অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

యాక్యూట్ లింఫోసైటిక్ ల్యుకేమియా ( ఏ ఎల్ ఎల్ )

యాక్యూట్ లింఫోసైటిక్ ల్యుకేమియా అంటే ఏమిటి ?

  • ల్యుకేమియా (రక్తానికి సంబంధించిన క్యాన్సర్) అనేది ప్రాణాపాయకరమైన వ్యాధి. ఈ వ్యాధి సోకడం అంటే, సాధారణంగా తెల్ల రక్త కణాలుగా మారే జీవకణాలు, క్యాన్సర్ కణాలుగా మారి , ఎముక మూలుగు (బోన్ మారో) లోని సాధారణ కణాల స్థానాన్ని చాలా వేగంగా, ల్యుకేమియా కణాలతో నింపివేస్తాయి.
  • అక్యూట్ లింఫోసైటిక్ ల్యుకేమియా (ఏ ఎల్ ఎల్ ) అన్ని వయసులవారికి సోకుతుంది. అయితే, 15 ఏళ్ల లోపు పిల్లలకు సోకే వివిధ రకాల క్యాన్సర్లలో ఏ ఎల్ ఎల్ దే ఎక్కువ వాటా (25 %) .
  • 2 నుంచి 5 ఏళ్ళ లోపు వయసున్న చిన్న పిల్లలకు ఏ ఎల్ ఎల్ , చాలా తరచుగా, సోకుతుంది. పెద్దవయసువారి విషయంలో, 45 ఏళ్లు పైబడివారికి ఈ వ్యాధి సోకడం కొంతవరకు మామూలే.
  • ఏ ఎల్ ఎల్ సోకడం అంటే, బొత్తిగా ఎదుగుదలలేని ల్యుకేమియా కణాలు ఎముక మూలుగులో పేరుకుపోయి, రక్త కణాలను ఉత్పత్తిచేసే సాధారణ జీవకణాలను ధ్వంసం చేస్తాయి; ఆ కణాల స్థానాన్ని ల్యుకేమియా కణాలతో నింపివేస్తాయి. ఈ ల్యుకేమియా కణాలు రక్త ప్రవాహం ద్వారా, కాలేయానికి, ప్లీహానికి, లింఫ్ గ్రంధులకు, మెదడుకు, మూత్రపిండాలకు చేరి; అక్కడ పెరగడం, విరగడం కొనసాగించవచ్చు. మెదడును, వెన్ను పూసను కప్పివుండే జీవకణ సముదాయంతో కూడిన ధాతు పొరలను ఉద్రేకపరచి, అవి వాయడానికి ( మెనింజైటిస్ ) దారితీయవచ్చు. రక్త హీనత (అనీమియా)ను కలిగించవచ్చు, కాలేయాన్ని , మూత్రపిండాలను పనిచేయనివ్వకపోవచ్చు, ఇతర అవయవాలను దెబ్బతీయవచ్చు.

వ్యాధి లక్షణాలు, గుర్తించే తీరు

  • తగినన్ని సాధారణ రక్తకణాలను ఉత్పత్తిచేయలేని ఎముక అశక్తతవల్ల ఈ వ్యాధి ప్రాథమిక లక్షణాలు బయటపడతాయి.
  • తెల్ల రక్తకణాలు చాలా తక్కువ వున్నందువల్ల , ఇన్ ఫెక్షన్ సోకిందనే సూచనగా, జ్వరం రావడం, ఎక్కువ చెమటపట్టడం గమనించవచ్చు. ఎర్ర రక్తకణాలు చాలా తక్కువగా వున్నందువల్ల, రక్తహీనత ఏర్పడిందనడానికి సూచనగా, నీరసం, అలసట, పాలిపోవడం గమనించవచ్చు.
  • ప్లేటిలెట్ల సంఖ్య ( రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే, రక్తంలోని జీవపదార్థ శకలాలు) చాలా తక్కువగా వున్నందువల్ల ఊరకే గాయాలుకావడం, రక్తం కారడం జరగవచ్చు. కొన్నిసార్లు ముక్కునుంచి , లేదా పంటి చిగుళ్లనుంచి రక్తం కారవచ్చు. మెదడులోని ల్యుకేమియా కణాలవల్ల తలనొప్పి, వాంతులు, చికాకు కలగవచ్చు; ఎముక మూలుగులోని ల్యుకేమియా కణాలవల్ల ఎముకల నొప్పులు, కీళ్ళ నొప్పులు కలగవచ్చు. ల్యుకేమియా కణాలవల్ల కాలేయం, ప్లీహం పెరిగి, కడుపు నిండుగా వున్నట్టు అనిపించవచ్చు, కొన్ని సందర్భాలలో కడుపునొప్పిగా కూడా అనిపించవచ్చు.
  • రక్తానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలిపే, " కంప్లీట్ బ్లడ్ కౌంట్ " వంటి రక్త పరీక్షలు ఈ వ్యాధి సోకిందనే మొదటి రుజువును అందించవచ్చు
  • మొత్తం తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గవచ్చు, సాధారణ స్థాయిలో వుండవచ్చు, లేదా పెరగవచ్చు ; కాని, ఎర్ర రక్త కణాలు, ప్లేటిలెట్ల సంఖ్య తగ్గడం మాత్రం దాదాపు ఖాయం.
  • ఇంతేకాకుండా, మైక్రోస్కోప్ ద్వారా రక్తాన్ని పరీక్షించినపుడు, ఆ రక్తపు నమూనాలు బొత్తిగా ఎదుగుదలలేని తెల్ల రక్తకణాలను కలిగివుంటాయి.
  • ల్యుకేమియా సోకిందని నిర్ధారించుకోవడానికి, అది ఏ రకమైన ల్యుకేమియానో విడమరచి తెలుసుకోవడానికి తప్పనిసరిగా రక్తపు మూలుగు బయాప్సీ నిర్వహిస్తారు.
  • ఈ వ్యాధికి చికిత్స అందుబాటులో లేకముందు, ఈ వ్యాధిసోకినవారిలో చాలా మంది, వ్యాధిని గుర్తించిన నాలుగు నెలలలోపే, చనిపోయారు. అయితే ఇప్పుడు, పిల్లలలో దాదాపు 80 % మందికి, పెద్దవారిలో దాదాపుగా 35 % మందికి నయమవుతున్నది
  • చాలామందిలో, మొదటి విడత కిమోథెరపితోనే , వ్యాధి అదుపులోనికి వస్తుంది ( క్యాన్సర్ కణాలు పూర్తిగా తొలగింపబడతాయి ) .
  • 3-7 ఏళ్ళ మధ్య వయసు పిల్లలకు ఈ వ్యాధి సోకితే, వారి పరిస్థితి ఎలా వుండబోతుందో తేలికగా ఊహించవచ్చు ( ప్రోగ్నోసిస్). రెండేళ్ళకంటె తక్కువ వయసు పిల్లలలో , లేదా పెద్ద వయసువారిలో పరిస్థితి ఎలావుంటుందో ఊహించడం చాలా కష్టం. తెల్ల రక్త కణాల సంఖ్య, ల్యుకేమియా కణాలలోని సంబంధిత క్రోమోజోమ్ అసాధారణ లక్షణాలు వ్యాధి ఎలా పరిణమిస్తుందో ఊహించడాన్ని ప్రభావితంచేయవచ్చు.

చికిత్స

  • కిమోథెరపి ప్రభావం చాలా ఎక్కువగా వుంటుంది, దీనిని దశలవారీగా నిర్వహిస్తారు. ల్యుకేమియా కణాల నిర్మూలన ద్వారా, వ్యాధి కారకాలను తొలగించి, ఎముక మూలుగులో మళ్ళీ, సాధారణ కణాల పెరుగుదలకు దోహదం చేయడంకోసం, కిమోథెరపిని ప్రారంభంలో ( ఇండక్షన్ కెమోథెరపి) ఇస్తారు.
  • ఎముక మూలుగు ఎంత త్వరగా కోలుకుంటుందనేదానినిబట్టి, ఈ వ్యాధిగ్రస్తులు కొన్ని రోజులపాటు, లేదా వారాలపాటు ఆస్పత్రిలో వుండవలసి రావచ్చు. రక్తహీనతను నయంచేసి, రక్తం పడకుండా నివారించడంకోసం, రక్తాన్ని, ప్లేటిలెట్లను ఎక్కించవలసి రావచ్చు; సూక్ష్మ క్రిములవల్ల సోకే ఇన్‌ఫెక్షన్లను నయంచేయడంకోసం యాంటిబయోటిక్స్ వాడవలసి రావచ్చు. ల్యుకేమియా కణాలను నిర్మూలించినపుడు , యూరిక్ యాసిడ్ వంటి హానికర పదార్ధాలు విడుదలవుతాయి. వాటిని శరీరంనుంచి తొలగించడానికి, నేరుగా నరాలద్వారా ఇచ్చే ద్రవరూప ఔషధాలను, ఇతర మందులను వాడవలసి రావచ్చు.
  • మెదడును, వెన్ను పూసను కప్పివుండే జీవకణ సముదాయంతో కూడిన ధాతు పొరలలోని ల్యుకేమియా కణాలను నయంచేయడంకోసం రకరకాల మందులను వాడవలసి రావచ్చు , వాటినె మళ్ళీ మళ్ళీ అనేక రోజులు, వారాలపాటు కూడా కొనసాగించవలసి రావచ్చు. క్యాన్సర్ కణాలను నిర్మూలించే మందులను నెరుగా, మెదడును, వెన్నుపామును ఆవరించివుండే స్రావం (సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్)లోకి ఇవ్వవలసిరావచ్చు.
  • ల్యుకేమియా మెదడుకు వ్యాపించిందని ఏ కొంచెం ఆధారం కనిపించినా, కిమోథెరపితో పాటు మెదడుకు రేడియేషన్ చికిత్సకూడా చేస్తారు. ఎందుకంటే, ల్యుకేమియా మెదడునుంచి వెన్నుపాముకు వ్యాపించడానికి అవకాశాలు ఎక్కువగా వున్నందువల్ల, దానిని నివారించడంకోసం ఈ రకమైన చికిత్స చేస్తారు.
  • కొన్నివారాలపాటు ప్రారంభ చికిత్స, ముమ్మరంగా చికిత్స జరిపిన అనంతరం, ఇంకా ఏవైనా ల్యుకేమియా కణాలు శరీరంలో మిగిలి వుంటే వాటిని తొలగించడానికి అదనపు చికిత్స ( స్థిరీకరణ చికిత్స) జరుపుతారు.
  • కిమోథెరపికి సంబంధించిన మరికొన్ని మందులను , లేదా ప్రారంభ చికిత్సలో వాడిన మందులనే అనేక వారాలపాటు , మళ్ళీ మళ్ళీ వాడవలసి రావచ్చు.
  • 2-3 ఏళ్ళపాటు కొనసాగింపు చికిత్స (మెయింటెనెన్స్ కెమోథెరపి) చేయవలసి వుంటుంది. ఈ చికిత్సలో కేవలం కొన్ని మందులనే, సందర్భాన్నిబట్టి తక్కువ మోతాదులలో వాడవలసి వుంటుంది.
  • రక్త కణాలలోని సంబంధిత క్రోమోజోమ్‌లో వచ్చే మార్పుల దృష్ట్యా, ల్యుకేమియా మళ్ళీ తిరగబెట్టే (రిలాప్స్) అవకాశం ఎక్కువగావున్న వారికి, మూల కణాల (స్టెం సెల్) మార్పిడి అవసరం కావచ్చు. ల్యుకేమియా సోకిన కణాల మొదటి తొలగింపు దశలోనే ఈ అవసరం ఏర్పడవచ్చు.
  • తరచుగా ల్యుకేమియా కణాలు రక్తంలోనో, ఎముక మూలుగులోనో, మెదడులోనో, వృషణాలలోనో మళ్ళీ కనిపించడం మొదలవుతుంది ( దీనినే రిలాప్స్ అంటారు) . ఎముక మూలుగులో మళ్ళీ కనిపించడాన్ని తీవ్రంగా పరిగణించవలసి వుంటుంది.
  • మళ్ళీ కిమోథెరపి అవసరమవుతుంది. చాలా మందికి వ్యాధి నయమైనప్పటికి, ఈ వ్యాధి మళ్ళీ సోకే అవకాశాలు ఎక్కువ; ముఖ్యంగా రెండేళ్ళ లోపు పిల్లలకు, పెద్దవారికి ఈ వ్యాధి తిరగబెట్టవచ్చు. ల్యుకేమియా కణాలు మెదడులో మళ్ళీ కనిపిస్తే, మెదడును, వెన్నుపామును ఆవరించివుండే స్రావం (సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్) లోకి వారానికి ఒకటి రెండుసార్లు కిమోథెరపి మందులను ఇంజక్షన్ల రూపంలో ఇవ్వవలసివుంటుంది.
  • ల్యుకేమియా కణాలు బీజాలలో తిరిగి కనిపిస్తే, కిమోథెరపితోపాటు, రేడియేషన్ చికిత్సకూడా చేయవలసి వుంటుంది.
  • ల్యుకేమియా తిరగబెట్టినవారికి కిమోథెరపి మందులను అధిక మోతాదులలో ఇవ్వడంతోపాటు, జీవ కణాలరీత్యా ఒకే వారసత్వానికి చెందని (అలోజెనిక్) మూలకణాల మార్పిడివల్ల వ్యాధి నయమయ్యే అవకాశాలు ఎక్కువగా వుంటాయి.
  • అయితే, వ్యాధికి గురైనవారి ధాతువుతో సరిపోలే ధాతువు కలిగిన ( హెచ్ ఎల్ ఏ మ్యాచ్డ్) వ్యక్తికి స్టెమ్సెల్ సేకరించవలసి వుంటుంది.
  • సాధారణంగా, తోబుట్టువులే స్టెమ్సెల్ ఇస్తుంటారు. అయితే, కొన్నిసందర్భాలలో, ధాతురీత్యా సరిపోయే, బంధువులుకానివారినుంచి సేకరించే మూలకణాలను ( లేదా కుటుంబ సభ్యులనుంచి, లేదా బంధువులుకానివారినుంచి సేకరించే పాక్షికంగా సరిపోలే మూలకణాలను, లేదా బొడ్డుకుసంబంధించిన మూలకణాలను ) కూడా ఉపయోగిస్తారు.
  • వయస్సు 65 ఏళ్ళకు మించినవారికి, మూలకణాల మార్పిడి చాలా అరుదుగా చేస్తారు. ఎందుకంటే, ఈ మార్పిడి ఫలవంతమయ్యే అవకాశాలు చాలా తక్కువగా వుండడమే కాకుండా, ఈ మార్పిడి వల్ల కలిగే దుష్ఫలితాలు ప్రాణాంతకమయ్యే అవకాశాలు ఎక్కువ.
  • వ్యాధి తిరగబెట్టి, మూలకణాల మార్పిడి చేయించుకోలేనివారికి, అదనపు చికిత్స చాలాసందర్భాలలో, భరించలేనంత కష్టంగా వుండడమే కాకుండా, ఆ చికిత్సవల్ల ఫలితంకూడా వుండదు. తరచుగా వారు మరింత కుంగిపోతారు. అయితే, ల్యుకేమియా కణాల తొలగింపు జరుగుతుంటుంది. చికిత్సకు స్పందించనివారికి మరణించేవరకు తగిన జాగ్రత్త పాటించే అంశాన్ని తప్పక పరిశీలించాలి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate