অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

గర్భవతుల సంరక్షణ

వైద్య సంరక్షణ

ఒక స్త్రీ తాను గర్భవతిని అని తెలియగానే ఆరోగ్యకర్యకర్తకి సమాచారం ఇచ్చి తన పేరు నమోదు చేయించుకోవటం వలన గర్భాధారణ తొలిదశలో ఎదురయ్యే సమస్యలను వెంటనే గుర్తించవచ్చు . మొత్తం గర్భధారణ కాలంలో ఆమెకు పూర్తి ఆరోగ్య సంరక్షణ అందుతుంది . సుఖ ప్రసవం సాధ్యమవుతుంది. తల్లీబిడ్డలకి ఆరోగ్యభద్రత చేకూరుతుంది .

గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువ మోతాదులో నీరు తాగడం వలన ఊపిరితిత్తుల, మూత్రపిండాల విధులు సక్రమంగా ఉంటాయి. శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు, నడవడం వంటివి చేయడం వలన రక్తప్రసరణ సజావుగా వుంటుంది, సుఖప్రసవానికి శరీరం సిద్దపడుతుంది
 • మత్తు పదార్థాలు, పొగాకు వాడే స్త్రీలకు అంగవైకల్యం, బరువు తక్కువ, బుద్ధిమాంద్యంతో బిడ్డలు పుట్టవచ్చు. మత్తు పదార్థాలు, పొగాకు పూర్తిగా మానెయ్యాలి .
 • గర్భిణిగా ఉన్నప్పుడు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం 12.5 మిల్లి గ్రాముల కంటే తక్కువగా వుంటే వైద్యుడు సలహా మేరకు ఐరన్,ఫోలిక్ మాత్రలు వేసుకుంటే రక్తహీనత నుండి కాపాడుకోవచ్చు. రక్తహీనత నివారణకి ఇనుము ఎక్కువ గల బెల్లము,ఎండుచేపలు ,ఆకుకూరలు, రాగులు వంటి వాటితో తయారుచేసే వంటకాలు, ఎండుద్రాక్ష, కర్జురం ,అంజూర0 వంటి పండ్లను తీసుకోవాలి.
 • పుట్టబోయే బిడ్డకు హెచ్.ఐ.వి రాకుండా నివారించాలంటే గర్భవతిగా వున్నపుడు ఐ.సి.టి.సి సెంటర్ కి వెళ్లి హెచ్.ఐ.వి పరీక్ష చేయించుకోవాలి .
 • గర్భవతిగా ఉన్నప్పుడు రక్తహీనత రావడం వలన నీరసం వస్తుంది తలనొప్పి , పెదాలు, నాలుక, కళ్ళు, పాలిపోవడం, గుంతగోళ్ళు ముఖ్య లక్షణాలు. గర్భవతులు సకాలంలో స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
 • గర్భిణి స్త్రీలకు రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వలన కాళ్ళల్లో నొప్పులు రావడం,కాళ్ళు కొంకర్లు పోవడం జరుగుతుంది అలాంటప్పుడు కాళ్ళు తిన్నగా పెట్టడం లేదా కాలి బొటన వ్రేలిని వంచడం వంటివి చేయడం వలన రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది .
 • సుఖప్రసవం,ఆరోగ్యవంతమయిన శిశువు జననము,ప్రసవానంతరం సంరక్షణ, కేవలం ఆసుపత్రి ప్రసవం వలనే సాధ్యము. కనుక గర్భవతి తన పేరుని ఆరోగ్యకార్యకర్త వద్ద నమోదు చేసుకోవాలి . ప్రతీ గర్భిణి 7వ నెల వరకు ప్రతీ నెల, తరువాత 9 నెలల వరకు ప్రతీ 15 రోజులకు, ఆపయిన కాన్పు అయ్యే వరకు ప్రతీ వారము, వైధ్య పరీక్ష చేయించుకోవాలి
 • గర్భవతిగా ఉన్నపుడు మధుమేహం రావచ్చు.అందువలన బిడ్డకు కామెర్లు,పుట్టుకతో లోపాలు వంటి అనారోగ్యాలు వస్తాయి. కావున గర్భవతి ఎప్పటికప్పుడు చక్కెర పరీక్ష చేసుకోవాలి .
 • గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువ బరువు మోయకూడదు అలా మోయడం వల్ల కొన్ని సమస్యలు, ప్రమాదాలు రావచ్చు.
 • గర్భాధారణ సమయంలో కనీసం నాలుగు సార్లు ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోవాలి. గర్భాధారణ సమయంలో ఆసుపత్రికి వెళ్లినపుడల్లా బరువు, రక్తపోటు పరీక్ష చేయించాలి. శిక్షణపొందిన ఆరోగ్యకార్యకర్త నుండే మందులు తీసుకోవాలి.
 • పుట్టబోయే బిడ్డకి ధనుర్వాతం రాకుండా గర్భవతులు 2 టి టి టీకాలు తీసుకోవాలి. రక్తహీనత రాకుండా ఉండటానికి ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవాలి. అవి తల్లీబిడ్డల్ని బలంగా ఉంచుతాయి . ఫోలిక్ యాసిడ్ పుట్టుకతో వచ్చే లోపాలనుండి రక్షణ కల్పిస్తుంది .
 • గర్భధారణ సమయంలో సాధారణ పనులు చేసుకోవచ్చు. అయితే ఎక్కువ బరువెత్తడం, ఎక్కువ శారీరక శ్రమ కలిగించే పనులు చేయకూడదు. పని చేస్తున్నప్పుడు అలసట వస్తే, ఆ పనిని అప్పటికి ఆపు చేయాలి. గర్భవతులుగా తగినంత విశ్రాంతి తీసుకోవాలి. మధ్యాహ్నం కనీసం రెండు గంటలు పక్కకు తిరిగి పడుకోవాలి. రాత్రి కనీసం 8 గంటలు నిద్రపోవాలి. ఈ విషయంలో కుటుంబ సభ్యులు సహకరించాలి.
 • గర్భవతులకు ప్రసవ సమయంలో ధనుర్వాతం రావచ్చు. ఇదిప్రాణం తీసే వ్యాధి. టెటనస్‌ టాక్సాయిడ్‌ (టిటి) ఇంజక్షన్‌ను వేయించుకోవాలి. మీరు మొదట ఆరోగ్య కార్యకర్తను కానీ, డాక్టరును కానీ కలిసినప్పుడు మొదట మోతాదు వేయించుకోండి. ఆ తర్వాత ఒక నెలకు రెండవ మోతాదు వేయించుకోవాలి. ఎటొచ్చీ టెటనస్‌ టాక్సాయిడ్‌ తీసుకోవడం ప్రసవానికి ఒక నెల ముందు లోపల జరిగిపోవాలి. ఈ ఇంజక్షన్ తీసుకొనడం వలన ప్రసవ సమయంలో తల్లికి, తరువాత నవజాత శిశువుకు ధనుర్వాతం రాదు.
 • గర్భిణులకు మలేరియా వ్యాధి ప్రమాదకరం. దోమలు కుట్టకుండా అన్ని నిరోధక చర్యలు చేపట్టాలి. దోమ తెరలు వాడితే ఎంతో మంచిది. పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకుని ఆహార పానీయాల ద్వారా వచ్చే సూక్ష్మజీవుల నుండి రక్షణ పొందండి.
 • గర్భిణులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఎంతో మంచిది. రోజూ క్రమం తప్పకుండా స్నానం చేయాలి. స్తనాలను, మర్మాంగాలను పరిశుభ్రమైన నీటితో తరచుగా శుభ్రం చేసుకోవాలి.
 • గర్భధారణ సమయంలో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు ఇచ్చే మందులు తప్ప మరే ఇతర మందులు వాడకూడదు. అయితే, మీ సమస్యలను పూర్తిగా చర్చించిన తరువాత మందులు వాడాలి. వీలైనంత వరకు గర్భిణులు ఎక్స్‌రేలు తీయించుకోకూడదు.
 • గుర్రపు వాతం గర్భిణిగా ఉన్నపుడు, ప్రసవ సమయంలో, బాలింతగా ఉన్నపుడు రావచ్చును.దీనిని నివారించడానికి సక్రమంగా రక్తపోటుపరీక్ష చేయించుకోవాలి. అవసరమైత ఎడల మూత్రపరీక్ష, రక్త పరీక్ష చేయించుకోవాలి. రక్తపోటు తగ్గించే మాత్రలు మొదలైనవి డాక్టర్ సలహా మీద వాడాలి.

ఆహారసంరక్షణ

 • గర్భవతిగా ఉన్నప్పుడు రెట్టింపు మోతాదులో ఆహారం తీసుకోవడం వలన తల్లీ బిడ్డల పోషకావసరాలు తీరి ఆరోగ్యవంతులుగా వుంటారు.తల్లిలో పౌష్టికాహర లోపం వుంటే పిల్లలు మరణించవచ్చు.
 • కడుపులో బిడ్డ పెరుగుదల సక్రమంగా వుండాలంటే మమూలు కన్నా అధికంగా మాంసకృత్తులు కలిగిన పప్పులు, పాలు, గ్రుడ్లు ,సోయా వంటి ఆహారాలు చేర్చుకోవాలి.
 • గర్భధారణ సమయంలో రక్తహీనత ప్రధాన సమస్య. ఈ సమయంలో రోజూ ఒక ఐరన్‌ మరియు ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు వేసుకోవాలి. అలా నూరు రోజులు తీసుకుంటే రక్తహీనతను నిరోధించొచ్చు. ఈ మాత్రలు ఆరోగ్య కార్యకర్తల నుంచి లభిస్తాయి. మీకు ఇప్పటికే రక్తహీనత ఉందని నిర్ధారణ జరిగనట్లయితే రోజూ రెండు మాత్రలు నూరు రోజులు వేసుకోవాలి.
ఐరన్, ఫోలిక్ మాత్రలు తీసుకోవల్సిన విధానం-భోజనానికి మద్యలో ఐరన్, ఫోలిక్ మాత్రలు తీసుకుంటే బాగా పని చేస్తాయి. మామిడి, నారింజ, నిమ్మ, జామ, బొప్పాయి, టమాట, మిరియాలు వంటి ఆహారంతో ఐరన్ ఫోలిక్ మాత్రలు తీసుకుంటే బాగా పనిచేస్తాయి .
గర్భవతులు అయోడైస్డ్ ఉప్పునే వాడాలి. అందువల్ల తల్లీబిడ్డలకు అయోడిన్ లోపం వలన సంభవించే థైరాయిడ్ సమస్యలనుండి రక్షణ కలుగుతుంది .
 • ఉదయం అల్పాహారంలోను, రాత్రి పడుకునే ముందు పండ్లను తినడం వలన శరీరానికి కావలసిన విటమిన్స్, ఖనిజలవణాలు లభ్యమవుతాయి అందువలన శారీరకంగా, మానసికంగా హాయిగా ఉంటుంది.
దానిమ్మ పండు తినడం రక్తకణాల వృద్దికి తోడ్పడుతుంది. రోగనిరోధకశక్తిని మరింత వృద్ది చేస్తుంది అనారోగ్యాలకు దూరంగా ఉంచుతుంది. ప్రతిరోజూ ఆపిల్ తినడం వలన కొలెస్ట్రాల్, చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా వుంటాయి .
గర్భిణి పాలు,పెరుగు వంటి పదార్ధాలు తినడం వలన, కడుపులో బిడ్డకు కాల్షియం అంది బిడ్డ పెరుగుదల, ఎముకలు అబివృద్ది బాగుంటుంది.
జామపండు తినడం వలన విటమిన్ సి దొరుకుతుంది అందువలన విటమిన్ సి సంబంధిత వ్యాధులు రాకుండా జాగ్రత్తపడవచ్చు.

ఆధారం:

డాక్టర్.ఎస్.శారద, ప్రొఫెసర్, ఉస్మానియా ఆసుపత్రి
కుమారి. జె.సుష్మ, విద్యార్ధి, ఐ.డి.నెం.హెచ్.హెచ్.2010/093.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate