హోమ్ / విద్య / ఉపాధ్యాయ వేదిక / శిశు వికాసం మరియు పూర్వ ప్రాథమిక విద్య
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

శిశు వికాసం మరియు పూర్వ ప్రాథమిక విద్య

బాల్యం యొక్క ఆరంభ దశ ఎంతో సున్నితమైంది. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల ఎదుగుదల కాలాన్ని బాల్యారంభ దశగా పరిగణిస్తే, ఆ సమయంలోనే వారిలో అన్ని విధాలుగా ఎదుగుదలకు ఉపయోగపడే బీజాలు నాటాలి.

బాల్యం యొక్క ఆరంభ దశ ఎంతో సున్నితమైంది. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల ఎదుగుదల కాలాన్ని బాల్యారంభ దశగా పరిగణిస్తే, ఆ సమయంలోనే వారిలో అన్ని విధాలుగా ఎదుగుదలకు ఉపయోగపడే బీజాలు నాటాలి. ఈ సమయంలోనే వారిలో చూపు, స్పర్శ, గుర్తింపు, వినికిడిలాంటి చేతనలన్నీ విజ్ఞానరూపం వైపు తొంగిచూస్తుంటాయి. ఈ సమయంలో ఏ మాత్రం మొరటు తనానికి వారు గురైనా, వారి భావి జీవితాలకు ఎంతో నష్టం కలుగుతుంది.ఆరు సంవత్సరాల లోపు పిల్లల మానసిక స్థితి అత్యంత సున్నితంగా ఉంటుంది. వారి వ్యక్తిత్వపు మొలకలు ఆరంభమయ్యే రోజులు ఇవి . ఈ పూర్వ ప్రాథమిక దశలోని పిల్లల అవసరాలు తెలుసుకోవటం ఎంత ముఖ్యమో, అలాగే వారి శక్తి సామర్థ్యాలు అవగాహన చేసుకోవటం అంతకన్నా ముఖ్యం. ఈ అవగాహన బలం తోటే పిల్లల సమగ్ర అభివృద్ధిని మరింత మెరుగ్గా సాధించవచ్చు.

పిల్లల సంసిద్ధత- పూర్వ ప్రాథమిక విద్యపై అవగాహన

ఆరు సంవత్సరాల లోపు పిల్లల మానసిక స్థితి అత్యంత సున్నితంగా ఉంటుంది. వారి వ్యక్తిత్వపు మొలకలు ఆరంభమయ్యే రోజులు ఇవి . ఈ పూర్వ ప్రాథమిక దశలోని పిల్లల అవసరాలు తెలుసుకోవటం ఎంత ముఖ్యమో, అలాగే వారి శక్తి సామర్థ్యాలు అవగాహన చేసుకోవటం అంతకన్నా ముఖ్యం. ఈ అవగాహన బలం తోటే పిల్లల సమగ్ర అభివృద్ధిని మరింత మెరుగ్గా సాధించవచ్చు.

పిల్లల సంసిద్ధత

నిత్యం పిల్లల చుట్టూ ఉండే వాతావరణానికి, పిల్లల మనస్తత్వానికి సంబంధం ఉందని అంటుంటారు. వారి చుట్టూ ఉండే వాతావరణం అంటే కుటుంబం, కుటుంబంలోని వ్యక్తులు, పిల్లల సామర్థ్యాన్ని ప్రత్యేక బోధన ద్వారా అభివృద్ధి పరచవచ్చని నిపుణుల ఉద్దేశం.

ఈనాటి పరిస్థితులలో తల్లిదండ్రులందరూ తమ పిల్లల్ని మేధావులుగా, గొప్పవారిగా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నారు. దానికిగాను ఎంతగానో శ్రమిస్తున్నారు. తమ సమయాన్ని, డబ్బుని దీనికిగాను వినియోగిస్తున్నారు. పిల్లలను అంగన్ వాడికి పంపిస్తున్నారు. వీరి ఈ శ్రమ ఫలించాలంటే, పిల్లలకి ఉన్న అవసరాలు ఏమిటో, వారి శక్తి, సామర్థ్యం ఎంతో అంగన్ వాడీ టీచరు గ్రహించాలి. కొంచెం విపులంగా చెప్పుకోవాలంటే, కొంతమంది పిల్లలు ఒక్కసారి దేన్నైనా చూస్తే చాలు తిరిగి గుర్తుపట్టి, దాని పేరు చెప్పగలిగే సామర్థ్యం ఉంటుంది.

అదే మరికొందరి పిల్లలకి అదే వస్తువుని ఒకటికి నాలుగుసార్లు చూపించి, దాని పేరు మననం చేయించాల్సిన అవసరం ఉంటుంది. దీనిని గమనించి పెద్దలు ఓర్పుగా కృషి చేస్తేనే ఫలితం ఉంటుంది.

3 – 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎంతో చురుగ్గా అన్నీ తెలుసుకోవాలన్న ఆసక్తితో, ఆతృతతో ఉంటారు. కళ్ళ ముందున్న అన్నింటి గురించి తెలుసుకోవాలని, వాటిని తమ అనుభవంలోకి తెచ్చేసుకోవాలని తొందరపడుతుంటారు. ఆ అవసరం తీరకపోతే ఏడవటం వాళ్ళ ఆయుధం. ఒకసారి ఏడ్చి సాధిస్తే, తిరిగి అదే పద్ధతి అవలంబిస్తారు. దానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే మొండికేస్తారు, పట్టుపడతారు. అందువల్ల పిల్లలు ఉండే వాతావరణంలో వారికి ప్రమాదకరమైనవి, వారికి ఇబ్బందిని కలిగించేవి ఏవీ లేకుండా వీలున్నంత జాగ్రత్తపడాలి.

ఆరో సంవత్సరం వరకు పిల్లల్లో శారీరక ఎదుగుదల చాలా త్వరితంగా జరుగుతుంది. అప్పటి వారి శారీరక స్వభావం ప్రకారం గెంతటం, పరిగెత్తటం, దూకటం, లాగటం, తొయ్యటం, గుండ్రంగా తిరగటం, విసరటం, పట్టుకోవటం లాంటి చర్యలు సహజంగా పిల్లలకు ఇష్టమైన చర్యలు. వారి ఈ ఇష్టానికి అనుగుణంగా వారిని ఆడించాలి. ఈ ఆటలవల్లే వారి శారీరక అభివృద్ధి జరుగుతుంది. సూక్ష్మ, స్థూల కండరాల చలనం, చూపు – చేతల సమన్వయం ఈ సమయంలోనే బలపడతాయి. ఆసక్తే తప్ప మంచి చెడులు సరిగ్గా తెలియని వయసు వారిది. ఈ సమయంలో వారి ఆసక్తి, సరదా తీరేలా, వారికి హాని చెయ్యని ఆటల్ని, ఆట వస్తువుల్ని అందుబాటులోకి తేవాలి. ఈ ప్రక్రియ సాగుతుండగానే వారి సామర్థ్యం పెరుగుతూ వస్తుంది. గుర్తు, గుర్తింపు, వ్యక్తీకరణ, స్పందన, ఊహ, ఇలా క్రమేపి వారి ప్రపంచం విస్తరిస్తుంది. స్కూలుకి వెళ్ళి పాఠాలు చదువుకోవటానికి ముందు ఆరు సంవత్సరాలలోపు దశలో అభివృద్ధి చెందే వారి స్థాయి, తరువాత భవిష్యత్తులో వారికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.

అందుకే పిల్లల్ని అర్థం చేసుకోవటానికి, వారి అభివృద్ధికి శాయ శక్తులా తోడ్పడటానికి ఉద్దేశించే పూర్వ ప్రాథమిక విద్య.

మేలైన అభివృద్ధి సాధించటానికి కొన్ని మార్గదర్శకాలు
 • పిల్లలందర్నీ వ్యక్తులుగా ఎవరికివారుగానే భావించాలి. ఒకరి సామర్థ్యంతో మరొకరి సామర్థ్యాన్ని పోల్చి చూడకూడదు.
 • పిల్లలు ఆటల ద్వారా నేర్చుకుంటారు. ఆటల్ని అల్లరిగా భావించకూడదు.
 • పిల్లలు చూసి, విని నేర్చుకోవటం కన్నా తామంత తాముగా చేయటం వల్ల బాగా నేర్చుకుంటారు.
 • పిల్లలందరికీ గెలుపు ఆనంద కారణం. వాళ్ళేదైనా సాధించగానే గుర్తింపు, ప్రోత్సాహాన్ని కోరుకుంటారు. దాన్ని పెద్దలు ఆదరించాలి. బంతి బాగా విసిరినప్పుడు , తప్పట్లు కొట్టి సంతోషిస్తే, వారి ఆనందం పదింతలవుతుంది.
 • పిల్లలు పెద్దల్ని ప్రశ్నంచి తెలుసుకోవాలనుకుంటారు. వారి ప్రశ్నల్ని అశ్రద్ధ చేయ్యకూడదు. తెలిసున్నంతవరకూ సమాధానాలు ఓప్పిగ్గా చెప్పాలి. తెలియకపోతే మరొకర్ని అడిగైనా తెలుసుకోవాలి.
 • పిల్లల్లో వ్యక్తీకరణ నైపుణ్యం చాలా ముఖ్యమైనది. పిల్లలతో పెద్దలు వీలున్నంతగా మాట్లాడటం ఎంత ముఖ్యమో, వారు చెప్పేది వినటం కూడా అంత ముఖ్యమే. వీలున్నంతగా వారు మాట్లాడటాన్ని ప్రోత్సహించాలి.
 • పిల్లలలతో ఉండే పెద్దలందరూ స్నేహంగా మెలగాలి. ప్రసన్నతతో వ్యవహరించాలి.
 • పెద్దవారు తమకి దగ్గరి వారన్న భావన పిల్లలకి కలిగించాలి. ఏ అవసరానికైనా ఏ భయం లేకుండా పిల్లలు పెద్దవారితో మెలగగలగాలి.
 • పిల్లలతో మొరటుగాగానీ, విముఖంగా గానీ ఉండకూడదు.
 • పిల్లలకి ఏర్పరచే హద్దుల విషయంలో ఎంతో ఓర్పుగా, మృదువుగా ప్రవర్తించాలి.
 • పిల్లల శారీరక రక్షణ విషయంలో ఎల్లవేళలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా వారికి కష్టం కలగనివ్వకూడదు.
 • పిల్లల శక్తి మేరకే వారి శ్రమ ఉండాలి. శక్తికి మించిన శ్రమకి గురిచేస్తే వారిలో విసుగు, ఆనాసక్తత కలుగుతాయి.
 • పిల్లలకి వీలున్నంత స్వేచ్ఛ ఉండాలి, మరీ అవసరం అయితే తప్ప పెద్దలు అడ్డుగా వెళ్ళకూడదు. అలా అని వారంతట వారిని వదిలెయ్యకూడదు. పెద్దల పర్యవేక్షణలో ఉండాలి.
 • పిల్లల ఆటపాటలకి, ప్రజ్ఞాపాటవాలకి పెద్దలు, కార్యకర్తలు తమ సంతోషాన్ని వారికి తెలియజేస్తుంటే పిల్లలు సంతోషంగా ఉంటారు. ఓదార్పు ఎంత అవసరమో అంతకన్నా, సంతోష వ్యక్తీకరణ ఇంకా ఎక్కువ అవసరం.
చిన్న పిల్లలకి ఎటువంటి ఆటబొమ్మలు ఇవ్వాలి
 • ఎటువంటి ఆటైనా పిల్లలకి ఆనందమే. అభం శుభం తెలియని పసివాడు పాముతోనైనా సరే ఆడుకోవడానికి సిద్ధపడతాడు. ఆటలు ఆనందాన్నే కాదు, పిల్లలకి శారీరిక బలాన్ని, ఎదుగుదలని, ఉత్సాహాన్నిస్తాయి. తన మాటల్ని, తనని ఇతరులు గుర్తించాలని, అలా గుర్తించి మెచ్చుకుంటే తనకి ఇంకా బావుంటుందన్న సాంఘిక బంధాన్ని ఆటలు పెంపొందిస్తాయి.
 • ఆటల ద్వారా పిల్లల్లో జరిగే అభివృద్ధి ఎంతో సహజమైంది. స్వాభావికమైంది. పెద్దలు చెప్పింది నేర్చుకోవటం కన్నా, పిల్లలు తమంతటగా తాము నేర్చుకున్నది బలీయమైంది.
 • ఆటలకి కావల్సిన వాటిలో ఆట వస్తువులు, బొమ్మలు ముఖ్యమైనవి. బొమ్మలు, ఆట వస్తువులు పిల్లల్ని, పెద్దల్ని మరింత దగ్గరగా చేస్తాయి. అనుబంధాన్ని పెంచుతాయి. ఒకే బొమ్మతో వివిధ రకాలుగా ఆటలాడుతూ, మాటలు,చెప్పటం పట్ల ఆసక్తి ఎక్కువవుతుంది.
 • పిల్లలకి ఇచ్చే ఆట వస్తువులు, బొమ్మలు వారికే ఏ విధంగానూ కష్టం, నష్టం కలిగించేవిగా ఉండకూడదు. ఈ అంశానికి పెద్దలు, కార్యకర్తలు చాలా ప్రాముఖ్యతనివ్వాలి. పిల్లల వయసుకి తగిన వాటినే ఇవ్వాలి, వయసు వారీగా ఎలా ఉంటే మంచిదో తెలుసుకుందాం.

0–6 నెలల వయసు

ఈ తొలిరోజుల్లో పిల్లలు రంగులకి, శబ్దాలకి, వాసనలకి తొందరగా స్పందిస్తారు. మొదట్లో వారివన్నీ అసంకల్ప చర్యలే. కాలక్రమేణా అంటే 6 నెలల వయసు వచ్చేటప్పటికి శరీర కదలికతో కొంతవరకూ ఆట వస్తువుల్ని, బొమ్మల్ని అందుకొనే స్థాయికి వస్తారు. ఈ వయసులో పిల్లలు, కొట్టొచ్చినట్టు కనబడే వాటిని ఇష్టపడతారు. మృదువుగా, సున్నితంగా ఉండే శబ్దాలని, నాదాల్ని వింటూ ఆనందిస్తారు.

ఈ వయసులో వారికి అనుకూలంగా, అభివృద్ధికి దోహదకారిగా ఉండే కొన్ని వస్తువులు: గిలకలు, ప్రమాదం కలగకుండా నోట్లో పెట్టుకొని ఆడుకొనే వస్తువులు, మెత్తటి మృదువైన బొమ్మలు, నొక్కితే చప్పుడు చేసేవి, బంతులు, దూది తదితర పదార్థాలు కూరి చేసే జంతు ఆకారాలు, పెద్ద ముఖాలతో ఉండే పోస్టర్లు, ప్రమాదం లేని అద్దాలు, క్రిబ్ జిమ్, టిక్ టిక్ మనే గడియారం బొమ్మలు, మ్యూజిక్ బాక్సులు, జోలపాటలు ఆడియో కేసెట్లు

6–12 నెలల వయసు

ఈ దశలో పిల్లలకి శరీరం మీద స్వాధీనత పెరుగుతుంది. కూర్చోవటం, పాకటం, నిలబడటం అలవాటవుతుంది. చేతివేళ్ళని విడివిడిగా కదుపుతూ బొమ్మల్ని పట్టుకోవటం వస్తుంది. ఆసక్తి పెరిగి వస్తువుల్ని మరింత పరీక్షగా చూడటం వస్తుంది. వాటిని చూసి, ముట్టుకొని, వాటిని రకరకాలుగా పరీక్షిస్తారు. కేంద్రీకరణ పెరిగి, ప్రవర్తన ప్రయోజనకరంగా రూపుదిద్దుకుంటూ ఉంటుంది.

ఈ వయసులో ఉపయోగపడే బొమ్మలు మరియు వస్తువులు: గుడ్డతో గాని, ప్లాస్టిక్ తో గాని చేసిన బ్లాకులు, కార్డ్ బోర్డ్ బొమ్మల పుస్తకాలు, గట్టి దీర్ఘమైన రబ్బరు ముక్కలతో గానీ, ప్లాస్టిక్ పూసలతో గానీ చేసిన రంగు రంగుల దండలు, తల, కాళ్ళు చేతులు కదిలించే బొమ్మలు, అక్షరాల బ్లాకులు, ఈ బ్లాకుల్ని అమర్చి ఆడుకోగలిగిన డబ్బాలు, మాటలు, పక్షుల కూతలు, జంతువుల అరుపులు తెలిపే ఆడియో కేసెట్లు, మృదువుగా దొర్లించడానికి వీలుండే తేలికపాటి ప్లాస్టిక్ బొమ్మలు.

12–18 నెలల వయసు

ఇది తప్పటడుగుల వయసు. ఈ వయసులో నడక ఆరంభించచటం గానీ, నడవటం గానీ జరుగుతుంది. కొద్దికొద్దిగా నైపుణ్యం పెరుగుతుంది. బొమ్మ ఎలా కదుతుతుంది, పక్షులు ఎలా ఎగురుతున్నాయి లాంటి విషయాల్ని తెలుసుకోవటానికి ఆసక్తి కనబరిచే కాలం. చిన్నచిన్న మాటలు అర్థమవుతాయి. ప్రీ స్కూల్ టీచర్ గానీ, కార్యకర్తగానీ, తల్లిదండ్రలుగానీ నెమ్మదిగా ఈ వయసు పిల్లలకి బొమ్మలతో ఎలా ఆడుకోవాలో వివరిస్తూండవచ్చు.

ఈ వయసులో వీలుగా ఉండే వస్తువులు మరియు బొమ్మలు: ఓ క్రమంలో అమర్చే కలర్ కోన్స్ బాగ్స్, రెండు నుంచి ఆరు భాగాల పజిల్స్, కలర్ పెన్సిళ్ళు, లేదా క్రేయాన్స్, రంగురంగుల కాగితాలు, చిన్నచిన్న ఆట పాత్రలు, కొద్దిపాటి నీటిలో వేసి ఆడించే పడవలు, నీటిలో తేలే పల్చటి చెక్క పదార్థాలు, ఉడెన్ బ్లాక్స్, జంతువులు మరియు పళ్ళ ఆకారంలో ఉండే మృదువైన బొమ్మలు, సూది అంచులు, మొనలులేని ప్లాస్టిక్ లేదా చెక్క బొమ్మలు, వాహనాలు, తబలా మరియు పియానో బొమ్మలు, చిన్నచిన్న బొమ్మల కథలుండే పుస్తకాలు, కొద్ది ఎత్తు ఉండి ఊగే గుర్రం బొమ్మ, లేదా ఎక్కించి తిప్పగలిగిన ఇతర బొమ్మలు.

18-24 నెలల వయసు

ఈ సమయానికి పిల్లలకి బాగా నడవటం వచ్చేస్తుంది. పరిగెత్తడం, ఎత్తులు ఎక్కడం ఆరంభిస్తారు. తమంతట తాము కొన్ని పనులు చెయ్యగలిగిన నైపుణ్యం, తమ ఇష్టం, అయిష్టం మాటలతో చెప్పగలిగే శక్తి వస్తాయి. బువ్వలాట లాంటి కొన్ని ఊహాత్మక ఆటలకి తమ దగ్గరున్న బొమ్మల్ని ఉపయోగిస్తారు.

వీరికి ఉపయోగకరంగా ఉండేవి: చెక్క రైలు, మట్టిబొమ్మలు, గుండ్రంగా తిరిగే ప్లాస్టిక్ లేదా చెక్క బొమ్మలు, బొమ్మ ఫోన్ / మొబైల్ ఫోన్, ఆకారాలను గుర్తించడానికి తయారుచేసిన బొమ్మలు, దూది లేదా ఇతరాలు కూరి చేసిన కొంచెం పెద్ద సైజు జంతు ఆకారాల బొమ్మలు (స్టప్డ్ యానిమల్ టాయ్స్), బొమ్మలుండే చిన్నచిన్న కథల పుస్తకాలు, డ్రమ్, డోలక్, తబలా చప్పుళ్ళు వచ్చే బొమ్మలు, ఊగే కుర్చీ లేదా గుర్రం, తాడు కట్టి లాగే బొమ్మలు (చక్రాలు ఉన్న బస్సు లేదా ఏనుగు లాంటి బొమ్మలు),తోస్తూ ఆడుకొనే బొమ్మలు.

2-3 సంవత్సరాల వయసు

ఈ వయసులో పిల్లల ప్రపంచం విస్తరిస్తూ ఉంటుంది. శక్తివంతమైనా, అభివృద్ధి చెందిన సమన్వయం అలవడే కాలం, ఎప్పుడూ ఏదో ఒకటి చెయ్యాలన్న ఆసక్తితో ఉంటారు. చేతులు, వేళ్ళు చురుగ్గా ఉంటాయి. ఆ చురుకుదనాన్ని, నైపుణ్యాన్ని వినియోగించుకోవాలన్న తాపత్రయం ఉంటుంది. బ్లాకులు, కోన్స్ లాంటివాటితో ఆకారాలు ఏర్పరచటం ఎంతో ఇష్టపడతారు. భావాభివృద్ధి కూడా జరుగుతుంది. అందువల్ల అందరితో కలవటం, మాట్లాడటం, చెప్పటం, వినటం, ఆసక్తిగా ఉంటాయి. పరస్పర సంబంధం ఉండే చర్యలుంటే ఉత్సాహంగా ఉంటుంది.

వీరికి ఆసక్తిగా ఉండే ముఖ్యమైన బొమ్మలు, వస్తువులు నాలుగు నుంచి ఇరవై భాగాలుగా ఉండే పజిల్స్, పదును లేకుండా మొండిగా ఉండే ప్లాస్టిక్ కతైర, వివిధ సైజులలో బంతులు, ఆకారాలు కూర్చే బ్లాకులు వస్తువులు వేసే ట్రక్ బొమ్మ,సాధారణ రైలు ఇంజన్, బోగీల సెట్, నర్సరీ రైమ్స్ ఉండే కేసెట్లు మరియు పిల్లల కోసం కూర్చీన సంగీతం, అల్లికలు తెలిపే బొమ్మలు, చేతులకి వేసుకొనే ప్రమాదకారి కాని రంగులు. ఈ వయసులో వారికి పరిచయం ఉండే విషయాల మీద బొమ్మల కథల పుస్తకాలు, దారం లాగితే తిరిగే లేదా శబ్దాలు వచ్చే బొమ్మలు. రకరకాల దుస్తులతో పెద్దవారిని పోలి ఉండే బొమ్మలు అంతేకాక ఇంటి సామాగ్రికి నకలుగా ఉండే బొమ్మలు మరియు వస్తువులు.

3-4 సంవత్సరాల వయసు

ఈ వయసు వారి ఆలోచనల్లో ఊహలు ఎక్కువగా ఉంటాయి. నిజంకాని ఊహాత్మక ప్రపంచం కూడా ఆసక్తిగా ఉంటుంది. సృజనాత్మకతతో పాటు, తమతమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించాలనుకొంటారు. పెద్దలతో కలిసి ఆడుకోవటానికి ఇష్టం చూపుతారు.

ఈ వయసుకి తగినవి : ఇంటర్ లాకింగ్ చెక్క మరియు ప్లాస్టిక్ బ్లాకులు,కుట్టుపని చార్టులు మరియు కిట్స్, రంగులు వేసే బొమ్మల పుస్తకాలు, క్రేయాన్లు,దారంతో ఉండే పూసలు, గొట్టాలు, కాగితాలు, కతైర్లు, అంటించటానికి జిగురు, బొమ్మలు వెయ్యటానికి పెయింట్స్, రంగులు, బ్రష్ లు, చేతితో చేసే బొమ్మలు. ఆడియో కేసెట్స్ మరియు రికార్డర్, మూడు చక్రాల సైకిళ్ళు మరియు ఇతర వాహనాలు, దుస్తులు వేసి తీసి మార్చే బొమ్మలు, సంగీతపు బొమ్మలు అంటే రిథమ్ స్టెప్స్.

4-6 సంవత్సరాల వయసు

స్నేహం, స్నేహితులు అలవాటయ్యే సమయం ఇది. తమకి నచ్చిన ఒకర్ని స్నేహితులుగా ఎంచుకొంటారు. వారితోటి ఆటలు, మాటలు పెంపొందుతాయి. తనంతట తానుగానీ, ఇతరుల ప్రమేయంతో గానీ ఆడే ఆటలలో నాటకీయత, ఊహా చోటు చేసుకుంటాయి.

ఈ వయసుకి తగినవి : చిన్నచిన్న చెక్క లేదా ప్లాస్టిక్ ముక్కలతో దృశ్యరూపంగా ఉండే బొమ్మలు. చిన్నచిన్న బొమ్మకార్లు, తదితర వాహన బొమ్మలు. ఇరవై భాగాలని మించిన పజిల్స్, ప్లాస్టిక్ బ్లాకులు, ఇంటర్ లాకింగ్ బిల్డింగ్ బ్లాకులు, బొమ్మల ఇల్లు, చిన్న బోర్డు ఆటలు, కొంచెం ఎక్కువ వివరణ, వివరాలు ఉండే కథల పుస్తకాలు, తేలికపాటి సాంకేతిక పుస్తకాలు, పోస్టర్ రంగులు, బ్రష్ లు, మేగ్నటిక్ స్కెచ్చింగ్ బోర్డు, కూర్చే మెటిరియల్ తో కొలేజస్, చాక్ బోర్డు, ప్లే కిచెన్, బొమ్మల మెడికల్ కిట్, కొంచెం ఎక్కువగా బట్టలు వేసి మార్చే బొమ్మలు.

పిల్లల ఆటవస్తువులు, ఇతర సామాగ్రి ఎంపిక చేసుకోవటంలో గమనించవలసిన విషయాలు
 • బొమ్మలు సురక్షితమైనవిగా, ప్రమాదం కలిగించనివిగా ఉండాలి. పిల్లలు ఎదిగే వయసులోనే ఈ జాగ్రత్త ముఖ్యం.
 • నెలల పిల్లలు మింగేసే ప్రమాదం ఉంటుంది. అందుకే చిన్న చిన్న ముక్కలుగా ఉండే, విరిగే, ఊడిపోయే బొమ్మలు వారికి ఇవ్వకూడదు.
 • గట్టిగా లేని దారాలు తాళ్ళు, రబ్బర్లు, రింగులు ఉండే బొమ్మలు ఇవ్వకూడదు.
 • సూదిగా, కొసగా ఉండే బొమ్మలు, మూలల వల్ల కోసుకొనే ప్రమాదం ఉన్న బొమ్మలు ఇవ్వకూడదు.
 • మరీ పెద్ద చప్పుళ్ళు, మోతలు వచ్చే బొమ్మలు ఇస్తే పిల్లలు భయపడతారు. అది వారి మీద చెడు ప్రభావం చూపిస్తుంది.
 • రసాయనాలు లేని బొమ్మల్నే ఇవ్వాలి.
 • అగ్ని ప్రమాదం ఉండే బొమ్మలు ఇవ్వకూడదు.
 • బొమ్మలు భద్రపరచేటప్పుడు, అవి అందుకొనే ప్రయత్నంలో పిల్లలకి ఏ ప్రమాదం జరగకుండా భద్రపరచాలి.
 • బొమ్మలను తరచుగా, క్రమ వారీ శుభ్రపరచాలి. దూమ్మూ, ధూళి, తుప్పు చేరే ప్రమాదం ఉంది. అంతేకాక పిల్లల చొంగ, ఉమ్ము బొమ్మలకి తగులుతుంది. అందువల్ల క్రిములు చేరకుండా మంచి పదార్థాలతో శుభ్రం చేస్తు ఉండాలి.
 • బొమ్మలు పిల్లల ఉత్సాహాన్ని, సృజనాత్మకతని పెంచాలి. భయం, జుగుప్స కలిగేలా ఉండకూడదు.
 • బొమ్మల ఖరీదు కన్నా, అవి పిల్లల అభివృద్ధికి తోడ్పడేవిగా ఉండటం ముఖ్యం.
 • విజ్ఞానదాయకంగా, పిల్లల సమగ్ర అభివృద్ధికి తోడ్పడేవిగా ఉండాలి.
 • బొమ్మల ఎంపికని ఆలోచించి చేస్తే మరింత ప్రయోజనకరం.
 • కొన్ని బొమ్మలు, ఆటలు కృరత్వాన్ని, విధ్వంసాన్ని పెంచేలా, పిల్లల్లో అసాంఘిక భావాలకి నాంది పలికేలా ఉంటాయి. వాటిని పిల్లల దగ్గరకి రానివ్వకుండా జాగ్రత్తపడాలి.
 • టి.వి., కంప్యూటర్, కంప్యూటర్ గేమ్స్ పిల్లలకి విచక్షణతో, తగిన సమయం కేటాయించి అందుబాటులో ఉంచాలి. రోజుకి గంట నుండి రెండు గంటల కన్నా పిల్లలు వీటిని వాడకుండా చూడటం మంచిది.
 • పెద్దలు వారికి అందుబాటులో దొరికే గ్రీటింగ్ కార్డులు, ఆహ్వాన పత్రికలు, న్యూస్ పేపర్లు, పాత పుస్తకాలు, కూరగాయలు, ఖాళీ డబ్బాలు, కవర్లు, పప్పుధాన్యాలు, చెక్కముక్కలు, పౌడరు డబ్బాలు, అగ్గిపెట్టె, కొవ్వొత్తులు, గాజులు, దూది, టైలర్ వద్ద లభించే బట్టముక్కలు ఉపయోగించి ఆట వస్తువులు తయారుచేయవచ్చును.

శిశు వికాసం

బాల్యం యొక్క ఆరంభ దశ ఎంతో సున్నితమైంది. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల ఎదుగుదల కాలాన్ని బాల్యారంభ దశగా పరిగణిస్తే, ఆ సమయంలోనే వారిలో అన్ని విధాలుగా ఎదుగుదలకు ఉపయోగపడే బీజాలు నాటాలి. ఈ సమయంలోనే వారిలో చూపు, స్పర్శ, గుర్తింపు, వినికిడిలాంటి చేతనలన్నీ విజ్ఞానరూపం వైపు తొంగిచూస్తుంటాయి. ఈ సమయంలో ఏ మాత్రం మొరటు తనానికి వారు గురైనా, వారి భావి జీవితాలకు ఎంతో నష్టం కలుగుతుంది.

పసివారికి ప్రపంచానికి మధ్య ఏర్పరచగలిగిన సున్నితమైన, సునిశితమైన వారధే బాల్య ఆరంభ విద్య. ఇది చదువు కాదు, కానీ పసివారికి అత్యవసరమైన జ్ఞానదీపిక. వెలుగునివ్వాలి కానీ పిల్లలకి తెలియ నీయకూడదు. అంతటి సున్నితమైన, జాగ్రత్తయిన ప్రక్రియ బాల్యారంభ విద్య.

ఈ ఆరు సంవత్సరాల కాలంలోని ముఖ్య పరిణామాలు :
 1. వికాసం వేగంగా జరుగుతుంది.
 2. వారి సామర్థ్యం ఫలప్రదం కావటానికి పునాది ఏర్పడే కీలకదశ.
 3. ఇప్పటి మొరటు, ఇబ్బందికర అనుభవాలు వారి భావి జీవిత విజయానికి ఆటంకాలుగా,బలహీనతలుగా రూపు దిద్దుకునే ప్రమాదం ఉంది.
 4. పిల్లల ఈ బాల్య దశను వారి అభివృద్ధికి అనువుగా తీర్చిదిద్ది ప్రేరణ కలిగించే వాతావరణం అవసరం.3 – 6 సంవత్సరాల పిల్లలు ఈ కనీస అవసరాన్ని తీర్చిదిద్దటానికి – శిశు విద్య, పూర్వ ప్రాథమిక విద్య, బాల్యారంభ విద్య, శిశు వికాస కార్యక్రమం అన్న వివిధ పేర్లతో రకరకాల కార్యక్రమ రచన జరిగింది.

శిశు వికాస కార్యక్రమం ప్రయోజనాలు

3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి :

 1. సమగ్ర వికాసానికి అవకాశం
 2. బడికి సంసిద్ధం కావడం

బడిలో చేరవలసిన పిల్లలకి :

 1. బడిలో చేరే స్థాయికి చేరటం
 2. కనీస సామర్థ్యాల సాధనకు అవకాశం

తల్లి దండ్రులకి :

 1. పిల్లలకి భద్రత – తల్లులకు నిశ్చంత

బడిలో చేరిన పిల్లలకి :

 1. అక్కలకు తమ్ముళ్ళను, చెల్లెళ్ళను చూసే బాధ్యత తప్పడం
 2. బడికి వెళ్ళగలగడం
 3. సమగ్రాభివృద్ధికి అవకాశం

సమాజపరంగా:

 1. అందరికీ ప్రాథమిక విద్య
విద్యా కార్యక్రమ ప్రధాన లక్ష్యాలు

పిల్లల సమగ్ర వికాసం :

 • శారీరక చలన కండారాల అభివృద్ధి
 • భాషాభివృద్ధి
 • గ్రహణశక్తి / మేధావికాసం
 • సాంఘిక వికాసం
 • సౌందర్య రసాస్వాదన / భావోద్వేగ వికాసం
సృజనాత్మక వ్యక్తీకరణ
 • పసివారి చుట్టూ కేంద్రీకృతమైన కార్యకలాపాల ఆధారంగా వ్యూహం రూపొందించుకోవడం. బాల్యారంభ విద్య. మౌలికంగా పిల్లలను కేంద్రంగా చేసుకొనే విధానం. అది విద్యాభ్యాసానికి తొలిమెట్టు. ఇది ఆటపాటలతో కూడుకున్న విధానం.
 • ఆటలు పిల్లలకు స్థూలరూపంలో అనుభవాలు నేర్చుకోవడానికి అవకాశాలు కల్పిస్తాయి. వీటి ద్వారా నేర్చుకునే ప్రక్రియలో సులభంగా విషయాలను గ్రహించడం, అంతే కాకుండా కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న భాగస్వామ్యం అలవాటవుతాయి.
 • పిల్లలు తమ చుట్టు పక్కల ఉన్న వాళ్ళను అనుకరించడం, వారి ప్రోత్సాహం ద్వారా భావాలు, అభిప్రాయాలు, ఆలోచనలు వినడానికి, తిరిగి వ్యక్తీకరించడానికి లభించే ప్రేరణ ద్వారా భాషను నేర్చుకుంటారు.
 • బాల్యారంభ దశలోని కార్యక్రమాలు తప్పనిసరిగా ప్రాంతీయ భాషలో లేదా పిల్లల మాతృ భాషలోనే ఉండాలి.
 • సరియైన విద్యను నేర్చుకొనే అలవాటును, వాతావరణాన్నీ కల్పించినపుడే పిల్లలు అభివృద్ధి పథంలో ఉంటారు.
శిశు విద్యా కార్యక్రమం
 • 2 ఎళ్ళు పై వయసు నుండి 6 సంవత్సరాల పిల్లల పరిపూర్ణ వికాసానికి దోహదం చేసేది.
 • పిల్లలను కేంద్రంగా చేసుకొని పని చేసేది.
 • పిల్లల తెలివితేటలు, భాషా నైపుణ్యాలు పెరగడానికి, వాళ్ళు సామాజికంగా, మానసికంగా, శారీరకంగా ఎదగడానికి తగిన వాతావరణాన్ని కల్పించేది
 • పిల్లలను ప్రాథమిక తరగతులకు సంసిద్ధం చేసేది.
 • చదవడం, రాయడం, లెక్కలు నేర్చుకోవడానికి అవసరమైన పునాది వేసేది.
 • పరికరాలతో సంబంధాలను, కలిసిమెలిసి చేసే పనిలో భాగ స్వామ్యాన్ని, సమస్యలకు సరియైన పరిష్కారాలను కనుగొనడాన్ని ప్రోత్సహించేది.
 • నేర్చుకోడానికి దోహదపడే నైపుణ్యాలను పెంపొందించడానికి అవసరమైన ప్రత్యక్ష అనుభవాలకు అవకాశం కల్పించేది
 • ప్రణాళిక రూపొందించుకోవడానికి ప్రాధాన్యతనిచ్చేది. కానీ పిల్లల అవసరాలను బట్టి దీనిని మార్చుకోవడానికి అవకాశం కల్పించేది. పరోక్షంగా స్వయం నియంత్రణను తద్వారా ఆంతరంగిక క్రమశిక్షణను పెంపొందించేది.
ఏదికాదు
 • కేవలం బడిలో పాఠాల ఫలితాలనే ఆశించేది కాదు
 • టీచరును కేంద్రంగా చేసుకొనేది కాదు
 • చదవడం, రాయడం, లెక్కలు మాత్రమే నేర్పడానికి, పాఠ్య ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం కాదు
 • ప్రాథమిక తరగతుల క్రిందిస్థాయి కాదు
 • చెప్పిందల్లా విని బట్టిపట్టీ నేర్చుకునేది కాదు
 • పరీక్షా ఫలితాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేది కాదు
 • ఖచ్చితమైన కాలనిర్ణయ పట్టిక ప్రకారం మార్పు చేయలేని తరగతి సమయాలు ఉన్న నిర్ణీత కార్యక్రమం కాదు
 • విధేయతను ప్రకటించడాన్ని, తీవ్ర క్రమశిక్షణనే ఆశించే విధానం కాదు
కార్యక్రమ పరిచయం

సాధారణంగా కేంద్రానికి వచ్చే పిల్లల వయస్సు రెండున్నర సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు ఉంటుంది. వీరు అభివృద్ధి పరంగా కూడా వేరుగా ఉంటారు. కాబట్టి వారిచే చేయించవలసిన కార్యక్రమం కూడా వేరుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాని ప్రస్తుతం మనకి ఉన్న అవకాశం, వసతి దృష్టిలో ఉంచుకొని పిల్లల కీలక అవసరాలకు అనుగుణంగా మలచుకునే ఒక పది నెలల శిశు వికాస కార్యక్రమం రూపొందించబడింది. ఈ కార్యక్రమం పిల్లల అవసరాలకు అనుగుణంగా అవకాశాలు కల్పిస్తుంది.

కేంద్రంలోని పిల్లల అవసరాలు - లభించే అవకాశాలు

2 ఎళ్ళ వయసు పై నుండి 4 ఎళ్ళ వయసు పిల్లలకు
అ. సాంగత్యం - తోటి పిల్లలతో / పెద్దలతో
ఆ. సంఘీభావం - ఇంటి నుండి దూరంగా ఉండగలగడం, తోటివారితో కలవడం, పంచుకోవడం, కలిసి ఆడుకోవడం
ఇ. మంచి అలవాట్లు – శుభ్రత, మంచి ఆహారపు అలవాట్లు, క్రమ పద్ధతిని అలవరచుకోవడం
ఈ. అనుభూతిని పొందడం - ఆట, పాట, మాట, కథ, సృజనాత్మక కృత్యాలద్వారా అనుభూతులు పొందడం
ఉ. అభివృద్ధి ఆటంకాలు గుర్తించబడడం - అభివృద్ధి ఆటంకాలను ప్రారంభదశలోనే గుర్తించబడడం 4+ నుండి 5 సంవత్సరాల పిల్లలకు - పైన పేర్కొన్న లక్ష్యాలను దృఢపరచడం, నిర్దేశిత స్థాయిని అందుకోవడం - బడికి వెళ్ళడానికి సంసిద్ధతా స్థాయి, కావలసిన నైపుణ్యాలు పెంపొందించుకోవడం

కార్యక్రమ లక్ష్యాలు
 • కీలకమైన బాల్యారంభదశలో శిశువుల అభివృద్ధి అవసరాలకు అనుగుణంగా శిశు విద్యాకేంద్రాలు /అంగన్ వాడీ/ బాల్వాడీ కేంద్రాలలో ఈ కార్యక్రమాలను నిర్వహించి వారి పరిపూర్ణ వికాసానికి అవకాశాలు కల్పించడం
 • పాఠశాల ప్రవేశానికి అవసరమైన నైపుణ్యాలతో పిల్లలను సంసిద్ధ పరచడం
 • పిల్లలపై ఒత్తిడి లేకుండా ఆటపాటలతో ఆనందంగా విద్యా రంగంలో ప్రవేశించడానికి అవకాశం కల్పించడం
 • ఈ లక్ష్యాలను సాధించడానికి, నిర్వహించవలసిన కార్యక్రమం అమలు చెయ్యడానికి టీచర్లు చేయూత ఈ శిశు వికాస కార్యక్రమం.
 • పై లక్ష్యాలన్నీ దృష్టిలో ఉంచుకొని, శిశు విద్య నిపుణులు, శిశు విద్యా కేంద్రాలలో వివిధ హొదాలలో ఉన్న ఉద్యోగులు, విద్యావేత్తలు, స్వచ్ఛంద సంస్థల సహకార ప్రోత్సాహంతో పది నెలల సమగ్ర కార్యక్రమం రూపొందించబడింది. ఇది ఒక ప్రయోగంలా కాకుండా, వివిధ కేంద్రాలలో గత కొద్ది సంవత్సరాలుగా అమలులో ఉన్న కార్యక్రమాలకి అవసరమైన మార్పులు, చేర్పులుతో పిల్లల సమగ్ర అభివృద్ధికి దోహదపడేలా రూపొందించిన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సరైన పధ్ధతిలో నిర్వహించడానికి కార్యక్రమ దీపిక , నెలవారీగా చెయ్యాల్సిన పనుల క్యాలెండరు, రోజువారీ కార్యక్రమాల సత్ఫలితాల పెంపుకు ఉపయోగపడే సామాగ్రి (కృత్య నిధి) ని ఆంగన్ వాడీ కార్యకర్తలకు అందజేస్తున్నారు,

కార్యక్రమ విధానం ఒక్క పనిని ఒక్కసారి చేయించడం ద్వారా సూచించిన నైపుణ్యాలను పెంపొందించలేకపోవచ్చు. సూచించిన నైపుణ్యాలను పెంపొందించడానికి సంబంధిత కృత్యాలకు కొత్తదనం జోడించి పిల్లలతో మరల మరల చేయించవలసి ఉంటుంది. కేంద్రంలోని పిల్లలందరూ ఒకే విధంగా నైపుణ్యాలు సాధిస్తారని అనుకోకూడదు. కాని అవకాశాలు సమానంగా కలిగించాలి. పిల్లలపరంగా పిల్లల వయస్సు, సామర్థ్యాలను బట్టి స్థాయి రెండు విధాలుగా ఉంటుంది. మొదటిస్థాయి : కేంద్రంలో చేరిన 3, 4 సంవత్సరాల పిల్లలు సాధించగలిగే స్థాయి రెండవ స్థాయి : కేంద్రంలో ఉన్న 4, 5 సంవత్సరాల పిల్లలు సాధించగలిగే స్థాయి స్థాయి కనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించాలి. సంభాషణ : నెలకు 3 లేక 4 విషయాలపై సంభాషణకు సూచనలు ఇచ్చి వాటిని ఆధారంగా తీసుకుని వారంరోజులు ఒక విషయం పై సంభాషణా కృత్యాలు జరిపించాలి. ఆట : వీలును బట్టి వారానికి కనీసం ఒక కొత్త ఆటను పిల్లలతో ఆడించాలి. ఆడించిన ఆటలు కూడా తిరిగి ఆడిస్తూ ప్రతిరోజూ ఒక ఆట తప్పనిసరిగా ఆడించాలి. కథ : వారానికి ఒక కథను చెప్పాలి. మూడు కథలు ఇచ్చిన నెలలో నాలుగవ వారం అవసరమనుకున్న ఏ కథనైనా తిరిగి చెప్పవచ్చు. పాట : ఒక్కొక్క పాటను పిల్లలకు వచ్చే వరకు నేర్పిన తరువాత ఇంకొక కొత్తపాటను నేర్పించాలి. ప్రతిరోజు పిల్లలతో పాట / పాటలు పాడించాలి. నెలలో ఆరు సృజనాత్మకత కార్యక్రమాలు ఇవ్వబడ్డాయి. వారానికి కనీసం రెండు చొప్పున చేయించాలి. ఒకసారి చేయించి వదలివేయవద్దు. ఆసక్తి చూపించినంత వరకు చేయించాలి. చేయని పిల్లలను బలవంతపెట్టవద్దు. చేయడానికి ప్రోత్సహించాలి. సంసిద్ధతా కార్యక్రమాలు ప్రత్యేకంగా 9, 10 నెలల్లో ఇవ్వబడ్డాయి. వీటిని పెద్దపిల్లలతో చేయించాలి. ఇది చేయించేటప్పుడు సూచించిన వరుసక్రమం తప్పక పాటించాలి.

కార్యక్రమ సూచనలు
 • కేంద్రానికి హాజరయ్యే పిల్లల వయస్సు రెండున్నర సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల వరకు ఉంటుంది. మొదట్లో వారు పెద్ద పెద్ద గ్రూపులలో కలిసి పని చేయడానికి అలవాటు పడి ఉండరు. కాబట్టి కేంద్రలోని పిల్లలను, చేయించే కార్యక్రమాన్ని బట్టి చిన్న చిన్న గ్రూపులుగా చేసుకోవాలి.
 • కథలు, పాటలు, సంభాషణా కార్యక్రమాలు చేయిస్తున్నప్పుడు అందరు పిల్లలను ఒకే గ్రూపులో కూర్చోబెట్టి చేయించవచ్చు. ఇలా చేయిస్తున్నప్పుడు పెద్ద పిల్లలను చూసి చిన్న పిల్లలు అనుకరించడానికి అవకాశం కలుగుతుంది.
 • సృజనాత్మకత కార్యక్రమాలు, స్వేచ్ఛ ఆటల సమయాలలో పిల్లల స్థాయిని గుర్తించి గ్రూపులుగా చేయించాలి. ఒక్కొక్కసారి కృత్యాలను బట్టి పెద్ద పిల్లలను చిన్న పిల్లలను కలిపి గ్రూపులుగా చేయవలసి వస్తుంది.
 • పిల్లలకు ఆసక్తిని కలిగించే వస్తువులను సెంటరులో ఉంచాలి.
 • పిల్లలందరీకీ కృత్యాలను చేయడంలో అవకాశాలను కల్పించాలి.
 • పిల్లల స్థాయి కనుగుణంగా కృత్యాలను ఇచ్చి నేను సాధించాను అన్న భావన వారిలో ప్రతి ఒక్కరిలో కలిగేందుకు అవకాశాలు కల్పించాలి.
 • పిల్లలు చేసిన పనులను ప్రతిరోజూ సెంటరులో ప్రదర్శించాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసింది బాగుంది, బాగాలేదు అనేది కాదు. పాల్గొంటున్నారా లేదా అనేది చూడాలి. పిల్లలు కృత్యాలలో పాల్గొనందుకు వారి నందరీని ప్రోత్సహించి ప్రశంసించాలి. వారు చేసిన పనిని గూర్చి వారితో మాట్లాడాలి. ఆ పనిని పొగడాలి.
 • నెలకి ఒకసారి పిల్లలు చేసిన పనిని సెంటరులో ప్రదర్శించి తల్లిదండ్రులను, గ్రామ పెద్దలను ఆహ్వానించాలి.
 • సెంటరు లోపల, బయట, చుట్టు ప్రక్కల శుభ్రత పాటించాలి. దీనికై తగు చర్యలు తీసుకోవాలి
 • పిల్లలు ప్రతి అనుభవంలో నుంచి నేర్చుకుంటారు. ఇటువంటి అనుభవాలను ఇవ్వడంలో ప్రకృతి సందర్శనకు మించినది లేదు. అవకాశం ఉన్నప్పుడల్లా ప్రకృతి సందర్శనకు పిల్లలను తీసుకువెళ్ళి ,ఆ అనుభవాలను కార్యము/ కృత్య నిర్వహణలో వాడుకోవాలి.
 • ఈ కార్యక్రమం ప్రేరేపించే వాతావరణంలో పిల్లల అభివృద్ధికి తోడ్పడేది మాత్రమే, నిర్దిష్టమైన ప్రణాళిక గా రూపొందించినది కాదు. టీచర్ల కార్యక్రమ నిర్వహణలో స్వేచ్చగా పిల్లల అవసరాలు, అభిరుచుల కనుగుణంగా కృత్యాలను ఎంపిక చేసుకోవడానికి, మార్చుకోవడానికి పూర్తి అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని నమునాగా తీసుకొని కార్యకర్తలు పిల్లల అవసరాలను గుర్తిస్తూ తమదైన ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించుకోవచ్చు. ఈ ప్రయత్నంలోని ఏకైక లక్ష్యం పిల్లల అవసరాలు గుర్తించి వారి అభివృద్ధికి సహాయపడడం.

వస్తువులు / సామాగ్రి

సరఫరా చేసేవి

బ్లాకులు, పూసలు, కథలు కార్డులు, సంభాషణా చిత్రపటాలు, రంగుల ఆకారాల నమునాలు, గుచ్చడానికి ఉపయోగించే బోర్డు, క్యాసెట్లు సంసిద్ధతా సంబంధిత చిత్రపటాలు.

సమకూర్చుకోవలసినవి

బంతులు, తాడు, అద్దం, కతైర, చిన్న చిన్న చేటలు (ప్లాస్టిక్) , బక్కెట్లు, బొమ్మలు, బొమ్మరింటికి పనికివచ్చే మనుషుల పప్పెట్లు, టైరులు మొదలగునవి.

తయారు చేసుకోవలసినవి - వనరుల నిధి

శిశు వికాస కార్యక్రమ నిర్వహణకు వివిధ విషయాలకు సంబంధించిన వస్తు సామాగ్రిని ముందుగా వనరుల నిధిగా సమకూర్చుకోవాలి. వనరుల నిధి (నిత్యం వాడి పారేసే వస్తువులు, పరికరాలలో తేలికగా దొరికేవి) ఉదా : టీ, పౌడర్ డబ్బాలు, టూత్ పేస్టు డబ్బాలు, మూతలు, ఖాళీ అగ్గిపెట్టెలు, చెక్కముక్కలు, చిన్న చిన్న రంగు రంగుల బట్ట ముక్కలు, రకారకాల గింజలు పెద్దవి, బెండు ముక్కలు, పాత వార్తాపత్రికలు, బొమ్మల పుస్తకాలు (పిల్లలకు ఉపయోగపడేవి మాత్రమే), వీటిని సేకరించి జాగ్రత్తగా ఒక పెట్టెలోగానీ, సంచిలోగాని భద్రపరచాలి. వనరుల నిధి గురించి పాఠశాల విద్యాకమిటీ సభ్యులకు, తల్లి దండ్రులకు వివరించి తగిన వస్తువులను సమకూర్చుకోవడానికి వారి సహాయం కోరవచ్చు.

వస్తువులను ఎలా ఉపయోగించాలి ?

 • ఏ వస్తువు / సామాగ్రి అయినా ఏదో ఒక్క అంశం నిర్వహించడానికి మాత్రమే పరిమితం కాదు.
 • ఒకే వస్తువును అనేక విధాల వేరువేరు అంశాలను పరిచయం చేయడానికి ఉపయోగించవచ్చు.
 • పిల్లలు స్వేచ్ఛగా ఆడుకోవడానికి ఇచ్చే వస్తువులను వారికి అందుబాటులో ఉంచాలి.
 • చిరిగిన, విరిగిన వస్తువులను పిల్లలకు ఇవ్వకూడదు. బాగు చేసిన తరువాతే తిరిగి ఇవ్వాలి
 • వస్తువులను ఉపయోగించిన తరువాత వాటి స్థానంలో పదిలపరచే అలవాటు పిల్లల్లో పెంపొందించాలి.

మట్టిపని

కుండలు తయారు చెయ్యడానికి వాడే మట్టిని తీసుకుని జల్లించి పెట్టుకోవాలి. ఒక సంచిలోగాని / డబ్బాలోగాని వేసి పెట్టుకోవాలి. అవసరమున్నప్పుడు నీటితో తడిపి పిల్లలకు ఇవ్వాలి. తడిపిన మట్టి మిగిలితే ప్లాస్టిక్ సంచీలో వేసి జాగ్రత్త పరచి మరుసటిరోజు ఉపయోగించవచ్చు. తయారయిన బొమ్మలను ఆరబెట్టి / కొలిమిలో కాల్చి సెంటరులో ప్రదర్శించాలి.

కత్తిరించడం / అతికించడం

పాత వార్తాపత్రికలు / వారపత్రికలు సేకరించి పెట్టుకోవాలి. కాగితాలను చింపించిన తరువాత వాటిని తిరిగి ఉపయోగించే వరకు ఒక అట్టడబ్బాలో భద్రపరచాలి. పెద్దవాళ్ళని అడగకుండా పిల్లలు వారికి అందిన కాగితాలను చింపకూడదని మొట్టమొదటగా టీచరు తెలియజేయాలి. ప్రాంతీయంగా దొరికే జిగురు ( తుమ్మ జిగురు మొదలగునవి) సమకూర్చుకోవాలి.

రంగులు

సరఫరా చేసిన రంగులే కాకుండా ప్రాంతీయంగా దొరికే ఆకులు / పూలు / కాయలు (హాని చేయనివి ) తీసుకుని వాటిని నలిపి కొన్ని చుక్కల నీళ్ళు వేసి రంగులు తయారు చేసుకోవచ్చు.

బొమ్మలు చేయడం

వార్తాపత్రికలు, పేపరు బ్యాగులు, పాత (ఉతికిన) మేజోళ్ళు , స్పాంజిముక్కలు, పురికొన మొదలగునవి ఉపయోగించి బొ్మ్మలు చెయ్యాలి.

వస్తువుల్ని ఎలా జాగ్రత్త పరచుకోవాలి / వాడాలి

 • ప్రతిరోజు కేంద్రంలోని వస్తువులన్నింటిని ఆయా సహాయంతో శుభ్రపరచుకోవాలి
 • చిరిగిన, విరిగిన వస్తువుల్ని వెంటనే సరిచూసుకోవాలి
 • వస్తువుల్ని పిల్లలకు అందుబాటులో ఉంచాలి. వస్తువుల్ని ఎలా వాడాలో, ఎలా భద్రపరచాలో పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పాలి.
 • పిల్లలకు హాని కలిగించే (కోసుకునేవి, గుచ్చుకునేవి) వస్తువుల్ని సెంటరులో ఉంచకూడదు. ఎప్పటికప్పుడు కొత్త వస్తువుల్ని తయారుచేసుకోవాలి / సమకూర్చుకోవాలి.
 • పిల్లలు చేసిన పనిని భద్రపరచి సెంటరులో ప్రదర్శించి, తల్లి దండ్రులను, గ్రామ పెద్దలను ఆహ్వానించాలి.
కార్యక్రమ నిర్వహణలో టీచరు పాత్ర
 • పిల్లలకంటే ముందుగా సెంటర్ కి వచ్చి పిల్లల్ని ఆహ్వానించాలి.
 • పిల్లల్ని ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించాలి.
 • ప్రతి ఒక్కరిని పేరుతోనే పలకరించాలి.
 • ఈ వయసు పిల్లలు పెద్దవాళ్ళతో సన్నిహిత సంబంధాన్ని కోరుకుంటారు. కాబట్టి టీచరు పిల్లల చేయి పట్టుకోవడం, భుజం తట్టడం వంటివి చేయాలి.
 • ప్రతి ఒక్కరిలోని సామర్థ్యాలను గుర్తించి పొగడాలి
 • అందరికీ కార్యక్రమాలలో పాల్గొనడానికి సమానంగా అవకాశాలు కల్పించాలి
 • నేను సాధించగలను అనే భావన పిల్లల్లో పెంపొందించడానికి తగిన అవకాశాలు కల్పించాలి
 • పిల్లల్ని కొట్టవద్దు / తిట్టవద్దు / హేళన చేయవద్దు.
 • పిల్లల్ని ఒకరితో ఇంకొకరిని పోల్చవద్దు, కించపరచవద్దు

శారీరకాభివృద్ధికి

 • ఆటలకు అవసరమయ్యే అన్ని వస్తువులు సరైన స్థితిలో ఉండేలా ముందే జాగ్రత్త పడాలి.
 • పిల్లలు లోపల / బయట ఆడుకునేటప్పుడు వారికి దెబ్బలు తగలకుండా పరిసరాలను ఉంచాలి
 • కొన్ని ఆటలు పెద్ద పిల్లలు మాత్రమే ఆడాలి. ఆయా ఆ సమయంలో చిన్న పిల్లలతో స్వేచ్ఛ ఆటలు ఆడించాలి.
 • చిన్న పిల్లల్ని / పెద్ద పిల్లల్ని కలిపి ఆడించినప్పుడు కూడా పిల్లల స్థాయి / సామర్థ్యాల కనుగుణంగానే ఆడించాలి.
 • ఇంటి లోపల ఆడే ఆటలు / బయట ఆటలు సమానంగా ఆడించాలి.
 • పిల్లల పొడవు, బరువు ఎప్పటికప్పుడు కొలుస్తూ ఉండాలి. నమోదు చేయాలి. ఎత్తు, బరువులలో పెరుగుదల లేనట్లు గుర్తించినట్లయితే వెంటనే ఆరోగ్య కార్యకర్తను సంప్రదించాలి.
 • పిల్లలు స్వేచ్ఛగా ఆడుకునేటప్పుడు, మధ్యలో జోక్యం చేసుకోవద్దు. దీని ద్వారా వారిని నిర్దిష్టపరచినట్లవుతుంది.
 • ఆటల్లో పాల్గొనని పిల్లలను బలవంతపెట్టవద్దు మిగతా పిల్లలు ఆడుకునేటప్పుడు, వీరిని గమనించమనాలి. అలాగే ప్రతీసారీ వీరిని కూడా ఆడుకోవడానికి ఆహ్వానించాలి. ఇలా చేస్తే కొంత కాలానికి వారంతట వారే ఆటల్లో పాల్గొనడానికి ఉత్సాహం కనుబరుస్తారు.
 • విరిగిపోయిన, పాడైపోయిన వస్తువుల్ని పిల్లలకు ఇవ్వకూడదు

సృజనాత్మకత పెంపొందించడానికి

 • స్వేచ్ఛగా ఆడుకోవడానికి అవకాశాలు కల్పించాలి.
 • తయారు చేసిన బొమ్మలు చూపించి / వాటిని చేయమని అనవద్దు. దీని వలన పిల్లల్లో సృజనాత్మకత దెబ్బతింటుంది
 • పిల్లలు చేసిన సృజనాత్మక పనులను ప్రశంసించండి. అది ఎలా ఉందీ అన్నది ముఖ్యం కాదు. ఎలా చేసినా ఆ పనిని గుర్తించి పొగడాలి
 • ఈ కార్యక్రమాలు ఎప్పుడు చిన్న చిన్న బృందాలలోనే నిర్వహించాలి.
 • కార్యక్రమాలు నిర్వహించడానికి కావలసిన వస్తువులను పిల్లలకి అందుబాటులో ఉంచాలి.
 • పరిసరాలలో దొరికే వివిధ వస్తువులను ఈ కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలి.

గ్రహణశక్తి వికాసానికి

 • వస్తువులతో పిల్లల్ని స్వేచ్ఛగా ఆడుకోనివ్వాలి.
 • సృజనాత్మకంగా ఆలోచించడానికి, సమస్యలు పరిష్కరించడానికి పిల్లలకు తగినన్ని అవకాశాలు కల్పించాలి.
 • ఆలోచించడానికి పిల్లలకు సమయం ఇవ్వాలి.
 • పిల్లల్లో నేర్చుకొనే నైపుణ్యం పెంపొందించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
 • అక్షరాలు, అంకెలు నేర్చుకోవడానికి తగిన సంసిద్ధత, కావలసిన నైపుణ్యాలు పిల్లల్లో పెంపొందించాలి. కానీ అక్షరాలు, అంకెలు మాత్రమే నేర్పకూడదు.

భాషాభివృద్ధికి

 • పిల్లలు వారి భావాలను వ్యక్తీకరించడానికి అవకాశాలు కల్పించాలి.
 • పనులు చేసేటప్పుడు పిల్లలతో ఎక్కువగా మాట్లాడాలి. భాషను ఎంత ఎక్కువగా వింటే పిల్లలు అంతగా నేర్చుకుంటారు.
 • పూర్తి వాక్యాలలో మాట్లాడడానికి పిల్లల్ని ప్రోత్సహించాలి.
 • మాట్లాడని పిల్లల్ని అలాగే వదలేయకూడదు. ప్రేమ, వ్యక్తిగత శ్రద్ధ, ప్రశంస కనపరచడం ద్వారా వాళ్ళను ప్రోత్సహించాలి.
 • పిల్లలు చెప్పేది ఓపిగ్గా వినాలి. వారి ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి.
 • పిల్లలు కలిసిమెలసి బృందాలలో ఆడుకోవడానికి, కృత్యాలలో పాల్గొనడానికి తగినన్ని అవకాశాలు కల్పించాలి.
 • చిత్రపటాలు చూపించి, వాటి గురించి మాట్లాడడానికి అవకాశాలు కల్పించాలి.
 • చిన్నచిన్న ప్రశ్నల ద్వారా చూసింది చెప్పడానికి, ఊహించి చెప్పడానికి, కారణాలు చెప్పడానికి అవకాశాలు కల్పించాలి.
 • మర్యాదగా, మెల్లగా, సరళమైన భాషను ఉపయోగిస్తూ పిల్లలతో మాట్లాడాలి.
 • పిల్లలు ఏమైనా తప్పు మాట్లాడితే వాళ్ళని ఎగతాళి చేయవద్దు. వెంటనే సరిచేయవద్దు. అలా చేస్తే పిల్లలు తమ భావాలను వ్యక్తీకరించడానికి భయపడతారు. నెమ్మది మీద సరియైన మాట చెప్పి తప్పును సరిదిద్దాలి.
కార్యక్రమ నిర్వహణకు ఆధారాలు

శిశు వికాస కార్యక్రమం ఖచ్చితంగా పిల్లలను ఆకర్షించేదిగా వారి అభివృద్ధి అవసరాలను తీర్చేదిగానూ ఉండాలి. పిల్లలను కేంద్రంగా చేసుకుని ఈ కార్యక్రమం వారి వ్యక్తిగత అవసరాలు, అభిరుచులు, శక్తిసామర్థ్యాలకు అనుగుణంగా ఉండాలి. అందుకే ఈ దశ కార్యక్రమం ఆటపాటలతో, కథలు కబుర్లతో, వివిధ రకాలైన కృత్యాలతో నిర్వహించాలి.

ప్రస్తుత కార్యక్రమం మాట, ఆట, కథ, సృజనాత్మకత, సంసిద్ధత అనే ఆరు బాటలపై నడుస్తుంది. ఈ ఆరు బాటలు కలిసి పిల్లలు ఇంటి నుంచి బడికి చేరుకోవడానికి వారధిలా ఉపయోగపడతాయి. రోజువారీ కార్యక్రమం ఏ బాటతోనైనా ప్రారంభించవచ్చు. ఆబాట మీద పిల్లలను వారికి అనువైన గతిలో నడవనీయండి. కాని అన్ని బాటల మీదగా నడిచిన తరువాత అంటే ఆ నెలకు సంబంధించిన అన్ని కృత్యాలు చేసిన తరువాత వారు చేరవలసిన స్థాయివైపు నడిపించడం టీచరు బాధ్యత. ఈ ఆరు అంశాల వివరణ పొందుపరచడం జరిగింది. ఏ మార్గం ఏ రకంగా ఉపయోగపడుతుందో వివరించబడింది. పది నెలల కార్యక్రమాన్నిఈ ఆరు మార్గాలు / పద్ధతుల ద్వారా నిర్వహించడానికి సుమారు 300 కృత్యాలు ఉన్నాయి. ఈ పది నెలల కార్యక్రమం పిల్లల అభివృద్ధికి మెట్టుమెట్టుగా ఉపయోగపడుతుంది. ఇవ్వబడిన సూచనలను / గమనికలను జాగ్రత్తగా చదువుకుని కృత్యాలను నిర్వహించాలి.

కేంద్రంలో ఆడపిల్లలకు, మగపిల్లలకు ఒకే రకమైన కృత్యాలు ఇవ్వాలి. అంతేగాని, మగపిల్లలు బొమ్మలతో ఆడకూడదు, ఆడపిల్లలు గెంతకూడదు లాంటి లింగ వివక్ష చూపకూడదు.

సంభాషణ

 • టీచరు పిల్లలందరినీ గుండ్రంగా కూర్చోబెట్టాలి.
 • టీచరు పిల్లలతో ప్రేమపూర్వకంగా , చనువుగా మాట్లాడాలి.
 • తెలిసిన విషయాల గురించి, వస్తువుల గురించి ప్రారంభించి చెప్పాలనుకున్న విషయాన్ని పరిచయం చేయాలి.
 • ఏ విషయం గురించి సంభాషణ జరపాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకోవాలి.
 • మొదటిరోజు ఆ విషయానికి సంబంధించిన కొత్త పదాలను పరిచయం చేస్తూ సంభాషణ జరపాలి.
 • రెండవరోజు చిత్రపటాలు, ఫ్లాష్ కార్డులు, పరిసరాలలోని వస్తువులు ఉపయోగిస్తూ సంభాషణ చేయాలి.
 • మూడవరోజు విషయానికి తగినట్లుగా పెద్దపిల్లలతో అభినయం చేయించాలి.
 • చిన్న పిల్లలను చూడమనాలి.
 • మిగతా పిల్లలను ఆ విషయం పై మాట్లాడించాలి.
 • నాలుగవరోజు విషయానికి సంబంధించిన కొత్త పదాలను ఉపయోగిస్తూ మాట్లాడేటట్లు పిల్లలను ప్రోత్సహించాలి.
 • ఐదు, ఆరవ రోజులు ఆలోచనలకు సంబంధించిన ప్రశ్నల ద్వారా పిల్లలను ఆలోచింపజేసి సమాధానాలు చెప్పించాలి.
 • దీనికై చిత్రపటాలు / పరిసరాలలోని వస్తువులు ఉపయోగించుకోవచ్చు
 • సూచించిన స్థాయిలను అనుసరించి పిల్లలతో సంభాషణ జరపాలి.
 • సంభాషణలో ప్రతి ఒక్కరు పాల్గొనేటట్లు టీచరు ప్రోత్సహించాలి.

ఆటలు / స్వేచ్ఛ ఆటలు

 • నిర్దేశించిన సమయానికి వచ్చిన పిల్లలతో ఆటలు ప్రారంభం చేయాలి.
 • ఆటలో ఆడుకోవడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి కాని, ఓడిపోవడం, గెలవడం అనేది ఉండకూడదు.
 • ఆటలకు కావలసిన సామాగ్రిని అందుబాటులో ఉంచాలి.
 • ఎవరైనా పిల్లలు ఆడుకోవడానికి ముందుకు రాకపోతే బలవంతపెట్టొద్దు. కాని వేరే పిల్లల ఆటను చూస్తూ ఉండమని చెప్పాలి. ఇలా చేస్తే వాళ్ళంతటా వాళ్ళే వేరే పిల్లలతో ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది.
 • స్వేచ్ఛగా ఆడుకోవడానికి వీలు కల్పించాలి.
 • సెంటర్ ఆవరణలో / తరగతి గదిలో పిల్లలు స్వేచ్ఛగా ఆడుకొనేందుకు వీలుగా టీచరు సిద్ధం చేసుకోవాలి.
 • సెంటర్ ఆవరణలో పిల్లల భద్రతకు భంగం కలిగించే వస్తువులు ఉంచరాదు.
 • సెంటర్ ఆవరణలో ముళ్ళపొదలు / రాళ్ళు మొదలగు వాటిని తీసియేయాలి.
 • సెంటర్ ఆవరణ దాటి పిల్లలు బయటకి వెళ్ళకుండా చక్కగా దడి కట్టాలి.
 • గదిలో పిల్లలు స్వేచ్ఛగా ఆడుకొనేందుకు వీలుగా వస్తువులు / బొమ్మలు అందుబాటులో ఉంచాలి.
 • పిల్లలను వారికిష్టమైన ఆటలు, (బయట ఆటలు / లోపలి ఆటలు) స్వేచ్ఛగా ఆడుకొనేందుకు టీచరు ప్రోత్సహించాలి.
 • వారంతట వారే వారికి కావలసిన బొమ్మలు / ఆట వస్తువులు తీసుకుని, ఆడుకున్న తరువాత తిరిగి వాటి స్థానంలో పెట్టేటట్లు టీచరు చూడాలి.
 • స్వేచ్ఛగా పిల్లలు ఆడుకునేటప్పుడు టీచరు / ఆయా అందరినీ గమనిస్తూ ఉండాలి.
 • ఎవరైనా సహాయం అడిగితే వారికే చెయ్యాలి.
 • పిల్లలు వాళ్ళంతట వాళ్ళే ఆడుకుంటున్నప్పుడు టీచరు మధ్యలో వెళ్ళకూడదు.
 • పిల్లలు ఒక్కరుగాని లేదా కొంతమంది కలిసిగాని స్వేచ్ఛగా ఆటలు ఆడుకోవచ్చు.

పాటలు

 • పాటలు పాడించేటప్పుడు పిల్లలను గుండ్రంగా నుంచోబెట్టాలి.
 • టీచరు కూడా వారితో పాటు గుండ్రంలో నుంచోవాలి.
 • పాటను టీచరు అభినయం చేస్తూ పాడాలి.
 • పాటలోని పదాలు పిల్లల వయస్సు, అర్థం చేసుకొనే శక్తి , వారి కిష్టమైన విషయాలకు సంబంధించినవై ఉండాలి.
 • టీచరు, పిల్లలు స్వంతంగా పాటలు పాడడానికి , కలిసి పాడడానికి, అభినయం చేయడానికి పాత్రలకు తగ్గట్టుగా నటించడానికి తోడ్పడాలి.
 • వారంలో చివరి రెండురోజులు పిల్లలందరూ కలిసి, ఒక్కొక్కరు పాడడానికి టీచరు సహాయపడాలి.
 • మొదట్లో పిల్లల్ని తప్పనిసరిగా పాడాలని బలవంతపెట్టవద్దు వింటేచాలు.

కథలు

 • కథలు చెప్పేటప్పుడు పిల్లలందరిని తనకు కనపడేటట్టు గుండ్రంగా కూర్చోబెట్టాలి.
 • టీచరు కూడా వారితో కలిసి కూర్చోవాలి.
 • కథలోని విషయాలు, పిల్లల వయస్సు, అనుభవాలకు, పరిసరాలకు సంబంధించినవై ఉండాలి.
 • కథలు హింసాత్మకంగా, పిల్లలు భయపడేటట్లుగా ఉండకూడదు.
 • కథలోని పాత్రానుసారంగా టీచరు స్వరాన్ని మార్చాలి. హావభావాలు ప్రదర్శించాలి. ఉదాహరణ కథలోని పాత్రల భావాలు వ్యక్తపరచేటప్పుడు ఆవు, సింహం మొదలైన శబ్దాలలో మార్పు ఉండాలి.
 • కథలోని పదాలు సరళమైనవిగా ఉండాలి. లేకపోతే పిల్లలలో అసహనం పెరిగి కథ వినటానికి ఆసక్తి పోగొట్టుకుంటారు.
 • అవసరమైన చోట కొత్త పదాలు వాడడం వలన పిల్లలకు పదజాలం పెరిగి కొంత భాష వస్తుంది.
 • ఒకే కథను వారం రోజుల పాటు వివిధ పద్ధతులలో చెప్పాలి. o టీచరు కథను మొదటి రోజు ఆసక్తిదాయకంగా హావభావాలతో చెప్పాలి. o కథ చెప్పేటప్పుడు ఆలోచింపజేసే చిన్నచిన్న ప్రశ్నలు వేయాలి o రెండవ రోజు కథాంశాన్ని సూచించే చిత్రపటాలు కానీ, కథా పాత్రల యొక్క చిత్రపటాలు కానీ, పపెట్లు/ తోలుబొమ్మలు కానీ ఉపయోగించి కథ రసవత్తరంగా చెప్పాలి. o మూడవ రోజు కథలోని పాత్రల వలే అభినయం చేయించాలి. పాత్రల గురించి మాట్లాడింపజేయాలి. o నాలుగవరోజు కథను నాటకీ కరణ చేయాలి. o అయిదవ రోజు టీచరు పిల్లలకు కథకు సంబంధించిన ఫ్లాష్ కార్డులను, చిత్రపటాలను ఇచ్చి కథను చెప్పిస్తూ వాటిని కథ ప్రకారం వరుసక్రమంలో పెట్టించాలి. o ఆరవరోజు పిల్లలచే కథను చిన్నచిన్న ప్రశ్నలు వేస్తూ పెద్ద పిల్లలచే, చిన్న పిల్లలకు చెప్పించాలి. (సొంత పదాలలో చెప్పటానికి ప్రోత్సహించాలి).
 • ప్రత్యేకించి కథలో వారికి ఇష్టమైన పాత్రల గురించి మాట్లాడాలి.
 • కథకు సంబంధించిన పాత్రల యొక్క ముఖం తొడుగులు (మాస్క్ లు) అభినయం చేయించేటప్పుడు ఉపయోగించాలి.
 • బొమ్మల పుస్తకాలు ఉపయోగించి కూడా కథలు చెప్పాలి.

సృజనాత్మకత

 • సృజనాత్మకత ప్రోత్సహించడానికి పిల్లలపై టీచర్ల అభిప్రాయమం రుద్దవద్దు. ఇచ్చిన సామాగ్రిని వారికి నచ్చిన విధంగా వాడనివ్వాలి. అవసరమైతే సూచనలను ఇవ్వవచ్చు.
 • సృజనాత్మకత కార్యక్రమాలను చేయించేప్పుడు ఇలా చేయాలి అని నిర్ధేశించవద్దు.
 • వారు చేసిన పనిని ప్రశంసించాలి. కాని విమర్శించకూడదు.
 • మట్టితో బొమ్మలు చేయడం, ఇల్లు ఆట, పూలు గుచ్చడం మొదలైన పనులు పిల్లలు తమంతట తాము చేయగలగడానికి అవకాశం ఇవ్వాలి.
 • ఈ పనులు చేయించేటప్పుడు పిల్లల్ని చిన్నచిన్న జట్లుగా చేయాలి. ప్రతి జట్టులో ఐదు లేక ఆరుగురు ఉండాలి.
 • ఈ కృత్యాలు చిన్న పిల్లలు చేసేటప్పుడు టీచరు పెద్ద పిల్లల కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించవచ్చు.
 • ఈ పనులు చేయించడానికి కావలసిన వస్తువులను టీచరు ముందే సమకూర్చుకోవాలి.
 • పిల్లలు ఈ పనులు చేసేటప్పుడు వాళ్ళ స్వంత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలి.
 • పిల్లలు వారంలో ఐదు రోజుల పాటు చేసిన పనులపై (తయారు చేసిన బొమ్మల పై) ఆరవరోజు వారితో మాట్లాడించాలి.

సంసిద్ధత

 • సంసిద్ధతా కార్యక్రమాలు మొదటి నెల నుంచి అన్ని కార్యక్రమాలలో ఇమిడి ఉన్నాయి.
 • ముఖ్యంగా ఇవి పూర్వపఠన, పూర్వలేఖన, పూర్వగణిత నైపుణ్యాలను పెంపొందించేవిగా సూచించబడ్డాయి.
 • ఇవి ముందు ముందు బడిలోని కార్యక్రమాలకు బలమైన పునాది వేస్తాయి. అందుకోసం బడిలో చేరే పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతిరోజు ఒక గంట వారితో ఈ కార్యక్రమాలు నిర్వహించవలసిన అవసరం ఎంతో ఉంది.
 • బడిలో చేరే పిల్లలతో వీటిని నిర్వహించేటప్పుడు మిగిలిన పిల్లలను ఆయా సహాయంతో స్వేచ్ఛ ఆటలు ఆడించాలి.
 • పిల్లలతో కృత్యాలు చేయించిన తరువాత వారు ఏ స్థాయిలో ఉన్నారో గమనించి అవసరమైన సహకారం, ఎప్పటికప్పుడు టీచరు అందిచాల్సి ఉంటుంది.
 • పిల్లలు అందుకున్న స్థాయిననుసరించి వారికి నిర్వహించవలసిన కృత్యాలు తిరిగి తయారుచేసుకోవాల్సి ఉంటుంది.
 • పిల్లలు కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో గమనించి వారి పేర్లు స్థాయిని సూచించే గుర్తు వరుసలో ఇలా రాయాలి. ఇలా ప్రతి ఒక్కరి స్థాయిని గుర్తించాలి.
 • ప్రతి నెలకు ఒకసారి పిల్లల స్థాయిలను గుర్తించి నమోదు చేయాలి.
 • ఏ ఒక్కరైనా మూడు నెలల వరకు ఒకే స్థాయిలో ఉండడం జరిగితే వారికై తగిన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
 • అవసరమైతే ఆరోగ్యకేంద్రాన్ని సంప్రదించాలి.

సాధారణంగా పిల్లలు ఒక పనిని / కృత్యాన్ని చేయమన్నట్లు వెంటనే చేయగలగవచ్చు. దీనిని ఆధారంగా తీసుకుని పిల్లలు పై స్థాయికి చేరారని అనుకుని పైకి లాగకూడదు. అదే స్థాయిలో ఒక కృత్యాన్ని మరికొన్ని కృత్యాలతో స్ప్రింగ్ లాగా కలిపి వారి సామర్థ్యాన్ని , నైపుణ్యాలను బలపరచాలి. లేకపోతే వెయ్యవలసిన పునాది బలహీనంగా ఉంటుంది.

పిల్లలు కృత్యాలు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిని గమనించాలి. ఈ విధమైన పరిశీలన ప్రతి ఒక్కరి స్థాయిని గుర్తించడానికి తగిన సహకారం అందించడానికి ఉపకరిస్తుంది. అభివృద్ధికి సంబంధించిన అంశాలు అంటే సంఘజీవనం, ఉద్వేగాలు, శారీరక, భాషాభివృద్ధి, గ్రహణశక్తి మొదలగు వాటినన్నింటిని పరిశీలించాలి. ఇదే నిరంతర పరిశీలన . ఈ నిరంతర పరిశీలన ద్వారా ప్రత్యేక అవసరాలున్న పిల్లల్ని గుర్తించవచ్చు.

నిరంతర పరిశీలనతో పాటు నెలకొకసారి పిల్లల స్థాయి నిర్ణయించి తగిన చర్య తీసుకోవాలి. బాల్యారంభ (బాల్యం లో మెదటిసారిగా ఆరంభించే) విద్య లక్ష్యాన్ని, ప్రయోజనాలని పరిశీలించిన మీదట రూపొందించిన కార్యక్రమంలో , నిత్యజీవితంలో భాగాలైన ఎన్నో అంశాలని జోడించడం జరిగింది. సంభాషణావకాశాలు పిల్లల నిత్య కృత్యాలు – అంటే తీసుకునే ఆహారం , మంచి అలవాట్లు, ఆడుకునే ఆటలు మొదలైనవి పరస్పర సంభాషణా, చిన్నచిన్న కథలుగా రూపొందించడం జరిగింది. ఆలాగే ఇంటి గురించి, ఇచ్చిన వస్తువుల గురించి, గుచ్చటం, బొమ్మలు చెయ్యటం లాంటి పనులు గురించి వివరణ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మాటల్లో,పాటల్లో, కథల్లో, ఆటల్లో, అలవాట్లలో అన్ని రకాలుగా వారి మానసిక సమగ్ర వికాసం జరిగేలా చేపట్టిన కార్యక్రమమే బాల్యారంభ విద్య.

నిత్య నూతనంగా అభివృద్ధి చెందుతున్న ఈ కార్యక్రమం ఎన్నో సత్ఫలితాలని ఇస్తోంది. ఎందరో పిల్లలకి మంచి పునాదిగా సహాయపడుతోంది.

శిశు వికాస కేంద్రాలలో నిత్యం పాటించవలసిన విషయాలు
 • ప్రతి శిశువుకు ఒక విశిష్టమైన వ్యక్తిత్వం ఉంటుంది. కాబట్టి ఒకరిని ఇంకొకరితో పోల్చకూడదు.
 • ప్రతి ఒక్కరినీ తమకు అనువైన రీతిలో అభివృద్ధి చెందడానికి ప్రోత్సహించాలి.
 • పిల్లలను వారి-వారి శక్తికి మించి సాధించమని ఒత్తిడి చెయ్యకూడదు.
 • బాల్యారంభ దశ విద్యాకేంద్రం ముఖ్యంగా పిల్లలకి భద్రతనిస్తూ, వారిలోఆసక్తి, ఇష్టత పెంచుతూ, అవసరాలను తీర్చగలగాలి.
 • పిల్లలు బాల్యారంభ దశ విద్యాకేంద్రానికి వచ్చేటప్పుడు వాళ్ళ జీవితంలో మొట్టమొదటసారిగా భద్రతాయుతమైన ఇంటిని వదిలి కొత్త పరిసరాల్లోకి అడుగు పెడతారు. ఇటువంటి కొత్త వాతావరణానికి అలవాటు పడితే పరిస్థితులను బాల్యారంభ దశ విద్యాకేంద్రం కల్పించాలి.
కేంద్రంలో నిర్వహించాల్సిన ప్రత్యేక కార్యక్రమాలు

పుట్టిన రోజు

 • కేంద్రంలోని ప్రతి ఒక్కరి పుట్టిన రోజు చేయాలి.
 • ప్రతి నెలలో పిల్లల పుట్టిన రోజులు సూచించే ఒక పట్టిక తయారుచేసి కేంద్రంలోని గోడ మీద తగిలించాలి.
 • నెలలో ఒక రోజు కేటాయించి, ఆనెలలో పుట్టిన రోజు ఉన్న పిల్లలందరినీ ప్రత్యేకంగా కూర్చోబెట్టాలి.
 • వారందరికి మిగతా పిల్లలచేత శుభాకాంక్షలు చెప్పించి చప్పట్లు కొట్టించాలి.
 • పుట్టిన రోజు పిల్లలందరికి ఏదైనా ఒక బహుమతి ఇవ్వాలి. (ఉదా : కాగితంతో / మట్టితో / పనికిరాని వస్తువుతో తయారు చేసిన బొమ్మ అయినా చాలు.) ప్రాంతీయంగా జరుపుకునే పండుగలు, జాతీయ పండుగలు అన్నీ కేంద్రంలో జరుపుకోవాలి.

పాఠశాల సంసిద్ధత

విద్యాపరమైన సంసిద్ధత

విద్యాపరమైన సంసిద్ధతని రెండు భాగాలుగా విభజించవచ్చు. 1) భాషా వికాసం, 2) గ్రహణశక్తి వికాసం.

1) భాషా వికాసం,

పిల్లలు భాషని చక్కగా నేర్చుకోవడానికి వారిలో భాషా నైపుణ్యాలు పెంపొందించాలి. రాయడం, చదవడం నేర్చుకొనే ముందు, పిల్లల భావాలు ఎదుటివారికి అర్థమయ్యలా చెప్పగలగాలి. ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోగలగాలి. దీనికై వారికి వినడంలో, మాట్లాడటంలో కూడా నైపుణ్యాన్ని ఏర్పరచాలి. అయితే ఆర్థికంగా వెనుక బడిన వర్గాల పిల్లలకు, పిల్లలతో కలిసి గడపడానికి తీరికలేని తల్లిదండ్రులున్న పిల్లలకు ఇటువంటి అనుభవాలు, అవకాశాలు తక్కువగా దొరుకుతాయి. అర్థవంతమైన పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమం ద్వారా ఈ లోటుని చాలా వరకు పూరించవచ్చు.

భాషా వికాసం - ముఖ్యాంశాలు

శ్రవణ నైపుణ్యాభివృద్ధి :

 • శబ్ద భేదాలను గుర్తించడం
 • విన్నది అర్థం చేసుకోగలగడం.

మాటల ద్వారా వ్యక్తీకరణాభివృద్ధి :

 • సంభాషణ
 • కథలు చెప్పడం నటన,
 • తోలుబొమ్మలాట
 • సృజనాత్మకతమైన వ్యక్తీకరణ – నాటకాలు.

చదవడానికి సంసిద్దతాభివృద్ధి :

 • శ్రవణ / శబ్దభేదాల గుర్తింపు
 • దృశ్యాభేదాలను గుర్తించడం
 • శబ్దదృశ్య సంబంధం గుర్తించడం
 • ఎడమవైపు నుంచి కుడివైపుకు పురోగమించడం.

లేఖానా సంసిద్దతాభివృద్ధి :

 • సూక్ష్మ కండరాల అభివృద్ధి
 • నేత్రహస్త సమన్వయం
 • పూర్వలేఖానా నైపుణ్యాభివృద్ధి.

శ్రవణ నైపుణ్యాభివృద్ధి - కృత్యాలు

 • పిల్లలను బయటకి తీసుకెళ్ళి వివిధ శబ్దాలను వినమనాలి
 • పరిసరాల్లోని జంతవుల, పక్షుల, కీటకాల, వాహనాల శబ్ద భేదాలను గుర్తించడం
 • పరిసరాలలోని వివిధ శబ్దాలలో గట్టిగా, నెమ్మదిగా వచ్చే శబ్దాలలో తేడాలను గమనించేటట్లు చేయాలి

ఉదాహరణ : ఆకులు రాలడం, కొమ్మలు విరగడం, వివిధ అరుపులు మొదలైనవి.

వివిధ రకాల శబ్దాలను, వాటిలోని భేదాలను పిల్లలు గుర్తించేలా చేయడం వలన భవిష్యత్తులో అక్షరాలు నేర్చుకొనేటప్పుడు వాటి ఉచ్ఛారణలో భేదాలను కూడా గుర్తించగలుగుతారు.

మాటల ద్వారా వ్యక్తీకరణాభివృద్ధి - కొన్ని కృత్యాలు

సంభాషణ

పిల్లల అంగన్ వాడిలో ప్రవేశించినప్పుడు సిగ్గుగా, సందేహంతో అడుగు పెడతారు. ఈ వాతావరణం వారికి బొత్తిగా పరిచయం లేనిది. దానితో వారికి అభద్రతాభావం అధికంగా ఉంటుంది. అందువల్ల పిల్లల్లో ధైర్యాన్ని, భద్రతాభావాన్ని కలిగించడానికి కార్యకర్త వారితో ఆత్మీయంగా మెలగాలి. పిల్లల్ని దగ్గరగా కూర్చోబెట్టుకొని వారితో చనువుగా మాట్లాడాలి.

ఉదాహరణ : అంగన్ వాడికి వచ్చే దారిలో నువ్వేం చూశావు అనేది సంభాషణా విషయం కావచ్చు. లేదా వారికిష్టమైన పళ్ళు, వారు చూసిన పువ్వులు మొదలైన వాటి గురించి అడగవచ్చు. ఈ సంభాషణలో మొత్తం అందరూ పాల్గొనేలా చూడాలి.

కథలు చెప్పడం

కేంద్రం రోజువారీ కార్యక్రమాల్లో కథలు చెప్పడం ఒక భాగం కావాలి

కథలను చాలా రకాలుగా చెప్పవచ్చు.

 • బొమ్మల పుస్తకాలతో
 • బోర్డుమీద కత్తిరించబడిన బొమ్మలతో
 • తోలుబొమ్మలతో ( వేళ్ళ మీద వేసిన బొమ్మలతో, చేతికి తగిలించుకొనేవి, కర్రకి ఉండేవి మొదలైనవి)
 • టీచరు స్వయంగా తయారు చేసిన కథల పుస్తకాలతో
 • ఏ విధమైన సాధనాలు లేకుండా

పిల్లలకు అసక్తి కలిగించే అంశాలు ఉన్న కథలు ఎన్నుకోవడం ముఖ్యం. ఉదాహరణకి జంతువులు, పక్షులు, కుటుంబంలో జరిగే ఘటనలు, పండుగలు వంటివి. కథలు చిన్నవిగానూ, తేలిక పదాలతోనూ ఉండాలి.

కథలు చెప్పేటప్పుడు పిల్లల్ని కూర్చోబెట్టే విధానం సరిగా ఉండాలి. పిల్లలు కార్యకర్తకి సాధ్యమైనంత దగ్గరగా కూర్చోవాలి. తక్కువ మంది పిల్లలు ఉంటే అర్ధచంద్రాకారంలో కూర్చోపెట్టవచ్చు.

 • పిల్లలు కూర్చున్న దానికంటే కార్యకర్త కొంచెం ఎత్తులో కూర్చోవాలి. దీనివల్ల కార్యకర్త చూపించేది పిల్లలందరికీ బాగా కనబడుతుంది.
 • ప్రతి ఒక్కరికి తాను చెప్పేది వినబడుతోందీ లేనిదీ, చూపించేది కనబడుతున్నదీ, లేనిదీ గమనిస్తుండాలి

అభినయం, తోలుబొమ్మలాట

పిల్లలకు తగిన అభినయం, హావభావలతో చిన్నచిన్న పాటలు పాడడం నేర్పించండి. తోలుబొమ్మలు ఉపయోగించి కథలు, పాటలు నేర్పించాలి

సృజనాత్మకమైన వ్యక్తీకరణ - నాటకాలు

సృజనాత్మక నాటకాలంటే ఒక కథను లేదా ఒక ఘటనను పిల్లలే స్వయంగా నాటకంగా మలచడం, సాధ్యమైనంతవరకు డైలాగులు వాళ్ళే తయారు చేయాలి.

సృజనాత్మక నాటకాలు ఎంతో ముఖ్యమైనవి, పిల్లలకు అనేక రకాలుగా తోడ్పడతాయి.

 • ఉహాశక్తిని పెంపొందిస్తాయి.
 • స్వతంత్ర ఆలోచనను ప్రోత్సహిస్తాయి.
 • స్వంత అభిప్రాయాలను పెంపొందిస్తాయి.
 • సహకరించుకోవడానికి అవకాశాలు కలిగిస్తాయి.
 • ప్రత్యేక చైతన్యాన్ని కలిగిస్తాయి.
 • భావోద్వేగాలు బహిర్గతమయ్యేలా చేస్తాయి.
 • మాటలతో వ్యక్తీకరించడాన్ని ప్రోత్సహిస్తాయి.
 • వినోదానికి కూడా అవకాశం కల్పిస్తాయి.

చదవడానికి సంసిద్దతాభివృద్ధి – పూర్వ పఠనం – కొన్ని కృత్యాలు శ్రవణ భేదాల గుర్తింపు

దీనికి సంబంధించిన కృత్యాలు శ్రవణ నైపుణ్యాభివృద్ధిలో ఇవ్వబడ్డాయి.

దృశ్య భేదాలను గుర్తించడం

పిల్లలకు వివిధ వస్తువులు, బొమ్మలు ఇచ్చి వాటిలోని తేడాలను గుర్తించేలా చేయడం ద్వారా అక్షరాల, పదాలలోని తేడాలను కూడా గుర్తించగలుగుతారు.

శ్రవణ – దృశ్య సంబంధం - కొన్ని కృత్యాలు

 • శబ్దాలను అక్షరాలతో జతపరచడానికి ముందు వాటి మధ్య సంబంధాన్ని గుర్తించే కృత్యాలు చేపట్టవలసిన అవసరం ఉంది.
 • పాతపత్రికల నుంచి కత్తిరించిన అనేక బొమ్మలను పిల్లలకు ఇచ్చి, ఏదో ఒక అక్షరంతో మొదలయ్యే బొమ్మలను వేరు చెయ్య మనాలి. ఉదాహరణకు తోక మొదలయ్యే పేర్లు గల బొమ్మలను వేరు చెయ్యమనడం.
 • నాలుగు బొమ్మలు గల పట్టీ తయారుచేయాలి. వీటిల్లో మూడు బొమ్మలు ఒకే అక్షరంలో మొదలయ్యేవి అయి ఉండాలి. నాల్గొవ బొమ్మ దానికి దగ్గరగా ఉండే వేరే అక్షరంతో మొదలయ్యేదై ఉండాలి. అలా వేరే అక్షరంతో మొదలయ్యే బొమ్మను గుర్తించమనాలి.

ఎడమవైపు నుండి కుడివైపుకు పురోగమించడం

 • పిల్లలకు బొమ్మల పుస్తకాలను ఇచ్చి వాటి పేజీలను సరిగ్గా తిప్పేలా అలవాటు చెయ్యాలి.
 • రకరకాల పనులకు పిల్లలకు కాగితాలు ఇచ్చినపుడు కూడా ఎడమవైపు నుండి కుడివైపుకు చేసుకుంటూ పొమ్మని ప్రోత్సహించాలి.

మరికొన్ని కృత్యాలు

చిత్రపఠనం

కొన్ని చిత్రపటాలను చూపించి ఆ చిత్రాలపై కొన్ని ప్రశ్నలు వేసి పటాన్ని చూపి జవాబులు చెప్పమనాలి. ఇలా చేయడం వలన వారిలో పఠన నైపుణ్యం అభివృద్ధి చేయవచ్చు.

పజిల్స్

 • కొన్ని చిత్రపటాలను తీసుకొని వాటిని ఒకటి లేక రెండు భాగాలుగా కత్తిరించి వాటిని పిల్లలకిచ్చి సరిగ్గా కూర్చమని చెప్పాలి. కూర్చిన తరువాత వాటిని గుర్తించి మాట్లాడించాలి.
 • రంగుల వెనుక అక్షరాన్ని ఇచ్చి దానిని రెండు మూడు ముక్కలుగా చేసి వాటిని జతచేయమనాలి (రంగుతో), వెనుక అక్షరాన్ని పలికింప చేయవచ్చు.
 • జంతువుల, పూల, పండ్ల, కాయల బొమ్మలని రెండు ముక్కలుగా చేయడం, వెనుక దాని పేరు రాసి ఇవ్వడం, అక్షరాన్ని పలికించడం.

అక్షరాలు జతపరచడం

ఒక చార్ట్ పేపరు పై అక్షరాలన్నింటినీ కలిపి రాసి దానిని పిల్లల కిచ్చి విడిగా అక్షరాలు రాసి ఉన్న అట్టముక్కలను చార్టు పేపరులో రాసిన అక్షరాలతో జతపరచమని చెప్పాలి.

రెండక్షరాల పదాలు

రెండక్షరాల పదాలను కొన్నింటిని ఒక చార్టు పైన రాసి అక్షరాలు రాసిన అట్టముక్కలను పిల్లలకు ఇచ్చి ఆ పదాలలో ఉన్న అక్షరాలను గుర్తించి జతపరచమనాలి. తర్వాత పదాలను గుర్తించి చదివించాలి.

ప్లానెలో గ్రాఫ్

ప్లానెల్ గుడ్డతో ప్లానలో గ్రాఫ్ / బోర్డును కార్యకర్త తయారు చేసుకోవాలి. దీన్ని అనేక కృత్యాలకు వాడుకోవచ్చు.

ఉదాహరణ : కథ చెప్పేటప్పుడు ప్రధాన పాత్రలకు సంబంధించిన రకరకాల బొమ్మలు తయారు చేసుకొని, పరిస్థితి కనుగుణంగా వాటిని ప్లానెల్ బోర్డు మీద పెట్టాలి. ఇది లాభదాయకమైన విధానం. ఎందుకంటే అవసరం లేని పాత్రలు ప్లానెల్ గ్రాఫ్ నుండి తీసివేయవచ్చు. అలాగే వాటిని ఒక చోట నుండి వేరొక చోటకు ప్లానెల్ గ్రాఫ్ పై కదిలించవచ్చు.

బొమ్మల పుస్తకాలు

బొమ్మల పుస్తకాల సహాయంతో కథ చెప్పడం పిల్లలకు చాలా ఆసక్తిదాయకమైనది. బొమ్మలు పిల్లలకు ఏకాగ్రతను సమకూర్చి వారు కథను అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. ఈ పుస్తకాల ద్వారా వాళ్ళకు మాట్లాడే భాష, వ్రాసే భాష కంటే తేడాగా ఉంటుందని తెలుస్తుంది. వాళ్ళు పుస్తకాలు చదివేటప్పుడు వాటిని సరైన పద్ధతిలో పట్టుకోవడం, ఎడమవైపు నుండి కుడివైపుకు చదవడం నేర్చుకొంటారు.

గమనిక : బొమ్మల పుస్తకాలను కార్యకర్తలు పిల్లలకు ఇవ్వాలి. అవి చిరిగిపోతే వెంటనే బాగు చేయాలి. లేకుంటే అవి మరింత చిరుగుతాయి. అంతేగాని చిరిగిపోతాయని, పాడైపోతాయని పుస్తకాల్ని దాచుకోకూడదు.

లేఖానా సంసిద్దతాభివృద్ధి – పూర్వ లేఖనం

రాయడం అనేది పిల్లలకు మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది. రాయడం మొదలు పెట్టక ముందు వారికి కొంత సంసిద్ధత అవసరం. రాయడం మొదలుపెట్టినప్పుడు పిల్లలు పెన్సిల్ సరిగ్గా పట్టుకోలేరు. అలా పట్టుకొని కాగితం మీద రాయడం వారికి కష్టంగా ఉంటుంది. ఇందుకు కారణం వారి చేతుల మరియు వేళ్ళ కండరాలు సమన్వయంగా పనిచేయలేకపోవడమే. వివిధ సృజనాత్మక కార్యకలాపాల ద్వారా కండరాలను అదుపు చేయగలగడం సాధ్యపడుతుంది.

సూక్ష్మ కండరాల అభివృద్ధి, నేత్ర – హస్త సమన్వయం

పూర్వలేఖానా నైపుణ్యాభివృద్ధికై సూక్ష్మ కండరాల అభివృద్ధి, నేత్ర – హస్త సమన్వయానికై రకరకాల కృత్యాలు చేపట్టవలసి ఉంది.

బంకమట్టితో

బంకమట్టితో ఆడడం పిల్లలకు చాలా ఇష్టం. అందుకవసరమైన మట్టిముద్దను కార్యకర్తలు ముందుగా తయారుచేయాలి. పిల్లలు ఆ ముద్దను పెట్టుకోవడానికి చెక్కబల్లలు, ప్లాస్టిక్ షీట్లు వాడుకోవచ్చు. ముందుగా చిన్న పిల్లలు మట్టిని కొట్టి, నలిపి ఆనందిస్తారు. తరువాత వారు మెల్లగా దానితో చిన్న ఉండలు, వివిధ ఆకారాలు చేయడం మొదలుపెడతారు. వారు దానితో ఆడేటప్పుడు పెద్ద లేక చిన్న ఉండలు చేయమని కార్యకర్త వారికి చెప్పవచ్చు. అలాగే వారితో సంభాషిస్తూ ఆ మట్టితో ఏమేం చేయవచ్చో సలహా ఇవ్వవచ్చు.

సూచన : పిల్లలకెప్పుడైనా ఏదైనా ఆకారాన్ని చూపి అలాగే చేయమని చెప్పకూడదు. వారేదైనా స్వంతంగా చేసినపుడు వారిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.

ఇసుకతో ఆట

ఇసుకతో ఆడటం పిల్లలకు సరదా, పాత డబ్బాలు, ప్లాస్టిక్ మూతలు, కొబ్బరి డొల్లలు ఇందుకోసం వాడవచ్చు. తడి ఇసుకను పిల్లలు ఈ మూతల్లో నింపి బోర్లిస్తే ఆ ఆకారంలో తడి ఇసుక పడుతుంది. ఒక పాత జల్లెడ, పాత మూతలతో చేసిన త్రాసు పిల్లలకు ఆడుకోవడానికి ఇవ్వొచ్చు.

బ్లాక్ బోర్డు మీద బొమ్మలు వేయడం

బోర్డు మీద బొమ్మలు వేయడానికి పిల్లల్ని ప్రోత్సహించాలి.

బొగ్గు, చాక్ పీసు ఉపయోగించడం

నేల మీద బొగ్గు లేదా చాక్ పీసును ఉపయోగించడం ద్వారా కూడా బొమ్మలు వేయించవచ్చు. బొమ్మలు వేయడం పూర్తి కాగానే వాటిలో రంగులు, రాళ్ళు ఆలు చిప్పలు, విత్తనాలు మొదలైనవి నింపవచ్చు.

కాగితాలు చింపి అతికించడం

దీని కోసం పాత వార్తాపత్రికలు, జిగురు వాడితే సరిపోతుంది. పిల్లలు కాగితాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఏదైనా వార్తాపత్రిక లేదా తెల్ల కాగితం పై వారికిష్టమైన రీతిలో అతికిస్తారు. లేదా మనం వారికి ఏదైనా బొమ్మ రూపాన్నిగాని, ఆకారాన్నిగాని కాగితం పై గీసిస్తే వారు దానిలో ఈ ముక్కలు అతికిస్తారు.

సూచన : కాగితాలు చింపి అతికించడం, ఆకులు అతికించడం, తడి ఇసుక మట్టితో బొమ్మలు చేయడం, సుద్దముక్కతో బొమ్మలు గీయడం మొదలైనవి చేయడం ద్వారా పిల్లల కండరాలపై చక్కని అదుపును సాధించడమేకాక వారి సృజనాత్మకతను పెంపొందింపజేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అనేక సామాజిక నైపుణ్యాల్ని సాధించగలుగుతారు. ఇలా కొంత కండరాల అదుపును సాధించాక మాత్రమే రాత సంసిద్ధతను అలవరచే కార్యక్రమాలు చేపట్టాలి.

పూర్వలేఖనా నైపుణ్యం – కృత్యాలు

చుక్కలను, గీతలను కలపడం : ప్రత్యేకమైన ఆకారాన్నేర్పరచి కొన్ని చుక్కలు, చిన్న గీతలు గీసి వాటిని కలపమని పిల్లలకు చెప్పండి. ఏ బొమ్మ ఏర్పడుతుందో చూసి చెప్పమనండి. ఇది వారి కుతూహలాన్ని ఆసక్తిని పెంపొందిస్తుంది.

రెండు సమాంతర రేఖల మధ్య ఒక గీత గీయడం : పిల్లల్ని రెండు సమాంతర రేఖల మధ్య ఒక గీత గీయమని చెప్పాలి. ఆ గీత రెండు సమాంతర రేఖలను తాకకూడదు. టీచరు బోర్డు మీద కొన్ని అలాంటివి గీసి పిల్లల్ని నేల మీద లేక పలక మీద అలాగే గీయమని చెప్పాలి.

ఆకారాలను గీయడం : ఒక త్రిభుజం బోర్డుమీద గీసి పిల్లల్ని ఆ ఆకారాన్ని జాగ్రత్తగా గమనించమని చెప్పాలి. వారు దాన్ని గమనించాక దానిని చెరిపేసి పలక లేదా కాగితం పై దాన్ని తిరిగి గీయమనాలి.

సూచన : పైన చెప్పినట్లు ఇలాంటి కృత్యాలను చేయించడం వల్ల పిల్లల్లో రాత సంసిద్ధతను పెంపొందించుకోగలుగుతారు.

పూర్వ ప్రాథమిక విద్యా కిట్స్

మన విద్యావిధానంలో పిల్లలు 5 సంవత్సరాలు నిండిన తరువాత బడిలో చేరుతారు. బడిలో చేరే ముందు వారు గడిపే రెండు, మూడు సంవత్సరాలు చాలా కీలకమైనది. ఈ దశలో వారి మానసిక ఎదుగుదల ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది.

మాతృభాషలో ఎక్కువ పదాలు పరిచయమయ్యేది, వాక్య నిర్మాణంలో తప్పొప్పులు తెలుసుకొనేది కూడా ఈ దశలోనే. భాషాభివృద్ధితోబాటు ఇతర నైపుణ్యాలు కూడా వారు పెంపొందించుకొంటారు. తోటి పిల్లలతో బాటు దొరికిన వస్తువులతో వంట చేసుకునే ఆట, ఇళ్ళు కట్టుకొనే ఆట, ఇసుక అందుబాటులో ఉంటే గూళ్ళు కట్టుకొనే ఆట, దాగుడు మూతలు – ఇలా రకరకాల ఆటలు ఆడతారు. సహజంగా పెంపొందే ఈ నైపుణ్యాలతోబాటు వారికి అందుబాటులో కొన్ని ఆట వస్తువులు ఉంచితే ఆ నైపుణ్యాలు మరింత మెరుగయ్యే అవకాశం ఉంది.

పిల్లలకు పరిచితమైన జంతువులు, పక్షులు, కూరగాయలు, రంగులు మొదలైన వాటిని మొదటిదశంలో వారికి పరిచయం చేయాలి. ఆ తర్వాత రకరకాల ఆకారాలు

సృష్టిలో ముఖ్యమైన ఆకారాలు నాలుగు. అవి – 1) వృత్తం, 2) త్రిభుజం, 3) చదరం, 4) దీర్ఘచతురస్రం.

ఇదే రకంగా మిగిలిన ఆకారాలను కూడా పిల్లలకు పరిచయం చేయాలి.

బొమ్మలతో పిల్లలను గమ్మత్తుగా ఆకట్టుకోవచ్చు. వాళ్ళకు మొదటి అయిదారు వాక్యాలలో ఒక కథ చెప్పేయాలి.

ఉదాపరణకు : చీమ, వేటగాడు కథ వాళ్ళకు చెప్పాలి.

 1. ఒక కొమ్మ మీద పావురం కూర్చోనుంది. వేటగాడు పావురాన్ని చంపడానికి బాణం ఎక్కుపెడుతున్నాడు.
 2. ఒక చీమ అది చూసింది.
 3. సరిగ్గా వేటగాడు బాణం వదిలే సమయానికి చీమ వేటగాడి కాలి మీద కుట్టింది.
 4. వేటగాడు అబ్బా అని నేల మీద కూర్చున్నాడు.
 5. బాణం గురి తప్పింది. పావురం ఎగిరిపోయింది.
 6. చీమ, పావురం ఆనందంగా వెళ్ళిపోయాయి

ఇంత తేలిక వాక్యాలలో కథ చెప్పిన తరువాత ఒక క్రమంలో లేని చిత్రకథ బొమ్మలను పిల్లల ముందు ఉంచాలి. మొదట ఏం జరిగిందో మళ్ళీ చెప్పి దానికి సంబంధించిన బొమ్మ తీయమనాలి. తరువాతి రెండోది. ఇలా కథకు సంబంధించిన అన్ని బొమ్మలను పిల్లలు వరుసగా పేర్చగలిగేటట్లు చేయాలి. ఇది ఒక వినోద ప్రక్రియనే కాకుండా విజ్ఞాన ప్రక్రియ కూడా.

ఇలా రకరకాల పద్ధతుల్లో పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్యని అందించే వివిధ సామాగ్రిని పరిశీలిద్దాం.

అంకెల్లో సింహం

ఆడించే విధానం

కార్యకర్త ముందుగా భాగాలను వేరు చేయాలి. తరువాత వాటిని బోర్డులో సూచించబడిన అంకెల ఆధారంగా తిరిగి అమర్చి పిల్లలకు చూపించాలి. మరల భాగములను వేరుచేసి పిల్లలకిచ్చి వారిని చేయమని చెప్పాలి.

పిల్లలకు కలిగే ప్రయోజనాలు

 • కంటికీ, చేతికి మధ్య సమన్వయం ( Eye- Hand coordination)
 • ఏకాగ్రత అభివృద్ధి (concentration)
 • మానసికాభివృద్ధి ( cognitive development)
 • సమస్యా పరిష్కరణ (problem solving)
 • పరిశీలనాశక్తి ( Attention)
శరీరంలో భాగాలు

ఆడించే విధానం

కార్యకర్త ముందుగా భాగాలను వేరు చేయాలి. తరువాత వాటిని బోర్డులో సూచించబడిన అంకెల ఆధారంగా తిరిగి అమర్చి పిల్లలకు చూపించాలి. మరల భాగములను వేరుచేసి పిల్లలకిచ్చి వారిని చేయమని చెప్పాలి.

పిల్లలకు కలిగే ప్రయోజనాలు

 • కంటికీ, చేతికి మధ్య సమన్వయం ( Eye- Hand coordination)
 • ఏకాగ్రత అభివృద్ధి (concentration)
 • మానసికాభివృద్ధి ( cognitive development)
 • సమస్యా పరిష్కరణ (problem solving)
 • పరిశీలనాశక్తి ( Attention)
అక్షరాలతో సీతాకోకచిలుక

ఆడించే విధానం

కార్యకర్త ముందుగా భాగాలను వేరు చేయాలి. తరువాత వాటిని బోర్డులో సూచించబడిన అచ్చుల ఆధారంగా తిరిగి అమర్చి పిల్లలకు చూపించాలి. మరల భాగములను వేరుచేసి పిల్లలకిచ్చి వారిని చేయమని చెప్పాలి.

పిల్లలకు కలిగే ప్రయోజనాలు

 • కంటికీ, చేతికి మధ్య సమన్వయం ( Eye- Hand coordination)
 • ఏకాగ్రత అభివృద్ధి (concentration)
 • మానసికాభివృద్ధి ( cognitive development)
 • సమస్యా పరిష్కరణ (problem solving)
 • పరిశీలనాశక్తి ( Attention)
రంగుల ఆట

ఆడించే విధానం

ఈ ఆటలో ఆరు వివిధ రంగుల చట్రాలు ఉంటాయి. ప్రతి చట్రంలోనూ వృత్తాకారంలో కొంత భాగం తొలగించబడి ఉంటుంది. తొలగించబడిన భాగాలు, చట్రాలు విడివిడిగా ఉంటాయి.

పిల్లలు తొలగించబడిన భాగాన్ని తీసుకుని దాని రంగుతో సరిపోయే చట్రంలో బిగించాలి.

పిల్లలకు కలిగే ప్రయోజనాలు

 • రంగులు, ఆకారాల పై అవగాహన
 • కంటికీ, చేతికి మధ్య సమన్వయం ( Eye- Hand coordination)
 • ఏకాగ్రత అభివృద్ధి (concentration)
 • మానసికాభివృద్ధి ( congnitive development)
 • సమస్యా పరిష్కరణ (problem solving)
 • పరిశీలనాశక్తి (Attention)
 • చిన్న కండరాల అభివృద్ధి ( Eye- Hand coordination)
ఆకారాలు

ఆడించే విధానం

ఒక అట్ట / ఫోమ్ బోర్డు మీద ఆరు రకాల ఖాళీలు ఉంటాయి. వాటిల్లో సరిగ్గా ఇమిడిపోయే ఆరు రకాల కత్తిరింపులు ఒక్కొక్కటి దేంట్లో సరిగ్గా ఇమిడిపోతుందో పిల్లలు గుర్తించి ఈ అట్టకు బిగించాలి.

పిల్లలకు కలిగే ప్రయోజనాలు

 • కంటికీ, చేతికి మధ్య సమన్వయం ( Eye- Hand coordination)
 • ఏకాగ్రత అభివృద్ధి (concentration)
 • మానసికాభివృద్ధి ( cognitive development)
 • సమస్యా పరిష్కరణ (problem solving)
 • పరిశీలనాశక్తి ( Attention)
దేనికి ఏది సరిపోతుంది ?

ఆడించే విధానం

ఒక అట్ట / ఫోమ్ బోర్డు మీద మూడు వరుసల్లో, ఒక్కో వరుసకు నాలుగు చొప్పున ఖాళీలు ఉంటాయి. మొదటిది చాలా పెద్దది, తరువాత కొంచెం చిన్నది – ఇలా నాలుగు ఖాళీలూ నాలుగు సైజుల్లో ఉంటాయి. ఆ ఖాళీలలో సరిగా ఇమిడిపోయే విడి ముక్కలు ప్రత్యేకంగా ఉంటాయి. ఏ సైజు రంధ్రానికి ఏది సరిపోతుందో పిల్లలు వెదికి అమర్చాలి.

పిల్లలకు కలిగే ప్రయోజనాలు

 • వివిధ ఆకారాలు, పరిమాణాల అవగాహన
 • ఏకాగ్రత అభివృద్ధి (concentration)
 • సమస్యా పరిష్కరణ (problem solving)
 • చిన్న కండరాల అభివృద్ధి ( Eye- Hand coordination)
 • కంటికీ, చేతికి మధ్య సమన్వయం ( Eye- Hand coordination)
 • మానసికాభివృద్ధి ( congnitive development)
 • పరిశీలనాశక్తి (Attention)
బొమ్మ పాప

ఆడించే విధానం

ఒక అట్ట / ఫోమ్ బోర్డు మీద ఖాళీలు ఉంటాయి. వాటిల్లో సరిగ్గా ఇమిడిపోయే విడి భాగాలు ఉంటాయి. ఏ ఖాళీలోకి ఏ భాగం ఇముడుతుందో గుర్తించి ఆభాగాన్ని అక్కడ అమర్చాలి. అన్ని ఖాళీలు పూర్తి చేస్తే అమ్మాయి బొమ్మ తయారవుతుంది.

పిల్లలకు కలిగే ప్రయోజనాలు

 • వివిధ ఆకారాలు, పరిమాణాల గుర్తింపు
 • కంటికీ, చేతికి మధ్య సమన్వయం ( Eye- Hand coordination)
 • ఏకాగ్రత అభివృద్ధి (concentration)
 • మానసికాభివృద్ధి ( congnitive development)
 • సమస్యా పరిష్కరణ (problem solving)
 • పరిశీలనాశక్తి (Attention)
 • చిన్న కండరాల అభివృద్ధి ( Eye- Hand coordination)
ఇల్లు కడదాం

ఆడించే విధానం

ఒక అట్ట / ఫోమ్ బోర్డు మీద 15 ఖాళీలు ఉంటాయి. వాటిల్లో సరిగ్గా ఇమిడిపోయే 15 బ్లాకులు అన్నీంటినీ ఖాళీలలో బిగిస్తే ఒక చక్కటి ఇల్లు తయారవుతుంది.

పిల్లలకు కలిగే ప్రయోజనాలు

 • వివిధ ఆకారాల పై అవగాహన
 • చిన్న కండరాల అభివృద్ధి ( Eye- Hand coordination)
 • కంటికీ, చేతికి మధ్య సమన్వయం ( Eye- Hand coordination)
 • ఏకాగ్రత అభివృద్ధి (concentration)
 • మానసికాభివృద్ధి ( congnitive development)
 • సమస్యా పరిష్కరణ (problem solving)
 • పరిశీలనాశక్తి (Attention)

ఆధారము: మహిళాభివృద్ధి శిశుసంక్షేమ శాఖ – ఆంధ్రప్రదేశ్

3.01515151515
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు