పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

క్షయ వ్యాధి

ఇది మైక్రో బాక్టీరియా టుబరంక్యులోసిన్ అనే బాక్టీరియా వలన వచ్చే అంటువ్యాధి. ఈ క్షయ క్రిములు ముఖ్యంగా ఊపిరితిత్తులలో ప్రవేశించి శ్వాసకోశ క్షయవ్యాధిని కలుగచేస్తాయి. ఈ శ్వాసకోశ క్షయ చాలా తీవ్రమైన అంటువ్యాధి. శరీరంలోని ఇతర భాగాలకి కూడా క్షయ వ్యాధి రావచ్చు.

టి.బి. (క్షయ) అంటే ఏమిటి?

ఇది మైక్రో బాక్టీరియా టుబరంక్యులోసిన్ అనే బాక్టీరియా వలన వచ్చే అంటువ్యాధి. ఈ క్షయ క్రిములు ముఖ్యంగా ఊపిరితిత్తులలో ప్రవేశించి శ్వాసకోశ క్షయవ్యాధిని కలుగజేస్తాయి. ఈ శ్వాసకోశ క్షయ చాలా తీవ్రమైన అంటువ్యాధి. శరీరంలోని ఇతర భాగాలకి కూడా క్షయ వ్యాధి రావచ్చు. అనగా శ్వాసకోశేతర భాగాలు ఎముకలు, కీళ్ళు, లింపు గ్రంధులు, మెదడు పొరలు, మూత్ర పిండాలు, గర్భ సంచి మొదలైనవి.

వ్యాధి లక్షణాలు :

 1. మూడు వారాలకి పైగా దగ్గు, కఫం
 2. సాయంత్రం, రాత్రి సమయాలలో జ్వరం
 3. బరువు తగ్గుట, ఆకలి తగ్గుట
 4. దగ్గు కఫంతోపాటు రక్తంపడుతుంది

వ్యాపించే విధానం

 1. క్షయ క్రిములు గాలి ద్వారా వ్యాపిస్తాయి
 2. క్షయ వ్యాధిగ్రస్థుడు దగ్గినపుడు, అతని ఊపిరితిత్తుల నుండి వచ్చే కఫం ద్వారా ఈ బాక్టీరియా గాలిలో చేరి, దగ్గరలో ఉన్న ఆరోగ్యవంతమైన మనిషి పీల్చే గాలితోపాటు అతని ఊపిరితిత్తుల లోనికి ప్రవేశించి జబ్బుకి పునాది వేస్తుంది.

నిరోధక చర్యలు :

 1. క్షయరోగి దగ్గేటప్పుడు నోటికి అడ్డుపెట్టుకోవాలి.
 2. దగ్గినపుడు వచ్చే కఫం ఒక పాత్రలోనికి పట్టి కాల్చివేయాలి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
 3. నిరోధక చర్యగా చిన్న పిల్లలకి బి.సి.జి. టీకా ఇప్పించాలి.

నివారణ చర్యలు

వ్యాధి లక్షణాలు కలిగిన వ్యక్తికి వెంటనే కఫం పరీక్ష జరిపి చికిత్స ప్రారంభించి మానకుండా పూర్తి కాలం వైద్యులు నిర్ణయించిన ప్రకారం మందులు వాడాలి.

కార్యకర్తల విధులు

 • గ్రామంలో గుర్తించబడిన రోగులను తరచూ పరామర్శిస్తూ వారు పూర్తిగా మందులు వాడేటట్లు సమ్మతింపజేయాలి.
 • రెండు నెలలు వాడిన తరువాత వ్యాధి లక్షణాలు తక్కువయితే, వ్యాధినయమైందని మందులు ఆపకుండా చూడాలి. దీనివలన వ్యాధి తీవ్రతరం అవుతుందని హెచ్చరించాలి.
 • పి.హెచ్.సి. సిబ్బంది కాని డిస్ర్టిక్ట్ ట్యూబర్ క్యులోసిస్ సెంటర్ సిబ్బంది కాని అందరు క్షయవ్యాధి రోగులు తమ తమ గ్రామం నుంచి క్రమంగా చికిత్స పొందుతున్నారో లేదో కనిపెట్టి ఉండాలి. వీరితో సహకరించాలి.
 • రోగికి పూర్తిగా నయం అయ్యేవరకు నిర్ణయించిన సమయంలో తప్పకుండా కఫం పరీక్ష జరిగేలా చూడాలి.
 • ప్రతి టి.బి. పేషంటును రిజిష్టరు చేయించడం, అతని సంబంధిత కుటుంబ సభ్యులకి కఫం పరీక్ష చేయించి ఈ రిజల్ట్స్ కార్డులో నమోదు చేయించాలి.

క్షయవ్యాధి చికిత్స, వైద్య సేవలు, ప్రాథమిక ఆరోగ్య కార్యక్రమాలలో భాగంగా ఆరోగ్య కేంద్రాలలోనే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రివైజ్డ్ టి.బి. కంట్రోలు ప్రోగ్రాంని ప్రభుత్వం అమలు పరుస్తోంది

తరచుగా అడిగే ప్రశ్నలు

క్షయవ్యాధి రావడానికి గల కారణము ఏమిటి?

క్షయవ్యాధి వంశపారంపర్యంగా సంక్రమించదు. ఇది ఒక అంటువ్యాధి. ఏ వ్యక్తికైనా క్షయవ్యాధి సోకే ప్రమాదం ఉంది. క్షయవ్యాధి సోకిన రోగి, ముఖ్యంగా వ్యాధి చురుకైన దశలో వున్నవారు బహిరంగంగా దగ్గినా, తుమ్మినా వ్యాధికి కారణమైన సూక్ష్మక్రిములు గాలిలో వ్యాపిస్తాయి. చుట్టుప్రక్కల ఉన్న ఏ వ్యక్తులైన ఈ క్రిములను శ్వాసద్వారా పీల్చుకోవడం సంభవిస్తే వారికి వ్యాధి సోకే అవకాశాలు అధికంగా వుంటాయి.

ఈవ్యాధిలో కనబడే లక్షణాలు ఏమిటి?

విడవకుండా మూడువారాల కంటే ఎక్కువ రోజులు దగ్గు ఉండడం, కాండ్రించడంతో పాటు దగ్గు, జ్వరం, బరువు తగ్గిపోవడం లేదా ఆకలి తగ్గిపోవడం మొదలైనవి క్షయవ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు. ఈ లక్షణాలలో ఏవైనా మూడువారాలకు మించి విడవకుండా ఉంటే, ఆవ్యక్తి దగ్గరలో వున్న డాట్స్ టిబి కేంద్రాన్ని లేదా ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వారి కఫంని పరీక్ష చేయించుకోవాలి.

క్షయవ్యాధి నిర్ధారణకు చేయు పరీక్షలు ఏమిటి? అవి ఎక్కడ చేయబడతాయి?

క్షయవ్యాధికి కారణమైన సూక్ష్మక్రిములను ప్రయోగశాలలో గుర్తించడానికి రోగి యొక్క కఫంని మూడు వరుస దినాలలో పరీక్షించ వలసి వుంటుంది. డిల్లీలోని ఎన్.సి.టి మరియు ఆంధ్రప్రదేశ్ లోని డాట్ కేంద్రాలు వివిధ ప్రదేశాలలో ఏర్పరచడం జరిగింది. ఈ కేంద్రాలలో అందించే సేవలు పూర్తిగా ఉచితం.

రోగి కఫంని పరీక్షకు ఇచ్చేటప్పుడు కఫంని మంచిగా దగ్గిన తరువాత తీయాలి. కఫానికి బదులుగా ఉమ్ముని ఇవ్వకుండా ఉండడం చాలా ముఖ్యం. ఉమ్ముని పరీక్షకు ఇస్తే, వ్యాధి నిర్ధారణకాకపోవచ్చు.

క్షయవ్యాధికి ఇచ్చే చికిత్స ఏమిటి?

క్రమం తప్పకుండా పూర్తి మోతాదులో మందులు వేసుకున్నట్టయితే క్షయవ్యాధిని పూర్తిగా నయంచేసుకో వచ్చు. క్షయరోగి క్రమం తప్పకుండా, ఆపకుండా కనీసం ఆరునెలలపాటు మందులు వేసుకొనవలసి ఉంటుంది. కొంతమంది రోగులకు ఒక సంవత్సరంపాటు మందులు ఇవ్వవలసి ఉంటుంది. వైద్యులను సంప్రదించిన తరువాతనే వారి సలహా మేరకు మాత్రమే మందులు వేసుకొనడం ఆపివేయాలి. చికిత్స పూర్తిగా తీసుకోని మరియు క్రమబద్ధంగా మందులు వేసుకోని రోగులకు, వారి వ్యాధి తగ్గదు సరికదా ప్రాణాంతకం కూడా అవుతుంది.

క్షయవ్యాధి నయం చేయడం సాధ్యమేనా?

అవును, క్షయవ్యాధి మందులు క్రమం తప్పకుండా, ఆపకుండా, నిర్దేశించిన పూర్తి కాలం తీసుకున్న యెడల ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుంది.

క్షయవ్యాధిని ఏవిధంగా నివారించవచ్చు?

క్షయవ్యాధి సోకిన రోగి ముఖానికి అడ్డుపెట్టుకోకుండా తుమ్మడం, దగ్గడం చేయడం వలన లేదా అక్కడ ఇక్కడ ఉమ్మడం వలన క్షయవ్యాధి వ్యాపిస్తుంది. అందుచేత, రోగులు ఎల్లప్పుడు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వారి ముఖాలని అడ్డుపెట్టుకోవాలి. ఏ ఒక్కరు అక్కడ ఇక్కడ ఉమ్మకుండా ఎల్లప్పుడు దగ్గుకి ఉమ్మితొట్టిలను ఉపయోగించాలి.

గృహము నందు కూడా, రోగులు మూత వున్న డబ్బాలోనే ఉయ్యాలి. కఫాన్ని పారవేసే ముందు దానిని ఉడకబెట్టాలి.

ఎవరిలోనైనా సరే క్షయవ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు భయపడడం, వ్యాధిని దాచడం వంటి పనులు చేయకుండా ఉండడం చాలా ముఖ్యం. రోగి వెంటనే పరీక్షలు చేయించుకుని తగిన సమయాన్ని తీసుకోవడం అవసరము.

క్షయరోగికి ఇవ్వవలసిన ఆహారపదార్థాలు

క్షయ రోగి తమ ఇష్టానుసారం ఎటువంటి ఆహారమైనా తీసుకొనవచ్చును. ప్రత్యేకమైన ఆహార పథ్యములు అంటూ ఏమీ లేవు. పౌష్టికాహారం తీసుకుంటే కొంత వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వారి శరీర తత్వానికి సరిపోని ఆహారం తీసుకోకుండా వుంటే సరిపోతుంది.

క్షయ రోగి మానుకోవలసిన విషయాలు

క్షయవ్యాధి ఉన్న రోగి బీడి, సిగరెట్టు, హుక్కా, పొగాకు, సారాయి లేదా ఇతర ఏవైనా మత్తునిచ్చే మందులు తీసుకోకూడదు.

క్షయవ్యాధిలో చేయవలసినవి, చేయకూడని అంశాలు

చేయవలసిన అంశాలు

 • దగ్గు మూడు వారాల కంటే ఎక్కువ రోజులు తగ్గకుండా దగ్గు వస్తుంటే, రెండు సార్లు కఫం పరీక్షలు చేయించుకోవాలి. ఈ కఫం పరీక్షలు అన్ని ప్రభుత్వ కఫం మైక్రోస్కోపీ కేంద్రాలలో ఉచితంగా చేయ బడతాయి.
 • అన్ని మందులను క్రమం తప్పకుండా, చెప్పిన సమయంవరకూ పూర్తిగా తీసుకోవాలి.
 • క్షయవ్యాధి పూర్తిగా నయం చేసుకొనవచ్చును అనే విషయం అర్థం చేసుకోవాలి.
 • తుమ్మేటప్పుడు లేదా దగ్గేటప్పుడు చేతి రుమాలుని అడ్డం పెట్టుకోవాలి.
 • ఇంటిలో ఉన్న క్రిమి సంహారకాలు గల ఉమ్మి తొట్టులలోనే ఉమ్మాలి.

చేయకూడని అంశాలు

 • మూడు వారాలు లేదా అంతకు మించి దగ్గు ఉన్న యెడల వైద్య సంరక్షణని మానవద్దు.
 • క్షయరోగ నిర్ధారణకు కేవలం ఎక్స్– రే మీద ఆధారపడకూడదు.
 • క్షయరోగానికి వాడే మందులను మీ వైద్యులు ఆపివేయమని చెప్పేవరకూ ఆపవద్దు.
 • క్షయరోగులను చిన్న చూపు చూడవద్దు
 • క్షయరోగులు ఎక్కడ బడితే అక్కడ ఉమ్మవద్దు.

డాట్స్ అనగా నేమి?

డాట్స్ అంటే తక్కువ కాల పరిమితిలో నేరుగా గమనించే చికిత్స, దీనితో క్షయవ్యాధి పూర్తిగా నయం చేయబడుతుంది. క్షయరోగులను గుర్తించడానికి మరియు చికిత్స అందజేయడానికి, ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాధమిక ఆరోగ్య సేవలు ఉపయోగించే పూర్తి వ్యూహరచన పేరు. ఇందులో ఐదు భాగాలు కలిసి వుంటాయి.

 • క్షయవ్యాధిని అదుపుచేసే జాతీయ కార్యక్రమాలపట్ల రాజకీయ సంసిద్ధత.
 • ఊపిరితిత్తులకు సంబంధించిన క్షయవ్యాధితో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలని పొందడానికి వచ్చిన వారిలో, అతి ముఖ్యంగా మూడు వారాలు లేదా అంతకు మించి దగ్గుతో బాధపడుతున్నవారిలో, వ్యాధిగ్రస్థులైనవారిని తెలుసుకోవడానికి సూక్ష్మ దర్శిని సేవలు
 • నిరంతరం ఆపకుండా క్షయవ్యాధి మందులు సరఫరా చేస్తూ ఉంటుంది. క్షయరోగులు వారి చికిత్స నిరంతరం, అంతరాయం లేకుండా తీసుకునేటట్టు చూడడానికి, అత్యుత్తమమైన క్షయవ్యాధిని నివారించే మందులు మొత్తం ఆరోగ్య వ్యవస్థలో సరఫరా చేసే, ఆధారపడే స్థాపనని స్థాపించడం డాట్స్ యొక్క వ్యూహరచనలో ఒక ముఖ్యమైన అంశము.
 • కనీసం తొలుత అంటువ్యాధి తీవ్రంగా ఉన్న దశలో, చికిత్సని ప్రత్యక్షంగా పర్యవేక్షించడం. డాట్స్ వ్యూహరచనలో భాగంగా, ఆరోగ్య కార్యకర్తలు ప్రతి శక్తివంతమైన కలయికలు గల మందుల మోతాదు తీసుకుంటున్న రోగులను గమనించి, అవగాహన కల్పిస్తారు.
 • కార్యక్రమం పర్యవేక్షణ మరియు క్షయరోగ నిర్ధారణ జరిగిన ప్రతి రోగి చికిత్సను మూల్యాకనం చేసే పర్యవేక్షించే మరియు బాధ్యతగల వ్యవస్థ.

డాట్స్ వలన లాభాలు

 • డాట్స్ ద్వారా వ్యాధి 95 శాతం వరకు నయమైపోతుంది.
 • క్షయరోగం నుంచి త్వరగా మరియు ఖచ్చితమైన ఉపశమనం, డాట్స్ కలుగచేస్తుంది.
 • డాట్స్, భారతదేశంలో 17 లక్షల మంది రోగుల జీవితాల్ని మార్చి వేసింది.
 • బీదరికాన్ని రూపుమాపడంలో డాట్స్ ఒక వ్యూహరచన. ఈ చికిత్స మూలంగా కొన్ని ప్రాణాలను కాపాడడం, జబ్బు యొక్క కాలపరిమితిని తగ్గించడం మరియు క్రొత్తవారికి వ్యాధి వ్యాప్తిచెందకుండా నివారించడం అంటే కొన్ని సంవత్సరాల ఉద్యోగకాలం నష్టపోకుండా నివారించడం అని అర్థం.
 • హె.చ్. ఐ. వి సోకిన క్షయరోగి జీవితకాలాన్ని, డాట్స్ పొడిగిస్తుంది.
 • రోగి అనుసరించేలా చేయడం మరియు నిరంతరం క్షయవ్యాధి నివారణ మందులు సరఫరా చేయడం ద్వారా, చికిత్సలో విఫలము కాకుండా చేసి ఒకటి కంటే ఎక్కువ మందులకు ఎదురు తిరిగే క్షయవ్యాధి సూక్ష్మక్రిములు ఉత్పన్నం కాకుండా, డాట్స్ చేస్తుంది.
 • చికిత్స ఆరోగ్య సేవలను విస్త్రతంగా అందుబాటులోకి, డాట్స్ తెచ్చింది. మారుమూల గ్రామాలకు ఆరోగ్య సేవల వికాసం ప్రోత్సహించడంలో, డాట్స్ వ్యూహరచన అద్భుతంగా విజయాన్ని సాధించింది.
 • అన్ని ఆరోగ్య కేంద్రాలలో, డాట్స్ ఉచితంగా అందుబాటులో ఉంటుంది.

మందులు పనిచేయని క్షయవ్యాధి అంటే ఏమిటి?

ఈ మధ్య సంవత్సరాలలో క్షయ వ్యాధి ఒక పెద్ద సమస్యగా తయారైంది ఎందుకంటే సాధారణ క్షయవ్యాధికి ఇచ్చే సాధారణ ఏంటిబయోటిక్ మందులతో పనిచేయని క్షయరోగం రావడమే. క్రమం తప్పిన మరియు పూర్తిగా చికిత్స తీసుకోని రోగులలో ఈ మందులకు అవరోధం కలగడం కారణము. నిర్దేశించబడిన పూర్తి కాలం వరకు క్రమం తప్పకుండా, మందులు వాడడం వలన ఎమ్ డి ఆర్ క్షయవ్యాధిని నివారించవచ్చును. ఈ రకమైన క్షయవ్యాధికి, చాలా ఖరీదైన మందులు కావాలి మరియు ఒకొక్కప్పుడు పనిచేయకపోవచ్చు. చికిత్సకు రెండు సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ సమయం పట్టవచ్చు.

క్షయవ్యాధికి, హెచ్. ఐ. వి వ్యాధికి ఏ విధంగా పరస్పర సంబంధం వుంది?

క్షయవ్యాధి ఎవరికైనా సోకవచ్చు, కానీ హెచ్. ఐ. వి మరియు క్షయ ఉన్నవారికి క్షయవ్యాధి సోకే ప్రమాదం అధికంగా ఉంటుంది.

మీ శరీరంలో క్షయవ్యాధి ఒక్కటే ఉన్నప్పటికీ, బాక్టీరియా మీ శరీరంలో ఉండి ఎప్పటికైనా మీకు ప్రమాదమే. హెచ్ఐవి తో మీ నిరోధకశక్తి క్షీణించిపోవడం వలన, బాక్టీరియా పెరగడం ప్రారంభమై ద్విగుణీకృతం అవుతుంది. అది అప్పుడు క్షయవ్యాధిగా బయట పడుతుంది.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.12365591398
kavitha Mar 13, 2020 04:12 PM

మా ఇంటి ఆమెకు టీబీ వచ్చింది ఏమైనా ప్రాబ్లెమ్ అవుతుందా ప్లీజ్ టెల్ me

Pavi Feb 18, 2020 10:04 AM

క్షయ వ్యాధి ఉన్న వాళ్ళు వివాహం చేసుకోవచ్చా??

ఆనంద్ Sep 14, 2019 08:44 PM

మా అమ్మ గార్కి టి.బి ఉంది,మాత్రలు రోజుకి ఎన్ని వేసుకోవాలి...తెలియజేయండి

David Aug 14, 2019 10:55 PM

మా అమ్మ గారికి టీబీ వచ్చింది, దానికి తగిన మందులు వాడుతుంది. వాడిన కొన్ని రోజులకు దగ్గు రావడం లేదు, రక్తం పడడం లేదు. కానీ 15 రోజులకు శరీరం అంతా ఎలర్జీ వచ్చి ఫేస్ నల్ల రంగు మారింది. అలా ఎందుకు వచ్చిందో చెప్పండి ప్లీజ్

సుబ్బారావు Jan 20, 2019 12:14 PM

క్షయ ఉన్న వారికి గోంతు కింద గడ్డలు వస్తాయ క్షయ మరియు హెచ్ ఐ వి రెండు ఉన్న వారు ఏవిదమయిన చికిత్స తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు