హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / బాలింతల సంరక్షణ మరియు కుటుంబ నియంత్రణ చర్యలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

బాలింతల సంరక్షణ మరియు కుటుంబ నియంత్రణ చర్యలు

బాలింతల సంరక్షణ

వైద్య సంరక్షణ

 • ప్రసవం తప్పనిసరిగా ఆసుపత్రిలోనే జరిగేలా చూడాలి. తల్లికి ఉమ్మనీరు బయటకు వచ్చిన 12 గంటలలోపు నొప్పులు రాకపోయినా, రెండు చారెళ్ళకు మించి రక్తం పోయిన, వెంటనే వైద్యుని సంప్రదించాలి .
 • ప్రసవించిన అనంతరం మొదటివారంలోను,ఆరవ వారంలోనూ తల్లీ బిడ్డలిద్దరు వైద్య పరీక్షలు చేయించుకోవడం వలన బిడ్డ పెరుగుదలకి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యమవుతుంది.
 • బాలింతలో అధిక రక్తస్రావం, బాలింత జ్వరం రాకుండా చూడాలి. లేకపోతే వీటి వలన మాతృమరణాలు సంభవించే అవకాశం వుంది.
 • ప్రసవం తర్వాత 2-3 రోజుల వరకు సరిగ్గా తినకపోవడం, నీరు తాగకపోవడం వలన మలబద్దకం వస్తుంది .
 • ప్రసవం అయిన అరగంట లోపు వచ్చేపాలు ముర్రుపాలు, ఎంతో విలువైనవి వీటిని వృదా చేయకూడదు వీటిని బిడ్డకు తాగించడం వలన బిడ్డలో రోగనిరోధక శక్తి పెంపొందించవచ్చు .
 • ప్రసవించిన వారంలోపు, ఒకటిన్నర నెల తరువాత మరోసారి తల్లీబిడ్డలిద్దరు పరీక్ష చేయించుకోవాలి. పూర్తిగా శక్తి వచ్చిన తరువాతనే ఆమె అన్ని పనులు చేయవచ్చు. అప్పటివరకు భర్త, ఇతర కుటుంబ సభ్యుల పూర్తీ సహకారం ఉండాలి .

ప్రసవం తర్వాత మహిళల్లో వచ్చే ఆరోగ్య సమస్యలు, నివారణొపాయలు

నొప్పులు: కాన్పు తర్వాత కొందరిలో వెన్ను, తొడలు, పిరుదుల్లో నొప్పులు ఎక్కువగా ఉండవచ్చు. గర్భాశయం బరువు వెన్నుపూసపై పడటం వలన, కండరాల పటుత్వం తగ్గి వెన్నునొప్పి ఉంటుంది. కొన్నిసార్లు కాన్పుకి ఎక్కువ సమయం పట్టినా, లేదా కాన్పు కష్టమై పరికరాల (ఫోర్సెప్) సహాయంతో కాన్పు జరిపినప్పుడు, వెన్నుపూస కింది భాగంలోని నరాలపై ఒత్తిడి పడి కాళ్ళు కదపలేకపోవడం, స్పర్శ తగ్గడం జరగవచ్చు. అయితే ఫిజియోథెరపీతో దీన్ని అధిగమించవచ్చు.

మూత్రసమస్యలు: కొన్నిసార్లు కాన్పు తర్వాత మూత్రాశయానికి చేరే నరాలు ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల మూత్రం పూర్తిగా ఖాళీ చేయలేకపోవడం వలన మూత్రాశయ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాన్పు తర్వాత నొప్పి వల్ల కూడా మూత్రం పూర్తిగా విసర్జించలేకపోవచ్చు. తగినంత నీరు తాగకపోవడం వలన, జననాంగాల నుండి మూత్రవ్యవస్థకు ఇన్ఫెక్షన్ సోకవచ్చు. కొంతమందిలో కొన్ని రోజులపాటు మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోవచ్చు. దీనికి ప్రత్యేకించి పెల్విక్‌ఫ్లోర్ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.
మలబద్దకం: కాన్పు తర్వాత 2-3 రోజుల వరకు కొంతమందిలో విరేచనం సాఫీగా అయినా,నీరు తాగకపోవడం, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల చేత కొంతమందిలో మలబద్దకం వస్తుంది.
ఇన్ఫెక్షన్లు: సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు పొట్ట మీద వేసే కుట్లలో చీము పట్టకుండా జాగ్రత్త పడాలి లేకపొతే మలేరియా, టైఫాయిడ్, నిమోనియా వంటి ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది. ఈ ఇన్ఫెక్షన్స్‌ని అశ్రద్ధ చేస్తే అవి రక్తం ద్వారా శరీరమంతటా ప్రాకి ప్రాణాపాయానికి దారితీసే ప్రమాదం ఉంది.
పిత్తాశయంలో రాళ్ళు: గర్భధారణ సమయంలో, ప్రొజెస్టెరాన్ హార్మోన్ పెద్ద మొత్తంలో స్రవిస్తుంది. ఈ హార్మోన్ పిత్త రస స్రావ0 ఊరటాన్ని అడ్డుకుంటుంది. పైత్య రసాల లోపం వల్ల గాల్ బ్లాడర్ లో రాళ్ళు ఏర్పడటానికి దారితీస్తుంది. అందువల్లే గర్భధారణ సమయంలో మరియు ప్రసవం తర్వాత పిత్తాశయ రాళ్ళును ఏర్పడటం చాలా సాధారణం.
రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం: గర్భవతికి కాన్పు తర్వాత జరిగే రక్తస్రావాన్ని అరికట్టడం కోసం, రక్తం గడ్డకట్టడానికి అవసరమైన పదార్థాలు ఎక్కువగా తయారయ్యేలా శరీరం రూపొందించబడింది. కాని కొందరిలో, అంటే బరువు ఎక్కువగా ఉన్నవారు, అధిక రక్తపోటు ఉన్నవారు, ఎక్కువ వయసు ఉన్నవారిలో, కాన్పు తర్వాత వారం నుంచి పది రోజుల వరకు ఈ పదార్థాల వల్ల రక్తం గడ్డకట్టి, ఆ గడ్డలు వేరే రక్తనాళాల్లోకి పాకి రక్తప్రసరణకు ఆటంకం కలిగించే ప్రమాదం ఉంది. కొందరిలో రక్తం గడ్డలు ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళాల్లోకి చేరి, రక్తప్రసరణకు ఆటంకం కలిగించడం ద్వారా అకస్మాత్తుగా ఊపిరి అందక ప్రాణాపాయం కలిగే అవకాశం కూడా ఉంటుంది. కాన్పు తర్వాత ఎక్కువ సేపు కదలకుండా పడుకుని ఉండేవారిలో ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. కనుక కాన్పు తర్వాత తగిన శారీరక వ్యాయామం.
మానసిక సమస్యలు: కొంతమంది బాలింతల్లో కాన్పు తర్వాత 3-5 రోజుల తర్వాత డిప్రెషన్ వస్తుంది. రక్తహీనత, బిడ్డ పెంపకం బాధ్యతల గురించిన భయం, ఆందోళన, నిద్రలేమి, కొన్ని హార్మోన్లలో మార్పులు, కుటుంబకలహాల వంటి ఎన్నో కారణాల వల్ల ఇది రావచ్చు. కొంతమందిలో కుటుంబసభ్యుల సహకారం వల్ల 2-3 రోజుల్లోనే కొందిరిలో పరిస్థితి చక్కబడుతుంది. కొంతమందిలో మాత్రం పరిస్థితి తీవ్రమై సైకోసిస్ స్థితిలోకి వెళ్తారు. దీనికి చికిత్స అవసరం.
తీవ్రమైన రక్తస్రావం: కాన్పు తర్వాత సాధారణంగా 200 ఎం.ఎల్. నుంచి 500 ఎం.ఎల్. వరకు రక్తస్రావం అవుతుండటం మామూలే. అంతకంటే ఎక్కువైతే ఆ పరిస్థితిని పోస్ట్‌పార్టమ్ హేమరేజ్ (పీపీహెచ్) అంటారు. పీపీహెచ్‌ను మొదటే నియంత్రించకపోతే, దాదాపు 25 శాతం మంది తల్లులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. 90 శాతం పీపీఎమ్ కేసుల్లో గర్భాశయం ముడుచుకుపోవడంవల్ల రక్తస్రావం జరుగుతుంది. కొంతమందిలో గర్భాశయ ముఖద్వారం చీరుకుపోవడం, మరికొందరిలో గర్భాశయం లోపల మాయముక్కలు ఉండిపోవడం కూడా పీపీహెచ్‌కు కారణం కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో కారణాన్ని బట్టి చికిత్సతో పాటు రక్తం ఎక్కించాల్సిన అవసరం కూడా రావచ్చు. రక్తస్రావం ఎంతకీ నియంత్రణలోకి రాకపోతే గర్భసంచి తొలగించాల్సి రావచ్చు.
మూర్ఛలు: కొంతమందిలో కాన్పుకి ముందు రక్తపోటు పెరిగి కాన్పు తర్వాత తగ్గుతుంది. కానీ కొంతమందిలో కాన్పు తర్వాత కూడా వారం నుంచి పదిరోజుల పాటు రక్తపోటు పెరిగి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
బాలింత జ్వరం: కాన్పు తర్వాత ఒళ్లు కొంచెం వేడిగా అనిపించి, తర్వాత మామూలుగా ఉంటుంది. కొంతమందికి కాన్పు తర్వాత 24 గంటల నుంచి 10 రోజుల్లోపు 100 డిగ్రీల కంటే ఎక్కువగా వచ్చే జ్వరాన్ని బాలింత జ్వరం అంటారు. దీనికి ఎన్నో కారణాలు ఉండవచ్చు.

పాలివ్వడం

;

బిడ్డ పుట్టిన అరగంటలోపు తల్లిపాలు ఇవ్వాలి. బిడ్డని త్వరగా రోమ్ముకి తీసుకోవటం ద్వారా తల్లిపాలు ఎక్కువగా వస్తాయి. మొట్టమొదటగా వచ్చే చిక్కనయిన ,పసుపు చాయలో ఉండే 'ముర్రుపాలు' బిడ్డకి చాల మంచిది. ముర్రుపాలు పిల్లలను రోగాలనుండి కాపాడే గొప్ప ఆహారం, వాటిని పారేయరాదు.
ముర్రుపాలు :

ప్రసవం తర్వాత వెంటనే ముర్రుపాలు ఇవ్వడం చాలా ముఖ్యం. ముర్రుపాలు పసుపు రంగులో ఉండి చిక్కగా ఉంటాయి.చాలా తక్కువ పరిమాణంలో స్రవించబడతాయి .ముర్రుపాలు ఇవ్వడం వలన బిడ్డకి ముఖ్యమైన పోషకాలు అందడమే కాకుండా ఎక్కువ మోతాదులో జీవకణాలు హార్మోన్లు ఉండి బిడ్డలో ప్రమాదకరమైన రోగాలను తట్టుకోగల నిరోధకశక్తిని పెంచుతుంది. ముర్రుపాలలో క్రొవ్వు తక్కువగా ఉంటుంది;

ప్రోటీన్లు,కార్బోహైడ్రేట్లు,కె విటమిన్లు ఎక్కువగా ఉంటాయి .ఇవి బిడ్డకి సులువుగా జీర్ణం అవుతాయి. మామూలు తల్లి పాలతో పోలిస్తే ముర్రుపాల ద్వారా రోగనిరోధకశక్తి ఎక్కువ .ఇందులో ఉండే సెక్రీటరీ ఇమ్మునోగ్లోబిన్ ఎ, ప్రతిరక్షకంగా పనిచేస్తుంది. బిడ్డ జీర్ణవ్యవస్థలో కూడా ప్రముఖ పాత్రవహిస్తుంది. ముర్రుపాలు పేగులలో ఉండే రంధ్రాలను మూసివేసి ఇతర పదార్థాలు లోనికి చొచ్చుకరాకుండా చేస్తాయి. తల్లి తీసుకొనే ఆహారపదార్థాల వలన బిడ్డకు హాని కలుగకుండా బిడ్డ జీర్ణవ్యవస్థను అలవాటు పరుస్తాయి. పుట్టినవెంటనే బిడ్డ పేగులో ఉండే మెకోనియం అనే నల్లని జిగురు వంటి పదార్ధం విరోచనంగా బయటకు రావడానికి వీలుగా, ముర్రుపాలు విరోచనకారిగా పనిచేస్తుంది . ఇన్ని ప్రయోజనాలు మరి ఏ ఇతర మందులు, గాని పోతపాలు గాని అందించలేవు. ప్రకృతి సహజంగా స్రవించబడే ముర్రుపాల నుండి బిడ్డను నిరోధిస్తే, బిడ్డలో నిరోధకశక్తిని ఆపినట్లే.

రొమ్ము సమస్యలు

 • ప్రసవం తర్వాత కొందరు మహిళలకు రొమ్ము సమస్యలు ఎదురవుతాయి. వీరికి రొమ్ము లో నొప్పులు ఏర్పడతాయి. వారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వైద్యం చేయించుకోవాలి. రొమ్ములలో నొప్పి ఎక్కువగా ఉండే నొప్పి తగ్గించే మందులను వాడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు రొమ్ము చుట్టూ అల్సర్లు ఏర్పడి నొప్పి రావచ్చు. దీనివల్ల శిశువుకు పాలిచ్చేటప్పుడు నొప్పి కలుగుతుంది. దీంతో కొన్నిసార్లు జ్వరం కూడా వస్తుంది. ఇటువంటివారు రొమ్ము నొప్పి నివారణకు క్రీమ్‌ రాసుకోవాలి అవసరాన్ని బట్టి, మందులను వాడాల్సి ఉంటుంది. అల్సర్‌లు ఎక్కువ రోజులు ఉంటే క్యాన్సర్‌ పరీక్షలు సైతం చేసుకోవాలి.
 • రొమ్ము సమస్యల్లో అక్యూట్ మాస్‌టైటిస్‌ ఒకటి. దీని వల్ల ఒళ్లు నొప్పులు, రొమ్ము ఎర్రగా కావడం, ముట్టుకుంటే నొప్పి కలగడం జరుగుతుంది. ఈ సందర్బంగా ఏర్పడే చనుమొన పగుళ్ళు సమస్యలు ఉంటే వెంటనే గైనకాలజిస్ట్‌ల చేత వైద్యం చేయించుకోవాలి.
 • కొందరు మహిళలకు రొమ్ము లో పాలు గడ్డ కట్టడం సంభవిస్తుంది. ఇటువంటి వారు ఎక్కువయిన పాలను ఎప్పటి కప్పుడు తీసేయాలి. కొందరు రొమ్ము సమస్యల వల్ల పాలు తక్కు వగా వస్తాయి. ఎక్కువ జ్వరం ఉంటుంది. రక్తపోటు ఉన్నవాళ్లు, రక్తం తక్కువగా ఉన్నవాళ్లు, ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు, డిప్రెషన్‌తో బాధపడుతున్నవాళ్లకి రొమ్ము సమస్యలు ఏర్పడతాయి.
 • పాలు రానివారికి, తక్కువగా వస్తున్నవారికి ఓదార్పు చెప్తూ శిశువును ఎల్లప్పుడు తల్లి పక్కనే ఉంచడం మంచిది. వీరికి సరైన పోషకాహారం, విశ్రాంతి అవసరమన్న విషయం గమనించాలి. పాలు ఎక్కువ రావడానికి ప్రత్యేకంగా ఎటువంటి మందులు లేవన్న విషయం తెలుసుకోవాలి.

రొమ్ము శుభ్రత

 • పిల్లలకు పాలిచ్చేటప్పుడు ముందుగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి .
 • రొమ్మును శుభ్రమైన పొడి బట్టతో తుడుచుకోవాలి .
 • చనుమొను కఠినంగా,ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా సున్నితంగా చనుమొన శుభ్రం చేయాలి.
 • ఒకవేళ చనుమొన చదునుగా లేదా లోపలికి ఉన్నట్లయితే వైద్యుడిని సంప్రదించాలి.
 • ప్రతిసారి పిల్లలకు పాలు ఇచ్చినప్పుడల్లా కొన్ని చుక్కల పాలు చనుమొన మీద పూసి ఆరనివ్వాలి. ఇలా చేయడం వలన చనుమొన పొడిబారనియ్యకుండ, ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా రక్షణగా ఉంటుంది
 • ఒకవేళ చనుమొన నొప్పిగా, గాయలుగా అనిపించిన శుద్ధిచేసిన లేనోలిన్ ద్రవాన్ని దూదితో పూతలాగా పూయాలి.
 • ఒకవేళ చనుమొన సమస్య మరింత ఎక్కువైతే ఆరోగ్యకేంద్రాన్ని సంప్రదించాలి.

చనుమొన సమస్యలు సాధారణ0గా క్రింద పరిస్థితులలో తలెత్తుతాయి

 • పాలిచ్చేటప్పుడు బిడ్డని సరైన స్థితిలో ఉంచకపోవడం
 • పిల్లలు సరిగ్గా పాలు తాగకపోవడం
 • ఏదైన అంటురోగానికి, చర్మ సంబందిత వ్యాధులు గురయినప్పుడు
 • రక్తనాళాలు బిగుసుకపోయినప్పుడు

పిల్లలకు పాలిచ్చే పద్ధతులు

బంతిని పట్టుకున్న విధంగా బిడ్డను చేతితో పట్టుకోవడం : సాధారణ ప్రసవం ద్వారా బిడ్డను కన్నతల్లులకు ఈ పద్ధతి చాలా మంచిది

 • ఏ రొమ్ముతో పాలిస్తున్నారోబిడ్డను అదే వైపు అరచేతితో బిడ్డ వీపును తాకేటట్లు చేతితో బిడ్డను పొదవి పట్టుకొని చన్ను అందించాలి
 • బిడ్డని చేతితో పట్టుకున్నప్పుడు బిడ్డ కాళ్ళు, తల్లి వీపు వైపు ఉండి నోరు చనుమొనకు అందేలా చూడాలి.
 • తల్లి వీపు భాగాన తలగడ పెట్టుకొని కాళ్ళు చాపుకొని చన్ను అందించడానికి బిడ్డ వైపు వంగకుండా నిటారుగా కూర్చోవాలి .

పడుకొని పాలివ్వడం : సిజేరియన్ అయిన తల్లులు, కాన్పు కష్టంగా అయిన తల్లులు, కూర్చోడానికి ఇబ్బందిగా ఉన్న తల్లులకు ఈ పద్ధతిని పాటించడం శ్రేయస్కరం.

 • పాలిచ్చేటప్పుడు ముందుగా తల్లి తల క్రింద,మోకాళ్ళ క్రింద,భుజాల క్రింద ఆధారంగా తలగడ పెట్టుకోవాలి. నడుము,నడుముకింది భాగము సమాంతరముగా ఉండటానికి ఇలా చేయాలి .
 • బిడ్డకి పాలిచ్చేటప్పుడు బిడ్డని దగ్గరగా చేర్చుకోవాలి.మెడకి ఆధారంగా తన చేతిని పెట్టాలి .
 • బిడ్డను తల్లి తన ఛాతి భాగానికి సమాన ఎత్తులో ఉంచుకుని దగ్గరగా జరపడానికి బిడ్డ తలకింద చిన్నపాటి తలగడ లేదా మడతబెట్టిన దుప్పటి పెట్టాలి.
 • బిడ్డ పాలు తాగేటప్పుడు చనుమొనను అందుకోకపోవడం లాంటివి జరిగితే తల్లీ బిడ్డ వైపుకి వంగకుండా రొమ్మును వేళ్ళతో ఎత్తి పట్టుకోవాలి.అప్పుడు బిడ్డ పాలు త్రాగేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవవు.

ఊయలలోపడుకోబెట్టినట్టుగా పాలివ్వడం: సుఖ ప్రసవం అయిన తల్లులు ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. సిజేరియన్ అయిన తల్లులు ఈ పద్ధతి ఉపయోగించడం మంచిది కాదు.ఎందుకంటే ఈ పద్ధతిలో ఎక్కువ ఒత్తిడి తల్లి కడుపు మీద పడుతుంది

 • బిడ్డకు పాలిచ్చేటప్పుడు తల్లి కుర్చీలో విశ్రాంతిగా కూర్చోని,కాళ్ళను స్టూల్ మీద పెట్టుకొని పాలివ్వాలి
 • బిడ్డను ఒడిలో పడుకోబెట్టుకొని బిడ్డ తల ,కడుపు,మోకాళ్ళు తల్లి వైపు ఉండేలా చూసుకోవాలి బిడ్డ రెండవ చెయ్యి తల్లి చేతి క్రింద ఉండాలి .
 • బిడ్డకి కుడి రొమ్ము నుండి పాలిస్తుంటే కుడిచేతితో, ఎడమ రొమ్ము నుండి పాలిస్తుంటే ఎడమ చేతితో బిడ్డను పట్టుకోవాలి. తల్లి తన మోచేయిని బిడ్డ తల ,మెడ,వీపు భాగానికి ఆధారంగా పెట్టాలి.

కుడి రొమ్ము – ఎడమ చేతితో, ఎడమ రొమ్ము - కుడి చేతితో పట్టుకొని పాలివ్వడం:

 • బిడ్డకి కుడి రొమ్ము నుండి పాలిస్తుంటే తల్లి ఎడమ చేతిని ,ఎడమ రొమ్ము నుండి పాలిస్తుంటే కుడి చేతిని బిడ్డ వీపుఫై ఆధారంగా ఉంచి తలను అరచేతిలో పట్టుకొని చన్ను అందించాలి.
 • పాలు తాగడానికి ఇబ్బందిపడే బిడ్డలకు ఈ పధ్ధతిని ఉపయోగించడం శ్రేయస్కరం.

విజయవంతంగా తల్లి పాలివ్వడానికి……

తేపించడం

 • ముందుగా మీ బొటన వేలుని పైన,చూపుడు వేలుని క్రింద ఉంచి మీ స్తనాన్ని కప్పులా పట్టుకొనండి,మీ చనుమొనతో బిడ్డ దిగువ పెదాన్ని మెల్లగా తాకండి. ఈ చర్య బిడ్డను ఉత్తేజ పరుస్తుంది. దానితో ఆమె తన తలని మీ చనుమొన వైపుగా తిప్పి నోరు బాగా తెరుస్తుంది
 • బిడ్డ తన నోటిని బాగా తెరిచినప్పుడు ఆమెను దగ్గరకు లాక్కొండి.ఆమె సక్రమంగా నోటితో పట్టుకుంటే ఆమె దిగువ పెదవి క్రిందవైపుగా మెలితిరుగుతుంది.ఆమె నోరు చనుమొనకి,చుట్టూ నల్లని ప్రదేశాన్ని వీలైనంతగా చుట్టి ఉండాలి.ఆమె సక్రమంగా మీ స్తనాన్ని నోటిలో ఉంచుకొనే ఉంటే అనేకసార్లు పీలుస్తున్న శబ్దాలు వినపడి ఆ తరువాత మ్రింగిన చప్పుడు మీకు వినపడాలి .
 • మీ బిడ్డ సక్రమంగా స్తనానికి అంటిపెట్టుకున్నట్లైతే ఆమె మూతికి మీ స్తనానికి మధ్య సీలు ఎర్పడుతుంది మీ బిడ్డ స్తనాన్ని నోతి నుంచి వదిలిపెట్టడానికి లేదా రెండవ స్తనానికి మార్చదలిచినా పాలు త్రాగే చర్యను నిలిపేందుకు సుకుమారంగా మీ వేలును ఆమె పంటి చిగుళ్ళ మద్య ఉంచండి.
 • మీ బిడ్డ పాలు త్రాగేటప్పుడు అప్పుడప్పుడు మద్యలో కొద్ది మొత్తాలలో గాలిని మ్రింగడం జరగవచ్చును దీనివల్ల బిడ్డ పొట్టలో అసౌఖ్యంగా ఉండే బుడగ ఎర్పడవచ్చును.బిడ్డకు కలిగే ఈ అసౌఖ్యాన్ని తొలగించడానికి బిడ్డని మీ భుజం మీద పడుకొపెట్టండి లోపల పేరుకున్న గాలి పోవడానికి బిడ్డ వీపుని మెల్లగా తట్టండి,లేదా పామండి నిటారుగా కూర్చొబెట్టడం లేదా మీ ఒళ్ళో అడ్డంగా పడుకొపెట్టడం వంటి వివిధ పద్దతులలో చేసి చూడండి

కుటుంబ నియంత్రణ

 380 ఎ కాపర్ టి ఎలా పనిచేస్తుంది

 • అండాన్ని, పురుష ఇంద్రియకణాలతో కలవకుండా చేస్తుంది.
 • అండాన్ని గర్భాశయ భాగంలో అంటుకోకుండా చేస్తుంది .
 • సిజేరియన్ ఆపరేషన్ చేసుకున్న వారు కూడా వాడవచ్చు.
 • బహిష్ట అయిన తరువాత అమర్చుకోవచ్చు.
 • లైంగిక సంపర్కం జరిగే ముందు ప్రతి రోజూ దీనిఫై ప్రత్యేక శ్రద్ధ చూపించవలసిన అవసరం లేదు.
 • పాలు ఇచ్చే తల్లులు కూడా వాడవచ్చు .
 • కాపర్ టి అమర్చుకున్న వెంటనే కొద్దిగా రక్తస్రావం జరగవచ్చు.
 • గర్భం తో ఉన్నవారు 380 ఎ కాపర్ టి వాడకూడదు .
 • వ్యాధితో బాధపడుతున్నవారు కాపర్ టి వాడకూడదు

ఆహారసంరక్షణ

 • పాలిచ్చే తల్లి మాములుగా తీసుకునే ఆహారం కన్నా అధికముగా తీసుకోవడం వలన బిడ్డకి తగిన మోతాదులో పోషకపదార్థాలు అందుతాయి. ప్రోటీన్లు, పండ్లు, కాయగూరలతో కూడిన మిశ్రమాహరాన్ని తీసుకోవాలి. గుడ్లు, నారింజ, మామిడి, కారట్, నిమ్మ, చేప, మాంసం, చిక్కుడు, వేరుశనగ,అరటిపండు, ఆకుకూరలు బాలింతకు మంచి ఆహారం .
 • బాలింతలకు మెంతులతో తయారు చేసిన పదార్థాలను తినిపించడం ఆరోగ్యకరం. పిల్లల తల్లులలో పాల ఉత్పత్తికి మెంతులు చాలా ఉపయోగపడుతాయి. బాలింతలకు మెంతుల కషాయం, మెంతి కూర పప్పు ఎక్కువగా తినిపించాలి. ఉత్తర భారతదేశంలో బాలింతలకు మెంతి హల్వా పెడతారు. మెంతులను నేతిలో వేయించి, మెత్తగా చూర్ణంచేసి, దానికి సమానంగా గోధుమ పిండిని కలిపి, తగినంత పంచదార వేసి హల్వా తయారు చేస్తారు.
 • తులసిలో ఔషదగుణాలు మాత్రమే కాదు, తల్లిలో పాల ఉత్పత్తి పెంచే గుణం కూడా కలిగి ఉన్నది. తులసిలో ఉన్న విటమిన్ కె పాలఉత్పత్తులను బాగా పెంచుతుంది. కాబట్టి తులసి ఆకులను సూపులతో చేర్చి ఇవ్వడం లేదా అలాగే పచ్చి ఆకులను, తేనెతో కలిపి తినడం వల్ల కూడా తల్లిలో పాలు బాగా పడుతాయి.
 • కొన్ని రకాల కూరగాయలు అంటే కాకర కాయ, బీరకాయ వంటివి తల్లిలో పాలు పడేందుకు బాగా ఉపయోగడుతాయి. ఈ కూరగాయల్లో అధికంగా విటమినులు, ఖనిజలవణాలు ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ బాగా ఉండికించి కారం లేకుండా తల్లి తీసుకొన్నట్లైతే బిడ్డకు సరిపడా పాలు పెరుగుతాయి.
 • ఆవుపాలు, నెయ్యి, వెన్న వంటి వాటితో, పాలు ఉత్పత్తి అధికంగా ఉంటుంది. అయితే వీటిని అలా తీసుకోవడం కంటే వాటిని కూరలు చేర్చి అందించడం మంచిది.
 • కర్బూజాపండు, పాలకూర, జీలకర్ర. బార్లీజావ, బొబ్బర్లు, తెలకపిండితో చేసిన కూర, ములగాకు కూరలు చాలా మేలు చేస్తాయి.
 • వెల్లుల్లి పురాతన కాలం నుండి బాలింతలకు ఎక్కువగా తినిపిస్తుంటారు. వెల్లుల్లిని పచ్చిగా తినడం కంటే పొడులతో చేర్చి లేదా కూరలతో చేర్చి ఇవ్వడం మంచిది. ఇది ప్రతిరోజూ తిన్నా ప్రమాదం ఉండదు.
 • బాలింతలకు బొప్పాయి కల్పతరువులాంటిది. బొప్పాయి దోరగా ఉన్నదాన్ని కొబ్బరి కోరులా చేసి కూరవండుకుని తిన్నట్లయితే పాలవృద్ధి కలుగుతుంది. తన పాలు దోషయుక్తంగా ఉండి బిడ్డకు వికారం, విరేచనాలు కల్గిస్తున్నప్పుడు, బొప్పాయి కాయనుగానీ, పండునిగానీ తీసుకోవడం మంచిది.
 • బాలింతలకు వాము కషాయం రోజూ తేనెతో తీసుకుంటే చక్కని పాలు పడతాయి. అంతే కాదు గర్భాశయం త్వరగా కుంచించుకుంటుంది. గర్భాశయంలో నొప్పి తగ్గుతుంది. మైల త్వరగా పడిపోతుంది.
 • శనగలను మొలకలొచ్చేదాకా నాన బెట్టాలి. ఆరబెట్టి, పొట్టు తీసి, దోరగా వేయించి, అప్పుడు కట్టులా కాచుకుని తాగితే బలాన్నిచ్చి మంచి ఔషధంగా పనిచేస్తుంది. రక్తాన్నివృద్ధి చేస్తుంది. పాలు కూడా పెరుగుతాయి.

ఆధారం:

డాక్టర్.ఎస్.శారద, ప్రొఫెసర్, ఉస్మానియా ఆసుపత్రి
కుమారి. జె.సుష్మ, విద్యార్ధి, ఐ.డి.నెం.హెచ్.హెచ్.2010/093.

3.09523809524
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు