অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మానసిక ఆరోగ్యానికి ఒక పరిచయ౦

మానసిక ఆరోగ్యానికి ఒక పరిచయ౦

మానసిక ఆరోగ్య౦ మరియు మానసిక ఆనారోగ్య౦

మంచి ఆరోగ్యానికి కావలసింది భౌతికంగా ఆరోగ్యవంతమైన శరీరం కంటే మించి ఉంటుంది, ఆరోగ్యంగా ఉండే వ్యక్తికి ఆరోగ్యమైన మనసు ఉండాలి. ఆరోగ్యవంతమైన మనసు ఉన్న వ్యక్తి స్పష్టతతో ఆలోచించగలగాలి, జీవితంలో ఎదురయే అనేకానేక సమస్యల్ని ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉండాలి, స్నేహితులతోనూ, పని చేసే చోట సహోద్యోగులతోనూ, కుటుంబ సభ్యులతోనూ మంచి అనుబంధాలను నెలకొల్పుకుని ఆనందించాలి, ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా ఉంటూ సమాజంలోని ఇతరులకు సంతోషాన్ని పంచగలగాలి. ఆరోగ్యానికి సంబంధించిన ఈ అంశాలే మానసిక ఆరోగ్యంగా పరిగణింప బడతాయి.

మనం శరీరం, మనసు గురించి మాట్లాడేటప్పుడు శరీరం, మనసు వేరు, వేరు అన్నట్లుగా మాట్లాడుతాము. నిజానికి ఇవి రెండూ ఒకే నాణానికి రెండు ప్రక్కలు. రెండిటికీ ఒకే అంశాలు కొన్ని ఉన్నప్పటికి బయటి ప్రపంచానికి వేర్వేరు ముఖాలతో దర్శనమిస్తాయి. ఇందులో ఏ ఒక్కటి దెబ్బ తిన్నా రెండవది కూడా తప్పకుండా దెబ్బతింటుంది.మనం శరీరాన్ని మనసుని వేర్వేరుగా అనుకున్నంత మాత్రాన అవి ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా స్వతంత్రంగా పని చేస్తాయనుకోగూడదు.

భౌతిక శరీరం వ్యాధికి గురయినట్లే మనసు కూడా వ్యాధికి గురవవచ్చు. దీనిని మానసిక వ్యాధి అని అంటారు. ఒక వ్యక్తి అనుభవించే భావోద్వేగాలు, ఆలోచనలు లేక ప్రవర్తనను ప్రభావితం చేసేది, అతని సాంస్కృతిక విశ్వాసాలు, వ్యక్తిత్వానికి విరుద్ధమైనది, అతని, అతని కుటుంబ సభ్యుల జీవితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపేది మానసిక వ్యాధి.

ఈ పుస్తకంలోని విషయాలకు ప్రాతిపదికగా ఇందులో రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి.

మానసిక వ్యాధులకు కారణాలు, చికిత్సల గురించి మన అవగాహనలో అద్భుతమైన ప్రగతి వచ్చింది. ఇందులో చాలా చికిత్సల్ని సామాన్య లేక సామాజిక ఆరోగ్య కార్యకర్త సమర్థవంతంగా చెయ్యగలడు.

అనేక విస్తృతమైన ఆరోగ్య సమస్యలు మానసిక అనారోగ్యంలోకి వస్తాయి. చాలామంది మానసిక వ్యాధి అంటే హింస, ఉద్రేకం, లైంగికంగా అనుచితంగా ఉండడం మొదలైన ప్రవర్తనలకు సంబంధించిన అలజడి అనుకుంటారు. ఇలాంటి అలజడులు చాలా తీవ్రమైన మానసిక వ్యాధులకు ఉంటాయి. కాని అనేక రకాల మానసిక వ్యాధులు ఉన్నవారు మిగతావారిలాగానే కనపడతారు, మిగతావారి లాగానే ప్రవర్తిస్తారు. సాధారణంగా కనపడే ఈ మానసిక ఆరోగ్య సమస్యల్లోకి కుంగుబాటు లేక డిప్రెషన్, ఆందోళన, లైంగిక సమస్యలు, వ్యసనాలు వస్తాయి.

మానసిక వ్యాధి గురి౦చి ఎ౦దుకు కలవరపదడాలి?

అనేక కారణాల వలన మానసిక వ్యాధి గురించి కలవరపడాలి :

 • ఎందుకంటే వాటి ప్రభావం మనందరి మీద పడుతుంది కనుక : ప్రతి ఐదుగురు వయో జనుల్లోనూ ఒకరు తమ జీవిత కాలంలో ఏదో ఒక మానసిక ఆరోగ్య సమస్యను అనుభవిస్తారని అంచనా వెయ్యబడింది. ఇది మానసిక అనారోగ్యం ఎంత సాధారణమో తెలియజేస్తుంది. ఎవరైనా మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడవచ్చు.
 • oneఎందుకంటే ఇది ఒక పెద్ద ప్రజారోగ్య సమస్య కనుక : ప్రపంచం లోని ప్రతి మూలలోనూ జరిపిన అధ్యయనాలు మామూలుగా అనారోగ్యంతో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలకు వచ్చే వారిలో 40 శాతం మంది ఏదో ఒక రకం మానసిక సమస్యతో సతమతమవుతున్నారని తెలుపుతున్నాయి. సామాన్య లేక సామాజిక ఆరోగ్య సేవలకోసం వచ్చేవారిలో చాలామంది చాలా అస్పష్టమైన, స్వల్పమైన బాధలతో వస్తారు. వీటిని సైకోసామాటిక్ వ్యాధులనో లేక అలాంటిదే ఇంకో పేరుతోనో పిలుస్తారు. ఇందులో చాలామంది వాస్తవంలో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు.
 • అవి వైకల్యాల్ని కలిగిస్తాయి కనుక : మానసిక వ్యాధులు శారీరక వ్యాధుల కంటే తక్కువ ప్రమాదకరం అని అందరూ నమ్ముతున్నప్పటికి నిజానికి అవే ఎక్కువ వైకల్యాలను, సమస్యలను కలగ జేస్తాయి. అవి అత్మహత్య వాహన, ఇతర ప్రమాదాల ద్వారా మరణాల్ని కూడా కలగజేస్తాయి. కొంతమంది శారీరక మరియు మానసిక అనారోగ్యాలు, రెండిటితోనూ బాధపడతారు, అలాంటి సందర్భాల్లో మానసిక వ్యాధి శారీరక వ్యాధిని మరింత పెంచుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2001లో వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య నివేదిక ప్రకారం ప్రపంచంలో అతి ఎక్కువ వైకల్యాలు కలిగించే మొదటి 10 వ్యాధుల్లో 4 మానసిక వ్యాధులే. రక్తహీనత, మలేరియా, ఇతర ఆరోగ్య సమస్యల కంటే డిప్రెషన్ లేక కుంగుబాటు ఎక్కువ వైకల్యాన్ని కలిగించే వ్యాధి.
 • మానసిక ఆరోగ్య సేవలు అతి తక్కువగా లభ్యమవుతున్నాయి కనుక : twoచాలా దేశాల్లో సైకియాట్రిన్స్, సైకాలజిస్ట్స్ ఈ వృత్తిలో ఇతర సిబ్బంది కొరత చాలా ఎక్కువగా ఉంది. ఉన్న కొద్దిమంది నిపుణులు కూడా చాలా తీవ్రమైన మానసిక వ్యాధుల (సైకోసెస్) బారిన పడిన వారికే చికిత్స చేస్తారు. ఇవి చాలా అరుదుగా వస్తాయి, కాని సమాజం వీటినే మానసిక వ్యాధులుగా భావిస్తుంది. చాలా సాధారణమైన కుంగుబాటు, మద్యం వ్యసనం బారిన పడినవారు అసలు మానసిక వ్యాధుల నిపుణుడిని సంప్రదించరు. సామాన్య ఆరోగ్య కార్యకర్తలు వీటికి చికిత్స చేస్తారు.
 • సమాజాలు వేగంగా మారుతున్నాయి కనుక : ప్రపంచంలో అనేక సమాజాలు వేగంగా అనూహ్యమైన ఆర్థిక, సామాజిక మార్పులకు లోనవుతున్నాయి.. వేగవంతమయిన అభివృద్ధి, పట్టణీకరణ, వలసలు, ప్రజల ఆదాయాల వ్యత్యాసంలో నానాటికీ పెరుగుదల, నిరుద్యోగం, హింస విపరీతంగా పెరగడంతో సమాజాల సాంఘిక నిర్మాణమే పెను మార్పులకు లోనవుతోంది.
 • threeమానసిక వ్యాధిని ఒక కళంకంగా భావిస్తారు కనుక : మానసిక వ్యాధితో బాధపడుతున్న వారిలో చాలామంది తమకు ఆ వ్యాధి ఉందని ఒప్పుకోరు. మానసిక వ్యాధి ఉన్నవారిని కుటుంబం, సమాజంకూడా చులకనగా చూస్తుంది, వారు వివక్షను ఎదుర్కొంటారు. ఆరోగ్య కార్యకర్తలు కూడా వారికి సానుభూతితో వైద్యం చెయ్యరు
 • మానసిక వ్యాధులకు చాలా సాధారణ మరియు ఖర్చు తక్కువ పద్ధతుల్లో చికిత్స చెయ్యొచ్చు కనుక : చాలా మానసిక వ్యాధుల్ని మందులతో నయం చెయ్యలేమనేది నిజమే. కాని, కేన్సర్, అధిక రక్తపోటు, మధుమేహం లేక చక్కెర వ్యాధి, కీళ్ళవాతం మొదలైన వాటిని కూడా నయం చెయ్యలేము. అయినప్పటికి ఈ వ్యాధులతో బాధపడుతున్నవారి జీవన నాణ్యతను పెంచడానికి ఎంతో చెయ్యొచ్చు. మానసిక వ్యాధులకు కూడా ఇది వర్తిస్తుంది

మానసిక వ్యాధుల రకాలు

fourమానసిక వ్యాధి నిర్ధారణ చెయ్యడానికి దాదాపుగా వ్యాధిగ్రస్తులు చెప్పే మాటల మీద సాంతం ఆధార పడవలసి ఉంటుంది. ఇందులో ప్రధాన సాధనం వారితో ముఖాముఖి మాట్లాడడం. మానసిక వ్యాధి ఆ వ్యాధితో బాధపడుతున్నవారు లేక వారిని దగ్గరగా చూచే వారు గమనించగల లక్షణాల్ని కలగజేస్తుంది. ఇందులో ఐదు ప్రధాన రకాల లక్షణాలు ఉన్నాయి:

 1. భౌతిక - ‘సామాటిక్’ లక్షణాలు : ఇవి శరీరాన్ని శారీరక కార్యకలాపాల్ని ప్రభావితం చేస్తాయి, ఇవి నెప్పులు, అలసట, నిద్రాభంగం మొ. మానసిక వ్యాధులు శారీరక లక్షణాల్ని కలగజేస్తాయని గుర్తుంచుకోవడం ముఖ్యం.
 2. భావన - భావోద్వేగ లక్షణాలు : సరైన ఉదాహరణలు - విచార పడడం, భయపడడం.
 3. ఆలోచన - విచారణార్హమైన లక్షణాలు : చిహ్నాత్మక ఉదాహరణలు - ఆత్మహత్య, ఎవరో తనకు హాని కలగజేయబోతున్నారని భావించడం, స్పష్టతతో ఆలోచించలేక పోవడం, మతిమరపు.
 4. ప్రవర్తన - ప్రవర్తనా పరమైన లక్షణాలు : fiveఇవి ఒక వ్యక్తి ఏమి చేస్తున్నాడు అనేదానికి సంబంధించి ఉంటాయి. ఉదాహరణలు - ఉద్రేకంగా ప్రవర్తించడం, ఆత్మహత్యా ప్రయత్నం చెయ్యడం.
 5. ఊహించడం - ఊహాజనిత లక్షణాలు : ఇవి జ్ఞానేంద్రియాల ద్వారా పుడతాయి. ఇతరులకు వినపడనివి వీరికి వినిపిస్తాయి, ఇతరులకు కనపడనివి వీరికి కనపడతాయి (భ్రమలు).

నిజానికి భిన్న రకాలకు చెందిన ఈ లక్షణాలు ఒకదానితో ఒకటి దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. ఒకేవ్యక్తిలో అన్ని రకాల లక్షణాలు ఎలా ఉంటాయో ఉదాహరణలుగా ఈ క్రింది బొమ్మల్ని చూడండి

మానసిక ఆరోగ్యంలో స్థూలంగా ఆరు విభాగాలున్నాయి:

 • సాధారణ మానసిక అనారోగ్యాలు (కుంగుబాటు మరియు ఆందోళన).
 • చెడు అలవాట్లు - మద్యం, మత్తు మందుల వ్యసనం.
 • తీవ్రమైన మానసిక వ్యాధులు-సైకోసెస్.
 • మానసిక ఎదుగుదల సక్రమంగా లేకపోవడం.
 • పెద్దవాళ్ళల్లో మానసిక అనారోగ్యాలు.
 • చిన్న పిల్లల్లో మానసిక అనారోగ్యాలు.

సాధారణ మానసిక అనారోగ్యాలు(కు౦గుబాటు మరియు ఆ౦దోళన)

 • కేసు. 1.1: లూసీ కి మొదటి బిడ్డ పుట్టినప్పుడు ఆమె వయసు 28 ఏళ్లు, sixపాపాయి పుట్టాక మొదటి కొన్ని రోజుల వరకు ఆమె తరచు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండేది, దిగులుగా ఉండేది. చాలా మంది తల్లుల లాగే ఆమె కూడా ప్రసవమయ్యాక తాత్కాలికంగా భావోద్వేగంగా సున్నితంగా ఉందనీ, ఆందోళన చెందాల్సిన అవసరంలేదనీ మిడ్వైఫ్ లూసీకి ధైర్యం చెప్పింది. అయితే ఆమె తన భర్తతో కలిసి ఎక్కువ సమయం గడుపుతూ బిడ్డను సంరక్షించుకుంటే ఆమె దిగులు తగ్గి మామూలుగా అవుతుందని సూచించింది. ఆశించినట్లుగానే లూసీ పరిస్థితి కొద్ది రోజుల్లోనే మెరుగుపడింది. కొన్ని నెలల వరకు అంతా బాగున్నట్లే అనిపించింది. అప్పుడు క్రమేపీ లూసీకి బాగా అలసటగా ఉండేది, నీరసంగా ఉండేది. అలసటగా ఉన్నప్పటికీ ఆమె ఉదయమే నిద్ర లేచేది. ఆమె మనసంతా తన గురించి ప్రతికూల ఆలోచనలతో నిండిపోయేది, తన బిడ్డ గురించిన చెడు ఆలోచనలతో భయపడిపోయేది. ఆమెకు తన ఇంటి బాధ్యతలపై ఆసక్తి తగ్గిపోయింది. లూసీ భర్త ఆమె సోమరిగా ఉంటూ దేనినీ పట్టించుకోవడం లేదని విసుక్కోసాగాడు. సామాజిక ఆరోగ్య కార్యకర్త మామూలుగా బిడ్డ ఆరోగ్యం గురించి వాకబు చెయ్యడానికి ఇంటికి వచ్చినప్పుడు గాని లూసీ డిప్రెషన్లో ఉందని ఖచ్చితంగా గుర్తించలేదు. సమస్యేమిటి ? లూసీ ప్రసవం తరువాత తల్లలకు వచ్చే ఒక రకం డిప్రెషన్ తో బాధపడుతోంది. దీనిని పోస్ట్ నేటల్ డిప్రెషన్ అని అంటారు.
 • కేసు 1.2 : రీటా వయసు 58 ఏళ్ళు. ఆమె భర్త క్రితం సంవత్సరమే sevenఅకస్మాత్తుగా చనిపోయాడు. ఆమె పిల్లలు పెరిగి పెద్దవాళ్లయి మెరుగైన ఉపాధి అవకాశాల్ని వెదుక్కుంటూ గ్రామాన్ని వదిలి పెద్ద నగరానికి వలస వెళ్ళారు. భర్త చనిపోయినప్పటి నుండి ఆమెకు నిద్ర పట్టడం లేదు, ఆకలి తగ్గిపోయింది. భర్త అంతిమ కార్యక్రమాలు అవగానే పిల్లలు కూడా గ్రామాన్ని వదలడంతో ఆమె పరిస్థితి మరింత క్షీణించింది. ఆమెకు తలనెప్పి, నడుమునెప్పి, కడుపునెప్పి, ఇంకా అనేకానేక శారీరక బాధలు వచ్చి చివరకు ఒక క్లినిక్ కి వెళ్ళి చూపించుకుంది. అక్కడ ఆమెకు అంతా బాగానే ఉందని చెప్పి విటమిన్ మాత్రలు, నిద్ర మాత్రలు ఇచ్చారు. వెంటనే ఆమెకు ఆరోగ్యం, ముఖ్యంగా నిద్ర సక్రమంగా పోవడం వలన, మెరుగు పడినట్లనిపించింది. కాని మళ్ళీకొద్ది రోజుల్లోనే ఆమెకు నిద్ర పట్టకపోవడం తీవ్రమయింది, ఆమె మళ్ళీ క్లినిక్ కి వెళ్ళింది. ఆమెకు ఇంకా ఎక్కువ విటమిన్లు, నిద్ర మాత్రలు ఇచ్చారు. ఇది ఇలాగే కొన్నాళ్ళు కొనసాగి ఇంక ఆమె నిద్ర మాత్రలు లేనిదే నిద్ర పోలేని స్థితికి వచ్చింది.
 • సమస్యేమిటి? రీటా భర్త మరణం, పిల్లలు తనతో కలిసి నివసించక పోవడం వలన ఒంటరితనంతో కలిగే డిప్రెషన్ యొక్క శారీరక చిహ్నాలతో బాధపడింది. క్లినిక్ వైద్యుడు ఆమె భావోద్వేగాల గురించి తెలుసుకోకుండా నిద్రమాత్రల్ని ఇచ్చాడు. ఇది రీటా నిద్ర మాత్రల మీద ఆధారపడి బ్రతికే స్థితికి దోహదం చేసింది.

 • కేస్ 1.3 : రవి ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురయినప్పుడు అతని eightవయసు 30 సంత్సరాలు. ఆతను తన సన్నిహిత మిత్రుడిని వెనక కూర్చోబెట్టుకుని మోటార్ సైకిల్ ని నడుపుతుండగా వెనుక నుండి బస్సు ధీకొట్టి రవి, అతని మిత్రుడు బైకు మీద నుండి ఎగిరి అవతల పడ్డారు. రవి కళ్ళముందే బస్సు చక్రాల క్రింద పడిన అతని మిత్రుడు అక్కడికక్కడ వెంటనే చనిపోయాడు. కొన్నాళ్ళ పాటు షాక్ లో, తీవ్రమైన విచారంలో కూరుకు పోయిన రవి మధ్య మధ్యలో భయంతో వణికి పోయేవాడు. ఇది అతను షాపింగ్ కి బజారుకు వెళ్ళడం మొదలు పెట్టాక ప్రారంభమయింది. అతనికి ఊపిరాడనట్లు, గుండె దడదడా కొట్టుకుంటున్నట్లు అనిపించేది. రవి తండ్రికి గుండె జబ్బు ఉంది. రవి తనకు కూడా గుండెజబ్బు వచ్చిందేమోనని అనుకుని భయనడి పోయేవాడు. డాక్టర్ అతనికి పరీక్షలు చేయించగా అతని గుండె ఆరోగ్యంగా ఉందని తేలింది. రవికి పీడకలలు రావడం ప్రారంభమయింది, ఆ కలల్లో అతనికి రోడ్డు ప్రమాదం సంఘటన అంతా కనిపించేది. ఒకొక్కప్పుడు మెలకువగా ఉండగానే ఆ దృశ్యాలు మళ్ళీ మళ్ళీ కళ్ళముందు కనపడేవి. దాంతో అతను బెదిరిపోయి భయంతో బిగుసుకునేవాడు. అతను నిద్రపోలేక పోయేవాడు, తొందర్లో అతనికి ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక కలగసాగింది.
 • సమస్యేమిటి? రవి ఒక వ్యక్తికి తీవ్రమైన దుర్ఘటన లేక విషాద సంఘటన కారణంగా కలిగే ఆందోళన లేక ఏంగ్టయిటీ తో బాధపడుతున్నాడు. దీనిని ‘పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్’ అని అంటారు.

సాధారణ మానసిక వ్యాధులలో రెండు రకాల భావోద్వేగ సమస్యలు ఉంటాయి: డిప్రెషన్ లేక కుంగుబాటు, ఏంగ్డయిటీ లేక ఆందోళన. డిప్రెషన్ లో కుంగిపోవడం, విచారపడడం, తనెందుకూ పనికిరాడని లేక తనకెవరూ లేరని కుమిలి పోవడం ఉంటాయి. ప్రతి ఒక్క మనిషి తన జీవిత కాలంలో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి భావనకు లోనవుతాడు. కొంత స్థాయి వరకు దీనిని నార్మల్ గానే అనుకోవచ్చు. కాని కొన్నిసార్లు ఇవి బ్రతుకును సాఫీగా సాగనివ్వకుండా ఇబ్బంది పెడతాయి, అప్పుడు అవి సమస్యలు అవుతాయి. ఉదాహరణకు, ప్రతి ఒక్కరు అప్పుడప్పుడు విచారంగా ఉంటారు, కాని మామూలుగానే బ్రతుకుతారు, విచారం క్రమంగా తగ్గిపోతుంది. కాని ఒకోసారి విచారం చాలా ఎక్కువ కాలం, ఒక నెల కంటే ఎక్కువ సమయం ఉంటుంది, దానితో పాటు అశక్తతను కలిగించే అలసట, ఏకాగ్రత నిలపలేక పోవడం ఉంటాయి. ఇది రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేయడాన్ని ప్రారంభిస్తుంది, పనిచెయ్యడం, ఇంటిదగ్గర చిన్నపిల్లల సంరక్షణను చూసుకోవడం కష్టమవుతుంది. డిప్రెషన్ రోజువారీ జీవితానికి ఆటంకం కలిగిస్తూ ఎక్కువ కాసం కొనసాగితే దానిని వ్యాధిగా పరిగణించవచ్చు. డిప్రెషన్ తాలూకు కీలక లక్షణాల్ని పెట్టె 1.1 లో చూపడం జరిగింది.

1.1. డిప్రెషన్ లేక కుంగుబాటు కీలక లక్షణాలు :

డిప్రెషన్ ఉన్న వ్యక్తి ఈ క్రింది లక్షణాలలో కొన్నిటితో బాధపడతాడు:

శారీరక :

 • అలసట, నిస్రాణగా, నీరసంగా ఉండడం.
 • శరీరమంతటా అస్పష్టమైన నెప్పలు, పీకులు.

భావాలు:

 • తీవ్ర విచారం, అనాధననే భావం.
 • బ్రతుకు మీద, సామాజిక సంబంధాల మీద, పని మీద అసక్తిని కోల్పోవడం.
 • అపరాధ భావం.

ఆలోచన :

 • భవిష్యత్తు మీద ఆశను కోల్పోవడం.
 • నిర్ణయాల్ని తీసుకోవడం కష్టమవడం.
 • తను ఇతరులతో సమానంగా లేడనే ఆలోచన (ఆత్మగౌరవాన్ని కోల్పోవడం).
 • తను చనిపోతే బావుంటుందనే ఆలోచన.
 • ఏకాగ్రతను కోల్పోవడం.

ప్రవర్తించడం :

 • నిద్రా భంగం (సాధారణంగా తక్కువ నిద్ర, కాని అప్పుడప్పుడూ మరీ ఎక్కువ నిద్ర).
 • ఆకలి తగ్గిపోవడం (ఒకోసారి ఆకలి ఎక్కువవడం).
 • లైంగిక కోరిక తగ్గిపోవడం.

ఏంగ్జయిటీ లేక ఆందోళనలో భయం, నెర్వస్ నెస్ ఉంటాయి. డిప్రెషన్ కి లాగానే ఏంగ్జయిటీ కూడా కొన్ని సందర్భాలలో సహజమే. ఒక నటుడు స్టేజి ఎక్కేముందు, ఒక విద్యార్థి పరీక్ష రాసే ముందు కొంచెం ఏంగ్జయిటీ పడడం సహజం. కొంతవరకు అది అవసరం కూడా. కొంతమంది ఎల్లప్పుడూ ఆందోళనతో ఉన్నట్లే ఉంటారు, కాని వారి రోజువారీ జీవితం పైన దాని ప్రభావం ఉండదు. డిప్రెషన్ కి లాగానే అది చాలా కాలం కొనసాగితే (సాధారణంగా 2 వారాల కంటే ఎక్కువ), రోజువారీ పనులు చేసుకోవటానికి ఆటంకంగా మారితే, చాలా తీవ్రమైన లక్షణాలు ఉంటే అది మానసిక వ్యాధిగా మారిందని అర్థం చేసుకోవచ్చు. ఏంగ్జయిటీ తాలూకు కీలక లక్షణాల్ని పెట్టె 1.2 లో చూపడం జరిగింది.

1.2. ఆందోళన లేక ఏంగ్డయిటీ ప్రధాన లక్షణాలు :

ఏంగ్డయిటీ ఉన్న వ్యక్తికి ఈక్రింది వాటిలో కొన్ని లక్షణాలు ఉంటాయి,

శారీరక :

 • గుండె వేగంగా కొట్టు కుంటున్నట్లు అనిపించడం (గుండె దడ).
 • ఊపిరి ఆడనట్లు ఉండడం.
 • త్రల తిరగడం.
 • వణుకు, ఒళ్ళంతా కంపించడం.
 • తలనెప్పులు.
 • కాళ్ళ చేతులు, ముఖం మీద పొడుస్తున్నట్లు లేక గుచ్చుకుంటున్నట్లు (చీమలు పాకుతున్నట్లు) వుండడం.

భావన :

 • తనకేదో పెద్ద ప్రమాదం జరగబోతున్నట్లు అనుకోవడం.
 • విపరీతంగా భయపడడం.

ఆలోచన :

 • తనగురించి, తన ఆరోగ్యం గురించి మరీ ఎక్కువగా బాధపడడం.
 • తను చనిపోబోతూందని, లేక తనపై తాను నియంత్రణ ను కోల్పోతున్నదని, పిచ్చి పడుతున్నదనే ఆలోచనలు. (ఈ ఆలోచనలతోపాటు ఒకోసారి శారీరకమైనబాధలు, విపరీతమైన భయం కూడా ఉంటాయి).
 • ఈ ఆలోచనల్ని ఎంత ఆపుకుందామని ప్రయత్నించినప్పటికీ మనసును కోసే అవే ఆలోచనలు మళ్ళీ మళ్ళీ రావడం.

ప్రవర్తన :

 • తను భయపడే బజారులకు వెళ్ళకుండా, బస్సుల్లో ప్రయాణించకుండా ఉండడం,
 • నిద్ర సరిగ్గా పోవక పోవడం.

సాధారణ మానసిక అనారోగ్యాలతో బాధ పడేవారికి డిప్రెషన్, ఆందోళన రెండూ ఉంటాయి. ఇందులో అత్యధిక భాగంమంది తమ అనుభూతి పరమైన లేక ఆలోచన పరమైన లక్షణాల్ని గురించి తమ ప్రధాన సమస్యగా చెప్పరు, దానికి బదులు భౌతిక, ప్రవర్తనా పరమైన లక్షణాల్ని నెమరేసుకుంటూ వెల్లడిస్తారు. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. ఉదాహరణకు మానసిక లోపాల్ని గురించి వెల్లడిస్తే తనను పిచ్చిది లేక మెంటల్ కేసు అని ముద్ర వేస్తారని భయపడొచ్చు.

మూడు రకాల సాధారణ మానసిక అనారోగ్యాలు కొన్ని ప్రత్యేకమైన లేక అసాధారణ లక్షణాలను కలిగి ఉంటాయి.

 1. పేనిక్ లేక భీతిల్లడం : అనేక సార్లు వచ్చి కొన్ని నిమిషాల పాటు మాత్రమే ఉండే ఆందోళనను పేనిక్ ఎటాక్స్ అనొచ్చు. ఇవి వచ్చినప్పుడు తనకేదో పెద్ద ఆపద కలగబోతూందని లేక తను చనిపోబోతున్నాడని భయ బ్రాంతుడవుతాడు. ఆందోళన చెందుతున్న వ్యక్తి ఈ సమస్య వచ్చినప్పుడు మామూలు కంటే వేగంగా ఊపిరి తీసుకుంటాడు. ఇది రక్తంలోని రసాయన వాతావరణాన్ని మార్చి, భౌతిక లక్షణాల్ని కలగజేస్తుంది.
 2. ఫోబియా లేక భయాలు : కొన్ని ప్రత్యేక సందర్భాలలో లేక కొన్ని ప్రత్యేక సంఘటనలకు ఒక వ్యక్తి భయపడడం. సాధారణ ఉదాహరణలు జన సమ్మర్ణం ఎక్కువగా ఉండే బజారులు, బస్సులు (కేసు 1.3 లో లాగా), మూసిఉండే చిన్న ప్రదేశాలు, చిన్నగదులు, లిపులు, మనుషులతో కలవడం లాంటి సాంఘిక సందర్భాలు. ఫోబియా ఉన్న వ్యక్తి తనకు ఆందోళన కలిగే సందర్భం రాకుండా నివారించడానికి ముందు జాగ్రత్త చర్య తీసుకుంటాడు, ఒకోసారి అసలు పూర్తిగా బయటకే పోకుండా ఇంటికే పరిమితమవుతాడు.
 3. అబ్సెసివ్ - కంపల్సివ్ డిజార్డర్స్ : ఆ ఆలోచనలు లేక పనులు శుద్ధ అనవసరమని, లేక తెలివి తక్కువతనమని తెలిసినప్పటికీ ఒక వ్యక్తికి మళ్ళీ మళ్ళీ ఒకే ఆలోచనలు వస్తూవుంటే వాటిని అబ్సెషన్స్ అని, మళ్ళీ మళ్ళీ ఒకే పనులు చేస్తూ ఉంటే కంపల్లన్స్ అని అంటారు. ఇలా తరచుగా జరుగుతూ ఉంటే ఏకాగ్రత దెబ్బ తినడమేగాక డిప్రెషన్ కి దారితీస్తుంది.

చెడు అలవాట్లు

 • కేసు 1.4: 44 సంవత్సరాల మైఖేల్ అనేక రకాల శారీరక బాధలతో క్లినిక్ కి nineచాలా నెలలుగా వెళ్తున్నాడు. అతని ప్రధాన బాధలు, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, తరచుగా ఉదయాన వాంతులవడం, ఎప్పుడూ నలతగా ఉండడం. ఒకరోజు అతను పొట్టలో విపరీతమైన నెప్పితో క్లినిక్ కి వచ్చాడు. కడుపులో ఏసిడ్ ని తగ్గించే మందులు ఇదివరకు లాగా పని చెయ్యడం లేదు. అతన్ని డాక్టరు చూచి ఇంకా ఎక్కువ ఏసిడ్ ని తగ్గించే మందుల్ని కడుపులోని పుండు మానడానికి ఉపయోగపడే రానిటిడిన్ మాత్రల్ని ఇచ్చాడు. అతను హాస్పటల్ నుంచి బయల్దేరే సమయంలో మైఖేల్ చెమటతో తడిచి పోవడాన్ని చేతులు వణకడాన్ని డాక్టరు గమనించాడు. డాక్టరు అతన్ని ఆపి, ఇంకా ఏమైనా బాధలు ఉన్నాయా అని అడిగాడు. అప్పుడు మైఖేల్ కూర్చుని ఏడవడం మొదలు పెట్టాడు. తన ప్రధాన సమస్య పని ఒత్తిడితో కొన్ని నెలలుగా ఇంకా ఇంకా ఎక్కువగా మద్యాన్ని తాగడమని ఒప్పుకున్నాడు. కాని ఇప్పుడు మద్యం తాగడమే పెద్ద సమస్యయి పోయింది. ఇప్పుడు తను తాగుడు లేకుండా కొన్నిగంటలు కూడా ఉండలేక పోతున్నానని చెప్పాడు.
 • సమస్యేమిటి? మైఖేల్ మద్యం మీద ఆధార పడుతున్నాడు. అతనికి ఉన్న చాలా బాధలు అతని శరీరం మీద మద్యం వ్యసనం ప్రత్యక్షంగా కొట్టిన దెబ్బ ఫలితమే. కొన్ని బాధలు మద్యాన్ని మానాలకున్నప్పుడు కలిగే లక్షణాలు.

 • కేసు 1.5: లీ 18 ఏళ్ళ హైస్కూల్ విద్యార్థి. అతను ఎప్పుడూ ఒక సగటు tenవిద్యార్థి, కష్టపడి చదివేవాడు, నిజాయితీ కలిగిన వాడు. కాని ఇటీవల లీ బాగా పొద్దుపోయే వరకు బయటే తిరుగుతున్నట్లు, పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తున్నట్లు, ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తున్నట్లు వాళ్ళ అమ్మ గమనించింది. క్రితం వారం తన పర్సులోని డబ్బు కొంత పోయినట్లు ఆమె గుర్తించి, అది లీ పనేనేమోనని బాధపడింది. ఆమె లీ తన పూర్వపు స్నేహితులతో, కుటుంబంతో తక్కువ సమయాన్ని గడుపుతున్నాడని, తన తల్లిదండ్రులకు పరిచయం చెయ్యని ఒక కొత్త మిత్ర బృందంతో తిరుగుతున్నాడని కూడా గమనించింది. ఆమె అతనికి ఒక కౌన్సిలర్ ని కలవమని సూచించింది, కాని అతను దానికి నిరాకరించాడు. ఆరోగ్య కార్యకర్తల్ని ఇంటి దగ్గర కలవడానికి నిర్ణయించుకున్నాడు. మొదట లీ అతనితో చర్చించడానికి అసలు ఇష్టపడలేదు. కాని ఆరోగ్య కార్యకర్తపై కొంత విశ్వాసం కలిగాక తను కొన్ని నెలలుగా హీరాయిన్ అనే మత్తుమందుకు అలవాటు పడ్డానని, ఇప్పుడు దానిని తప్పించుకోలేక పోతున్నానని అంగీకరించాడు. అతను చాలా సార్లు దాని నుంచి బయట పడేందుకు ప్రయత్నించాడు, కాని ప్రయత్నించిన ప్రతిసారీ ఎంతో బాధకు గురయి మళ్ళీ ఆ మందును తీసుకుంటున్నాడు. తను ఈ వ్యసనం నుంచి బయట పడాలనుకుంటున్నానని, కాని ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదని చెప్పాడు.
 • సమస్యేమిటి? లీ హీరాయిన్ కి అలవాటు పడ్డాడు. దీని వలన అతను చదువులో వెనకబడ్డాడు, అతను తన లాగానే మత్తు మందులకు అలవాటు పడిన వారితో స్నేహం చేస్తున్నాడు. మత్తు మందుల్ని కొనడానికి డబ్బును దొంగిలిస్తున్నాడు.

ఒక వ్యక్తి యొక్క శారీరక, మానసిక, సాంఘిక ఆరోగ్యంపై మద్యం లేక మత్తు మందుల ప్రభావం ఉన్నప్పుడు అతను ఆ వ్యసనానికి లోనయినట్లుగా భావించవచ్చు. ఈ వ్యసనానికి లోనయినవాళ్ళు దీనినుండి బయట పడడం కష్టం. వాళ్ళు మందును మానడానికి ప్రయత్నించినప్పుడల్లా అనేక శారీరక బాధలు కలగడం, ఆ మందును తీసుకోవాలనే కోరిక విపరీతంగా పెరగడం జరుగుతుంది (విత్డ్రాయల్ లక్షణాలు). మద్యం, మత్తు మందుల వ్యసనానికి లోనయిన వ్యక్తులకే కాక వారి కుటుంబాలకు, సమాజానికి కూడా ఎంతో నష్టం, బాధ కలుగుతాయి. ఉదాహరణకు మద్యం వ్యసనం శారీరక బాధల్ని కలగజేయడమే కాక ఆత్మహత్యల సంఖ్య పెరగడానికి, వివాహాలు విఫలమవడానికి, గృహ హింస తీవ్రమవడానికి, రహదారి ప్రమాదాలు ఎక్కువవడానికి, పేదరికం పెరగడానికి దారితీస్తుంది. మద్యంవ్యసనం బారిన పడినవారిలో చాలా మందికి చికిత్స నిమిత్తం హాస్పటల్ కి రావడానికి మద్యం ప్రధాన కారణం కాదు. అందువలన హాస్పటల్ కి వచ్చిన వారిని వారి బాధల గురించి అడిగేటప్పుడు, ముఖ్యంగా వారి బాధలు మద్యం సంబంధమైనవిగా తోచినప్పుడు వారి తాగుడు అలవాట్ల గురించి అడిగి తెలుసుకోవాలి. మద్యం వ్యసనం యొక్క కీలక లక్షణాల్ని పెట్టె 1.3 లో ఇవ్వడం జరిగింది.

1.3. మద్యం వ్యసనం యొక్క కీలక లక్షణాలు :

మద్యం వ్యసనానికి లోనయిన వ్యక్తి ఈ క్రింది వాటిలో కొన్ని బాధల్ని అనుభవిస్తాడు.

శారీరక :

 • కడుపు లోపలి పొర ఎర్రబడడం, పుండు పడడంతో కడుపు నెప్పి.
 • కాలేయం దెబ్బ తిని పచ్చ కామెర్లు రావడం.
 • రక్తపు వాంతులవడం.
 • వణుకు, ముఖ్యంగా ఉదయం పూట.
 • ప్రమాదాలు జరగడం, గాయాలవడం.
 • మందు మానే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఫిట్స్ రావడం, చెమటలు పట్టడం, గందరగోళంలో పడడం.

భావన :

 • నిస్సహాయంగా ఉన్నానని, నియంత్రణను కోల్పోతున్నానని భావించడం.
 • తన తాగుడు అలవాటు గురించి కించ పడడం.

ఆలోచనలు :

 • మద్యం తాగాలనే వెర్రి కోరికతో కూడిన ఆలోచనలు.
 • తరువాత మళ్ళీ తాగడం గురించే ఎల్లప్పుడూ ఆలోచించడం.
 • ఆత్మహత్య గురించి ఆలోచనలు.

ప్రవర్తనలు:

 • నిద్ర పోవడం కష్టమవడం.
 • పగలు కూడా త్రాగడం అవసర పడడం.
 • శారీరిక బాధల్ని తగ్గించుకోవడానికి ఉదయాన్నే తాగవలసి రావడం.

అనేక రకాల మత్తు మందుల వ్యసనం అలవడవచ్చు. మద్యం కాక సాధారణంగా అలవాటయే మత్తు మందులు కన్నాబిస్, గంజాయి సంబంధిత మందులు, హీరాయిన్, కొకెయిన్, స్పీడ్ లాంటి ప్రేరేపక మందులు, నిద్ర మందులు. వీటి కీలక లక్షణాలు పెట్టె 1.4 లో ఇవ్వబడినాయి.

1.4. మత్తు మందుల వ్యసనం యొక్క కీలక లక్షణాలు :

మత్తు మందుల వ్యసనం బారిన పడిన వ్యక్తికి ఈ క్రింది వాటిలో కొన్ని లక్షణాలు ఉంటాయి.

శారీరక :

 • శ్వాస తీసుకోవడం కష్టమవడం, ఉబ్బసం.
 • మత్తు మందుల్ని ఇంజక్షన్ రూపంలో తీసుకుంటే చర్మానికి ఇన్ఫెక్షన్ లు, పుండ్లు.
 • మందును తీసుకోకపోతే విత్డ్రాయల్ లక్షణాలు, వికారం, ఆందోళన, వణుకులు, విరేచనాలు, కడుపులో నెప్పి, చెమటలు పట్టడం

భావన :

 • నిస్సహాయంగా ఉన్నానని, నియంత్రణను కోల్పోతున్నానని భావించడం.
 • తన మత్తు మందుల అలవాటు గురించి కించపడడం.
 • విచార పడడం, డిప్రెషన్ కి లోనవడం.

ఆలోచన :

 • మత్తు మందును తీసుకోవాలనే తీవ్రమైన కోరిక.
 • మళ్ళీ మత్తు మందును తీసుకోవడం గురించే ఎప్పుడూ ఆలోచించడం.
 • ఆత్మహత్య గురించి ఆలోచనలు.

ప్రవర్తనలు :

 • నిద్ర పోవడం కష్టమవడం.
 • చిరాకు పడడం, ఉద్రేక పడడం.
 • మత్తు మందుల్ని కొనడానికి డబ్బును దొంగిలించడం. పోలీసులతో సమస్యల్ని తెచ్చుకోవడం.

వ్యక్తుల ఆరోగ్యాన్ని నష్ట పరచే ఇతర వ్యసనాలు, సిగరెట్లను వాడడం, నిద్ర మాత్రలను వాడడం, జూదమాడడం.

ఈ అలవాట్ల వలన కలిగే సమస్యల్ని ఎలా గుర్తించచ్చు, ఈ వ్యసన పీడితులకు ఎలా సహాయ పడవచ్చు అనే విషయాల గురించి 6వ అధ్యాయంలో వివరించడం జరిగింది.

తీవ్రమైన మానసిక వ్యాధులు(సైకోసెస్)

ఈ గ్రూపులో మూడు రకాల మానసిక వ్యాధులు ఉంటాయి: షిజోఫ్రినియా మానిక్ డిప్రెసివ్ డిజార్డర్ (బైపోలార్ డిజార్డర్ అనికూడా అంటారు) మరియు స్వల్పకాల సైకోసెస్. ఈ వ్యాధులు అరుదుగా వస్తాయి. కాని చాలా అసహజమైన ప్రవర్తనలు, విచిత్రమైన ఆలోచనలు ఉంటాయి. ఈ కారణం వల్లే మానసిక వ్యాధులంటే ఇవేననే ధోరణి ఉంది. సైకియాట్రిక్ హాస్పటల్స్ లో చాలా ఎక్కువమంది సైకోసెస్ తో బాధపడుతున్న వారే ఉంటారు.

 • కేసు 1.6 : ఇస్మాయిల్ అనే 25 ఏళ్ళ కాలేజి విద్యార్థి. క్రితం సంవత్సరం elevenహాస్పటల్ కి తీసుకు వచ్చే సరికి తనను తాను గదిలో బంధించుకోవడం మొదలు పెట్టాడు. ఇస్మాయిల్ మంచి విద్యార్థి, కాని క్రిందటి పరీక్షల్లో తప్పాడు. ఆతను గంటల తరబడి శూన్యంలోకి చూస్తూ కూర్చుంటాడని అతని తల్లి చెప్పింది. ఒకొక్కప్పుడు అతను ఎవరో ఊహా వ్యక్తితో మాట్లాడుతున్నట్లు తనలో తనే గోణుగుతున్నట్లు మాట్లాడేవాడు. అతని తల్లిదండ్రులు అతన్ని బలవంతంగా క్లినిక్ కి తీసుకు వచ్చారు. మొదట అతను నర్స్ తో మాట్లాడడానికి నిరాకరించాడు. కొంత సమయం తరువాత అతను తనను తన తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు కలిసి కుట్ర చేసి చంపజూస్తున్నారని, దయ్యం తన మనసుతో ఆడుకుంటూందని చెప్పాడు. ఇరుగు పొరుగువారు తన గురించి మాట్లాడుకోవడం తనకు స్పష్టంగా విన పడుతోందని, తలుపు బయట వాళ్ళు తన గురించి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారని చెప్పాడు. తనకేదో జరగబోతూందని తెలుస్తూంది, కాని తనకేమీ అనారోగ్యం లేనప్పుడు తను క్లినిక్ కి రావలసిన అవసరం ఏంటని అడిగాడు.
 • సమస్యేమిటి? ఇస్మాయిల్ షిజోఫ్రినియా అనే తీవ్రమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. అందువల్లే అతను వాస్తవం కాని మాటల్ని వింటున్నాడు, లేని విషయాల్ని ఊహిస్తున్నాడు.

షిజోఫ్రినియా చాలా తీవ్రమైన మానసిక వ్యాధి. సాధారణంగా 30 సంవత్సరాల వయసులోపు ప్రారంభమవుతుంది. ఈ వ్యాధి పీడితులు సామాన్యంగా ఉద్రేకంగా ఉంటారు లేక ముడుచుకుని ఏమీ మాట్లాడకుండా ఉంటారు. సంబంధం లేకుండా మాట్లాడతారు. తమలో తామే మాట్లాడుకుంటారు. ఇతరుల్ని అనుమానిస్తారు, తన మాటలకు ఎవరో అడ్డు పడుతున్నారు లాంటి అసహజమైన విషయాల్ని నమ్ముతారు. ఇతరులు వినలేని మాటల్ని వినడం లాంటి హాలిసునేషన్స్ లేక బ్రాంతులు ఉంటాయి. దురదృష్టవశాత్తు షిజోఫ్రినియా ఉన్న వ్యక్తులు తమకు వ్యాధి ఉందని ఒప్పుకోరు, స్వచ్ఛందంగా చికిత్స తీసుకోవడానికి నిరాకరిస్తారు. షిజోఫ్రినియా చాలా కాలం, నెలలు, సంవత్సరాలపాటు కొనసాగే వ్యాధి, చాలా కాలం పాటు చికిత్స అవసరమవుతుంది. షిజోఫ్రినియా కీలక లక్షణాల గురించి పెట్టె 1.5 లో ఇవ్వబడింది.

1.5. షిజోఫ్రినియా కీలక లక్షణాలు :

షిజోఫ్రినియా ఉన్న వ్యక్తికి ఈక్రింది వాటిలో కొన్ని లక్షణాలు ఉంటాయి.

శారీరక :

 • తన శరీరంలో జంతువులు లేక చిత్రమైన వస్తువులున్నట్లు చెప్పడం.

భావన :

 • డిప్రెషన్.
 • రోజువారీ పనులపై శ్రద్ద, ఆసక్తిని కోల్పోవడం.
 • తనకెవరో హాని చేస్తారని భయపడడం.

ఆలోచన :

 • స్పష్టతతో ఆలోచించడం కష్టమవడం.
 • తనకెవరో హాని చెయ్యబోతున్నట్లు, తనను బయటి శక్తులేవో నియంత్రిస్తున్నట్టు ఊహించుకోవడం (భ్రమలు లేక డెల్యూజన్స్).

ప్రవర్తన :

 • మామూలుగా చేసే పనులు చెయ్యకపోవడం.
 • స్థిమితం లేకుండా, ఒకచోట నిలవకుండా కలయు దిరగడం.
 • ఉద్రేకంగా ప్రవర్తించడం.
 • చెత్తను భద్రంగా దాచుకోవడం లాంటి అస్తవ్యస్త ప్రవర్తన.
 • వ్యక్తిగత సంరక్షణ చేసుకోక పోవడం, పరిశుభ్రంగా ఉండకపోవడం.
 • సంబంధంలేని జవాబులున్న ప్రశ్నలకు జవాబివ్వడం.

ఊహించడం :

 • తనగురించి మాట్లాడే స్వరాల్ని ముఖ్యంగా తిట్లను వినడం (హాలుసినేషన్స్).
 • ఇతరులు చూడని వాటిని చూడడం (హాలుసినేషన్స్).

కేసు 1.7 : 31 సంవత్సరాల వయసున్న మారియా ని గత వారం రోజుల నుండి twelveఅసహజంగా ప్రవర్తిస్తూందని ఆమె భర్త క్లినిక్ కి తీసుకు వచ్చాడు. ఆమె మామూలుగా కంటే అతి తక్కువగా నిద్ర పోతూంది, ఒక చోట స్థిమితంగా కూర్చోకుండా అటూ ఇటూ తిరుగుతోంది. ఇంటిని, పిల్లల్ని ఇంతకు ముందులాగా శ్రద్ధగా చూచుకోవడం మానేసింది. మామూలుగా కంటే చాలా ఎక్కువగా మాట్లాడుతూంది, వాస్తవం కానివాటిని, గొప్పల్ని చెప్తుంది. ఉదాహరణకు తను ఇతరుల జబ్బుల్ని నయం చెయ్యగలనని, తమది చాలా డబ్బు ఉన్న కుటుంబమని చెప్తుంది (ఆమె భర్త నిజానికి ఒక ఫ్యాక్టరీ కార్మికుడయినప్పటికి). ఆమె ఇదివరకటి కంటే తన బట్టల మీద, అలంకరణ వస్తూవుల మీద ఎక్కువగా ఖర్చు పెట్టసాగింది. మారియా భర్త ఆమెను క్లినిక్ కి తీసుకు రావడానికి ప్రయత్నించినప్పుడు ఆమెకు చాలా కోపం వచ్చి అతనిని కొట్టింది. చివరకు ఇరుగు పొరుగువారి సహాయంతో అతను ఆమెను క్లినిక్ కి బలవంతంగా తీసుకువచ్చాడు.

సమస్యేమిటి? మరియా ఒక తీవ్రమైన మానసిక వ్యాధి, పిచ్చి లేక బైపోలార్ డిజార్డర్ తో బాధపడుతూంది. ఇది ఆమె గొప్పల్ని ఊహించుకునే లాగా చేసి, భర్త క్లినిక్ కి తీసుకు రావాలనుకున్నప్పుడు ఆమెకు కోపం తెప్పించింది.

మానిక్ డిప్రెసివ్ జబ్బు లేక బైపోలార్ డిజార్జర్ లో రెండు అతి తీవ్రమైన మూడ్స్ ఉంటాయి. ఒకవైపు తీవ్రమైన ఉద్రేకం(మానియా లేక పిచ్చి), మరోవైపు తీవ్రమైన కుంగుబాటు, లేక డిప్రెషన్ ఉంటాయి. ఈ వ్యాధి సామాన్యంగా మనిషి కొంచెం పెద్దయాక వస్తుంది. సాధారణంగా ఉద్రేక దశలో ఉన్నప్పుడు ఆరోగ్య కార్యకర్త దృష్టికి వస్తుంది (1.6 పెట్టె లో ఈ వ్యాధి యొక్క కీలక లక్షణాలు ఇవ్వబడింది) డిప్రెషన్ దశ మామూలుగా సాధారణ మానసిక వ్యాధిలో ఉన్నట్లే ఉంటుంది కాని మరి కొంచెం తీవ్రమైనది. ఆ వ్యాధి ప్రధాన లక్షణం దశల వారీగా రావడం. అంటే ఒకో దశలో, కొంత సమయం పాటు ఈ వ్యాధి పీడితులు చికిత్స ఏమీ తీసుకోనప్పటికి, చాలా మామూలుగా ఏమీ జబ్బు లేనట్లే ఉంటారు. కాని దీనికి విరుద్ధంగా షిజోఫ్రినియాలో రోగులు చికిత్స తీసుకోనప్పుడు అనారోగ్యంతోనే ఉంటారు.

1.6. మానియా లేక ఉన్మాదం లేక పిచ్చి లక్షణాలు ;

భావన :

 • ఆకాశంలో తేలిపోతున్నట్లు భావించడం.
 • కారణం ఏమీ లేకుండా సంతోష పడడం.
 • చిరాకుపడడం.

ఆలోచన :

 • తను ప్రత్యేక వ్యక్తినని లేక తనకు ప్రత్యేక శక్తులున్నట్లు భావించడం.
 • ఎవరో తనకు హాని చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని నమ్మడం.
 • తనకేమీ అనారోగ్యంలేదని వాదించడం.

ప్రవర్తన :

 • వేగంగా, గబగబా మాట్లాడడం.
 • సామాజికంగా బాధ్యత లేకుండా ప్రవర్తించడం, అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకోవడం లాంటివి.
 • విశ్రాంతిగా, స్థిమితంగా ఒక దగ్గర కూర్చోలేక పోవడం.
 • తక్కువగా నిద్ర పోవడం
 • అనేక పనులు చెయ్యాలనుకోవడం, ఏ పనినీ చెయ్యలేక పోవడం
 • చికిత్సను నిరాకరించడం.

ఊహించడం :

 • ఇతరులు వినలేని స్వరాల్ని తను వినడం (తరచుగా ఈ స్వరాలు తను గొప్ప పనులు చెయ్యగలిగిన ముఖ్యమైన  వ్యక్తి అని చెపూ ఉంటాయి)

1.7. స్వల్పకాల లేక అకస్మాత్తుగా వచ్చిన సైకోసిస్ :

షిజోఫ్రినియాకు ఉండే లేక మానియాకు ఉండేలక్షణాలకు ఈవ్యాధి లక్షణాలకు సారూప్యత ఉంటుంది (పెట్టె 1.5 మరియు 1.6). కీలక మేమిటంటే లక్షణాలు అకస్మాత్తుగా ప్రారంభమయి నెలలోపే తగ్గిపోతాయి. ఈ వ్యాధికి ప్రత్యేకంగా ఉండే లక్షణాలు

 • తీవ్రమైన ప్రవర్తనా సమస్యలు, స్థిమితం లేకపోవడం, ఉద్రేకం.
 • ఇతరులు వినలేని లేక చూడలేని వాటిని వినడం, చూడడం.
 • విచిత్రమైన నమ్మకాలు.
 • అర్థంలేని విషయాలను మాట్లాడడం.
 • భయేగ్వేద స్థితిలో ఉండడం లేక వేగంగా మారే భావోద్వేగాలకు గురి కావడం, (అంతలోకే కన్నీరు పెట్టుకోవడం, అంతలోనే పెద్దగా నవ్వడం)

తీవ్రమైన మానసిక వ్యాధుల్ని నయం చెయ్యడానికి అవసరమైన సలహాల్ని 4వ అధ్యాయంలో ఇవ్వడం జరిగింది.

కేసు 1.8 : 34 ఏళ్ళ వయసు ఉన్న రిచర్డ్ మూడు రోజుల నుండి విచిత్రంగా thirteenప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఆతనికి స్థిమితం లేకుండా ఉంది, ఏదేదో చెత్తనంతా వాగుతున్నాడు, బహిరంగంగా బట్టలూడదీసుకుని సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నాడు. అతనికింతకు ముందు మానసిక వ్యాధి లేదు. ఈ అసహజమైన ప్రవర్తన మొదలయే ముందు కొద్ది రోజులపాటు జ్వరం, తలనెప్పి వచ్చాయంతే. అతనిని క్లినిక్ కి తీసుకు వచ్చేటప్పటికి అతనికి తనెక్కడున్నాడో, ఆరోజు ఏ తేదీయో, ఏమీ తెలియడం లేదు. అతను ఇతరులు చూడని వాటిని చూస్తున్నాడు, ఆరోగ్య కార్యకర్త అడిగిన ప్రశ్నలకు విచక్షణతో జవాబివ్వలేక పోతున్నాడు. అతనికి బాగా ఎక్కువ జ్వరం కూడా ఉంది. అతనికి సెరిబ్రల్ మలేరియా వచ్చిందని తేలింది.

సమస్యేమిటి? రిచర్డ్ సంధి, గందరగోళం, తీవ్రమైన సైకోసిస్ లక్షణాలు గల విపరీత మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. ఇతని విషయంలో మలేరియా వల్ల మెదడుకు ఇన్ఫెక్షన్ రావడం కారణంగా ఈ వ్యాధి వచ్చింది.

తీవ్రమైన లేక స్వల్పకాలం ఉండే ఈసమస్య షిజోఫ్రినియాలాగా ఉంటుంది, కాని దానికి భిన్నంగా, అకస్మాత్తుగా ప్రారంభమవుతుంది, కొద్దిసేపే ఉంటుంది. అందువల్ల చాలామంది ఎక్కువ కాలం మందులు వాడనవసరం లేకుండా, ఒక నెల లోసే పూర్తిగా కోలుకుంటారు. మళ్ళీ ఏదైనా అకస్మాత్తుగా కలిగిన ఒత్తిడి కారణంగా, ఉదాహరణకు, తనెంతో ప్రేమించే వ్యక్తి చనిపోయినప్పుడు, స్వల్పకాలంపాటు మళ్ళీ వ్యాధి లక్షణాలు కనపడతాయి. ఒకోసారి, ఏదైనా తీవ్రమైన శారీరక వ్యాధి వలన సైకోసిస్ రావచ్చు. అప్పుడు దీనిని డెలీరియమ్, లేక సన్నిపాతం అని అంటారు (పెట్టె 1.8). డెలీరియమ్కి తరచుగా తక్షణ చికిత్స అవసరమవుతుంది.

1.8. డెలీరియమ్ లేక సన్నిపాతం కీలక లక్షణాలు :

శారీరక వ్యాధి వలన మెదడు దెబ్బ తినడం కారణంగా వచ్చే సమస్య. డెలీరియమ్ ఉన్న వ్యక్తికి ఈ క్రింది లక్షణాలు ఉంటాయి.

 • ఏమీ తెలియక పోవడం, (ఎక్కడున్నాడో, ఎందుకున్నాడో, టైమెంతో తెలియక పోవడం).
 • జ్వరం, ఎక్కువ చెమట పట్టడం, నాడి వేగమవడం, ఇతర శారీరక లక్షణాలు.
 • జ్ఞాపకశక్తి తగ్గడం.
 • నిద్ర సరిగ్గా పట్టకపోవడం.
 • విజువల్ హాలుసినేషన్స్ (ఇతరులు చూడనివి తను చూడడం).
 • గంట గంటకు లక్షణాలు మారడం (కొంతసేపు మామూలుగా ఏ లక్షణాలూ లేకుండా ఉండడం, కాసేపు తీవ్రమైన లక్షణాలతో బాధపడడం).

మానసిక క్షీణత లేక బుద్ధి మా౦ద్య౦

fourteenచాలామంది ఆరోగ్య కార్యకర్తలు మానసిక క్షీణత అనే పదాన్ని చాలా అలవోకగా, తేలిగ్గా వాడుతూ ఉంటారు. చాలా వివక్షా పూరిత పద్ధతిలో ఈ పదాన్ని వాడడమే దీనికి కారణం. దానికి బదులుగా నేర్చుకోవడంలో లోపం అంటే మెరుగ్గా ఉంటుంది. ఈ పుస్తకంలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న ఎక్కువ విస్తృతంగా వాడుతున్న కారణంగా మానసిక క్షీణత లేక బుద్ధి బిద్ధి మాద్యం అనే పదాన్నే ఆలస్యమవుతున్న మానసిక అభివృద్ధి వర్ణించడానికి వాడాము.

ఖచ్చితమైన పదంగా చెప్పాలంటే మానసిక క్షీణత లేక బుద్ధి మాంద్యం మానసిక వ్యాధి కాదు. ఎందుకంటే ఒక ప్రారంభం, ఒక ముగింపు ఉన్న సమస్యను వ్యాధి అని అంటాము. కాని బుద్ధి మాంద్యం చాలా చిన్నప్పటినుండి ప్రారంభమయి జీవిత కాలమంతా కొనసాగుతూ ఉండే మానసిక స్థితి, మెదడు మామూలుకంటే నెమ్మదిగా లేక ఆలస్యంగా పెరగడం వలన ఇతర పిల్లలకంటే ఆలస్యంగా ఈబిడ్డ మానసిక సామర్థ్యాలు పెరుగుతాయి. బంధువులు ఈ పిల్లల్ని తనపనులు తాను చేసుకోలేక పోవడం, స్కూల్లో సమస్యలు, ఉద్రేకంగా ప్రవర్తించడం వంటి రకరకాల కారణాల వలన ఆరోగ్య కార్యకర్తల దగ్గరకు తీసుకువస్తారు,

1.9. మానసిక క్షీణత లేక బుద్ధి మాంద్యం కీలక లక్షణాలు :

బుద్ధి మాంద్యం ఉన్న వ్యక్తికి ఈ క్రింది లక్షణాలు ఉంటాయి.

 • కూర్చోవడం, నడవడం, మాట్లాడడం లాంటి పెరుగుదలను సూచించేవన్నీ ఆలస్యమవ్వడం.
 • నేర్చుకోవడం కష్టమవడం, పరీక్షలు తప్పడం లాంటి పాఠశాల సమస్యలు.
 • ఇతర పిల్లలతో, ముఖ్యంగా తన ఈడువారితో మెలగడంలో ఇబ్బందులు.
 • కౌమార దశలో ఆమోద యోగ్యంకాని లైంగిక ప్రవర్తనలు.
 • ఎదిగి, పెద్దయాక ఉద్యోగాన్ని వెదుక్కోవడంలో, వచ్చిన ఉద్యోగాన్ని నిలుపుకోవడంలో, డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్ని చూచుకోవడంలో, వంట చెయ్యడం లాంటి రోజువారీ కార్యక్రమాల నిర్వహణలో సమస్యలు.

కేసు 1.9 : బేబీ రూడొ కష్టపు కానుపులో పుట్టింది. ఆమె తల్లి రెండు రోజులకు పైగా నెప్పులతో బాధ పడ్డాక బిడ్డ జనన మార్గంలో ఇరుక్కు పోయింది. గ్రామంలో పురుళ్ళు పోసే మంత్రసాని తల్లికి వెంటనే వైద్య సహాయం అందకపోతే ప్రమాదమవుతుందని హెచ్చరించగా ఆమెను టాక్సీలో వేసుకుని మూడు గంటల తరువాత హాస్పటల్ కి చేరుకున్నారు. హాస్పటల్ లో అపరేషన్ చేసి బిడ్డను బయటికి తీసారు. పుట్టాక బిడ్డ కొన్ని నిమిషాల దాకా ఏడవ లేదు, డాక్టరు చికిత్స వల్లే నిజానికి ఆ బిడ్డ గండం నుండి బయటపడి బ్రతికింది. తల్లి దండ్రులు ఆ బిడ్డను అపురూపంగా, అతి జాగ్రత్తగా పెంచారు. మొదటి కొద్ది నెలలు మామూలుగానే పెరుగుతూందనిపించిన రూడొ తమ కొడుకు థాబొ కంటే ఆలస్యంగా కూర్చోవడం, నుంచోవడం నేర్చుకుంటూందని తల్లి దండ్రులు గమనించారు. థాబొ ఒక సంవత్సరం నిండేటప్పటికి నడవడం నేర్చుకుంటే రూడొ రెండేళ్ళ నిండాకగానీ నడవడం మొదలు పెట్టలేదు. ఆమెకు మాటలు కూడా చాలా ఆలస్యంగా వచ్చాయి. ఆమెకు రెండేళ్లు నిండినా తన తల్లిని ‘అమ్మా’ అని నోరారా పిలవ లేక పోతున్నది. అప్పుడు వాళ్ళకు రూడొ విషయం అంతా సవ్యంగా లేదని తెలిసొచ్చింది. రూడొను అప్పుడు పిల్లల వైద్య నిపుణుడి దగ్గరకు తీసుకు వెళ్ళగా ఆయన రూడొ పుట్టినప్పటి నుండి మొదటి కొన్ని సంవత్సరాల వరకు జరిగిన దాని గురించి అనేక ప్రశ్నలు వేసి తెలుసుకున్నాడు.

సమస్యేమిటి? డాక్టరు రూడొ బుద్ధి మాంద్యంతో బాధపడుతున్నదని జాగ్రత్తగా వివరించాడు. కానుపు కష్టమయినప్పుడు రూడొ తల్లిని హాస్పటల్ కి తీసుకు వెళ్ళడం, ప్రసవంలో జరిగిన తీవ్రమైన జాప్యం వలన బహుశా రూడొ మెదడు దెబ్బతిని బుద్ధిమాంద్యం వచ్చింది.

బుద్ధిమాంద్యంలో చాలా స్థాయిలు ఉండొచ్చు:

 • స్వల్ప బుద్ధి మాంద్యం ఉన్నప్పుడు స్కూల్ లో పారాలు నేర్చుకోవడంలో ఇబ్బందులు తప్ప మరేమీ లక్షణాలు ఉండక పోవచ్చు.
 • బుద్ధి మాంద్యం ఒక మాదిరిగా ఉన్నప్పుడు చదువును చదువును కష్టమవడం, చివరకు స్నానం చెయ్యడం లాంటి స్వీయ సంరక్షణలో ఇబ్బందులు రావచ్చు.
 • తీవ్రమైన బుద్ధి మాంద్యం ఉంటే తినడం లాంటి చిన్న చిన్న పనులకు కూడా ఇతరుల సహాయం అవసరమవుతుంది.

స్వల్ప బుద్ధి మాంద్యం ఉన్న వారికి జీవితమంతా ఆ లోటును గుర్తించకుండానే గడిచిపోతే, తీవ్రమైన బుద్ధి మాంద్యం ఉన్న వారికి వైకల్య తీవ్రత కారణంగా చిన్నతనం లోనే గుర్తించడం జరుగుతుంది. స్వల్ప బుద్ధి మాంద్యం ఉన్నవారు తమంత తాము కొన్ని ప్రత్యేకమైన ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతారు, తీవ్రమైన బుద్ధి మాద్యం ఉంటే వారిని జాగ్రత్తగా సన్నిహితంగా చూచుకుంటూ సంరక్షించవలసి వస్తుంది.

బుద్ధి మాంద్యం ఉన్న పిల్లలకు సహాయపడే విధానాల గురించి సలహాలు 8.1 విభాగంలో ఇవ్వబడినాయి, బుద్ధి మాంద్యంను ఎలా నివారించాలి అనే విషయంపై సమాచారం 10.2 విభాగంలో ఇవ్వబడింది.

పెద్దవారిలో మానసిక సమస్యలు

కేసు 1.10 : రామన్ 70 ఏళ్ళ వయసు ఉన్న విశ్రాంత పోస్ట్ మన్, అతను తన fifteenకొడుకు, కోడలుప తో కలిసి నివసిస్తున్నాడు. అతని భార్య 10 సంవత్సరాల క్రితం చనిపోయింది. కొన్ని సంవత్సరాలుగా రామన్ కి నానాటికీ మతిమరపు ఎక్కువవుతూంది, అతని కుటుంబ సభ్యులంతా అది వయసు పైబడడం వలన సహజంగా వచ్చే మార్పుగా భావించి దానిపై అంత శ్రద్ధ పెట్టలేదు. కొద్ది రోజులు పోయేసరికి రామన్ కి మతిమరపు మరీ ముదిరి ఇంటి నుంచి బయటికి వెళ్ళినవాడు ఇంటి దారి మరచి పోయేవాడు. క్రమేపీ అతను తన బంధువుల పేర్లను, తనకు అత్యంత ప్రీతి పాత్రులైన తన మనవలు, మనవరాండ్ర పేర్లను కూడా మరచిపోవడం మొదలు పెట్టాడు. అతను ఎప్పుడెలా ప్రవర్తిస్తాడో తెలియని స్థితి. కొన్ని రోజులు ఎప్పుడూ చిరుబ్రురులాడుతూ, చిన్న విషయాలకే కోపంతో ఎగిరి పడుతూ ఉండేవాడు, మరి కొన్నిరోజులు గంటల తరబడి ఎవరి తోనూ మాట్లాడకుండా మౌనంగా కూర్చునేవాడు. రామన్ కొడుకు అతన్ని హాస్పటల్ కి తీసుకు వచ్చాడు, డాక్టరు అతని మెదడుకి స్కానింగ్ చేయించి మెదడు నిర్మాణంలో కలిగిన మార్పులకారణంగా రామన్ కి 'డిమెన్షియా' అనే వ్యాధి వచ్చిందని నిరూపణగా చెప్పాడు.

సమస్యేమిటి? రామన్ వృద్దులలో ప్రత్యేకంగా కనబడే ఒక రకపు మెదడు వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి మరచిపోవడంతో ప్రారంభిస్తుంది. ఇది సమయం గడిచిన కొద్దీ మరీ ముదిరి ప్రవర్తనాపరమైన సమస్యలకు దారి తీస్తుంది.

పెద్ద వయసు వారికి రెండు ప్రధానమైన మానసిక వ్యాధులు వస్తాయి. ఒకటి డిప్రెషన్. ఇది తరచుగా ఒంటరి తనం వలన, శారీరక ఆనారోగ్యం వలన, అశక్తత లేక వైకల్యంవలన, పేదరికం వలన కలుగుతుంది. ఇది మిగతా వయసువారిలో డిప్రెషన్కి సమానం. మరొక మానసిక వ్యాధి డిమెన్షియా (పెట్టె 1.10). ఇది వృద్దులకు మాత్రమే ప్రత్యేకమైన వ్యాధి.

1.10. డిమెన్షియా కీలక లకణాలు :

డిమెన్షియా ఉన్న వ్యక్తికి (సాధారణంగా 60 ఏళ్ళ వయసు పైబడినవారు) ఈక్రింది లక్షణాలలో కొన్ని ఉంటాయి.

 • బంధువులు, స్నేహితుల పేర్లు లాంటి అతి ముఖ్యమైన విషయాల్ని మరచి పోవడం.
 • తనకు బాగా తెలిసిన గ్రామం, ఇంటినే మరచిపోయి దారి తప్పడం.
 • ఎప్పుడు చిర్రుబుర్రులాడుతూ చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం.
 • తనలోతాను ముడుచుకు పోవడం, డిప్రెషన్లో కూరుకు పోవడం.
 • కారణం లేకుండా ఏడవడం, నవ్వడం.
 • ఇతరులతో మాట్లాడింది మరచిపోవడం.
 • ఆరోజు ఏవారమో, ఏ తేదీయో మరచిపోవడం, తనెక్కడుందో మరచి పోవడం.
 • విచక్షణా రహితంగా మాట్లాడడం, లేక సబబుగాని మాటల్ని మాట్లాడడం.

చిన్న పిల్లల్లో మానసిక ఆరోగ్య సమస్యలు

చిన్నపిల్లల్లో ప్రత్యేకంగా వచ్చే కొన్ని మానసిక ఆరోగ్య సమస్యలు :

 • డిస్లెక్సియా, నేర్చుకోవడంలో ఇబ్బందులు.
 • హైపర్ ఏక్టివిటీ, పిల్లలు మితిమీరిన చురుకుదనంతో ఉంటారు.
 • ప్రవర్తనాపరమైన సమస్యలు, మామూలు కంటే ఎక్కువ అల్లరి చేస్తారు.
 • డిప్రెషన్, పిల్లలు విచారంగా, సంతోషంలేకుండా ఉంటారు.
 • పక్కమీద మూత్రం పొయ్యడం, అలా చెయ్యగూడని వయసు వచ్చాక కూడా ఇంకా పక్క తడపడం.
 • పిల్లలు హింసకు గురవుతున్నప్పుడు కూడా మీ దృష్టిలో పడొచ్చు (పెట్టె1.11) బుద్ధి మాద్యం లోలాగా కాకుండా తరచుగా ఈ పిల్లల ఆరోగ్యం మెరుగు పడి పూర్తిగా నయం అవొచ్చు. ప్రవర్తన సంబంధమైన సమస్యలతో ఉన్న పిల్లలందరికీ బుద్ధి మాద్యం ఉన్నదని అంచనా వేయగూడక పోవడం ముఖ్యం.

1.11. చిన్న పిల్లల్లో మానసిక వ్యాధుల కీలక లక్షణాలు :

చిన్నపిల్లల్లో మానసిక వ్యాధుల్ని సూచించే కీలక చిహ్నాలు:

 • మామూలు తెలివితేటలు ఉండి కూడా చదువులో వెనకబడే పిల్ల.
 • ఎల్లప్పుడూ స్థిమితం లేకుండా తిరుగుతూ, ఏకాగ్రత నిలపలేని పిల్ల.
 • ఇతరులతో ఎప్పుడూ ఇబ్బందుల్ని కొని తెచ్చుకునే , లేక తగవులు తెచ్చుకునే పిల్ల.
 • ఇతర పిల్లలతో ఆటలాడుకోకుండా, మాట్లాడకుండా ఎప్పుడూ ముడుచుకుని ఉండే పిల్ల.
 • స్కూలుకు వెళ్ళనని మొరాయించే పిల్ల.

మానసిక వ్యాధులకు కారణాలు

చాలా సంస్కృతుల్లో అనారోగ్యాలకు కారణాల్ని అర్థం చేసుకోవడానికి వైద్య sixteenసంబంధమైన, సంప్రదాయ పరమైన వివరణలు ఇవ్వబడినాయి. సంప్రదాయక నమూనాలు దుష్ట శక్తుల, లేక క్షుద్ర దేవతలు, దయ్యం పట్టడం, చేతబడులు, మంత్ర గత్తెలు లాంటివాటి తో సంబంధం ఉన్నవి. మీ సంస్కృతిలో ఉన్న విశ్వాసాల గురించి మీకు తెలిసి ఉండాలి. ఐనప్పటికీ, మీ దగ్గరకు సలహా కోసం వచ్చేవారికి మానసిక అనారోగ్యానికి సంబంధించిన వైద్య పరమైన వివరణల్ని తెలపడానికి మీకు వాటి గురించి అవగాహన ఉండాలి.

 1. ఒత్తిడితో కూడిన జీవిత సంఘటనలు : ప్రతి ఒక్కరి బ్రతుకు అనేక అనుభవాలతో, సంఘటనలతో నిండి ఉంటుంది. వీటిలో కొన్ని ఒక వ్యక్తికి బాధనూ, ఒత్తిడినీ కలిగించ వచ్చు. చాలా మంది వీటిని తట్టుకుంటూనే బ్రతుకును కొనసాగించడం నేర్చుకుంటారు. కాని ఒకోసారి అవి మానసిక వ్యాధులకు దారి తియ్యొచ్చు. బాగా ఎక్కువగా మానసిక అనారోగ్యాలకు కారణమయే జీవిత సంఘటనలు- నిరుద్యోగం, తనకు ప్రియమైన వ్యక్తి చనిపోవడం. అప్పల్లో కూరుకు పోవడంలాంటి ఆర్థిక కారణాలు, పిల్లలు పుట్టక పోవడం, వివాహ సంఘర్షణలు, హింస మరియు గాయాలు.
 2. కష్టాల మయమైన కుటుంబ నేపథ్యం : బాల్యంలో హింసకు, భావోద్వేగ పరమైన అశ్రద్దకు, నిర్లక్ష్యానికి గురయిన వారు డిప్రెషన్, ఏంగ్టయిటీ లాంటి మానసిక అనారోగ్యాలకు గురవుతారు.
 3. మెదడు వ్యాధులు : మెదడుకు సోకే ఇన్ఫెక్షన్స్ వలన, ఎయిడ్స్, తలకు దెబ్బ తగలడం, మూర్ఛ వ్యాధి, మెదడు రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడం, బుద్ధి మాంద్యం, డిమెన్షియా, భావోద్వేగ సమస్యలు వస్తాయి. చాలా మానసిక వ్యాధులకు ఇంకా ఖచ్చితమైన మెదడుకు సంబంధించిన కారణం కనుగొనబడ లేదు. ఐతే చాలా మానసిక వ్యాధులకు న్యూరోట్రాన్స్మిటర్స్ అనే రసాయనాలలో కలిగే మార్పులు కారణాలని చెప్పడానికి ఆధారాలున్నాయి
 4. వారసత్వం, జీన్స్ : చాలా తీవ్రమైన మానసిక వ్యాధులకు వారసత్వం అనేది అతి  ముఖ్యమైన అంశం. ఐతే, తల్లి దండ్రులిద్దరిలో ఒక్కరికే seventeenమానసిక వ్యాధి ఉంటే పిల్లలికి వ్యాధి వచ్చే ప్రమాదం చాలా తక్కువ. మధుమేహ వ్యాధి లేక డయాబెటిస్, అధిక రక్తపోటు లేక హైపర్టెన్షన్ కి లాగానే ఈ వ్యాధులపై కూడా పరిస్థితులు, పరిసరాల ప్రభావం ఉంటుంది.
 5. శారీరక వ్యాధులు : మూత్రపిండాలు, కాలేయం దెబ్బతిని పని చెయ్యక పోవడం వలన తీవ్రమైన మానసిక వ్యాధులు రావచ్చు. కొన్ని మందులు, ఉదాహరణకు, అధిక రక్తపోటుకు వాడే కొన్ని మందులు డిప్రెషన్ కి దారి తియ్యొచ్చు. వృద్దులకు ఎక్కువ మోతాదులో వాడితే చాలా మందులు డెలీరియమ్ లేక సన్నిపాతాన్ని కలగజేయొచ్చు.

స౦స్కతి మరియు మానసిక వ్యాధులు

సంస్కృతి చాలా రకాలుగా మానసిక ఆరోగ్య అంశాలను ప్రభావితం చేస్తుంది.

 1. మానసిక వ్యాధి అంటే ఏమిటి ? : మానసిక వ్యాధి నిర్వచనం ఒక సంస్కృతికీ మరొక సంస్కృతికీ మారుతూ ఉంటుంది. షిజోఫ్రినియా, మానియా లాంటి తీవ్రమైన మానసిక వ్యాధుల సముదాయాన్నే తరచుగా మానసిక వ్యాధులుగా పరిగణించడం జరుగుతుంది. మామూలుగా అతి సాధారణంగా, తరచుగా కనపడే మానసిక ఆరోగ్య సమస్యలు సాధారణ మానసిక ఆనారోగ్యాలు (డిప్రెషన్ మరియు ఏంగ్టయిటీ) మద్యం, మత్తుమందుల వ్యసన సంబంధమైన మానసిక ఆరోగ్య సమస్యలు - వీటిని చాలా అరుదుగా మానసిక వ్యాధులుగా పరిగణిస్తారు. మీరు ఈ వ్యాధుల గురించి తెలుసుకుని ఉండాలి, కాని ఈ వ్యాధుల పట్ల ఉన్న వ్యతిరేక భావాల వలన, మీరు వ్యాధి గురించి ఒక ముద్రను వాడడం వలన వారి బాధను మరింత పెంచిన వారవుతారు. దానికి బదులు, వ్యాధి ఫలానా అని తెలియ చెప్పేందుకు స్థానికంగా సరైన మాటలతో ఒత్తిడి, అందోళన ఫలితంగా వచ్చిన వ్యాధులుగా వర్ణించాలి.
 2. భావోద్వేగ బాధను వర్ణించే మాటలు : మానవ భావోద్వేగాల్ని అనారోగ్యాల్ని వివిధ భాషల్లో వర్ణించడం అంత సులువు కాదు. ఉదాహరణకు డిప్రెషన్ ని తీసుకుందాం. ఈ మాటకు అర్థం కుంగుబాటు లేక విచారం, దీనిని భావనను వర్ణించడానికి ఉపయోగించవచ్చు (నేను డిప్రెషన్ లో ఉన్నాను), వ్యాధిని వర్ణించడానికి ఉపయోగించవచ్చు (రోగి డిప్రెషన్ లో బాధపడుతున్నాడు). చాలా భాషల్లో విచారాన్ని ఒక భావనగా వర్ణించడానికి పదాలు ఉన్నాయిగాని విచారాన్ని ఒక వ్యాధిగా వర్ణించడానికి పదాలు లేవు. అందుచేత, స్థానిక భాషలో ఏ మాటలు భావనను తెలియజేస్తాయో, ఏ మాటలు వ్యాధిని తెలియజేస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు ఈరెండిటికి వేరు వేరు పదాలు ఉండొచ్చు. ఒకోసారి ఒక పదాల సముదాయాన్ని వ్యాధిని వర్ణించడానికి ఉపయోగించవచ్చు. ఈమాన్యువల్లో పద సూచికలో వివిధ మానసిక వ్యాధుల్ని వాటి లక్షణాల్ని వర్ణించు పదాల్ని ఇంగ్లీషులో ఇవ్వడం జరిగింది. ఆ పదాలకు స్థానికంగా వాడే మాటల్ని రాసుకోవడానికి కొంత స్థలం  కేటాయించబడింది. eighteen
 3. చేతబడి, క్షుద్రశక్తుల గురించి నమ్మకాలు : చాలా సమాజాల్లో ప్రజలు చేతబడి, క్షుద్ర శక్తులు లేక అతీంద్రియ శక్తులవలన ఈ మానసిక వ్యాధులు వస్తాయని నమ్ముతారు. వీటిని వ్యతిరేకించడం వల్ల లాభమేమీలేదు (కమ్యూనిటీలో అందరూ ఆదే భావాల్ని కలిగి ఉంటారు). పైగా అలా చెయ్యడం వలన వ్యాధిగ్రస్తుడికి ఇబ్బందిగా అనిపిస్తుంది. దానికి బదులు వారి నమ్మకాల్ని అర్థం చేసుకుని వైద్యపరమైన విషయాల్ని సులభమైన భాషలో వివరించాలి.
 4. మతగురువులు, జ్యోతిష్కులు, మానసిక వ్యాధి నిపుణులు : బాధలో ఉన్నప్పుడు ప్రజలేం చేస్తారు? ప్రత్యామ్నాయ, మత పరమైన, సంప్రదాయ ఆరోగ్య సంరక్షకుల సహాయం తీసుకుంటారు. ఉదాహరణకు హోమియోపతీ, ఆయుర్వేద, మానసిక వ్యాధులు ఉన్నవారు వివిధ రకాల చికిత్సల సహాయం పొందుతారు.
 5. సంప్రదాయ చైనీస్ మందులు, దుష్ట శక్తుల్నుండి విముక్తి కలిగించేవారు, షామన్స్, పురోహితులు, పాస్టర్లు, జ్యోతిష్కులు. ఇది అనేక కారణాలవలన జరుగుతుంది. మొదటిది, అన్ని వ్యాధులకు ఆరోగ్య సంరక్షణలో సమాధానాలు లేవు, ఇది ముఖ్యంగా మానసిక వ్యాధులకు వర్తిస్తుంది. రెండవది, మనుషులు తమకు మానసిక వ్యాధులు దుష్టశక్తుల వలన, సామాజిక కారణాలవలన వచ్చాయని అనుకుంటారు. అందుకని వైద్యులను కాకుండా మిగతా వారి సహాయాన్ని కోరతారు. కొందరికి సంప్రదాయ చికిత్స వైద్య చికిత్సకంటే త్వరగా సహాయపడుతుంది.

 6. మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కౌన్సిలింగ్ : చాలా పాశ్చాత్య దేశాల్లో మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి సహాయ పడడానికి తమ తమ సంస్కృతుల్లో పెంపొందిన సైకలాజికల్ థియరీలు లేక ప్రతిపాదనల ఆధారంతో కౌన్సిలింగ్ చెయ్యడం జరుగుతోంది. కాని ఇతర దేశాల్లో ఉన్న సంస్కృతులకు ఇవి విదేశీయమైనవి. దీని అర్థం ఇతర సంస్కృతుల్లో కౌన్సిలింగ్ పనికిరాదని కాదు. మీ స్వంత సంస్కృతిలో పెంపొందిన వనరుల్ని పద్ధతుల్ని వెదకడం అవసరం, ఎందుకంటే వాటికి ప్రజల అంగీకారం ఎక్కువగా ఉంటుంది. ఈ మాన్యువల్లో అన్ని సంస్కృతులకు వర్తించగల సులభమైన కౌన్సిలింగ్ పద్ధతిని వివరించడం జరిగింది.

1.12. మానసిక వ్యాధుల గురించి గుర్తుంచుకోవలసిన విషయాలు :

 • వివిధ రకాల మానసిక వ్యాధులు అనేకం ఉన్నాయి. మానసిక వ్యాధులు తీవ్రమైన అశక్తతనూ, వైకల్యాన్నీ చివరకు మరణాన్నికూడా కలగజేస్తాయి.
 • సమాజంలోనూ, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లోనూ తరచుగా కనపడే మానసిక వ్యాధులు, సామాన్య మానసిక సమస్యలు మద్యం వ్యసనానికి సంబంధించినవి. కాని రోగులుగాని, ఆరోగ్య కార్య కర్తలుగాని వీటిని మానసిక వ్యాధులుగా పరిగణించరు.
 • ప్రవర్తనల్లో కలిగే ఇబ్బందుల కారణంగా షిజోఫ్రినియా, మానిక్-డిప్రెసివ్ వ్యాధి, నైకోసెస్ లాంటివాటిని మాత్రమే రోగులుగాని, ఆరోగ్య కార్యకర్తలు గాని మానసిక వ్యాధులుగా పరిగణిస్తారు.
 • ఒత్తిడిని కలిగించే సంఘటనలు, మెదడు పని చెయ్యడంలో మార్పులు, మెదడుకు ఇన్ఫెక్షన్స్ లాంటి ఆరోగ్య అంశాలు, మానసిక వ్యాధులకు ప్రధాన కారణాలు.
 • కొంతమంది దుష్టశక్తులు, అతీంద్రియ శక్తులు మొదలైన అంశాలు మానసిక వ్యాధులకు కారణాలని నమ్ముతారు. వీటికి వ్యతిరేకంగా మీరు వాదించవద్దు. వాటికి వైద్యపరమైన వివరణల్ని సులభంగా అర్థమయే రీతిలో వారి ముందుంచండి.
 • మీరు ఒక వ్యక్తి యొక్క వ్యాధిని నిర్ధారణ చేసేసి ఒక ముద్రను వెయ్యాల్సిన అవసరం లేదు. ముఖ్యమైనదేమిటంటే వ్యాధి ఉందని గుర్తించడం, ఏరకం వ్యాధో తెలుసుకోవడానికి ప్రయత్నించడం, అప్పుడు తగిన చికిత్సను అందించడం.

సమాజపు అంచుల్లో ఉన్న వారి కంఠస్వరాలు

మొదటిసారి జరిగినప్పుడు అది చాలా భయంగొలిపేదిగా ఉంది. నేను బస్సులో కూర్చుని ఉండగా అకస్మాత్తుగా నా గుండె దడదడా వేగంగా కొట్టుకోవటం ప్రారంభంచింది, నాకు హార్ట్ ఎటాక్ వచ్చిందనే అనుకున్నాను. నాకు ఊపిరి తీసుకోవడం కష్టమయింది, అంతలోనే చేతుల మీద, పాదాల మీద చీమలు పాకినట్లు అనిపించింది. నా గుండె మరింత బలంగా, మరింత వేగంగా కొట్టుకో సాగింది, శరీరమంతా వేడిగా అయిపోయింది, ఒళ్ళంతా వణికిపోతోంది, నేను బస్సునుండి బయటపడాల్సి ఉంది, కాని బస్సు వేగంగా నడుస్తూంది, నాకు ఊపిరాడలేదు. నాకున్న పెద్ద భయం నేను స్పృహ తప్పి పడిపోతానేమోనని లేక నాకు పిచ్చెక్కి పోతుందేమోనని. అంతలో బస్సు అగింది, ఇంకా నేను దిగవలసిన చోటు చాలా దూరంగా ఉన్నప్పటికి గబుక్కున దిగిపోయాను. అప్పటి నుండి ఇంక బస్సులోకి ఎక్కడం నా వల్ల కావడంలేదు. అసలు బస్సు ఎక్కాలనే అలోచనే నాకు వ్యాధిని కలిగిస్తూంది. రెండు సంవత్సరాల నుండి ఈ భయంతో నేను ఇల్లు విడిచి బయటకు వెళ్ళడం మానేసాను. ఇప్పుడు నాకు చాలా తక్కువ మంది స్నేహితులున్నారు, దాదాపుగా నా సాంఘిక జీవితం ఆగి పోయింది. నాకేం చెయ్యాలో పాలుపోలేదు, సైకియాట్రిస్ట్ ని కలవడానికి నాకు చాలా భయంగా ఉంది. నాకేమీ పిచ్చి లేదు కదా !" ----- భయాలు, భయోత్పాతాలకు గురయిన 24 సంవత్సరాల స్త్రీ.

"నాకు మొదటిసారి స్వరాలు వినిపించడం మొదలయినప్పుడు నా వయసు 17 సంవత్సరాలు. ముందు నాకు అవి నిజమో, కేవలం నా మనసుకు అలా అనిపిస్తోందో ఖచ్చితంగా తెలిసేది కాదు. కాని తరువాత నాకు తెలియని వాళ్ళు నా గురించి అసహ్యంగా మాట్లాడేది వినగలిగే వాడిని. ఒకసారి ఎవరో నన్ను నూతిలోకి దూకమని చెప్పడం విన్నాను, తరువాత నేను విన్న ఆజ్ఞను పాటించాలని చాలా రోజుల పాటు నూతి దగ్గరే నిలబడి ఉండేవాడిని. నా ఆలోచనల్ని టి.వి. నియంత్రిస్తున్నట్లు అనుకునేవాడిని, కొన్నిసార్లు నేను తినే పదార్ధాల్లో ఖచ్చితంగా విషం కలుపుతున్నారని అనుకునేవాడిని. గాంగ్స్టర్స్ నన్ను చంపడానికి పొంచి ఉన్నారని అనిపించేది. నాకు చాలా కోపంవచ్చేది, అలా ఒకసారి నేను బాగా ఉద్రేకంతో పొరుగు వ్యక్తిని చావబాదినప్పుడు నన్ను హాస్పటల్ కి తీసుకు వెళ్ళారు". ----- షిజోఫ్రినియా ఉన్న 23 సంవత్సరాల పురుషుడు

"అది చాలా నెమ్మదిగా, క్రమేపీ ప్రారంభమయింది, కాని దానిని నేను గుర్తించేలోగానే నాకు జీవితం మీద ఆసక్తి పోయింది. చివరికి నాపిల్లలు, కుటుంబం కూడా నాకు సంతోషం కలిగించేవి కావు. ఎప్పుడూ చాలా అలసటగా అనిపించేది, నిద్ర పట్టేది కాదు. తెల్లవారుజామున 2.3 గంటలకే మెలకువ వచ్చేసేది, తరువాత అటూ, ఇటూ తిరుగుతూ కాలక్షేపం చేసేదాన్ని నాకు ఇష్టమైన పదార్ధాల రుచి తెలిసేది కాదు, బరువు తగ్గిపోయాను. దృష్టి నిలప లేకపోవడం వలన పుస్తకాల్ని చదివే ఆసక్తి కూడా తగ్గిపోయింది. నాకు తలనెప్పి వచ్చేది. నేనంటే నాకే చాలా చులకనగా అనిపించి, నేను కుటుంబానికి భారంగా ఉన్నానని, ఇంకా అలాంటి ఆలోచనలు చాలా వచ్చేవి. నా ఆలోచనలకు నాకే సిగ్గుగా అనిపించేది, ఐతే ఇది ఎవరికీ చెప్పుకోలేక పోయేదాన్ని. మా అత్తగారు నేను చాలా సోమరిగా తయారయానని విసుక్కునేది. ఒకసారి నాకు ఆత్మహత్య చేసుకోవాలని బలంగా అనిపించింది, ఇంక అప్పుడు బాగా భయపడిపోయి నా భర్తకు చెప్పాను... ఇది అసలు సమస్య ప్రారంభమయిన రెండు నెలలకు." -----డిప్రెషన్ కు గురయిన 43 సంవత్సరాల మహిళ.

"నాకు చాలా బలం ఉందనీ, నాకు అసలు నిద్రపోవాల్సిన అవసరమే లేదని అనుకునేవాడిని. నిజానికి ఆ రోజుల్లో నేను దాదాపుగా నిద్ర పోయేవాడినే కాదు. నేను చాలా స్కీములు, ప్రణాళికల్ని వేసుకోవడంతో సతమతమయి పోయేవాడిని, కాని ఏ ఒక్కదాన్ని సరిగ్గా పూర్తి చెయ్యలేకపోయేవాడిని. ఎవరైనా నన్ను ఆపాలని చూస్తే నేను కోపంతో ఊగిపోయేవాడిని. ఒకసారి నా వెర్రి స్కీము ఒకదాని విషయంలో నా వ్యాపార భాగస్వాములతో పెద్ద కొట్లాటయింది. బాగా ఉద్రేకంగా ఉన్నప్పుడు నేను ఎంత తప్పుగా వ్యవహరిస్తున్నానో గుర్తించలేక పోయాను. ఇంకా, ఇతరుల్ని ఉద్ధరించడానికి నాకు ప్రత్యేక శక్తులున్నాయని కూడా కొన్నిసార్లు అనుకునేవాడిని. నా జబ్బు వలన కలిగిన అతి పెద్ద నష్టం, నేను హదూపదూ లేకుండా విచ్చల విడిగా డబ్బును ఖర్చుపెట్టడం వలన నా కుటుంబం వీధిన పడింది." ----- మానియా లేక ఉన్మాదానికి లోనయిన 38 ఏళ్ళ పురుషుడు.

"ఏమి జరుగుతోందో నాకు తెలియడం లేదు. మొన్నొక రోజు ప్రొద్దున నా భార్య నాకు టీ తీసుకు వచ్చి ఇచ్చింది, ఒక నిమిషం ఆమె ఎవరో నాకు గుర్తుకు రాలేదు. తరువాత నేను బజారు నుంచి ఇంటికి వస్తున్నాను, నేను మా ఊశ్ళోనే ఉన్నప్పటికి, అకస్మాత్తుగా నేను ఎక్కడున్నానో నాకు తెలియలేదు. నాకు వయసు పైబడిన కొద్దీ మతి మరపు వస్తోందని నాకు ఎప్పుడూ అనిపించేది, కాని ఇది మరీ విపరీతం. అప్పుడు నాకు మా నాన్నగారు జ్ఞాపకశక్తిని కోల్పోయిన చాలా సంవత్సరాలకు చనిపోయారని గుర్తుకు వచ్చింది, నాకు కూడా అదే సమస్య వచ్చేస్తుందేమోనన్న భీతి పట్టుకుంది." ----- డిమెన్షియా ఉన్న ఒక పురుషుడు.

“నాకు జబ్బుగా ఉందంటూ నేను చాలా రోజులు పని మానేయడం ప్రారంభించినప్పటి నుండి నా సమస్య మొదలయింది. నాకు తరచుగా కడుపు నెప్పి వచ్చేది, ఈ మధ్య పచ్చకామెర్లు వచ్చాయి. అప్పటినుంచి నాకు నా తాగుడు గురించి భయం పట్టుకుంది. నాకు మెలకువ వచ్చిందంటే కల్లోలం నన్ను భయపెట్టేది. ఆ రోజును ఎలాగోలా గడపాలంటే నేను తాగక తప్పదు. ఈమధ్య నేను మధ్యాహ్నం భోజనానికి ముందు కూడా తాగుతున్నాను. నేనెంత తాగుతున్నానో నాకు ఖచ్చితంగా తెలియదు, కాని ఎంత తాగినా ఇంకా చాలనట్టుగానే ఉంటుంది." ----- తాగుడు వ్యసనం ఉన్న 44 సంవత్సరాల పురుషుడు.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate