆహార వాహిక, జీర్ణాశయం, చిన్నపేగు, పెద్దపేగు, పురీష నాళం, పాయువు.
  • నోటి ద్వారా ఆహారాన్ని తీసుకోవడాన్ని అంతర్ గ్రహణం అంటారు. నోటిలోని కుహరం ఆస్యకుహరం. నోటిలో మూడు జతల లాలాజల గ్రంథులుంటాయి. అవి..
    1) అథోజంభిక (పై దవడలో)
    2) అథోజిహ్విక (నాలుక కింద)
    3) పెరోటిడ్ (చెవి దగ్గర) గ్రంథులు
  • లాలాజల గ్రంథులు సంక్లిష్ట నాళాశయ గ్రంథులు. ఇవి శ్లేష్మకణాలు కలిగి ఉంటాయి.
  • లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తాయి. లాలాజలం కొద్దిగా క్షారయుతం. ఇందులో టయలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది.
  • మానవుడి నోటిలో నాలుగు రకాల దంతాలుంటాయి. ఇవి వేరు వేరు నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని విషమ దంతాలు అంటారు. అవి కొరకు పళ్లు (కుంతకాలు, కోర దంతాలు (రదనికలు), నములు దంతాలు (అగ్ర చర్వణకాలు), విసరు దంతాలు (చర్వణకాలు).
  • మానవుని దంత ఫార్ములా 2123/2123
  • నాలుక మీద రుచి కళికలు ఉంటాయి.
  • లాలాజలంలో టయలిన్‌లోని ఎమిలేస్ ఎంజైమ్ పిండి పదార్థాన్ని మాల్టోస్/చక్కెరగా మారుస్తుంది. దంతాలతో నమిలిన ఆహారం లాలాజల శ్లేష్మంతో కలిసి జిగురుగా ఏర్పడి, సులువుగా కదిలి గ్రసని చేరుతుంది.
  • వాయునాళంలోకి ఆహారం పోకుండా కొండనాలుక (ఉపజిహ్విక) చూస్తుంది.
  • ఆహార వాహిక.. గ్రసనిని జీర్ణాశయంతో కలుపుతుంది. ఇది నియంత్రిత, అనియంత్రిత కండరాలతో నిర్మితమైంది. దీని లోపలి గోడల్లో శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల ఆహారం జారుతుంది.
  • ఆహార వాహికలో గ్రంథులు లేవు. అందుకే ఇక్కడ ఆహారం మార్పు చెందదు.
  • ఆహారం ఆహార వాహిక చేరుకోగానే కండరాల సంకోచ, వ్యాకోచాలు (ఏకాంతర సంకోచ కదలికలు) ప్రారంభమై అలల వంటి చలనాలు కలుగుతాయి.ఈ చలనాలనే పెరిస్టాలిటిక్ చలనాలు అంటారు. ఈ చలనాలు అనియంత్రితమైనవి.
  • ఆహారవాహిక నుంచి ఆహార పదార్థం జీర్ణాశయంలోనికి ప్రవేశిస్తుంది. జీర్ణాశయం కండరమంతా సంచిలాంటి నిర్మాణం. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. ఆహార వాహిక తెరచుకునే భాగం.. హార్థిక జీర్ణాశయం. ఆంత్రమూలంలోనికి తెరచుకునే జీర్ణాశయం.. జఠర నిర్గమ జీర్ణాశయం.
  • జఠర నిర్గమ జీర్ణాశయం.. ఆంత్రమూలంలోనికి తెరచుకునే చోట జఠర నిర్గమ సంవరణి అనే కవాటం ఉంటుంది. జీర్ణాశయ గోడల్లో అనియంత్రిత కండరాల వల్ల ఆహారం పలుచనవుతుంది.
  • మానవుడి జీర్ణాశయంలో సుమారు 35 మిలియన్ల జఠర గ్రంథులుంటాయి. జఠర రసం చిక్కగా, తేటగా, ఎండుగడ్డి రంగులో ఉండే ద్రవం.
  • జఠర రసంలోని HCl ఆహారంలోని బ్యాక్టీరియాను చంపుతుంది. HCl చైతన్య రహిత పెప్సినోజన్‌ను పెప్సిన్‌గా మారుస్తుంది. పెప్సిన్‌తోపాటు లైపేజ్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది.
  • HCl ప్రొరెనిన్‌ను రెనిన్ ఎంజైమ్‌గా ఉత్తేజపరుస్తుంది. రెనిన్ పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్. ఇది పాలు తాగే శిశువులో జీర్ణాశయం నుంచి పాలు త్వరగా పేగులోకి చేరకుండా నిరోధిస్తుంది. పెప్సిన్.. ప్రోటీన్‌లను విశ్లేషించి పెప్టోనులు, ప్రోటియేస్‌లుగా మారుస్తుంది. లైపేజ్‌లు.. కొవ్వులను కొవ్వు ఆమ్లాలుగా, గ్లిజరాల్‌గా మారుస్తాయి.
  • జఠర నిర్గమ సంవరణి నియంత్రణ వల్ల కొద్దికొద్దిగా ఆహారం జీర్ణాశయం నుంచి ఆంత్రమూలంలో చేరుతుంది. జీర్ణాశయంలో పిండి పదార్థాలు జీర్ణం కావు. ఆంత్రమూలంలో చేరిన ఆహారం ఆమ్ల స్థితిలో ఉంటుంది. దీన్ని ‘కైమ్’గా పిలుస్తారు.
  • ఆంత్రమూలంలో రెండు గ్రంథుల రసాలు కలుస్తాయి. అవి..
    1) కాలేయం
    2) క్లోమం
  • కాలేయం నాలుగు తమ్మెలు కలిగిన గ్రంథి. ఇది పైత్యరసం ఉత్పత్తి చేస్తుంది. పైత్య రసం పిత్తాశయంలో నిల్వ ఉంటుంది. ఇది పసుపు, బంగారు, బూడిద రంగుల మిశ్రమం. ఇందులో ఎంజైమ్‌లు ఉండవు. సోడియం కొలేట్, సోడియం డి ఆక్సీకొలేట్ అనే పైత్యరస లవణాలు, బిల్‌రూబిన్, బైలివిరిడిన్ అనే వర్ణకాలు ఉంటాయి. హెమోగ్లోబిన్ విచ్ఛిన్నమైనప్పుడు వర్ణకాలు ఏర్పడతాయి. పైత్యరసం క్షారయుతం (pH విలువ = 7.6)
  • పైత్యరస లవణాలు కొవ్వుల ఎమల్సీకరణలో ఉపయోగపడతాయి.
  • కాలేయం..అమ్మోనియాను యూరియాగా మారుస్తుంది (ఆర్నిథిన్ వలయం). కొవ్వుల్లో కరిగే విటమిన్లను నిల్వ చేస్తుంది. విటమిన్-డీను క్రియాత్మకంగా చేస్తుంది. పిండ దశలో ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది (హీమోపాయిటిక్ అంగం). ప్రౌఢ దశలో ఎర్ర రక్తకణాలను విచ్ఛిన్నం చేస్తుంది (ఎరిత్రో క్లాస్టిక్ అంగం). కాలేయం విషయుక్త పదార్థాలను హానిరహిత పదార్థాలుగా మారుస్తుంది.
  • క్లోమం పసుపు, బూడిద రంగులో ఉండే గ్రంథి. క్లోమం నాళవినాళ గ్రంథిగా పనిచేస్తుంది. క్లోమ రసం క్షారయుతం (pH = 8.0)గా ఉంటుంది. క్లోమరసంలో ఉండే ముఖ్యమైన ఎంజైమ్‌లు ట్రిప్సిన్, కీమోట్రిిప్సిన్ ఎమిలేజ్, లైపేజ్. క్లోమరసంలో ఎక్కువ మొత్తంలో బైకార్బనేట్‌లు ఉంటాయి. దీనివల్ల కైమ్‌లో ఉన్న ఆమ్లగుణం తటస్థీకరణం చెందుతుంది. క్లోమరసంలోని ఎంజైమ్‌లు ట్రిప్సినోజన్, కీమోట్రిప్సినోజన్‌లను ఎంటరోకీనేజ్ చైతన్య రూపంలోనికి మారుస్తుంది. ఎంటరోకీనేజ్ ఆంత్ర రసంలో ఉంటుంది.
    క్లోమ రసంలోని పెప్సిన్‌ల చర్య వల్ల జల విశ్లేషణం చెందిన ప్రొటీన్‌లు కీమోట్రిప్సిన్ వల్ల పాలిపెప్టయిడ్‌లుగా మారతాయి.
  • క్లోమరసంలోని ఎమైలేజ్ పిండి పదార్థాల మీద చర్య జరిపి వాటిని చివరకు మాల్టోజ్, చక్కెరలుగా మారుస్తుంది. లైపేజ్.. చిలికిన కొవ్వులను గ్లిజరాల్, ఫాటీ ఆమ్లాలుగా మారుస్తుంది.
  • క్లోమంలో రెండో భాగంలో ఐలెట్స్ ఆఫ్ లాంగర్‌హాన్‌‌స పుటికలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్‌ను స్రవించి డయాబెటిస్‌ను నియంత్రిస్తాయి. ఈ దశలో క్లోమం వినాళ గ్రంథి.
    పేగులో జీర్ణక్రియ ఆంత్రరస గ్రంథుల వల్ల జరుగుతుంది. చిన్నపేగు మొదటి భాగం ఆంత్రమూలం. రెండో భాగం జెజునమ్. మూడో భాగం శేషాంత్రికం.
  • ఆంత్రరస గ్రంథుల స్రావాన్ని సక్కస్ ఎంటిరీకస్ అంటారు. ఇందులో ఎంటరోకీనేజ్, పెప్టిడైజ్, లైపేజ్, సుక్రేజ్, న్యూక్లియోటైడేజ్, న్యూక్లియోసైడేజ్ ఎంజైమ్‌లుంటాయి.
  • పెప్టిడేస్‌లు.. పెప్టైడులను అమైనో ఆమ్లాలుగా మారుస్తాయి. ఆంత్రరస లైపేజ్‌లు కొవ్వులను పూర్తిగా జీర్ణం చేస్తాయి. సుక్రేజ్, మాల్ట్టేజ్, లాక్టేజ్‌లు వరుసగా సుక్రోజ్, మాల్టోజ్, లాక్టోజ్‌లను చక్కెరలుగా మారుస్తాయి.
  • న్యూక్లియోటైడేజ్, న్యూక్లియోసైడేజ్‌లు న్యూక్లిక్ ఆమ్లాల జీర్ణక్రియ పూర్తి చేస్తాయి.
  • జీర్ణక్రియలోని అంత్య ఉత్పన్నాలను చిన్నపేగు కుడ్యంలోని ఆంత్ర చూషకాలు శోష ణం చేసుకుంటాయి.
  • పెద్దపేగు వ్యాసం చిన్నపేగు కంటే ఎక్కువ. నీరు, ఖనిజ లవణాలను పెద్దపేగు గోడలు పీల్చుకుంటాయి. పెరిస్టాలిటిక్ కదలికల వల్ల మలం పురీష నాళంలోనికి పోతుంది. పాయువుని రక్షిస్తూ ఉండే సంవరణీ కండరాలు వ్యాకోచించినప్పుడు మలం పాయువు ద్వారా బయటపడుతుంది.

ఆధారము: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

జీవశాస్త్రము పదవతరగతి

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate