హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / తల్లిపాల కోసం కొన్ని జాగ్రత్తలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

తల్లిపాల కోసం కొన్ని జాగ్రత్తలు

తల్లిపాల కోసం కొన్ని జాగ్రత్తలు

పరిచయం

బిడ్డను నవమాసాలు మోసినప్పటికన్నా, తల్లి ప్రయాణం ఆ పసికందు భూమిమీద పడినప్పుడు మొదలవుతుంది. చక్కటి పాపాయికి జన్మనిచ్చానన్న సంతోషం ఒకవైపు ఉంటే, బిడ్డను ఆరోగ్యవంతంగా పెంచగలనా అన్న ఆందోళన మరోవైపు ఉంటుంది.  గ్రాంట్లీ డికరేట్ అనే శాస్త్రవేత్త ప్రకారం  నవజాత శిశువుకు మూడే కోరికలుంటాయి-  అమ్మ కౌగిలిలోని వెచ్చదనం, అమ్మపాలలోని కమ్మదనం, నేను అమ్మ దగ్గరే ఉన్నాననే భద్రతా భావం నిత్యం అనుభవించాలని. తల్లి తన పాలు బిడ్డకు ఇవ్వటం ద్వార వీటిని తీర్చగలుగుతుంది. తల్లిపాలు ప్రకృతి ప్రసాదం,  దివ్యౌషధం.

 

తల్లి పాలు తల్లీ, బిడ్డల యొక్క శారీరక, మానసిక ఆరోగ్యానికి తోడ్పడతాయన్న విషయం అందరికీ సుపరిచితమే. పాపాయి రోగనిరోధక శక్తిని పెంచి, శరీర ఎదుగుదలకు కావలసిన పోషకాలను అందించటమే కాక బిడ్డకు తల్లిపట్ల నమ్మకాన్ని ప్రేమని పెంచుతుంది. తల్లిని రొమ్ము క్యాన్సర్ల బారినుండి కాపాడి, బిడ్డకు తనే పాలివ్వగలుగుతున్నాననే మానసిక ఆనందాన్ని సొంతం చేస్తుంది.

తల్లిపాల తయారీ గర్భవతిగా ఉన్నప్పుడే మొదలవుతుంది. కడుపులో పెరిగే బిడ్డ చుట్టూ రక్షణ పొరలా ఉండే మాయ, శరీరంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఈ హార్మోన్లు రొమ్ములోని పాల గ్రంధుల సంఖ్యను పెంచుతాయి. పాల గ్రంధులు ద్రాక్ష గుత్తుల్లాంటి ఆల్వియోలై లోకి తెరుచుకుంటాయి. బిడ్డ పుట్టిన తరువాత  మాయ మొత్తం శరీరంలోంచి బయటకు రావటం వలన ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్లు పనిచేయటం తగ్గిపోయి పిట్యుటరీ గ్రంధి లో ప్రొలాక్టిన్ హార్మోన్ ని ఉత్తేజపరుస్తుంది. ప్రొలాక్టిన్ హార్మోన్ విడుదలవ్వటం వల్ల రొమ్ములోని ఆల్వియోలై, రక్తసరఫరా నుండి పిండిపదార్థాలు, క్రొవ్వు పదార్థాలు, చక్కెరలు తీసుకుని పాలని ఉత్పత్తి చేస్తుంది.

అందుకని తల్లి ఆహారంలో అన్ని పోషక పదార్థాలుండటం చాలా అవసరం.

గర్భంతో ఉన్నప్పటికంటే  పాలిచ్చేటప్పుడు తల్లి 500 కేలరీల ఆహారాన్ని అధికంగా తీసుకోవలసిన అవసరం ఉంది. ఈ అదనపు కేలరీలు అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, తాజా  పండ్లు, ఎండు పండ్లు తినడం ద్వారా శరీరానికి అందిస్తే, తల్లికీ, బిడ్డకీ ఎంతో ఆరోగ్యకరం.

చాలామంది తల్లులు బిడ్డకు అజీర్తి చేస్తుందనో లేదా సుస్తి చేస్తుందనో తమ ఆహారాన్ని కొన్ని కూరగాయలు, పండ్ల వరకే పరిమితం చేసుకుంటారు. కన్నేస్మిత్ అనే పరిశోధకురాలు 25 సంవత్సరాలు పాలిచ్చే తల్లులతో పనిచేసిన తరువాత తన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ప్రతీ 100 మంది పిల్లల్లో కేవలం 3 నుండి 7గురిలో మాత్రమే తల్లి ఆహారపుటలవాట్లు బిడ్డ మీద ప్రభావం చూపాయి అదీ చాలా తక్కువ స్థాయిలో. అందుకని ఆవిడ పాలిచ్చే తల్లులను అన్ని రకాల ఆహారాలను తినమని సూచిస్తున్నారు. దీనివల్ల ఇంకొక లాభం ఏంటంటే ఆరు నెలల తరువాత పిల్లలు ఘన ఆహారాలకు తొందరగా అలవాటు పడతారంట. తల్లిపాల ద్వారా తల్లి ఆహారంలో తీసుకున్న అన్ని రకాల రుచులు వాళ్ళ నాలుకకు ముందే తెలియడమే దీనికి కారణం.

పాలిచ్చే తల్లి  తప్పకుండా తీసుకోవలసిన ఆహారం

నీరు: పాలిచ్చే సమయంలో మన శరీరంలోని నీటి శాతం తగ్గిపోతుంది.  మన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవటం కోసం ఎక్కువ నీరు తాగడం ఎంతో అవసరం.
ఆకుకూరలు: అన్ని ఆకుకూరలు మంచివే. కాని ముఖ్యమైనవి పాలకూర, తోటకూర. వీటిలో ఉండే ఫైటో ఈస్ట్రోజెన్ అనే పదార్థం రొమ్ము ఆరోగ్యాన్ని మెరుగుపరచి పాల ఉత్పత్తిని పెంచుతుంది
క్యారెట్: వీటిలో ఫైటో ఈస్ట్రోజన్ తో పాటు నాణ్యమైన పాలు ఉత్పత్తికి అవసరమైన విటమిన్ ఎ, బీటా కెరోటిన్ ఉంటాయి

చిక్కుళ్ళు:

చిక్కుళ్ళ జాతికి చెందిన కందిపప్పు, గోరుచిక్కుడు, బఠాణీలు, చిక్కుడు కాయలు తల్లి శరీరానికి అవసరమైన పిండిపదార్థాలను అందిస్తుంది. శనగలు నానబెట్టి, ఉడకబెట్టి గుగ్గిళ్ళలాగా కొద్దిగా ఉప్పు, నిమ్మరసం, వెల్లుల్లి తాళింపు వేసుకుని తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
బొప్పాయి పండు: తల్లికి పాలు బాగా పడాలంటే పండు బొప్పాయి కంటే పచ్చి బొప్పాయి ఎంతో తోడ్పడుతుంది. తురుముకుని కూర చేసుకున్నా, పాలు, చక్కెర వేసుకుని హల్వా చేసుకున్నా మంచిదే.
దంపుడు బియ్యం దంపుడు బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్ల వల్ల తల్లికి ఎక్కువ శక్తిని అందించటమే కాకుండా పాల ఉత్పత్తిలో సహాయపడే ప్రొలాక్టిన్ హార్మోన్ ని విడుదల చేయటంలో కూడా తోడ్పడుతుంది.
డ్రై ఫ్రూట్స్ కుబానీలు, ఖర్జూరాలు, అంజూరపండ్లలో ఎక్కువగా ఉండే కాల్షియం పాల ఉత్పత్తికి దోహదపడుతుంది.
చేపలు చేపలలో ఉండే ఒమేగా-3-ఫాటీ యాసిడ్స్ మరియు ఎసెన్షియల్ ఫాటీ యాసిడ్స్ పాలల్లో మంచి కొవ్వును పెంచి ఇంకా ఆరోగ్యవంతమైన పాల తయారీలో సహాయపడతాయి.

ఆధారం: శ్రీమతి. పర్జన్య కర్నాటి, ఫార్మసిస్ట్.

3.01075268817
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు