অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సౌందర్య చిట్కాలు

సౌందర్య చిట్కాలు
 1. మొటిమల నివారణకు పాటించవలసిన కొన్నిపద్దతులు
 2. ఆరోగ్యమైన జుట్టు ఇక మీ సొంతం:
  1. మందారంతో కొన్ని చిట్కాలు :
  2. పోడిబారినట్టు జీవం లేకుండా తయారైన జుట్టుకోసం :
  3. వెంట్రుకలు చిట్లిపోకుండా :
 3. హోంమేడ్ స్క్రబ్స్:
 4. తెల్లదనం మీసొంతం
  1. పెరుగు , తేనెతో తెల్లదనం :
  2. సెనగపిండి, నిమ్మరసం కలిస్తే తెల్లదనం స్వంతం :
 5. చర్మ సౌందర్యానికి నువ్వుల నూనె
 6. నా వయసు తగ్గించగలరా?
 7. ముఖం మీద మచ్చలు పోతాయా?
 8. సిక్స్‌ప్యాక్ సర్జరీ
 9. రొమ్ముల పెరుగుదల సాధ్యమేనా?
 10. దేహ సౌందర్యంలో ముఖ్య పాత్ర
 11. మొటిమలు
 12. బ్లాక్‌హెడ్స్ భరతం పట్టండి!
 13. చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది
 14. అందమైన చర్మం కోసం
 15. అందానికి చిట్కాలు!
 16. పెదవులు పగులుతున్నాయా...?
 17. కురుల సమస్యకు కారణాలెన్నో..!

మొటిమల నివారణకు పాటించవలసిన కొన్నిపద్దతులు

మొటిమలు ఉన్నప్పుడు ముఖం శుభ్రం చేసుకొనే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖాన్ని శుభ్రం చేయటానికి సబ్బులు కన్నా నీటిని ఎక్కువగా ఉపయోగించటం మంచిది. రోజు మొత్తంలో వీలైనన్ని ఎక్కువ సార్లు జిడ్డు పోయే విధంగా ముఖాన్ని కడగాలి. గాడమైన రసాయనాలు ఉపయోగించి తయారుచేసిన సబ్బులు,ఫేస్ వాష్ లును అసలు ఉపయోగించకూడదు.

 • నూనె రహిత మేకప్ సామాను మాత్రమే ఉపయోగించాలి. అలాగే మొటిమలు ఉన్నవారు నేరుగా ఎండలోకి వెళ్ళకూడదు. ఎండలోకి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా గొడుగు వెంట తీసుకువెళ్ళాలి.
 • ఒక స్పూన్ టమోటా గుజ్జులో ఒక స్పూన్ పాలు,రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి ముఖానికి బాగా పట్టించి ఆరాక శుభ్రం చేసుకోవాలి.
 • రాత్రి పడుకొనే ముందు మొటిమల మీద టూట్ పేస్ట్ అప్లై చేసి,తెల్లవారి లేచిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా మొటిమలు తగ్గే వరకు చేయాలి.
 • మెంతి ఆకులను మెత్తగా రుబ్బి మొటిమల మీద ఆపాలి చేసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

ఆధారము: తెలుగు వన్.కం

ఆరోగ్యమైన జుట్టు ఇక మీ సొంతం:

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ఎదుర్కుంటున్న సమస్య జుట్టు రాలిపోవడం. దిన్ని అధిగమించాలంటే జుట్టుకు సరైన పోషణ అందించాలి. వారంలో కనీసం రెండుసార్లైన నూనె పెట్టి మర్దన చేసి ఒక గంట తరువాత మనకు న్యాచురల్ గా దొరికే కుంకుడుకాయ రసం తో తల స్నానం చేయడం వల్ల కొంతైనా హెయిర్ ఫాల్ సమస్య నుంచి బయటపడొచ్చు. జుట్టు రాలకుండా కాపాడటంలో మందారం కీలకపాత్ర పోషిస్తుంది...

మందారంతో కొన్ని చిట్కాలు :

మందారపు పువ్వుని కాగేనూనేలో వేసి చల్లారిన తర్వాత జుట్టుకు పట్టించుకుని అరగంట తరవాత తలారా స్నానం చేస్తే జుట్టు నిగ నిగ లాడుతూ వత్తుగా పెరుగుతుంది.

పోడిబారినట్టు జీవం లేకుండా తయారైన జుట్టుకోసం :

ఆరు మందారపువ్వుల్ని గుజ్జుగా చేసి అందులో ఒక స్పూను కలబంద గుజ్జు కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

ఎక్కువగా ప్రయాణాలు చేసేవారి జుట్టుకోసం: ఒక గ్లాసు నీళ్లలో రెండు టీ స్పూన్ల టీ పొడి వేసి మరిగించి అందులో ఒక టేబుల్ స్పూను మందారపొడి వేసి కలిపి తలకు పట్టించాలి. జుట్టుకి ఇది మంచి కండీషనర్‌గా ఉపయోగపడుతుంది.

వెంట్రుకలు చిట్లిపోకుండా :

వెంట్రుకలు చిట్లిపోకుండా ఉండాలంటే ఒక కప్పు పుల్లటి పెరుగులో రెండు టీ స్పూన్ల మందారపొడి వేసి బాగా కలిపి జట్టుకి పట్టించాలి

జుట్టు ఎదుగుదలకు పోషకపదార్ధాలు,ప్రోటిన్స్ అవసరం కాబట్టి బలమైన పోషక పదార్ధాలైన పాలు,పళ్ళరసాలు రోజు తీసుకునే ఆహారంలో ఉదెల చూసుకోవాలి.

జుట్టురాలిపోవడానికి కారణం అనారోగ్య సమస్యలు కూడా కావచ్చు. మనం పై మెరుగులు ఎన్ని చేసినా జుట్టు లోపలి నుంచి ఆరోగ్యంగా ఉండాలంటే అవసరమైన ఆందోళనలకు గురికాకుండామనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకుంటూ ఈ చిన్న చిట్కాలను పాటిస్తూ ఆరోగ్యమైన జుట్టును మీ సొంతం చేసుకోండి...

ఆధారము: తెలుగు వన్.కం

హోంమేడ్ స్క్రబ్స్:

స్క్రబ్ చర్మానికి కొత్త నిగారిపుని ఇస్తుంది. ఇంట్లోనే స్క్రబ్ చేసుకునేందుకు నలుగుపిండిని మించింది లేదు. ఇంకా ఈ కింది చెప్పిన స్క్రబ్ లు కూడా ప్రయత్నించి చూడండి. మెరిసే చర్మం స్వంతమవుతుంది.

తేనెకు గుడ్డు తెల్లసొన,నలుగు చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్యాక్ లా వేసుకోవాలి. బాగా ఆరిన తరువాత చల్లని పాలలో ముంచిన దూదితో ఆ ప్యాక్ ను తీయాలి. తరువాత చల్లని నీటితో
కడుక్కుని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చర్మం పై సన్నని గీతల్లా కనిపించే ముడతలు మాయం.

ఇక శనగపిండి, వరిపిండి, ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకుని దీనికి కొద్దిగా పాలు.ఆలివ్ ఆయిల్ లేదా ఏదైనా వంట నూనె నాలుగైదు చుక్కలు చేర్చి మెత్తని మిశ్రమం లా చేసి ముఖానికి, మెడకు పట్టించి ఆరాక చల్లని నీటితో కడగాలి. పొడిచర్మం చర్మం కలిగిన వాళ్ళకి ఇది మంచి స్క్రబ్. తరచూ ఇలా చేస్తే చర్మానికి కొత్త నిగారింపు వస్తుంది.

సులువుగా ఇంట్లోనే చేసుకునే స్క్రబ్ లు ఇవిప్రయత్నించి చూడండి.

ఆధారము: తెలుగు వన్.కం

తెల్లదనం మీసొంతం

పెరుగు , తేనెతో తెల్లదనం :

పెరుగులో వుండే ఎంజైమ్స్ చర్మాన్నినిగనిగలాడేలా చేస్తాయి. అలాగే తేనే తేమని అందించటమే కాదు, యాంటి బాక్టీరియల్ ప్రోపర్టీస్ కూడా కలిగి వుంటుంది. ఈ రెండిటిని కలిపి ముఖానికి మాస్క్ వేసుకుంటే మంచి ఫలితం వుంటుంది.తేనే, పెరుగు సమపాళ్ళలో తీసుకుని బాగా కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి 15 నిముషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో కడిగెయ్యాలి. చర్మం నిగనిగలాడుతూ కొత్తకాంతిని స్వంతంచేసుకుంటుంది.

సెనగపిండి, నిమ్మరసం కలిస్తే తెల్లదనం స్వంతం :

శనగపిండి పావుకప్పు, రెండు స్పూన్ల నిమ్మరసం లేదా పాలు తీసుకుని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. శనగపిండి పడనివాళ్ళు పసుపు వాడొచ్చు. తయారు చేసుకున్న పేస్ట్ ను పట్టించే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి ఆ తరువాత పేస్ట్ ను పట్టించి పదిహేను నిముషాలు అలాగే ఉంచి తరువాత కడిగెయ్యాలి. ఈ ప్యాక్ తో ఇన్స్టంట్ గ్లో పొందవచ్చు.

ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం నల్లబడటమనే సమస్య వుండదు.

ఆధారము: తెలుగు వన్.కం

చర్మ సౌందర్యానికి నువ్వుల నూనె

వెన్న అన్ని వయసుల వారికి హితమైనను బాలురకు, వృద్ధులకు అత్యంత హితకరమైనది. నెయ్యి బుద్ధిని వికసింపచేయును. ఆవు నెయ్యి శ్రేష్ఠము. వంటకు ఉపయోగించు నూనెలలో నువ్వుల నూనె మంచిది. ఈ నూనెలో మిగిలిన అన్ని నూనెలకన్న క్రొవ్వు శాతం తక్కువగా ఉండును. ఆహారము తరువాత మానవునికి అవసరమయినది నిద్ర. ఆరోగ్యమును కాపాడుటలో బ్రహ్మచర్య పాలన కూడా ముఖ్యమైనది.

నువ్వుల నూనె

నూనె : వంటకు ఉపయోగించు నూనెలలో నువ్వుల నూనె మంచిది. ఈ నూనెలో మిగిలిన అన్ని నూనెలకన్న క్రొవ్వు శాతం తక్కువగా ఉండును. వాత, కఫ వ్యాధులందు పథ్యము. మధుర రసమును, ఉష్ణ గుణమును కలిగి ఉంటుంది. శరీర బరువులు పెరగనివ్వదు. చర్మమునకు, నేత్రములకు మంచిది. గర్భాశయ దోషములను పోగొట్టును. శరీరమునకు మృదుత్వమును కలిగించును. వ్రణములను మాన్పును.

ఆయుర్వేద శాస్త్రరీత్యా, ఆరోగ్యరీత్యా అన్ని నూనెలకన్న నువ్వుల నూనె మంచిది.

వెన్న : పథ్యముగా పనిచేయును, బలమును కలుగచేయును. వాత వ్యాథులలో, రక్త దోషములలో పనిచేయును. క్షయ, మూలశంక, దగ్గులను పోగొట్టును. అన్ని వయసుల వారికి హితమైనను బాలురకు, వృద్ధులకు అత్యంత హితకరమైనది. వెన్న ఇతర క్రొవ్వు పదార్థముల కన్నా త్వరగా జీర్ణమగును.

నెయ్యి :మధుర రసం కలిగి ఉండును. చలువ చేయును. బలమును కలుగచేయును. నేత్రములకు మంచిది. ఆకలిని కలిగించును. విషములకు విరుగుడుగా పని చేయును. బుద్ధిని వికసింపచేయును. పుండ్లను మాన్పును. రక్త దోషములను, వాత రోగములను, పోగొట్టును. క్షయ, విసర్పము, చర్మ వ్యాధులందు మంచిది. ఆవు నెయ్యి శ్రేష్ఠము.

నిద్ర :ఆహారము తరువాత మానవునికి అవసరమయినది నిద్ర. ఆహారము, నిద్ర, బ్రహ్మ చర్యము ఈ మూడింటిని మానవునికి ఉపస్తంభములుగా, ఆధారములుగా చెప్పిరి. శారీరిక, మానసిక కార్యముల వల్ల కలిగిన అలసట నిద్ర వలన పోవును. కాలమును అతిక్రమింపక ప్రతి రోజూ రాత్రి సుమారు 6 గంటల నిద్ర మానవునికి అవసరము. ఎండాకాలము తప్ప మిగిలిన కాలములలో పగటి నిద్ర పనికిరాదు.

బ్రహ్మచర్యము : ఆరోగ్యమును కాపాడుటలో ఆహారము, నిద్రలతో పాటు బ్రహ్మచర్య పాలన కూడా ముఖ్యమైనది. ఇచట బ్రహ్మచర్యమనగా నియమబద్ద సంసార ధర్మమును నిర్వర్తించుట అని అర్ధం. మానవులందరూ సంసారమును త్యజించమని ఏ ధర్మ శాస్త్రము చెప్పలేదు. నియమముల ననుసరించి దాంపత్య సుఖమును అనుభవించుట బ్రహ్మచర్య మనబడును. దీనికి సంబంధించిన విధి నియమములు, భార్యా భర్తలు ఆచరించవలసిన ఆహార, ఔషధ వివరములు ఆయుర్వేదమునందు విస్తృతముగా చెప్పబడినవి.

ఆధారము: లోకహితం.నెట్

నా వయసు తగ్గించగలరా?

నా వయసు 45 సంవత్సరాలు. కానీ చూడడానికి 60 సంవత్సరాల వయసున్నదానిలా కనిపిస్తాను. ముఖమంతా ముడతలతో ముసలిదానిలా ఉన్నాను. నేను యంగ్‌గా కనబడేటట్లు చేయడం సాధ్యమా? తెలుపగలరు.

ముడతలు కనిపించకుండా చేసేందుకు చాలా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఫేస్‌లిఫ్ట్ సర్జరీ ఒకటి. దీనిద్వారా ముఖంపై ముడతలు కొంతవరకు కనబడకుండా చేయవచ్చు. దీని ద్వారా వయసును కనీసం 6 నుంచి 8 సంవత్సరాలు తక్కువగా అనిపించేట్లు చేయవచ్చు. అన్ని సర్జరీల్లానే దీనితో కూడా పలు సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

అయితే ముఖ్యంగా తెలుసుకోవలసింది ఏమిటంటే అనుభవజ్ఞులైన వైద్యులతోనే చేయించుకోవాలి. అలాచేస్తే చాలావరకు సమస్యలు తక్కువ స్థాయిలోనే ఉంటాయి. ఈ విధానంలో చేతిపై చర్మాన్ని కొంత భాగం తీసుకుని దాన్ని ముఖంపై అమర్చడం ద్వారా ముడతలను కప్పివేయవచ్చు. నుదుటి భాగం, మెడ భాగంలో కూడా ఇలాగే చేయవచ్చు. ఇవన్నీ కూడా సురక్షితమైన చికిత్సలే. కనుక ప్లాస్టిక్ సర్జన్‌ను సంప్రదించి సరైన చికిత్స తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

నా వయసు 38 సంవత్సరాలు. బరువు 140 కేజీలు. అధిక బరువుతో నేను పడే అవస్థలు వర్ణనాతీతం. నడవడమే చాలా కష్టంగా ఉంటోంది. లైపోసక్షన్ చేయించుకోవడం ద్వారా సన్నగా అవ్వాలనుకుంటున్నాను. ఇది సాధ్యపడుతుందా? సలహా ఇవ్వగలరు.

మీకు లైపోసక్షన్ సరైనది కాదు. ఎందుకంటే మీరు చాలా బరువుఉన్నారు. మీ అసాధారణ బరువును మమూలు బరువు అంటే 90కేజీల్లోపు తీసుకురావాలంటే దాదాపు 50 కేజీలు తగ్గాలి. లైపోసక్షన్‌తో అంత బరువు తగ్గడం సాధ్యం కాదు. పైగా అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. బెరియాట్రిక్ సర్జరీ ద్వారా మీకు కొంతవరకూ ప్రయోజనం ఉంటుంది. ఈ సర్జరీ ద్వారా పొట్టసైజును తగ్గిస్తారు.

సైజు తగ్గడంతో కొంచెం తినగానే కడుపు నిండిపోతుంది. తినే పరిమాణం తగ్గడంతో శరీరంలో కొవ్వు పేరుకోవడానికి అవకాశం ఉండదు. దీంతో బరువు తగ్గడం సాధ్యమవుతుంది. ఈ సర్జరీ తర్వాత ఆరు నెలల వ్యవధిలో 20 నుంచి 30కేజీలు తగ్గిన సందర్భాలున్నాయి. కనుక మీరు వెంటనే ప్లాస్టిక్‌సర్జన్‌ను సంప్రదించి తగిన చికిత్స దాని వివరాలను పూర్తిగా తెలుసుకుని ఒక నిర్ణయానికి రండి.

ముఖం మీద మచ్చలు పోతాయా?

నా వయసు 23 సంవత్సరాలు. నాకు ముఖం మీద మొటిమలు వచ్చి తగ్గిపోయాయి. కానీ మచ్చలు అలాగే మిగిలిపోయాయి. వీటివల్ల ముఖం చూడడానికి వికారంగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఇవి పోయే మార్గం ఉందా?

ముఖం మీది మచ్చలను తొలగించడానికి చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. డెర్మాబ్రేషన్ అనే పద్ధతి ద్వారా మీ ముఖం మీది మచ్చలు కొంతవరకూ కనిపించకుండా చేయవచ్చు. దీంతో చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. కెమికల్ పీల్ మరొక పద్ధతి. ఇందులో కొన్ని రసాయనాలను వాడడం ద్వారా చర్మం పైపొరలను తీసివేయవచ్చు. తర్వాత వచ్చే చర్మం యవ్వనంగా కనిపించడమే కాకుండా తాజాగా ఉంటుంది. అందుబాటులో ఉన్న మరొక పద్ధతి టిష్యూపిల్లర్స్.

ఈ పద్ధతిలో ఇంజెక్షన్స్ ద్వారా చర్మం గుంటలుగా ఉన్నచోట లోపలికి ఒక పదార్థాన్ని ప్రవేశపెట్టి ఆ గుంటలను పూడ్చివేయడం జరుగుతుంది. అయితే ఈ పద్ధతుల ద్వారా కొంత వరకూ ఫలితాలను తీసుకురావచ్చు. మచ్చలను పూర్తిగా తొలగించే అవకాశం లేదు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఈ చికిత్సలను పూర్తిగా అనుభవజ్ఞులైన నిపుణులతోనే చేయించుకోవడం మంచిది. లేకుంటే పలు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

నా వయసు 21 సంవత్సరాలు. నా రొమ్ములు చాలా పెద్దసైజులో ఉంటాయి. దీనివల్ల బయటకు వెళ్లాలంటే చాలా సిగ్గుగా ఉంటోంది. రొమ్ముల బరువుకి భుజాలు, వీపు భాగంలో విపరీతమైన నొప్పి వస్తోంది. లూజ్ డ్రెస్‌లు వేసుకుని వాటిని కనబడకుండా ఉండేలా ప్రయత్నం చేస్తున్నాను. కానీ బయట అందరూ నావైపే చూస్తున్నారని అనిపిస్తోంది. దీంతో మానసికంగా కుంగిపోతున్నాను. దీనికి పరిష్కారం తెలియజేయగలరు. ?

మీ సమస్యను నేను అర్థం చేసుకోగలను. మీ సమస్యని 'గిగాంటో మాస్టియా' అంటారు. రొమ్ముసైజు 42 లేక 46 సెంటీమీటర్లు ఉండడం వల్ల ఆ బరువుకి అవి కిందికి వేలాడుతూ ఉంటాయి. కొంతమందికైతే బొడ్డువరకూ వేలాడుతుంటాయి. దీనికి తోడు రొమ్ముకింది భాగంలో శుభ్రత లోపిస్తే అక్కడ చర్మవ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రిడక్షన్ మమ్మోప్లాస్టీ అనే శస్త్రచికిత్స ద్వారా మీ రొమ్ముల సైజును తగ్గించి చిన్నవిగా చేయవచ్చు. ఇదే కాకుండా ఇంకా పలు రకాల శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

కనుక రొమ్ముల సైజు ఆధారంగా సరైన శస్త్రచికిత్సను నిర్ణయించవచ్చు. ఈ చికిత్సలో రొమ్ముపాలను ఉత్పత్తి చేసే గ్రంధిని తగ్గించడం వల్ల తర్వాత పాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుంది. కానీ సైజు, బరువు తగ్గడం వల్ల మీ ప్రస్తుత బాధ తొలగిపోతుంది. కనుక ప్లాస్టిక్ సర్జన్‌ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోండి.

సిక్స్‌ప్యాక్ సర్జరీ

సిక్స్‌ప్యాక్...నేటి యువత కల. ఎప్పటికైనా కండలవీరులవ్వాలని ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. సల్మాన్‌ఖాన్, షారూక్, అమీర్‌ఖాన్ వంటి బాలీవుడ్ తారలు మొదట్లో సిక్స్‌ప్యాక్ సంప్రదాయానికి తెరలేపారు. మెల్లగా మన తెలుగుహీరోలు కూడా కొందరు బాలివుడ్ కథానాయకుల బాటలో నడిచారు. సిక్స్‌ప్యాక్ బాడీ అంటే చిన్నవిషయం కాదు. నెలల తరబడి డైటింగ్, ఎక్సరసైజులు చేయాలి. ఈ సాధన మితిమీరితే ఆరోగ్యం దెబ్బతినే అవకాశమూ ఉంది. ఎంత ఇష్టపడ్డప్పటికీ అంత కష్టపడే ఓపిక అందరికీ ఉండదు.

అయితే ఇప్పుడు తొంభైవేల రూపాయలు ఖర్చుపెట్టగలిగితే ఆ కోరికను అంత కష్టపడకుండా నిజం చేసుకోవచ్చంటున్నారు డాక్టర్ మోహన్ థామస్. ముంబయిలోని బ్రీచ్‌కాండి ఆసుపత్రిలో థామస్ సిక్స్‌ప్యాక్‌కి సర్జరీ చేస్తూ వార్తల్లోకెక్కారు.

వెంటనే జేబులో తొంభైవేలు పెట్టుకుని ముప్పై నుంచి నలభై మంది ఆసుపత్రి దగ్గర క్యూ కట్టారు. వీరిలో ఎక్కువమంది నటులు, మోడల్సే. ఇప్పటివరకూ మనకు ముక్కుకి, మొహానికి సర్జరీ చేయించుకోవడమే తెలుసు. దాదాపు అలాంటి ప్రయత్నమే ఈ సిక్స్‌ప్యాక్ సర్జరీ కూడా. లిపోలిసిస్ అనే చికిత్స ద్వారా ఈ సర్జరీ చేస్తున్నారు. లిపోలిసిస్ అనే ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా పొట్ట ప్రాంతంలో ఉన్న కొవ్వంతా కరిగిపోతుంది. సో....మీరూ సిక్స్‌ప్యాక్ వీరులు అవ్వాలనుకుంటే ముంబయికి బయలుదేరండి

రొమ్ముల పెరుగుదల సాధ్యమేనా?

కొంతమంది ఆడవారిలో రొమ్ముల ఎదుగుదల సరైన విధంగా ఉండదు. దీంతో చాలామంది స్త్రీలు మానసికంగా ఎంతో వేదనకు లోనవుతుంటారు. ఈ సమస్య పెళ్లికి పెద్ద అవరోధం అయి కూర్చుంటుంది. దీనికి వైద్యపరంగా పరిష్కారం లేదనే భావన చాలా మందిలో ఉంది. ఆ భావనతో లేదా సిగ్గుతో వైద్యులను సంప్రదించడానికి స్త్రీలు వెనుకాడుతుంటారు. ఈ విషయంలో వ్యర్థమైన సందేహాలన్నీ పక్కనబెట్టి వైద్యులను సంప్రదిస్తే జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చంటున్నారు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సంజీవ్ శశ్మిత్.

ఆధునిక వైద్య విధానంలో రొమ్ముల ఆకారాన్ని మమ్మోప్లాస్టీ శస్త్రచికిత్స ద్వారా పెద్దవిగా మార్చుకునే సౌలభ్యం ఉంది. ఈ చికిత్సలో ముందుగా కావాల్సిన సైజును నిర్ణయించుకుని ఆ సైజుకి తగిన ఇంప్లాంట్స్‌ను అమర్చడం ద్వారా రొమ్ముల ఆకారాన్ని పెద్దవిగా చేయవచ్చు. అయితే ఒకేసారి కోరిన సైజుకి తీసుకురావడం సాధ్యం కానప్పుడు మొదట రొమ్ముల్లోకి బెలూన్ ఎక్స్‌పాండర్ ప్రవేశపెట్టి అందులోకి నీరు పంపించడం ద్వారా కావాల్సిన సైజుకి రొమ్ములను పెంచుతాము. తర్వాత ఆ బెలూన్‌ను తీసివేసి దాని స్థానంలో ఇంప్లాంట్ అమర్చుతాము.

ఇటీవలి కాలంలో ఈ శస్త్రచికిత్సను చాలామంది చేయించుకుంటున్నారు. నిపుణులైన వైద్యులు ఏ ఇబ్బందులు లేకుండానే ఈ చికిత్సను పూర్తిచేస్తారు. రూపురేఖల్లో ఇవి సాధారణ రొమ్ముల్లాగే ఉంటాయి. చికిత్స తర్వాత స్త్రీలలో ఉన్న మనోవేదన తొలగిపోయి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఇదే చికిత్సతో పెద్దగా ఉన్న రొమ్ములను చిన్నవిగా కూడా చేయవచ్చు. అంటే మొత్తంగా రొమ్ములు ఏ సైజుకి కావాలంటే ఆ సైజుకు మార్పించుకునే సౌలభ్యం ఉంది. ఈ విషయంలో ప్లాస్టిక్‌సర్జన్‌ను సంప్రదిస్తే శస్త్రచికిత్సకు ముందుగా పూర్తి సమాచారాన్ని తెలియజేయడంతోపాటు అనుమానాలు, భయాలు, సందేహాలను తొలగించగలరు.

"కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు'' ఈ సామెత మీరు వినే ఉంటారు. కొంతమంది అనారోగ్యాన్ని తొలగించుకోవడం కోసం ఇంజెక్షన్ చేయించుకుంటే అనారోగ్యం సంగతేమో కానీ ఇంజెక్షన్ చేసిన చేయి చచ్చుబడిపోతుంది. దాంతో సాధారణ జీవనం పెద్ద భారంగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో వెంటనే వైద్యనిపుణుడిని సంప్రదించకపోతే ఆ చేయి పనిచేయకుండా పోయే ప్రమాదముంది. అనుభవం లేని వారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు కాని వారు ఇంజెక్షన్ చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది.

ఇంజెక్షన్ నరానికి ఇవ్వడం వల్ల ఆ నరం దెబ్బతినే ప్రమాదముంటుంది. ఈ సమస్యలో చేయి పైకి లేపలేకపోవడం, వేళ్లు కదిలించలేకపోవడం జరుగుతుంది. ఈ సమస్యను రేడియో నెర్వ్ పాల్సీ అంటారు. చేతి బొటన వేలికి తిమ్మిరి కూడా ఉంటుంది. ఎందుకంటే రేడియల్ నెర్వ్ స్పర్శ ఇచ్చే భాగం అదే. ఈ విషయంలో వెంటనే వైద్యులను సంప్రదిస్తే తగిన చికిత్స ద్వారా చేయి దెబ్బతినకుండా కాపాడుతారు. వైద్యులను సంప్రదించడం బాగా ఆలస్యం చేస్తే ఆ నరంతోపాటు దానికి సంబంధించిన కండరాలు కూడా దెబ్బతింటాయి.

అయితే అటువంటి సందర్భాల్లో చేయి మణికట్టు, వేళ్లకు కదలిక తెప్పించడానికి వీలుగా వేరే ప్రదేశంలోని కండరాలను వాడుకోవడం జరుగుతుంది. అంటే ఇంజెక్షన్ చేసిన చోట దెబ్బతిన్న నరాన్ని తొలగించి వేరే నరాన్ని అక్కడ ప్రవేశపెడతారు. దానివల్ల కొంత ఉపయోగం ఉంటుంది. ఈ సమస్యతో బాధపడేవారు ఆలస్యం చేయకుండా వెంటనే ప్లాస్టిక్ సర్జన్‌ను కలిస్తే తగిన పరిష్కారం లబిస్తుంది.

దేహ సౌందర్యంలో ముఖ్య పాత్ర

దేహసౌంద ర్యంలో ప్రతీ అంగం ప్రధాన పాత్ర పోషిస్తుంది. దేన్నీ నిర్లక్ష్యం చేయడానికి వీలులేదు. అదేసమయంలో బయటకు కనిపించే కొన్ని ముఖ్య అవయవాల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటే మన అందాన్ని రెండు రెట్లు మెరుగుపరచుకోవచ్చు.

కళ్లు: దేహ సౌందర్యంలో కళ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. చూడగానే ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకునేవి కళ్లు. ఇవి ఆరోగ్యంగా ఉంటే మన అందం పదింతలైనట్ల్లే. కనుక కళ్లను ఎప్పుడూ ఆరోగ్యంగా కాపాడుకోవాలి.

తీపి పిండి పదార్థాలను ఎక్కువగా తినవద్దు. దీనివల్ల కళ్లు నిస్సారంగా కనిపిస్తాయి.

రక్తనాళాలు ఇబ్బందికి గురైతే కళ్లు అలసిపోయినట్లుగా కనిపిస్తాయి. కళ్ల చుట్టూ ఉన్న చర్మం చాలా సున్నితమైనది. ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కుంటే రక్తప్రసరణ మంచిగా జరుగుతుంది. యాపిల్ జ్యూస్‌ను కళ్ల చుట్టూ రాసుకోండి. యాపిల్‌జ్యూస్‌లో పెక్టిన్ ఎక్కువగా ఉంటుంది. దాంతో కళ్లు మెరుస్తూ కనిపిస్తాయి.

ఎక్కువగా ఒత్తిడికి లోనుకావద్దు. కంప్యూటర్ల ముందు గంటల తరబడి పనిచేయాల్సి వస్తే మధ్యమధ్యలో కళ్లు ఆర్పుతూ వాటికి కొంత విశ్రాంతి కల్పించండి.

చర్మం: చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే శాఖాహారాన్ని మించింది లేదు. విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. ఎక్కువ శాతం కూరగాయల్లో ఫైబర్, నీరు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపించడంలో చక్కగా తోడ్పడతాయి.

దేహానికి వ్యాయామం ఎంతో అవసరం. అలాగే చర్మానికి వ్యాయామం మంచి మెరుపునిస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. కనుక ప్రతిరోజూ వేకువజామున వేగంగా నడవడం, పరుగెత్తడం, ఏరోబిక్ ్స తదితర వ్యాయామాలు చేయడం మంచిది. దీనివల్ల శరీరంలో పేరుకున్న కొవ్వు, మలినాలు బయటకు వెళతాయి.

అలాగే యోగా, ప్రాణాయామం మనసుకే కాదు చర్మానికీ నూతన శక్తిని అందిస్తాయి. ఎప్పుడూ తాజాదనంతో మెరుపు తీగలా కనిపించడానికి ఇవి సహకరిస్తాయి.

చేతులు: చేతులపై ఉండే చర్మం మందంగానే కాదుచాలా సున్నితమైనది. కనుక రోజులో కనీసం నాలుగు సార్లయినా మాయిశ్చరైజింగ్ క్రీమును చేతులకు తప్పనిసరిగా రాసుకోవాలి. అలాగే మెనిక్యూర్‌ను తప్పకుండా ప్రతీవారం చేయించుకోవాలి. వారానికి ఒకసారి రాత్రిపూట నిద్రించడానికి ముందు ముఖసౌందర్యానికి వాడుకునే క్రీమును చేతులకు రాసుకోవాలి. పొడిచర్మం ఉన్నవారు చేతులను ఉప్పతో కడుక్కుంటే మంచిది.

ఇంట్లో, బయట గార్డెన్‌లో పనిచేస్తున్నప్పుడు రబ్బర్ గ్లౌజులను చేతులకు వేసుకోవాలి.

అలాగే గోళ్లు అందంగా కనిపించడానికి కాల్షియం లభించే ఆహారాన్ని తీసుకోవాలి. గోళ్లను ఎప్పటికప్పడు కట్ చేసుకోవడాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.

పాదాలు: అలాగే పాదాల ఆరోగ్యం కూడా దేహ సౌందర్యంలో చాలా ముఖ్యం. ఇవి ఆరోగ్యంగా ఉంటేనే చూడడానికి అందంగా ఉంటాయి. మనల్ని భూమిపై నిలబెట్టేది పాదాలే. వీటి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అందవిహీనంగా తయారవుతాయి. పాదాలు నీటిలో ఎక్కువగా తడవకుండా, బురద అంటకుండా జాగ్రత్త తీసుకోవాలి. బ్యాక్టీరియా పాదాల్లోకి చేరకుండా జాగ్రత్త తీసుకోవాలి.

యాంటీఫంగల్ క్రీమును రోజూ రాత్రిపూట రాసుకోవాలి. ఇలా వారంలో మూడురోజులు చేస్తేచాలు. దానివల్ల పాదాలపై దాడిచేసే ఎన్నోరకాల క్రిములను సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. అలాగే మాయిశ్చరైజింగ్ క్రీమును కూడా రాసుకోవాలి.

బయటకు వెళ్లేటప్పుడు పాదాలకు సాక్స్ తప్పకుండా ధరించే వె ళితే ఎంతో మంచిది. దానివల్ల దుమ్ము, కాలుష్యం నుంచి పాదాలకు రక్షణ లభిస్తుంది. షూ అలవాటుంటే మంచిది. అయితే ఈ కాలంలో షూని ఎక్కువ సమయంపాటు ధరిస్తే గాలి ఆడక దురదలు, అలర్జీ వచ్చే ప్రమాదముంది.

పాదాలకు పగుళ్లు ఏర్పడితే వైట్‌పెట్రోలియం జెల్లీ రాసుకోండి.

మొటిమలు

యుక్కవయస్కుల్లో ముఖం మీద మొటిమలు రావడం ఒక సాధారణ సమస్య. కొన్నిసార్లు ఇవి వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ, కొన్ని సార్లు ఇవి బాగా పెద్దవై చీముకూడా పట్టవచ్చు. వాటిని గిల్లడం వల్ల గుంటలు, మచ్చలు ఏర్పడి ముఖమంతా వికారంగా తయారవుతుంది. మొటిమల వచ్చే సమస్యలు వ్యక్తి వ్యక్తికీ వేరుగా ఉంటాయి. ఆ లక్షణాలను అనుసరించి హోమియో మందులు వేసుకుంటే సమస్య చాలావరకు తగ్గుతుంది.

కొందరికి మొటిమలలో చీము చేరి దురద, నొప్పి ఉంటాయి. వీరు సైలీషియా-200 (పొటె న్సీ) మందును ప్రతి 12 గంటలకు ఒక డోసు చొప్పున మూడు సార్లు వేసుకోవాలి. ఆ తరువాత ఇదే మందును 1000 పొటెన్సీలో వారానికి ఒక డోసుచొప్పున కొన్ని వారాలు వాడితే వ్యాధి నయమవుతుంది.

బొద్దుగా ఉండే కొంత మంది అమ్మాయిల్లో మొటిమలే కాకుండా చెమట ఎక్కువగా పోసే తత్వం కూడా ఉంటుంది. వీటికి తోడు తరుచూ జలుబుతో బాధపడుతూ ఉండడం, రుతుస్రావం తురుచుగానూ అధికంగానూ అవుతూ ఉండడం వంటి లక్షణాలు కూడా ఉన్నప్పుడు కాల్కేరియా కార్బ్-200 మందును 15 రోజుల కొక డోసు చొప్పున కొన్ని నెలల పాటు వేసుకుంటే ఈ సమస్య బాగా తగ్గుతుంది.

కొంత మంది యుక్త వయస్కుల్లో మొటిమలతో పాటు జీర్ణకోశ సమస్యలు కూడా ఉంటాయి. ముఖం జిడ్డుగా ఉంటుంది. మొటిమలు తరుచుగా వస్తూ ఉంటాయి. వీరికి యాంటిం క్రూడ్-200 మందును ప్రతి 12 గంటలకు ఒక డోసు చొప్పున మూడు డోసులు ఇస్తే మంచి ఫలితం ఉంటుంది.

కొందరిని మొటిమల సమస్య దీర్ఘకాలికంగా కొనసాగుతూ ఉంటుంది. ఎన్ని మందులు వాడినా తగ్గకుండా వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి వారు సల్ఫర్ అయోడ్-200 మందును ప్రతి 12 గంటలకు ఒక డోసు చొప్పున 5 డోసులు ఇవ్వాలి. ఇది చాలా లోతుగా పనిచేసే మందు. ప్రత్యేకంగా ముఖ చర్మం మీదే పనిచేసే మందు కావడం వల్ల మొటిమలను బాగా తగ్గిస్తుంది.

కేవలం మొటిమలకే కాకుండా చర్మానికి సంబంధించిన అన్ని మొండి వ్యాధులను నయం చేసే కొన్ని మందులు హోమియోలో ఉన్నాయి.అలాంటి వాటిలో సోరినం-1000 మందు ప్రధానమైనది. ఈ మందును నెలకు ఒక డోసు చొప్పున కొన్ని నెలల పాటు వేసుకుంటే సమస్య మూలాల్లోంచి తొలగిపోతుంది. ఈ మందు వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి కూడా తోడ్పడుతుంది.

గమనిక : ఇందులో సూచించిన మందులన్నీ ప్రధమ చికిత్సకు ఉద్ధేశించినవి. ఒకవేళ ఈ మందులు వాడిన తరువాత కూడా ఫలితం కనిపించకపోతే దగ్గరలో ఉన్న హోమియో వైద్యుణ్ని సంప్రదించండి.

బ్లాక్‌హెడ్స్ భరతం పట్టండి!

యుక్తవయసులో అమ్మాయిల ముఖంపై నల్లమచ్చలు సర్వసాధారణం. ఇవి ముఖారవిందాన్ని పాడుచేయడమే కాకుండా ఆత్మన్యూనతనూ కలుగచేస్తాయి. దీంతో పదిమందిలోకి వె ళ్లాలంటే బిడియపడతారు. రిలేషన్స్ దెబ్బతినే ప్రమాదమూ ఉంది. ఇవి ఎంతగా బాధిస్తున్నా కొంతమంది డాక్టర్లను సంప్రదించడానికి ఆసక్తి చూపించరు. మార్కెట్లో దొరికే క్రీములను రాస్తూ ముఖాన్ని మరింత పాడుచేసుకుంటారు. ఇటువంటివారు కొన్ని సౌందర్య చిట్కాలను పాటించడం ద్వారా వారి ముఖ సౌందర్యానికి అడ్డుగా ఉన్న నల్ల మచ్చలను చెరిపేసుకోవచ్చు. అవి...

అర స్పూన్ నిమ్మరసానికి కాస్తంత గ్లిజరిన్ జోడించి ఆ మిశ్రమాన్ని నల్లమచ్చలున్న ప్రాంతంలో రాస్తే తొందర్లోనే వాటి బాధ వదిలిపోతుంది.

చిటికెడు పసుపును రెండు మూడు గోరింటాకులతో కలిపి పేస్ట్‌లా చేసి మచ్చలపై రాసినా మంచి ఫలితం ఉంటుంది.

కొంచెం పసుపు, కరివేపాకును కలిపి మెత్తని పేస్టులా చేసి మచ్చలపై రాయాలి.

ఎండిన తులసి ఆకులను పొడిచేసి దానికి వేపాకు పొడి, పుదీనా 100గ్రామలు కలుపుకోవాలి. దానికి కొంత పసుపు, రోజ్‌వాటర్ కలిసి పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలపై రాస్తే నల్లమచ్చలు మాయమవడమే కాకుండా చర్మం మెరుపును సంతరించుకుంటుంది.

ఎండిన తమలపాకులను పొడి చేసి దానికి కొంచెం కొబ్బరినూనె కలిపి ఆ మిశ్రమాన్ని మచ్చలపై రాసినా ఉపయోగం ఉంటుంది.

రాత్రి పడుకునే ముందు కొంచెం నీళ్లలో చపాతీని నానబెట్టి మర్నాడు ఉదయం దాన్ని పేస్ట్‌లాగా చేసి ముఖానికి పట్టించండి. ఇలా కొన్ని రోజులపాటు క్రమం తప్పకుండా చేస్తే బ్లాక్‌హెడ్స్ తొలగిపోతాయి.

కుంకుమపువ్వును పొడి చేసి దానికి కొంత తేనె కలిపి ముఖానికి రాసుకుంటే బ్లాక్‌హెడ్స్ తొందరగా మాయమవుతాయి.

మచ్చలను తొలగించడంలో సిట్రస్ జాతికి చెందిన పండ్లరసాలకు మించింది లేదు. కొంచెం నిమ్మరసాన్ని కాటన్‌తో తీసుకుని నల్లటి మచ్చలపై రాసి సుతిమెత్తగా మసాజ్ చేయాలి. దీనిలో ఉన్న విటమిన్-సి మచ్చలపై మంచి ప్రభావం చూపిస్తుంది.

కొంచెం దూదిపై పాలు లేదా మజ్జిగ చుక్కలు వేసి దాన్ని మచ్చలున్న ప్రాంతంపై రాసుకోండి. వీటిలో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ చర్మాన్ని తెల్లగా మార్చుతుంది.

మచ్చలున్న ప్రదేశంలో తేనెను రాసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. తేనెలో ఎన్నో చక్కటి ఔషధ గుణాలున్నాయి. అవి నల్లమచ్చలను తొలగించడంలో తోడ్పడతాయి.

విటమిన్-ఇ ఆయిల్‌ను రాత్రి నిద్రకు ముందు ముఖానికి రాసుకుని తెల్లారి లేచిన తర్వాత కడుక్కోండి.

వీటితోపాటు నిత్యం సన్‌స్క్రీన్ లోషన్‌ను ముఖానికి రాసుకోవడం మర్చిపోవద్దు.

సూర్యుడి కిరణాల కారణంగా చర్మంలో ఉండే మెలానిన్‌లో హెచ్చుతగ్గులు వస్తాయి. ఈ మెలానిన్ శాతం తగ్గినప్పుడు చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. కాబట్టి పైన చెప్పిన చిట్కాలను పాటించడం వల్ల చర్మం మెరుపును సంతరించుకోవడంతో పాటు నల్లమచ్చలు తొలగి ముఖం మరింత అందంగా కనబడుతుంది.

చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది

ఆపిల్ గుజ్జులో గోధుమ పొట్టు కలిపి పేస్ట్ చేయాలి. ముఖానికి, చేతులకు ఈ మిశ్రమాన్ని పట్టించి స్క్రబ్ చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది ఈ స్క్రబ్.

అందమైన చర్మం కోసం

ఆరోగ్యవంతమైన చర్మం అందంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.ఎంత చక్కటి కనుముక్కు తీరు ఉన్నా మచ్చలు, మెుటిమలు గల చర్మం ఉంటే వారి అందం కొంచెం మసకబారినట్టే ఉంటుంది. అందుేక ముఖ చర్మాన్ని ఎప్పుడూ శుభ్రంగా, ఆరోగ్యవంతంగా కాపాడుకోవాలి.మెటిమలకు కారణమైన బ్లాక్‌హెడ్గ్స వంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.చికత్సకంటే నివారణ ఉత్తమమైనట్టుగా అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి కొన్ని చిట్కాలు...

మేకప్‌ వేసుకునే అలవాటు ఉన్న వారు జిడ్డుగా ఉండే కాస్మొటిక్స్‌ను దూరంగా ఉంచడం మంచిది.జిడ్డుగా ఉండే కాస్మొటిక్స్‌ చర్మ రంధ్రాలలో చిక్కుకుని బ్లాక్‌హెడ్స్‌ అనంతరం మొటిమలు రావడానికి కారణమవుతుంది.

ఒకవేళ జిడ్డు చర్మం ఉన్నట్టు అయితే సున్నితమైన క్లెన్సర్‌ను ఉపయోగించడం మంచిది. పదే పదే సబ్బును ఉపయోగించి ముఖం కడగడం కన్నా క్లెన్సర్‌తో శుభ్రం చేసుకుని నీళ్ళతో కడిగేసుకుంటే ముఖం శుభ్రంగా ఉంటుంది.పదే పదే సబ్బును ఉపయోగిస్తే చర్మ కణాలు పాడయ్యే అవకాశముంటుంది.

 • మృత చర్మ కణాలను తొలగించేందుకు ఎక్స్‌ఫోలియేషన్‌ మం చిది.చర్మ రంధ్రాలలో వృద్ధి చెందే మృతకణాలను ఎక్స్‌ఫోలియేట్‌ చేయ డం ద్వారా తొలగిస్తే బ్లాక్‌హెడ్స్‌ సమస్య చాలా వరకూ తీరిపోతుంది.
 • బాగా జిడ్డు చర్మం ఉన్నవారు ఆ జిడ్డును తొలగించుకునేందుకు క్లే మాస్క్‌ ఉపయోగించడం మంచిది.పుదీనా, పిప్పర్‌మెంట్‌ లేదా చికాకు చేసే పదార్ధాలు లేని క్లే మాస్క్‌ను వాడడం మంచిది.
 • నిమ్మరసం, బాదం నూనె, గ్లిసరిన్‌ను సమపాళ్ళలో కలిపి ముఖానికి పట్టించుకోవాలి.ఇది బ్లాక్‌హెడ్స్‌ తగ్గేందుకు ఉపకరించడమే కాక ముఖంపై ఉండే ఇతర మచ్చలను కూడా తగ్గిస్తుంది.
 • ప్రతిరోజూ సాయంత్రం గోరువెచ్చటి నీళ్ళలో ముంచిన బట్టతో ముఖాన్ని తుడుచుకోవడం ఎంతో మంచిది.గోరువెచ్చటి నీళ్ళలో టవల్‌ లేదా నాప్కిన్‌ను ముంచి దానిని పావుగంట పాటు ముఖం మీద ఉంచుకోవడం ద్వారా చర్మ రంధ్రాలలో చిక్కుకుపోయిన మురికి, మృతకణాలు వంటివి బయటకు వచ్చేస్తాయి.అనంతరం ఆ నాప్కిన్‌ను వేడి నీటిలో ఉతకడం మరువకండి.
 • బ్లాక్‌హెడ్స్‌ ఎక్కువగా ఉంటే కొంచెం తేనె తీసుకుని దానిని వేడి చేసి అవి ఉన్న ప్రాంతంలో రాసి పది నిమిషాల తర్వాత కడిగి వేయాలి.ఇది సహజమైన పీల్‌లా ఉపయోగపడి బ్లాక్‌హెడ్స్‌ తొలగిపోయేందుకు దోహదం చేస్తుంది.

అందానికి చిట్కాలు!

ఎండలకు కమిలిన చర్మం ఓ పట్టాన మామూలు స్థితికి రాదు. దీని కోసం మహిళలు ఎంతో కసరత్తు చేస్తుంటారు. తెలిసిన చిట్కాలన్నీ పాటిస్తుంటారు. అలా కమిలిపోయిన చర్మాన్ని యధాస్థితికి తేవాలంటే ఎన్నో చిట్కాలు వున్నాయి. వాటిలో కొన్ని చిట్కాలు ఇక్కడ ఇస్తున్నాం..ప్రయత్నించి చూడండి.

 • బాదం పాలు ముఖానికి పట్టించి రాత్రంతా ఉంచుకోవాలి. ఉదయం లేవగానే గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ఫ్రెష్‌గా తయారవుతుంది.
 • నానబెట్టిన బాదం పప్పుల్ని పచ్చిపాలలో కలిపి పేస్టులా చేయాలి. ఈ పేస్టును ముఖం మీద కనీసం ప్రతిరోజూ ఒక గంటసేపు ఉంచు కోవాలి. రాత్రిపూట దీన్ని రాసుకుని పడుకుంటే మంచిది. ఉదయానికి ముఖం కాంతిని సంతరించు కుంటుంది.
 • బక్కెట్‌ నిండా నీళ్లు తీసుకుని దాన్లో రెండు నిమ్మకాయలు పిండాలి. ఆ రసం నీళ్ళలో బాగా కలిసాక ఆ నీళ్ళతో స్నానం చేయాలి. దీనిని కొన్ని నెలలవరకూ కొనసాగించాలి.

   

  ప్రతి రోజూ చర్మానికి తేనెను పూతగా రాయాలి. తలవెంట్రుకలకు మాత్రం తగలకుండా జాగ్రత్త పడాలి..ఎక్కువసేపు ఉండకుండా కాస్త ఆరగానే స్నానం చేయాలి.

 • నిమ్మ, తులసి ఆకుల రసం సమపాళ్ళలో లిపి రోజూ రెండుసార్లు ముఖానికి పట్టించాలి. ఆరిన తరువాత చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి.
 • బంగాళాదుంపల రసం తీసి ముఖానికి రాసుకున్నా మంచి ఫలితం వుంటంది. రాసిన తరువాత అర గంట వరకూ అలాగే ఉంచాలి. వారానికి రెండు, మూడు సార్లు ఇలా చేయడం వల్ల కమిలిపోయిన చర్మం రంగు మారుతుంది.
 • పచ్చిపాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టాలి. తర్వాత ఆ పాలు ఫ్రిజ్‌లో ఉంచాలి. రోజూ ఒక దూది పింజను తీసుకుని కమిలిపోయిన చర్మంపై రుద్దుతూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
 • శనగపిండి, నెయ్యి, పసుపు పేస్టులా తయారుచేసి చర్మంపై రాయాలి. కొద్దిగా ఆరాక చేత్తో మృదువుగా గుండ్రంగా మసాజ్‌ చేయాలి. ఇలా చేస్తే పొడిబారిన చర్మం పై ఉన్న మురికి తొలగిపోతుంది. దీనితో పాటు తగ్గిపోయిన ఛాయ మెరుగుపడుతుంది.
 • మీగడలో పసుపు కలిపి రోజూ చర్మానికి దాన్ని రాసుకుంటే మంచి ఫలితం వుంటుంది. ఇలా రాసుకున్న తరువాత మెత్తగా, నెమ్మదిగా మసాజ్‌ చేయాలి.
 • గంధం పొడిని, పసుపు, రోజ్‌వాటర్‌ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే ఛాయ మెరుగుపడుతుంది. ఎండకు నల్లగా మారిన చర్మం కాంతివంతంగా మారుతుంది.

పెదవులు పగులుతున్నాయా...?

ఎండలు మొదలయ్యాయి.హమ్మయ్య! చర్మం పగుళ్లు తగ్గుతాయనుకుంటే పొరపాటే.పెదవుల పైన చర్మం పొరలుగా వచ్చేయడం, పగుళ్లు బారడం ఎండాకాలంలో కూడా కనిపిస్తుంది. చర్మం పైన 16 పొరలు ఉంటాయి.కానీ పెదవులపై ఉండే చర్మంపై మాత్రం 3 నుంచి 4 పొరలు మాత్రమే ఉంటాయి.అందువల్ల పెదవుల పగుళ్లు సర్వసాధారణం.దీన్ని పట్టించుకోకపోతే పెదవులు నల్లగా మారే అవకాశం కూడా ఉంది.

అందుకే పెదవుల ఆరోగ్యం కోసం చిన్న చిట్కాలు...

- సగం నిమ్మకాయ ముక్కపై పంచదార అద్ది పెదవులపై గుండ్రంగా రుద్దాలి.ఇలా పది నిమిషాల పాటు చేసి చల్లని నీటితో కడిగేస్తే పెదవుల తేమ పోకుండా ఉంటుంది.

- పెదవులపై ఆలివ్ ఆయిల్‌ని రోజుకి రెండుసార్లు రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

- కొబ్బరినూనెలో రెండు మూడు స్పూన్ల నిమ్మరసం వేసి పెదవులకు రాస్తే కూడా ఈ సమస్య తగ్గుతుంది.

- రోజూ పెదవులకు తేనె రాసుకుంటే అక్కడి చర్మం నుంచి తేమ వెళ్లిపోకుండా కాపాడుతుంది.పగిలిన పెదవులకు ఇన్‌ఫెక్షన్ రాకుండా కూడా తేనె నివారిస్తుంది.

- రోజూ రెండు సార్లు మీగడ రాసుకున్నా పెదవులు మృదువుగా తయారవుతాయి.

కురుల సమస్యకు కారణాలెన్నో..!

అందమైన జుట్టుకు తగిన రక్షణ తీసుకోనట్లయితే సమస్యలు కూడా తలెత్తుతాయి.ప్రపంచ జనాభాలో కనీసం 80 శాతం మంది మహిళలు చుండ్రుతో బాధపడుతున్నారని ఇటీవల ఒక సర్వే తెలిపింది.అలాగే చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం వల్ల నలుగురిలోకి వెళ్ళాలంటే కూడా వారుచాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసింది.వీటన్నిటికీ కారణాలు అనేకం అని వారంటున్నారు. వీటితో పాటే అనేక సమస్యలూ వస్తాయని చెబుతున్నారు.అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటే వీటి నుండి బయట పడొచ్చని వారు చెవుతున్నారు.అందుకు తగిన సలహాలను కూడా సూచిస్తున్నారు.

చుండ్రు మూలంగా కేవలం జుట్టుకే సమస్య ఉంటుందనుకుంటే పొరపాటు.జుట్టు రాలిపోతుంది.చుండ్రుకు సంబంధించిన పొలుసు రాలడం మూలంగా ముఖం, వీపు, మెడలపై మొటి మలు తయారవుతాయి.కొన్ని సందర్భాల్లో తల నొప్పికి కూడా దారి తీయవచ్చు. రుతుక్రమంలో తేడాల మూలంగా కూడా చుండ్రు వచ్చే అవకాశా లున్నట్లు వైద్యనిపుణులు అంటున్నారు.చుండ్రు తో పాటు ముఖంపై అవాంఛిత రోమాలు, స్థూల కాయం, రుతుక్రమంలో తేడాలు ఉన్నట్లయితే, పాలిసిస్టిక్‌ ఓవరియన్‌ సిండ్రోమ్‌ అనే వ్యాధి లక్ష ణంగా భావించవచ్చు.దీన్ని గుర్తించడానికి అవస రమైన వైద్య పరీక్ష చేయించుకోవాలి.

నిపుణుల సలహా అవసరం....

చుండ్రుతో తరుచూ ఇబ్బందిపడేవారు మూడుపై పొట్టు రేగడం తగ్గగానే యాంటీ డాండ్రఫ్‌ షాం పూలు వాడడం ఆపేస్తారు.అలా చేయడం సరి కాదు.షాంపూ వాడకాన్ని కొనసాగిస్తూనే ఉం డాలి.చాలామంది స్ర్ర్తీలు, పురుషులకు వేర్వేరు షాంపూలుంటాయని అంటుంటారు.కానీ ఇది నిజం కాదు.చుండ్రుకు లింగవివక్ష లేదు.చికిత్స అనేది ఎవ రికైనా ఒక్కటే అని గుర్తించాలి.

చుండ్రు నియంత్రణకు ఇప్పుడు మార్కెట్లో వివిధ రకాలైనా పద్ధతులు అమల్లో ఉన్నాయి.నిపుణుల సలహామేరకు వాటిలో ఏది మెరు గైనది అన్న విషయాన్ని తెలుసుకుని ఆయా పద్ధతులను అనుసరించడం మంచిది.తెలిసితెలియని పద్ధతులను అనుసరించడం మూలంగా మొదటికే మోసం వచ్చే అవ కాశం ఉంది.అంతేకాకుండా మార్కెట్లో ధర తక్కువగా ఉందనే ఉద్ధేశంతో చౌకబారు షాంపూలను వాడడం చేయరాదు.దీనివల్ల చుండ్రు నివారించబడకపోగా, జుట్టు మరింత రాలిపోయే ప్రమాదం ఉంటుంది.

నియంత్రణ మార్గాలు:

వాస్తవానికి చుండ్రు నివారించడానికి ప్రత్యేక చికిత్స అంటూ ఏదీ లేదు.చుండ్రును నియంత్రించే ఉద్ధేశంతో రూపొందించిన వివిధ కంపెనీల షాంపూలు మాత్రం కొంత మేరకు పనిచేస్తాయి.షాంపూను తలకు పట్టించి, నురగ వచ్చే వరకూ రుద్ది కడిగేయడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు.అలా కాకుండా చుండ్రు మాడుకు అంటుకుని ఉంటుంది కనుక మాడుపై షాంపూను రుద్ది కనీసం పది నిమిషాలున్న తర్వాత తలంటు స్నానం చేయాలి.దీనివల్ల యాంటీ ఫంగల్‌ లక్షణాలు బాగా పనిచేసి చుండ్రు కొంతమేర నివారించబడుతుంది.

తెల్ల జుట్టు నివారణకు...

కొంత మందికి చిన్నవయస్సులోనే జుట్టు తెల్లబడు తుంది.దీనిక అనేక కారణాలు ఉన్నాయి.ముఖ్యంగా వంశపారంపర్య లక్షణాల మూలంగా కూడా జుట్టు తెల్ల బడే అవకాశాలు అధికంగా ఉన్నాయి.ఆహారలోపాలు, ఒత్తిడి వంటివన్నీ దీనికి కారణం.ఇక నేటి వాతావారణ కాలుష్యం కూడా దీనికి ఓ కారణం.తీసుకునే ఆహారంలో లోపాలు, థైరాయిడ్‌ సమస్య, మా నసిక ఒత్తిడి, ఆందోళన, రకరకాల షాంపూలు వాడడం వంటివి పలు కారణాలు కావచ్చు.వీటిలో ఏ కారణం వల్ల మీ జుట్టు తెల్లబడుతుందో ముందుగా గుర్తించాలి.

వంశపారం పర్యం, థైరాయిడ్‌ సమస్యల మూలంగా జుట్టు తెల్లబడుతుందానుకుంటే వెంటనే ట్రైకాలజిస్ట్‌ లేదా ఎండో క్రైనాలజిస్ట్‌ వైద్య నిపుణులను సంప్రదిం చాలి. చదువుకునే విద్యార్థులకు జుట్టు తెల్లబడుతుం దంటే వారికి చదువు ఒత్తిడి అధికంగా ఉందనుకోవచ్చు.పరీక్షలకు సంబంధించిన ఒత్తిడి, ఆందోళన వంటివి విద్యార్థుల్లో జుట్టు తెల్లబడడానికి కారణమవుతాయి.ఇటువంటపుడు కౌన్సిలింగ్‌ ద్వారా ఒత్తిడిని తగ్గించుకునే అవకాశాలున్నాయి.

ఇక తీసుకునే ఆహారంలో లోపాలు కూడా తెల్లజుట్టు రావడానికి కారణమవుతాయి.ప్రతిరోజూ మంచి పోష కాహారం తీసుకోవాలి.పాలు, గుడ్లు, మొలకెత్తిన విత్త నాలు, సోయాజాతి విత్తనాలు, డ్రైప్రూట్స్‌ వంటివి ఎక్కు వగా తీసుకుంటే కొంతవరకు ఉపయోగం ఉంటుంది.ఘూటైన షాంపూలను వాడరాదు.ఎప్పు డు ఒకే రకమైన షాంపూను వాడడం మంచిది. మార్కెట్లోకి కొత్తగా ఏవీ వస్తే వాటిని వాడడం సరికాదు.గుడ్డు తెల్లసొన లేదా మజ్జికతో కలిపి రుబ్బిన కరివేపాకు లేదా మెంతి ఆకు పేస్టుల్ని తలకు ప్యాక్‌గా వేసుకోవాలి.మందారాకు పేస్ట్‌తో కూడా ప్యాక్‌ చేసుకోవచ్చు.హెర్బల్‌ హెన్నాలో బీట్‌రూట్‌ రసాన్ని కలిపి ప్యాక్‌ వేసుకున్నా జుట్టుకు మంచి రంగు వస్తుంది.

ఆధారము: హెల్త్ కేర్ తెలుగు బ్లాగ్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate