অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కండర, అస్థిపంజర వ్యవస్థ & ఆరోగ్యం

కండర, అస్థిపంజర వ్యవస్థ & ఆరోగ్యం

శరీరంలోని కండరాలు, ఎముకలు, మృదులాస్థి, స్నాయువులు, కీళ్ళు, నరాలు, కణజాలాలు- వీటన్నిటిని కలిపి కండర, అస్థిపంజర వ్యవస్థ అంటారు. ఇది శరీర నిర్మాణాన్ని, స్థితి, గతిని, కదలికలను నిర్వహిస్తుంది. ఈ వ్యవస్థలో ప్రతి భాగం ఎటువంటి వ్యాధి, జబ్బు లేకుండా ఉండటాన్ని కండర, అస్థిపంజర వ్యవస్థ ఆరోగ్యం అంటారు. ఎముకలకు, కీళ్ళకు, కండరాలకు, స్నాయువులకు, నరాలకు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కండర, అస్థిపంజర నొప్పి వస్తుంది. ఆకస్మిక కుదుపులు, రోడ్డు ప్రమాదాలు, పడిపోవడం, బెణుకులు, ఎముకల స్థానభ్రంశం మొదలైన కారణాల వలన ఈ నొప్పి కలుగుతుంది.
కీళ్ళలో, కండరాలలో, స్నాయువులలో, ఎముకలలో నొప్పికలిగినా, వాటికి ఏదైనా దెబ్బతగిలినా, ఆ స్థితిని కండర, అస్థిపంజర రుగ్మతలు అంటారు. ఈ రుగ్మతలు ప్రమాదకరమైన వ్యాధులుగా గుర్తించబడ్డాయి. ఇవి శరీరంలో నొప్పిని, వాపును కలిగించి సాధారణంగా రోజువారీగా చేసుకొనే పనులను కూడా చేసుకోనివ్వవు. కండరాలు చాలసేపు సంకోచించినప్పుడు రక్తం సరఫరా తగ్గిపోతుంది. దానివలన కండరాలలో ఉత్పత్తి అయ్యే విసర్జక పదార్థాలు త్వరగా తొలగించబడకుండా పేరుకు పొతాయి. అందువలన నొప్పి కలుగుతుంది. అంతే కాక కండరాలు తరచూ సంకోచించడం వలన రెండు సంకోచాల మధ్య వ్యవధి తక్కువగా ఉండి నొప్పి అధికమవుతుంది.
కండర, అస్థిపంజర వ్యవస్థ & ఆరోగ్యం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన అరోగ్య సమస్య. గత 10 సంవత్సరాలలో కండర, అస్థిపంజర రుగ్మతలుకు గురౌతున్నవారి సంఖ్య 25% పెరిగిందని, ఇకపై కూడా పెరుగుతూనే ఉంటుందని అంచనా. మనం ఏదైనా పనిని ఒకే పద్దతిలో తరచుగా చేస్తుంటే, కండరాలు సాగుదలకు గురై రుగ్మతకు దారి తీస్తుంది.

సాధారణంగా కనపడే కండర, అస్థిపంజర రుగ్మతలు

 • ఎముకల, కీళ్ళ బాధ
 • కీళ్ళ వాపు
 • వెన్ను నొప్పి
 • వృత్తి సంబంధ బాధలు
 • కాలి బొటన వేళ్ళ వాతం
 • బోలు ఎముకల వ్యాధి.

కండర, అస్థిపంజర రుగ్మతల తొలి లక్షణాలు

 • వెన్నెముక క్రింది భాగంలో నొప్పి కలుగుతుంది
 • బొటనవేలు, మోచెయ్యి, మణికట్టు, భుజాలు నొప్పిగా ఉంటాయి
 • అరికాళ్ళు, అరచేతులలో మంటలు, తిమ్మిర్లు, మొద్దుబారడం జరుగుతుంది
 • నీరసంగా ఉంటుంది

ప్రాధమిక దశలో నొప్పి ఉంటుంది, పని చేసినంతసేపు అలసట కలుగుతుంది. కాని రాత్రిపూట విశ్రాంతి తీసుకోవడం వలన, లేకపోతే శెలవుదినాలలో పని లేకపోవడం వలన నొప్పి మాయమవుతుంది. ఆస్థితిలో పని సామర్థ్యంలో కూడా ఎటువంటి మార్పు ఉండదు.

మాధ్యమిక దశలో పని చేస్తున్నంతసేపు, రాత్రిపూట నొప్పులు, అలసట ఉంటాయి. దినసరిగా చేసే పనిలో సామర్థ్యం తగ్గుతుంది.

చివరి దశలో నొప్పులు, అలసట, విశ్రాంతి సమయంలో కూడా నీరసంగా ఉంటుంది. రాత్రి పూట నిద్ర తక్కువ అవుతుంది, చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతారు.

అయితే అందరిలో ఈ దశలన్నీ కనిపిస్తాయని చెప్పలేం. కాని మొదట నొప్పి ప్రభావం తెలియగానే వెంటనే నివారిస్తే నొప్పి తీవ్రత తగ్గుతుంది.
కండర, అస్థిపంజర గాయాలు కంటికి కనపడేవి కావు. బాధపడ్తున్న వారు చెప్తేగాని, రోజూ వారి పనులు చేయలేక పోతున్నారని గమనిస్తే గాని తెలియవు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే వృత్తిపరమైన రుగ్మతకు దారితీస్తుంది.

వృత్తిపరమైన రుగ్మతలు మూడు రకాలు

 1. కండరాల గాయం
 2. స్నాయువుల గాయం
 3. నరాల గాయం

కండరాల గాయం

ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని కండరాలు గాయపడవచ్చు. కండర శక్తిని మించి దానిపై వత్తిడి పడితే అవి చిరిగి, గాయపడతాయి. ఈ గాయాలను మూడు స్థాయిలుగా విభచించవచ్చు.
మొదటి స్థాయి: కండర బెణుకు- తక్కువ సంఖ్యలో అయినప్పటికి కండరాల పీచుకు హాని జరుగుతుంది
రెండవ స్థాయి: పాక్షికంగా విరగడం- 50% వరకు కండరానికి హాని జరుగుతుంది
మూడవ స్థాయి: పూర్తిగా విరిగిపోవడం- కండరానికి పూర్తిగా హాని జరుగుతుంది.

స్నాయువుల గాయం

కండరాల లాగానే స్నాయువుల గాయాలు కూడా మూడు స్థాయిలుగా విభజించవచ్చు
మొదటి స్థాయి: స్నాయువులలో వేడి జ్వలనం, నొప్పితో కూడిన వాపు ఉంటుంది
రెండవ స్థాయి: స్నాయువులు పాక్షికంగా విరిగి నొప్పిని కలిగిస్తాయి, బలహీనపడ్తాయి
మూడవ స్థాయి: స్నాయువులు పూర్తిగా విరిగి పోయి, వాటి విధులు ఆగిపోతాయి. నొప్పి ఉండవచ్చు, లేకపోవచ్చు.

నరాల గాయం

నరాల ప్రధాన విధి కీళ్ళను స్థిరపరచి, నిలువరించి, దృఢ పరచి, సమస్థితికి తీసుకొనిరావడం. ఇవి సాధారణం బాహ్య వత్తిడి వలన గాయపడ్తాయి.
మొదటి స్థాయి: నరాల బెణుకు- తక్కువ సంఖ్యలో అయినప్పటికి నరాల పీచుకు హాని జరుగుతుంది. వాపు ఉంటుంది, చాపినప్పుడు నొప్పిగా కూడా ఉంటుంది.
రెండవ స్థాయి: పాక్షికంగా విరగడం- 50% వరకు నరానికి హాని జరుగుతుంది. నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది, వాపుకూడా ఉంటుంది
మూడవ స్థాయి: పూర్తిగా విరిగిపోవడం- నరానికి పూర్తిగా హాని జరుగుతుంది. నొప్పి తక్కువగాఉండవచ్చు గాని, బాగా వాపు ఉంటుంది, విధులు పూర్తిగా ఆగిపోతాయి.

కండర, అస్థిపంజర రుగ్మతలకు కారణాలు

 • బాగా బరువైన వస్తువులను ఎత్తడం - ఉదాహరణకు బరువైన నీళ్ళ బకెట్ లు, గడ్డి మూటలు, కట్టెల మోపు మోయడం, నీళ్ళ బకెట్ ను క్రింద నుండి పైకి తీసుకెళ్ళడం, సంవత్సరం దాటిన పిల్లలను నేల మీద కూర్చుంటే ఎత్తడం లాంటివి.
 • అటువంటి భారమైన పనులను తరచుగా చేస్తూండటం
 • అసాధారణ భంగిమలో కూర్చొనో, నిలొచొనో, వంగొనో పని చేస్తూండటం - ఇటుకలు మోయడం, వంగొని టమోటాలు, వంకాయలు పొలంలో కొయ్యడం, మునివేళ్ళ మీద నిలబడి పైన అటకమీద వస్తువులు తియ్యడం, వంగొని వరినాట్లు వెయ్యడం, గడ్డి పీకడం మొదలైనవి.
 • సహజ భంగిమైనా ఒకే భంగిమలో గంటలకొద్దీ పని చేయడం - గంటలకొద్దీ నిలబడి పనిచేయడం.
 • భుజాలు, మెడ కదలకుండా ఒకే భంగిమలో ఉంచి పని చేస్తూండటం - టైపింగ్ చేయడం.
 • భుజాలు వంచి, చేతులు చాచి ఎక్కువసేపు పని చేయడం - పొలంలో మందు కొట్టడం, ఇంట్లో సున్నం కొట్టడం.
 • అధిక వేడి, అధిక చలిలో ఎక్కువసేపు పని చేయడం - ఎడారులలో, శీతల ప్రదేశాల్లో, శీతల గిడ్డంగులలోపనిచేయడం, ఎండలో మిర్చి కొయ్యడం, ఎండబెట్టడం
 • ముందుకు లేదా వెనక్కు వంగి, వంకరగా నిలబడి పని చేయడం
 • యంత్రాలతో పని చేస్తున్నప్పుడు అవి సరైన ఎత్తులో లేకపోవడం - ముఖ్యంగా చేనేత కార్మికులు, మగ్గం పనిచేసేవాళ్ళు, పూసలు గుచ్చేవాళ్ళు, వాచీలు రిపేరు చేసేవాళ్ళు సరైన ఎత్తులో కూర్చోరు.
 • కుదుపులకు, తీవ్ర కదిలకలకు తరచూ గురౌతున్నప్పుడు - ట్రక్ డ్రైవర్లు, కండక్టర్లు, భవన నిర్మాణ కార్మికులు గురవుతారు
 • పనిని చాలా వేగంగా, ఒకే రకమైన పనిని విరామమం లేకుండా చేస్తూండటం - ఫ్యాక్టరీ కార్మికులు, కంప్యూటరు వర్కర్లు దీనికి గురవుతారు.
 • పనిలో అసంతృప్తి, అధిక శ్రమ ఉండటం - పని వాతావరణం, యంత్రాలు సరిగా లేకున్నా అసంతృప్తికి గురవుతారు.
 • పొగ త్రాగడం, మద్యం, సోడా త్రాగడం వంటి కొన్ని అలవాట్లు. పొగ త్రాగేవారిలో ఎముకలకు రక్త సరఫరా తగ్గుతూ ఉంటుంది. దీని వలన ఎముకను నిర్మించే కణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఆహారం ద్వారా లభించే కాల్షియం అనే ఖనిజలవణం శోషణ తగ్గుతుంది, ఎముక నిర్మాణానికి అవసరమయ్యే హార్మోన్లు త్వరితంగా నశించిపోతాయి. వీటన్నిటి వలన కండరాలు, ఎముకలు, మృదులాస్థి, స్నాయువులు, కీళ్ళు, నరాలు, కణజాలాలు దెబ్బతింటాయి. ఆదే విధంగా మద్యం, సోడా ఎక్కువగా తాగే వారిలో కూడా కాల్షియం శోషణ తగ్గి ఎముకల బోలుతనం ఏర్పడుతుంది.
 • తీసుకుంటున్న ఆహారంలో కాల్షియం, డి విటమిన్ లోపిస్తే ఎముకలు పెళుసుతనం , బోలుతనం ఏర్పడి ఎముకలు బలహీనమౌతాయి.
 • వయస్సు, లింగభేధం, వంశపారంపర్యం, శరీర బరువు- ఎత్తు, ఆటలు ఆడేప్పుడో, పనులు చేస్తున్నప్పుడు గతంలో తగిలిన గాయాలు, వయస్సు పెరిగే కొద్ది కీళ్ళు నీలుక్కుపోవడం, కండరాలలో బలం తగ్గడం మొదలైన వ్యక్తిగత కారణాల వలన కూడా రుగ్మతలకు గురౌతారు.
 • మానసికమైన కారణాలవలన కండరాలమీద ఒత్తిడి పెరగడం, అధికరక్త పోటు, అశాంతి, నిరాశా నిస్పృహలు కూడా రుగ్మతలకు దారితీస్తాయి.
 • ఒక్కోసారి సమాజం నుండి సాయం తక్కువైనా కూడా తీవ్ర అసంతృప్తి రుగ్మతలకు దారితీస్తుంది.
 • శరీరానికి సరిపడా వ్యాయామం లేకపోవడం కూడా కారణమే!

కండర, అస్థిపంజర రుగ్మతలను ఎదుర్కోవడం

 • లక్షణాలు గమనించిన వెంటనే పరిష్కార చర్యలను మొదలు పెట్టాలి.
 • శరీర సాంద్రతను (BMI) బట్టి, బరువును నియంత్రించుకోవాలి. 20-25 మధ్యలో ఉంటే అది ఆదర్శ BMI
 • వ్యాయామం ద్వారా శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలి.
 • పొగ, మద్యం త్రాగే అలవాట్లను మానుకోవాలి.
 • వైద్య సలహాల మేరకు మందులు తీసుకోవాలి, ఫిజియో తెరపీ పాటించాలి.
 • కాల్షియం, డి విటమిన్ సమృద్ధిగాగల ఆహారం తీసుకోవాలి. కాల్షియం కోసం పాలు, పాల పదార్థాలు, ఆకుకూరలు, డి విటమిన్ కోసం చేపలు తీసుకోవాలి. ఎండలో నడవడం వలన కూడా డి విటమిన్ లభిస్తుంది.
 • పనిచేసప్పుడు సరైన భంగిమను పాటించడం అలవాటు చేసుకోవాలి.
 • చిన్న చిన్న విరామాలు తీసుంటూ, భంగిమలను మార్చుకుంటూ పనిచేస్తూండాలి. ప్రతి అరగంట కొకసారి మార్చుకుంటే మంచిదని పరిశోధనలు చెప్తున్నాయి .

కండర, అస్థిపంజర రుగ్మతల విపత్తు ఉందా?- తెలుసుకోవడం

విపత్తు అంశాలురుగ్మత
ఏభై ఏళ్ళు పైన వయస్సు, ఊబకాయులు , గతంలో కీళ్ళ సంబంధిత అనారోగ్యం కలిగిన వారు, తీవ్రంగా శ్రమించవలిసిన వృత్తిలో ఉన్నవారికి ఎముకల, కీళ్ళ బాధ (Osteoarthritis)
కీళ్ళ నొప్పులతో బాధపడిన సంధర్భాలున్నట్లైతే వారికి కీళ్ళవాతం
విడవకుండా లేదా తరచూ వెన్నెముక నొప్పి వారికి వెన్నునొప్పి
రవైఐదు ఏళ్ళు పైన వయస్సు కలిగి, పునరుత్పత్తి హార్మోన్లకు సంబంధించిన (మగవారిలో కాని, ఆడవారిలోకాని) సమస్యలున్నవారికి, గతంలో ఏదైనా ఫ్రాక్చర్ అయినవారికి, ముఖ్యంగా గర్భవతిగానో, బాలింతగానో ఉన్నప్పుడు తుంటి ఎముక ఫ్రాక్చరై ఉన్నవారికి,స్టిరాయిడ్ల చికిత్స తీసుకొన్నవారికి తక్కువ బరువు కలవారికి, పొగ, మద్యం తాగే అలవాటు ఉన్నవారికి బోలుఎముకలు
ట్రాఫిక్, ఇంకా అటువంటి ఇతర వృత్తులు నిర్వహించే వారికి, ఎక్కువ తీరుబాటుగా ఉండేవారికి ప్రధాన కండర, అస్థిపంజర రుగ్మతలు
తరచూ మొరటు పనులు చేసేవారికి, అదరుపాటుకు లోనయ్యేవారికి, దీర్ఘకాలం బరువు పనులు చేసే వారికి, మానసిక వత్తిడికి గురయ్యేవారికి వృత్తి సంబంధిత కండర, అస్థిపంజర ప్రమాదాలు

డకు అవసరమైన శరీరాకృతి లేనప్పటికి, శరీరం సహకరించనప్పటీకి కూడా అవే క్రీడలు ఆడేవారికి ఈ రుగ్మత రావచ్చు.

వీరికి ఇంకో ప్రమాదం ఏమిటంటే, ఏదైనా నొప్పికి చికిత్స తీసుకొనే పునరావాస సమయంలో వీరికి మరికొన్ని కొత్త గాయాలు కావచ్చు, ప్రమాదాలు జరగవచ్చు.

క్రీడా పరమైన ప్రమాదాలు.

నివారణ

కండర, అస్థిపంజర ప్రమాదాలు స్థూలంగా మూడు ముఖ్య కారణాల వలన సంభవిస్తాయి.

 1. పని చేసేప్పుడు సరైన భంగిమలో ఉండి పని చేకపోవడం
 2. శరీరం మీద ఎక్కువ వత్తిడిని పెట్టడం
 3. బరువైన పనులను ఎక్కువగా చేయడం

కండర, అస్థిపంజర ప్రమాదాలు ఒక్కసారిగా రావు. ముందుగా శరీరం ఎన్నో సంకేతాలను, హెచ్చరికలను పంపిస్తూంటుంది. వాటిని క్కచేయకపోతేనే తీవ్రపరిణామాలు చోటుచేసుకుంటాయి. ఉదాహరణకు మనం వేసుకోవలసిన సైజు కంటే చిన్న చెప్పులు వేసుకుని ఎన్ని రోజులు నడవగలం. ఒక వేళ నడిచినా కాళ్ళు పుండ్లు పడతాయి, నొప్పులు వస్తాయి. ఇవన్ని సంకేతాలు, చెప్పులు చాలా అసౌకర్యంగా ఉన్నాయనే హెచ్చరికలు. అలాగే  కండర, అస్థిపంజర ప్రమాదాల విషయంలో కూడా  ఉంటుంది.

ఉద్యోగమైనా, ఇంట్లో పనులైనా, పనిని చేసేప్పుడు సరైన పద్ధతిలో చేయడం ముఖ్యం.

 • ఏ భంగిమలో, ఎంత ఎత్తులో చేయాలో దానిని బట్టి పనిచేయాలి. తరచూ వాడే వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలి. ఒకే వస్తువు కోసం ప్రతిసారి అటూ ఇటూ తిరగడం కూడా ఒత్తిడిని కలిగిస్తుంది.
 • వెన్ను భాగం నిటారుగా ఉండే విధంగా పని చేయాలి. ఆ ప్రకారం మనం పని చేసే స్థలాన్ని మలచుకోవాలి.  తరచూ వెన్నెముకను వంచడం, మెలితిప్పడం  ప్రమాదాలకు దారి తీస్తుంది.
బరువైన వస్తువులను ఎత్త వలసి వచ్చినప్పుడు చేతులతో కాకుండా యంత్రాలతో ఎత్తడం మంచిది. అందువలన ప్రమాదాలను అరికట్టవచ్చు.
 • పనిముట్లు ఉపయోగిస్తున్నప్పుడు, వాటి వలన ఎక్కువ అదురు లేకుండా చూసుకోవాలి.
 • పనిముట్లు ఉండవలసినంత పదును కలిగి ఉండేట్లుగా చూసుకోవాలి. లేకుంటే వాటితో చాలా బలంగా పనిచేయవలసి వస్తుంది.
 • వాటిని వాడేప్పుడు చేయి, మణికట్టు భంగిమ పట్ల చాలా జాగ్రత్త వహించాలి. భంగిమ పనిచేస్తున్న ఉపరితలానికి సమాతరంగా  ఉండాలి
చేతుల స్థానం మోకాళ్ళకు క్రింద, మోచేయి భుజాలకంటే ఎత్తులో ఉండడం వత్తిడిని కలిగిస్తాయి.   చేతులు మోకాళ్ళకంటే ఎత్తులో, మోచేతులు భుజాల ఎత్తుకు దిగువలో ఉండేట్లుగా చూడాలి
తరచు మెడ వంచి, మెలి తిప్పి  చేయడం  వత్తిడిని కలిగిస్తుంది. ఆ భంగిమను పూర్తిగా మానేయ్యడం మంచిది.
 • నిలబడి పని చేస్తుంటే అర్థగంట కంటే ఎక్కువ సేపు నిలబడితే శరీర భారమంతా కాళ్ళ మీద పడుతుంది. ముఖ్యంగా లావుగా ఉన్నవారికి కాళ్ళ వాపులు త్వరగ వస్తాయి. ప్రతి అరగంటకి ఒక సారి భంగిమను మార్చుకోవడం మంచిది.
 • నిలబడి పని చేస్తున్నప్పుడు రెండు కాళ్ళ మధ్య దూరం రెండు భుజాల మధ్య ఉన్నంత ఉండాలి. ఆ విధంగా ఉండటం వలన మోకాళ్ళు, అరికాళ్ళ నొప్పులు రావు.
 • నేలమీద కూర్చుని పని చేస్తున్నప్పుడు కాళ్ళుమడిచి మోకాళ్ళు నేలకు అనుకుని ఉండేట్లుగా కూర్చోవాలి. వెన్నెముక ఎప్పుడు నిటారుగా ఉండాలి..

ఆధారం:

 1. డాక్టర్. పి. అమల కుమారి, ప్రొఫెసర్, విస్తరణ మరియు ప్రసార నిర్వహణ విభాగం.
 2. డాక్టర్. వి. విజయలక్ష్మి, అసిస్టెంట్ ప్రొఫెసర్, వనరుల నిర్వహణ మరియు వినియోగదారుల శాస్త్ర విభాగము.


© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate