অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఎబోలా మహమ్మారి

ఎబోలా మహమ్మారి

‘ఎబోలా’.. ఇప్పుడు పశ్చిమ ఆఫ్రికాలో విజృంభిస్తూ, ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి! దీని ముప్పును గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించింది. వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రభావిత దేశాలకు సహాయసహకారాలు అందజేయాలంటూ ప్రపంచ దేశాలకు సూచించింది...

ప్రస్తుతం ఎబోలా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. తాజా వ్యాధి వ్యాప్తికి సంబంధించి ఈ ఏడాది మార్చిలో పశ్చిమ ఆఫ్రికాలోని గినియాలో తొలి కేసును గుర్తించారు. ఆ తర్వాత పొరుగున ఉన్న లైబీరియా, సియెర్రా లియోన్, నైజీరియా తదితర దేశాల్లో కేసులు నమోదయ్యాయి. 2009 మార్చిలో మెక్సికోలో కనిపించిన స్వైన్ ఫ్లూ.. తర్వాత యావత్ ప్రపంచానికి వ్యాపించింది. 2003లో సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్).. తొలుత ఆసియాలో కలకలం సృష్టించి, తర్వాత ప్రపంచం మొత్తానికి విస్తరించింది. ఈ రెండు సంఘటనల్లో కొన్ని వందల మరణాలు సంభవించాయి. ప్రస్తుత ఎబోలా వ్యాధితో చాలా ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం ఇది పశ్చిమాఫ్రికా దేశాలకే పరిమితమైనప్పటికీ, మున్ముందు మరిన్ని దేశాలకు వ్యాపించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఎబోలా 1,779 మందికి సంక్రమించగా, దాదాపు వెయ్యి మంది మరణించారు. వ్యాధి తీవ్రతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించింది.

వైరస్‌కు ఆశ్రయమిచ్చే గబ్బిలాలు:

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఎబోలా వైరస్ వ్యాధి (ఉఛౌ్చ గజీటఠట ఈజీట్ఛ్చట్ఛఉగఈ) లేదా ఎబోలా హెమరేజిక్ ఫీవర్ (ఉఏఊ) బారినపడిన వారిలో 80 శాతం మంది మరణిస్తారు. ప్రధానంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని వర్షాధార అడవులకు దగ్గరున్న సుదూర గ్రామీణ ప్రాంతాల్లో ఎబోలా వ్యాధి వ్యాపిస్తుంటుంది. వన్య ప్రాణుల నుంచి మనిషికి సోకి, ఆ తర్వాత మనుషుల మధ్య వ్యాధి విజృంభిస్తుంది. ఫ్రూట్‌బ్యాట్స్ అనే గబ్బిలాలు ఎబోలా వైరస్‌కు ఆశ్రయం ఇస్తాయి. మొదటిసారిగా 1976లో బెల్జియం పరిశోధకుడు పీటర్ పయట్ ఎబోలాను గుర్తించారు. ఒకేసారి ఆఫ్రికాలోని సూడాన్‌లో గల జారా ప్రాంతంతో పాటు కాంగోలోని ఎబోలా నది ఒడ్డున యంబుకు ప్రాంతంలో వ్యాధి మొదటిసారిగా అలజడి సృష్టించింది. అప్పట్నుంచి ఎబోలా వ్యాధిగా పిలుస్తున్నారు.

ఎబోలా వైరస్.. ఫైలో విరిడే కుటుంబానికి చెందింది. కాబట్టి దీన్ని ఫైలో వైరస్ అని కూడా అంటారు. ఎబోలా వైరస్ ప్రజాతిలో ఐదు భిన్న జాతులుంటాయి. అవి.. బుండిబుగ్యో ఎబోలా వైరస్ (బీడీబీవీ); జైర్ ఎబోలా వైరస్ (ఈబీఓవీ); రెస్టాన్ ఎబోలా వైరస్ (ఆర్‌ఈఎస్టీవీ); సూడాన్ ఎబోలా వైరస్(ఎస్‌యూడీవీ); టాయి ఫారెస్ట్ ఎబోలా వైరస్ (టీఏఎఫ్‌వీ). వీటిలో బీడీబీవీ, ఈబీఓవీ, ఎస్‌యూడీవీ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందాయి. ఫిలిప్పీన్స్, చైనాలో గుర్తించిన ఆర్‌ఈఎస్టీవీ రకం మనుషులకు సోకినా, పెద్దగా ప్రభావం చూపించదు.

వ్యాప్తి.. విజృంభణ:

ఎబోలా వ్యాధి బారిన పడిన జంతువుల రక్తం, ఇతర శరీర స్రావాల నుంచి వైరస్ మనిషికి వ్యాపిస్తుంది. ఆఫ్రికా అడవుల్లో చింపాంజీలు, గొరిల్లాలు, కోతులు, అడవి దుప్పిలు వ్యాధికి గురై మరణించినప్పుడు, వాటిని తొలగించే క్రమంలో ఎబోలా మనిషికి సోకినట్లు గుర్తించారు. ఈ వైరస్ ఒకసారి మనిషిలోకి చేరితే వెంటనే ఇతరులకు తేలిగ్గా వ్యాపిస్తుంది. ఇది గాలి ద్వారా వ్యాపించదు. వ్యాధి బారినపడిన రోగి శరీర ద్రవాలు ముఖ్యంగా లాలాజలం, రక్తం, చెమట, వాంతులు, వీర్యం తదితరాల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. సరైన రక్షణ లేకపోతే ఎబోలా రోగులకు చికిత్స అందించే సిబ్బందికి కూడా ఇది వ్యాపిస్తుంది. మృతదేహాల ఖననం సందర్భంలోనూ బంధువులకు వ్యాపించే ప్రమాదముంది. వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత ఏడు వారాల వరకు వీర్యంలో వైరస్ కనిపిస్తుంది.

మృత్యు ఒడికి..

వైరస్ సోకిన తర్వాత రక్తపీడనం పడిపోవడం, అవయవాల పనితీరు దెబ్బతినటం వల్ల రోగి మరణిస్తాడు. ఈ వ్యాధి పొదిగే కాలం (శరీరంలోకి వ్యాధి కారకం ప్రవేశించిన దగ్గర నుంచి లక్షణాలు బయటపడేందుకు పట్టే సమయం) వారం రోజులు. తొలుత కనిపించే లక్షణాలు.. జ్వరం, శరీరంపై దద్దుర్లు, తలనొప్పి, వికారం, వాంతులు, కడుపునొప్పి. వీటితో పాటు వెన్నునొప్పి, కీళ్లవాపు, నీళ్ల విరేచనాలు, గొంతు తడి ఆరిపోవడం వంటివి కనిపిస్తాయి. శరీరంలో వ్యాధి విజృంభిస్తే నోరు, చెవులు, ముక్కు నుంచి రక్తస్రావం జరుగుతుంది. జననాంగాల్లో వాపు, కళ్ల కలకలు, నోరు పైభాగం ఎర్రగా కందడం, శరీరమంతా దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాలేయం, మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. శరీరం లోపల, బయట తీవ్ర రక్తస్రావం సంభవిస్తుంది. తెల్ల రక్తకణాలు, రక్త ఫలకికల సంఖ్య క్షీణతతో పాటు కాలేయంలో ఎంజైముల స్థాయి పెరుగుతుంది. సత్వర చికిత్స అందిస్తేనే వ్యక్తి బతుకుతాడు. లేకుంటే 90 శాతం మృతి చెందే అవకాశముంటుంది.

టీకా అందుబాటులో లేదు:

ప్రారంభ లక్షణాలు కనిపించిన వారిలో మలేరియా, టైఫాయిడ్, కలరా, ప్లేగు, హెపటైటిస్, డెంగీ జ్వరాలు లేవని నిర్ధారించిన తర్వాత ఎబోలా పరీక్ష నిర్వహించాలి. ఎలీసా, యాంటిజెన్ డిటెక్షన్ టెస్ట్, కణ వర్ధనం తదితర పద్ధతుల్లో వ్యాధిని నిర్ధారించాలి. రోగి నుంచి సేకరించిన రక్త నమూనాలు చాలా ప్రమాదకరమైనవి. శరీరంలోని వైరస్‌ను నిర్మూలించేందుకు ప్రత్యేక నిరోధక మందులేవీ లేవు. అందువల్ల లక్షణాలకు చికిత్స (డఝఞ్టౌఝ్చ్టజీఛి ఖీట్ఛ్చ్టఝ్ఛ్ట) అందించాలి. ఎబోలా వ్యాధి నివారణకు టీకా అందుబాటులో లేదు. ఈ తరుణంలో ఎబోలా వ్యాప్తిని నిరోధించే మార్గాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. వ్యాధి ప్రభావిత దేశాల్లో దాదాపు 45 వేల మంది భారతీయులున్నట్లు అంచనా. ఒక్క లైబీరియాలోనే వెయ్యి మంది భారతీయులు పనిచేస్తున్నారు. వీరందరూ ఇప్పుడు భారత్‌కు తిరిగి వచ్చే అవకాశముంది. అందువల్ల భారత్ అప్రమత్తంగా ఉండటం అవసరం. వ్యాధి ప్రభావిత దేశాల నుంచి వచ్చినవారిని, అనుమానిత లక్షణాలు ప్రదర్శించే వారిని విమానాశ్రయాల వద్ద క్వారంటైన్‌లను ఏర్పాటు చేసి, పరీక్షించాలి. ఇప్పటికే భారత్ ఈ దిశగా చర్యలు తీసుకుంది. డబ్ల్యూహెచ్‌వోతోపాటు ఐరోపా యూనియన్, అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) తదితర సంస్థలు ఎబోలా వ్యాప్తిపై దృష్టి సారించాయి.

డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు:

కేవలం ఆఫ్రికాలోనే కాకుండా చైనా, ఫిలిప్పీన్స్‌లోనూ ఎబోలా వైరస్ ఇతర జాతులు వ్యాప్తిలో ఉన్నాయి. అందువల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనలు విడుదల చేస్తోంది. ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాల ప్రజలు అడవి జంతువుల మాంసాన్ని (బుష్ మీట్) బాగా ఇష్టపడతారు. చింపాంజీ, గబ్బిలాలు తదితరాల మాంసాన్ని తింటారు. ఈ నేపథ్యంలో ఇలాంటి జంతువులను తాకినప్పుడు జాగ్రత్తగా ఉండాలని, జంతువుల మాంసాన్ని పూర్తిగా ఉడికించిన తర్వాతే తినాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.

ఎబోలా వ్యాధి-గత సంఘటనలు

సం.

దేశం / దేశాలు

ఎబోలా వైరస్ జాతి

కేసులు

మరణాలు

2012

డెమోక్రటిక్
రిపబ్లిక్ ఆఫ్ కాంగో

బుండిబుగ్యో

57

29

2012

ఉగాండా, సూడాన్

బుండిబుగ్యో

7

4

2012

ఉగాండా, సూడాన్

బుండిబుగ్యో

24

17

2008

కాంగో

జైర్

32

14

2007

ఉగాండా

బుండిబుగ్యో

149

37

2007

కాంగో

జైర్

264

187

2003

కాంగో

జైర్

143

128

2000

ఉగాండా, సూడాన్

జైర్

425

224

1976

కాంగో

జైర్

318

280

ముఖ్యాంశాలు:

ఎబోలా వైరస్ వ్యాధి ప్రారంభ లక్షణాలు సాధారణంగా ఉంటాయి. అందువల్ల ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా ఆరోగ్య కార్యకర్తలు, పారామెడికల్ సిబ్బంది పూర్తిస్థాయిలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, చేతులకు పొడవాటి గ్లోవ్స్, ముఖానికి మాస్క్ ధరించాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.

ప్రస్తుతం ఎబోలా వైరస్ వ్యాధి విస్తరిస్తున్న తీరునుబట్టి పరిస్థితి విషమంగా ఉందని, ఇది అదుపుతప్పి ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎబోలా ప్రభావిత దేశాల్లో సరైన వైద్య సౌకర్యాలు లేనందున ప్రపంచ దేశాలు సహాయం అందించాలని సంస్థ డెరైక్టర్ జనరల్ మార్గరెట్ చాన్ కోరారు.

ఇప్పటి వరకు భారత్‌లో ఎక్కడా ఎబోలా కేసును గుర్తించలేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే గినియా నుంచి చెన్నైకు వచ్చిన ఓ వ్యక్తికి ఎబోలా సోకినట్లు అనుమానం ఉండటంతో ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా వైరస్ సోకలేదని లేదని తేలింది. అయినా ముందస్తు జాగ్రత్తగా విమానాశ్రయాల్లో క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించాలి. ప్రత్యేక నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఏమాత్రం ఉపేక్షించినా అపార ప్రాణనష్టం జరిగే ప్రమాదముంది.

- సి. హరికృష్ణ, సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్

ఆధారము: సాక్షి

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate