హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / రక్తం - నిర్మాణం, విధులు, ఆరోగ్యం, పోషణ
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

రక్తం - నిర్మాణం, విధులు, ఆరోగ్యం, పోషణ

రక్తం - నిర్మాణం, విధులు, ఆరోగ్యం, పోషణ

నిర్మాణం, విధులు, ఆరోగ్యం, పోషణ

మానవ శరీరంలోని ధమనులు, సిరలలో  ప్రవహించే ఎర్రని ద్రవమే రక్తం. ఇది ద్రవరూపంలో ఉన్న శరీర నిర్మాణ కణజాలం . జీవి మనుగడకి రక్తం అత్యవసరం; రక్తానికి సంబంధించిన అధ్యయనాన్ని 'హిమటాలజీ' అంటారు. శరీరంలో ప్రతి అవయవంలోని ప్రతి కణజాలానికి రక్తం ఆక్సిజెన్ అందిస్తుంది. అలాగే  కణజాల నుండి కార్బన్ డయాక్సైడును స్వీకరిస్తుంది. శరీరంలో ఇది రవాణ వ్యవస్థవంటిది. అంతే కాకుండా ఇన్ఫెక్షన్ల  పై యుద్దం చేస్తుంది కనక రక్షణ వ్యవస్థగా కూడా చెప్పుకోవచ్చు. రక్తానికి మరో ప్రత్యమ్నాయం లేదు. దీనిని ఉత్పత్తి చేయలేము. కాని దాతలెవరైనా ఉంటే వారినుండి తీసుకొని అవసరమైన వారికి  ఎక్కించవచ్చు. శరీర బరువులో 7-8% బరువు రక్తానిదే. రక్తాన్ని పరీక్ష నాళికలో వేసిన కాసేపటికి రక్తం మూడు పొరలుగా గా విడిపోతుంది. ఈ మూడింటిలో ఎక్కవ మందం ఉన్న పొర, ఎండుగడ్డి రంగులో, పారదర్శకంగా, పైకి తేలుతూ కనిపిస్తుంది. దీనిని ప్లాస్మా అని అంటారు. దీని దిగువన, అతి తక్కువ మందంతో తెల్లటి పొర తెల్ల రక్త కణాలు. అట్టడుగున దరిదాపు ప్లాస్మా లేయర్ ఉన్నంత మందం గానూ ఎర్రటి పొర ఎర్ర రక్త కణాలు.

రక్తంలో మొత్తం 4000 వివిధ భాగాలుంటాయిగాని,  ప్రధానంగా చెప్పుకోవలసినవి నాలుగు మాత్రమే.
 1. ఎర్రరక్తకణాలు
 2. తెల్లరక్తకణాలు
 3. ప్లేట్ లెట్లు
 4. ప్లాస్మా
పరిమాణం బట్టి చూస్తే, మొత్తం రక్తంలో ఎర్రరక్తకణాలు 45%, తెల్లరక్తకణాలు 0.7%, ప్లాస్మా 54.3% , ఉంటాయి. ఇవి ఎముక మజ్జ లేదా మూలగలో ఎప్పటికప్పుడు తయారవుతుంటాయి.

ఎర్ర రక్త కణాలు (ఎరిత్రోసైట్లు)

ఎర్రరక్తకణాలు ఆమ్లజనిని శరీరమంతా అందేలా చేస్తాయి. హీమోగ్లోబిన్ అనే ప్రొటీన్ పదార్ధం ఉండడం వలన అవి ఎర్రగా ఉంటాయి. గుండ్రంగా, ద్విపుటాకారంలో ఉం డే ఇవి ఒక మి.లీ. రక్తంలో 450 నుండి 500 కోట్ల వరకు ఉంటాయి. ఎముక మజ్జలో ఉత్పత్తి అవుతాయి. ఇవి ఉత్పత్తి అయ్యే విధానాన్ని ఎరిత్రోపాయిసిస్ అంటారు. ఎర్ర రక్త కణాలు సుమారు  120 రోజులు జీవిస్తాయి. వీటి జీవితకాలం తరువాత ఇవి ప్లీహంలో, కాలేయంలో విచ్ఛిన్నమవుతాయి. రక్తకణాలు శరీరానికి అవసరమైన ఆక్సిజెన్ సరఫరా చేయడం, అంటువ్యాధులను కలుగచేసే సూక్ష్మ క్రిములతో పోరాడటం, గాయాలు అయినపుడు రక్తం కారడాన్ని ఆపడం వంటి పనులు చేస్తుంటే, ప్లాస్మా ఈ రక్తకణాలను శరీరంలోని  వివిధ భాగాలకు మోస్తుంది. తద్వారా శరీరానికి అవసరమైన, పోషకాలను అందిస్తుంది.

తెల్ల రక్తకణాలు (ల్యూకోసైట్లు)

వ్యాధులనుండి సంరక్షించడం తెల్ల రక్తకణాల పని. అమీబా వంటి ఆకారంలో ఉంటాయి. ఒక మి.లీ. రక్తంలో 50 నుండి 90 లక్షల రక్త కణాలుంటాయి. ఇవి లింపు కణుపులలోను, ప్లీహంలోను ఉత్పత్తి అవుతాయి. ఇవి ఉత్పత్తి అయ్యే ప్రక్రియను ల్యూకోపాయిసిస్ అంటారు. ఇవి సుమారు  12-13 రోజులు జీవిస్తాయి.. వీటి జీవితకాలం తరువాత తెల్లరక్తకణాలు లేయంలోను, లింపు ద్రవంలోను విచ్ఛిన్నమవుతాయి.

ప్లేట్లెట్లు (త్రాంబోసైట్లు)

ఒక మైక్రో లీటరు రక్తంలో ఇవి 1,50,000 నుండి 4,50,000 వరకు ఉంటాయి. రక్తం మరకను పరిశీలించినట్లైతే, ఊదా(పర్పుల్) వర్ణంలో చిన్నచిన్న చుక్కల్లాగా కనపడతాయి. ప్లేట్లెట్లు, ఎర్ర రక్త కణాలు నిష్పత్తి 1:10 నుండి 1:20 వరకు ఉంటుంది. రక్తం గడ్డ కట్టడంలో వీటి పాత్ర చాలా ప్రధానమైనది. ఉండవలసిన దానికన్న తక్కువ ప్లేట్లెట్లు ఉండడాన్ని త్రాంబోసైటోపీనియా అంటారు. ప్లేట్లెట్లు సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం, లేదా ఎక్కువగా క్షీణించిపోవడం ఈ పరిస్థితికి కారణం. అదే విధంగా ప్లేట్లెట్లు హెచ్చుగా ఉండడాన్ని త్రాంబోసైటోసిస్ అంటారు. ఈపరిస్థితికి కారణాలు వంశ్యపారంపర్యత, ప్రతిచర్యలు (రియాక్షన్),  ఉత్పత్తి అక్రమరీతిలో జరగడం .  ఇవి ఎక్కువగాఉన్న, తక్కువగా ఉన్న శరీరంలో సంబంధిత రుగ్మత ఉన్నట్లే. ఎక్కువగా ఉంటే చేతులలో, కాళ్ళలో రక్తం గడ్డకట్టి ప్రవాహం ఆగిపోతుంది; తద్వారా గుండెపోటు వచ్చే అవకాశాలుంటాయి. తక్కువగా ఉంటే చర్మంపై గాయాలు, చిగుళ్ళు, ముక్కు నుండి రక్తం కారడం సంభవిస్తుంది.

రక్తం గడ్డకట్టడం

శరీరంలో ఏభాగానికైనా గాయమైనప్పుడు రక్తం వస్తుంది. అయితే కొంచెం సేపటికే రక్తం గడ్డకట్టి, రక్తం స్రవించడం ఆగిపోతుంది. రక్తం గడ్డకట్టడానికి ప్లేట్‌లెట్సే కారణం. గాయం తగిలినప్పుడు రక్తంలోని ప్లేట్‌లెట్స్ గాయం చుట్టూ చేరి ప్లాస్మానుంచి త్రాంబో ప్లాస్టిన్ అనే పదార్థాన్ని తయారు చేస్తాయి. ఈ పదార్థం రక్తంలోని కాల్షియం. ప్రోత్రాండిన్‌లతో కలుస్తుంది. ఇవి ఫ్రైబ్రొనోజిన్ అని రక్తంలో ఉండే ఒక ప్రోటీన్‌తో ప్రతిక్రియ జరుపుతాయి. దాంతో ఫైబ్రెన్ దారాలు ఒక దానితో ఒకటి పెనవేసుకునిపోయి రక్తాన్ని బయటకుపోనివ్వకుండా ఒక విధమైన అడ్డుకట్టలాగ నిలుస్తాయి. దాంతో ఫ్రైబ్రెన్ దారాలు గట్టిగా అతుక్కుపోతాయి. ఈ కణాల పై పొర చనిపోతుంది. దెబ్బతిన్న కణాల స్థానంలో కొత్త కణాలు వచ్చాక పైన ఏర్పడిన పొర ఊడిపోతుంది. ప్లేట్‌లెట్స్ నుండి సిరోటినిన్ అనే హర్మోను ఉత్పత్తి అవుతుంది. ఇది రక్తాన్ని సంకోచింపజేస్తుంది. దాంతో రక్తప్రవాహం ఆగిపోతుంది. ఈ ప్రక్రియంతా సర్వసాధారణంగా 2-6 నిముషాలలో జరిగిపోతుంది.రక్తం గడ్డకట్టకపోతే అధికంగా రక్తస్రావం జరిగి మరణం సంభవించవచ్చు.

ప్లాస్మా

రక్తంలో ప్లాస్మా చాల ముఖ్యమైనది. నీటితో పాటు, శరీర పోషణకి కావలసిన విటమిన్లు, ఖనిజాలు, చక్కెరలు,  కొవ్వులు వంటి పోషకపదార్థాల రవాణాకి తోడ్పడుతుంది. కణజాలాలు వదలిపెట్టిన వ్యర్థపదార్థాలను సేకరించుకొని వాటిని శరీరం నుండి తొలగించడంలో తోడ్పడుతుంది. అంతేకాక, రక్తం యొక్క అన్నిభాగాలు ప్రసరణ ద్వారా ప్రతి అవయవాన్ని చేరేట్లుగా చూస్తుంది.

రక్తం చేసే పనులు

ఎర్ర కణాలలో ఉండే హీమోగ్లోబిన్ తో కణజాలాలకు ప్రాణవాయువును సరఫరా చెయ్యటం.

 • గ్లూకోజు, ఎమైనో ఆమ్లాలు, ఫాటీ ఆసిడ్ ల వంటి పోషకాలను సరఫరా చెయ్యటం.
 • కార్బన్ డై ఆక్సైడ్, యూరియా, లాక్టిక్ ఆమ్లంల వంటి వ్యర్థ పదార్థాలను నిర్మూలించటం.
 • వ్యాధి నిరోధక విధులను, తెల్ల కణాల సరఫరాసరఫరాను నివారించడం
 • ఆంటీబాడీలతో సూక్ష్మ క్రిములను, రోగకారకాలను నిరోధించటం.
 • హార్మోన్ల సరఫరాకి పని చెయ్యటం.
 • దెబ్బతిన్న కణజాలాల సమాచారాన్ని మెదడుకు చేరవేయటం.
 • శరీరంలో ఆమ్ల-క్షార తుల్యతని (pH విలువని) నియంత్రించటం.
 • శరీర ఉష్ణోగ్రతను నియంత్రించటం.
 • హైడ్రాలిక్ (పంపింగ్) విధులు నిర్వర్తించటం.

రక్తం వర్గాలు

1900 సంవత్సరం లో కారల్ ల్యాండ్ స్టీనర్ అను శాస్త్రవేత్త నాలుగు రక్త వర్గాలను కనుగొన్నారు.

 1. ఎ (A)
 2. బి (B)
 3. ఎబి (AB)
 4. ఓ (O)

రక్తదానం

రక్త దానం దాదాపు ప్రాణ దానం లాంటిది. రోగ నివారణ కోసం ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. రక్తదానం సేవ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత కూడా.రక్తాన్ని తీసుకొనే వ్యక్తిని గ్రహీత అని, ఇచ్చే వ్యక్తిని దాత అని అంటారు. ఓ (O) గ్రూప్ వారిని విశ్వదాత అని, ఎ.బి.(AB) గ్రూప్ వారిని విశ్వగ్రహీత అని అంటారు. 16 నుండి 60 సంవత్సరాలు గల వ్యక్తులు ఆరోగ్యంగా ఉన్నవారు రక్తాన్ని దానం చేయవచ్చు. ఒక వ్యక్తి ప్రతి 3-4 నెలలకు ఒక్కసారి రక్తాన్ని దానం చేయవచ్చు. రక్తాన్ని సేకరించిన తర్వాత 35-45 రోజులు నిల్వ చేస్తారు.

ఎవరు ఎవరికి రక్తం దానం చేయవచ్చు

 • ఎబి గ్రూప్ వారు ఎబి గ్రూప్ కి
 • ఎ గ్రూప్ వారు ఎ, ఎబి గ్రూప్ కి
 • బి గ్రూప్ వారు బి, ఎబి గ్రూప్ కి
 • ఓ గ్రూప్ వారు ఎ, బి, ఎబి, ఓ  గ్రూప్ ల వారందరికి దానం చేయవచ్చు.

ఎవరు ఎవరి నుండి రక్తం తీసుకోవచ్చు

 • ఎబి గ్రూప్ వారు అన్ని గ్రూప్ ల నుండి
 • బి గ్రూప్ వారు బి, ఓ గ్రూప్ ల నుండి
 • ఎ గ్రూప్ వారు ఎ, ఓ గ్రూప్ లనుండి
 • ఓ గ్రూప్ వారు ఓ గ్రూప్ నుండి మాత్రమే రక్తం తీసుకోవచ్చు.

రక్త దానం వలన కలిగే మేలు

 • ఐరన్ నిల్వలను సమతుల్యం చేస్తుంది: అనేక పరిశోధనలు, అద్యయనాల ప్రకారం చాలా మందిలో వారు తీసుకొనే ఆహారాన్ని బట్టే ఐరన్ నిల్వలు ఉంటాయి అని కనుగొన్నారు. కాబట్టి శరీరంలో ఇనుము స్థాయిని సమతుల్యం కోసం రక్తం దానం చేయడం చాలా మంచిది. రక్తంలో ఎక్కువగా ఐరన్ ఉంటే గుండెకు హాని చేస్తుంది. కార్డియో వాస్కులర్ వ్యాధులను నివారించేందుకు రక్తదానం చేయడం మంచిది. మహిళల్లో ఒక వయస్సు వచ్చిన తర్వాత రుతస్రావం పూర్తి నిలిచిపోయినప్పుడు వారి శరీరంలో నిల్వఉండే ఐరన్ స్థాయిని సమతుల్యం చేసుకోవాడానికి రక్తదానం చేయడం చాలా ఆరోగ్యకరం.
 • హెల్త్ చెకప్: రక్తం దానం చేయడానికి ముందు, దాత యొక్క చరిత్ర తెలుసుకుంటారు. అంతే కాదు, ఆవ్యక్తి రక్తం దానం చేయడానికి అర్హుడా కాడా అన్ని విషయ నిర్ధారణ కోసం డాక్టర్లు కొన్ని ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. కాబట్టి రక్తదానం చేయడానికి ముందు డాక్టర్ సలహా ప్రకారం తీసుకోవడం వల్ల వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు.
 • క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది: శరీరంలో ఐరన్ నిల్వల స్థాయి తగ్గడం వల్ల క్యాన్సర్ లక్షణాలను తగ్గిస్తుంది. రక్తదానం చేయడం వల్ల క్యాన్సర్ తో బాధపడుతున్న అవకాశాలు ప్రత్యేకంగా పెద్దపేగు, కాలేయం, గొంతు, మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ లు రాకుండా అడ్డుకుంటుంది.
 • అధిక రక్త పోటును నియంత్రిస్తుంది: రక్త దానం చేసినప్పుడు, రక్త పరిమాణం సమతుల్యం చేంది, రక్తపోటును నిరోధిస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన గుండె, గుండె సంబంధిత వ్యాధులను నివారించడానికి రక్తదానం చేయడం మంచిది.
 • కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది: శరీరంలోని రక్త కణాల్లో కొలెస్ట్రాల్ నిల్వ ఉంటుంది. ఎర్ర రక్తకణాల్లో చెడు మరియు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి రక్తదానం చాలా ఉపయోగకరం.

పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలలో  రక్తాన్ని సేకరిస్తుంటారు. దీనిని సురక్షితంగా నిల్వచేసి అవసరమైనపుడు ఇతరులకు ఎక్కించడానికి వినియోగిస్తారు. ఆపరేషన్లు నిర్వహించేపుడుకూడా ముందుగా అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత  ఆరోగ్యవంతమైన రక్తమని నిర్ధారించుకున్నతర్వాతనే సేకరిస్తారు. ఒకరి రక్తం వేరొకరికి ఎక్కించడం వలన ప్రాణాలు నిలబెట్టవచ్చు అనే విషయాన్ని మొదటగా మొదటి ప్రపంచ యుద్ధకాలంలో 1915 వ సంవత్సరంలో లారెన్సు బ్రూస్ రాబర్ట్ సన్ అనే ఆయన కనుగొన్నారు. రక్తం ఓడుతున్న గాయాలతో బాధపడుతున్న సైనికునికి సిరెంజ్ ద్వారా రక్తం ఎక్కించారు. ఆ తర్వాత పలుమార్లు రక్తం ఎక్కించే ప్రయోగాన్ని చేపట్టి, తన ఫలితాలను మెడికల్ రీసెర్చ్ కమిటీకి వెల్లడించారు.

ఈ ఫలితాల ఆధారంగా 1917 లో ఆస్వాల్ హోల్డ్ రాబర్ట్ సన్ అనే సైనికాధికారి మరియు వైద్యశాస్త్రవేత్త, ఆధ్వర్యంలో మొట్టమొదట సారిగా బ్లడ్ బ్యాంకు  కు అంకురం పడింది. 1921 సంవత్సరంలో దాతల నుండి రక్తం సేకరించడం అనే సేవ ప్రారంభమైంది. మనదేశంలో మొదటి బ్లడ్ బ్యాంకు కలకత్తా లోని చిత్తరంజన్ ఎవెన్యూలో ప్రారంభమైంది. తర్వాత కలకత్తా వైద్యకళాశాల మరియు ఆసుపత్రికి తరలించబడింది. కేంద్రీయ బ్లడ్ బ్యాంకుగా ప్రస్తుతం పనిచేస్తుంది.

రక్తం - రుగ్మతలు

ఎర్రరక్త కణాలను ప్రభావితం చేసేవి

రక్తహీనత: దీనితో బాధపదేవారిలో ఎర్ర రక్త కణాల సంఖ్య చాలా తక్కువగాఉంటుంది. రక్తహీనత అనేక కారణాల వలన కలుగుతుంది.

 • ఆహారంలో ఇనుమనే ఖనిజ లవణం లోపించడం వలన ఐరన్ లోప రక్తహీనత వస్తుంది.
 • దీర్ఖకాలిక జబ్బులవలన, ముఖ్యంగా మూత్రపిండాలకు సంబంధించిన జబ్బులవలన  రక్తహీనత వస్తుంది.
 • స్వయం రోగ నిరోధకత లేదా జీర్ణవాహిక బలహీనత వలన బి12 అనే విటమిను శోషించబడక పెరినిషియస్ అనీమియ అనే రక్తహీనత వస్తుంది.
 • వైరల్ ఇన్ ఫెక్షన్స్, కొన్నిమందుల ప్రభావం వలన,  స్వయం రోగ నిరోధకత మొదలైన కారణాల వలన ఎముక మజ్జలో ఎర్రరక్తకణాలు సరిపడినన్ని ఉత్పత్తి చేయలేకపోవడం వలన ఎప్లాస్టిక్ అనీమియా అనే రక్తహీనత వస్తుంది.
 • కొన్ని పరిస్థితులలో స్వయం రోగ నిరోధకత యొక్క అదిక ఉత్తేజం వలన శరీరంలో ఎర్ర రక్తకణాలు నశించిపోతాయి. అలా ఆటోఇమ్యూన్ హిమోలైటిక్ అనీమియా అనే రక్తహీనత వస్తుంది.
 • వంశపారంపర్య కారణాల వలన తలసీమియ అనే రక్తహీనత వస్తుంది.
 • వంశపారంపర్యం వలన వచ్చే మరొక రక్తహీనత సికెల్సెల్ అనీమియ. ఇది మనదేశంలో కనపడదు.
 • కొన్ని తెలియని కారణాలవలన శరీరంలో ఎర్రరక్త కణాలు అధికంగా ఉత్పత్తి చేయబడతాయి. దీనినే పాలిటీమియ వెర అంటారు. సాధారణంగా ఇది అంత సమస్యాత్మకం కాక పోయినప్పటికి, ఒక్కోసారి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే పరిస్థితికి దారి తీయవచ్చు.
 • మలేరియ వ్యాధి వలన ఎర్రరక్తకణాలకు వ్యాధి సంక్రమిస్తుంది.

తెల్లరక్త కణాలను ప్రభావితం చేసేవి

 • తెల్లరక్త కణాలు ప్రాణాంతకంగా మారి, విపరీతంగా, అసాధరణంగా ఉత్పత్తిచెందుతూ ఉంటాయి. ఈస్థితిని లింఫోమా అంటారు. ఇది ఒకరకమైన రక్తక్యాన్సర్.
 • తెల్లరక్త కణాలను ప్రాణాంతకంగా మారి ఎముకమజ్జలో ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. దీనిని ల్యుకేమియా అంటారు.
 • ప్లాస్మా కణం అనబడే తెల్లరక్తకణాలు ప్రాణాంతకంగా మారి, శరీరంలోని అవయవాలను నాశనం చేసే పదార్థాలను   విడుదలచేస్తాయి.ఇది మల్టిపుల్ మైలోమా అనే రక్త క్యాన్సర్.

ప్లేట్లెట్లను ప్రభావితం చేసేవి

 • చాలా  తక్కువ సంఖ్యలో ప్లేట్లెట్లు ఉండటాన్ని త్రాంబోసైటోపీనియ అంటారు
 • కారణం ఏంటో తెలియదుకాని నిరంతరం ప్లేట్లెట్లు తగ్గిపొవడం వలన చర్మం పై  గాయాలు, ఎర్రని మచ్చలు, అసాధారణంగా రక్తంకారడం వంటి స్థితి ఎర్పడుతుంది. దీనిని ఈడియోపాటిక్ త్రాంబోసైటోపినిక్ పర్పురా(Idiopathic thrombocytopenic purpura) అంటారు.

ప్లాస్మాను ప్రభావితం చేసేవి

 • శరీరంలోని ఏదైనా ఇంఫెక్షన్ రక్తంలోనికి ప్రవేశించి జ్వరం, వేగంగా శ్వాస తీసుకోవడం, అసలు శ్వాస తీసుకోలేకపోవడం, రక్తపోటు తక్కువగా ఉండడం, వంటి పరిస్థితిని సెప్సిస్ అంటారు .
 • గాయమైనపుడు రక్తం గడ్డకట్టం వలన ప్రవాహం ఆగిపోతుంది. కాని హిమోఫీలియా అనే వ్యాధి కలవారిలో, రక్తాన్ని గడ్డకట్టించడానికి అవసరమైన ప్రోటీన్లు జన్యుపరమైన కారణాలవలన లోపించడంవలన రక్తం చాలా ఆలస్యంగా గడ్డకట్తుంది.
 • మన జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా బ్లడ్ కొలెస్ట్రాల్ లో చెడ్డ కొలెస్ట్రాల్ ను అదుపు చెయ్యవచ్చు. ప్రతిరోజూ సైక్లింగ్, నడక, ఈత వంటి తేలికపాటి వ్యాయామాలు చెయ్యాలి. దీనివలన గుండె పటిష్టపడుతుంది. చెడ్డ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది. అధిక బరువు మాయమవుతుంది. రక్త నాళాలలో వాపు, క్లాగింగ్ తగ్గి, రక్తనాళాల గోడలు దలసరికాకుండా వుంటాయి.

రక్తనాళాలకు, గుండెకు మంచి పదార్థాలను

కొన్ని పదార్థాలను తినడం వల్ల రక్తనాళాలకు, గుండెకు ఎంతో మంచి చేకూరుతుంది.

ఆపిల్ పండు రక్తంలోని కొలెస్ట్రాల్ నిల్వల్ని తగ్గించడంలో ఆపిల్ పండు ఉపయోగపడుతుంది. లివర్ తయారు చేసే చెడ్డ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.  ఈ పండులో మాలిక్ ఆమ్లం, శరీరంలోని కొవ్వులను జీర్ణం చేస్తుంది.
బీన్స్ బీన్స్ లో ఉండే కరిగే పీచు చెడ్డ కొలెస్ట్రాల్ తయారీని నిలుపుదల చేస్తుంది. బీన్స్ లోని లేసిథిన్ కొలెస్ట్రాల్ కరిగిపోయేలా చేస్తుంది. పొటాషియం, రాగి, భాస్వరం, మాంగనీసు ఫోలిక్ ఆమ్లాలు కూడా దీనిలో ఉన్నాయి.
బెర్రీస్ బ్లాక్ బెర్రీ లోని విటమిన్స్ గుండెకు, ప్రసరణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని కరిగే పీచు పెక్టిన్ కొలెస్ట్రాల్ ను శరీరం నుంచి బయటికి పంపుతుంది.
వంకాయ: అనేక రకాల విటమిన్లు, మినరల్స్ కలిగిన వంగ అనేక ఫైటో న్యూట్రియంట్లు కలిగి ఉంటుంది. ఆక్సీకరణ ప్రక్రియలో తోడ్పడతాయి.


ద్రాక్ష: ఆంతో సైనిన్స్, టానిన్స్ వంటివి కొలెస్ట్రాల్ నిల్వల్ని బాగా తగ్గిస్తాయి. ద్రాక్ష లోని పొటాషియం, శరీరంలోని విష పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది. మధుమేహులకు ద్రాక్ష నిషిద్ధం.
జామపండు: తాజా జమపండ్లు శరీరానికేంతో మేలు చేస్తాయి. జమలోని విటమిన్ సి  భాస్వరం, నికోటిన్ ఆమ్లం, కరిగేపీచు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను పటిష్ట పరిచి, కొలెస్ట్రాల్ తగ్గించి, గుండెను సంరక్షిస్తాయి.
పుట్టగొడుగులు: కొలెస్ట్రాల్ నిల్వలు తగ్గించంలో మాష్ రూమ్స్ లోని విటమిన్స్ బి, సి కాల్షియం, మినరల్స్ బాగా ఉపయోగాపడతాయి.
గింజలు(nuts): బాదం పప్పు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనిలోని ఒలియిక్ ఆమ్లం, గుండెను వ్యాధుల బారినపడకుండా రక్షిస్తుంది. జీడిపప్పులోని మోనో అన్  సచురేటేడ్ కొవ్వును తగ్గించి గుండెను పదిలంగా ఉంచుతాయి. వాల్ నట్స్ లోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్ ను గణనీయంగా తగ్గిస్తాయి
వెల్లుల్లి: రక్తపోటును, ఎక్కువగా వున్న చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది

సోయా: ఎనిమిది రకాల ఆవశ్యక మూలకాలు గల ఒకే ఒక శాకాహార మాంసకృత్తులు సోయాలో వున్నాయి. సోయా మాంసకృత్తులు రోజూ తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తం నుండి కొలెస్ట్రాలును విసర్జించే లివర్ శక్తిని పెంచుతుంది. సోయా చిక్కుళ్ళలో విటమిన్ b3, b6, E , ఉన్నాయి.
ఓట్ మీల్ (oatmeal): దీనిలోని బీటా గ్లూకస్ అనే ప్రత్యేక కరిగే పీచుపదార్థం  స్పాంజివలె పనిచేసి కొలెస్ట్రాల్ ను గ్రహిస్తుంది.
సబ్జా గింజలు: దీని పొట్టు పేగులలోనికి కొలెస్ట్రాల్ ప్రవేశించనీయదు. చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గించే అత్యంత శక్తి వంతమైన పదార్థంగా ప్రసిద్దికెక్కింది.
పొట్టు తీయని గింజలు: గోధుమ, మొక్కజొన్న  ఓటు ధ్యాన్యం, బార్లీలను ఏక మొత్తంగా తింటే కొలెస్ట్రాల్ పరిమాణం తగ్గడం, రక్తపోటు నియంత్రించడం, రక్తం గడ్డకట్టే ప్రక్రియను వేగవంతం చేయడం మొదలైనవి సాధ్యమౌతాయి.

ఆధారం: డాక్టర్. పి. అమల కుమారి, ప్రొఫెసర్, విస్తరణ మరియు ప్రసార నిర్వహణ విభాగం

3.11538461538
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు