অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

విద్యార్థి కేంద్రిత బోధనా పద్ధతులు.

పరిచయం

విద్యార్ధి అన్ని విషయాలలో సంపూర్ణ పరిజ్ఞానం పొందడానికి విద్యావిధానంలో భోధనా పద్దతులు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి అని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. బోధనాపద్దతి విద్యార్ధి కేంద్రితమైతే మంచి ఫలితాలను మనం సాధించవచ్చు. వాటిలో కొన్ని పద్దతులు గురించినదే ఈ వివరణ.

శాస్త్రీయ పద్ధతి

విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ. శాస్త్రవేత్తలు అనుసరించే విధానమే శాస్త్రీయ పద్ధతి. శా స్త్రీయ పద్ధతికి ప్రత్యేక సోపానాలు లేవు. ఎందుకంటే ప్రతి శాస్త్రవేత్త తనదైన శైలిలో ప్రయోగాలు చేస్తాడు.

  • 1937లో కార్‌‌లపియర్‌సన్, కీస్లర్ అనే శాస్త్రవేత్తలు ఈ పద్ధతిలో తొమ్మిది సోపానాలను వివరించారు. అవి... సమస్యను గుర్తించడం, సమస్యను నిర్వచించడం, సమస్య విశ్లేషణ, దత్తాంశ సేకరణ, దత్తాంశాల ప్రతిక్షేపణ, ప్రాకల్పనల ప్రతిపాదన, ప్రాకల్పనలను పరీక్షించడం, సాధారణీకరించడం, అన్వయం.

అన్వేషణ/ హ్యూరిస్టిక్ పద్ధతి


దీన్ని మొదటగా హెచ్.ఇ. ఆర్‌‌మస్ట్రాంగ్ లండన్‌లో ప్రవేశపెట్టారు. హ్యూరిస్టో అనే గ్రీకు పదానికి అర్థం అన్వేషణ. ఈ పద్ధతి ద్వారా విద్యార్థిని అన్వేషణకుడిగా చేయవచ్చు.
సోపానాలు: బోధనా అంశాలను సమస్యల రూపంలో రాయడం. సూచన పత్రాలను తయారు చేయడం. సూచనల ద్వారా ప్రయోగం చేయడం (విద్యార్థులు). ప్రయోగ ఫలితాలను రికార్డు చేసి, ఉపాధ్యాయులతో సంప్రదించి తిరిగి ప్రయోగాలు చేయడం. నేర్చుకున్న సూత్రాలను, సాధారణీకరణలను అన్వయించడం.
ప్రయోజనాలు: శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇస్తుంది. శాస్త్రీయ వైఖరి, సృజనాత్మకత, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించవచ్చు. కష్టపడి పనిచే యడంతో పాటు పనిపై గౌరవం పెరుగుతుంది. చేయడం ద్వారా నేర్చుకోవడం సాధ్యమవుతుంది. ఉపాధ్యాయునికి విద్యార్థులకు మధ్య సహకారం పెరుగుతుంది. నిజ జీవితంలో సమస్యలను సమర్థంగా ఎదుర్కొంటారు.
లోపాలు: విద్యార్థులు తమకు తాముగా నేర్చుకోవడం కష్టం. దీనికి ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు అవసరం. సరైన పాఠ్య పుస్తకాలు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు లేవు. తక్కువ మంది విద్యార్థులున్నప్పుడే సాధ్యం అవుతుంది. సిలబస్‌ను పూర్తి చేయడం కష్టం. అధిక వ్యయమవుతుంది. ప్రాథమిక పాఠశాలకు వర్తించదు. కాలనిర్ణయ పట్టికలో ఈ పద్ధతిని ఇమడ్చటం కష్టం.

ప్రాకల్పన/ ప్రాజెక్టు పద్ధతి

ఈ పద్ధతిని డబ్ల్యు.హెచ్. కిల్‌ప్యాట్రిక్ కను గొన్నాడు. జె.ఎ. స్టీవెన్‌సన్ దీని గురించి వివరించాడు. సహజ వాతావరణంలో చేసే సమస్యా పరిష్కారమే ప్రాజెక్ట్. ఇది వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి ఉంది.
సోపానాలు: పరిస్థితిని కల్పించడం, ప్రాజెక్ట్‌ను ఎంచుకొని లక్ష్యాన్ని వివరించడం, వ్యూహరచన, ప్రాజెక్ట్‌ను అమలు పర్చడం, మూల్యాంకనం, నివేదిక తయారు చేయడం మొదలైనవి.
మంచి ప్రాజెక్ట్ లక్షణాలు: విద్యార్థికి నిజ జీవితంలో ఉపయోగపడాలి. ఫలవంతమైన అనుభవాలు ఇచ్చేవిగా ఉండాలి. విద్యార్థులే సొంతంగా నిర్వహించగలిగేవిగా, సమయం, డబ్బు వృథా కాకుండా, రుతువులకు అనుగుణంగా ఉండాలి.

ప్రాజెక్ట్‌ల రకాలు
స్టీవెన్‌సన్ ప్రకారం రెండు రకాల ప్రాజెక్టులు ఉంటాయి.

  1. భౌతిక సంబంధమైనవి: శారీరక శ్రమకు సంబంధించినవి.
  2. మేధా సంబంధమైనవి: ఆలోచన లేదా జ్ఞానం ఉపయోగించి చేసేవి.
  3. కిల్‌ప్యాట్రిక్ ఈ రెండింటితోపాటు మరో నాలుగు రకాలను చేర్చి ఆరు రకాలుగా వర్గీకరించాడు.
  4. ఉత్పత్తి సంబంధమైనవి: ఈ ప్రాజెక్ట్ వల్ల చివరకు ఏదో ఒక వస్తువు తయారవుతుంది. ఉదా: సబ్బులు, కొవ్వొత్తుల తయారీ
  5. వినియోగ సంబంధమైనవి: ఒక వస్తువు లేదా పరికరం వినియోగం గురించి తెలుసుకుంటారు. ఉదా: డ్రిల్లింగ్ మిషన్ పనిచేసే విధానం తెలుసుకోవడం.
  6. సమస్యా ప్రాజెక్ట్: దీనిలో భాగంగా ఒక సమస్యను ఇస్తారు. దాని పరిష్కారం కనుగొనాలి.
  7. శిక్షణ ప్రాజెక్ట్: నైపుణ్యాలు నేర్చుకునే ప్రాజెక్ట్.

ప్రయోగశాల పద్ధతి


విద్యార్థులకు ముందుగానే లక్ష్యం, ప్రయోగ విధానం, ఫలితం తెలియజేసి, వారితో ప్రయోగాలు చేయిస్తూ బోధించే పద్ధతి.
ప్రయోగాలు మూడు రకాలు.
వ్యక్తిగతంగా చేయించేవి: పరికరాలు సరిపడే సంఖ్యలో ఉండి, చిన్న ప్రయోగాలైనప్పుడు ప్రతి ఒక్క విద్యార్థితో ప్రయోగాలు చేయించవచ్చు.
జట్టుతో చేయించేవి: పరికరాల సంఖ్య తక్కువగా ఉంటే విద్యార్థులను జట్లుగా విభజించి ఒక్కో జట్టుతో చేయించేవి.
ప్రయోగ విభజన: ప్రయోగం పెద్దదై, క్లిష్టంగా ఉన్నప్పుడు, దాన్ని భాగాలుగా విభజించి ఒక్కో భాగాన్ని ఒక్కో జట్టుతో చేయించడం.

నియోజన పద్ధతి

వారం రోజుల్లో పూర్తి చేయడానికి వీలుగా ఉండే చిన్న పాఠ్యాంశాల భాగాన్నే నియోజనం అంటారు. ఇందులో రెండు భాగాలుంటాయి.
1. సన్నాహక భాగం, 2. ప్రయోగశాల భాగం.
సన్నాహక భాగం: ఏం చదవాలో, ఏయే పుస్తకాలు సంప్రదించాలో వివరిస్తూ ఉపాధ్యాయుడు సూచన పత్రాల ద్వారా తెలియజేస్తాడు.
ప్రయోగశాల భాగం: సూచనల ఆధారంగా విద్యార్థి ప్రయోగాలు చేసి ఫలితాలు రాబడతాడు.

చర్చా పద్ధతి

విద్యార్థులకు వ్యక్తిగతంగా లేదా జట్లుగా చర్చను ఇవ్వవచ్చు. చర్చను గంట లేదా అంతకు మించిన సమయంలో కూడా నిర్వహించవచ్చు. కీలకమైన భావనలు నల్లబల్లపై రాయాలి. కాలనిర్ణయ పట్టికలో తగిన సమయం కేటాయించాలి. ఈ పట్టికలో పాఠ్యాంశాలు సరళంగా ఉండాలి.

కృత్య/ కార్యకలాపాల పద్ధతి

కృత్యాల ద్వారా బోధించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థి సొంతంగా కృత్యం చేయడం వల్ల ఆనందానికి గురవుతాడు. పాఠశాలలో సాంఘికోపయోగ ఉత్పాదక కృత్యాలను ప్రవేశ పెట్టాలని 1977లో ఈశ్వరీ భాయ్ పటేల్ కమిటీ సిఫార్సు చేసింది.
1986 లో జాతీయ విద్యా కమిషన్ కూడా ఈ కృత్యాలను ‘పని - అనుభవం’ పేరుతో ప్రవేశపెట్టింది. కృత్యాలు మూడు రకాలు. అవి..
1. కనుక్కొనే కృత్యం - జ్ఞానాన్నిచ్చేవి
2. నిర్మాణాత్మక కృత్యాలు - అనుభవాన్ని ఇచ్చేవి
3. ప్రకటిత కృత్యాలు - ప్రదర్శనను ఇచ్చేవి.
వివిధ రకాల ప్రయోగాల ద్వారా విద్యార్థులు వివిధ దశల్లో, వయసుల్లో చేయదగ్గ కృత్యాలను మనో వైజ్ఞానిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ పియాజే వివరించారు.

 

ఆధారము: భౌతిక,రసాయన శాస్త్ర బోధనాపద్దతులు, తెలుగు అకాడమి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate