బోదవ్యాధి (ఫైలేరియాసిస్) హెల్మెంత్ వర్గానికి చెందిన సన్నని పరాన్నజీవి వలన కలుగుతుంది. ఈ వ్యాధి మానవుని మరణానికి దారితీయకపోయినప్పటికీ, దీని వలన కలిగే దుష్పరిణామాలు మాత్రం చాలా తీవ్రమైనవి. వ్యాధి సంక్రమణను సరిగా అంచనా వేయడం, ప్రాథమిక దశలో గుర్తించడం కష్ట సాధ్యం. ఈ వ్యాధి నుండి పూర్తి విముక్తికి మార్గం లేదు. రాకుండా చూసుకోవడమే ఉత్తమం. ఈ వ్యాధి సోకిన వారి వ్యాధినిరోధక శక్తి లోపించి యితర వ్యాధులకు గురి కావడానికి అవకాశం ఎక్కువ అవుతాయి. వాపుల వలన సాధారణమైన పనులు చేసుకోలేకపోవడం, అంగవైకల్యం, శారీరక, మానసిక వ్యధ యీ వ్యాధి వలన కలిగే దుష్పరిణామాలు.
ప్రపపంచంలోని బోదవ్యాధి గ్రస్తులలో సగం మంది మన దేశంలోనే ఉన్నారు. మన రాష్ట్రంలోని 20 జిల్లాల్లో యీ వ్యాధి ఉన్నట్లుగా గుర్తించబడినది. ప్రాంతాలవారీగా చూస్తే కోస్తా ప్రాంతంలో అధికముగాను, తెలంగాణా ప్రాంతములో ఒక మోస్తరుగాను, రాయలసీమలో తక్కువగా ఉంది. 1991 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలోని 6 కోట్ల 63 లక్షల మందిలో 5 కోట్ల 24 లక్షల మంది బోధ వ్యాధి విస్తరించి ఉన్న ప్రాంతాలలో నివసిస్తున్నారు. వారిలో 53 లక్షల మందికి పైగా యీ వ్యాధి సోకినట్లు నిర్ధారించబడినది. తూర్పు గోదావరి, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కరీంనగర్, మెదక్ మరియు నిజామాబాద్ జిల్లాలలో యీ వ్యాధి ఎక్కువగా ఉంది.
మానవుని రక్తంలో ఉన్న ఫైలేరియా పరాన్నజీవి పిల్లలు (మైక్రోఫైలేరియా). దోమ, మనిషిని కుట్టి రక్తం పీల్చేటప్పుడు, రక్తంతో పాటు దోమ కడుపులోనికి ప్రవేశిస్తాయి. ఇలా దోమలో ప్రవేశించిన క్రిములు 10 – 15 రోజుల్లో వివిధ దశలుగా అభివృద్ధి చెంది, మరొక వ్యక్తిలోనికి ప్రవేశించడానికి తయారవుతాయి. ఇలా తయారైన దోమలు మరోవ్యక్తిని కుట్టి, రక్తం పీల్చుకొనే సమయంలో అతని లోనికి క్రిములు ప్రవేశిస్తాయి. ఇలా మానవునిలో ప్రవేశించిన క్రిములు శోషనాళములలో చేరి 1 - 2 సంవత్సరాలలో పెరిగి పెద్ద క్రిములుగా మారతాయి. మానవుని శరీరంలోని శోషరసకణుతులలో పెద్ద క్రిములు సుమారు 10 సంవత్సరాల వరకు జీవించి ఉండి, పిల్లలను పెడుతుంది. ఈ మైక్రోఫైలేరియా పగటి సమయంలో శరీరములోని అంతర్భాగాల్లో నివసిస్తూ, రాత్రి సమయంలో ఉపరితల రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా చర్మం వద్దకు చేరతాయి. ఈ మైక్రో ఫైలేరియా ఒక సంవత్సరము పాటు బ్రతికి ఉండి, అవి ఉన్న మనిషిని దోమలు కుట్టి రక్తం పీల్చినప్పుడు, రక్తంతోపాటు దోమ శరీరంలోనికి ప్రవేశిస్తాయి. ఇలా బోధవ్యాధి కారక పరాన్నజీవి తన జీవిత చరిత్రను కొనసాగిస్తుంది.
మన ప్రాంతములో మామూలుగా 5 జాతులకు చెందిన దోమలు కనపిస్తాయి. 1) అనాఫిలిస్, 2) క్యూలెక్స్, 3) మాన్సోనియా, 4) ఏడిస్, 5) ఆర్మిజెరిస్. వీటిలో క్యూలెక్స్ క్యుంక్యుఫాసియాటస్ దోమ మాత్రమే బోధవ్యాధిని వ్యాప్తి చేయగలదు. దోమ జీవిత చరిత్ర గ్రుడ్డు, లార్వా, ప్యూపా మరియు పెద్ద దోమ అను 4 దశలు కలిగి ఉంటుంది. వీటిలో గ్రుడ్డు, లార్వా మరియు ప్యూపా దశలు నీటిలో నివశిస్తూ, పెద్ద దోమగా మారిన తరువాత మాత్రమే గాలిలోకి ఎగురుతుంది. బోధవ్యాధి వ్యాప్తికారక క్యూలెక్స్ దోమ సాధారణంగా మురుగు కాల్వలు, పాడుపడిన బావులు, మురికి నీటి గుంటలు, మరుగుదొడ్లు, యితర కలుషిత నీటి నిల్వల్లో మాత్రమే పెరుగుతుంది.
బోధవ్యాధి ప్రారంభదశలో బయటకు కనిపించని అంతర్గత లక్షణములతో మొదలై ప్రాథమికదశను దాటి తీవ్రమై ముదిరిన దశకు చేరుతుంది. ఇలా దశల వారీగా వ్యాధి తీవ్రతరం కావడానికి సుమారు 10 సంవత్సరాలు పడుతంది. బోధవ్యాధి గ్రస్తులు కొద్దిపాటి జ్వరానికి తరుచూలోనవుతారు. చంకల్లో, గజ్జల్లో బిళ్ళ కట్టడం, కాళ్ళు చేతులపై ఎర్రని చారలు (వెదురుపాము) కనబడుతాయి. కొంత కాలము తరువాత కాళ్ళు, చేతులు, వృషణాలు, యితర జననేంద్రియములకు సంబంధించిన వాపులు కూడా బోధ వ్యాధి లక్షణములే.
బోధవ్యాధి నిర్ధారణకు ప్రస్తుతం అందుబాటులో వున్న అవకాశాలు కేవలం వ్యాధి లక్షణములు బయటకు కనిపించడం, రక్త పరీక్ష చేయడం మాత్రమే. ఇతర రకాలైన యాంత్రికపరీక్షలు, వ్యాధి తీవ్రత పరీక్షలు యింకా ప్రయోగ దశలోనే ఉండి సామాన్యులకు అందుబాటులోకి రాలేదు. సాధారణంగా రాత్రిపూట రక్త పరీక్ష ద్వారా ఒక వ్యక్తి శరీరంలో బోధ వ్యాధి క్రిములు ఉన్నదీ, లేనిదీ తెలుసుకొనవచ్చును. వ్యాధి లక్షణములు బయటపడని వారిలో క్రిములు కనిపించడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి వ్యాధి సోకలేదు అనుకొనే వారు కూడా తరచూ రాత్రిపూట ఫైలేరియా రక్త పరీక్ష చేయించుకొని నిర్థారణ పొందవచ్చును. వ్యాధి ముదిరితే క్రిములు రక్తములో కనిపించవు, చికిత్సకు లొంగదు. తరుచూ వచ్చే కొద్దిపాటి జ్వరం, చంకల్లో, గజ్జల్లో బిళ్ళలు, వెదురుపాము బోధ వ్యాధికి గుర్తులు. పొడి దగ్గు, నీరసం, ఆయాసం, ఆస్నోఫీలియా, కీళ్ళ నొప్పులు కూడా బోధవ్యాధి వలన కలిగే పరిణామాలుగా గుర్తించాలి. వృషణాలు, స్థనాలు, యితర జననేంద్రియాలు నొప్పి కల్గించడం బోధవ్యాధి సోకినట్లుగా గుర్తించాలి. ఈ వ్యాధి వంశపారపర్యంగా గాని, లైంగిక సంపర్కము వలన గాని, గాలి, నీరు వంటి యితర కారణముల వలన గాని వచ్చే రోగము కాదు. కేవలం దోమల వలన మాత్రమే ఒకరి నుండి యింకొకరికి వ్యాపిస్తుంది.
బోధవ్యాధి చికిత్సకు ప్రస్తుతం అందుబాటులో వున్న డైయిథైల్ కార్బమజైన్ (డి.ఇ.సి.) ఫైలేరియా పరాన్నజీవి పిల్లలతో పాటు, పెద్ద క్రిములను కూడా చంపే గుణం ఉండుట వలన ఇది విరివిగా వాడబడుచున్నది. ఈ మందు వ్యాధి కారక క్రిములకు పరోక్షంగా సహకరించుట వలన ఈ మందుకు తట్టుకునే గుణం బోధవ్యాధి క్రిమికి కలుగదు. ఈ మందు హెట్రోజన్, ఇథోడ్రల్, బోనసైడ్, యూనికార్బజాన్ అను సాధారణ పేర్లతో లభిస్తుంది. ఈ మందును ప్రతి కిలో గ్రాము శరీర బరువుకు 6 మి. గ్రా. చొప్పున 12 రోజులు వాడాలి. జాతీయ బోధవ్యాధి నివారణ కార్యక్రమము ప్రకారం మనదేశంలో వయస్సును బట్టి వాడబడుతున్న డి.ఇ.సి. మోతాదు.
వయస్సు |
ప్రతి రోజు |
12 రోజులు |
||
మోతాదు మి. గ్రా. |
100 మి. గ్రా. మాత్రలు |
మోతాదు మి. గ్రా. |
100 మి. గ్రా. మాత్రలు |
|
2 సం. లు |
30 |
1/3 |
360 |
3 1/2 |
3 – 5 సం. లు |
75 |
3/4 |
900 |
9 |
6 – 11 సం. లు |
150 |
1 1/4 |
1800 |
18 |
12 – 17 సం. లు |
225 |
2 1/5 |
2700 |
27 |
18 సం. లు |
300 |
3 |
3600 |
36 |
బోధవ్యాధి నివారణ కేంద్రము ఏర్పాటు కాబడి ఉన్న పట్టణంలో నెలకు 2, 3 రోజులు ఆరోగ్య సిబ్బంది రాత్రులందు గృహములను సందర్శించి రక్తపూతలు సేకరించి, వ్యాధిగ్రస్తులను గుర్తించి, చికిత్స చేస్తారు. ఈ పద్ధతిలో వ్యాధితో నిమిత్తం లేకుండా వ్యాధి ఉన్నవారికి, లేనివారికి అందరికి రక్త పరీక్షలు చేస్తారు. దీనితో పాటు వారంలో నిర్ణయింపబడిన ఒక రోజు, బోధవ్యాధి నివారణ కేంద్రంలో రాత్రిపూట క్లినిక్ నిర్వహించి బోధవ్యాధి గ్రస్తులకు చికిత్స, వ్యాధి లేనివారికి రక్త పరీక్షలు చేస్తారు.
ఇందుకు గాను నివారణ కేంద్రంగల పట్టణాన్ని 6 భాగాలుగా విభజించి ప్రతి భాగంలో నిర్ణయింపబడిన రోజు చొప్పున మొత్తం పట్టణాన్ని వారం రోజుల్లో పూర్తి చేస్తారు. ఈ కార్యక్రమంలో బోధవ్యాధి దోమపిల్లలు పెరిగే మురుగు కాల్వలు, పాడుబడిన బావులు, మురికి నీటి గుంటలు, మరుగుదొడ్లు యితర కలుషితమైన నీటి నిల్వల్లో దోమ పిల్లలను చంపే మందు చల్లుతారు. తద్వారా దోమలను పిల్ల దశలోనే నిర్మూలించి, పెద్ద దోమలుగా మారకుండా నివారిస్తారు.
బోధవ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించడం, పూర్తి చికిత్స పొందడం వ్యాధి నివారణలోని ముఖ్యాంశాలు. ఈ వ్యాధి దోమల వలన ఒకరి నుండి యింకొకరికి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి దోమల నియంత్రణ కూడా యీ వ్యాధి నివారణలోని ముఖ్యాంశము.
ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020