హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / రాగి, ఇత్తడి పాత్రలతో ఎంతో ప్రయోజనం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

రాగి, ఇత్తడి పాత్రలతో ఎంతో ప్రయోజనం

రాగి, ఇత్తడి పాత్రల ప్రయోజనం

ఆరోగ్యంగా ఉండడానికి, శుభ్రంగా జీవించడానికి మన సంప్రదాయాల్లోని కొన్ని విషయాలు చాలా దోహదం చేస్తాయి. అటువంటిదే రాగి పాత్రల వాడకం. ఇంట్లో పూజా పునస్కారాలకు మనం రాగి లేదా వెండి పాత్రలు వాడడం కద్దు. ఈ లోహాలకున్న యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలే ఆ లోహాలను పూజార్హం చేశాయి. అంతేనా.. ఒక్కసారి తాతముత్తాతల కాలంలోకి రీవైండ్‌ అయితే.. రాగి బిందెలు, ఇత్తడి గిన్నెలు, కొండొకచో కంచు సామగ్రి చూడొచ్చు.

వీటన్నింటిలోనూ రాగి ఉంటుంది. ఈ రాగికి ఇంత ప్రాధాన్యం ఎందుకు? మన జీవితంలో ఒక భాగమైపోవడంలో ఈ లోహానికున్న లక్షణాలేంటి? అని ఆధునిక పరిశోధకులు తరచి చూస్తే.. బోలెడన్ని మంచి విషయాలు ఈ లోహం గురించి బయటపడ్డాయి. అమెరికాలోని ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ర్టేషన్‌ అయితే.. రాగిని శరీరానికి అవసరమైన ‘ట్రేస్‌ ఎలిమెంట్‌’గా గుర్తించడమే కాక, అది లోపిస్తే ఏమిటి.. ఎక్కువైతే ఏమవుతుందో కూడా చేసిన పరిశోధనలకు గుర్తింపునిచ్చింది.

ఈ పరిశోధనల ద్వారా రాగి వాడకంతో ఆధునిక కాలంలో వచ్చే చాలా జబ్బులను అరికట్టొచ్చని తేలింది. భారతదేశంలో శతాబ్దాల క్రితమే రక్తపోటు నుంచి కేన్సర్‌ వరకూ, శ్వాసకోశ వ్యాధుల నుంచి జీర్ణకోశ వ్యాధుల వరకూ, గుండె జబ్బుల నుంచి కిడ్నీ వ్యాధుల వరకూ ఇలా లెక్క తీస్తూ పోతే బోలెడన్ని గుణాలను ఆయుర్వేదంలో తెలిపారు. ఆధునిక కాలంలోనూ ఈ లోహాన్ని పలు యాంటీ బ్యాక్టీరియల్‌ ఆయింట్‌మెంట్లలో వాడుతున్నారు. అంతే కాదు.. రాగి పాత్రల్లోని నీళ్లు తాగితే.. అది పొట్టలో కదలికలను (పెరిస్టాల్సిస్‌) నియంత్రించి జీర్ణవ్యవస్థను కుదుటపరుస్తుంది. అలాగే పేగుల్లో అల్సర్లు రాకుండా ఆపుతుంది. అంతేనా.. శరీరంపై మచ్చలను తొలగించడమేకాక, గాయాలు త్వరగా మానేలా చేస్తుంది. లోహం అనేది క్షారగుణం కలిగి ఉంటుంది కాబట్టి, అసిడిటీని తగ్గిస్తుంది. కొవ్వును కరిగించడంలో రాగి కీలక పాత్ర పోషించి మనం అధిక బరువును పెంచుకోకుండా కాపాడుతుంది. దీంతో ఊబకాయం సమస్యకు నివారణ ఉంటుంది. కొవ్వును నియంత్రించి, రక్తాన్ని శుద్ధిచేస్తుంది కాబట్టి, గుండెపోటు వచ్చే అవకాశాన్ని రాగి పాత్రల్లో నీరు తాగడంద్వారా తగ్గించుకోవచ్చు. రాగికి నొప్పి, మంట తగ్గించే గుణాలున్నాయి. ఆ కారణంగా కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. శరీరంలో మెలనిన్‌ కారణంగా మన చర్మం రంగు నిర్ధారణ అవడమే కాక, అది అసలు మరీ తక్కువగా ఉంటే.. కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. రాగి కారణంగా అవసరమైనంత మెలనిన్‌ ఉత్పత్తి అవుతుంది. రాగి పాత్రల్లోని నీరు తాగడం వలన రక్తహీనత అదుపులో ఉంటుంది.

ద్వాదశ ప్రయోజనాలు

రాగి ప్రయోజనాల్లో ముఖ్యమైన 12 గుణాలు ఇవి.. 1. ఎసిడిటీని తగ్గించడం 2. అల్సర్లతోపాటు అజీర్ణాన్ని అరికట్టడం 3. అధిక బరువును తగ్గించడం 4. గుండెజబ్బును నివారించడం 5. కేన్సర్‌ నిరోధక సామర్థ్యం 6. డయేరియా దరి చేరకుండా చేయడం 7. కామెర్లు రాకుండా చూడడం 8. థైరాయిడ్‌ గ్రంథి అతిగా పనిచేయనీయకుండా చేయడం 9. అది తక్కువగా పనిచేయడాన్ని నిగ్రహించడం 10. అర్థరైటిస్‌ రాకుండా కీళ్లను బలంగా ఉం చడం 11. రక్త హీనత నివారించడం 12. రెండు రకాల రక్తపోట్లను దూరంగా ఉంచడమని రాగిపై అధ్యయనం చేసినవారు బల్లగుద్ది చెబుతున్నారు.

ఎక్కువైనా ఇబ్బందే సుమా!

24 గంటలూ రాగి పాత్రల్లోని నీరు తాగడం కూడా అనవసరమని నిపుణులు చెబుతున్నారు. రోజుకు రెండుమూడు సార్లు.. రాగి పాత్రలోని నీళ్లు తాగితే చాలన్నది వారి మాట. మరీ ఎక్కువ రాగిని శరీరంలోకి తీసుకున్నా ఈ లోహం ఎక్కువై మిగిలిన లోహాలను స్వీకరించడంలో శరీరానికి ఇబ్బంది కలిగి సమస్యలు వస్తాయంటున్నారు. అమెరికాలోని ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ర్టేషన్‌ అంచనాల ప్రకారం.. రోజుకు 12 మిల్లీగ్రాముల రాగి మనకి సరిపోతుంది. మన ఆయుర్వేద అంచనాల ప్రకారం కొద్దిగా ఎక్కువైనా ఫర్వాలేదు. అందుకే.. ఇంట్లో అన్నీ రాగి పాత్రలే వాడకుండా, ఎక్కువగా ఇత్తడి పాత్రలు వాడడం వలన పరిమితమైన మోతాదులో మాత్రమే రాగిని తీసుకునే అవకాశం ఉంటుందని నిపుణుల సలహా.

ఆధారము: ఆంధ్రజ్యోతి

2.9797979798
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు