హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / అయోడిన్ ప్రభావాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అయోడిన్ ప్రభావాలు

అయోడిన్ ప్రభావాలు

పరిచయం

మన దేహంలో జీవక్రియలు సక్రమంగా జరగాలంటే సూక్ష్మ పోషకాలకు చెందిన మూలకాలు అవసరం. ఈ మూలకాలలో అయోడిన్ ఒక ముఖ్యమైన సూక్ష్మ పోషకం. ఈ సూక్ష్మ పోషకాన్ని మన గొంతు భాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంధి ఉపయోగించుకుని థైరాక్షిన్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ అయోడిన్ మూలకం వల్ల మన మెదడు భాగంలో ఉన్న పిట్యూటరీ గ్రంధి ప్రేరేపించబడి, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోను ఉత్పత్తి అవుతుంది. ఈ హా ర్మోను మన గొంతు భాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంధి నుండి T3 & T4 హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ల వల్ల మన జీవక్రియలు సక్రమంగా పని చేయడంవల్ల మన శరీర పెరుగుదల, మరియు ఆరోగ్యం కాపాడబడుతుంది. ప్రపంచం మొత్తం జనాభాలో 30% మంది అయోడిన్ లోపము మరియు దాని వలన వచ్చు సమస్యలు గల ప్రదేశాలలో నివసిస్తున్నారు. మన ఆరోగ్య పరిస్థితి మన దేహ జీవక్రియలపై ఆధారపడి ఉంటుంది.

అయోడిన్ మూలక ఆధారమైన జీవక్రియలు గర్భస్థ శిశువుకు, గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు మరియు చిన్న పిల్లల ఎదుగుదలకు చాలా అవసరము. అదే విధముగా  గర్భస్థ శిశువు పెరుగుదలకు ఎంతో అవసరం. పుట్టిన పిల్లల్లో అయోడిన్ లోపం వలన వయస్సు పెరిగే కొద్దీ చురుకుదనం లేకపోవటం, పెరుగుదలలోపం జ్ఞాపకశక్తి తగ్గి చదువులో వయస్సుకు తగ్గ ప్రతిభ చూపించలేకపోవటం (మంద బుద్ధి) కనబడుతుంది. తద్వారా సామాజిక, ఆర్థిక పురోభివృద్ధిపై ప్రభావం చూపిస్తుంది.

అయోడిన్ యొక్క మోతాదు

మనం తినే ఉప్పులో అయోడిన్ ఉండదు. కాని అయోడిన్ పోషకము మన దేహంలో చేకూరుటకు అయోడిన్ ను మనం తీసుకునే ఆహార పదార్థాలతో కలపాలి. అయోడిన్ కు కలిపే పరిమాణము రీజియన్ కు ఒక్కో రకంగా ఉంది. కెనడా మరియు అమెరికాలలో అయోడైస్డ్ ఉప్పులో పొటాషియం అయొడైడ్ 100 ppm ఉంటుంది. అంటే 2 గ్రాముల ఉప్పులో 150mcg అయొడిన్ ఉంటుంది. అమెరికాలో అయోడైస్డ్ ఉప్పు, అయోడైజ్డ్ కాని ఉప్పు కూడా ఒకే ధర ఉంటుంది. అక్కడ అమ్మే ఉప్పులో 50% అయోడైజ్డ్ ఉప్పు. కెనడాలో టేబుల్ సాల్ట్ అంతా అయోడైజ్డ్ చేయబడి ఉంటుంది. ఇతర దేశాలలో 10 నుండి 40 mcg  అయోడిన్ ను 1 గ్రాము సాల్ట్ కు చేర్చబడినది. ఆహారంలో ప్రతిరోజు ఉప్పు వినియోగం ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంది. పశ్చిమ దేశాలలో 2 నుండి 5 గ్రా, మరికొన్ని ఇతర దేశాలలో 20 గ్రాములవరకూ ఉంది. అది సరాసరి రోజుకు 10 గ్రా.
అయోడిన్ సూక్ష్మ పోషకము రోజుకు సగటున 150 మైక్రో గ్రాములు అంటే ఒక గుండు సూది తలసైజు పరిమాణము సరిపోతుంది. స్త్రీ పురుషులిద్దరికీ, అన్ని వయస్సులలోను ప్రతిరోజు ఇది అవసరం. ముఖ్యంగా స్త్రీలకు వారి వయస్సు, గర్భధారణ పరిస్థితిని బట్టి అయోడిన్ ఈ విధముగా విపులీకరించబడినది.
సాధారణ వ్యక్తికి: 150 మైక్రో గ్రాములు
గర్భవతి/పాలిచ్చే తల్లికి: 250 మైక్రో గ్రాములు
పసి పిల్లలు: పుట్టినప్పటినుండి 11 నెలల వరకు 50 మైక్రో గ్రాములు
బాల్య దశ: 12 నుండి 59 నెలల వరకు 90 మైక్రో గ్రాములు
బడి పిల్లలు: 6 నుండి 12 సంవత్సరాల వరకు 120 మైక్రో గ్రాములు
12 సంవత్సరములపైన: 150మైక్రో గ్రాములు అవసరం.

ఏ ఏ పదార్థాలలో అయోడిన్ లభ్యమవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం

అయోడిన్ మనం తీసుకునే ఆహార పదార్థాలలో మరియు త్రాగే నీటిలో ఉంటుంది. మనకు సాధారణ స్థాయిలో సరిపడి అయోడిన్ నేలలో పండించిన పంటలలో లభ్యమవుతుంది. ఏదైనా పరిస్థితులలో పంటలు పండించిన నేలలో అయోడిన్ సారలోపం ఉంటే, అక్కడ పండించిన పంటలో కూడా అయోడిన్ లోపం ఉంటుంది. వీటిలో లభ్యమయ్యే అయోడిన్ వలన భారత దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయోడిన్ లోప సంబంధిత రుగ్మతలకు లోనవుతున్నారు. కావున భారత ప్రభుత్వం వివిధ అధ్యయనాల ఆధారంగా ఉప్పులో అయోడిన్ చేర్చి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తోంది. ప్రతి వ్యక్తి సగటున రోజుకు 5-6 గ్రాముల ఉప్పును ఉపయోగించాలి. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు ఉప్పు వాడటం సహజం. అందువల్ల ఉప్పుకు అయోడిన్ చేర్చడం వల్ల ప్రతి ఒక్కరికీ ప్రతిరోజూ కనీసం 150 మైక్రో గ్రాముల అయోడిన్ లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సాధారణ ప్రజానీకానికి అందుబాటులోనికి తేవటానికి రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరలో పంపిణీ చేస్తోంది. సముద్రంలో లభ్యమయ్యే అన్ని చేపలలో అయోడిన్ ఉండదు, కావున సముద్ర తీర, కొండ ప్రాంతాలలో నివసించే ప్రజలందరూ కూడా అయోడైజ్డ్ ఉప్పును తప్పక వాడవలెను. ఆహార పరిరక్షణ మరియు ప్రమాణాలు నిబంధన చట్ట ప్రకారం 2006 లో అయోడైజ్డ్ ఉప్పునే వాడాలి మరియు విక్రయ దారులు అయోడైజ్డ్ ఉప్పునే విక్రయించాలి. నిబంధనలను ఉల్లంఘించి సాధారణ ఉప్పును పంపిణీ చేసినా, విక్రయించినా చట్ట ప్రకారం శిక్షార్హులు. కాబట్టి అయోడైజ్డ్ ఉప్పునే వాడండి.

అయోడిన్ లోపము వలన వచ్చు పరిణామాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.

ఇంతకు ముందు వివరించిన విధంగా అయోడిన్ లోపం వల్ల పలు జీవక్రియలు మార్పు చెందడం వల్ల T3 & T4 తగ్గడం, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోను (TSH)పెరగడం జరుగుతుంది. ఈ స్థితిని హైపో థైరాయిడిజం అంటారు. హైపో థైరాయిడిజంతో బాధపడే స్త్రీలు ముఖ్యముగా బరువు పెరగడం, చర్మం పొడిబారడం, జుట్టు రాలటం, ఋతుక్రమం తప్పటం, గర్భం ధరించలేకపోవటం, చురుకుగా పనిచేయలేకపోవటం లాంటి సమస్యలకు గురి అవుతారు. ఇటువంటి స్త్రీలు గర్భము ధరించినట్లయితే, ఈ హార్మోన్ల లోపం వల్ల గర్భస్థ శిశువు పెరుగుదల సరిగా ఉండదు. అంతేకాక గర్భస్రావం జరగటం, తక్కువ బరువుగల శిశువుకు జన్మనివ్వటం, పుట్టుకతో వచ్చే చెముడు తద్వారా వచ్చే మూగతనం, మరుగుజ్జుతనం, కండరాలు బిగుసుకుపోవడం మరియు పుట్టిన బిడ్డ బుద్ధి మాంద్యతకు గురి అవ్వటం జరుగుతుంది. తీవ్ర అయోడిన్ లోపమునకు గురి అయినట్లయితే గొంతులో థైరాయిడ్ గ్రంధి వాపు ఏర్పడుతుంది. దీనినే గాయిటర్ అంటారు.

అయోడిన్ లోపం వలన వివిధ దశలలో కలిగే విపరిణామాలు

జీవన దశవిపరిణామాలు
గర్భస్థ దశలో ఉన్నపుడు

- గర్భ స్రావం

-మృతశిశువు జననం

-అనువంశిక జనన లోపాలు

-తక్కువ బరువుగల శిశువుకు జన్మనివ్వటం

-నరాల లోపాల వల్ల కలిగే మరుగుజ్జుతనం

-మానసిక వికాస స్థంభన

-చెవిటి తనము - మూగతనము (డెఫ్ మ్యుటిజం)

-నరాల బలహీనత

శైశవ దశలో ఉన్నపుడు

అవయవ సమన్వయంలో అవకతవకలు

- గాయిటర్ / గొంతు వాపు

-అంగ వైకల్యం

-గ్రంధి వాపు / గాయిటర్

-మానసిక వికాస స్థంభన

-మరుగుజ్జుతనం

-విషయ సంగ్రహణా సామర్థ్యం తగ్గటం

యుక్త వయస్సులో ఉన్నపుడు

- జ్ఞాపక శక్తి నశించటం

-మానసిక అన్శ్చితి

-శారీరక ఎదుగుదలలో లోపము

చివరి దశలో అంటే పెద్దవారిలో

- థైరాయిడ్ గ్రంధి వాపు

-మానసిక పరిస్థితి / రుగ్మతలు

సాధారణంగా మన దేశంలో ఈ అయోడిన్ లోపము వలన 200 మిలియన్ ల మంది ప్రజలు భాదపడుతున్నారు.

70 మిలియన్ల మందికి పైగా గాయిటర్ మరియు ఇతర అయోడిన్ లోపాల వలన భాదపడుతున్నారు.

ఎక్కువ మంది ప్రజలు ఈ అయోడిన్ లోపమునకు గాయిటర్ మాత్రమే కారణమని అనుకుంటున్నారు.

కాని చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన విషయము ఏంటంటే మానసిక ఎదుగుదల సరిగ్గాలేకపోవటం వలన కూడా ఈ అయోడిన్ లోపము వస్తుంది.

ఈ అయోడిన్ లోపము వలన

నవజాత శిశువులు - 8.0 మిలియన్లు

చిన్న పిల్లలు - 7.6 మిలియన్లు

5 సంవత్సరముల పిల్లలు - 36.5 మిలియన్లు

గర్భిణిలు - 8.8 మిలియన్లు బాధపడుతున్నారు.

మొత్తం జనాభాని చూసినట్లయితే 350 మిలియన్లు మంది ఈ అయోడిన్ లోపము వలన భాదపడుతున్నారు.

అయోడిన్ లోప రుగ్మతలు రావడానికి రెండు కారణాలు

  1. సరిగ్గా ఆహారం తీసుకోలేకపోవడం వలన అంటే పండించే మట్టిలో అయోడిన్ శాతం తక్కువగా ఉండటం వలన ఇంకా సముద్రపు ఆహారం తక్కువగా తీసుకోవడం వలన
  2. మనం తీసుకున్న ఆహారం శరీరంలో సరిగ్గా గ్రహించలేకపోవడం వలన అంటే ఆహారంలో ఉన్న కొన్ని టాక్సిన్ లు, కసావా, కాలి ఫ్లవర్, కర్ర పెండలం, చిరుధాన్యాలు శరీరంలో అయోడిన్ ను గ్రహించకుండా అడ్డుపడతాయి.

అయోడిన్ లోప రుగ్మతలనివారణ

ప్రతిరోజు మనం తినే అన్ని రకాల ఆహార పదార్థాలలో క్రమం తప్పకుండా అయోడైజ్డ్ ఉప్పును ఉపయోగించడం ద్వారా అయోడిన్ లోప రుగ్మతలను నివారించవచ్చు. వంటలలో వండేటప్పుడు తప్పని సరిగా అయోడైజ్డ్ ఉప్పునే వాడవలెను. అయోడిన్ లోపం నివారించబడినట్లయితే పెరుగుదల మరియు ఆరోగ్యంగా అభివృద్ధి త్వరగా కనబడుతుంది.

 

అయోడిన్ లోప రుగ్మతల చికిత్స, వాటి సూచనలు

అయోడిన్ లోప రుగ్మతల బారిన పడ్డవారు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రములో వైద్యులను సంప్రదించి, వారి సలహా మేరకు రక్తపరీక్షలు (T3,T4 & TSH) చేయించుకుని, వైద్యులు సూచించిన విధంగా మందులను వాడవలెను.

ముఖ్యంగా అయోడిన్ లోప రుగ్మతల బారిన పడ్డ స్త్రీలు డాక్టరు సలహా మేరకు మందులు వాడటం వలన గర్భస్థ దశలో సంభవించబోయే పరిణామాలను అధిగమించి ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనివ్వగలరు.

గాయిట్రోజన్స్ గల పదార్థాలు

కాయగూరలు ముఖ్యముగా క్రూసిఫెరస్ కుటుంబమునకు సంబంధించిన కూరగాయలు. ఉదా:- నిత్యం ఉపయోగించే ముల్లంగి, నూల్ కోల్, క్యాబేజీ, కాలీఫ్లవర్ మరియు కర్ర పెండలం, కసావా, చిలకడ దుంపలు మొదలగు దుంపలలో గాయిట్రోజన్స్ అనబడు రసాయనాలు ఉంటాయి. అవి మన శరీరానికి అవసరమయ్యేంత పరిమాణంలో అయోడిన్ ను థైరాయిడ్ గ్రంధి గ్రహించటాన్ని ఆటంకపరుస్తాయి. వీటిని అధికంగా ఉపయోగించటం వలన వాటిలోని పొటాషియం థయోసైనేట్ థైరాయిడ్ గ్రంధి అయోడిన్ ను గ్రహించటాన్ని ఆటంకపరుస్తుంది. కనుక అయోడిన్ లోప రుగ్మతలకు గురి అవుతారు. మిగిలిన ఆకుకూరలు, కాయగూరలు పుష్కలంగా తీసుకొనవలెను.

అయోడైజ్డ్ ఉప్పును కొనుగోలు చేయుటకు, ఉపయోగించుటకు మరియు భద్రపరచుటకు సూచనలు

అయోడైజ్డ్ ఉప్పును కొనుగోలు చేయునప్పుడు, ఆ ప్యాకెట్ పై నవ్వుతున్న సూర్యుడు గుర్తు (స్మైలింగ్ సన్ లోగో) తప్పక ఉండునట్లు చూసుకొనవలెను. తయారు చేసిన తేదీ నుండి 6 నెలల లోపల ఉపయోగించాలి. కొన్న వెంటనే ప్యాకెట్లోని ఉప్పును మూత గట్టిగా ఉన్న డబ్బాలలో నిల్వ చేసుకొనవలెను. తడి, తేమ, వేడికి దూరంగా అయోడైజ్డ్ ఉప్పును నిల్వ ఉంచిన డబ్బాలను పెట్టవలెను.

మనం తినే ఉప్పు ఎక్కువగా వంట చేసేటప్పుడు వాడుతుంటాము. వంట చేసేటప్పుడు చిన్న మొత్తంలో కొంత అయోడిన్ పోతుంది. అయితే అది ఉప్పు యొక్క స్వచ్చత మరియు వంట విధానాలపై ఆధారపడి ఉంటుంది. వంటకము తయారయ్యి, దించిన తరువాత అయోడైజ్డ్ ఉప్పును కలపవలెను. ఈ సూచనలను పాటించటం ద్వారా అయోడైజ్డ్ ఉప్పులోని అయోడిన్ ఆవిరి అయిపోకుండా మనకు లభ్యమవుతుంది. తద్వారా అయోడిన్ లోప రుగ్మతలనుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

అయోడిన్ లోప ప్రభావం లేని ప్రాంత ప్రజలు, కొంత ఎక్కువ మోతాదులో అయోడిన్ సేవించటం వలన ఏమైనా ప్రమాదమా/ అలర్జీలకు కారణమా

ప్రజలలో ఎక్కువమందికి 1mg/1000mg  వరకూ తీసుకున్నా కూడా ఎలాంటి సమస్యలు రావు. మనం ఉపయోగించే ఆహారం ద్వారా అయోడిన్ అధిక మొత్తంలో లభిస్తే అదనంగా అందిన అయోడిన్ మూత్ర విసర్జన ద్వారా బయటకు వెల్లిపోతుంది. అందువల్ల ఇది ఏమాత్రం ప్రమాదం కాదు. సర్వే ఫలితాల ప్రకారం అయోడిన్ ఉపయోగించటం వలన ఏ రకమైన అలర్జీలు సంభవించవని నిర్ధారించబడింది.

  • పేద, గొప్ప తారతమ్యాలు లేకుండా, అయోడిన్ లోపం రుగ్మతలు(IDD) ఎవరికైనా రావచ్చు. కనుక అందరూ అయోడైజ్డ్ ఉప్పును వాడాలి.
  • అన్ని ప్రభుత్వ రేషన్ దుకాణములలో అయోడైజ్డ్ ఉప్పు లభ్యమవుతుంది.
  • అన్ని హాస్టల్స్ లో, మిడ్ డే మీల్ కార్యక్రమంలో, అంగన్ వాడీ సెంటర్లలో అయోడైజ్డ్ ఉప్పునే వాడండి.
  • అయోడిన్ ఉప్పు వాడుట మరియు అవగాహన కల్పించడములో మనవంతు చేయూతనిద్దాం.

ఆధారం: డాక్టర్ కె. ఉమాదేవి, ప్రొఫెసర్, ఆహారం & పోషణ విభాగం.

http://www.vigyanasaadhitha.com

3.01204819277
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు